Aathmabodha         Chapters          Last Page

1. అభిప్రాయాలు

సామాజిక స్పృహ

డాక్టరు జి.చెన్నకేశవ్‌ రెడ్డి

M.A. Ph.D.,

విజ్ఞానసర్వస్వశాఖాధిపతి,

తెలుగు విశ్వవిద్యాలయం,

హైదరాబాదు.

నేటి ఆధునిక సమాజం అత్యంత సంక్లిష్టమైనది, సంఘర్షణాత్మకమైనది, సంక్షుభితమైనది, మున్నెన్నడూ లేనంతగా మనిషి సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాడు, అనేక ఆటుపోట్లకు గురవుతున్నాడు. సమస్త విలువల్ని వదిలిపెట్టి, ఒకే ఒక్క విలువకు (ధనార్జనకు) ప్రాధాన్యమిచ్చి, తోటివాడికి తోడ్పడటంపోయి, తోటివాడికంటే మిన్నగా సంపాదించాలని, భౌతిక సుఖాలను అందరికంటే అధికంగా జుర్రుకోవాలనే తపనతో, తాపత్రయంలో ఉరుకులు నురగలతో పరుగులు తీస్తున్నాడు. ఫలితంగా, అంతులేని అలసటకు, ఆవేదనకు నిరాశకు, అశాంతికి లోనవుతున్నాడు. ఈ పరుగుపందెం తొడతొక్కిడిలో సాటి మనిషిపట్ల ఉండవలసిన కనీస ప్రేమాదరణలు, గౌరవాభిమానాలు నానాటికి కరువైపోతున్నాయి. ఎవరినీ ప్రేమించలేకా, ఎవరినీ నమ్మలేకా ఏకాకిగా మిగిలిపోతున్నాడు. ఈ ప్రపంచ వేగంలో, ఈ కరుడుగట్టిన స్వార్థంతో ఈ మానవుడు రేపు ఎక్కడికి చేరుకుంటాడో తెలియటం లేదు.

పారిశ్రామిక నాగరికత అడ్డూ అదుపు లేకుండా పెరిగిపోవడం వల్లనైతేనేమి, అణుబాంబుల యుద్ధాలు ప్రజ్వరిల్లడం వల్లనైతేనేమి, వాతావరణంలో అనేక మార్పులు జరిగి, అనేక కాలుష్యాలవల్ల వింత వింత రోగాలు ప్రబలి మానవుడి మనుగడను పరిహసిస్తున్నాయి. అన్ని రంగాలలోనూ అంతులేని స్పర్ధఅనివార్యమై అనేక మానసిక ఒత్తిడులకు గురవుతున్నాడు, నేటి మానవుడు. శారీరక, మానసిక, ఆరోగ్యాలకు మున్నెన్నడూ లేనంత ముప్పు వాటిల్లడంతో తీవ్రమైన అభద్రతకూ భయానికీ లోనవుతున్నాడు. ఇలాంటి స్థితిలో కొందరు జిజ్ఞాసాపరులు ఆరోగ్య స్పృహతో వాకింగ్‌ క్లబ్‌లు, హెల్త్‌ క్లబ్‌లు, యోగాభ్యాసాలు, ఆయిల్‌ పుల్లింగ్‌లు వంటి ఆరోగ్య ప్రక్రియలను అలవరచుకొంటుంటే, మరికొందరు, భావాతీతధ్యానం, ప్రాణాయామం వంటి ప్రక్రియలద్వారా మానసిక ఒత్తిడులను తగ్గించుకొనే ప్రయత్నం, శక్తిని పెంపొందించుకొనే ప్రయత్నం వంటివి చేస్తున్నారు. మరికొందరు చిత్తశాంతి కోసం గురువులను ఎన్నుకొని సత్సంగియై, ప్రేమీయై ఆత్మజ్ఞానాన్ని ఆవిష్కరించుకొంటున్నారు. తన్ను తాను తెలుసుకోడానికి పూర్వులు సర్వసంగ పరిత్యాగులై తపోవనాలకు తరలిపోయేవారు. ఇప్పుడు ఆధునికులు సమాజంలోనే ఉంటూ సంసార జీవనం గడుపుతూ ఎవరో ఒక గురువును ఆశ్రయించుకొని తమలోని జిజ్ఞాసను తీర్చుకొంటున్నారు. ఆత్మాన్వేషణ తత్పరులవుతున్నారు. అరవిందుడు, రమణ మహర్షి, మాస్టర్‌ సి.వి.వి వంటి గురువులవల్ల ప్రభావితులై ఎందరో మేధావులు, సామాన్యులు యోగమార్గాన్ని అవలంబించినవారున్నారు. ఇటీవలి కాలంలో యోగానంద రాసిన (ఒక యోగి ఆత్మకథ) చదివి, యోగదా సత్సంగసభ్యులై యోగమార్గాన్న ఎన్నుకొన్న వారెందరో ఉన్నారు. నేనూ కొంతకాలంపాటు సభ్యుడనే. ఆ మార్గంలో సాధన చేస్తున్నదశలో, పదవీ విరమణచేసి విశ్రాంతి తీసుకొంటున్న మిత్రులు శ్రీ చంద్రమోహన్‌ గారిలోని జిజ్ఞాసను గుర్తించి సభ్యులై విశ్రాంతి కాలాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా సలహా ఇచ్చి ఉన్నాను. వారప్పుడు ఆ సలహాకు వెంటనే ప్రతిస్పందింంచలేదు. కొంతకాలానికి తనదైన అన్వేషణలో శ్రీ భగవాన్‌గురుమహారాజ్‌గారిని గురువుగా ఎన్నుకొన్నారు. ఎవరి గురువును వారు అన్వేషించుకోవలసిందే కదా! నేను వారిని కలిసినప్పుడల్లా పరిపూర్ణ విశ్రాంతితో ఏ సాంసారిక వ్యాపకాలూ పెట్టుకోకుండా పూర్తి కాలాన్ని వినియోగించి సాధకుడిగా ఎదుగుతూ అనేక పుస్తకాలను అవలోడనం చేస్తూ తన జిజ్ఞాసనూ, యోగదాహాన్నీ సంతృప్తిపరుచుకొంటున్న దిశలో వెళ్ళుతున్నట్లుగా అనిపించేది. వారు సరి అయిన గురువునే ఎన్నుకొన్నారని, సరి అయిన మార్గంలోనే పయనిస్తున్నారని అనుకొన్నాను. వారు కేవలం సాధనతోనే తృప్తిపడలేదు. చిరకాలం ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నందువల్లనైతేనేమి, అనేక పుస్తకాలను అమూలాగ్రం పఠించి నందువల్లనైతేనేమి, తన సాధనానుభూతినీ, తన జ్ఞానాన్నీ మేళవించి శ్రీ శంకరుల 'ఆత్మబోధ' శ్లోకాలను తనదైన వ్యాఖ్యానాన్ని జోడించి సర్వులకూ సుబోధక మయ్యేలా రచించి ధన్యులైనారు- చంద్రమోహన్‌ గారు. శాస్త్రగ్రంథాన్ని కేవల సంప్రదాయ రీతిలోనే కాక, సామాజిక స్పృహతో, ఆధునిక దృక్పథంతో సహృదయైక వేద్యంగా ఈ గ్రంథాన్ని రచించినట్లు ప్రతిపుటా వెల్లడిస్తుంది. ఎంతో నైపుణ్యమున్న, విజయవంతుడైన ఉపాధ్యాయుడాయన. తన వృత్తిలోని అనుభవాన్నీ, కొత్తగా అలవరచుకొన్న ప్రవృత్తిలోని అనుభవాన్నీ అభ్యాసాన్నీ రంగరించి పండించిన ఫలమే ఈ గ్రంథ రాజం. సత్కాలక్షేపానికి ఆరంభించిన సాధన క్రమంగా వికసించి ఒక సద్గ్రంథంగా రూపుదిద్దుకోడం మరెంతో సంతోషదాయకం.

శ్రీ శంకరుని 'ఆత్మబోధ'ను గురించి వివరించే ఈ గ్రంథంలో కూడ మనిషి పుట్టుకతోనే ఫలానా కులానికి చెందిన వాడుగా, పుణ్యాత్ముడిగానో, పాపిగానో ముద్రవేసుకొని మరీ పుట్టడం భారతదేశంలో తప్ప మరెక్కడా లేదని, భారతదేశం అభివృద్ధి చెందకపోవడానికి ప్రధాన మూలకారణం ఇదేనని పలు సందర్భాలలో పలు విధాలుగా చెప్పిన శ్రీ చంద్రమోహన్‌గారి నిజాయితీ మెచ్చుకోతగినది. ఆయన నిజమైన అన్వేషణ పరుడు. నిర్మలమైన నిద్దపు సాధకుడు. వారు ఈ శేష జీవితంలో అశేష అనుభవాన్ని గడించి, తన సాధనలో దివ్యానుభూతులను పొందుతూ మరెన్నో సద్గ్రంథాలు రచించి సామాన్యులలో కూడ ఈ రకమైన జిజ్ఞాసను కలిగించాలని ఆకాంక్షిస్తున్నాను.

ఈ గ్రంథం గురించి నా అభిప్రాయం చెప్పడానికి అటు ప్రాయమూ, ఇటు సాధనాబలమూ, సంస్కారబలమూ సరిపోకపోయినా, సన్మిత్రుడు శ్రీ చంద్రమోహన్‌గారి సంకల్పబలానికి తలొగ్గి సంతోషంగా అంగీకరించాను. నా చేత ఈ సద్గ్రంథానికి అభిప్రాయం రాయించిన శ్రీ చంద్రమోహన్‌ సహృదయతకు, స్నేహానుబంధానికి నా కైమోడ్పులు.

20-7-96

హైదరాబాదు జి. చెన్నకేశవరెడ్డి

Aathmabodha         Chapters          Last Page