Aathmabodha         Chapters          Last Page

3. ఉన్నది ఒక్కటే

డాక్టర్‌ పోరంకి దక్షిణామూర్తి

M.A., Ph.D.,

రిటైర్డ్‌ డిప్యూటీ డైరెక్టరు,

తెలుగు అకాడమి,

హైదరాబాదు.

ఇద్దరు స్నేహితులు తీరిగ్గా కూర్చుని మాట్లాడుకొంటున్నారు. ఒకాయన తన సొదేదో వెళ్ళబెట్టుకొంటున్నాడు. ఏముంది? ఏవో కష్టాలూ నష్టాలూ భయాలూ బాధలూ ఈర్ష్యలూ ద్వేషాలూ కోరికలూ నిరాశలూ కుట్రలూ మోసాలూ - ఇవే కదా ఎవరు చెప్పినా! ఇవి లేనిదెప్పుడు, లేకుండా ఉండేదెప్పుడు?

రెండో ఆయన ఓపిగ్గా వింటున్నాడు. ఉలకడంలేదు, పలకడం లేదు.

మొదటాయన చెప్పినంత సేపు చెప్పి చివరకి, దేశంమీదా ప్రపంచంమీదా ఇంట్లోవాళ్ళమీదా-చివరికి స్నేహితులనిపించుకొన్నవాళ్ళమీద కూడా నమ్మకం పోయిందని తేల్చేశాడు.

రెండో ఆయన చటుక్కున లేచి ఇంట్లోకి వెళ్ళి, ఒక అరటి పండూ గ్లాసు మంచినీళ్లూ తెచ్చి ఇచ్చాడు. ''ఉన్నది ఒక్కటే; నువ్వు తినేయ్‌; తరవాత మాట్లాడదాం'' అన్నాడు. అలా కాదని, సగం ఆయనకిచ్చి సగం తను తిని మంచినీళ్ళు తాగాడు మొదటాయన.

''ఇప్పుడు చెప్పు! నువ్వేమంటావు?'' అన్నాడు.

''అవన్నీ మరిచిపో ! ఈర్ష్వ ద్వేషాలూ మోసాలూ నీవు కావు; వాటితో నీకేం సంబంధం లేదు.

''అంటే?''

''ఇంకేం అడక్కు. నేనిప్పుడు ఏం చెప్పినా నీకు నచ్చదు!''

''పరవాలేదు; చెప్పు. నన్ను అర్థం చేసుకొనేవాడివి నువ్వొక్కడివే!'

''అది సరే; నువ్వు నన్ను సరిగా అర్థం చేసుకోవాలి.''

''ఇంతకీ ఏమంటావు?''

''ఉన్నది ఒక్కటే ! నువ్వు ఆ ఎత్తుకు ఎదగాలి''.

''అలా కాదు; విడమరిచి చెప్పు!''

''అది లోపల ఉంది; బయట ఉంది; ఇక్కడ ఉంది; అంతటా ఉంది. ఎప్పటినుంచో ఉంది; ఇప్పుడూ ఉంది; ఎప్పుడూ ఉంటుంది!''

''అది ఒక్కటే నంటున్నావు సరే; ఎన్నిట్లాగో కనిపిస్తోంది కదా! అది ఇక్కడే ఉందంటున్నావు, మరి ఎక్కడా చిక్కదేం?''

''అదే దాని చిత్రం! ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటిగానే ఉంటూ, అన్నిట్లోనూ ఎన్నిట్లాగో ఉంటూ, ఆ ఎన్నిట్లోనో ఒక్కటిగానే పరుచుకొని ఉన్నదే అది.

''అది కంటికి కనబడదు; చెవులకు వినబడదు; ముక్కుకు తగలదు; ఒంటికి సోకదు; ఇక నాలికదాకా ఎలా వస్తుంది కనక?

''ఎందుకంటే-

''దానికి రంగులేదు; చప్పుడు లేదు; వాసనలేదు; తాకుడు లేదు; రుచి సంగతి సరేసరి!

''పండులా ఆకారమూ లేదు; గాలిలా కదిలేదీ కాదు; కత్తితో కోసేదీ కాదు; గుప్పిట్లో ఇమిడేదీ కాదు. చటుక్కున నీ చేతికి చిక్కమంటే చిక్కుతుందా?'

''ఏమిటిదంతా మాయ?''

''మాయ కాదు; ఆ మాయను తుడిచేస్తే మిగిలేది?''

''అది మన తరమా?''

''అదేమిటో తెలిస్తే మన తరమే! 'యా మా సా మాయా' అంటారు. అంటే ఏది లేదో అది మాయ'.

''ఒక పక్క, ఉన్నట్టుగా చెబుతూ, లేదంటే ఎలా కుదురుతుంది?''

''నీపాటి తెలివి శంకరాచార్యులవారికి లేదనుకోకు! కంటి ముందు కనిపిస్తున్నదాన్ని ఆయన లేదనలేదు. అది వ్యావహారిక సత్యం. మాయ అంటే 'కొలవదగినది' అనే అర్థంకుడా ఉంది. అంటే, పరిమితమయినదని అర్థం. ఇది స్వతంత్రంగా పుట్టలేదు; శాశ్వతంగా నిలవలేదు''.

''మాయను తుడిచేస్తే మిగిలేదేదో ఉందన్నావు. అదెక్కడిది? ఎలా వచ్చింది''?

''ఎక్కడిదో ఎందుకవుతుంది? ఎక్కణ్ణించీ వచ్చింది కాదు.''

''ఎవరికీ తెలియని బ్రహ్మపదార్థమన్నట్లు చెబుతావేం?''

''నువ్వన్నదే సరి! అదే బ్రహ్మపదార్థం!''

''నేనన్నదే నాకు అప్పగించడం కాదు; పేరు చెప్పు.''

''ఆత్మ అనుకో.''

''రెండూ ఒకటే ఎలా అవుతాయి? ఏమిటీ తలతిక్క?''

''ఆ తిక్క కుదర్చడానికే ఇదంతా! రెండూ ఒకటే మరి! అవ్వ పేరే ముసలమ్మ!''

''ఇదీ మరీ బాగుంది!''

''ఇంకా బాగుంటుంది విను! దీన్ని తెలుసుకుంటే, నువ్వని నువ్వు అనుకుంటున్న నువ్వు నువ్వు కావు!''

''నేను నేను కాకపోతే నువ్వా?''

''మీ అమ్మ కడుపు చల్లగా! సరిగ్గా చెప్పావు! నేను నేనూ కాను. నువ్వు నువ్వూ కావు. నేనులో నువ్వున్నావు; నువ్వులో నేనున్నాను!''

''ఇది నీ వెర్రి! నేను నేనే; నువ్వు నువ్వే!''

''పోనీ అలాగే అనుకో! వేరుపడి చూస్తున్నప్పుడు వేరే. చూసేది నువ్వయితే, చూపుకు అనేది నేను. నీకు నాకూ నడుమ నడిచే వంతెన నీ చూపు.''

''అయితే?''

''ఈ మూడూ వేరు కావు; ఒకటే నంటున్నాను.''

''ఇదిగో, మళ్ళీ మొదటికి వచ్చావు!''

''చివర ఉంటే కదా, దీనికి మొదలు ఉండటానికి?''

''కవిత్వం చెప్పకు!''

''మంచిమాట అన్నావు. బ్రహ్మకు 'కవి' అని కూడా పేరు ఉంది. ఆయనకు సంబంధించింది కవిత్వం కాకపోతే మరేమిటి? అయినా మాటలు కుట్టి మనుషులు కట్టే కవిత్వం కాదిది; గాఢ సమాధిలో దర్శించి పలికినది. లోతయిన నిజాలు పెల్లుబికినప్పుడు రివ్వున ఎగసిన వేదమంత్రాలు! మామూలు కవిత్వంకంటే అవి లోతయినవి, ఎంతో విశాలమయినవి; గొప్ప విలువయినవి. నీ పట్టాలూ పాండిత్యాలూ దాని ముందు బలాదూరు! మనది పరిణత బుద్ధి కాదు; పరిమిత బుద్ధి. కాబట్టి ముందు అణకువ నేర్చుకో; నీ పొగరుబోతు 'నేను'ను జాయిగా జోకొట్టి అమ్మ ఒళ్ళో పడుకోబెట్టు! మళ్ళీ తల ఎగరెయ్యకుండా చూడాలి!''

''ఈ గోలంతా ఎందుకు? అసలు సంగతికి రా!''

''ఆ మాటకోసమే చూస్తున్నాను! ఒళ్ళు దగ్గిర పెట్టుకొని విను!''

''ఒక్క ముక్కలో చెప్పు!''

''బ్రహ్మసత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః''

''మధ్యలో ఈ సంస్కృత శ్లోక మెందుకు?''

''బజార్లో నువ్వు కొనే ప్రతి పిచ్చిమందుకూ లాటిన్‌ పేర్లు ఎందుకుటా?''

''సరే సరే? అసలు విషయం చెప్పు!

''నువ్వు అనేవాడివి ఈ జగత్తులో ఉన్న అనేక జీవరాశుల్లో ఒకడివి. కారణం లేకుండా కార్యం ఉండదు. జగత్తు కార్యం; బ్రహ్మం కారణం. అంటే, బ్రహ్మంలోంచే జగత్తు వచ్చింది. జగత్తు జడం; అదే మాయ. అంటే, దానంతట అది పుట్టేదీ, దానంతట అది ఉండేదీ, శాశ్వతమయినదీ కాదు. దానికి స్వతంత్రమయిన ఉనికి లేదు. తాను సృష్టించిన జగత్తుకు భిన్నంగా ఉంటూనే ఆ బ్రహ్మం, దాంట్లో అంతటా వ్యాపించి ఉన్నాడు. అంటే జగత్తులో ప్రతి జీవిలో కూడా ఉన్నట్లే కదా? శరీరంవంటి ఉపాధిని ఆశ్రయించి ఉన్నప్పుడు జీవుడని మన మంటున్న ఆయన్నే ఉపాధిలేనప్పుడు బ్రహ్మం అంటున్నాం. 'జీవో బ్రహ్మైవ నాపరః' అంటే అదీ అర్థం. జీవుడికి, ఒక ఒరలో మరో ఒర అమర్చినట్లుగా, స్థూల సూక్ష్మ కారణశరీరాలనే మూడు శరీరాలుంటాయి. ఒక్కొక్క శరీరం కొన్ని కొన్ని తత్వాలతో (అంటే అంశాలతో) ఏర్పడ్డది. వాటి ప్రభావంవల్లా ఒత్తిడివల్లా జీవుడు, తాను బ్రహ్మం కంటే వేరు అని అనుకుంటూ ఉంటాడు. తానెవరో తెలుసుకొంటే ఈ బాధలూ భయాలూ వగైరా లేవీ ఉండవు.''

''పరబ్రహ్మం, బ్రహ్మం, పరమేశ్వరుడు, పరమాత్మ, ఆత్మ - అంటూ ఇన్ని పేర్లు చెబుతారు; గందరగోళమయిపోదూ!''

''పేర్లలో ఏం లేదు. అన్నీ ఆయనకు పెట్టినవే! కావాలంటే ఆయన్ని 'ఆత్మ' అని పిలుచుకో; ఆయనే 'నేను' అని కూడా తెలుసుకుంటావు. ఆదిశంకరులు 'ఆత్మబోధ' అన్న గ్రంథం రాశారు. సిద్ధాంత పరిజ్ఞానం, సాధనావిధానం కూడా ఆయన చక్కగా పొందుపరిచారు. అది చదివితే నువ్వు ఇలా ఉండవు; ఎంతో మారిపోతావు!''

* * *

అజ్ఞానంవల్లే, ఆత్మకు పరిమితి ఉన్నట్లు అనిపిస్తుంది. అజ్ఞానం నశిస్తే ఆత్మ తెలుస్తుంది; మబ్బు తొలగగానే సూర్యుడు కనిపించినట్టు.

బతుకు నీళ్ళలో అజ్ఞానపు బురద విరగాలంటే జ్ఞానమనే ఇండుపకాయను దాంట్లో అరగదియ్యాలి. బురద విరుగుతుంది; ఇండుపకాయ కరిగిపోతుంది.

సంసారం కలలాంటిది. కలగంటున్నంతసేపూ అది నిజమేననుకుంటావు. మెలకువ రాగానే 'ఓస్‌, ఇదంతా కలేనా?' అనుకుంటూవు. నిద్దట్లోది చిన్న కల అయితే మెలకువలోది పెద్దకల. అంతే తేడా! కల కలే!

ముత్యపు చిప్ప తెల్లగా ఉంటుంది కనక, వెండి అనుకుంటాం. మన భ్రమ తొలగిపోతే సత్యం తెలుస్తుంది. సత్యమే బ్రహ్మం.

బంగారు నగలు రకరకాలుగా ఉంటాయి. కాని అన్నిట్లో ఉన్నదీ బంగారమే.

అదే సత్యం. అలాటిదే బ్రహ్మం.

ఖాళీ ఖాళీయే. కుండలో ఖాళీ వేరు, చెంబులో ఖాళీ వేరు కాదు. విడివిడిగా ఉన్నప్పుడు అలా కనిపిస్తుందంతే. అవి పగిలిపోతే మళ్ళీ అంతా ఒకటే ఖాళీ. కంటికి ఆనని ఆ బ్రహ్మాన్ని ఆ ఖాళీలాంటివాడే అనుకో.

మట్టిలో ఉన్న పదార్థాల్ని బట్టి నీటికి రంగు, రుచి, వాసన, పేరు ఉంటాయి. వాటిని తీసేస్తే ఉండేది స్వచ్ఛమయిన నీరే. అలాటిదే బ్రహ్మం.

చుట్టూ ఆవరించి ఉన్న మాయవల్ల ఆత్మ మరుగునబడి ఉంది. స్ఫటికం మీద రంగు బట్ట కప్పితే స్ఫటికం ఆ రంగులోనే కనిపిస్తుంది. ఆ ముసుగు తీసెయ్యి. స్వచ్ఛమయిన స్ఫటికం అక్కడే ఉంటుంది.

వడ్లు దంపి పొట్టు తీసేస్తే ధాన్యపు గింజ వస్తుంది. బ్రహ్మం కూడా అలాగే, తత్త్వవిచారం చేస్తే కనిపిస్తాడు.

అద్దం మబ్బులు బట్టి ఉంటే మొహం సరిగా కనిపించదు. మకిలి తుడిచేస్తే మొహం ముచ్చటగా కనిపిస్తుంది.

బ్రహ్మం రాజులాంటివాడు. ఆయన దేంట్లోనూ స్వయంగా కలగజేసుకోడు. జరిగేవి జరిగిపోతూ ఉంటాయి. అలాగే దేహం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ప్రకృతి వాటి పనులు అవి చేస్తూ ఉంటే బ్రహ్మం చూస్తూ ఉంటాడు కాని, కలగజేసుకోడు.

మబ్బులు వడివడిగా కదులుతూ ఉంటే చంద్రుడు విడివడిగా పోతున్నాడనుకుంటాం. ఆ మబ్బులు ఇంద్రియాలనుకుంటే, చంద్రుడు బ్రహ్మం.

సూర్యుడి వెలుగులో మన పనులు చేసుకుంటూ ఉంటాం. శరీరమూ ఇంద్రియాలూ ఆత్మప్రకాశంలో వాటి పనులు అవి సాగిస్తూ ఉంటాయి.

ఆకాశం ఇలా ఉంది, అలా ఉంది అని అనుకొంటాం. ఆకాశం ఆకాశ##మే; మన చూపుల్లోనే తేడా ఉంది. కదిలే నీళ్ళలో చంద్రుడు కదులుతున్నట్లు కనిపిస్తాడు. ఆ చంద్రుడి వైపు కదిలేవి నీళ్ళేనని తెలుస్తుంది. ఆ చంద్రుడిలాంటివాడు బ్రహ్మం.

బుద్ధి లేదా మనస్సు పని చేస్తున్నంత కాలం సుఖదుఃఖాల్లాటి ద్వంద్వాలు తప్పవు; గాఢమయిన నిద్రలో ఇవి పనిచెయ్యవు. అప్పుడుండేది ఆత్మ ఒక్కటే. ఆత్మకు మార్పన్నది లేదు. ఉందనుకుంటే అది మాయ.

చీకట్లో తాడును చూసి పాము అనుకొని భయపడ్డట్లే మనిషి తనను జీవుడనుకుంటాడు. తాను పరమాత్మ స్వరూపుణ్ణి అని తెలుసుకొన్నప్పుడు నిర్భయంగా ఉంటాడు.

దీపం వెలుగువల్లే వస్తువులకు వెలుగు వస్తుంది. ఆత్మవల్లే ఇంద్రియాలు పనిచేస్తాయి.

ఎప్పటికీ ఉండేది ఇక్కడ లోపల ఉన్నదే. అదే నేను. ఇక్కడిదీ అక్కడిదీ ఒకటే కనక నేనూ ఆయనా ఒక్కటే.

నాకు పుట్టుక, పెరుగదల, చావు లేవు. ఇంద్రియాలూ లేవు. మనస్సు నేను కాను కనక రాగద్వేషభయాల వంటివి నాకు లేవు.

నాకు గుణకర్మలు లేవు; శాశ్వతుణ్ణి; శుద్ధుణ్ణి, నిరాకారుణ్ణి, నిశ్చలుణ్ణి, ఎప్పుడూ స్వతంత్రుణ్ణి. ఆ పరబ్రహ్మం కూడా అంతే. ఆయనా నేనూ ఒకటే.

ఎవరూ లేనిచోట ఒంటరిగా కూర్చుని ఆత్మధ్యానం చెయ్యాలి. అన్నిటినీ ఆత్మలోనే లయం చెయ్యాలి.

ఇలాటి ధ్యానంలో పుట్టే అగ్ని అజ్ఞానపు కట్టెల్ని కాల్చిపారేస్తుంది.

ఆత్మ ఎప్పుడూ ఉన్నదే. అది తెలియక, మెళ్ళో ఉన్న నగకోసం ఇల్లంతా వెతికినట్లు వెతుకుతాం.

పరిపూర్ణ జ్ఞానం పొందిన యోగి తన ఆత్మలోనే అఖిల జగాన్నీ చూస్తాడు.

జగత్తంతా ఆత్మే. మట్టిపాత్రలన్నీ మట్టితో తయారయినవే కదా!

ఆత్మజ్ఞానం పొందినవాడు తన పూర్వ స్వభావాలను (వాసనలను) వదిలేస్తాడు. తాను సచ్చిదానందరూపుణ్ణి అని తెలుసుకుంటాడు; గొంగళి పురుగు తుమ్మెద అయినట్టు.

భ్రాంతివల్ల పుట్టిన చీకటి సముద్రాన్ని దాటిన తరవాత ఆత్మానందంలో ఉండిపోతాడు. బయటి సుఖాలమీద ఆసక్తి వదిలేస్తాడు. గాజుబుడ్డిలో దీపంలా వెలుగుతూ ఉంటాడు. పదిమందిలో ఉన్నా ఏదీ పట్టించుకోడు. గాలిలా తిరుగుతాడు. ఉపాధులు నశించి అంతటా వ్యాపించి ఉంటాడు.

బ్రహ్మత్వం పొందితే మరింకేదీ పొందక్కర్లేదు. దీన్ని మించి మరే సుఖమూ ఉండదు. మరేదీ తెలుసుకోవలసింది ఉండదు. ఆ స్థితి సచ్చిదానందం, అద్వితీయం. అనంతం, నిత్యం, ఏకం.

ఉన్నది ఒక్కటే!

* * *

'ఆదిశంకరులు' రచించిన ప్రకరణ గ్రంథాల్లో 'ఆత్మబోధ' ఒకటి. (ప్రకరణ గ్రంథమంటే ఒక ప్రత్యేకమయిన వేదాంత విషయాన్ని-ప్రకరణాన్ని-వివరించే గ్రంథం). ఇందులో, లోకంలో కనిపించే సులభమయిన దృష్టాంతాలతో పరతత్త్వాన్ని చక్కగా నిరూపించారు. అంతే కాకుండా సాధనా విధానాన్ని కూడా సూచించారు.

జాతి, మత, కుల, లింగ వివక్షతో స్వలాభాపేక్షతో సమాజానికీ తమకూ కూడా కీడు తలపెట్టేవారికి కనువిప్పు కలిగించగల గ్రంథమిది.

దీనిమీద ఇంతవరకు వెలువడిన వివరణ గ్రంథాల్లో అన్నిటికంటె విస్తృతమయిన చర్చతో, వివిధ సామాజిక విషయాల పరిశీలనతో సమగ్రంగా సాగినది మిత్రులు శ్రీ చంద్రమోహన్‌గారు రచించిన ఈ గ్రంథం.

ఒక విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు దాన్ని గురించి ప్రముఖులు కొందరు చెప్పిన అభిప్రాయాలను, వారి అనుభవాలను, ఆలోచనారీతులను ఎక్కడెక్కడినుంచో సేకరించి రచయిత ఇందులో పొందుపరిచారు. తోటల్లో పువ్వుపువ్వుకూ తిరిగి తేనెటీగలు తేనే సేకరించి పెట్టినట్లుగా పాఠకులకు అందించారు. తమ గురువులయిన శ్రీబాలయోగేశ్వర్‌ సంత్‌ మహారాజ్‌జీ చెప్పిన విషయాలను, చేసిన సూచనలను తరచుగా వివరిస్తూ వచ్చారు. చంద్రమోహన్‌గారి గురునిష్ఠ మెచ్చుకోదగ్గది.

రచన సులువుగా అర్థమయ్యేటట్లు ప్రసన్నమయిన శైలిలో సాగింది.

చంద్రమోహన్‌గారు నివురుగప్పిన నిప్పులాంటివారు. ఈ నిప్పు కాంతి నిచ్చేదే కాని, కాల్చేది కాదు. ఆదిశంకరుల 'ఆత్మబోధ'కు ఆయన రాసిన ఈ వివరణ చదివినవాళ్ళకు తప్ప, ఇతరులకు తమ లోతు తెలియనివ్వని నిరాడంబరులు; మంచి స్నేహపాత్రులు; ఉత్తమ సంస్కారవంతులు.

ఈ గ్రంథం జిజ్ఞాసువులందరికీ ఎంతో ఉపయోగపడుతుంది. ఎక్కడెక్కడో ఉన్న సంబంధిత విషయాలను ఎవరికి వారు వెతుక్కొని తెచ్చుకొనే శ్రమ లేకుండా, ఆ శ్రమంతా తామే పడి, సిద్ధాన్నంగా అమర్చి పెట్టారు. ఇందుకు ఆయన్ని మనసారా అభినందిస్తున్నాను. పాఠకుల కృతజ్ఞతల నందుకొంటారని విశ్వసిస్తున్నాను.

16-7-96

హైదరాబాదు - దక్షిణామూర్తి

____________________________________________

* కేరళ నంబూద్రి పండితులు, తమ పూర్వికులు ఎన్నో వందల ఏళ్ళ కిందట గోదావరి ప్రాంతంలోని వేంగి మండలం నుంచి వచ్చారని చెప్పుకొంటూ ఉంటారట. కాబట్టి ఆదిశంకరాచార్యుల వారితో చుట్టరికం కలుపుకోడం తెలుగువాళ్ళకొకముచ్చట. అనేక శతాబ్దులుగా దేశవిదేశాల్లో నివాళులందుకొంటున్న లోక శంకరులను ఆత్మీయులుగా తలచనివారెవరు?

Aathmabodha         Chapters          Last Page