Sri Sivamahapuranamu-II    Chapters   

అథ ఏకవింశో%ధ్యాయః

పార్వతికి నారదుని ఉపదేశము

నారద ఉవాచ|

విధే తాత మహాప్రాజ్ఞ విష్ణుశిష్య త్రిలోకకృత్‌ | అద్భుతేయం కథా ప్రోక్తా శంకరస్య మహాత్మనః || 1

భస్మీ భూతే స్మరే శంభు తృతీయ నయనాగ్నినా | తస్మిన్‌ ప్రవిష్టే జలధౌ వత త్వం కిమ భూత్తతః || 2

కిం చకార తతో దేవీ పార్వతీ కుధరాత్మజా| గతా కుత్ర సఖీభ్యాం సా తద్వదాద్య దయానిధే|| 3

నారదుడిట్లు పలికెను-

ఓ విధీ! తండ్రీ! నీవు మహాబుద్ధి శాలివి. విష్ణు శిష్యుడవు. ముల్లోకములను నీవు సృష్టించినావు. శంకరమహాత్ముని ఈ అద్భుతమగు గాథను చెప్పితివి (1). శంభుని మూడవ నేత్రము నుండి పుట్టిన అగ్నిచే మన్మథుడు భస్మము కాగా ఆ అగ్ని సముద్రములో ప్రవేశించగా, తరువాత ఏమి జరిగినదో నీవు చెప్పుము (2). హిమవత్పుత్రిక యగు పార్వతీ దేవి అపుడేమి చేసెను? ఆమె సఖురాండ్రిద్దరితో గూడి ఎచటకు వెళ్లెను? ఓ దయానిధీ! ఇపుడా వృత్తాంతమును చెప్పుము (3).

బ్రహ్మో వాచ |

శృణు తాత మహాప్రాజ్ఞ చరితం శశిమౌలినః | మహోతి కారకసై#్యవ స్వామినో మమ చాదరాత్‌ || 4

అదహత్‌ శంభునేత్రోద్భవో హి మదనం శుచిః | మహాశబ్దో%ద్భుతో%భూద్వై యేనాకాశః ప్రపూరితః || 5

తేన శ##బ్దేన మహాతా కామం దగ్ధం సమీక్ష్య చ | సఖీభ్యాం సహా భీతా సా య¸° స్వగృహమాకులా || 6

తేన శ##బ్దేన హిమవాన్‌ పరివార సమన్వితః | విస్మితో%భూదతి క్లిష్టి స్సుతాం స్మృత్వా గతాం తతః || 7

బ్రహ్మ ఇట్లు పలికెను-

వత్సా! నీవు మహా బుద్ధిశాలివి. నేను గొప్ప లీలాకరుడగు చంద్రశేఖర స్వామి చరితమును వర్ణించెదను. నీవు ఆదరముతో వినుము (4). శంభుని కంటినుండి బయల్వెడలిన అగ్ని మన్మథుని దహించివేసినది గదా! దాని ప్రభావముచే అద్భుతమగు మహాశబ్దము పుట్టి ఆకాశము నిండిపోయెను (5). దహింపబడిన కాముని చూచి, ఆ గొప్ప శబ్దమును విని ఆ పార్వతి భయపడినదై సఖురాండ్రిద్దరితో గూడి కంగారుగా తన గృహమునకు వెళ్లెను (6). ఆ శబ్దమును కుటుంబ సభ్యులతో గూడియున్న హిమవంతుడు గూడ విని శివుని వద్దకు వెళ్లియున్న కుమారైను స్మరించి విస్మయమును, మహా దుఃఖమును పొందెను (7).

జగామ శోకం శైలేశో సుతాం దృష్ట్వా తివిహ్వలామ్‌ | రుదంతీం శంభు విరహా దాససాదాచలేశ్వరః || 8

ఆసాద్య పాణినా తస్యా మార్జయన్నయనద్వయమ్‌ | మాబిభీహి శివే%రోదీరిత్యుక్త్వా తాం తదా గ్రహీత్‌ || 9

క్రోడే కృత్వా సుతాం శీఘ్రం హిమవానచలేశ్వరః | స్వమాలయమథానిన్యే సాంత్వయన్నతి విహ్వలామ్‌ || 10

అంతర్హితే స్మరం దగ్ధ్వా హరే తద్విరహాచ్ఛివా | వికలాభూద్భృశం సా వై లేభే శర్మ న కుత్ర చిత్‌ || 11

శంభుని విరహముచే మహా దుఃఖమును పొంది రోదించుచున్న కుమారైను చూచి పర్వత రాజగు హిమవంతుడు శోకమును పొంది ఆమె వద్దకు వచ్చెను (8). ఆమెను తన దగ్గరకు తీసుకొని, ఆయన కన్నీటిని తుడిచి 'ఓ పార్వతీ! భయపడకుము, ఏడ్వకము' అని పలికి ఓదార్చెను (9). పర్వతరాజగు హిమవంతుడు వెంటనే తన కుమార్తెను ఒడిలో కూర్చుండ బెట్టుకొనెను. మరియు మిక్కిలి దుఃఖితురాలైయున్న ఆమెను ఓదార్చుచూ తన ప్రాసాదములోనికి తీసుకొనివెళ్లెను (10). శివుడు మన్మథుని బూడిద చేసి అంతర్ధానము కాగానే పార్వతి ఆయన యొక్క విరహముచే మిక్కిలి దుఃఖితురాలై ఎక్కడనూ మనశ్శాంతిని పొందలేకపోయెను (11).

పితుర్గృహం తదా గత్వా మిలిత్వా మాతరం శివా | పునర్జాతం తదా మేనే స్వాత్మానం సా ధరాత్మజా || 12

నినింద చ స్వరూపం సా హా హతాస్మీత్యథాబ్రవీత్‌ | సఖీభిర్బోధితా చాపి న బుబోధ గిరీంద్రజా|| 13

స్వపతీ చ పిబంతీ చ సా స్నాతీ గచ్ఛతీ శివా | తిష్ఠతీ చ సఖీమధ్యేన కించిత్సుఖమాప హ || 14

ధిక్‌ స్వరూపం మదీయం చ తథా జన్మ చ కర్మచ | ఇతి బ్రువంతీ సతతం స్మరంతీ హరచేష్టితమ్‌ || 15

ఆ పార్వతి తండ్రి గృహమును చేరిన తరువాత తల్లిని కలుసుకొనెను. అపుడామెకు తాను పునర్జన్మను పొందినట్లు భాసించెను (12) మరియు ఆమె తన రూపమును నిందించుకొని, 'అయ్యో! హతురాలనైతిని' అని దుఃఖించెను. సఖురాండ్రు ఆమెను ఓదార్చిరి. అయిననూ ఆమెకు దుఃఖవిముక్తి కలుగలేదు (13). ఆ పార్వతి నిద్రించుచున్నప్పుడు గాని, నీటిని త్రాగునప్పుడు గాని, స్నానమును చేయునప్పుడు గాని, ఇటునటు నడచునప్పుడు గాని, సఖురాండ్ర మధ్యలో నున్నప్పుడు గాని లేశ##మైననూ సుఖమును పొందలేక పోయెను (14). 'నా రూపము మరియు కర్మ నిందింపదగినవి' అని పలుకుచూ ఆమె సర్వదా శివుని చేష్టలను స్మరింపజొచ్చెను (15).

ఏవం సా పార్వతీ శంభువిరహోత్ల్కిష్టమానసా | సుఖం న లేభే కించిద్వా% బ్రవీచ్ఛివ శివేతి చ || 16

నివసంతీ పితుర్గేహే పినాకిగత చేతనా | శుశోచాథ శివా తాత ముమోహ చ ముహుర్ముహుః|| 17

శైలాధిరాజోప్యథ మేనకాపి మైనాక ముఖ్యాస్సనయాశ్చ సర్వే |

తాం సాంత్వయామాసురదీన సత్త్వా హరం విసస్మారం తథాపి నో సా || 18

అథ దేవమునే ధీమన్‌ హిమవత్ప్రస్తరే తదా | నియోజితో బలభిదాగమస్త్వం కామచారతః || 19

ఈ తీరున శంభుని విరహముచే గొప్ప క్లేశమును పొందిన మనస్సు గల ఆ పార్వతి లేశ##మైననూ సుఖమును పొందజాలక, శివా! శివా! అని పలుకజొచ్చెను (16). వత్సా! ఆ పార్వతి తండ్రిగారి ఇంటివద్ద ఉన్ననూ, ఆమె మనస్సు శివునిపై నుండెను. ఆమె తీవ్రమగు దుఃఖము గలదై అనేక పర్యాయములు స్పృహను గోల్పోయెను (17). దైన్యము నెరుంగని దృఢచిత్తులైన హిమవంతుడు, మేనక, మరియు మైనాకుడు హిమవత్పుత్రులందరు ఆమెను ఓదార్చిరి. కాని ఆమె శివుని మరువలేకపోయెను (18). ఓ దేవర్షీ! ఓ బుద్ధిశాలీ! అపుడు నీవు యథేచ్ఛగా సంచరించుచున్నవాడవై, ఇంద్రునిచే నియోగింపబడి హిమవత్పర్వమునకు విచ్చేసితివి (19).

తతస్త్వం పూజితస్తేన భూధరేణ మహాత్మనా | కుశలం పృష్టవాంస్తం వై తదావిష్టో వరాసనే || 20

తతః ప్రోవాచ శైలేశః కన్యాచరిత మాదితః | హరసేవాన్వితం కామదహనం చ హరేణ హ || 21

శ్రుత్వా వోచో మునే త్వం తు తం శైలేశం శివం భజ | తమామంత్ర్యోదతిష్ఠస్త్వం సంస్మృత్య మనసా శివమ్‌ || 22

తం సముత్సృజ్య రహసి కాలీం తామాగమంస్త్వరా| లోకోపకారో జ్ఞానీ త్వం మునే శివవల్లభః || 23

అపుడు మహాత్ముడగు ఆ హిమవంతుడు నిన్ను పూజించి శ్రేష్ఠమగు ఆసనమునందు గూర్చుండబెట్టి కుశల ప్రశ్నల నడిగెను (20). పార్వతి ప్రారంభము నుండియూ శివుని సేవలో లగ్నమై యుండుట, శివుడు మన్మథుని దహించుట మొదలగు వృత్తాంతమును హిమవంతుడు ఆ తరువాత నీకు వివరించెను (21). ఓ మహర్షీ! నీవా మాటలను విని హిమవంతునితో 'శివుని సేవింపుము' అని బోధించి, మనస్సులో శివుని స్మరిస్తూ లేచివచ్చితివి (22). ఓ మహర్షీ! లోకములకు ఉపకారమును చేయునట్టియు, శివునకు ప్రీతి పాత్రుడవైనట్టియు, జ్ఞాని యగు నీవు హిమవంతుని విడిచిపెట్టి, వెంటనే ఏకాంతములో పార్వతిని కలుసుకొంటివి (23).

ఆసాద్య కాలీం సంబోధ్య తద్ధితే స్థిత ఆదరాత్‌ | అవోచస్త్వం వచస్తథ్యం సర్వేషాం జ్ఞానినాం వరః || 24

జ్ఞానులందరిలో శ్రేష్ఠుడవగు నీవు పార్వతీ దేవి యొక్క హితమును గోరి ఆమెను ఆదరముతో సమీపించి సంబోధించి సత్యమును ఇట్లు పలికితివి (24).

నారద ఉవాచ|

శృణు కాలి వచో మే హి సత్యం వచ్మి దయారతః | సర్వథా తే హితకరం నిర్వికారం సుకామదమ్‌ || 25

సేవితశ్చ మహాదేవస్త్వయేహ తపసా వినా | గర్వవత్యా యదధ్వంసీద్దీనానుగ్రహకారకః || 26

విరక్తశ్చ స తే స్వామీ మహాయోగీ మహేశ్వరః | విసృష్టవాన్‌ స్మరం దగ్ధ్వా త్వాం శివే భక్తవత్సలః || 27

తస్మాత్త్వం సుతపోయుక్తా చిరమారాధయేశ్వరమ్‌| తపసా సంస్కృతాం రుద్రస్స ద్వితీయాం కరిష్యతి|| 28

నారదుడిట్లు పలికెను-

ఓ పార్వతీ! నా మాటము వినుము. దయామయుడనగు నేను నీకు అన్ని విధములుగా హితమును చేగూర్చునది, రాగద్వేషాది దోషములు లేనిది, కోర్కెలనీడేర్చునది అగు సత్యమును చెప్పెదను (25). దీనులను అనుగ్రహించే మహాదేవుని నీవిచట సేవించి యుంటివి. కాని నీవు తపస్సును చేయలేదు. మరియు గర్వమును కలిగియుంటివి. దానితో సర్వము ధ్వంసమాయోను (26). ఓ పార్వతీ! విరాగి, మహాయోగి, భక్తవత్సలుడునగు ఆ మహేశ్వర ప్రభుడు మన్మతుడు దహించి, నిన్ను విడిచిపెట్టి వెళ్లినాడు (27). కావున నీవు చిరకాలము గొప్ప తపస్సును చేసి ఈశ్వరుని ఆరాధించుము. తపస్సుచే పవిత్రురాలవగు నిన్ను ఆయన తన భార్యగా స్వీకరించగలడు (28).

త్వం చాపి శంకరం శంభుం న త్యక్ష్యసి కదాచన | నాన్యం పతిం హఠాద్దేవి గ్రహీష్యసి శివాదృతే|| 29

ఇత్యాకర్ణ్య వచస్తే హి మునే సా భూధరాత్మజా | కించిదుచ్ఛ్వసితా కాలీ ప్రాహ త్వాం సాంజలిర్ముదా|| 30

నీవు ఏనాడైననూ శివశంకరుని వీడి యుండవు. ఓ దేవీ! నీవు శివుడు తక్క మరియొకనిని హఠాత్తుగా భర్తగా స్వీకరించుట జరుగబోదు (29). ఓ మహర్షీ! హిమవత్పుత్రిక యగు ఆ పార్వతి నీ ఈ మాటలను విని, చిన్న నిట్టూర్పును విడచి, ఆనందముతో చేతులెత్తి నమస్కరించి ఇట్లనెను (30).

శివో వాచ|

త్వం తు సర్వజ్ఞ జగతాముపకారకర ప్రభో | రుద్ర స్యారాధనార్థాయ మంత్రం దేహి మునే హి మే || 31

న సిధ్యతి క్రియా కాపి సర్వేషాం సద్గురుం వినా | మయా శ్రుతా పురా సత్యం శ్రుతిరేషా సనాతనీ || 32

పార్వతి ఇట్లు పలికెను-

హే ప్రభో! నీవు సర్వజ్ఞుడవు. జగత్తులకు ఉపకారమును చేయువాడవు. ఓ మహర్షీ! నేను రుద్రుని ఆరాధించుట కొరకై నాకు ఒక మంత్రము నిమ్ము (31). ఎవ్వరికైననూ సద్గురువు లేనిదే పుణ్యకర్మలేవియూ సిద్ధించవని నేను పూర్వము వినియున్నాను. సనాతనమగు వేదము ఈ సత్యము చెప్పుచున్నది (32).

బ్రహ్మోవాచ |

ఇతి శ్రుత్వా వచస్తస్యాః పార్వత్యా మునిసత్తమ | పంచాక్షరం శంభుమంత్రం విధిపూర్వముపాదిశః || 33

అవోచశ్చ వచస్తాం త్వం శ్రద్ధాముత్పాదయన్‌ మునే | ప్రభావం మంత్రరాజస్య తస్య సర్వాధికం మునే || 34

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఓ మహర్షీ! ఆ పార్వతి యొక్క ఇట్టి పలుకులను విని నీవు శివ పంచాక్షరీ మంత్రమును ఆమెకు యథావిధిగా ఉపదేశించితివి (33). ఓ మునీ మరియు నీవు ఆమెకు ఆ మహామంత్రము యొక్క సర్వశ్రేష్ఠమగు మహిమను చెప్పి, ఆమె యందు దానిపై శ్రద్ధను కలిగించితివి (34).

నారద ఉవాచ |

శృణు దేవి మనోరస్య ప్రభావం పరమాద్భుతమ్‌ | యస్య శ్రవణ మాత్రేణ శంకరస్సుప్రసీదతి|| 35

మంత్రో%యం సర్వమంత్రాణామధిరాజశ్చ కామదః | భుక్తిముక్తి ప్రదో%త్యంతం శంకరస్య మహాప్రియః || 36

సుభ##గే యేన జప్తేన విధినా సో%చిరాద్ద్రుతమ్‌ | ఆరాధితస్తే ప్రత్యక్షో భవిష్యతి శివో ధ్రువమ్‌ || 37

చింతయంతీ చ తద్రూపం నియమస్థా శరాక్షరమ్‌ | జపమంత్రం శివే త్వం హి సంతుష్యతి శివో ద్రుతమ్‌|| 38

ఏవం కురు తపస్సాధ్వి తపస్సాధ్యో మహేశ్వరః | తపస్యేవ ఫలం సర్వైః ప్రాప్యతే నాన్యథా క్వచిత్‌|| 39

నారదుడిట్లు పలికెను-

ఓ దేవీ! ఈ మంత్రము యొక్క పరమాశ్చర్యకరమగు మహిమను వినుము. శంకరుడీ మంత్రమును విన్నంత మాత్రాన మిక్కిలి ప్రసన్నుడగును (35). శంకరునకు అత్యంత ప్రీతిపాత్రమగు ఈ మంత్రము మంత్రములోకెల్లా గొప్పది. కోర్కెలను, భక్తిని, ముక్తిని ఇచ్చునది (36). ఓ సుందరీ! నీవు యథావిధిగా దీనిని జపించుము. శివుని ఆరాధించుము. శివుడు శీఘ్రముగానే నీకు ప్రత్యక్షము కాగలడు. ఇది నిశ్చయము (37). ఓ పార్వతీ! నీవు నియమములను పాటిస్తూ, శివుని రూపమును స్మరిస్తూ ఈ పంచాక్షరీ మంత్రమును జపించుము. శివుడు శీఘ్రమే నీయందు ప్రసన్నుడు కాగలడు (38). ఓ సాధ్వీ! నీవీ తీరున తపస్సును చేయుము. మహేశ్వరుడు తపస్సుచే ప్రసన్నుడగును. సర్వప్రాణులు తపస్సు చేతనే ఫలమును పొందును, మరియొక ఉపాయము లేదు (39).

బ్రహ్మో వాచ|

ఏవముక్త్వా తదా కాలీం నారద త్వం శివప్రియః | యాదృచ్ఛికో%గమస్త్వం తు స్వర్గం దేవహితే రతః || 40

పార్వతీ చ తదా శ్రుత్వా వచనం తవ నారద | సుప్రసన్నా తదా ప్రాప పంచాక్షరమనుత్తమమ్‌ || 41

ఇతి శ్రీ శివ మహాపురాణ రుద్ర సంహితాయాం పార్వతీ ఖండే నారదోపదేశో నామ ఏకవింశో%ధ్యాయః (21)

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఓ నారదా! శివునకు ఇష్టుడవగు నీవు అపుడా పార్వతితో ఇట్లు పలికి దేవతలకు హితమును చేయగోరి యథేచ్ఛగా స్వర్గమునకు వెళ్లియుంటివి (40). ఓ నారదా! అపుడా పార్వతి నీ మాటలను విని మిక్కిలి ప్రసన్నురాలై సర్వశ్రేష్ఠమగు పంచాక్షరీ మంత్రమును చేపట్టెను (41).

శ్రీ శివ మహాపురాణములోని రుద్ర సంహితయందు పార్వతీ ఖండలో నారదోపదేశమనే ఇరువది యొకటవ అధ్యాయము ముగిసినది (21).

Sri Sivamahapuranamu-II    Chapters