Upanyasamulu    Chapters   

హరిజన దేవాలయ ప్రవేశము.

దేవాలయములో పవిత్రతకలదనియు, ఆలయాంతర్భాగమున భగవంతుడున్నాడనియు నమ్మువారికే దేవాలయములుద్దేశింపబడినవి. దేవాలయముల పవిత్రతనుగూర్చి ఆగమశాస్త్రములలో వర్ణించబడియున్నది. ఈ శాస్త్రములందు ఎవరికి విశ్వాసములేదో వారు బ్రాహ్మణులైనను, చండాలురైనను దేవాలయ ప్రవేశమునకనర్హులు. అస్పృశ్యులును, కొన్ని నిషేధింపబడ్డ వస్తువులును నిర్ణియించబడ్డ హద్దులనుదాటినచో దేవాలయ పవిత్రతకు మాలిన్యముకల్గునని ధర్మాశాస్త్రమసూత్రములు విశదీకరింపుచున్నవి. దేవాలయములోని భగవంతుని ప్రభావమునకు కళంక మాపాదించి తద్వారా తనకుగాని, ఇతరులకుగాని, ఆ సర్వేశ్వరుని అశీర్వాదములను బడయు అదృష్టమును లేకుండజేయునట్టి ఏపనికైననూ, హిందుమతమునందు విశ్వాసముగల అస్పృశ్యుడెవడైనను, పాల్పడడు, గుడిగోపురములను మాత్రము దర్శించును. ఉత్సవములందు భగవంతుని దర్శనమును పొందును ఈరీతిగజేసి అతుడు వేదోక్తరీతిగ నడుచుకొను బ్రాహ్మణుల కన్నను అధికమైన ప్రయోజనమును పొందుచున్నాడు. మహా భక్తుడైన నందనారు విషయము దీనికొక దృష్టాంతము.

దేవాలయ ప్రవేశపుబిల్లు హిందువులకును, హరిజనులకు భగవంతుని దీవనలందు భాగ్యములేకుండా జేయునని ఎంచబడుచున్నది. కాబట్టి దీనిని ఎదుర్కొని ఖండించుట ప్రతిహిందువునకును, అస్పృశ్యునకును ప్రథమకర్తవ్యము.

మత సంస్కర్తలకు దేవాలయములనిన భక్తివిశ్వాసములులేవు. ఆత్మగౌరవమునందే వారికి దృష్టియుండును. హిందుమతమునందు భక్తివిశ్వాసములులేని కొంతమంది హరిజనులకు దేవాలయముల తెరచినంతమాత్రమున తాము తల పెట్టిన కార్యమును సాధించితిమని సంతోషించెదరు. అవర్ణులు ప్రవేశించుట వలన దేవాలయముల పవిత్రత మంటగలిసినదని ఎప్పుడు సనాతనులు గుర్తించెదరో అప్పుడు వారు దేవాలయములను ప్రవేశించరు. వాటి సమీపమునకే వెళ్ళరు. అవి పాడుపడును.

హరిజనదేవాలయ ప్రవేశబిల్లు శాసనసభలలో ఆమోదింపబడినయెడల దేవాలయములన్నియు క్రమక్రమముగా నశించిపోవును. కావున ఈ బిల్లుయొక్క ఉపపాదనను ప్రతిఘటించి, దేవాలయ పవిత్రతను కాపాడవలసిన భాధ్యత ప్రతిహిందువుపైననూ, ప్రతి హరిజనునిపైననూ కలదు. బహుజనుల మానసిక శాంతికి భంగమువాటిల్లజేయు దేవాలయ ప్రవేశ శాసనమువంటి చట్టములొనర్చుట ప్రజాప్రతినిధులకు కర్తవ్యముకాదని దొరతనమువారు గుర్తించవలసియున్నది!

------

Upanyasamulu    Chapters