Page load depends on your network speed. Thank you for your patience. You may also report the error.

Loading...

Sri Madhagni Mahapuranamu-1    Chapters   

శ్రీ శ్రీ వేదవ్యాస మహర్షి ప్రణీతము

శ్రీ మదగ్ని మహాపురాణము

ఆంధ్రానువాద సహితము

(ప్రథమ సంపుటము)

అనువాదకులు :

శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు

సంస్కృత శాఖాధ్యక్షులు

ఉస్మానియా విశ్వవిద్యాలయం

ప్రకాశకులు :

శ్రీ వేంకటేశ్వర ఆర్షభారతి ట్రస్ట్‌

గురుకృప

1-10-140/1, అశోక్‌నగర్‌, హైదరాబాద్‌ - 500 020.

పథమ ముద్రణము: సర్వస్వామ్యములు ప్రకాశకులవి

మార్చి - 1989 మూల్యము రు. 81-00 లు

ప్రతులు : 2000

ప్రతులకు :

శ్రీ వేంకటేశ్వర ఆర్షభారతి ట్రస్ట్‌

గురుకృప

1-10-140|/1, అశోక్‌నగర్‌,

హైదరాబాద్‌ - 500 020.

ముద్రణ :

సహజ ప్రింటర్స్‌

బాకారం, ముషీరాబాద్‌,

హైదరాబాద్‌ - 500 048.

ఫోన్‌ : 68041

శ్రీః

ఉపోద్ఘాతము

పురాణములు పురాతనత్వము

వేదవాఙ్మయం వలె పురాణ వాఙ్మయం కూడా అతి విస్తృత వైనది. అతి ప్రాచీన మైనది. వేదాలను విభజించినట్లే పురాణ వాఙ్మయానికి కూడా నిశ్చితరూపం ఇచ్చి తీర్చి దిద్దినవాడు వ్యాసుడే. ఈనాడు పద్దెనిమిది మహాపురాణాలు, పద్దెనిమిది ఉప పురాణాలు, ఇంకా పురాణాలనే పేరుతో మరికొన్ని గ్రంథాలు లభిస్తున్నాయి.

పురాణాల స్వరూప స్వభావాలను గూర్చి పురాణాలలోనే అక్కడక్కడ చెప్పబడి ఉన్నది. ప్రాచీన వాఙ్మయంలో మనకు "పురాణము" "పురాణ సంహిత" అనే రెండు పేర్లు కనబడతాయి. 'పురాణం' అనగా లోకవృత్తము. అది ఒక నిశ్చిత గ్రంథ రూపంలో కాకుండా వివిధ కథా కథన రూపంలో, లోక ప్రచారంలో ఉన్న విద్యా విశేషము. గ్రంథరూపంలో క్రోడీకరించినది పురాణసంహిత. వీటిలో 'పురాణం' అనేది వేదాలకంటె కూడా ప్రాచీన మైనదని కొన్ని పురాణాలు చెపుతున్నాయి. బ్రహ్మ నోటి నుంచి శతకోటి విస్తృతమైన (నూరుకోట్ల శ్లోకాల) పురాణం ముందు బయలుదేరినదట. పిమ్మట వేదాలు బయలుదేరినవట.

"పురాణం సర్వ శాస్త్రాణాం ప్రథమం బ్రహ్మణా స్మృతమ్‌

నిత్యం శబ్దమయం పుణ్యం శతకోటి ప్రవిస్తరమ్‌

అనన్తరం చ వక్త్రేభ్యః వేదాస్తన్య వినిర్గతాః."

పురాణాల ఆవిర్భావము

పురాణాల ఆవిర్భావాన్ని గూర్చి స్కన్ద-మత్స్య పద్మపురాణాదులలో మరొక సంప్రదాయం ఉన్నది. పూర్వకల్పంలో చతుర్ముఖ ప్రోక్తమైన పురాణం శతకోటి ప్రవిస్తరంగా ఉండేదట. అల్పబుద్ధులైన అర్వాచీనుల సౌకర్యం కోసం ఆ బ్రహ్మయే వ్యాసరూపంలో వచ్చి దానిని నాలుగు లక్షల శ్లోకాల లోనికి కుదించి పద్దెనిమిది పూరాణాలుగా చేసినాడట.

"పురాణమేకమేవాసీ దస్మిన్కల్పాన్తరే నృప

త్రివర్గసాదనం పుణ్యం శతకోటి ప్రవి స్తరమ్‌.

స్మృత్వా జగాద చ మునీన్‌ వ్రతీ దేవశ్చతుర్ముఖః

చతుర్లక్షప్రమాణన ద్వాపరే ద్వాపరే సదా

తదష్టాదశధా కృత్వా భూర్లోకే7స్మిన్‌ ప్రభాష్యతే".

__స్కం. పు. 1.28-30.

రెండు వాఙ్మయ ప్రవాహాలు

అతి ప్రాచీన కాలం నుంచీ రెండు వాఙ్మయ ప్రవాహాలు ఆవిర్భవించి పరస్పరోపకారకాలుగా ఉంటూ రెండు మార్గాలలో ప్రవహిస్తున్నాయి. మొదటిది వేదవాఙ్మయ ప్రవాహము, రెండవది పురాణ వాఙ్మయ ప్రవాహము. మొదటి దానిని బ్రహ్మనుండి ఋషులు గ్రహించి ప్రచారం చేయగా రెండవదానిని మునులు స్వీకరించి ప్రచారం చేశారు. అందుచేత ఈ రెండూ కూడా సమాన ప్రామాణ్యం కలవి. ఈ విషయం మార్కండేయ పురాణంలో చెప్పబడినది.

ఉత్పన్న మాత్రస్య పురా బ్రహ్మణో7వ్యక్తజన్మనః

పురాణమేతద్వేదాశ్చ ముఖేభ్యో7నువినిస్సృతాః

వేదాన్‌ సప్తర్షయస్తస్మాజ్జగృహుస్తస్య మానసాః

పురాణం జగృహుశ్చాద్యా మునయస్తస్య మానసాః."

__మా. పు. 45

పురాణాల ప్రచారము

పైన వివరించిన విధంగా, అనూచానంగా వస్తూన్న అతి ప్రాచీనమైన పురాణాన్ని విభజించి, గ్రంథస్థం చేసి, కృష్ణద్వైపాయనుడు పురాణసంహిత రచించినాడు. వేదాల "వ్యాసనం" (విభజించడం) చేతనేకాకుండా "పురాణవ్యాసనం" చేతకూడా ఈయనకు వ్యాసత్వం సిద్దించింది. వ్యాసుడు తాను రచించిన పురాణ సంహితను రోమహర్షణుడనే సూతునకు బోధించి దానిని ప్రచారం చేయవలసినదిగా ఆజ్ఞాపించాడు. రోమహర్షణుడు వ్యాసుని పురాణసంహిత ఆధారంగా మరొక పురాణసంహిత రచించి ఆత్రేయుడైన సుమతి, కాశ్యపుడైన అకృతవ్రణుడు, భారద్వాజుడైన అగ్నివర్చసుడు, వాసిష్ఠుడైన మిత్రాయువు, సావర్ణియైన సోమదత్తి, శాంశపాయనుడైన సుశర్మ అనే ఆరుగురు శిష్యులకు బోధించినాడు. వారిలో కాశ్యప-సావర్ణిశాంశపాయనులు మరిమూడు సంహితలు రచించినారు. రోమహర్షణుని సంహితతో కలిపి నాలుగు సంహితలైనవి. ఈ విషయం వాయు పురాణాదులలోనూ, కొంచెం భేదంలో ఈ అగ్నిపురాణంలోనే 272వ అధ్యాయంలోనూ చెప్పబడింది. ఇపుడు మనకు లభ్యమయ్యే అష్టాదశపుహాపురాణాలు కృష్ణ ద్వైపాయనుడే రచించినట్లు సంప్రదాయం. "అష్టాదశపురాణానాం కర్తా సత్యవతీసుతః" ఇత్యాది వాక్యాలు ఇందుకు ఆధారం.

అగ్నిపురాణము లేదా శ్రీమదగ్ని మహాపురాణము

ఇది అష్టాదశ మాహాపురాణాలలో ఒకటి. అగ్నిరూపుడైన శ్రీమహావిష్ణువునుండి ఆవిర్భవించడం చేత దీనికి "అగ్ని మహాపురాణము" అనే పేరు వచ్చినది. అగ్నిదేవుడు వసిష్ఠునకు చెప్పిన ఈ పురాణాన్ని వ్యాసుడు ఆయన నుండి (వసిష్ఠుని నుండి) గ్రహించి తన శిష్యుడైన సూతునికి బోధించాడు. అగ్ని పురాణంలో 15000 శ్లోకాలున్నవని భాగవతంలోను, 16000 శ్లోకాలున్నవని మత్స్యపురాణంలోను చెప్పబడి ఉన్నది. శ్లోక సంఖ్య12000 అని అగ్నిపురాణం లోనే 272వ అధ్యాయంలోనూ, 15000 అని చివరి అధ్యాయంలోను చెప్పబడి ఉన్నది. వాస్తవంలో ఉన్న శ్లోకాల సంఖ్య మాత్రం 11457 అయితే దీనిలో కొన్ని గద్య భాగాలు ఉన్నాయి. వాటిని 32 అక్షరాల శ్లోకాలుగా భాగించి లెక్క పెటితే దాదాపు 1000 శ్లోకాలు పెరగవచ్చును. 383 అధ్యాయాల ఈ మహాపురాణంలో పరాపర విద్యలకు సంబంధించిన అన్ని విషయాలు ఉన్నవనీ, అందుచేత ఒక విధంగా ఇది విజ్ఞాన సర్వస్వం అనీ అక్కడక్కడ చెప్పబడింది.

ఈ పురాణంలో మొత్తం 50 ప్రధాన విషయాలు చెప్పబడినట్లుగా చివరి అధ్యాయంలో ఉన్నది. "సర్గశ్చ ప్రతిసర్గశ్చ" ఇత్యాది పురాణ లక్షణం ప్రకారం ఈ పురాణంలో కూడా సృష్టి, అవాంతర సృష్టి లేదా ప్రళయము, దేవాదుల వంశాలు, మన్వంతరాలు, రాజవంశాలు అనే ఐదు విషయాలు ఉన్నాయి అని చెప్పినా ఈ విషయాలు అసంపూర్ణంగానే కనబడతాయి. ఈ పురాణం వ్యాసరచితమైనదనే సంప్రదాయం ఉన్నది కాని ఆధునికులు మాత్రం అనేకమైన ఆంతరంగిక ప్రమాణాలను పురస్కరించుకొని దీని రచన క్రీ. శ. 700-900 సంవత్సరాల కాలంలో జరిగినట్లు భావిస్తున్నారు.

వైష్ణవ పాంచరాత్రము, భగవద్గీత మొదలైనవి పొందు పరచటం చేత ఈ పురాణానికి వైష్ణవచ్ఛాయ కల్పించడం జరిగింది. కృష్ణుని నారాయణునిగా, విష్ణువునుగా పూజించ వలెనని దీనిలో ప్రతిపాదింపబడింది. అగ్ని విష్ణువుగాను, కాలాగ్నిగాను, రుద్రుడుగాను ప్రారంభాధ్యాయములలో వర్ణింపబడినాడు. "విష్ణువు, అగ్ని అనేవి ఒక దేవత యొక్క రెండు రూపాలు. ఈ పురాణంలో విష్ణువే అగ్నిగా స్తుతింపబడినాడు" అని 174వ అధ్యాయంలో చెప్పబడింది. అగ్ని విష్ణువు యొక్క రూపాంతరమే. సర్వ పాపాలను దహించ కలిగిన ఈ అగ్నిని ధ్యానించి, పూజించి, స్మరించి, స్తుతించాలి. అయితే ఈ పురాణంలో శైవాగమానికి సంబంధించిన విషయాలు, శివలింగపూజ, తాంత్రిక పూజా విధానాలుకూడా చెప్పబడి ఉన్నాయి. ఈ విషయాలు కూడా ఉండడం చేత ఇది 'తామస పురాణం' అని అంటూ, పద్మపురాణంలో దీనినింద కనబడుతుంది. అందుచేత దీని రచన శైవ వైష్ణవాల మధ్య అంతగా విరోధభావం ఏర్పడడానికి ముందుగానే, వైష్ణవ మతంలో రాధాకృష్ణ సంప్రదాయం ఆవిర్భవించడానికి కూడా ముందుగానే జరిగి ఉంటుందని ఆధునిక విమర్శకుల ఊహ.

ఈ పురాణానికి పురాణం అనే పేరే కాని ఇందులో ఉపాఖ్యానాదులు చాలా తక్కువ. శైవ_శాక్త-వైష్ణవాగమాదులకు సంబంధించిన అనేక విషయాలు అత్యధికంగా ఉన్నాయి. అందుచేతనే ఇది ఒక విధంగా విజ్ఞాన సర్వస్వం వంటిదని చెపుతూ ఉంటారు. సంగ్రహంగా దీనిలోని విషయాలు ఇవి:

అన్ని పురాణాలలో ఉన్న పద్దతిలోనే ఈ పురాణంలో కూడా ప్రథమాధ్యాయంలో ప్రారంభం అవుతుంది. రెండుమూడు అధ్యాయాలలో మత్స్య-కూర్మ-వరాహావతారాలు, తరువాతి ఏడు అధ్యాయాలలో (5-11) రామాయణంలోని ఏడుకాండల కథ వర్ణింపబడినవి. 12వ అధ్యాయంలో హరివంశ కథ-తరువాత మూడు అధ్యాయాలలో (13-15) మహాభారత కథ సంక్షిప్తంగా ఉన్నాయి. 16వ అధ్యాయంలో బుద్ధావతారము, కల్క్యవతారము చెప్పబడినవి. 17-20 అధ్యాయాలలో సాధారణంగా అన్ని పురాణాలలో ఉండే సర్గ-ప్రతిసర్గ- మన్వంతరాదుల ప్రసంగం ఉన్నది.

21 మొదలు 105 వరకు ఉన్న అధ్యాయాలలోను, 201వ అధ్యాయంలోను, 317-326 అధ్యాయాలలోను శైవ-వైష్ణవ-శాక్త-సౌర ఆగమాలకు సంబంధించిన విషయాలు ఉన్నాయి. 21-70 అధ్యాయలలో సంవాదం నారద-అగ్ని-హయగ్రీవ-భగవంతుల మధ్య జరిగినది. పాంచరాత్రాగమం పేరు చెప్పకుండగానే పాంచరాత్రపద్ధతిలో వాసుదేవ-సంకర్షణ-ప్రద్యుమ్న-అనిరుద్ధ-నారాయణుల పూజా విధానం చెప్పబడింది. 39-70 అధ్యాయలలో ఇరవైయైదు పాంచరాత్రాగమగ్రంథాలు నిర్దేశింపబడ్డాయి. సప్తరాత్ర సంప్రదాయం అనేది ఒకటి పేర్కొనబడింది. ఈ భాగంలో హయగ్రీవ పాంచరాత్రానికి సంబంధించిన అదికాండ-సంకర్షణకాండలను సంక్షిప్తం చేసి చెప్పినట్లు కనబడుతుంది. అరవైనలుగురు యోగినీల మూర్తులవర్ణనం కూడా ఉన్నది.

71-106 అధ్యాయలలో శివలింగ-దుర్గా-గణశాది పూజావిధానం చెప్పబడింది. ఇక్కడ చెప్పిన వివిద మంత్రాలకు సంబంధించిన విషయాలకూ, శారదాతిలక-మంత్రమహోదధులలో విషయాలకూ చాలా పోలిక లున్నాయి. 107-116 అధ్యాయాలలో స్వాయంభువసృష్టి, భువనకోశ వర్ణనమూ, వివిధ తీర్థాలమాహాత్మ్య వర్ణనమూ ఉన్నాయి. 118-120 అధ్యాయాలలో భారతదేశము, దాని ఎల్లలు, ఆయా ప్రదేశాల ఆయామ వైశాల్యాదులు వర్ణింపబడ్డాయి. 121-149 అధ్యాయలలో ఖగోళశాస్త్రము, జ్యోతిః శాస్త్రము (ఫలిత భాగము), సాముద్రిక శాస్త్రము మొదలైన విషయాలు ప్రతిపాదింపబడినవి. 150-167 వివిధ వర్ణాశ్రమాదులకు సంబంధించిన ధర్మాలు, 168-174 అధ్యాయాలలో పాపాలు, వాటికి ప్రాయశ్చిత్తాలు చెప్పబడినవి. 175-207 అధ్యాయాలలో వివిధ వ్రతాల చర్చ ఉన్నది. 208-217 అధ్యాయాలలో ఉపవాసాది వివిధ పుణ్యకార్యాల వర్ణన ఉన్నది. 218-258 అధ్యాయాలలో రాజధర్మాలు, రాజ్యాపాలనా విధానము, శస్త్రవిద్య, వ్యవహారనిర్ణయము మొదలైన విషయాలు అతి విస్తృతంగా చెప్పబడ్డాయి. 259-271 అధ్యాయాలలో వివిధవైదిక కర్మకలాపాల చర్చ చేయబడింది. 272వ అధ్యాయంలో పూరాణవాఙ్మయాన్ని గూర్చిన వివరణ ఉన్నది. 273-278 అద్యాయాలలో సూర్యచంద్రవంశరాజులు వర్ణన చేయబడింది. 279-300 అధ్యాయాలలోను, 369, 370 అధ్యాయాలలోను, మనుష్యాయుర్వేదమే కాకుండా, గజాశ్వవృక్షాద్యాయుర్వేదం కూడా చెప్పబడింది. 301-326 అధ్యాయాలలో వివిధ దేవతల పూజా విధానాలు, వారికి సంబంధించిన మంత్రాలు, తత్సాధన విధానాదులు చెప్పబడినవి. 327వ అధ్యాయంలో దేవాలయప్రాశస్త్యాన్ని వర్ణింపబడింది. 328-336 అధ్యాయాలలో 'చందస్సు', 336 వ అధ్యాయంలో 'శిక్ష', 337-348 అధ్యాయాలలో అలంకార శాస్త్రానికి సంబంధించిన వివిధ విషయాలు, 349-359 అధ్యాయాలలో వ్యాకరణశాస్త్ర విషయాలు, 360-367 అధ్యాయాలలో నిఘంటువు ఉన్నాయి. నిఘంటు భాగంలో అమర సింహుని నామలింగాను శాసనంలోని శ్లోకాలు యథా తథంగా చేర్చబడ్డాయి. 369-370 అధ్యాయాలలో మానవుని శరీరానికి సంబంధించిన వివిధ భాగాల వర్ణన ఉన్నది. 371వ అధ్యాయంలో అనేక విధాలైన నరకాల వర్ణన ఉన్నది. 372-376 అధ్యాయాలలో యోగశాస్త్ర విషయాలు చెప్పబడినవి. 377-380 అధ్యాయాలలో అద్వైతసిద్దాంతం ప్రతిపాదించబడినది. చివరి మూడు అధ్యాయాలలో (381-383) భగవద్గీతసారము, యమగీత, అగ్నిపురాణ మాహాత్మ్యము ఉన్నాయి.

"అగ్నేయేహి పురాణ7స్మిన్‌ సర్వావిద్యాః ప్రదర్శితాః" (అ.పు. 383-51) అని చెప్పినట్లు, మధ్యయుగానికి చెందిన భారతదేశంలో ప్రచారంలో ఉన్న అన్ని శాస్త్రీయవిషయాలూ ఈ పురాణంలో పొందుపరచబడి ఉన్నాయి.

దీని ఆంధ్రభాషానువాద కార్యక్రమాన్ని నాకు అప్పగించిన "శ్రీ వేంకటేశ్వర ఆర్ష ట్రస్టు" స్థాపకులు శ్రీ పి. వెంకటేశ్వర్లు గారికి చాలా కృతజ్ఞుడను. ఈ పురాణంలో అలంకార శాస్త్రానికి సంబంధించిన విషయాలు ఉన్నాయని చాల మందికి తెలుసును. ఆ భాగాన్ని వేరుగా కొందరు ప్రచురించడం చేత దాన్ని చదివినవారు కూడా ఉంటారు. నేను కూడా చదివినాను. అయితే ఇంకా ఇన్ని విషయాలు దీనిలో ఉన్నాయవి చాల మందికి తెలియదు; నాకూ తెలియదు. "అగ్నిపురాణంలో అలంకార శాస్త్రానికి సంబంధించిన విషయాలు ఉన్నాయికదా; మీరు అలంకారికులు కదా: ఈ పురాణం మీరు తెలుగులోనికి అనువదిస్తే బాగుంటుంది" అని పూజ్యులు దివాకర్ల వెంకటావధానిగారు అన్నప్పడు_"సరే పురాణమే కదా; ఏవో కథలు ఉంటాయి; అలంకారశాస్త్రం ఉన్న భాగం మనకేమి కష్టం కాదు" అని అనుకొని నేను అంగీకరించాను. గ్రంథం సంపాదించి చదవడం ప్రారంభించగానే_దీనిలో కథలకు ప్రాధాన్యమే లేదనీ, అనేక శాస్త్రీయ విషయాలు ఉన్నాయనీ తెలుసుకొన్నాను. అన్ని శాస్త్ర ప్రక్రియలతోనూ కొద్దిగానో గొప్పగానో పరిచయం ఉండడంచేత ఆభాగాల అనువాదంలో క్లేశంఏమీ కలగలేదు. ఆగమ శాస్త్రానికి సంబంధించిన విషయాలు మాత్రం పారిభాషిక పదాలు ఎక్కువగా ఉండడంచేతసరిగా అర్థంకాలేదు. ఏమిచేయాలో తోచలేదు. అదృష్టవశంచేత గోరఖ్‌పూర్‌ గీతా ప్రెస్సువారు ప్రచురించిన మూలరహితమైన హిందీ అనువాదం లభించింది. అది నావంటి కించిద్జుడుకాక బహుశ్రుతులు రచించిన అనువాదం. చాల చక్కగా, ప్రామాణికంగా ఉన్నది. దాని సహాయమే లేకపోతే నేను ఆ భాగాల అనువాదం చేయగలిగే వాడినికాదు. ఈ విధంగా ఈ కార్యం ముగించ గలిగాను. అయినా అక్కడక్కడ కొన్ని దోషాలు ఉండడానికి అవకాశం లేకపోలేదు. పూర్తిగా ఏ దోషాలూ లేకపోతే తదేకదృక్కులు భగ్నాశులవుతారు కదా: ఏమైనా ఈ అనువాదం విషయ జిజ్ఞాసువులకు ఏ కొంచమైనా ఉపకరించకపోదని నా విశ్వాసం.

12-2-1989.

పు. శ్రీ రామచంద్రుడు

Sri Madhagni Mahapuranamu-1    Chapters