రత్నత్రయము
సాధారణ స్మరజయే నిటలాక్షిసాధ్యే
భాగీ శివో భజతునామ యశః సమగ్రమ్,
నామాంఘ్రిమాత్ర కలితే జనని! త్వదీయే
కా వా ప్రసక్తి రివా కాలజయే పురారేః ?
అర్ధనారీశ్వర తత్త్వంలో పార్వతీ పరమేశ్వరులకు ఏకశరీరం. సామేను అంబిక. సాబాలు శివుడు. సమస్త జీవరాశీ వీరి సంతానం. తమిళభాషలో ఈశ్వరునకు 'తాయు మానవర్' అనిన్నీ 'ఆమ్మైయప్పన్' అనిన్నీ రెండు పేరులు ఉన్నవి. అమ్మా అయ్యా వారే అయినందున 'అమ్మైయప్పన్' అని వాడుక. ఈశ్వరుడు జీవరాశికి జనకుడే కాక జనని కూడా. కాబట్టి వారిని 'తాయు మానవర్' అనిన్నీ అంటారు. తాయుమే అనగా తల్లియు, అనవర్ అయినవారు, అంటే తండ్రియే కాక తల్లిగూడా అయినట్టివారు అని తాత్పర్యం. ఒకే ఒకటి అగు అర్ధనారీశ్వర తత్త్వంలో జననీ జనకుల తాదాత్మ్యం చూడవచ్చు.
అర్ధనారీశ్వరు లెట్లాగో శంకరనారాయణమూర్తి గూడా అలాటిదే. దక్షిణాన తిరునల్వేలి జిల్లాలో శంకర నయినార్ కోయిల్ అనే వూళ్లో ఒకేమూర్తిలో శంకర నారాయణ స్వరూపంగా భగవంతు డుండటం నేటికినీ మనకు కనబడుతుంది. మైసూరుకూ మహారాష్ట్రానికీ మథ్య 'హరిహర్' అనే క్షేత్రంలో ఈలాగే హరియున్నూ హరుడున్నూ ఏకస్వరూపంలో ఇమిడి ఉన్నారు.
శంకరనారాయణ స్వరూపమున్నూ అర్ధనారీశ్వర స్వరూపమున్నూ ఈ రెండూ ఒకటె అని చెప్పటానికి శాస్త్రంలో ఆధారాలు ఉన్నవా? మహావిష్ణువు ఈశ్వరునిలో ఒక భాగం, ఈశ్వరుడున్నూ మహావిష్ణువులో ఒక భాగం అని చెప్పడానికి పురాణాలకు సంబంధించిన మూర్తులూ, క్షేత్రాలూ ఆధారం.
తమిళనాడులో వెలసిన మహాభక్తులు వెనుక కాలంలో విష్ణుక్షేత్రాలు సందర్శించే సందర్భంలో ప్రతి క్షేత్రంలోనూ మంగళాచరణస్తుతులు చేసి పోయేవారు. శివభక్తులుగూడా ఇదేరీతిగా స్తోత్రంచేసి వెళ్ళేవారు. ఆ యీ భక్తులుచేసిన స్తోత్రాలయిన దివ్యప్రబంధాలలోనూ (ఇవి వైష్ణవాలు) తేవారాలలోనూ (ఇవి శైవాలు) చూడవచ్చు. తిరుమంగై యాళ్వారు పెరుమాళ్ళను నుతిచేసేటప్పుడు,
పిరై దంగు చడయాపై సలత్తే నైత్తు
పిరమనైత్తన్ ఉన్దియలే తోట్రు నిత్తు పెరియతిరుమొళి.
అని నుతి చేశారు. పెరుమాళ్లు తన కుడిప్రక్క చంద్రశేఖడుని శివుని ధరించాడు. ఉన్ది అంటే బొడ్డు. బొడ్డు దామరనుండియే నాలుగు మొగముల బాలుడావిర్భవించింది. కుడిప్రక్క శివుడున్న రూపమే శంకరనారాయణుడు. ఇదే విధంగా తేవారంలోనూ.
'కూడమాడియై ఇడత్తే కొండు'
అని ఉంది. కుడమాడి అనే పేరు విష్ణువునూ, శ్రీకృష్ణపరమాత్మను చెపుతుంది. కడవలుమోసి గోపికలతో సయ్యాటాలాడారట, కుడర్సకడవలు. ఆడ్సిఆడినవారు. అట్టి కుడమాడిని ఎడమతట్టున కలవాడు ఈశ్వరుడు.
విష్ణువు కుడి తట్టున శివు డున్నటులున్నూ, ఎడమ తట్టున విష్ణు వున్నటులున్నూ ఈ యిరువురున్నూ ఒకరే అనే అర్థం వచ్చేటట్లు శివభక్తులూ, విష్ణుభక్తులూ వర్ణించారు. వీరి వర్ణనలనుబట్టి శివవిష్ణువు లొకే స్వరూపమనిన్నీ హరియున్నూ హరుడున్నూ శంకరుడున్నూ నారాయణడున్నూ ఏక శరీరంతో ఉన్నారనిన్నీ తెలుస్తుంది.
ఈశ్వరుని వామభాగంలో నారాయణు డున్నాడని అంటే ఆ చోటే అంబికగూడా ఉండడంవల్ల నారాయణునకూ ఈశ్వరునికీ అభేదం అని తెలుస్తుంది. నారాయణుడు సాక్షాత్తు అంబికే. పరమేశ్వరీ స్తోత్రాలలో కొన్నిచోట్ల 'పద్మనాభసహోదరీ, కృష్ణసహోదరీ అని చెప్పడంకద్దు. అలాగే విష్ణువున్నూ అంబికకు సోదరుడని
వ్యవహరిస్తారు.
మందిరక్కోడి యుడుత్తి మణమాలై
అందరి సుట్ట కణాక్కండేన్ తోళినాన్
అని ఆండాళ్ పాశురం. మహావిష్ణువునే ప్రేమించి ఆయననే పెండ్లి చేసికొంటానని పట్టు పట్టిన 'ఆండాళ్కు- ఆముక్తమాల్యదకు- అలంకారం చేసేటప్పుడు వదినెగారు అంబిక వచ్చి 'మణమాలైను'- వివాహమాల్యమును అలంకరించిదట! 'అందరి' అనగా అంబిక.
తిరుమళిసైయాళ్వారు 'మాదాయమాలవన్తేనూదవనై' అని వ్రాశారు. మహావిష్ణువు స్త్రీ రూపం తాల్చాడని దేని అర్థం. పాలవెల్లిని తరచేటప్పుడు అమృతముకోసం దేవతలకున్నూ అసురులకున్నూ వివాదం కలుగగా విష్ణువు మోహిన్యవతారం స్వీకారించారని ఒక కథ.
ఇంకొకప్పు డు భస్మాసురుడు శివునికోసం ఘోరమయిన తపస్సుచేయగా ఈశ్వరుడు ప్రత్యక్షమై వరంకోరుకోమన్నాడు. నేను 'ఎవరితలమీద చేయిపెడతానో వారు పిడికెడు బూడిదై పోవాలి' అని వరం అడిగాడుట. ఈశ్వరుడు 'ఆలాగే అవుగాక' అని వరం ఇచ్చాడట. భస్మాసురుడు ఆ వరప్రభావం పరిశీలించడానికి ఈశ్వరుని తలమీదనే చేయుంచడానికి 'ఏదీ నీ తల చూపు' అని అన్నాడుట. వరమిచ్చిన వేలుపునెత్తికే కొరవి పెట్టదలచిన భక్తుని భావౌన్నత్యానికి భవుడు భయపడి పారిపోవడము తలపెట్టాడట. అపుడు మహావిష్ణువు 'ఇదేమి చిత్రం? ఈశ్వరుని గతే ఇట్లా ఉందే' అని జాలిపడి కటాక్షమాత్రాన మోహపెట్టే కామినీవేషం ధరించి భస్మాసురునికి కనబడ్డారట. అతడున్నూ ఒళ్ళూపైతెలియక కామం పొంది తన్నంగీకరింప మని వేడుకోడం మొదలేశాడట. మంచిదే, నీవు పోయి స్నానాచమనాలు మొదలయినవన్నీ చేసిరా' అని చెప్పినదట ఆ మోహిన్యవతారం. అతడు పోయి ఆచమనం చేస్తూ 'పద్మనాభ! దామోదర!' అని తలను చేత్తో స్పృశించాడో లేదో భగ్గున మండి భస్మమైపోయాడట. 'మాదాయ మాలవనై' అనడానికి మహావిష్ణువు స్త్రీరూపం ధరించాడని అనడమే ఆధారం. అంబికా కాగా ఆయనయే ఒకే వస్తువు విష్ణువుగానూ ఈశ్వరుడుగానూ అంబికగానూ ఆవిర్భవించి ఉన్నది. ఈ రూపాలతో లోకాలను అనుగ్రహించడానికి ఆ పరమాత్మ వేరువేరు అవసరాలలో వెలిశారని ఈ గాథలు చెపుతున్నై. పెద్దలు రత్నత్రయం అని చెపుతారు. మనం పూజించే యీ మూడు రత్నాలూ వేదమధ్యంలో ఉన్నవి. అంబిక విష్ణువు, ఈశ్వరుడు అనే ఈ మూడు రత్నాలూ మనకు పూజనీయాలు.
కాంచీపురంలో కామాక్షికి ప్రత్యేకంగా ఒక ఆలయమూ పెరుమాళ్ళకు వరదరాజపెరుమాళ్ళకు ఒక కోవెలా ఈశ్వరునకు ఏకామ్రనాథదేవాలయమూ ఉన్నవి. వాస్తవానికి వీరు వేరు కాదనిన్నీ ఒకటే అనిన్నీ తెలపడానికి అర్ధనారీశ్వర తత్త్వమూ శంకరనారాయణ తత్త్వమూ ఏర్పడినవి.
కావేరీ పాకం అని ఒక గ్రామం ఉంది. కంచి నుండి వేలూరు పోయే దారికి అది ఇరువది మైళ్ళ దవ్వులో ఉన్నది. అచ్చటికి 2 మైళ్ళ దవ్వులో పాలార్ నది ప్రవహిస్తూ ఉంటుంది. దాని ఒడ్డున 'తిరుప్పార్ కడల్' అనేది ఒక క్షేత్రం. ఆ క్షేత్రంలో ఒక పెరుమాళ్ళగుడి. ఆ దేవళము గూర్చి ఒక కథ వాడుకలో ఉన్నది.
ఆ ఊళ్లో మొదట విష్ణ్వాలయం అనేది లేదు. శివుని గుడి మాత్రం ఉండేది. శ్రీ వైష్ణవు లొకరు బహుక్షేత్రాటనం చేసి ఆ ఊరు వచ్చారు. అన్ని ఊళ్ళలోనూ శివ విష్ణుదేవాలయాలు ఉంటై. ఆయన ఏ ఊరు వెళ్ళినా విష్ణుదర్శనం లేకుండా భుజించి ఎరుగరు. ఎన్నినాళ్ళు వరుసగా విష్ణుదర్శన భాగ్యం లేకున్నా అన్ని నాళ్లూ ఆయనకు ఉపవాసమే. ఆయన తిరుప్పార్‌కడల్ అనే గ్రామం వేంచేసి విష్ణ్వాలయం కోసం వెతకడం మొదలుపెట్టాడు. కాని చూచిన గుడులన్నీ శివునివే. ఇందులో ఈగుడిలో నయినా విష్ణువు ఉంటాడేమో అని దానిలో దూరాడు. చూచునుగదా ఎట్టెదుట ఈశ్వరుడు. వెంట వెంటనే బితుకు బితుకుమంటూ బయటికి పరుగు తీశాడు. ఆనాడిక దైవదర్శనంలేదని అనుకొని ఒక పెడ ఆకలితోనూ ఒకపెడ బెంగతోనూ తల్లడిల్లుతూ కూచున్నాడు. భక్తితోడి బాధ దుర్భరంగా ఉంది. అనతి ఆస్థితి చూచి శ్రీమహావిష్ణువు వృద్ధబ్రాహ్మణ వేషంతో వచ్చి 'స్వామీ! విష్ణుదర్శనానికి వస్తారా?' అని అడిగారుట.
'ఈ వూళ్లో విష్ణ్వాలయంకూడానా? పాడూరు' అని కసురుకున్నాడుట.
'అల్లదిగో ఆ కనబడేది పెరుమాళ్ళ కోవెలగదా! ఆ భక్తు డిప్పుడుచూచి బెదిరి పారిపోయి వచ్చింది. ఆకోవెల నుండే- ఎందుకయ్యా అబద్ధాలు? అది ఈశ్వరుని గుడి!' అని అన్నాడు.
'కాదు, అబద్ధం చెప్పేది మీరు. నేను కాదు. అది పెరుమాళ్ళగుడే. కావలిస్తే వచ్చి చూచుకోండి' అని ఆయన అన్నాడు. ఇట్లా కాదని భక్తుడూ, ఔనని ముసలిబాపడూ, వాదులాడారు. మాధ్యస్థ్యానికి కొందఱు బ్రాహ్మణులు పోగయారు. ఇదేమిటో 'మనం అందరం కలిసివెళ్లి చూచి వత్తాం' అని అనుకున్నారు.
అక్కడికి వెళ్లిచూడగా ఆలయమేమో శివాలయమే. మూర్తి శివలింగమువలెనే, క్రింద బ్రహ్మపీఠం. కాని దాని మీద మాత్రం పెరుమాళ్లు. దానిని చూడగానే 'ఏమారి పోతిమే! మహావిష్ణువుకదా ఇచట ఉండేది' అని ఆ విష్ణుభక్తుడు లోలోపల సంతోషించి స్తోత్రం చేశాడట. ఆయన మరి క్షేత్రాటనంమాని ఆఊళ్లోనే కాపురంపెట్టి పెరుమాళ్ళ సేవ చేస్తూ ఉండిపోయాడుట!
నేటికిన్నీ ఆక్షేత్రంలో బ్రహ్మపీఠమ్మీద లింగం ఉండే చోట పెరుమాళ్ళ విగ్రహం ఉంటుంది. శివకేశవుల ఏకత్వానికి ఈ క్షేత్రం ఒక దృష్టాంతం. శంకరనాయనార్ కోవెలలోగూడా ఒకే శరీరంతో శంకరనారాయణులిరువురూ ఉన్నారు.
ఇపుడు నే చెప్పిన ఇతిహాసాలు రత్నత్రయమును గూర్చిన్నీ వస్త్వేకత్వమును గూర్చిన్నీ చాటుతవి. అర్ధనారీశ్వరతత్త్వం శివపార్వతుల కీ భేదమును చాటుతుంది. శంకర నారాయణ స్వరూపం శివ విష్ణువుల అభేదమును తెలుపుతుంది. అభేదమయిన వస్తువు భేదము కలిగిన దానివలె రెండు మూడు రూపాలు తాల్చి మనకు అనుగ్రహము చేస్తున్న దని శాస్త్రాల వలనను క్షేత్రాలలోని మూర్తులవలనను తెలిసికోవచ్చు. రత్నత్రయ పరీక్ష అనే గ్రంథంలో రత్నములను గుఱించి చెప్పేటప్పుడు 'ఒకే స్వరూపం ద్వివిధంగానూ త్రివిధంగానూ ప్రకాశిస్తుందనిన్నీ, ఏయేపని యే యే ప్రయోజనానికి ఏయే విధముగా భాసించవలెనో ఆయా విధంగా భాసిస్తుందనిన్నీ, నానా రూపాలతో వేరు వేరు స్థితు లున్నటులుగా తోచినా, అభిన్నమైన వస్తువిది, అని చెప్పబడినది. మూర్తిత్రయము నందున్నూ ఇదే తత్త్వం ప్రకాశిస్తూంది. దీనిని మనము తెలిసికొని ఆ పరమాత్మానుగ్రహం పొందాలి.
|