గణపతిస్తుతి
గణపతిని గజపతిని కవిపతిని కులపతిని
రక్తితో భక్తితో ముదముతో నుతియింతు
తమ్మిపూలను బోలు చల్లనీ పాదాల
ఘల్లుఘల్లని క్షుద్రఘంటికలు మ్రోయంగ
పై ధరించిన యట్టి పీతాంబరము వ్రాల
మత్తేభవదనంబు మదజలాసిక్త
గండస్థలంబును పాలస్థలంబున
తీరుగా దీర్చి త్రిపుండ్రరేఖలతో
రెండు చేతులలోన అంకుశము పాశమూ
వ్రేలాడు తుండంబు ఎగుభుజంబులతో
ముచ్చటగ కనపడే మూడుకన్నులవాడు
రత్న ప్రభారుణ భ్రాజమాన కిరీట
కాంతులు దిశ##లెల్ల గడలుకొని పర్వంగ
వివరణాతీతమై వెలుగొందు చిన్మూర్తి
మోదక ప్రియుడును వేదగర్భుండును
సచ్చిత్స్వరూపుడును సతత సుముఖుడును
ఆద్యంతములు లేని ఆనందమూర్తియు
పంచాక్షరీమంత్ర పరమార్థవిదుడు-
ప్రణయసౌధంబున ప్రణయినులైన
అణిమ గరిమా లఘీమ అష్టసిద్ధులతో
ప్రజ్ఞానఘనముగా ప్రజ్జ్వరిల్లే ఘనుడు
సిద్ధిబుద్ధీసహిత శ్రీ వినాయకుడు-
శాంతినీ దాంతినీ సకల సౌఖ్యములను
మా కిచ్చి వెసబ్రోచి మమ్ము రక్షించు.
''విశాఖ''
|