Atma Vidya Vilasamu         Chapters          Last Page

 

ఓం

శ్రీ గురుభ్యో నమః

ఆత్మ విద్యావిలాసము

వటతరు నికట నివాసం

పటుతర విజ్ఞాన ముద్రితకరాబ్జమ్‌ |

కఞ్చన దేశిక మాద్యం

కైవల్యానన్ద కన్దలం వన్దే || 1

తా || మఱ్ఱిచెట్టుకు చేరువగా జ్ఞానముద్రావిలసితమైన పాణిపద్మము గలవాడై - ఆదిముడైన గురువొకడు విరాజిల్లు చున్నాడు. కేవలానందమునకు మూలకందమైన ఆ గురువునకు బ్రణమిల్లు చున్నాను.

వివరము :

సంసారమే ఒక మఱ్ఱిచెట్టు. ఊడలతో మఱ్ఱివిస్తరించును. సంసారమును అట్టిదే. మఱ్ఱివలె దాని విస్తృతికిని అంతములేదు.

'మఱ్ఱి' అనునది సంసారమును సూచించు చాటుమాట. దానికి చేరువగా నున్న గురువు పరమాత్మయే; పరబ్రహ్మమే! పరబ్రహ్మ సన్నిధియందు మాయ ఈ విశ్వసృష్టిని సాగించుచున్నది.

''మహామాయే విశ్వంభ్రమయసి పరబ్రహ్మ మహిషి'' ||

- సౌందర్యలహరి.

పరబ్రహ్మమో! దానికి ఒక చలనము లేదు, దాని యందొక వికారము జనింపదు. అది నిత్య సత్య వస్తువు. కేవల జ్ఞానానందములే దాని రూపము.

అందుచేతనే - జ్ఞానముద్రతో విలసిల్లు పాణిపద్మము గలవాడనియు - కేవలానందమునకు మూలకందమైన వాడనియు విశేషణములు వాడబడెను. అట్టి ఆ పరబ్రహ్మమును గురువుగా లక్షించి - వానిని జేరుకొని - అద్వయ భావనతో మ్రొక్కిన వాడు విశ్వాతీతుడై ప్రకాశించును. 'అతడే తానై' అలరారును.

మాయకు అవ్వలదోచు ఈ గురుమూర్తియే దక్షిణా మూర్తి యని వినుతింపబడెను. 'దక్షిణము' అనగా మొదటిది. 'ఉత్తరము' అనగా తరువాతిది. మొదటిది పరమాత్మ. తరువాతిది ప్రకృతి, మాయ. మొదటిది మూర్తి యగుటచే ఆ పరమాత్మ దక్షిణామూర్తి.

జ్ఞానమే ఆయనరూపము. ఎచట నేజ్ఞానమున్నను అదెల్ల అటనుండి - ఆయననుండి వచ్చినదే ! జ్ఞానదాతయేకదా గురువు. అందుచే ఆ దక్షిణామూర్తి ఆదిమగురుమూర్తి. ఆయన కేవలానందమునకు మూలకందమైనవాడు. 'ఆనన్దం బ్రహ్మేతి వ్యజానాత్‌' - అని శ్రుతి పేర్కొనుచున్న విషయము యోగిజనులకు అనుభవసిద్ధమైనది.

ఇట్లు శ్రీసదాశివ బ్రహ్మేంద్ర సరస్వతులు - మాయా కార్యమైన ఈవిస్తృతసంసారమునకు మూలమందున్న జ్ఞానానందమయమైన పరబ్రహ్మమును పేర్కొని - దానినిగూర్చిన నమనమును - అభిముఖప్రవృత్తిని - ఫలితముగా అదే తానైయున్న ఏకత్వస్థితిని - నమస్ర్కియారూపమున గ్రంథారంభమున వెల్లడించి యున్నారు.

గ్రంథము ఆత్మవిద్యావిలాసము గ్రంథారంభమునందలి యీమంగళాచరణ శ్లోకము - గ్రంథములోని సర్వమైన విషయమునకును అద్దము పట్టుచుండుట విశేషము.

నిరవధి సంసృతి నీరధి

నిపతిత జన తారణ స్ఫురన్నౌకామ్‌ |

పరమత భేదన ఘుటికాం

పరమశివేన్ద్ర పాదుకాం నౌమి || 2

తా|| పరమశివేంద్రశ్రీగురుపాదుక అపారమైన సంసార సముద్రమునబడి గిలగిలలాడుచున్న జనసందోహమును సముద్ధరించు నౌక. ఇతరమతముల నెల్ల జీల్చిచెండు దివ్యౌషధియైన ఆశ్రీగురుపాదుకకు మ్రొక్కుచున్నాను.

వివరము :

శ్రీ పరమశివేంద్ర సరస్వతీ మహాస్వామివారు కామకోటి పీఠము నధిష్ఠించిన జగద్గురువుల పరంపరకు చెందినవారు. వీరి కాలమున (దాదాపు 200 సం.లు) నేటి కామకోటి పీఠము కుంభఘోణములో ఉండెడిది. ఈస్వామివారు వేదవేదాంగ ములయందు ఘనతరవైదుష్యము కలవారగుటయే కాక గొప్ప రాజయోగులు. వీరు సదాశివబ్రహ్మేంద్రసరస్వతులకు గురువులు.

తనను, మరెందరినో ఈమాయామయ సంసార సముద్రమునుండి సముద్ధరించి బ్రహ్మపదమును జేర్చి - చేర్చుచున్న ఆగురువరుని పూజ్యపాదుకను గ్రంథారంభమున భక్తితో సంస్మరించి మ్రొక్కుచున్నారు.

పాదుక అనగా కాలి చెప్పు. (పద్యన్తే అనయాఇతి పాదుకాః, పాదూరేవ పాదుకా.) శ్రీగురువుల కాలిచెప్పులు సైతము శిష్యులకు వంద్యములే కదా !

మరియు - 'పాలనాత్‌ దురితధ్వంసాత్‌ కామితార్థ ప్రపూరణాత్‌. పాదుకానామ విఖ్యాతా' ......

పాలనము - దురిత (పాప) నాశము - కామితార్థపూరణము అను మూడు పనులను ఆచరించునది అని తెలుపుటకు - ఆమూడుపదముల ఆద్యక్షరములను జేర్చి 'పాదుక' అనినారు - అన్నది వేరొక అర్థము. అపుడు పాదుక పరమశివేంద్రులకంటె వేరైనది కాదు. మరియు ఏకవచనము.

అనగా పాలించి - పాపములను బోగొట్టి - కామితము లను బ్రసాదించు పరమశివేంద్రశ్రీగురువులకు నమస్కారమని అర్థము.

కాగా పరమశివేంద్రుల రూపమున బ్రకాశించుచున్న పరబ్రహ్మమే ఇందు వినుతింప బడెను.

ఇట్లు దైవవందన గురువందనము లాచరించి శ్రీసదాశివ యోగీంద్రులు స్వవిషయమును బ్రస్తావించుచున్నారు.

దేశిక పరమ శివేన్ద్రాదేశ

వశోద్బుద్ధ దివ్యమహిమాహమ్‌ |

స్వాత్మని విశ్రాన్తికృతే

సరసం ప్రస్తౌమి కిఞ్చిదిదమ్‌ || 3

తా|| సద్గురువులైన శ్రీపరమశివేంద్రుల ఆదేశముచే నాలో ఒకానొక దివ్యమైన మహత్త్వము మేలుకొన్నది. అందుచే స్వాత్మనిష్ఠుడనై ప్రకాశింపగోరి నేనిచట సరసముగా కొంచెము ప్రస్తావించుచున్నాను.

వివరము :

గుర్వనుగ్రహములేక ఎవనికిని ఏమియును సిద్ధింపదు. తొలుత గురువునందు - 'పరమాత్మ యీతడు' అన్న భావమును నిలిపి -దానిని విస్తరింప జేయుచు - 'సర్వం బ్రహ్మమయం' అన్న అనుభవశిఖరమును జేరుకొనవలయును. ఇది దారి.

అట్లు కాక, ఎవడు, తనకు జ్ఞానదాతయైన గురువునందే పరమాత్మబుద్ధిని ('పరమాత్మ జ్ఞానాకృతి. అతడే శ్రీగురు రూపమున నన్ను అనుగ్రహించు చున్నాడు' నాలోని అజ్ఞాన తిమిరమును బారద్రోలుచున్నాడు అనెడి భావమును) నిలుపు కొనజాలడో - ఇక వాడేమి సాధించును?

అందువలననే - ''స గురుమేవాభిగచ్ఛేత్‌ సమిత్కుశఫలపాణిః'' అన్నది శ్రుతి. (పరమాత్మ నెఱుంగ గోరినవాడు - గురువునకు వలసిన పదార్థములు (సమిధలో - పండ్లో - దర్భలో) చేతబట్టుకొని పోయి గురువునే ఆశ్రయింపవలెను.

సదాశివేంద్రులవారు తమ సాధనచే గురువును మించిన శిష్యులై ప్రకాశించినారు. అయినను ఆయన దృష్టిలో గురువే దైవము, గురవు తరువాతిదే దైవము. ఆ మహనీయుని గురు భక్తి నిరుపమానము.

నేను నా శక్తి సామర్ధ్యము బలముతో ఇంతవాడనైతి నని వారు చెప్పుకొనలేదు. గుర్వనుగ్రహము నన్నింతవానిగ జేసినదన్నారు. లోకము వారిగురుభక్తిని ఆదర్శముగా తీసికొని తమ్ముదాము సరిదిద్దు కొనవలెను.

గోస్వామి తులసీదాసు శ్రీరామచరితమానసరచనము 'స్వాన్తస్సుఖాయ' అయినట్లు - సదాశివులు తమ యీ 'ఆత్మవిద్యావిలాసము' 'స్వాత్మని విశ్రాన్తికృతే' (ఆత్మ పదార్థమున విశ్రాంతి ననుభవించుటకు అని చెప్పుకొనినారు.)

బ్రహ్మవిద్వరుడు బ్రహ్మానందమునకు దోహదకారులైన పనులను మాత్రమే ఆచరించును. బ్రహ్మానందమే గ్రంథ ప్రయోజనము.

ఇట్లు దేవతా - గురు - వందన - గ్రంథ ప్రయోజనములను బేర్కొని పరమాత్మస్వరూపమును వివరించుచున్నారు.

నిరుపమ - నిత్య - నిరీహూ

నిష్కల - నిర్మాయ - నిర్గుణాకారః |

విగలిత సర్వ వికల్పః

శుద్ధో బుద్ధశ్చకాస్తి పరమాత్మా || 4

తా|| సాటిలేనిదై - నిత్యమై - ఏ కోరికలును లేనిదై - అఖండమై - మాయారహితమై - నిర్గుణమై - సంకల్పవికల్పములు లేనిదై - శుద్ధమై- జ్ఞానమయమై పరమాత్మస్వరూపము విరాజిల్లు చున్నది.

వివరము :-

సాటిలేనిది :- దేనికైకను పోలికను బేర్కొన వచ్చును గాని - పరమాత్మ స్వరూపమును గూర్చి 'ఇదం-ఇత్థం' (ఇది - ఇట్లు) అని తెలుపుట సాధ్యము కాదు. ఆత్మాభిన్నముగ నుండుటయే దీనికి గారణము. అందువలననే అది వాక్కులకు అందనిది (యతో వాచోనివర్తన్తే) అని శ్రుతి తెలుపుచున్నది.

నిత్యము :- ఏవస్తువైనను అది పుట్టుటకు ఉండదు. నశించిన పిమ్మట నిలిచియుండ నేరదు. ఉత్పత్తికి లయమునకు నడిమి కాలమందే ఏవస్తువైనను భాసించుచున్నది. పరమాత్మకు ఉత్పత్తిలేదు. విలయములేదు. అందుచే అతడు నిత్యుడు. అతడు కాలాతీతుడు.

ఏకోరికలు లేనిది :- శరీరధారులకు కోరిక లుండును. శరీరము - ఇంద్రియములు. మనసు, బుద్ధి - వీనియందలి తాదాత్మ్యమువలననే (ఇవే నేను అనుకొనుట వలననే) ఏ కోరిక యైనను జనించును. ఇట్టి తాదాత్మ్యము లేనిచోటనే పరమాత్మానుభవము సిద్ధించును. దేహేంద్రియ తాదాత్మ్యము అంతరించినపుడు గాని పరమాత్మానుభవము కలుగదు. ఆ తాదాత్మ్యము తొలగినచోట కోరికలు ఉదయించుట కే అవకాశము లేదు. అందుచే పరమాత్మ 'నిరీహుడు' అనబడినాడు.

అఖండము :- ఖండము అనగా ముక్క; భాగము. పరమాత్మస్వరూపము అంతటను నిండియున్నది. దానిలో ఖండములకు భాగములకు అవకాశ##మే లేదు. అందుచే అది అఖండము.

మాయారహితము :- సంసారము మాయా విలాసము. పరమాత్మ మాయాతీతుడు. మన ఇంద్రియములు - అంతఃకరణము ఇవన్నియు దాటిపోయిననే పరమాత్మోపలబ్ధి. అచట మాయలేదు.

నిర్గుణము :- సత్వగుణము - రజోగుణము - తమోగుణము అని గుణములు మూడు. మనయందీ మూడింటిలో నేదో యొకటి తలయెత్తి రాజ్యమేలు చుండును. ఒకపుడు సత్వగుణము; వేరొకపుడు రజోగుణము లేక తమోగుణము ఇటు లేదో యొక గుణప్రకాశమునకు జిక్కి మనముందుము. ఈ త్రిగుణములును మాయాస్వరూపమే. అందుచేతనే మాయ 'త్రిగుణాత్మిక' అనబడెను. మాయారహితుడుకదా పరమాత్మ. అందువలన ఆయన నిర్గుణుడు.

వికారములు లేనిది :- పుట్టట - పెరుగుట మొదలగు వికారములు పరమాత్మయందు లేవు.

శుద్ధము :- అన్యవస్తు సంపర్కము కొంచెమును లేని దగుటచే పరమాత్మస్వరూపము శుద్ధము.

ఇట్టిదైన పరమాత్మస్వరూపము సర్వత్ర సర్వదా విరాజిల్లు చున్నది. కాని గుర్వనుగ్రహము లేక - తీవ్ర సాధనలేక అది అనుభవమునకు అందదు.

అవతారిక :-

పరమాత్మ స్వరూపమును వివరించి - సంసారబద్ధుడైన జీవుని - సాధకుని - సిద్ధుని గూర్చి వివరించుచున్నారు.

స్వావిద్యైక నిబద్ధః

కుర్వన్‌ కర్మాణి ముహ్యమానస్సన్‌ |

దైవా ద్విధూతబన్ధః

స్వాత్మజ్ఞానాన్ముని ర్జయతి || 5

తా|| తన అజ్ఞానమే తన్ను కట్టి వేయగా మోహమగ్నుడై ఏవో కర్మలనాచరించుచు, సంస్మరించుచున్న జీవుడు - దైవానుగ్రహముచే అజ్ఞానపాశము విచ్ఛిన్నముకాగా - 'ఇదిగో ! ఇదీ నేను!' అని అచ్చమైన తన రూపము నెరింగి, అందు నిలిచినవాడై (ఆత్మనిష్ఠుడై) మౌనియై విరాజిల్లు చున్నాడు.

వివరము:-

మాయాతీతుడు పరమాత్మ. మాయావశుడు జీవుడు, ఆవరించిన మాయను దొలగింపగా వాడే వీడు; వీడే వాడు.

అజ్ఞానమే బంధకారణము. అజ్ఞానము అనగా తెలివి లేమి. లేనిది బంధమై ఎట్లు కట్టి వేయగలదు? కాగా బంధ మన్నది కూడ వాస్తవమునకు లేనిదే !

'బన్ధశ్చ - మోక్షశ్చ మృషైవ మూఢాః'

- వివేకచూడామణి.

(బంధముగూర్చి లేదు. మోక్షమున్నూ లేదు. రెండును అసత్యములే.)

బద్ధుడను అన్నది భ్రాంతి. ఆభ్రాంతిని దొలగించుటకు మోక్షభ్రాంతిని కల్పించుట జరుగుచున్నది. దయ్యము పట్టిన దని భ్రాంతుడైన వానికి - దయ్యము వదలినదన్న భ్రాంతిని గలిగింపవలెను. అపుడు వాడు స్వస్థుడగును. అటులే సంసార బద్ధుడనన్న భ్రాంతిలో నున్న వానిని స్వస్థునొనరించుటకు - ముక్తుడనైతిని. బంధము తొలగినదన్న భ్రాంతిని కలిగింపవలెను. ఇట్లు ఈ భ్రాంతిచే ఆభ్రాంతి నెట్టివేయబడినపుడు స్వతస్సిద్ధమైన ఆత్మస్వరూపము ఎరుకకు అందును.

అయితే ఇదంత తేలిక కాదు. పరమాత్మ ఎవనిని అనుగ్రహించునో అతడు మాత్రమే అజ్ఞానమును త్రోసిరాజనుటకు పూనుకొనును. దైవానుగ్రహము లేనిచో - ఎంత చదివిన వాడైనను - ఈ లేనిదాని పట్టునుండి (మాయాబంధమునుండి) తప్పించుకొనజాలడు.

అందువలననే శ్రుతి 'యమేవైష వృణుతే' - ఎవనిని పరమాత్మ వరించునో' .... అన్నది

తానెవరో ఎరుకకు అందినపుడు - అనుభవమునకు జిక్కి నపుడు - ఇక మరి వాడు మాటాడడు. వాని యింద్రియములు విషయాసక్తములు కావు. మనసు తన చలనములను గోల్పోవును. అట్టిస్థితిలో వాడు మౌని కాక ఏమగును?

అవిద్యాపాశబద్ధుడు జీవుడు. దైవానుగ్రహముచే బంధ చ్ఛేదమునకు ఉద్యుక్తుడైనవాడు సాధకుడు. ఆత్మజ్ఞాన సంపన్నుడు సిద్ధుడైనముని.

అజ్ఞాన నిద్రామగ్నునకు గురూపదేశ##మే మేలుకొలుపు అనుచున్నారు.

మాయావశేన సుప్తౌ

మధ్యే పశ్యన్‌ సహశ్రశః స్వప్నాన్‌ |

దేశిక వచః ప్రబుద్ధో

దీవ్యత్యానన్ద వారిధౌ కో7పి || 6

తా|| మాయకు జిక్కి నిద్రలో బడి - ఎన్నో కలలను గాంచుచు కలవరపడుచున్న వారిలో ఒకానొకడు శ్రీగురుని ఉపదేశముచే మేల్కొని ఆనందసాగరమున విహరింప గల్గుచున్నాడు.

వివరము :-

అనాత్మవస్తువునందు ఆత్మభావము - ఆత్మవస్తువునందు అనాత్మభావము నిద్ర. దీనికి కారణము మాయ.

దేహాదులు తానుకాడు. వానియందు తాను అన్న భావమును నిలుపుచున్నాడు. అనగా ఆత్మకాని దానిని ఆత్మ అనుకొనుచున్నాడు. ఇదియే 'అనాత్ముని ఆత్మభావము'.

నిత్య, శుద్ధ, బుద్ధ ముక్తమై - 'నజాయతే మ్రియతే వాకదాచిత్‌, నాయం భూత్వా భవితా వా న భూయః' అని కీర్తింపబడిన పరబ్రహ్మమే తానై యుండగా - దానిని విస్మరించి చరించుచున్నాడు. ఇది 'ఆత్మని అనాత్మభావము'.

తన్నుదా మరచుట నిద్రాలక్షణమే కదా !

దేహాదులయందు తాదాత్మ్యము జెంది యున్నవానికి దారపుత్రాదిరూపమైన స్వప్నము జనించు చున్నది. ఇది ఒక కలకాదు. ఎన్నోకలలు! వానియందు కలవరింతలు!

ఇది మాయావశుడైన వాని స్థితి.

ఇట్టి స్థితి యందుండియు - సత్సంగతిచే - సుకృత విశేషముచే భాగ్యశాలియైన వానియందు దైవము గురురూపమున అనుగ్రహమును గనబరుచును.

'తత్త్వమస్యాది' మహావాక్యరూపమైన శ్రీగురుని ఉపదేశము వానిని ఈనిద్రనుండి మేలుకొల్పును. అపు డాతడు - నశ్వర శరీరాదులకంటె విలక్షణమైన తన స్వరూపమును గుర్తించి ఆనంద మగ్నుడై చరించును.

ఇది సంసారసాగర మగ్నులైయున్న వారిలో ఎక్కడనో ఎవనికో ఒకనికి లభించు భాష్యవిశేషము.

ఆత్మజ్ఞానసంపన్నులు కోటికొకరుందురేమో అని భావము. శ్రీగురుని కరుణకు బాత్రుడైన వాడేమిచేయునో నాలుగు శ్లోకములలో వివరించుచున్నారు.

ప్రాకృతభావ మపాస్య

స్వీకృత నిజరూపసచ్చిదానన్దః |

గురువర కరుణాపాఙ్గాద్‌

గౌరవ మాసాద్య మాద్యతి ప్రాజ్ఞః||

తా|| శ్రీగురుని కరుణకు బాత్రమై తెలివొందినవాడు ప్రాకృతభావమును అనగా ఈశరీరము తానన్న జగద్భావమును పరిహరించును.

సచ్చిదానందమయమైన స్వస్వరూపమును స్వీకరించి గౌరవోపేతుడై ఆనందమత్తుడై చరించును.

వివరము :

శ్రీగురుని యుపదేశముచే ప్రథమమున 'ఏది తాను కాదో - అది తెలిసివచ్చును'. పిమ్మట తన స్వరూపము తెలివికి అందును.

ఆత్మజ్ఞానోపదేశమునకు బూనుకొన్న వేదాంత శాస్త్ర ములు ఇదే విధానమును అవలంబించి ప్రవర్తిల్లుచున్నవి. 'నేతి నేతి' వాక్యములతో (న+ఇతి, న+ఇతి = ఇది కాదు ఇది కాదు) అన్నిటిని త్రోసివేయగా - ఏది త్రోసివేయుటకు వీలుకానిదై విరాజిల్లు చున్నదో - అది 'ఆత్మ' అని అవిబోధించుచున్నవి.

ఇటులేల చేయవలయును? ఆత్మస్వరూపమునే వివరింపరాదా? అనవచ్చును.

ఆత్మస్వరూపము 'ఇదం ఇత్థం' అని వాక్కులతో వివరించుట వీలైనది కాదు. అందుచే వేదాంతములు ఇదే మార్గమును అవలంబించినవి. ఫలితముగా సాధకుడు తొలుత తాను ఏది కాదో - దానిని గుర్తించును. 'ఉపదేక్ష్యన్తి తే7జ్ఞానం జ్ఞానిన నత్వదర్శినః - అని గీత (తే+అజ్ఞానం).

పంచభూతాత్మకమైనది ప్రకృతి. దేహము పాంచభౌతికము. అందుచే అది ప్రాకృతము. సాధకుడు తొలుత ప్రాకృత మైన దేహాదికమును వివేచనచేసి, తనకంటె ఇదెల్ల వేరైనద గుర్తించి, వానితోడి తాదాత్మ్యమును విడిచిపెట్టును.

పిమ్మట సర్వమును నెట్టివేయగా శేషించియున్న సచ్చిదానంద మయమైన స్వరూపమే తానుగా గ్రహించును.

లోకమున 'సత్యము' అనగా నిజము చెప్పుట. కాని వేదాంతములయందు అట్లు కాదు. సత్యమనగా త్రికాలా బాధ్యమైనది. సత్యమన్నను సత్‌ అనినను ఒక్కటే. చిత్‌ - అనగా జ్ఞానము.

సచ్చిదానంతమయమైన ఆత్మస్వరూపము జననమరణ ములు లేనిది. సుఖ దుఃఖములు - కామక్రోధాదులు - దేహేంద్రియ మనోబుద్ధులవరకు మాత్రమే వెంటాడగలవు. ఆత్మ వస్తువును అవి తాకలేవు. అది అచ్చముగా ఆనందపుముద్ద. 'రసోవై సః' - అని శ్రుతి.

ఇట్లు బహిరంతరములయందు వెలితియన్నది లేని ఆనందమే తన రూపముగా గ్రహించి అనుభవించు చున్నవాడు మత్తుడై చరింపడా ?

శ్రీగురుని కరుణకు పాత్రమై హెచ్చరింపబడినవాడు మాత్రమే ఆనంద మత్తుడై చరింపగలడు!

శ్రీగురుకృపయా సచ్చి

త్సుఖనిజరూపే నిమగ్నధీర్మౌనీ |

విహరతి కశ్చన విబుధః

శాన్తాహన్తో - నితాన్తముదితాన్తః. 8

తా|| శ్రీ గురుకరుణా విశేషముచే - సచ్చిత్సుఖాత్మకమైన ఆత్మస్వరూపమున నిమగ్నుడై - అహంభావము శాంతింపగా పెల్లుబికిన ఆనందముతో - ఎవడో ఒకానొక ప్రాజ్ఞుడు మౌనియై విహరించును.

వివరము:

వెనుకటిశ్లోకమున ఆత్మస్వరూపమును సచ్చిదానంద మయముగా స్వీకరించుట పేర్కొనబడెను.

ఇందు ఆత్మస్వరూపమున నిమగ్నుడై యుండుట వివరింపబడెను.

దేహాదులతో తాదాత్మ్యము చిరకాలమునుండి జన్మ జన్మలనుండియు సాగి వచ్చుచున్నది. శ్రీగురుకరుణాప్తిచే ఇంచుక తెలివి ఉదయింపగా ఈపరిస్థితి తారు మారగును.

ఇంతవరకు 'తానే' అని ఏదేహాదికమును భావించుచు వచ్చినాడో అది తాను కాదని తోచసాగెను. ఇంతవరకు దేనినిగూర్చిన బోధము తనకు కొంచెమును లేదో, ఏది ఎరుకకు (ఇదం ఇత్థం అని గ్రహించుటకు) అందదో అది తానని స్ఫురింపసాగెను.

అయినను చిరకాలమునుండియు సాగివచ్చుచున్న ప్రవృత్తి ఒక్కసారిగా మాసిపోదు. అది అనువర్తించుచునే యుండును. ఆ దశలో 'దేహాదులయందు' - 'నేనుకాదు' అన్న భావమును - 'దేహాదులకంటె విలక్షణమైన సచ్చిదానంద స్వరూపమున ఆత్మభావమును' ప్రయత్నపూర్వకముగా నిలువ బెట్టుకొను చుండవలయును. అయినను అది జారిపోవు చుండును. జారిపోయి - దేహాదులయందే తానన్న భావము స్వయం ప్రతిష్ఠితమగు చుండును. అపుడు సాధకునకు పునఃపునః ప్రయత్నము అవసరమగును. అందుచేతనే వెనుకటి శ్లోకమున - 'స్వీకృత నిజరూప సచ్చిదానన్దః' - అనినారు.

ఇట్లు సాధకుడు ప్రయత్నపూర్వకముగా ఆత్మనిష్ఠుడై యుండుటకు అభ్యాసము సాగింపగా - వానికి ఆత్మనిష్ఠతో బాటు, దేహదులయందు దేహాదులయందు అనాత్మ భావము సహజ సిద్ధమై పోవును. అట్టి స్థితి చేకూరగా - అతడు సచ్చిత్సుఖాత్మక మైన ఆత్మస్వరూపమున నిమగ్ను డగును. మునుగును. ఫలితముగా వానియందలి అహంభావము నీరుచల్లిన నిపై#్ప పోవును.

ఇంతవరకును - ఎవరైనను తనదేహాదులకు నొప్పి కలిగింపగా - 'నన్ను వాడిట్లు చేసెను. నేను ఊరకొందునా?' ఇత్యాదిగా అహంభావము (నేను అనెడి భావము) త్రాచువలె చఱ్ఱున తల ఎత్తుచుండెను.

ఇపుడు దేహాదులు తాను కాదన్న భావము బలపడి నందున - ఎన్ని అపకారములు జరిగినను లేదా ఉపకారములు జరిగినను 'నేను' అన్న భావము - ప్రతీకారభావము - తలఎత్తవు.

ఫలితముగా అచ్చమైన ఆనందము కట్ట తెగిన మహాప్రవాహమువలె పెల్లుబికి అంతరంగమును ఆప్లావిత మొనర్చును.

ఒక మహా ప్రవాహమున్నది, దానికి ఒక కొండ అడ్డ మున్నది. అపుడా ప్రవాహముతో మనకు సంబంధము విచ్ఛిన మగును.

ఒకానొక భాగ్యవంతమైనకాలమున ఆకొండను పూర్తిగా తొలగించుట సంభవించినపుడు - ఆప్రవాహము ఉరకలు పెట్టదా?

హనుమంతుడు సీతమ్మను దర్శించి, రాక్షసులను సంహరించి, లంకనుగాల్చి - మరల జానకీదేవిని జూచి, శ్రీరాముని దర్శింపవలయునని త్వరపడుచు (రామదర్శనశీఘ్రేణ) అరిష్టము అను కొండనెక్కెను. ఆకొండ ముప్పది యోజనములనిడి పది యోజనముల విస్తారమును గల్గి యున్నది.

ఉత్సాహభరితుడైన హనుమ ఆకొండపై నెక్కి, ఊగి ఊగి తన సహచరులను చేరుకొనుటకై ఒక్క దూకు దూకెను. అపుడాకొండ నేలబరాబరిగా (పృథివ్యాం సమతాం యాతః) అణగిపోయినది - అని రామాయణము.

అటులే ఇంతవరకును దల నిక్కించియున్న అహం భావము అణగారిపోగా - దాని కవ్వలనున్న ఆనందప్రవాహము అతిశయితమైన వేగముతో కదలివచ్చి అంతఃకరణమును ముంచిఎత్తును.

దేహామలయందు తలయెత్తి నిలిచియున్న అహంభావమే ఆనందానుభవమునకు పెద్ద అవరోధము.

గురువర కరుణాలహరీ

వ్యతికరభర శీతలస్వాన్తః |

రమతే యతివర ఏకో

నిరుపమ సుఖ సీమని సై#్వరమ్‌ ||9

తా|| శ్రీ గురుకరుణాతరంగము లొకదానివెనుక నొకటిగా వచ్చిపడుచుండగా చల్లబడిన అంతరంగముగలవాడై - నిరుపమానందపదమున యతిరాజొకడు యధేచ్ఛము విహరించు చున్నాడు.

వివరము :

'తన శిష్యుడు దారిలో సాగుచున్నాడు. చకచక ముందుకు బోవుచున్నాడు - అద్వయానందశిఖరము నందుకొనుచున్నాడు' - అని గ్రహించిన గురువునకు ఆశిష్యునిపై కరుణానురాగములు అంతకంతకు అతిశయింపకుండునా?

వివరము :

మరియు - తత్త్వమస్యాది మహావాక్యోపదేశ##మే శ్రీగురు కరుణాతరంగము. ఆమహావాక్యముల మహార్థ మంతరంగ మునం దొక్కమారు కదలిన చాలును. స్వస్వరూప జ్ఞానము తళుక్కురని మెరసి - తాను ఈ సాంసారికతాపములకు మిక్కిలి దవ్వున నున్నాననిపించును. దానితో మనసు చల్లబడును. చిత్తమునందొక శాంతిరేఖ ఉదయించును.

అట్లుకాక ఇదే చింతనము. మాటిమాటికి సాగినపుడు కెరటము వెంబడి కెరటము వచ్చిపడినట్లగును. ఆధ్యాత్మిక - ఆదిభౌతిక - ఆధిదైవిక తాపములతో అంతవరకు అట్టుడికినటు లుడుకుతున్న అంతరంగము తాపరహితమై చప్పగా చల్లారి పోవును.

సాంసారిక తాపము సర్వదా శాంతించిన చిత్తమునందు ఆత్మానందరస ప్రవాహము అతిశయించిన వేగముతో వెల్లి విరియుననుటలో ఆశ్చర్యమేమున్నది? అత్యుక్తి ఏమున్నది?

శ్రీగురుని ఉపదేశార్థమును 'సొమ్ము సంచిని చూరులో బెట్టి మరచితి నన్నట్లు' చేయరాదు. ఏకాంతమునం దాయర్థ మును నిరంతర మనుశీలించుచుండవలెను. అపుడు మాత్రమే గురుశిష్యులిద్దరును ధన్యులయ్యెదరు.

అవతారిక :-

ఆగురుకరుణావిశేషమునే సూర్యకిరణములతో బోల్చి వర్ణించుచున్నారు.

శ్రీదేశిక వర కరుణా

రవి కర సమపోహితస్వాన్తః |

విహరన్‌ మస్కరి వర్యో

నిరవధికానన్ద నీరధా వాస్తే || 10

తా|| శ్రీ గురువుల కరుణ అనెడు సూర్యకిరణము ప్రసరించి - చిత్తమునందలి చిమ్మచీకటిని వెడలనడపగా - అపార మైన ఆనందసముద్రమున విహరించుచు యతిశేఖరుడు విరాజిల్లును.

వివరము :

చీకటిలో వస్తువివేకము జనింపదు. దుంగ దొంగవలె - త్రాడు పామువలె దోచును. అజ్ఞానముకూడ అట్టిదే. అజ్ఞానికి 'ఆత్మ - అనాత్మగా - అనాత్మ - ఆత్మగా' దోచును.

'చిత్తమున గ్రమ్మిన చిమ్మచీకటి' - యనగా అజ్ఞానమే. సూర్యకిరణప్రసారముతో చీకటి మటు మాయమైనట్లు శ్రీగురు వుల కరుణ ప్రసరింపగనే అజ్ఞానము తొలగిపోవును. గురువుల కరుణ అనగా - ఆత్మానాత్మవివేకమును గలిగించి; బ్రహ్మాను భవమును సిద్ధింపజేయు మహావాక్యోపదేశ##మే.

మహావాక్యార్థము అంతరంగమున జొచ్చినంతనే 'తాను జనన మరణ ప్రవాహమున గొట్టుకొని పోవు జీవుడనన్న' చీకటిభావము అంతరించును.

'నేను అవినాశియైన పరబ్రహ్మమనే' - అన్న బోధము ఉదయించును. ఇట్టి బోధము - జ్ఞానము ఉదయింపగనే సాధకుడు ఆనందమయుడగును.

దీనికంతకును కారణము శ్రీగురుకరుణావిశేషము. అందుచే శ్రీగురు చరణములు సర్వదేవతాధికములు !!

అవతారిక :-

ఇటు లింతవరకును - శ్రీగురుకరుణావిశేషమును బ్రస్తుతించి - ఆత్మలాభమునకు, బ్రహ్మానుభవమునకు ఉపకరించు సాధన విధానములకు బ్రస్తావించుచు - ఆత్మవిద్యాసంపన్నుడైన యతిశేఖరుని (జీవన్ముక్తుని) మహావైభవమును వివరించు చున్నారు.

జని విపరీతక్రమతో -

బుద్ధ్యా ప్రవిలాప్య పంచభూతాని |

పరిశిష్టమాత్మతత్త్వం

పశ్యన్నాస్తే ముని శ్మాన్తః || 11

తా|| పంచమహాభూతములను ఉత్పత్తి క్రమమునకు వ్యతిరేకమైన దిశలో ఒక దానియందు వేరొకదానిని విలీనమొనర్చుచు - ఇటు అన్నిటిని విలీనము సేయగా - ఏది శేషించియున్నదో అదేతానని (ఆత్మయని) అనుభవించుచు యతిరాజు శాంతుడై యుండును.

వివరము :-

ఆత్మప్రాప్తికై ఒకానొక ప్రాచీన అద్భుత సాదన విధానము - తత్ఫలితమును శ్రీసదాశివులిందు సూచించినారు.

ఆకాశము - గాలి - అగ్ని - నీరు - నేల - ఇవి పంచభూతములు. ఇవి వరుసగా ఒకదానినుండి వేరొకటి ఉత్పన్నములైనవి. అనగా అకాశమునుండి గాలి - గాలి నుండి అగ్ని - అగ్ని నుండి జలము - జలమునుండి నేల జనించినవి.

ఆకాశము దేనినుండి పుట్టినది? 'ఆత్మన ఆకాశః సంభూతః' ఆత్మనాశ్రయించి మాయ తలఎత్తగా తత్ర్పభావముచే ఆకాశము పొడమినది. ఆకాశాది పంచమహాభూతముల క్రమమిది.

వీనిని విపరీతముగా నడిపి ఒక దానియందు వేరొక దానిని విలీనము చేయవలయును. అనగా 'భూమిని-జలమునందు, జలము - నగ్ని యందు, అగ్నిని - అనిలమందు, అనిలము - నాకాశమునందు విలీన మొనర్చి - దానిని ఆత్మయందు లీనము గావింపవలయును. ఇది ఉత్పత్తి క్రమమునకు వ్యతిరేకమైన క్రమము.

దీనిని సాథనయందుంచిన యోగి -అన్నిటిని విలీన మొనరింపగా శేషించినది ఆత్మయని గుర్తించును, అనుభవించును, అనుభవించి పరమ ప్రశాంతిని భజించును.

ఒకానొక ఏకాంతప్రదేశమున గూర్చుండి సాధకుడు నదీనదములతో - పర్వతారణ్యములతో -చరాచరప్రాణివర్గ ముతో నిండి సువిశాలముగానున్న భూమిని గూర్చి చింతింప వలయును. అనగా భావింపవలయును.

ఇట్లు కొంత సమయము ఈచింతనయందు గడుపవలెను. పిమ్మట - ఈభూమి యంతయును దనకు జనిస్థానమైన జలమున విలీనమైనట్లు చింతింపవలెను.

అనగా ఇంతవరకు భావనయందున్న కొండలు అడవులు చరాచరప్రాణివర్గము ఇవన్నియును జలమగ్నములై పోయి నట్లు భావింప వలెను. కేవలము జలమున్నది. నీరు, నీరు, జలము, జలము. వేరేమియును లేదు. ఇట్లు కేవల జలభూతమును కొంతసమయము ధ్యానించి - అది దానికి జనకస్థానమైన అగ్నియందు విలీనమైనట్లు చింతింపవలయును.

భావనయందున్న జలమంతయును తేజముగా - జ్వాలా భీల మహాగ్ని నిచయముగా మారిపోయినట్లు చింతింపవలయును. అద్భుతము అనంతము విద్యుత్ర్పభము. కింశుకసంకాశము - అయిన మహాగ్ని! మహాతేజము - ఇది భావింపబడవలయును.

ఇట్లు తేజోభూతమును గొంత తడవు ధ్యానించి - అది తనకు జనిస్థానమైన వాయువునందు విలీనమైనట్లు చింతింపవలెను.

గాలికి రూపమున్నదా? లేదు. కేవలము స్పర్శయున్నది. ఆకాశగుణమైన శబ్దము దానిని అనువర్తించి యున్నది. అనగా శబ్దస్పర్శములున్నవి.

ఇంతవరకును భావితమైన తేజోభూతము. రూపరహితమై, శబ్దస్పర్శములచే మాత్రమే తెలియబడుచున్న గాలియందు లీనమైనట్లు చింతనము సాగింపవలయును. చింతనలో అగ్ని యొక్క స్థానమును గాలిఆక్రమింపవలయును. గాలి! గాలి! ఝంఝామారుతము!

కాని ఆగాలికి ఊగుచున్న చెట్లులేవు. సూదులవలె - దబ్బనములవలె గాలివేగముచే పదునెక్కిన - తీక్‌ష్ణతను వహించిన వర్షధారలు లేవు. వాయువేగముచే నాల్కలు జాపుచున్న అగ్ని జ్వాలలు లేవు. అవన్నియు ఒకదానియందొకటి లీనమైపోయి గాలిగా మారినట్లు చింతించితిమికదా!

అందుచే కేవలము గాలి! ఈలలువేయుచు ఆకాశ గర్భమున నిరాటంకముగ - నిర్నిరోధముగ - ఉరకలు పెట్టుచున్న - పరుగులు తీయుచున్న - సుడులు తిరుగుచున్న - క్రిందుమీదగు చున్న గాలి! పెనుగాలి! ఝంఝామారుతము ! ప్రచండమైన వాయుభూతము!

ఇట్లు కేవల మరుద్భావమును జిత్తమున గొంతతడవు నిలిపియుంచి ఈగాలి అంతయును ఆకసమున విలీనమైనట్లు ధ్యానింపవలెను.

ఒక పాత్రను నీటిలో ముంచి వెలికి దీసి (అందు నీరుండ రాదు) ఎండలో పెట్టుము. ఆరంభమున ఆపాత్రయందు అంతటను వ్యాపించి యున్న ఆర్ద్రత (నీటితడి) క్రమముగ హరించిపోయి తడి కనబడకుండ పోవును గదా! అట్లే దీనిని గూడ భావింపవలెను.

అనగా - ఝంఝా మారుతము యొక్క వేగము తగ్గినది. చిరు కదలికలున్నవి. అవియును శాంతించుచున్నవి! శాంతించినవి!

అపుడేమున్నది? కేవల మాకాశమున్నది. కేవలము బయలు! ఖాళీ! అవకాశము. అనంతమైన శూన్యము. మరే మియును లేదు. ఇట్లు కేవలమైన ఆకాశమును గూర్చిన ధ్యానమును కొంతతడవు సాగింపవలయును,

పిమ్మట నీయాకాశమును దాని కధిష్ఠానమైన ఆత్మ యందు విలీన మైనట్లు భావింపవలెను. దేనికై నను ఆధార ముండవలయును. ఆధారమే అధిష్ఠానము. ఆకాశము భావింపబడుచున్నదనగా - దేనియందు భావింపబడుచున్నది? ఆత్మ యందు, తనయందే ఆది భావింపబడుచున్నది కదా!

దానియందు అనగా ఆకాశభావమునకాధారమైన ఆత్మ యందు ఇదెల్ల - ఈ బయలంతయు విలీనమైనట్లు భావింపవలెను.

అపుడేమున్నది? శబ్దరహితము - స్పర్శరహితము - రూప - రస - గంధ విరహితము అయిన ఆత్మస్వరూపమున్నది ! అట్టి ఆ స్వరూపమునందు నిలిచి యుండవలెను. ఆత్మోపలబ్ధికి ఇదొక అద్భుతమైన సాధనము.

సాధకుని దేహేంద్రియములు పంచభూతములకంటె వేరైనవి కావు. అందుచే ఈ ధ్యానవిధానములో సాధకుని దేహేంద్రియాదులు మిగిలి యున్నట్లు తలంపరాదు. అవికూడ పంచభూతములతో బాటు విలీనములై పోయినట్లు - కేవలము సాక్షీభూతమై ఆత్మవస్తువు మిగిలి యున్నట్లు చింతింపవలెను.

ఈ ధ్యానవిధానములో -'ఆకాశమువరకు సాగింపవలసిన ధ్యానకృత్యము తెలివికి అందుచున్నది, కాని అటుతరువాతిది స్పష్టముగా దెలియ వచ్చుట లేదు' - అనిపించును.

కొంతకాలము ఈధ్యానవిధానమును అభ్యాసములో నుంచినవానికి అదియును తెలిసివచ్చును.

ఇట్టి ధ్యానమార్గము నవలంబించి సిద్ధుడైనవాడు నిస్తరంగ సముద్రమువలె ప్రశాంతముగా నుండును - అని శ్రీసదా శివ బ్రహ్మేంద్రులవారు విశదీకరించినారు.

జగదఖిల మిద మసారం

మాయిక మేవేతి మనసి మన్వానః |

పర్యటతి పాటితాశః

ప్రగలిత మదమానమత్సరః కో7పి || 12

తా|| ఈజగమంతయును నిస్సారమే! మాయా కల్పితమే! అని భావించుచు ఏకోరికయు లేనివాడై - మదమును మానమును మచ్చరమును వీడి జీవన్ముక్తుడొకడు యధేచ్ఛము విహరించును.

వివరము:

పరబ్రహ్మ సాన్నిథ్యములో చెలగిన మాయ ఈలోక మును కల్పించుచున్నది.

కల్పన అనగానే అది వాస్తవము కాదని తెలియుచున్నది. మాయాకల్పితమైన యీ జగము యధార్థముగా ఉన్నది కాదు. అది ఎండమావిలోని నీరు!

ఎండమావిలో దోచు నీరు దప్పికను తీర్చజాలదు. అట్లే అయథార్థమైన జగము సారరహితమైనది - అని ఎవడు గాఢముగా భావించునో వానికి గోరిక లెట్లుండును?

కోరికలన్నవి -దేహ - ఇంద్రియ - అంతఃకరణములను యధార్థములని భావించి నపుడు - వీనితో దాదాత్మ్యమును అనుభవించినపుడు మాత్రమే తల యెత్తును.

అంతఃకరణప్రవృత్తియే లేనిచోట కోరికలు ఎట్లుండ గలవు? వానియందు కామక్రోధములు - లోభమోహములు మదమాత్సర్యములు ఎట్లు నిలుచును? వాడు ఆత్మారాముడు? యధేచ్ఛావిహారి! జీవన్ముక్తుడు!

జీవన్ముక్తుడైన మహాపురుషుడు - అజ్ఞానవిలాసమైన సంసారబంధమునుండి విముక్తుడై - ఆత్మనిష్ఠుడై విరాజిల్లుటకు - ఒకప్పుడొక మార్గమున - వేరొకప్పడు వేరొకమార్గమున చింతన సాగించుచుండును.

ఆ మహాత్మునకు ఏమార్గమైనను ఆత్మలాభమును గలిగించును.

సాధక పురుషునకు ఆ జీవన్ముక్త పురుషుని మార్గములు అనుసరణీయములు.

నాత్మని కిఞ్చిన్మాయా

తత్కార్యం వాస్తి వస్తుతో విమలే |

ఇతి నిశ్చయ వానన్తః

హృష్యత్యాసన్ద నిర్భరో యోగీ || 13

తా|| 'మాయకాని - తత్కార్యముగాని - ఆత్మయందు లేవు. ఆత్మస్వతః శుద్ధమైనది' - అన్న నిశ్చయము గలవాడై యోగి ఆనందపరిపూర్ణమైన అంతరంగముతో హృష్టుడై విరాజిల్లును.

వివరము :

ఆత్మజ్ఞానము - మాయ తేజస్తిమితముల వంటివి. వెలుగున్న చోట చీకటి నిలువ జాలదు. చీకటి రాజ్యము సాగుచున్న దనగా వెలుగు ఉదయింపనట్లే 'మాయ' అనగా తన్నుదాను మరచుట.......... కాని దానియందు తానన్న అభిప్రాయముతో నుండుట.

ఈ మాయ - ఈ భ్రాంతి నివారితము కానంతవరకు సంసారమున్నది. దేహేంద్రియాదులున్నవి. దారపుత్రాదు లున్నారు. ఇవి సత్యములే అన్న భావముండును.

ఎంత వరకు ఇవెల్ల సత్యములుగ దోచుచున్నవో - అంత వరకు ఆత్మలాభము కలుగ లేదన్నది నిశ్చితము. ఆత్మజ్ఞాన ముదయింపగా - మాయాకార్యములైన ఇవన్నియు తమ అస్తిత్వమును గోల్పోవును.

'సూర్యుడుదయింపగా చీకటి మాసిపోయినట్లు' - 'అంత వరకు దొంగగాదోచిన దుంగ యొక్క వాస్తవజ్ఞాన ముదయింపగా కలవరమెల్ల శాంతించినట్లు' - మాయాతత్కార్య ములు ఆత్మలాభముతో అంతరించిపోవును.

ఆత్మవస్తువు స్వతశ్శుద్ధమైనది. అచట పరస్పర్శ లేదు.

ఆత్మానుభవసిద్ధుడైన యోగి - 'నా కంటె వేరైన దేదియును లేదు ! ఏదియును లేదు! అంతటను నేనే నిండి యున్నాను' అని భావించి సర్వాత్మత్వమును అనుభవించును.

ఆ అనుభవ మాయోగిని బహీరంతరములయందు ఆనంద పరిపూర్ణుని జేయును.

ఆ ఆనందమున కంతములేదు ! ఆ హర్షమున కవధి లేదు.

త్వమహ మభిమాన హీనో

మోదిత నానాజనాచారః |

విహరతి బాలవదేకో

విమలసుఖాంభోనిధౌ మగ్నః || 14

తా|| ఆత్మానంద సాగరమగ్నుడైన యోగికి - 'నీవు - నేను' అనెడి భేదబుద్ధి ఉండదు. అఖిల జనుల ఆచారములును అతనికి ఆనందమునే కలిగించును. అతడు బాలునివలె సదా ప్రసన్నుడై ఒక్కడై చరించును.

వివరము :-

ఆత్మసాన్నిధ్యమున మాయ ఈ సంసారబుద్ధిని జనింప జేయుచున్నది. సంసారము - 'నేను - నీవు; 'వీడు - వాడు'; 'వీడు నావాడు'; 'వాడు పరుడు'; 'ఇది నాది'; 'అది వానిది'; దానిని నేను సొంతము చేసికొనవలయును'; 'దీనిని కాపాడు కొనవలయును' - ఇత్యాదిగా బహువిధ భేద భావములకు నిలయమైనది.

శ్రీగురుకృపాకటాక్షముచే ఆత్మజ్ఞాన ముదయింపగా మాయావిలాసమైన సంసారము - దానివలన జనించు కలవరము అదృశ్యమగును. అనగా వానికి సంసారము గోచరింపదని కాదు. గోచరించును, కాని కలవర ముండదు.

ఆకసమున్నది, నీలముగా గనబడుచుండును. అజ్ఞుడు అచట నీలవర్ణముతో నిండిన వస్తువేదో వ్యాపించి యున్నదని తలంచును. తెలిసినవాడు -'అచట నేమియును లేదు, శూన్యమే ఆతీరున కనబడుచున్న దని గ్రహించును.

ఇచట ఆకసము అజ్ఞున కెట్లు గోచరించుచున్నదో ప్రాజ్ఞునకును అటులే గోచరించుచున్నది, కనబడుచున్నది - అని తెలియుచున్నది కదా!

అట్లే ఆత్మవిద్యాసంపన్నుడైన జీవన్నుక్తునకును అజ్ఞున కును సంసారము యొక్క గోచరత్వములో భేదము లేదు. అజ్ఞుడు దీనిని దర్శించుచు - ఇది సత్యమని భావించును. ప్రాజ్ఞుడు - దీనిని దర్శించుచు ఇదంతయు మాయావిలాసమని గ్రహించియుండుటచే దీనియందు సక్తుడు కాడు.

ఈ కారణముచేతనే అజ్ఞునియందు 'నీవు - నేను' ఇత్యాదిగా భేదబుద్ధి తలయెత్తి యుండును. ప్రాజ్ఞునియందీ భేదబుద్ధి అంకురింపదు. అతడు సర్వమును బ్రహ్మమయముగా అనుభవించును.

ఆచారభేదములు - విధినిషేధములు సాధారణులకు, జీవన్ముక్త పురుషునకు ఈ భేదములుకూడ ఉండవు. అతడన్నిటిని సమభావముతో అంగీకరించును.

నేలమీద నడచుచున్నవాడు - ఇది దారి. అది డొంక; ఇది మెట్ట - అది గోయి, ఇది నేల - అది నీరు ఇత్యాది భేదములను గమనించి నడకను సాగింపవలెను. లేకున్న వాడు గోతిలో పడవచ్చును, ఏటిలో పడవచ్చును.

ఆకాశమున చరించువానికి - గగనవిహారికి ఇట్టి భేదము లను నియమములను పాలించు నక్కర యుండదు. వాడు యథేచ్ఛము సంచరింప వచ్చును.

అట్లే ఆచారభేదములు సాధారణులకు, జీవన్ముక్తునకు అన్ని ఆచారములును సమ్మతములే. అయినను బ్రహ్మానుభవ మును బొందిన యోగి - తాను యథేచ్ఛము వర్తింపవచ్చునని కలుషవర్తనుడై చరింపడు. అన్ని ఆచారములను సమముగా జూచునే కాని దురాచారమును అనుసరింపడు

బాలుని మానసమున కావట్యముండదు. అటులే సిద్ధుడైన యోగి యొక్క మానసముకూడ నిత్య ప్రసన్నముగా నుండును.

బాలుని మనోనైర్మల్యమునకు వాని అజ్ఞానము కారణము, వాడు సమలోష్టాశ్మకాంచనుడు. బంగారము, రాయి, మట్టిపెళ్ళ - బాలునకు సమముగనే కానవచ్చును. ఇది విలువైనది; అది విలువలేనిది - అనెడి భావము వానియందు జనింపదు. దానికి గారణము వాని అజ్ఞానము.

యోగియొక్క మానసము కూడ నిత్యనిర్మలముగా నుండును. ఇచటి నైర్మల్యమునకు గారణము జ్ఞానము.

యోగిజనులు సమలోష్టాశ్మకాంచనులై చరింతురు. వారు ఈ మట్టికిని ఆ బంగారమునకును భేదము నెంచరు. విలువ తెలియక కాదు; రెండును మాయావిలాసములే అని వారు గ్రహించి యుండుట వారి సమబుద్ధికి కారణము.

అందుచే సిద్ధపురుషుల వర్తనము బాలుని వర్తనమును బోలియుండును, వారి నిర్మలవర్తనమునకు హేతువులు మాత్రము భిన్నములైనవే.

ద్వైతము దుఃఖహేతువు, అద్వైతము ఆనందకందము. 'ఉన్నది తానొక్కడే' - అని ఎవడు గ్రహించునో - అనుభవించునో - అతడు అంతములేని ఆనందసాగరమున విహరించును.

అవధూత కర్మజాలో

జడ బధిరాంధోపమః కో7పి |

ఆత్మారామో యతిరాట్‌

అటవీకోణష్వట న్నాస్తే || 15

తా|| బ్రహ్మవిద్వరిష్ఠుడైన సిద్ధపురుషుడు సర్వకర్మ పరిత్యాగియై ఆత్మారాముడై - లోకులకు అతడొక జడుడు, చెవిటివాడు అనిపించుచు అటవీసీమల యందు విహరించు చుండును.

వివరము :

సత్కర్మాచరణము స్వర్గమును దెచ్చిపెట్టును. దుష్కర్మాచరణము నరకమును జేర్చును. సాధారణలోకము స్వర్గప్రాపకము నరకనివారకము అయిన కర్మయందు బ్రవర్తించును.

'అహంబ్రహ్మాస్మి' అన్న అనుభవముతో ఎవనికి సర్వము బ్రహ్మమయముగా బోధపడినదో - అతడు యజ్ఞ యాగాది కర్మలయందెట్లు ప్రవర్తించును?

అతడొకవేళ అట్టి కర్మలయందు బ్రవర్తించినను ఆత్మారాముడై ఆయాకర్మలను ఒక అభినయముగా ఆచరించునే కాని - కర్తృత్వబుద్ధితో - ఫలాపేక్షగలవాడై ఆచరింపడు.

అట్టి కర్మాచరణసమయమున గూడ అతడు స్వాత్మ నిష్ఠుడై - బ్రహ్మము తానై యుండునే కాని సాగుచున్న కర్మమునందు తాదాత్మ్యమును భజింపడు.

అజ్ఞ జనుల కాతడొక జడునివలె - చెవిటివలె దోచును. దూషణభూషణ తిరస్కారముల కాతడు కొంచెమైనను స్పందింప కుండుటయే దీనికి గారణము.

సంసారమునందు సత్యతాబుద్ధి గలవారితో లోకము వ్యవహరింపగలదు. మాటలలో వేదాంతము, ఆచరణమున లోకప్రవృత్తి కలవారిని ఆదరింపగలదు.

సర్వధా లోకబంధ విముక్తులై చరించు సిద్ధపురుషుల నీలోకము అందుకొనలేదు. అర్థము చేసికొన జాలదు. వారిని గాంచియీలోకము అబ్బురపడును.

లోకవ్యవహారముతో లేశమును సంబంధము లేని ఆమహాపురుషులు లోకదృష్టికి జడులు, బధిరులు.

ఆమహాపురుషులు జనులెవరును లేని అడవులయందు న్నను - లేక జనబాహుళ్యముయొక్క నడుమ నున్నను - తమలో తాముందురుగాన అడవులయందున్నట్లే !

శాన్త్యా దృఢోపగూఢః

శాన్త సమస్తాన్య వేదనోదారః |

రమతే రసజ్ఞఏకో

రమ్యే స్వానన్ద పర్యఙ్కే || 16

తా|| జీవన్ముక్తుడైన మహాత్ముడు - ఇతరములైన వేదన లెల్ల శాంతింపగా మహితుడై - పరమానందమన్న సెజ్జపై శాంతిదేవిని గాఢము కౌగిలించుకొని రమించుచుండును.

వివరము:-

అంతఃకరణము - ఇంద్రియములు - ఇవి బహిర్ముఖ ప్రవృత్తి కలవి. అవి శబ్ద - స్పర్శ - రూప - రస - గంధాత్మకములైన విషయములవంక పరుగెత్తుచు నుండును. వానియొక్క ఈ బహిర్ముఖప్రవృత్తి అశాంతినే తెచ్చి పెట్టును.

జీవన్ముక్తుని ఇంద్రియములు అంతరంగము బహిర్ముఖ ప్రవృత్తిని గోల్పోవును. ఆ మహాపురుషునియందు వానికి అంతర్ముఖ వృత్తి నిత్యసిద్ధమగును.

సాధన దశయందున్నవాడు సహజముగా విషయముల వంక బరువెత్తుచున్న తన ఇంద్రియములను ప్రయత్న పూర్వకముగా వెనుకకు మరల్చి ఆత్మాభిముఖములుగా నిలువబెట్టు చుండును. జీవన్ముక్తునియందలి ప్రయత్నము లేకయే ఆత్మాభి ముఖములగుచు అవి నిష్క్రియములగును. ఆమహాత్ముడు చేపలు నిద్రించియున్న చెరువువలె (''సుప్తమీనఇవహ్రదః'' రఘువంశము) శాంతాంతరంగుడై విరాజిల్లును. అట్లున్న స్థితియే శాంతి దేవీ గాఢాలింగనముగా ప్రస్తుతింపబడెను.

నిర్వికల్పమైన యీస్థితియందు యోగి అన్యమెరుంగక ఆత్మారాముడై ఆనందించును.

ఉన్మూలిత విషయాలిః

స్వీకృత వైరాగ్యకోశ సర్వస్వః |

స్వాత్మానందమహిమ్ని

స్వారాజ్యే7స్మిన్‌ విరాజతే యతిరాట్‌ || 1

తా|| జీవన్ముక్తుడైన యతిచక్రవర్తి - శబ్ద స్పర్శాది విషయములనెడు శత్రువులను నిర్మూలించి యుండును. విరక్తి అనెడు ధనాగారములోని ధనమెల్ల అతనికి స్వాయత్తమై యుండును. ఇటులున్న ఆమహాపురుషుడు ఆత్మానంద మహిత మైన స్వరాజ్యమున విరాజిల్లుచుండును.

వివరము :

శబ్దముచే చెవి, స్పర్శసుఖముచే త్వగింద్రియము, రూపముచే చక్షురింద్రియము, రసముచే జిహ్వేంద్రియము, గంధముచే ఘ్రాణంద్రియము ఆకర్షింపబడి వానికి (ఆవిషయములకు) వశవర్తులై చరించుచుండును. శబ్దాదివిషయములు శ్రోత్రాది ఇంద్రియములను తమవశమం దుంచుకొని తమచుట్టును త్రిప్పు కొను చుండును. ఇది సాధారణలోకస్థితి.

ఆత్మ సామ్రాజ్యమునుండి భ్రష్టుని గావించి - తమకు ఊడిగము చేయించుకొనుచున్న - ఈ శబ్దాదివిషయ శత్రువు లను యతిచక్రవర్తి నిర్మూల మొనర్చి యుండును. వాని పాదులను పెకలించి వేయును. అటులొనర్చుటచే ఆతని యింద్రియములు విషయబంధములనుండి విముక్తములై యుండును.

ఇంతవరకు విషయసక్తములైన ఇంద్రియములు వాని నుండి విరక్తములగును. ఈ విరక్తి - ఈ వైరాగ్యము వానికి పుష్టిని బలమును చేకూర్చును. పరసేవనములో నీరస పడిన ఇంద్రియములు - వైరాగ్యధన సంపన్నములై ప్రకాశించును. అపుడు ఆత్మానందప్రాప్తికి ఒక ఆటంకముండదు.

యతిలోకచక్రవర్తి మాత్రమే దీనిని సాధించును. ఆత్మనందప్రాప్తికి విషయాసక్తి ప్రబలావరోధమన్నది సారము.

సవితర్యపి శీతరుచౌ

చన్ద్రే తీక్షే7ప్యధో వహత్యగ్నౌ |

మాయిక మిదమితి జానన్‌

జీవన్ముక్తో న విస్మయీభవతి || 18

తా|| సూర్యుడు చల్లగా - చంద్రుడు వెచ్చగా దోచినను - అగ్ని అధోముఖమై జ్వలించినను - ముక్తపురుషుడు ఇదంతయును మాయావిలాసమే అని భావించునే గాని ఆశ్చర్యము ననుభవింపడు.

వివరము :

సూర్యునకు వేడి, చంద్రునకు చల్లదనము స్వభావసిద్ధములు. అటులే అగ్నికి ఊర్ధ్వముఖ జ్వలనము (అగ్నిజ్వాల పైకిలేచును గాని క్రిందిగా మొగముపెట్టదు) స్వభావము. వీని యీ స్వభావము లెన్నడును మారవు.

మార్పువచ్చి - సూర్యుడు చంద్రునివలె చల్లదనమును. చంద్రుడు సూర్యునివలె వెచ్చదనము వెదజల్ల నారంభించి నపుడు - అగ్ని అధోముఖముగా జ్వలించినపుడు - ఎంతటి గంభీరప్రకృతియైనను ఆశ్చర్యపడును. విస్మయమును భజించును.

కాని బ్రహ్మవిదాంవరుడైన యోగి దీనినిగాంచి కొంచెమును ఱిచ్చవడడు.

అతడు సర్వమైన జగమును మాయాకల్పితముగా గ్రహించినవాడై - జాగతికముపైన విషయములయందు - అదెట్టిదైనను - హర్ష - శోక - విస్మయాదుల ననుభవింపడు.

శోకస్థాన సహస్రాణి - హర్ష స్థాన శతానిచ |

దివసే దివసే యూఢ - మావిశన్తి న పండితమ్‌ ||

- భారతము.

రోజుకు వేయిసార్లు ఏడ్చి - వంద సార్లు నవ్వుట మూఢుని లక్షణము. పండితుడు హర్ష శోకములకు అతీతుడు.

కాగా జగమెవనికి మాయాకల్పితమన్న నిశ్చయబుద్ధి జనించియున్నదో - వానికి - జగత్సంబంధులైన వికారము లెల్ల మాయా జన్యములుగనే దోచునుగాని సత్యములుగా ఎట్లు తోచును?

అజ్ఞాన వైరి విజయీ

ప్రజ్ఞా మాతఙ్గ మస్తకారూఢః |

విహరతి సంయమి రాజః

సమరస సుఖధామ్ని సర్వతోరమ్యే || 19

తా|| యతి శేఖరుడు అజ్ఞానమన్న శత్రువుపై జయమును సాధించి - జ్ఞానమన్న ఏనుగు నెక్కి సర్వతోరమ్యమైన పరమానందధామమున విహరించును.

వివరము:-

ఆత్మయందు అనాత్మబుద్ధి - అనాత్మయందు ఆత్మబుద్ధి అజ్ఞానముచే గలుగుచున్నది. దీనివలన సంసారబంధ మేర్పడు చున్నది. అందుచే సంసారబంధమును గలిగించు అజ్ఞానము శత్రువు.

జీవన్ముక్తునియందు అజ్ఞాన చర్యలుండవు. దేహాదుల యందు తానన్న భావము - ఆత్మయందు అనాత్మబుద్ధి ఆతని యందుండవు. ఈ కారణముచే అతడు అజ్ఞానమన్న శత్రువును నిర్జించినవాడుగా గీర్తింపబడుచున్నాడు.

జ్ఞానోదయ మైనపుడుకదా అజ్ఞాన వినాశము! ఇదిగో ఇది నావాస్తవరూపము అని తెలిసికొని - ఆ తెలివియందే - నిలిచినవాడు - గజారూఢునివలె వైభవోన్నతుడై ప్రకాశించుచున్నాడు.

అట్లున్నవాడు అనుభవించు ఆనందమునకు అంతము లేదు.

చెఱువులు - సరస్సులు ఎంత పెద్దవైనను - సముద్ర మును జూచిన కన్నులకు అవి చిన్నవే - అల్పాల్పములే.

అట్లే ఆత్మానందమునందు ఇహలోకములోని ఆనంద ములు - పరలోకములోని ఆనందములు - ఇంద్రాదిపదములు - సూర్యునిముందు దివిటీ వెలుగులవలె వెలవెలబోవును. ఆత్మానందమునకు సాటికాగల ఆనందము వేరొకటి లేనేలేదు.

అజ్ఞానమును అణగద్రొక్కి జ్ఞానగజారూఢుడైన యుతి రాజు అట్టి పరమానందమున విహరించు చున్నాడు.

ఇవేవో ఇవి (అజ్ఞానముపై విజయము - జ్ఞానగజారోహణము - పరమానందానుభవము) ఒకదాని వెంబడి ఒకటిగా సాధింపవలసిన మూడు పనులుకావు.

ఇదొక్కటే కృతము. అజ్ఞానముపై విజయసాధనము! దీపము వెలుగుటకును చీకటి తొలగుటకును మధ్య అంతర ముండునట్లు - జ్ఞానోదయముతో అజ్ఞానము వినష్టమగును. అచ్చమైన జ్ఞానభూమికయందు నిలచుటయే పరమానందధామ విహారము!

అందుచే తెలివికలవాడు ఆత్మానాత్మవివేకమును బెంపొందించు సాధనమార్గమున అభ్యాసము సాగింపవలయును.

శాన్తా హంకృతి దోషః

సుసమాహిత మానసః కో7పి |

పూర్ణేన్దు శిశిరభావో

రాజత్యానన్ద సత్యచిద్రసికః || 20

తా|| సచ్చిదానందమయమైన పరబ్రహ్మమున నిత్యరమణశీలుడైన యోగియందు - 'అహంకారదోషము' ఉండదు. అతని మానసము అన్నివైపుల నుండియును ప్రోవుచేయబడి సమాహితమై యుండును. పున్నమిచంద్రునివలె చల్లనైన భావములతో నిండి ఆనందరసికుడైన అట్టియోగి ఎచటనోగాని లభింపడు.

వివరము:

మనము పుట్టుటకు పూర్వములేము. మరణానంతర ముండము; అట్లుకాక సృష్టికి బూర్వము - ప్రళయానంతరము కూడ నిర్వికారముగ నిలిచి యుండునది సత్‌ అనబడును. పరబ్రహ్మము సత్స్వరూపము. అది చిన్మయము, (జ్ఞాన స్వరూపము) మరియును ఆనందమయము.

దేహేంద్రియాదులయందు 'నేను' అనెడి భావమును నిలుపుటయే అహంకారదోషము. ఇది ఆత్మోపలబ్ధికి గట్టి అవరోధము. దీనివలననే సంసారబంధము.

జీవన్ముక్తుడైన యోగియందు అహంకారదోషము ఉండదు. నశ్వరములైన దేహేంద్రియాదులను తానుగా అతడెన్నడును భావింపడు. జనన మరణరహితమై సదా నిర్వికార ముగా నుండు పరబ్రహ్మమే తానన్న అనుభూతి యందాతడు నిమగ్నుడై యుండును.

మన మనస్సు వివిధవిషయములందు విక్షిప్తమై యుండును. చెదరి పడియుండును. ఒక సంచితో బియ్యము తెచ్చితిమి. ప్రమాదవశమున అది చేయి జారినది. బియ్యము నేలపై అన్నివైపులకు చెదరిపోయినవి. అట్లే వివిధ విషయముల యందు చెదరిపడియున్న మానసమును - ఆబియ్యమును ప్రోవుచేసినట్లు - యోగీంద్రుడు ప్రోవొనరించును. సమాహిర మొనరించును.

ఇట్లగుటచే ఆతని మానసము తాపరహితమగును. చంద్రునివలె చల్లనైన అంతఃకరణవృత్తులు కలవాడైయోగి బ్రహ్మానందరసికుడై విరాజిల్లును.

అహంకారదోషమే జీవకోటికి బ్రహ్మానుభవమును కలుగ నిచ్చుటలేదు.

తిష్ఠన్‌ పరతరధామ్ని

స్వీయసుఖాస్వాదపరవశః కో7పి |

క్వాపి ధ్యాయతి

కుహచిద్గాయతి కుత్రాపి నృత్యతి న్వైరమ్‌ || 21

తా|| పరమోన్నతమైన బ్రహ్మపదమున వసించుచు - ఆత్మానంద రసాస్వాదపరవశుడై - ఒకచో ధ్యానమ్నగుడు - వేరొకచో గానమగ్నుడు, ఇంకొకచో నృత్యమగ్నుడునై చరించు యోగివర్యు డెచటనోగాని లభింపడు.

వివరము :

మానవులకంటె దేవతలు - దేవతలకంటె హరిహర హిరణ్యగర్భులును అధికులు. పరబ్రహ్మపదార్థము వారింటెను మిన్నయైనది.

''పరమాద్వైత విజ్ఞానీ మయారాధ్యః సదైవతు |

నారాయణన రుద్రేణ తదా దేవై ర్విశేషతః ||''

-బ్రహ్మగీత.

''అద్వయజ్ఞానసంపన్నుడైన యోగి నాకు సర్వదా పూజ్యుడు. నాకేకాదు. నారాయణునకు - రుద్రునకును గూడ అత డారాధ్యుడై యున్నాడు. ఇక దేవతలు ఆమహాత్ముని నధికముగా సేవింపదగినవారని వేరే చెప్పనక్కరలేదు'' - అని బ్రహ్మగీత.

బ్రహ్మవిద్వరేణ్యుడు ఇంద్రపదవిని - బ్రహ్మపదవినిగూడ గడ్డిపరకగా జూచును. అతడు తృణీకృత బ్రహ్మపురందరుడు. అతడనుభవించు ఆనందము ఇంద్రపదమున - బ్రహ్మపదమున లేదు. అందుచే పరబ్రహ్మము సర్వోన్నతమైనది.

యోగివర్యుడు పరబ్రహ్మమే తానన్న జ్ఞానభూమిక యందు సుస్థిరుడై - ఆత్మానందరసాస్వాద పరవశుడై యుండును.

లోకములోని ఏ ఆనందమును ఆద్మానందమునకు సాటి కాదు. మరియు విషయానందము లన్నియును - ఆత్మానంద సాగరము నుండి చెదరిన శీకరములే. తుంపరలే.

''నవా అరే పత్యుః కామాయ పతిః ప్రియోభవతి'', - బృహదారణ్యకము.

ఒకవనిత తనభర్తను మిక్కిలి ప్రేమించుచున్నది. తానుగా ఆమెయు, ఆమెను జూచుచున్న లోకమును - ఆమెకు గల పతిప్రేమ అపారము. నిరుపమము అనియే భావించుచున్నారు. కాని వాస్తవ మది కాదు.

'ఆమెకు తనయందే ప్రేమ. పతియందు కాదు' - అని శ్రుతి తెలుపుచున్నది. ఆభర్తవలన తనకు సుఖము లభించుచుండటచేతనే ఆమెభర్తను అంతగా ప్రేమించుచున్నది. తన ఆనందమునకై ఆమె పతిని ప్రేమించుచున్నది. ఆమెకు తనయందే ప్రేమ అని విశదమగుచున్నది.

ఇట్లు లోకములో ఎవరు దేని నెంతగా ప్రేమించుచున్నట్లు కానవచ్చినను దాని కంతకును ఆత్మప్రేమయే కారణము.

ఒకడు తల్లిని భార్యను వెంటబెట్టుకొని ఏటిని దాటుచున్నాడు. ఏరు వేగముగా ప్రవహించుచున్నది. భార్యను తల్లిని పొదవి పట్టుకొని వాడు ఏటిని దాటుచున్నాడు.

ప్రవాహవేగము నీటిలోతు అధికములగుచున్నవి. ఇద్దరిని కాపాడుకొనుచు నడచుట కష్టముగా నున్నది. తల్లి, భార్య - ఇద్దరి కాళ్ళు నీటిలో తేలిపోవుచున్నవి. వారు వీనిని బట్టుకొని వ్రేలాడుచున్నారు. వాడు ఈ యిద్దరితో ఏటిని దాట జాలననుకొన్నాడు. ఎవరిని వదలుట? తల్లి, భార్య. వాడు తల్లిని వదలినాడు. భార్యను బట్టుకొని నడువసాగెను.

తల్లినే ఏలవదలెను? భార్య నేల వదలలేదు? వాని కిపుడు తల్లి వలనకంటె భార్యవలన లభించు సుఖమెక్కువ. అందుచే తల్లిని వదలినాడు.

వాడు భార్యతో నడచుచు ఒకగోతిలో పడినాడు. నీరెక్కువగా ఉన్నది. వాడు ఉక్కిరిబిక్కిరియైనాడు. భార్యను రక్షించుకొనుచు తనను రక్షించుకొనుట కష్టమనిపించినది.

తనను గట్టిగాబట్టుకొనియున్న భార్యను వదలించు కొనినాడు. నీటిలోనుండి తలపై కెత్తినాడు. ఈదుకొని యొడ్డునకు జేరినాడు.

ఈ ఉదాహరణగాథను కొంచెము పరిశీలన చేయుదము.

అతనికి తల్లిమీద భార్యమీద ప్రేమయున్నది. కాని తనమీద ప్రేమ ఎక్కువ. ఆయిద్దరివలన దనకు సుఖము లభించుచున్నది గాన నాతడా యిద్దరిని బ్రేమించుచు వచ్చినాడు. వారిపై ప్రేమకుగూడ తనమీదిప్రేమయే కారణము. ఎపుడు తనకే ముప్పు వచ్చుచున్నదని తోచెనో అపుడాతడు ఒకరితరువాత నొకరుగా నాయిద్దరను ఏటిలో వదలి తాను బయట పడినాడు.

ఏ ఆనందమును ఆత్మానందమునకు సాటికావు.

అచ్చమైన ఆత్మానందముననుభవించు మహాత్ముడు ఆ యానందమున బరవశుడై ఒకచో ధ్యానము సేయుచు పడియుండును. ఒకచో పాడును. ఒకచో ఆడును. ''అతడాత్మానంద మదిరామత్తుడు గదా!''

అగృహీతాఘకలఙ్కః

ప్రశమిత సఙ్కల్పవిభ్రమఃకో7పి |

న్యక్కృతకార్యకలాపః

తిష్ఠత్యానన్ద సీమని క్వాపి || 22

తా|| సర్వమును దెలిసినవాడు - పాపమాలిన్య మంటని వాడై శాంతించిన సంకల్పముల సందడిగలవాడై - సర్వకర్మలను విసర్జించి, వెలితియన్నది లేక అంతటను నిండియున్న అఖండ పరబ్రహ్మస్వరూపమున నిమగ్నుడై యుండును. అట్టి మహాత్ము డెచటనోగాని లభింపడు.

వివరము :

అఘమనగా పాపము, పాప మెవడాచరించును? విషయాసక్తు డాచరించును. విషయాసక్తి దేహేంద్రియములయందలి తాదాత్మ్యముతో జనించుచున్నది.

లోకము రెండు రకములు. పాపకార్యాసక్తమైనది. పుణ్యకార్యాసక్తమైనది. పాపముదుఃఖభోగమునకై శరీరమును దెచ్చిపెట్టును. పుణ్యము సుఖానుభవమునకై శరీరమును గల్పించును.

ఇవి రెండును జీవుని సంసారమున బంధించి యుంచు నవియే. రెండును బంధముచే. ఒకటి ఇనుపసంకెల. రెండవది బంగారు సంకెల.

అజ్ఞజనము తమయందు జనించిన విషయాసక్తిని నిగ్రహింప జూడదు. దానికొక అవరోధమును గల్పింపదు. నిర్ణిరోధముగ దానిని సాగనిచ్చును. అటులొనరించుటచే పాపాచరణము సంభవించును.

ఇంచుక తెలివైనవారు - తమయందలి విషయాసక్తికి కొన్ని హద్దులు - పరిమితులు కల్పించి - సుఖభోగమును దెచ్చి పెట్టు పుణ్యకర్మముల నాచరింతురు.

ఇద్దరును శరీరేంద్రియాదులతోడి తాదాత్మ్యము గల వారే. ఇద్దరును ఆత్మసామ్రాజ్యమునుండి భ్రష్టులైనవారే.

దేహేంద్రియములతోడి తాదాత్మ్యమే సర్వపాపము లకును మూలము. ఈశరీరమును తానుగా భావించుటయే మహాపాపము.

ఈతాదాత్మ్యమును వీడి యోగిపుంగవుడు విరాజిల్లును అందుచే అతడు పాపుపుణ్యములకు అతీతుడై యుండును. వానికి (పుణ్యపాపములకు) జెందిన అల్పమాలిన్యమైనను వాని యందుండదు.

మనసును యధేచ్ఛముగా ఇంద్రియముల దారులగుండా శబ్దాది విషయములవంక పరుగెత్త నిచ్చినపుడు - దాని యందుద యించు సంకల్పమునకు (కోరికలకు) అంత ముండదు.

శబ్ద స్పర్శ రూపరసాదులచే ఆకృష్టమగుచు చిత్తము వివిధ సంకల్పముతో నిండును. (శబ్దమున రమించుచు స్పర్శ సుఖమును వాంఛించును. స్పర్శసుఖమందుండి - రూపదర్శన కాంక్ష గలదగును. ఇట్లు దానియందలి సంకల్పములకు అంత ముండదు).

ఇట్టి విషయాభిముఖ సంకల్పముల సందడిలో - కామ క్రోధాదులు తలయెత్తును. అపుడు నాయకత్వము వాని చేతులలోనికి బోవును.

ఒక మహానగరమునం దేకారణముచేతనో సమ్మె జరుగుచున్నది. జనులు ఎక్కువగా వీధులయందేవో నినాదము లొనరించుచు పరిభ్రమించు చున్నారు. అట్టివేళ దుర్జనులు (గూండాలు) వారితో గలియుదురు. ఆసమ్మెయొక్క లక్ష్యము మారిపోవును. దుష్కార్యములు జరుగును. హింస జరుగును. వినాశము సంభవించును.

అటులే విషయాభిముఖ వృత్తుల అధిక్యమున కామ క్రోధాదులు తలయెత్తి నానాభీభత్సమును గల్పించును.

ప్రాజ్ఞునకు దేహతాదాత్మ్యమే లేదు. ఇక వాని చిత్తము ఇంద్రియముల దారులగుండా విషయములవంక పరుగెత్తుట ఎట్లు జరుగును?

ఇట్టి సంకల్పరహితమైన మానసమున - కామక్రోధాదులు తలయెత్తి స్వేచ్ఛా విహార మెట్లు చేయును?

అందుచే యోగీశ్వరుని చిత్తము సంకల్పముల సందడి లేనిదై ప్రశాంతముగా నుండును.

అతడు ''అపారము - అనంతము - అఖండము - నిస్సీమము - సార్వదేశికము - సార్వకాలికము - వెలితి యనునది లేక పూర్ణ వస్తువునై యున్న పరబ్రహ్మమునందు'' - సుస్థిరాసనాసీనుడై విరాజిల్లును.

చపలం మనః కురఙ్గం

చారు గృహీత్వా విమర్శవాగురయా |

నిగమారణ్యవిహారః

శ్రాన్తః శేతేస్వధామ్ని కో7ప్యేకః ||

తా|| చంచలమైన మనస్సు అనెడి - లేడిని, విమర్శ యనెడి ఉచ్చున జిక్కబట్టి - వేదారణ్యవిహారియై - అలసి - సొలసి ఆత్మధామమున సుఖముగ నెవడో శయనింప గలుగును.

వివరము :

లేడి చంచలమైనది. అది ఱప్పపాటుకాలములో ఎచటికో పరుగెత్తును. దానిని బట్టుకొనుట సుఖసాధ్యముకాదు.

అట్టిదే మనస్సు. అది ''ప్రమాణ -2 విపర్యయ - 3 వికల్ప - 4 నిద్రా - 5 స్మృతి 'వృత్తుల' నవలంబించి - విషయారణ్యముల యందు విహరించుచుండును.

____________________

1. 'ప్రమాణ - విపర్యయ - వికల్ప - నిద్రా - స్మృతయః'

-యోగసూత్రములు.

ప్రమాణాలైదును మనసుయొక్క నడకలు.

1. ప్రమాణము :- ఇది ప్రత్యక్ష - అనుమాన - ఆగమ రూపమున మూడురకములు.

2. విపర్యయము :- అనగా మిథ్యాజ్ఞానము. ఒకదానిని జూచి వేరొకటిగా దలంచుట విపర్యయము.

3. వికల్పము :- శబ్దశ్రవణ మాత్రమున మనసు ఒకరూపము నేర్పరచుకొనుటకై కదలును. ఆ కదలిక వికల్పము. (''రాహుశీర్షము'' అన్నంతనే దానిని జూడకున్నను - మనసు ఒక రూపమును కల్పించుకొనును. అట్టి కదలిక వికల్పము.)

4. నిద్ర :- అభావమును (ఏమియును లేకపోవుటను) భావించుటకైన మానసికమైన వృత్తి నిద్ర.

5. స్మృతి :- పూర్వానుభూత విషయమును భావనాదార్‌ఢ్య ముచే రూపు గట్టించుకొనుటకైమనసు అవలంబించువృత్తి స్మృతి.

శబ్దారణ్యమునుండి స్పర్శారణ్యమునకు - దానినుండి రూపారణ్యమునకు - అటనుండి రస - గంధారణ్యములకు అది ప్రమాణాదులైన వృత్తులను (నడకలను) మార్చుచు దూకుచుండును, పరువెత్తుచుండును, అట్టి దానిని నిలువరించుట ఎట్లు? కదలకుండ కట్టివేయుట ఎట్లు?

నిరంతరము పరువెత్తు లేడిని బట్టుకొనుటకు ఒకవల లేదా ఉచ్చువంటి సాధనము అవసరము. మనసును బట్టుకొనుటకు విమర్శ - ఆత్మవిమర్శ - జగద్విమర్శ సాగించుచు తనను దేహేంద్రియాదులకంటె భిన్నమైన వానినిగా భావించుట ఒక ఉచ్చువలె ఉపయోగ పడును. ఉచ్చులో జిక్కిన లేడివలె ఆత్మవిమర్శనము సాగించుమని మానసము నిగ్రహింపబడును.

అడవిలో దారి కనుగొనుట కష్టము. ఏది ఎచటకు గొంపోవునో తెలియదు. అట్లే వేదముల అర్థమునెరుంగుట కష్టము. మిక్కిలి శ్రమించినవానికిగాని వేదార్థము - అవగతము కాదు. అట్లు శ్రమించిన ధీరునకు వేదములు 'సర్వం బ్రహ్మ మయ' మ్మని బోధించుటయందే తాత్పర్యము గలవని తెల్లమగును.

అభ్యాసవైరాగ్యములతో సుష్ఠు కల్పితమైన ఆత్మ విమర్శ అనెడు ఉచ్చులో మనసు అనెడి లేడిని జిక్కబట్టి - వేదారణ్యములలో దిరిగితిరిగి -''సర్వం బ్రహ్మమయ'' మని, ''నేహ నానాస్తి కిఞ్చన -'' అని గ్రహించుటయందు అలసిన యోగిసత్తముడు - తిరిగి తిరిగి మిక్కిలి అలసి, ఇంటికి జేరి సుఖముగ నిద్రించిన వానివలె - 'అహం బ్రహ్మాస్మి' అన్న జ్ఞానభూమిక నధిరోహించి - అన్యమెరుంగనివాడై వర్తిల్లును.

దారుణచిత్తవ్యాఘ్రం

ధీర మనః ఖడ్గధారయా హత్వా |

అభయారణ్య కో7పి

సై#్వర విహారీ జయత్యేకః || 24

తా|| #9; చిత్తమనెడు క్రూరమైన బెబ్బులిని - ధీరమైన మనుః ఖడ్గముయొక్క వాదరతో (పదును) ఖండించి - భయమన్నది లేని కాంతారమునం దొంటిగా స్వేచ్ఛా విహారియై విరాజిల్లు యోగిసత్తముడు లెక్కకొక్క డెచటనో లభించును.

వివరము:

పెద్దపులి అడవులలో స్వేచ్ఛగా నిర్ణిరోధముగా విహరించినట్లు - చిత్తము శబ్దాది విషయారణ్యములయందు విహరించును.

బెబ్బులి అల్పమృగములను దారుణముగ జీల్చి చెండినట్లు - చిత్తముకూడ అల్పాల్పములైన నీతివాక్యములకు ధర్మసూత్రములకు లొంగదు సరికదా. తనదారికి అడ్డువచ్చు వీనినెల్ల సంహరించును, గ్రసించివేయును.

అభ్యాస - వైరాగ్యములచే ధీరమై - ఆత్మానాత్మ వివేక ముచే పదునెక్కిన మనసనెడు మహాఖడ్గముతో ఎవడో యోగి వర్యుడు మాత్రము దానిని ఖండించును.

ఇచట సంహరింపబడునది చిత్తము, దానిని ఖండించు ఖడ్గము మనసు అని చెప్పబడెను. చిత్తమునకు - మనసునకును ఈషద్భేదమున్నను - అవి రెండును అంతఃకరణములోని భాగములేకదా! (మనో బుద్ధ్యహంకారముల సంపుటియే అంతః కరణము) ఒకటి వ్యాఘ్రముకాగా - వేరొకటి ఖడ్గమై దానిని ఖండించుట ఎట్లు? అను సంశయమునకు అవకాశమున్నది. కాని-

''మన ఏవ మనుష్యాణాం - కారణం బన్ధమోక్షయోః

బన్ధాయ విషయాసక్తం - ముక్త్యై నిర్విషయం మనః.

జీవకోటి సంసారబద్ధమై కుందుటకు, మోక్షలాభముచే ఆనందించుటకు రెండింటికిని మనస్సే కారణము. అదే బంధమును దెచ్చి పెట్టును. అదే ముక్తి లాభమును గలిగించును.

విషయములవంక పరువెత్తి బంధమునకు, విషయముల నుండి వెనుకకు మరలి, నిర్విషయమై ముక్తిలాభమునకును అది కారణమగుచున్నది.

వృత్తిభేదముచే చిత్తమే వ్యాఘ్రము, అదియే ఖడ్గము అగుచున్నది.

విషయాభిముఖవృత్తి చిత్తమును బెబ్బులిని జేసి భయమును (సంసారమును) దెచ్చిపెట్టుచున్నది. అపుడెవడైనను - అభ్యాసవైరాగ్యములచే ఆత్మవిమర్శచే - విషయపరాఙ్ముఖ వృత్తిని ఆమనసునందు కల్పింపగలిగెనా బెబ్బులివలె నున్న విషయాభిముఖవృత్తి మాసిపోవును, ఖండితమగును.

'ద్వితీయాద్వైభయంభవతి' - రెండవదున్నదని తలంచి నంతవరకును భయము తప్పదు. భయమనగా సంసారము. ఈ సంసారము అడవివంటిది. భయారణ్యమైన సంసారమునకు వ్యతిరేక మైనదగుటచే అభయారణ్యమనగా పరబ్రహ్మము.

మనసును నిర్విషయ మొనరించిన మహాత్ముడు 'ఏకమేవాద్వితీయం బ్రహ్మ' అన్న జ్ఞానభూమికను అధిరోహించి - బంధముక్తుడగుటచే స్వతంత్రుడై - ఉన్నది తానొక్కడే అన్న అనుభవముతో విహరించును.

సాధారణులకు ఈకార్యము సాధ్యము కాదు. ఎవడో యోగిపుంగవుడు మాత్రమేదీనిని సాధింపగలడు.

అవతారిక :-

ఇటనుండి ముప్పదిమూడవ శ్లోకము వరకును శ్లేషచే - రూపకముచే ఆత్మవిద్యాసంపన్నుని వైభవమును వర్ణించు చున్నారు.

సజ్జన హృదయ సరో

జోన్మీలనకర ధీకర ప్రసరః |

ఏకో యతివరపూషా

నిర్దోష శ్చరతి కో7పి చిద్గగనే || 25

తా|| తన బుద్ధి కిరణప్రసారముచే సజ్జనుల హృత్పద్మము లను వికసిత మొనర్చుచు యతివరసూర్యుడు చిదాకాశము నందు అద్వయమూర్తియై విరాజిల్లు చుండును. అట్టి మహాత్ముడు అరుదుగా లభించును.

వివరము:

ఇంద్రియములను అదుపున బెట్టుటకై యత్నించుట, మనసుయొక్క విషయాభిముఖ ప్రవృత్తిని నిరోధింప యత్నించుట, పరమాత్మానుభవమునకై తడవుకొనుచుండుట సజ్జన లక్షణము.

కామక్రోధాదులు ఒక్కదుర్జనుని యందు మాత్రమే కాదు, అందరి యందును (సజ్జనులయందును) ఉదయించును. తనయందు ఉదయించిన కామక్రోధాదులను సాగనిచ్చువాడు దుర్జనుడు. వానిని అరికట్టయత్నించువాడు సజ్జనుడు. మనసు యొక్క విషయాభిముఖప్రవృత్తికి స్వాగతము పలుకువాడు దుర్జనుడు. ఆప్రవృత్తిని విదళింపయత్నించువాడు సజ్జనుడు.

బ్రహ్మానుభవసంపన్నుడైన యోగివర్యుడు - పరమాత్మానుభవమునకై తడవుకొనుచున్న సజ్జనునకు మార్గదర్శకుడగును. (దుర్జనునకు - ఈవాంఛయే లేదుగాన, వాడు పెద్దగా మారడు).

ఎండుకట్టె నిప్పు సోకినంతనే జ్వలించును. పచ్చికట్టెను నిప్పుల నడుమ నుంచినను పొగయేకాని జ్వాలరాదు.

సూర్యకిరణములు సోకగా పద్మము వికసించినట్లు యోగి వర్యుని బుద్ధి ప్రసరించినంతనే సజ్జనహృదయము వికసితమగును.

అంతవరకు దారిదొరకక కొట్టుమిట్టాడుచున్న సజ్జనునకు యోగివర్యుని సాంగత్యము అనుగ్రహము వెలుగులు విరజిమ్మి ఆత్మానుభవమునకు మార్గదర్శక మగును.

'చిదాకాశము' అనగా జ్ఞానాకాశము అనగా బ్రహ్మమే.

సంతతము చిదాకాశమున దోషరహితుడై (శరీరేంద్రియ తాదాత్మ్యము లేనివాడై) ఆత్మోపలబ్ధికై యత్నశీలురై యున్న జనులకు వెలుగులు విరజిమ్మి హృదయ వికాసము చేకూర్పగల మహాత్ముడైన యతివరసూర్యుడు దుర్లభుడు.

కువలయ వికాసకారణ

మజ్ఞాన ధ్వాన్త కౌముదీప్రజ్ఞః |

శుద్ధో మునీన్ద్రచన్ద్రః

సురసేవ్యే లసతికో7పి విష్ణుపదే || 26

తా|| కువలయవికాసకారణమై - అజ్ఞానమను చీకటిని బారద్రోలు కౌముది (వెన్నెల) వంటి ప్రజ్ఞగలవాడై పరిశుద్ధుడైన యోగిచంద్రుడు - దేవసేవ్యమైన విష్ణుపదమున విరాజిల్లు చున్నాడు.

వివరము:

ఇందలి కువలయ - కౌముదీ - విష్ణుపద శబ్దములు రెండేసి అర్థములయందుపయోగింపబడెను.

కువలయమనగా - కలువ, భూమి, కౌముది - అనగా, వెన్నెల, వ్యాకరణ శాస్త్రము. విష్ణుపదమనగా - ఆకాశము, పరబ్రహ్మము.

పున్నమి నా డాకాశమున నిర్మలముగా బ్రకాశించు చంద్రబింబము - వెన్నెలలను గురియించి చీకటిని బారద్రోలి నట్లు - కలువలను వికసితముల గావించినట్లు -

యోగిసత్తముడు శుద్ధుడై (తనకంటె వేరైనదాని సంబంధము కొంచెమును లేనివాడై) పరబ్రహ్మమే తానై తేజరిల్లుచు - తన ప్రజ్ఞచే (బ్రహ్మజ్ఞానముచే) అజ్ఞానమును నివారించుచు - ఈ పుడమి కెల్ల వికాసమును గలిగించు చున్నాడు.

అట్టి యోగి సులభప్రాప్యుడు కాడు.

స్వానన్దామృతసేకై రాన్తర

సన్తాప సన్తతిం శమయన్‌ |

చిత్తమచఞ్చలవృత్తి శ్చిద్వ్యోమని

భాతియోగివర్యఘనః || 2

తా|| ఆత్మానందామృతాసేచనములచే - అంతరములైన సంతాపముల నెల్ల శాంతింపజేయుచు - చిదాకాశమున యతి వరమేఘము అచంచలవృత్తియై విరాజిల్లు చున్నది. ఇది చిత్రము!

వివరము :

మేఘము జలధారలను వర్షించును. బ్రహ్మవిద్వరేణ్యుడైన యోగివర్యుడు ఆత్మానందామృతమును వర్షించును.

మేఘము జలధారాసేచనములచే (తడుపుటచే) బయటి తాపమునెల్ల హరించివేయును. యోగివర్యుడు ఆత్మానందధారాసేచనములచే లోపలి తాపములనెల్ల (సంసారము వలన జనించు మానసిక తాపము) హరించును.

మేఘము స్థూలాకాశమున చంచలవృత్తియై యుండును. అనగా నిరంతరము చలించుచుండును. యతివర్యుడు చిదాకాశమున స్థిరుడై యుండును.

బ్రహ్మవిద్వరుడైన యతికిని మేఘమునకును కొన్నిటి యందు పోలికయున్నది. కాని అది బాహ్యతాపమును హరింపగా - యోగివర్యుడు ఆంతరసంతాపమును శమింప జేయుచున్నాడు. అది చంచలవృత్తి కాగా ఈయతివరమేఘము అచంచలవృత్తి అగుట చిత్రము.

యతిశేఖరుడు పరబ్రహ్మము తానై యున్నానన్న తెలివి నెన్నడును విడువడు! అతడున్నచోట ఆత్మానందా మృతము వెల్లివిరియును.

సాంసారికములైన తాపములచే నిరంతరము తపించు అంతరంగము ఆమహాత్ముని సన్నిధియందు తాపరహితమై చల్లని శాంతిని అనుభవించును.

సుమనః సౌరభ మఞ్జుల

సఞ్చార నివారితాఖిల శాన్తిః |

సంయమి చారు సమీరో

విహరత్యానన్ద సంవిదారామే || 28

పూలతోటలో విహరించి వచ్చుటచే - పూలవాసనల గుబాళింపులను వెంటబెట్టుకొని వచ్చిన మనోహర మారుతము - సకలప్రాణుల అలసటను నివారించినట్లు -

సంయమీంద్రుడు దేవలోకపు పరిమళములను వెదజల్లుచు - తాను సంచరించినచోట నిఖిలజనులకు సాంసారిక తాపోపశాంతిని బ్రసాదించుచు - జ్ఞానానందమయమైన పరబ్రహ్మమున విహరించుచుండును.

వివరము :-

సుమనశ్శబ్దమునకు పూవులు - దేవతలు అని రెండర్థములు.

పూలతోటనుండి పూలవాసనలతో వచ్చినగాలి - మనోహరముగానుండుటయే కాక - శరీర తాపాపనోదనక్షమమై యుండును.

'అటులే 'అహంబ్రహ్మాస్మి' అన్న జ్ఞానభూమియందు నిత్యము విహరించు వాడైన సంయమీంద్రుడు కదలిన చాలును, వాని వెంట దేవతలు కదలివత్తురు. అతడడుగిడిన చోట నెల్ల సాంసారికమైన తాపము చల్లారిపోవును.

అందుచే ఇచట సంయమీంద్రుడు సుమనస్సౌరభసంయుత సుందరసమీరముగా బేర్కొనబడి సర్వజనుల సాంసారిక తాపములను శాంతింప జేయువాడుగా వర్ణింపబడెను.

ఒకడొకచోటకు కదలి వచ్చినపుడు - అచటకు వాని శరీర మొక్కటియే రాదు, వాని స్వభావ గుణాదులుకూడ వానిని వెంబడించి వచ్చును.

ఒక దుర్జనుడు మనసమీపమునకు వచ్చి కూర్చుండగా - మనము పైకి తెలియని అశాంతిని అనుభవించుటకు - వాని వెంట వాని దుర్భావములన్నియును వచ్చుటయే కారణము వాని ప్రభావమే మనయందు అశాంతిని రేకెత్తించును.

అట్లే ఒక సజ్జనుడు ఒక బ్రహ్మవిదుత్తముడు కదలి వచ్చి నపుడు - వాని సద్భావము - వాని ఆత్మజ్ఞానసంపద కూడ వానివెంట వచ్చును అపుడు మనము మనకు తెలియని ఆనంద మును శాంతిని అనుభవింతుము.

అప్రస్తుతమైనను ఇచట నొకమాట ! శివారాధకులై హరిని ద్వేషించువారు, విష్ణ్వారాధకులై శివుని ద్వేషించు వారును ఉన్నారు. వారు మూర్ఖులు.

శివుడనగా ఆయన బాహ్యరూపమే కాదుగదా! అంతరంగముతో గలసి కదా శివస్వరూపము! శివుని అంత రంగములో ఎవరున్నారు? హరియున్నాడు! రాముడున్నాడు! 'నారాయణప్రియ మనఙ్గ మదాపహారం' నారాయణప్రియుడైన శివుని అంతరంగమున హరి నిండియున్నాడు.

కాగా ఎవరు శివునారాధించుచున్నారో - వారు హరిని ఆరాధించుచున్నట్లే ! మరియు - శివునకు బ్రీతిపాత్రమైయున్న హరిని ద్వేషించినపుడు వాడు చేయునది శివారాధన మెట్లగును?

ఇట్లే హరియును అంతరంగమున శివుడై యున్నాడు!

'బాహ్యరూపమే కాదు. అంతరంగముగూడ కదలి వచ్చును. దానిని కూడ గమనింపవలయును' అన్న సామాన్య విషయము నెవరు గుర్తింపరో - వారికి - ఈ ద్వేషములు. అస్తు!

బ్రహ్మవిద్వరుడు సంసారతాపమును శమింపజేయు ఆత్మానంద సౌరభమును వెదజల్లుచుండును.

నిశ్శ్రేయ స సరసఫలే

నిర్మల విజ్ఞాన పల్లవ మనోజ్ఞే |

వీతభ##యే విపినతలే

యతిశితికణ్ఠో విభాత్యేకః || 29

తా|| నిర్మలమైన విజ్ఞానమనెడు చివురాకులతో - మనోహరమైన మోక్షమనియెడు రసవంతమైన ఫలసంపదతో విరాజిల్లియున్న - భయరహితమైన కాంతారమందు - యతివర మదమరాళము ఒంటిగా విభాసించుచున్నది.

వివరము :

'ద్వితీయాద్వైభయంభవతి' రెండవది ఉన్నదనుకొనిన చాలును, భయము సంభవించును, భయ మనగా సంసారము. దానికి వ్యతిరేకమైనదగుటచే అభయారణ్య మనగా - పరబ్రహ్మము.

అద్వయ జ్ఞానసంపన్నుడైన యోగీంద్రుడు - అభయారణ్య విహారియైన మత్త మయూరముగా (నెమలి) ఇందు రూపింపబడెను.

అరణ్యమనినంతనే చెట్లు వానికి జివుళ్ళు - ఫలసంపద ఉండవలయునుగదా!

ఇచట పరబ్రహ్మమును గూర్చిన పరిశుద్ధ జ్ఞానమే చివురాకులుగా జెప్పబడెను. మోక్షము ఫలముగా బేర్కొన బడెను.

చివురు ముందుపుట్టి - పూవు - పిందె - కాయ - పండు తరువాత ఏర్పడును. అటులే మొదటిది పరోక్షజ్ఞానము - తరువాతిది బ్రహ్మానుభవము.

''అస్తి బ్రహ్మేతి చేద్వేద పరోక్ష జ్ఞాన మేవ తత్‌ |

అహం బ్రహ్మేతి చేద్వేద సాక్షాత్కార స్స ఉచ్యతే ||

-వేదాన్త పఞ్చదశీ.

బ్రహ్మ మున్నదని తెలియుట మొదటి దశ - అది పరోక్షజ్ఞానము. తానే ఆపరబ్రహ్మమని ఎఱుంగుట రెండవ దశ. దీనికి సాక్షాత్కారమని పేరు.

అందుచే ఇచట ఆత్మప్రాప్తికైన విజ్ఞానము చివుళ్ళ మొత్తముగా చెప్పబడెను.

మోక్షమేను రసవంతమైన ఫలముగా జెప్పినారు. లోకములోని ఫలములయందు - తొక్క - టెంక - గింజ వంటివి పారవేయదగిన పదార్థములున్నూ ఉంటాయి. కాని మోక్షఫల మట్టిదికాదు. ఇదంతయు రసమే. ఇది కేవల రస స్వరూపము. ఇందు పరిహరింపదగినది లేదు. 'రసోవైసః' అని శ్రుతి. రసము - ఆనందము - ఆనందమే పరబ్రహ్మ స్వరూపము.

అడవియందొంటిగా నెమలి నర్తించినట్లు - కేవలానంద రూపమైన పరబ్రహ్మమునందు ఎవడో భాగ్యశాలి యైన యతి శేఖరుడు విహరింప నేర్చును; నర్తింపగల్గును.

'శితిః కణ్ఠ యస్య సః - శితికణ్ఠః' - కంఠమున నలుపు గలవాడు, శివుడు అని శితికంఠశబ్దార్థము. ఇచట ¸°గికార్థముచే నెమలి అను అర్థమున ఉపయోగింపబడెను. నీలకంఠ శబ్దము లేదా ! అట్లే ఇదియును.

విస్తార భువన మరుతల

ముత్సాయానన్దసార రసపూర్ణే |

వరసరసి చిన్మయే7స్మిన్‌

పరహంసః కో7పి దీవ్యతిసై#్వరమ్‌ || 30

తా|| నిస్సారమైన ఎడారివంటి లోకమును వీడి, ఆత్మానంద రసపరిపూర్ణమైన జ్ఞానసరోవరమునందు స్వేచ్ఛావిహారియై విరాజిల్లు పరమహంస మూర్తి - ఎచటనోగాని కనులబడదు.

వివరము:

ఎడారియందు ఎండమావులు చెలరేగి జలభ్రాంతిని గలిగించును. వాని నందుకొని దప్పిక తీర్చుకొనవచ్చునని పరువెత్తుటయే కాని అవి అందవు, అందు జలమున్నూ లేదు. ఈపరువువలన దప్పిక మరింత పెరుగును.

ఈసంసారములోని సుఖమిట్టిది. అనగా ఎండమావులను గాంచి జలమన్న భ్రాంతితో - ఇదిగో జలము! ఇక నాలుగడుగులు! అనుచు పరువెత్తి నటులే -

సంసారమున గూడ రేపుసుఖింతుము, ఈ ఒక్క సం.రము గడచెనా బాధలేదు - ఇత్యాదిగా సుఖమును భవిష్యత్తులో భావించుచు బ్రదుకంతయు గడపుటయేకాని అందుకొన్న సుఖములేదు; అనుభవించిన హాయిలేదు, ఉండదు. సంసారము లోని సుఖమిట్టిది.

ఎవడో ప్రాజ్ఞుడు మాత్రమే ఎడారియందు నిలిచి - ఇవి ఎండమావులు, ఇది జలముకాదు, వీనికై పరువెత్తుట వ్యర్థము - అని గ్రహించి, పరువెత్తుట మాని వెనుదిరిగినట్లు -

ఎవడోజ్ఞాని విషయసుఖములనుండి విరతుడై అనగా విషయ పరాఙ్ముఖుడై - ఆత్మానందరసపరిపూర్ణమైన జ్ఞాన సరోవరమున విహరింపనేర్చును.

ఇచట 'పరహంస' అను శబ్దము - 'రాజహంస - యోగీంద్రుడు' అను అర్థముల యందుపయోగింపబడెను.

ఆత్మానుభవమున - వెనుకకు నడచుటయే పురోగమనము.

'మాండూక్యము' అని ఒక ఉపనిషత్తు. మండూకమనగా కప్ప. మాండూక్యమనగా కప్పకు సంబంధించినదని సామాన్యార్థము.

ఆ శబ్దమును గూర్చి ఒక యోగివర్యుడు ఇట్లు చెప్పెను.

మాండూక్యము అనగా కప్పనడక. కప్ప ముందుకు దూకనెంచినపుడు వెనుక కాళ్ళపై లేచి నిలచును. తరువాత దూకును. అది ముందుకు పోదలంచి తనవెనుక కదులచున్నది. అట్లే ఆత్మానుభవముకూడ వెనుకకునడక.

విషయములనుండి ఇంద్రియములకు - వానినుండి మనసు నకు -ఇలా వెనుక వెనుకకు బోవుటయే ఇచట పురోగమనము.

ఆత్మప్రాప్తికైన విష సంసద నందిచ్చుచున్నదగుటచే - ఆత్మప్రాప్తి వెనుకకు నడచుటవలన మాత్రము లభించునది యగుటచే ఇది 'మాండూక్యము'.

ఆ అర్థము ప్రాచీనులు చెప్పినదికాదు. కాని - ఇదియును సమంజసముగనే తోచుచున్నది.

కాగా విషయసుఖములు ఎండమావులలోని జలములని గ్రహించి వానివంక పరువును విరమించుట - విరమించి వెనుదిరుగుట - వెనుదిరిగి ఆత్మలాభముచే ఆనందించుట - అనునది బ్రహ్మానుభవమునకైన క్రమము.

ఈ క్రమమును అనుసరించి ఆనందసరోవరమున విహరింపగల పరమహంస ఎచటనో లభించును.

నిఖిలాగమ పల్లవితే

నిగమ శిరస్తన్త్ర శీతలోద్యానే |

మధురతర మఞ్జువాచః

కూజన్నాస్తే యతీన్ద్రకలకణ్ఠః || 31

తా|| ఒక చల్లని ఉద్యానము, అది అంతటను చివుళ్ళు దొడిగి యున్నది. అట్టి వనమును జేరిన కోయిల - మధుర మంజుల కుహుకుహూ నాదములను బచరించినట్లు -

వివిధశాస్త్రములచే ఉపబృంహితమైన ఉపనిషత్తంత్ర మును స్వాయత్తమొనరించుకొనిన యోగిసత్తముడు మధుమయభాషణుడై వర్తిల్లును.

వివరము :

నిగమశిరస్సులనగా ఉపనిషత్తులు. అవి అద్వయ బ్రహ్మానుభవమును బోధించు విషయసంపదతో విరాజిల్లుచున్నవి. అందలి విషయము సంసార తాపమును ఉపశమింప జేయునట్టిది. అందుచే అది శీతలోద్యానముగా రూపింప బడెను.

చివుళ్ళు చెట్టుకు పుష్టిని అందమును పెంచును; అట్లే వివిధ శాస్త్రపరిజ్ఞానముచే ఉపనిషదర్థము విభాసితమగును. అట్ల గుటచే శాస్త్రజ్ఞానము పల్లవసముదాయముగా రూపింపబడెను.

కోకిల వాక్కు మధురము. ఉపనిషత్తంత్రారూఢుడైన యతిశేఖరుని వాక్కు మధుమయము. అందుచే యతిసత్తముడు ఇందు కలకంఠముగా రూపింపబడెను.

యతిసత్తముడు పెదవి విప్పిన చాలును, బ్రహ్మానుభవమును గూర్చి ప్రసంగించును, అతడితరము మాటాడడు.

బ్రహ్మవిద్యను గూర్చిన ప్రసంగముకంటె మధురమైనది లేదు.

లోకములో ఎన్నో వింత వింత గాథలు ఉండవచ్చును. అవేవియును బ్రహ్మవిద్యా ప్రసంగమువలె మధురములు కావు. అవన్నియును పరులగాథలు. బ్రహ్మవిద్యయో! అది ఆత్మ కథ! తనకథ! మనకథ!

ఆలకించిన జాలును, ఆశ్చర్యమును గలిగించు గాథ! వీనులబడిన జాలును, విపరీతమైన సంసారతాపమునెల్ల ఉపశమింపజేయుగాథ |

చెవులబడిన జాలును, చిత్తమును స్వాయత్త మొనరించు కథ!

శ్రోత్ర కుహరముల జొచ్చిన జాలును, అజ్ఞానతిమిరము నంతరింపజేసి, ఆత్మసూర్యుని సాక్షాత్కరింపజేయు కథ!

అందుచే ఉపనిషత్తంత్రారూఢుడై యతిశేఖరుని వాక్కులు పరమమధురము లని తెలుపబడెను.

(ఇచట 'మఞ్జువాచః' అన్నచోట - ఆకారాన్తవాచా శబ్దము ఉపయోగింపబడి పుంవద్భావము చేయబడెను. ఇది చకారాన్త వాక్ఛబ్దము కాదు).

దారిత మోహమదేభో

దూరీకృత సకలదురితశార్దూలః |

విబుధో త్తమసింహవరో

విహరత్యానన్ద వితత కాన్తారే || 32

తా|| సువిశాలమైన ఆనంద కాంతారమున - అజ్ఞానమన్న మదగజమును మట్టు వెట్టి - పాపమెనెడు బెబ్బులిని పలాయిత మొనరించి, జ్ఞాని సింహము సాటిలేనిదై విహరించుచున్నది.

వివరము:-

'జగత్తు మిథ్యయని, బ్రహ్మ సత్యమని' - ఎవనికి నిర్ద్వంద్వముగ నిస్సంశయము తెలిసివచ్చెనో, తెలియుటయే కాదు, అనుభవమునకు అందెనో - అతడు జ్ఞాని.

కావ్య - నాటకాలంకార - శాస్త్రాదుల పరిచయ మెంత యున్నను - జగన్మిథ్యాత్వమును భావింపనివాడు, బ్రహ్మ సత్యత ననుభవింపనివాడు, ''జీవో బ్రహ్మైవ నాపరః'' - అని బ్రహ్మముతానై ప్రకాశింపనివాడు జ్ఞాని అనబడడు.

ఇట్టి జ్ఞానము - బ్రహ్మజ్ఞానము ఎవనియందు ఉదయించెనో అతడు సింహము వంటివాడు.

సింహము ఏనుగును - అదెంతబలము కలదైనను చీల్చి చెండి సంహరించినట్లు - జ్ఞానియైన యోగివర్యుడు - ఆత్మ యందనాత్మబుద్ధిని, అనాత్మయం దాత్మబుద్ధిని గల్పించుచు -చిరకాలము నుండియు బలపడియున్న అజ్ఞానమును సంహరించును.

మరియు సింహము బెబ్బులిని పారద్రోలినట్లు - జ్ఞానియైన యతి శేఖరుడు పాపమును పలాయిత మొనరించును.

శరీరేంద్రియ తాదాత్మ్యము పాపము.పాపమే కాదు, సకల పాపములకును మూలకందము. అట్టి పాపము జ్ఞాని యందుండదు.

అందుచే జ్ఞానియైన యోగిసింహము - అజ్ఞాన గజవిదారియై పలాయిత పాపశార్దూలమై ఆనందకాంతారమునందనవరతము విహరించుచుండునని వర్ణింపబడెను.

అజ్ఞాన మృగవరోజ్ఝిత

విజ్ఞానోత్తుఙ్గ శృఙ్గశిఖరితలే |

మతి సలిలశీతలాఙ్గో

యతివరకలభో విరాజతే విహరన్‌ || 33

తా|| అజ్ఞానమనెడు మృగరాజుచే విడువబడిన - విజ్ఞాన మనెడు సమున్నత శైలశిఖరమందు - ప్రజ్ఞాజలమున శీతలమైన అంగములుగల - యతివర బాలమదేభ మొండు విహరించుచున్నది.

వివరము :-

అజ్ఞాన మెంతవరకు నిలిచియుండునో - అంతవరకును - ఆత్మలాభమున కుపకరించు విజ్ఞాన మెంత ఎక్కువగా నున్నను సుఖమునీయజాలదు.

సింహము వసించు కొండకొమ్ము ఎంత ఎత్తుగానున్నను అది నిరాపదముకాదు, అభయ స్థానము కాదు. అటులే అభ్యాస వైరాగ్యములచే అజ్ఞానమును (దేహాత్మభ్రాంతిని) నివారించు కొననినాడు - కేవలమైన వేదాంత గ్రంథవిజ్ఞానము నెంత పెంచుకొనినను - అది సంసారబంధమును నివారింప జాలదు.

అట్లు కేవల వేదాంతవిజ్ఞానమే సంసారభయ నివారక మైనచో - వేదాంతగ్రంథ రచయితలు, ఉపనిషదుపన్యాసకులు - అందరును జీవన్ముక్తిని సాధించిన మహాపురుషుల కోటిలోనికే చేరియుందురు.

అభ్యాసవైరాగ్యములచే అజ్ఞానము పూర్తిగా తొలగి పోయిననాడు మాత్రమే - ఆత్మప్రాప్తికైన విజ్ఞానము అభయ స్థానమగును.

అపుడది సింహమువీడిన సమున్నత శైలశిఖరమువంటిది.

నిర్మలాచ్ఛ జలపూరమునం దవగాహనము శరీరతాపము నెల్ల హరించినట్లు - ఆత్మ విద్యాసంపన్నమైన బుద్ధి సంసార తాపము నుపశమింపజేయును.

ఒక గున్న ఏనుగు సింహమువీడిన సమున్నత శైలశిఖర మున- నిర్మలజలపూరమున నిమగ్నమగుచు- శరీర తాపమునెల్ల నివారించుకొనుచు-స్వేచ్ఛగా నిర్భయముగ విహరించినట్లు-

ఎవడో యతివరుడు మాత్రమే - అభ్యాసవైరాగ్యములచే అజ్ఞానము నివారితముకాగా - ఆత్మలాభము నొదవించు విజ్ఞానముతో నిండిన బుద్ధియందు చరించుచు (ఆత్మవిచారణ సాగించుచు) స్వతంత్రుడై (బంధము-భయము లేనివాడై) విహరింపనేర్చును.)

ఇచట అజ్ఞాన సింహములకు - విజ్ఞానశైలములకు-యతి కలభములకు-అభేదరూపకము చేసి శ్రీసదాశివేంద్రులు ఈ మహార్థమును వివరించి యున్నారు.

కేవల వేదాంతవిజ్ఞానము ప్రయోజనకారి కాదు -

దేహాత్మభ్రాంతిని తొలగించుకొనవలయును- అని తాత్పర్యము. అట్లు కానినాడు - ఈ భ్రాంతి సింహమువలె గర్జింపగా - కూడబెట్టిన ఉపనిషద్విజ్ఞాన మెంత ఎక్కడైనను పలాయనము చిత్తగించును.

నాసాఞ్చల నిహితాక్షో

నామాదిభ్యో నివారిత స్వాన్తః |

తటినీ తటేషు తత్త్వం

ధ్యాయన్నాస్తే యతిః కో7పి|| 34

తా నాసాగ్రమున కంటి చూపును నిలిపి - నామ రూపాదికమునుండి మనసును మరల్చి - నదీతీరములయందెవడో యోగిపుంగవుడు - తత్త్వచింతనపరుడై యుండనేర్చును. వివరము:-

మనసును విషయములనుండి వెనుకకు మరల్చి ఏకాగ్ర మొనరించుటకైన సాధనములలో - భ్రూమధ్యదృష్టి ప్రశస్త మైనది.

ఇదియే నాసాగ్ర దృష్టి యనబడును. నాసా అనగా నాసిక, ముక్కు. దానియొక్క అగ్రము అనగా అది ఆరంభమగుచోటు భ్రూమధ్యము. కొందరు అట్లుగాక నాసికయొక్క కొననే నాసాగ్రముగా భావింతురు. 'నాసాగ్రే నవమౌక్తికం'- అదియును యుక్తమే:! రెండును సమానఫలితమునే కలిగించును. రెండింటి అభ్యాసమువలన ప్రథమదశలో భ్రూమధ్య మునం దొక స్పందము (అదరు) అనుభవమునకు వచ్చును.

అసలు ఈదృష్టులు - అమాదృష్టి - పూర్ణిమాదృష్టి ప్రతిపద్దృష్టి - అని మూడు రకములుగా జెప్పుదురు. అమాదృష్టి యనగా కనులు మూసికొని నాసాగ్రమును - భ్రూమధ్య మును భావించుట - ధ్యానించుట - కనులనుదెరచియుంచి అదే పనిని సాగించుట - పూర్ణి మాదృష్టి. కనుల నరమోడ్పులుగా నుంచి - నాసాగ్రముపై చూపు నిలుపుట ప్రతిపద్దృష్టి.

ఇట్లు కొంచెము భేదములతో నున్న ఈ దృష్టులయందు దేని నభ్యసించినను - భ్రూమధ్యమునందలి 'పాయనిజల్‌' అను గ్రంథి చైతన్యవంతమగును. అది చైతన్య వంతమైనంతనే సాధకుడు తనదైన మానసిక వ్యాపారముతో తాదాత్మ్యమును గోల్పోవును. అనగా మానసిక చలనము లుండును గాని వానితో ఏకీభవించుట జరుగదు. ఏకీభవించుట లేదు గాన మనస్సుయొక్క వ్యాపారముకూడ దాదాపు పడి పోవును.

ఇద్దరు భాగస్వాములు కలిసి ఒక వ్యాపారమును ఆరంభించి సాగించుచుండిరి. అందు ఒకని పెట్టుబడి చాల ఎక్కువ. రెండవవాని పెట్టుబడి నామమాత్రము. ఇట్లుండగా ఎక్కువ పెట్టుబడిపెట్టిన భాగస్వామి - వానినుండి తనసొత్తుతో విడిపోయినాడు. అపుడాతక్కువ పెట్టుబడి వాడు ఒంటిగా వ్యాపారము నేమినడపును. వానికి పెట్టుబడిలేదు, బలములేదు. వానికి కాలుసేతులాడవు. అతడు వ్యాపారము సాగింపలేడు, రెన్నాళ్ళలో వాని వ్యాపారము మూతపడును. మరల కొలది పెట్టుబడితో ఇంకొకటి ఆరంభించును. అదియును ఇటులేయగును.

సరిగా ఇదే విధానము మానసికవృత్తితో - వ్యాపారముతో ఏకీభవించని వాడు - తాదాత్మ్యమును విడిచిపెట్టిననాడు- మనసుయొక్క వృత్తి నీరసించిపోవును. మనసు శిథిలమై చదికిల బడును.

భ్రూమధ్యదృష్టిని అభ్యసించిన ఉత్తమసాధకుడు తన మానసికమైన సర్వవ్యాపారమునకు సాక్షిగా (చూచువాడుగా) ఉండిపోవును.

దీనితో ఆతనికి తాను శరీరేంద్రియాదులకంటె వేరైన వాడనన్నది అనుభవమునకు అంద నారంభించును, అది క్రమముగా వృద్ధిచెందును. అనుభవమునకు పరిపూర్ణతసిద్ధించును.

ఇదొక అద్భుతమైన సాథనము. ఉనిషదర్థమును, వేదాంతవిజ్ఞానమును చక్కగా బుద్ధియందు పదిలపరచుకొని- ఈసాధనమును అభ్యాసములో నుంచిన, దేవభూములతో సంబధ మేర్పడును.

'తల్లి యున్నది. బిడ్డడున్నాడు. బిడ్డ మంచి ఆకలితో నున్నాడు. తల్లి బిడ్డకి కడుపునింపుటకై తనరొమ్ము వాని నోట బెట్టినది. వాడు ఆబగా పాలు గుడుచుకొను చున్నాడు. ఇంతలో తల్లికి వేరే పని గుర్తుకు వచ్చి- తనరొమ్మును బిడ్డనోటినుండి వెలికిదీయ యత్నించినది. వాడు తల్లి రొమ్మును వదలడు'- ఈ విషయము అందరును ఎరింగినదే.

భ్రూబధ్యదృష్టి సరిగా ఇటులే ఉండును. సాథకుడు తన అవధానమును భ్రూమధ్యమున నిలుపుచు అభ్యాసముచేయగా 'పాయనిజల్‌' అనెడి గ్రంధి చైతన్యవంతమై సాధకుని దృష్టిని బట్టుకొనును. కొంత ప్రయత్నించిన మీదట కాని సాదకుడు అటనుండి తనదృష్టి మార్చుకొనజాలనిస్థితి వచ్చును. ఎపుడిట్టి స్థితి సంభవించెనో అపుడు సాధకుడు తనకు సరియైన కేంద్రము లభించినదనియు, గ్రంధి (¸°గికభాషలో భ్రూమధ్యచక్రము- ఆజ్ఞాచక్రము) చైతన్యవంతమైనదని నిశ్చయించుకొనవచ్చును.

ఈదృష్టిచే భ్రూమధ్యకేంద్రము చైతన్యవంతమైన మీదట గూడ అభ్యాసము సాగింపగా - ఒక తటిల్లత - ఒక మెఱుపుదీన - భ్రూమధ్యమునుండి సహస్రారమునకు (మాడు పట్టు - లేక - ముచ్చిలిగుంట) పరువెత్తిపోవుటను సాధకుడు కనులు మూసికొనియుండియు దర్శించును- అనుభవించును, దానితో వానికి దేవభూములతో సంబంధ మేర్పడును. తాను చదువు కొన్న వేదాంత శాస్త్రార్థముల యాథార్థ్యము అనుభవమునకు వచ్చును.

ఈ స్థితికి చేరుకొన్నవానికి ఇదియొక వ్యసనముగా మారిపోవును. ఏకాంతమున గూర్చుండి - భ్రూమధ్యమున (నాసాంచలమున) దృష్టి నిలిపి శరీరేంద్రియములతోడి తాదాత్మ్యమును డుల్లగొట్టి ఆత్మనిష్ఠుడై యుండుటకే ఆతడు యత్నించును. శరీరేంద్రియములతోడి తాదాత్మ్యము వీడిపోవుట- ఒక అద్భుతమైన తృప్తిని - సుఖమును - ఆనందమును - హాయిని జనింపజేయును. అది వానిని అచట గట్టివేయును.1

________________________________________

1. దీనిని గూర్చి ఎంత వివరించినను జాలదు. ఇది శివనేత్రము ఇది తృతీయనేత్రము! సాధనచేసి దీనిని స్వాధీనమొనర్చుకొనుట సర్వసిద్ధికరము! ఇహాముత్రఫలభోగవిరాగియై సద్గురువు నాశ్రయించినవాడు దీని అభ్యాసమునకు అర్హుడు.

నామము-రూపము రెండును అసత్యములే! 'కుండ- మూకుడు-బాన-చట్టి-డాక-ముంత' ఇట్లు మృణ్మయపాత్రల నామ-రూప భేదము లెన్నియున్నను అవి సత్యములు కావు.

మృత్తు-మృత్తిక-అనగా మన్ను. అది ఘట శరావాదులు రూపుదాల్చుటకు పూర్వమున్నది. ఘటశరావాదు లుగా నున్నపుడును ఉన్నది. అవి విధ్వస్తము లైనపుడును ఉన్నది.

ఘట శరావాది నామరూపములో! అవి మధ్యలో కొంతకాలము మాత్రము మృత్తికయందు కల్పితము లగు చున్నవి, అందుచే అవి అసత్యములు. 'మృత్తికేత్యేవ సత్యమ్‌' అని శ్రుతి.

అట్లే బ్రహ్మమొక్కటియే సత్యము, మాయావిలాసముగా నామరూపాత్మకమైన ఈజగము దానియందు- ఆపర బ్రహ్మమునందు బొడముచున్నది, అడగుచున్నది. ఈ జగత్తు సృష్టికి పూర్వము లేదు - ప్రళయానంతరము నిలువదు. కాగానామరూపాత్మకమైన జగము సత్యము కాదు.

బ్రహ్మపదార్థమో అది త్రికాలబాధ్యము. యోగి పుంగవుడు నామ రూపాత్మకమైన జగత్తున రమింపడు. ఏకాంత నదీతీరము లాతనికి నిత్యవిహారభూములు. అచట ఆమహాత్ముడు తత్త్వ చింతనపరుడై యుండును.

నదీతీరములు అనగా గంగా, గోదావరి, కృష్ణాకావేరులు మాత్రమే కాదు. యోగి తనపిండాండము నందలి-నదుల తీరములవెంట విహరించును.

నాసారంధ్రములు రెండును ఇడ పింగళ అను నాడుల ముఖములు, ఎడమ రంధ్రము ఇడాముఖము. కుడి రంధ్రము పింగళాముఖము, శ్రాసక్రియకు సాధనములైన ఈనాడులు వెన్నుపూసకు ఇరువైపుల మూలాధారమువరకు సాగినవి. వీనకి నడుమ వెన్నుయొక్క లోపలిభాగమున సుషమ్న అను నాడి యున్నది.

ఇడకు గంగయని-పింగళకు యమున యని సుషుమ్నకు సరస్వతియనిపేర్లు. 'ఇడా భాగీరధీప్రోక్తా పింగళా యమునానదీ.'

యోగిచంద్రుడు ఇడాపింగళల సాయముతో సుషుమ్నాద్వారమును దెరచి - అటనున్న కుండలిని జాగృతనుజేసి - దానివెంట భ్రూమధ్యమునకు వచ్చి అచట తన అవధానమును నిలుపును.

ఇట్లొనర్చి యాతడు తత్త్వచింతనపరుడై - దేహేంద్రి యాదులనుండి తనస్వరూపమును వివేచించును. వేరు చేయును.

తత్త్వము అనగా యథార్థము. జగత్తు ఉన్నట్లు తోచుచున్నది. కాని - తత్త్వదృష్టితో జూడగా నిది మిథ్యయే! బ్రహ్మమొక్కటియే సత్యము. యతివరుడు నాసాంచల నిహితాక్షుడై - తత్త్వమును - యధార్థమును - సత్యమును అనుభవించును.

ఇట్టి మహనీయుడు పరమదుర్లభుడు.

ఆశావసనో మౌనీ

నైరాశ్యాలఙ్కృతః శాన్తః |

కరతలభిక్షాపాత్రః

తరుతల నిలయో మునిర్జయతి || 35

తా|| దిగంబరుడై - పెదవి విప్పి పలుకనివాడై - కోరిక లన్నవి లేకపోవుటచే భూషితుడై - శాంతుడై - తన అరచేయియే భిక్షాపాత్రముగా - వృక్షమూలమే ఆవాసముగా అంగీకరించిన మునీంద్రు డీ సంసారమును జయించుచున్నాడు.

వివరము:-

వస్త్రము శరీరావరకము. శరీరమును జుట్టియుండును. సంసారబంధ మించుకయును లేక - బ్రహ్మలీనుడైన వానికి శరీరముతో సంబధ ముండదు. అందుచే దాని కాతడు వస్త్రాది రక్షకావరణములను ఎన్నడును కల్పింపడు, అట్టి యోగియొక్క శరీరమునకు దిక్కులే అవరకములగును. అందుచే యోగి ఆశావసనుడు - దిగంబరుడు.

ఆశయనగా - దిక్కు, కోరిక అని రెండర్థములు నిరాశుడు అనగా - కోరికలు లేనివాడు. అట్టివానిధర్మము నైరాశ్యమనబడును.

బ్రహ్మాభిన్నుడై వర్తించు యోగికి కోర్కెలుండవు. అతడు నిరీహుడు. అదియే ఆతనికి అలంకారము.

ఒకడు సంన్న్యాసియైయుండి ఇది కావలె-నదికావలె - ఆశ్రమముకావలె - కారుకావలె - సమ్మానముకావలె నన్నచో వాడేమి యోగి! వాడేమి సంన్యాసి! వానికంటె విషయ లంపటుడైన గృహస్థు మేలు.

నిరీహుడైన యోగి శాంతుడై యుండును

కోరికలున్నప్పుడు అశాంతి తప్పదు. తాను కోరినదానిని సాధించుటకైన యత్నమున అశాంతి, ఆయత్నమున ఆటంకములు కల్గిన అశాంతి! ఎటులో వాంఛితార్థము సిద్ధించినను దాని రక్షణయందశాంతి! ఇట్లు కోరికలన్నవి అశాంతికి మారు పేరు.

దేహేంద్రియ తాదాత్మ్యమున్నచోట కోరికలు తొలగవు. అదిలేనిచోట నిలువవు.

కాగా యోగిపుంగవు డొకడు మాత్రమే శాంతుడు అనదగినవాడు!

అట్టివాడు తాను బిచ్చమెత్తుకొనుటకై ఒక సామాన్యమైన పాత్రనైన వాంఛింపడు. ఆకలి ఉదయించినపుడు, తమంత తాముగా ఏమైన తినుటకు బెట్టినచో - తన అరచేతినే భిక్షా పాత్రముగా ఉపయోగించును. నిజమైన యోగియొక్క వాంఛా రాహిత్యము ఇంత పరాకాష్ఠకు చేరి యుండును.

అవధూతయైనయోగీంద్రుడు తనకొక ఆవాసము కావలెనని- సౌకర్యములతో తనకొక ఆశ్రమముండవలెనని ఎన్నడును వాంఛింపడు. ఏ చెట్టు మొదటనో పడియుండును. రాజప్రాసాదమైనను - వృక్షమూల మైననుఆతనికి సమానములే!

తీవ్రవైరాగ్య సంపన్నుడైన యోగిమాత్రమే ఇట్లు వర్తింపగలడు. అతడు మాత్రమే సంసారమును గెలువగలడు.

విజన నదీకుఞ్జ గృహే

మఞ్జుల పులినైక మఞ్జుతరతల్పే |

శేతే కో7పి యతీన్ద్రః

సమరస సుఖబోధ వస్తు నిస్తన్ద్రః || 36

తా|| సమరసమై-జ్ఞానానంద స్వరూపమై యున్న వస్తువు నందు నిత్యజాగరూకుడైన యోగిమాత్రమే - నిర్జనమైన నదీ తీరమునందలి పోదరింటినే ఇల్లుగా జేకొని, మనోహరమైన ఇసుకతిన్నెనే మెత్తని శయ్యగా గైకొని - సుఖము నిద్రింప నేర్చును.

వివరము:-

ప్రకారాంతరముచే నిందు గూడ 'తీవ్రవైరాగ్యము చేతనే బ్రహ్మానుభవ మని' ఉపదేశింపబడెను.

పరబ్రహ్మమే తానన్న అనుభవమున మునిగినవాడు జనమధ్యమునందుండగోరడు. ఏకాంత నదీతీర వాసము నెన్నుకొనును. ఆ నదులు భౌతికములు కావచ్చును. పిండాండగతము లైన ఇడా - పింగళా - సుషుమ్నాది నాడీరూపమున నున్న గంగా, యమునా సరస్వతులును గావచ్చును. రెండును కావచ్చును.

యోగియొక్క స్థూలశరీరము - బ్రహ్మాండగతముపైన నదీతీరముల నివాసమునందును - ఆత్మాభిముఖుడైన ఆతని అంతరంగము - భావదార్ఢ్యముచే ఇడా పింగళల సహకారముతో జాగృతయైన కుండలినితో ఏకీభవించి - సుషుమ్నా పథమున విహరించుచు - సబీజ - నిర్బీజ - సమాధులను అనుభవించుట యందును బ్రవృత్తములై యుండును.

ఆనదీ తీరమునం దామహాత్ముడు - మెత్తని శయ్యమీద మేను వాల్చినటులు - ఏ ఇసుకతిన్నెమీదనో ఒడలెరుంగక (సమాధినిష్ఠుడై) పడియుండును.

సామాన్యజనులు శరీరనిష్ఠులు యోగిపుంగవుడు ఆత్మనిష్ఠుడు అందుచే సామాన్యజనమునకు మేను వాల్చుటకు మంచములు - పరుపులు - మెత్తలు కావలయును. బ్రహ్మవిద్యా మహితుడైన యోగి, శరీరముతో లేశమును తాదాత్మ్యమును అనుభవింపక - నిత్యసమరసమైన (హెచ్చు తగ్గు లెన్నడును లేని) జ్ఞానానంద స్వరూపమైన పరబ్రహ్మమునందు నిత్యజాగరూకుడై యుండును. అతనికి ఈ మెత్తలతో - పరుపులతో బనిలేదు.

'నిద్రించును - పరబ్రహ్మమున జాగరూకుడై యుందును - అని చెప్పుట పరస్పర విరుద్ధముగా దోచును.

నిద్రయందు- సమాధియందు గూడ - ఇంద్రియవృత్తులు - మానసిక వ్యాపారము వెనుకకు అడుగుపెట్టును. నిద్రయందావృత్తులు అజ్ఞానమున విలీనములగును సమాధియందు జ్ఞానమున జేరుకొనును.

నిద్రించుచు మేల్కొని యుండుట లేదా - మేల్కొని యుండి నిద్రించుట సమాధి. అందుచే ఇచట విరోధము లేదు. యోగిపుంగవుడు జగద్విషయమున నిద్రితుడు - ఆత్మవిషయమున జాగృతుడు.

సామాన్యలోకము జాగ్రత్‌, స్వప్న, నిద్రావస్థల నెఱుంగును. నాల్గవదైన 'సమాధి' అను అవస్థ యోగిజనైక వేద్యము. అందుచే 'నిదురించుచు మెలుకవగానుండుట' అని నంతనే సామాన్యలోకమునకు వింతగా విరుద్ధముగా దోచును.

చిరతరాభ్యాసముచే - తీవ్రవైరాగ్య సంపృత్తిచేమాత్రమే ఈ తురీయావస్థ - సమాధి అనుభవమునకు వచ్చును.

భూతల మృదుతర శయ్యః

శీతలవాతైక చామరః శాన్తః |

రాకా హిమకరదీపో

రాజతి యతిరాజశేఖరః కో7పి || 37

తా|| యతిశేఖరుడైన యోగిపుంగవునకు నేలయే మెత్తని సెజ్జ. తన అంత తానుగా కదలివచ్చు చల్లగాలియే వింజామరము. పున్నమిచంద్రుడే దీపము! ఇట్లు ప్రకృతి సిద్ధములైన వానికంటె వేరుగా తనకై ఏమియును వాఛింపని ఆత్మనిష్ఠుడు - బ్రహ్మలీనుడు అయిన యోగి సుదుర్లభుడు.

వివరము :-

పంచభూతములు సూర్యచంద్రాదులు భగవానుని సృష్టి. గృహ - గ్రామ - నగరాదులు, ఆసనములు; శయ్యలు, ఆభరణములు - దుకూలములు - రధాదికములు ఈ సర్వము మానవుడు తనదేహేంద్రియ సౌఖ్యమునకై భగవత్సృష్టిలోని వస్తుతతిని వినియోగించి. యత్నించి నిర్మించుకొన్నవి ఈనిర్మాణముల వెనుక మానవుని సంసార లంపటత్వమున్నది. అట్లు కాని నాడు వీని నిర్మాణము జరుగదు.

విషయవాంఛలే లేనిచోట- 'శయనించుటకు మెత్తని హంసతూలికాతల్పములు- చల్లగాలి ననుభవించుటకు వింజామరములు- రాత్రివేళ జీకటిని దొలగించి వెలుగును విరజిమ్ముటకు కాంతిమంతములైన దీప శ్రేష్ఠములు కావలెనన్న కోరక ఎటులుదయించును? ఇవే కాదు, ఇట్టివైన వాంఛలేవియును అవధూతయైన యోగీంద్రునియందు తలయెత్తవు,

జీవన్ముక్తుడైన మహాపురుషుడు - లోకమున నడయాడు చున్నను- వానికిని లోకమునకును ఎంతో అంతర ముండును. లోకము శరీరబద్ధము. అతడు ఆత్మనిష్ఠుడు!

అతడు యదృచ్ఛాలాభ సంతృప్తుడు! నిత్యసంతుష్టుడు!

విపుల శిలాతల ఫలకే

విమల సరిద్వారి పరివృతోదారే |

మన్దం మలయజపవనే

వాతి స్వపితి కో7పి యతిరాజః || 38

తా|| మలయ మారుతము వీచుచుండగా - తేటనీటితో నిండి కదలుచున్న నదినడుమ నొకానొక విశాలమైన శిలా తలముపై - ఎవడో యతిశేఖరుడు నిద్రింప నేర్చును.

వివరము:-

'తేటనీటితో నిండిన నది - నదినడుమ నొక చదునైన పెద్దఱాయి - మందమారుతము' ఇవి ఆరాతిపై మేనువాల్చవలె నన్న లోభ మెవరికైనను జనింపజేయును.

కాని దానిపై బ్రహ్మలీనుడైన మహాపురుషుడు ఎంత నిశ్చింతగా శయనించునో - అంత నిశ్చింతగా సంసారబద్ధులు శయనింప జాలరు.

ఆత్మస్వరూపము ఎరుకకు అందని వాడు - అంతటి మనో హర దేశమును జేరికూడ - సాంసారిక తాపమునే అనుభవించును.

''ఓయీ! నీవు ఈలోకమున సుఖమునిచ్చు వస్తువులను సమకూర్చుకొనుటకై ఎంత యత్నించినను - ఎన్నిటిని సమకూర్చుకొనినను ఆత్మజ్ఞానసంపన్నత లేకున్న సుఖింపజాలవు. చక్కని సుఖమునందించు వస్తువుల నడుమకూడ తపించుచునే యుందువు; క్లేశమునే అనుభవించు చుందువు.

ఆత్మజ్ఞాన సంపన్నుడ వైతివా, సుఖమును సమకూర్చువస్తువులే కావలెననిలేదు. ఎచట నున్నను సుఖమునకు ఆనంద మునకు వెలితి యుండదు. నీవునిత్యానందమయుడవు.

సంసారమునుండి విరక్తుడవై ఆత్మోపలబ్ధికై యత్నింపుము. నిత్యానందమయుడవై విరాజిల్లుము - అని ఉపదేశము.

ఆన్తర మేకం కిఞ్చిత్‌

నన్తత మనుసన్ద ధన్మౌనీ |

కరపుట భిక్షా మశ్నన్‌

అటతి హి వీథ్యా జడాకృతిః కో7పి || 39

తా|| అన్నిటికిని లోనిదైన వస్తువు నెద్దానినో సంతత మును ధ్యానించుచు, మౌనియై - కరతల భిక్షాశనుడై - జడుని వలె వీధులయందు బర్యటించు మహాత్ములు అరుదుగా నుందురు.

వివరము :-

శరీరముకంటె ఇంద్రియములు - వానికంటె మనస్సు - దానికంటెను బుద్ధి - లోపలివి. కాగా - దానికిని లోపలిది ఆత్మవస్తువు, పరబ్రహ్మము.

పోయ్యిమీద గిన్నె - గిన్నెలోనీరు - నీటిలోబియ్యము, బియ్యము ఉడికెను. ఎట్లు ఉడికెను? వేడి ఎటనుండి లభించినది?

నీటినుండి లభించినది, నీటికి వెచ్చదనము సహజగుణమా? కాదు, గిన్నెనుండి ఉష్ణశక్తి నీటికి చేరినది. గిన్నెకును వేడిమి సహజగుణముకాదు. సహజోష్ణమైనది అగ్నిమాత్రమే.

తత్సామీప్యముచే గిన్నెకు - దానిద్వారా నీటికి - నీటి నుండి బియ్యమునకు ఉష్ణధర్మము సంక్రమించినది.

అట్లే పరమాత్మ సామీప్యముచే బుద్ధి చైతన్యవంత మగుచున్నది. ఆచైతన్యమే మనసునకు ఇంద్రియములకు, దేహమునకు సంక్రమించుచున్నది.

ఈ సత్యమును పామరుడు గుర్తింపడు. గుర్తించిన ప్రాజ్ఞుడు - దేహేంద్రియాదులు స్వస్వ కర్మములయందు విచేష్టితము లగుచుండగా - వీనిని లక్షింపక ఈ అన్నిటికిని కారణ మైన వస్తువునందు ధ్యానము నిలుపును.

చెవి ఆలించుచున్నది. కన్ను చూచు చున్నది. ప్రాజ్ఞుడు ఆవినబడు శబ్దమును, ఈ కనబడు దృశ్యమును భావింపడు, ఆశబ్దమును ఆలకించుటకు, ఈ దృశ్యమును దిలకించుటకు ఉపకరణములై యున్నా శ్రోత్ర - నేత్రములనుగూడ లక్షింపడు. వీని వెనుక పని సేయుచున్న అంతరంగమును గూడ గమనింపడు. ఏ చైతన్య సామీప్యముచే ఈ శ్రవణ దర్శనాది కార్యములు జరుగుచున్నవో - ఆ చైతన్యమును - ఆత్మవస్తువును - భావించును, ధ్యానించును.

శరీరేంద్రియాదులయొక్క చలనము లన్నియును ప్రాజ్ఞునకు బ్రహ్మానుధ్యానమున దోహదకారులే. ఏశరీరేంద్రియ చలనములు సామాన్యునకు సంసారమును దెచ్చిపెట్టుచున్నవో - అవే చలనములు ప్రాజ్ఞునకు పరమాత్మను సాక్షాత్కరింప జేయును.

అందుచే బ్రహ్మలీనుడైన యోగి సదా పరధ్యానములో నుండును. తత్త్వ మెరుంగని లోక మట్టివానిని జడుడుగా భావించుటలో ఆశ్చర్యములేదు.

పరమాత్మను ధ్యానించుచు దేహేంద్రియాదులకు దవ్వైయున్నవాడు ఎవరితో ఏమి మాటాడును! కాగా బ్రహ్మవిద్వరుడు మౌని!

అట్టివాడు తన శరీర రక్షణమునకై ఏమియును యత్నింపడు. సంగ్రహింపడు. ఎవరైన తమంతదామై ఏమైన పెట్టిన తన చేతిలో దానిని గ్రహించునే కాని - వానియొద్ద భిక్షాపాత్ర కూడ ఉండదు.

అట్టి మహాపురుషుడు శరీరముచే వీధులలో విహరించుగాక ! కాని అతడు సదా బ్రహ్మముతానై బ్రహ్మమునందే విహరించును. ధన్యతముడైన ఇట్టి యోగీంద్రుడు సుదుర్లభుడు.

ప్రవిలాప్య జగదశేషం

పరిశిష్టాఖణ్డ వస్తుపరతన్త్రః |

ప్రాశ్నాతి కబళ మాస్యే

ప్రాప్తం ప్రారబ్ధకర్మణా కో7పి || 40

తా|| సమస్తమైన జగత్తును - అనగా భూతపంచకమును ఒకదానియందొకటి విలీన మొనరించి (11 వ శ్లోకమున జెప్పినట్లు) సర్వకారణ కారణముగా మిగిలియున్న అఖండపరబ్రహ్మ వస్తువున నిలచినవాడై యతి శేఖరుడు ప్రారబ్ధకర్మమువలన సంప్రాప్తమైన తనయత్నములేకయే నోటికి అందివచ్చిన ఆహారమును భుజింపుచు వర్తిల్లును.

వివరము:-

పంచమహాభూతములను విపరీతక్రమమున ఒకదాని యందు వేరొకదానిని విలీనమొనర్చు విధానమును గూర్చి 11-వ శ్లోకమున వివరింపబడెను.

కారణభిన్నమై కార్యముండదు. అనగా ఏకార్యమును తత్కారణముకంటె వేరైనది కాదు. కారణమందే కార్యము కల్పిత మగుచున్నది.

కారణము- నిమిత్త-ఉపాదాన భేదములచే రెండు రకములు. కుండయున్నది. అది నిర్మిత మగుటయందు- కుమ్మరి, వాని సారె (చక్రము) మొదలగునవి నిమిత్త కారణములు. దానియం దంతటను వ్యాపించియున్న మృత్తు (మట్టి) ఉపాదాన కారణము. దేనితో ఒక వస్తువు నిర్మితమగు చున్నదో దానిని ఉపాదానకారణము అందురు.

సాధారణముగా నిమిత్తోపాదాన కారణములు వేరుగా నుండును. కానికొన్నిచోట్ల నిమిత్తకారణమే ఉపాదానకారణ మగుచుండును.

సాలెగూడున్నది. దాని నెవరు నిర్మించుచున్నారు? సాలెపురుగే దానిని నిర్మించుచున్నది. అందుచే ఆపురుగు దాని నిర్మితియందు నిమిత్త కారణ మగుచున్నది. ఆగూడు దేనితో నిర్మితమగుచున్నదో అదికదా ఉపాదాన కారణము! అది సన్నని దారములతో నిర్మిత మగుచున్నది. అయితే ఆదారములను అసాలెపురుగు ఎటనుండియో తీసికొనిరాలేదు. ఆ దారములు దానినుండియే పుట్టినవి. ఈ కారణముచే సాలెగూడు నిర్మాణములో ఉపాదాన కారణముగూడ సాలెపురుగే!

ఇటులే ఈ జగన్నిర్మాణమున పరమాత్మయే నిమిత్తోపా దాన కారణములుగా నున్నాడు. "తత్‌ సృష్ట్వా తదేవాను ప్రావిశత్‌"-అని శ్రుతి. (దాని సృజించి దానియందే ప్రవే శించెను.)

సాలెగూడును నిర్మించినది సాలెపురుగు. ఆ దారములు సాలెపురుగునుండియే వచ్చినవి. ఇట్లు నిర్మితమైన గూటినడుమ సాలెపురుగే నివసించు చున్నది.

ఇదేవిధమున పరమాత్మ తానే నిమిత్తో పాదాన కారణములై ఈ జగమును నిర్మించి దీనియందు దాను వసించుచున్నాడు

భూమికి జలము, జలమున కగ్ని, దానికి గాలి, దానికి ఆకాశము కారణములు కాగా- ఆకాశము పరమాత్మనండి పొడముచున్నది. ఇట్లు అది సర్వకారణకాఱణము. ఆ పరమాత్మకు కారణములేదు.

దేనికి కారణమున్నదో దానికి ఉత్పత్తి లయము ఉండును.దేనికి ఒకకారణములేదో అది అనాది అనంతము. ఆనాద్యనంతవస్తువన్నను కారణరహితమైన వస్తువన్నను ఒక్కటే. "యోగీంద్రుడు సర్వజగత్తును పరమకారణమైన పరమాత్మయందు విలీన మొనరించి దానియందు నిలుచును అని చెప్పబడెను

అచట నిలుచుట అన్నది కూడ లేదు. అన్నిటిని పరమ కారణవస్తువునందు (బ్రహ్మమును) విలీన మొనరించు వేళ-తాను కూడ దానితోబాటు బాటు అందు విలీనమై పోవును. ఈ విలీనస్థితియే పరమాత్మయందు నిలుచుటగా జెప్పబడెను.

అట్టి యోగిపుంగవునకును శరీరముండును. అతనికి శరీరమేల నిలిచియున్నది?అనగా కర్మవశమున నిలిచి యున్నది యని సమాధానము.

కర్మము 'ప్రారబ్ధము-ఆగామి- సంచితము' అవి మూడు రకములు. విలుకాడు ఒక బాణమును వదలి వేరొకదానిని చేతబట్టి- మరికొన్నిటిని అమ్ములపొదిలో పూని యున్నట్లు ఈ కర్మములుండును.

వదలిన బాణమువంటిది ప్రారబ్ధము. (ప్ర+అరబ్ధము) చేతబట్టియున్న బాణము వంటిది ఆగామి, అమ్ములపొదియందున్న బాణముల వంటిది సంచితము.

చేతిలో నున్న బాణమును, అమ్ములపొదిలోని వానిని ప్రయోగింపకుండ ఉండగలము. కాని వదలిన బాణమును నిలుపగలమా? అది తన లక్ష్యమును జేరితీరును. అందుచే 'అనుభవముచేగాని ప్రారబ్ధకర్మము నశింపదు' అనివారు. "ప్రారబ్ధం భోగతో నశ్యేత్‌!" ఏకర్మఫలానుభవమునకై ఈ శరీర మేర్పడినదో- ఆ కర్మానుభవము సమాప్తము కానిదేఈ శరీరము తొలగదు. ఆగామి నంచిత కర్మఫలములను అనుభవింపకుండ నివారించుకొనవచ్చును. ప్రారబ్ధకర్మఫలము నివారించుట వీలుకాదు.

యోగిపుంగవుడు తన కడుపు నింపుకొనుటకై తానేమియును యత్నింపడు. ప్రారబ్ధ కర్మవశమున ఎవడోవచ్చి తన నోరుదెరచి- ఏమైన ఆహారము నోటిలో బెట్టిన దానిని మ్రింగును. అంతే!

క్షుత్పిపాసల అథిక్యమును ఎవరు సహింపగలరు? యోగి మాత్రము ఎట్లుసహించును? అన్న శంక పుట్టుచున్నది.

క్షుత్పిపాసలు శరీరధర్మములు, యోగికి శరీరముతో సంబంధములేదు. అందుచే క్షుత్పిపాసలు శరీరముతో తాదాత్మ్యముగల లోకమును బాధించునేగాని దేహేంద్రియ విలక్షణుడై ప్రకాశించు యోగిని ఏమియును చేయజాలవు. అని సమాధానము.

మరియును-"కంఠ కూపే క్షుత్పిపాసా నివృత్తిః" అని పాతంజలయోగసూత్రము. విశుద్ధ చక్రస్థానమైన కంఠదేశణున పంయమము సాధించిన వానికి ఆకలి దప్పులుండవు- అని పతం జలి చెప్పినమాట. అట్టివానికి సూర్యకిరణములనుండియే శరీర పోషణమునకైన ప్రాణశక్తి లభించును. మహాయోగులకు ఈప్రక్రియ తనంతతానుగా సిద్ధించును. అందువలన యోగి ఆహారాన్వేషణ మొనరింపడు.

ఇట్టి యోగీంద్రుడు లోకమునందుండ వచ్చునుగాని వాని దర్శనము సులభముకాదు.

నిన్దతి కిమపి నయోగీ

నన్దతినైవాపరం కిమప్యన్తః |

చన్దన శీతల హృదయః

కన్దలితానంద మన్ధరః స్వాస్తే|| 41

తా| యోగిపుంగవు డెవనిని నిందింపడు; స్తుతింపడు. అతని మనమునందు నిందాస్తుతులు ఉదయింపవు. ఆమహాపురుషుడు- చందనమువలె చల్లని హృదయము గలవాడై- మోసులెత్తిన ఆనందముచే బరవశుడై - మంథరవృత్తియై సుఖముండును.

వివరము:-

మనసులో ద్వేషముదయించిన నిందించుట, శ్రద్ధా గౌరవము లుదయించిన స్తుతించుట సంభవించును.

ఆత్మనిష్ఠుని మానసము నిర్వికారముగ నుండును. అందుచే అత డపకారినిసైతము నిందింపడు. ఎంతటి మహోపకారినైనను వినుతింపడు.

కాషాయములు గట్టియు- నిందాస్తుతులు పరిధియందే యున్నవానికి బ్రహ్మానుభవము సిద్ధింపలేదన్నది నిశ్చయము.

భౌతికమైన లక్ష్య మెవనిని బలముగా ఆకర్షించుచున్నదో- వాని నడకలో వోగము, చేతలో బలము, మాటలో ఒక క్రమము ఉండును. పరధ్యానమునందున్నవాని మనో వాక్కాయములు భౌతికలక్ష్యములచే అకృష్టములు కావు. పరధ్యాన మనగా బ్రహ్మానుభవము,

ఉబుకుచున్న ఆనందముచే బరవశుడైన యోగియొక్క శరీరేంద్రియాదులు తమఅంత తాము ఏదో కదలుచుండును. వానితో నాతనికి తాదాత్మ్యముండదు. అందుచే అతని శరీరేంద్రియ వృత్తులయందు వేగము లోపించును.

అత డానందమయుడు! బ్రహ్మమయుడు!

సన్త్యజ్య శాస్త్రజాలం

సంవ్యవహారంచ సర్వతస్త్యక్త్వా|

ఆశ్రిత్య పూర్ణపదనీం

ఆస్తే నిష్కమ్పదీపవద్యోగీ ||

తా|| యోగికి శాస్త్రముతో బనిలేదు; లోకముతో వ్యవహారముండదు. రెండింటిని అతడువిడిచిపెట్టును: పరిత్యజించును. సర్వతః పూర్ణమైన పరబ్రహ్మము నాశ్రయించి - (అందు విలీనుడై) నిష్కంపదీవమువలె విరాజిల్లును.

వివరము:-

చీకటిరాత్రి- కాలినడక-తోటలలో ప్రయాణము-సంభవించినపుడు వెనుకటిరోజులలో - కాగడా చేతబట్టి- లేదా కొబ్బరి ఆకులవంటివి వెలిగించి- ఆమంట వెలుగులో దారి చూచుకొనుచు వెళ్ళెడివారు. ఇట్టివానికి ఉల్కాహస్తుడు, (ఉల్క-కాలుచున్న కర్ర; చేతియందు గలవాడు) అని పేరు, వానికి గమ్యము చేరువరకు మాత్రమే ఉల్కతో బని, దానిని ఆరిపోకుండ-చక్కగ వెలుతురు ప్రసరించునట్లు రక్షించు కొనుట గమ్యము చేరువరకు మాత్రమే అవసరము. గమ్యము చేరినమీదట గూడ దానిని చేత ధరించి వర్తిల్లడు. ఒకచోబారవేయును.దానిని బట్టించుకొనడు.

అట్టిదే శాస్త్రము. అజ్ఞానమన్న కారుచీకటిలో పయనించుచున్నవానికి శాస్త్రమన్న దివ్వె అవసరము. జ్ఞానసూర్యుడుదయింపగా అదివ్వెతో అక్కర తీరిపోవును.

అజ్ఞానమునివారితమై బ్రహ్మానుభవము సిద్ధించినవానికి శాస్త్రముతో నేమి పని?

శాస్త్రజ్ఞానము మేడమెట్ల వంటిది. మేడ పైభాగము వంటిది. బ్రహ్మానుభవము-మేడపైభాగమునకు జేరుకొన్నవాడు మెట్లవరసను లక్షింపడు. ఆత్మానుభవసంపన్నతకై శాస్త్రము. అది లభింపగా శాస్త్రము- ఇల్లు ఊడ్చిన తరువాత చీపురు వంటిది. అది విసర్జింపబడును.

గాలిసోకగా దీపముచలించును. ప్రాపంచిక వాసనాజాలముచే చిత్తము చలించును. ఆ వాసనలకు దూరముగా బ్రహ్మము తానై యున్న యోగి నిష్కంపదీపమే!

తృణ పఙ్క చర్చితాఙ్గ

స్తృణమివ విశ్వం విలోకయన్‌ యోగీ|

విహరతి రహసి జనాన్తే

విజరామర భూమ్ని నిత్యవిశ్రాన్తః || 43

తా| బురదతో-పెంటతో నిత్యమలిన శరీరియైయుండి కూడ యోగి-వ ఈసకల విశ్వము నొక గడ్డిపరకగా జూచును. ఏకాంత రహస్య దేశమునందున్న వాడై- జరామరణరహితమైన పరబ్రహ్మమున నిత్యవిహరణ శీలియై- విశ్రాంతుడై యొప్పారును.

వివరము:-

మాలిన్యముచే అట్టకట్టిన-ధూళిధూసరమై తృణ శకలములంటియున్న దేహము, ఎవనికైనను చీదరపుట్టించును. స్వచ్ఛజలస్నానము చేసినగాని వానికి సుఖముగా నుండదు.

మహాయోగియందు శరీరము తానన్న భావము లేశమును మిగిలియుండదు. అందుచే అతడు శరీర మెంత బురద బురదగానున్నను పట్టించుకొనడు. దానికి శుభ్రతను కల్పింపయత్నింపడు.

చూడగా నింత నిర్ధనుడు. కాని అత డీవిశ్వమున కేమియు విలువనీయడు. దీని నొక గడ్డిపరకగా జూచును. జరామరణములు లేని-పునరావృత్తి రహితమైన నిత్యసత్యవస్తువు నెన్నడు నెడబాయక విశ్రాంతుడై చెలగు ఆమహాపురుషుడు-

జరామరణములన్న సుడిగుండమున జిక్కి, మునుగుచు, దేలుచు-ఉక్కిరిబిక్కిరి యగుచున్న విశ్వమును గడ్డిపరకగా జూచుటలో ఆశ్యర్య మేమున్నది?

పశ్యతి కిమపి నరూపం

నవదతి-నశ్రుణోతి-కిఞ్చిదపి వచనమ్‌|

తిష్ఠతి నిరుపమ భూమని

నిష్ఠామవలమ్బ్య కాష్ఠ వద్యోగీ||44

తా|| యోగిదర్శన శ్రవణ భాషణాదులకు దూరుడై యుండును. అత డేమియును దిలకింపడు. ఏమియును ఆలకింపడు. ఏమియును మాటాడడు.

సాటిలేని పరబ్రహ్మవస్తువునందు నిష్ఠగలవాడై కాష్ఠము వలె నిశ్చలుడై విరాజిల్లును.

వివరము:-

మనస్సు విషయాసక్తము కానపుడు కన్ను తెరచి యున్ననురూపదర్శనముకాదు. చెవులు మూసుకొనక పోయినను శబ్దము గ్రహింపబడదు. ఏ ఇంద్రియమైనను మనస్సు విషయభాముఖమైనపుడు మాత్రమే క్రియాశీల మగును. విషయ గ్రహణము చేయును.

అట్లు కానినాడు 'ఆఫీసు తెరచియున్నది కాని పని చేయుటలేదు' అనినటులుండును.

బ్రహ్మనిష్ఠుడైన యోగికి విషయానుభవ మెట్లు కలుగును? మహారాష్ట్రములోని భూకంపమును అస్సాములో నున్నవా డెటు లనుభవించును?

రూపదర్శన-శబ్దశ్రవణ-వాక్సంభాషణాదికము ఇంద్రియ నిష్ఠునియందు సంభవించును. అద్వితీయ పరబ్రహ్మమునందత్యంతము నిమగ్నుడైన యోగి కఱ్ఱవలె చలనము లేని వాడై విరాజిల్లును,

'యస్యత్వస్య సర్వమాత్మైవాభూత్‌-తత్కేనకంపశ్యేత్‌'- అని శ్రుతి. సర్వమును ఆత్మస్వరూపమే అని ఎవనికి విదితమైనదో- అనుభవమున కందినదో- వాడు దేనితో జూచును? దేనిని దర్శించును? చూచుచున్నది- చూడబడుచున్నది ఆత్మభిన్నములు కావుకదా! కాగా యోగి శబ్దస్పర్శరూపాదికము ననుభవింపడు- తననే తాననుభవించును.

జాత్యభిమాన విహీనః

జన్తుషు సర్వత్ర పూర్ణతాం పశ్యన్‌|

గూఢం చరతి యతీన్ద్రో

మూఢవదఖిలాగమార్థ తత్త్వజ్ఞః || 45

తా|| యోగికి జాత్యభిమాన ముండదు. సర్వప్రాణుల నాతడు బ్రహ్మముగానే దర్శించును, సకల శాస్త్రార్థ రహస్యముల నెరింగినవాడైకూడ- అజ్ఞజనము మూఢు డీతడని భావించునట్లు నిగూఢవృత్తియై చరించును.

వివరము:-

'జన్మనాజాతిః'- పాణినీయము. పుట్టుకచే జాతి ఏర్పడుచున్నది. పుట్టునది శరీరమేకాని ఆత్మవస్తువు కాదు. దానికి జననమరణములు లేవు.

'న జాయతే మ్రియతే వాకదాచిత్‌

నాయం భూత్వాభవితా వా నభూయః అని గీత.

శరీరనిష్ఠములకు జాత్యభిమాన ముండును. బ్రహ్మనిష్ఠుడు- వీడు బ్రాహ్మణుడు- వీడు శూద్రుడు అన్న జాతిభేదమును భావించును- వీడు నావాడు, వీడు పరుడు- అన్న అభిమాన ద్వేషాదులకు నిలయుడై వర్తింపడు.

అతడుశరీరము నెన్నడును లక్షింపడు. సర్వమునందును పరబ్రహ్మమునే దర్శించును.

'శునిచైవ శ్వపాకే చ పణ్డితా స్సమదర్శినః' గీత.

పుట్టుగ్రుడ్డి పున్నమిచంద్రునిసౌందర్యమునేమి అనుభవింపగలడు? అజ్ఞజనము ప్రాజ్ఞుడైన యోగీంద్రుని చర్యల నేమి గమనింపగలరు? వారాతని నొక మూఢునిగా భావింతురు. ఆయోగికి మానావమానములు సమానములు. పైగా లోకమాతనిని మూఢునిగా భావించుట అతనికి మహాలాభము. అతని ఏకాంతమునకు భంగముండదు.

యోగి సర్వజ్ఞుడై యుండియు మూఢునివలె గన్పట్టును!

ఉపధాయ బాహుమూలం

పరిధాయాకాశ మవని మాస్తీర్య |

ప్రస్వపితి విరతివనితాం

పరిరభ్యాసన్ద పరవశః కో7పి|| 49

తా||యోగి తనచేతినే తలగడగా జేసికొని- ఆకాశమునే కట్టుబట్టగా గైకొని-భూతలమునే మృదుతల్పముగా జేకొని- వైరాగ్యమన్న ప్రియురాలిని గాఢము కౌగలించుకొని ఆనందపరవశుడై యుండును.

వివరము:-

ధరించుటకు చక్కని వస్త్రములు, శయనించుటకు హంసతూలికాతల్పములు, తలక్రిందకు మెత్తని దిండ్లు - ఇత్యాదులపై కోరిక శరీరనిష్ఠునకు, ఆత్మనిష్ఠునకు వీనితో బనిలేదు.

విషయాసక్తుడు ప్రియాపరిష్వంగమున బరవశించును. యోగికి తీవ్రవైరాగ్యమే ప్రియురాలు. అతడు వైరాగ్యమునే గాఢము హత్తియుండి ఆనందపరశుడగును.

లోక మనుభవించునది విషయానందము! యోగి అనుభవించునది బ్రహ్మనందము! అది సీమితము! ఇది నిస్సీమము! అది నశ్వరము! ఇది శాశ్వతము!

గతభేదవాసనాభిః

స్వప్రజ్ఞోదారవార నారీభిః |

రమతే సహ యతిరాజః

త్రయ్యన్తాన్తః పురేకో7పి|| 4

తా|| భేదమునెన్నని సొగసుకత్తెలైన వెలయాండ్రతో రాజు తన అంతఃపురములో రమించినట్లు-యోగీంద్రుడు జాతిభేదమును విషయవాసనలను విసర్జించి, బ్రహ్మానుసంధానపరములై రమణీయములైన బుద్ధివృత్తులతో ఉపనిషదంతఃపురమున గ్రీడించుచుండును.

వివరము:

వారవనితలు-వీడు- వాడు అన్న భేదములేనివారై, సొమ్మిచ్చిన జాలును, ఎవనితో నైనను గూడి విహరింతురు. వారియందు భేదభావము వాసనకైనను ఉండదు. భేదమెన్నుట వారి వృత్తికి భంగకరము,

శరీరేంద్రియనిష్ఠుడైతమ భోగమును సాగించుకొనుటకు సమర్థుడైన ప్రభువు ఇట్టి సొగసుకత్తెలైన వెలయాండ్రును ఎన్నికజేసి తెచ్చి- అంతఃపురములో వారితో గూడి విహరించును.

బ్రహ్మాన్వేషణ పరములైన బుద్ధివృత్తులయందు భేదభావమునకు, విషయవాసనలకు ఆవంతయైనను అవకాశము లేదు అవియున్నచో బ్రహ్మానుసంధాన మెట్లు సాగును?

వారవనితలు తమ సొగసుచే ఒయ్యారముచే తమ్ము గూడిన ప్రభువరు చిత్తము నలరించినట్లు - భేదవాసనారహితము లైన బుద్ధివృత్తులు యోగీంద్రునకు బ్రహ్మానంద పారవశ్యమును గల్గించును.

అంతఃవురమన్నది లోపల ఎచటనో ఉండును. అచటి కందరును జేరలేరు.

బ్రహ్మజ్ఞానము నుపదేశించు ఉపనిషత్తులు వేదశీర్షములు. వాని భావము నందుకొనగల్గుట కష్టము.

ప్రభువునకు అంతఃపురము విహారభూమి! యోగివర్యునకు ఉపనిషదర్థము! విహారభూమి! ఒకటి విషయానందము వేరొకటి బ్రహ్మానందము!

వైరాగ్య విపులమార్గం

విజ్ఞానోద్దామ దీపికోద్దీప్తమ్‌ |

ఆరుహ్యతత్త్వహర్మ్యం

ముక్త్యాసహ మోదతే యతిరాట్‌|| 48

తా|| వైరాగ్య మను విశాలమైన మెట్లవరుస గుండా- విజ్ఞానమనెడి పెనుదివ్వెచే ప్రకాశవంతమై యున్న- నిత్య సత్య వస్తువైన పరబ్రహ్మ మనెడి మేడపై కెక్కి - యతిరాజు ముక్తి కాంతతో గూడి ఆనందించుచుండును.

వివరము:-

మెట్లు లేనిదే మేడపైకి ఎక్కుట సంభవము కాదు. అది చక్కని మెట్లవరస అయినచో సుఖముగా అధిరోహింపవచ్చును.

పరబ్రహ్మమన్న సమున్నత ప్రసాదము నధిరోహించుటకు వైరాగ్యమే చక్కని మెట్లదారి.

ఎటులో మేడమీదకు చేరుకొన్నను. అది దీపము లేని చీకటికోణమైనచో - అచట ఒకటి వేరొకటిగా దోచును. అట్లే తగిన విజ్ఞానము లేకయే-తీవ్ర ధ్యాన విధానాదుల నవలింబించి- ఎవడైనను దేహేంద్రియ వైలక్షణ్యమును అనుభవించినను- వాడా అనుభవమును సరిగా గుర్తింపజాలడు. అట్టివాడు తన భ్రాంతిమయోపదేశములచే లోకమును తప్పుదారిని బట్టించును.

శ్రీ శంకరభాగవత్పాదులకు బూర్వము తరువాతకూడ, తగినంత విజ్ఞానములేకయే తమదైన సాధనచే దేహేంద్రియ విలక్షణమైన భవ్యస్థితిని అనుభవించినవార లున్నారు.

కానివారు తగిన విజ్ఞానము లేనివారైనందున, ఆస్థితినందుకొనియు- సత్యమును అనుభవింపజాలనివారై లోకమునకు అద్వైతభిన్నములైన పలుమార్గములు ఉపదేశించుచు వచ్చిరి.

తగిన విజ్ఞానములేని బ్రహ్మానుభవము దీపములేని మేడ. (మహారత్నము లభించినను-దాని వెల తెలియనివాడు వాని దారిద్ర్యము తొలగదు) అందుచే గురూపదేశముచే పరోక్షజ్ఞానమును సంపాదించుకొని -ఎడతెగని వైరాగ్యాభ్యాసములచే-బ్రహ్మాత్త్మెక్యమును అనుభవింప వలయును.

ఎవడో యోగిపుంగవుడు మాత్రమే ఇట్టి బ్రహ్మాను భవమును గడించి - ముక్తి కాంతాసాహచర్యముచే జెన్నొందనేర్చును.

విజనతలోత్పల మాలాం

వనితావైతృష్ణ్య కల్పవల్లీం చ |

అపమానామృత ఘటికాం

ఆత్మజ్ఞః కో7పి గృహ్ణాతి || 49

తా || ఏకాంతవాసమును చక్కని పూలదండగా - వనితల తోడి విహారము నెడ పరాఙ్ముఖతను కల్పవృక్షపుదీవగా- అవమానమున అమృతఘటికగా-ఆత్మజ్ఞాన సంపన్నుడు మాత్రమే స్వీకరింపగలడు.

వివరము:-

సాధారణలోకము శబ్ద స్పర్శ రూప రస గంథాత్మక విషయములందు రమించును. ఏకాంతప్రదేశమునందు ఇవి లభింపవు.

అందుచే విషయాభిముఖి ప్రవృత్తి గల లోకమునకు ఏకాంతవాసము కంటకకిరీటమువలె మహాదుఃఖమును గలిగించును.

విషయవిరతుడైన యోగి దానిని (ఏకాంతవాసమును) కలువపూల దండనువలె ఆనందముతో స్వీకరించును.

శరీరమును వీడిన తరువాతగూడ- స్వర్గాది పుణ్య లోకములయందు అప్సరఃకాంతాసమాగమమును వాంఛించిన వారై యజ్ఞయాగాది కర్మములయందు ప్రవర్తిల్లెడి జనులు కాంతలయెడ పరాఙ్ముఖులై వర్తిల్లుటయా? అట్టి స్థితి విసపుదీపవలె వారికి మహాదుఃఖమును దెచ్చి పెట్టును.

కాని యోగిపుంగవుడు లోకవిరుద్ధముగా కాంతావిహారసౌఖ్యమునందు -తనలో ఉదయించిన రోతను (జుగుప్సను, అసహ్యతను) కల్పలతికనువోలె స్వీకరించును, ఆదరించును, సంరక్షించును.

లోకమునకు అవమానము విషము! సమ్మాన మమృతము! యోగి అవమానము అమృతముగా స్వీకరించును,

అతని ఏకాంతదేశ బ్రహ్మాత్త్మెక్యమునకు- లోకమొనరించు అవమానమును మహోపకార మొనరించునుగదా!

మహాయోగి మాత్రమే ఇటులుండగలడు!

ననిషేధతి దోషధియా

గుణబుద్ధ్యావా న కిఞ్చిదాదత్తే!

ఆవిద్యక మఖిలమితి

జ్ఞాత్వోదాస్తే మునిః కో7పి|| 5

తా|| యోగి యీలోకమునందు ఎద్దానినైనను దోషమని భావించి పరిహరింపడు, గుణముగా దలంచి స్వీకరింపడు. అతనికి గుణదోషములు సమానములే! అన్నియును అవిద్యావిలాసములే! అతడన్నిటియెడ ఉదాసీనుడై యుండును.

వివరము:-

'జడ-చేతన-గుణ-దోషమయ-విశ్వకీన్హకర్తార'- తులసీదాసు.

("జడ-చేతనములను, గుణ-దోషములను కలియబోసీ పరమాత్మ యీలోకమును సృజించెను"

దోషమేకాదు గుణముకూడ మాయావిలాసమే! పాపమే కాదు. పుణ్యమ కూడ ఆత్మోపలబ్ధికి ఆటంకమే. దుష్కృతము దుఃఖానుభవమునకై శరీరబంధమును దెచ్చిపెట్టు చున్నది. సుకృతము సుఖానుభవమునకై శరీరమును గల్పించు చున్నది. రెండును బ్రహ్మనందానుభవమునుండి దిగజార్చునవియే.

అందుచే యోగిపుంగవుడు దోషమని యెంచి దేనినీ ద్వేషింపడు. గుణమని ఎంచి దేనినీ ఆదరింపడు. అతడు సర్వమైన అనాత్మవస్తువులయందును- అది గుణమైనను- దోషమైనను ఉదాసీనతనే-ఉపేక్షాభావమునే వహించును.

భూతం కిమపి నమనుతే

భావిచ కిఞ్చిన్న చిన్తయత్యన్తః|

పశ్యతిన పురోవర్త్యపి వస్తు

సమస్తార్థ సమరసః కో7పి|| 51

తా|| జీవన్ముక్తుడైన మహాత్ముడు - భూతార్థములను భావింపడు, భవిష్యదర్థములను జింతింపడు. సమస్తార్థముల యందును. సమరస బుద్ధి గలవాడై (బ్రహ్మముగా దర్శించువాడై) తన ఎదుటనున్న దానిని సైతము తిలకింపడు.

వివరము:-

భూతము అనగా గడచినది, భావి లేక భవిష్యతు అనగా రానున్నది. రెండింటికిని నడుమనున్నది వర్తమానము

లోకము అధికసమయము భూతార్థభావనమందో - భవిష్యదర్థచింతనమునందో తన్నుదామరచి వర్తిల్లును. కేవల వర్తమానమునందదినిలువదు.

లోకముయొక్క యీస్థితి స్వప్నమువంటిది. కల వంటిది. మన మెచట శయనించినామో ఆ ప్రదేశము- ఆ పరిసరములు కలయందు విస్మరింపబడును. ఏవో ప్రదేశములు- ఎవరో వ్యక్తులు కానవత్తురు.

అటులే తమ చిన్నదనములో - ¸°వనారంభమున ఎపుడో జరిగిన ఏదో విషయమును భావించుచు లోకము వర్తమానార్థమును తత్కాలమున విస్మరించు చుండును. అట్లే ఇది యిట్లు చేయవలయును, ఇది యిట్లు జరుగవలెనన్న భవిష్యద్విషయోహల తో వర్తమానమును విస్మరించుచుండును.

కలయందు వర్తమానార్థము విస్మృతమై ఏదో ఏదో కానవచ్చినటులే ఇందును జరుగుచున్నదికదా! అందుచే లోకముయొక్క యీస్థితి (గతార్థభావనము భవిష్యదర్థచింతనము) స్వప్నసదృశము.

ఇక వర్తమాన మున్నది. అది నిరంతరము. భవిష్యదర్థము నుండి జనించుచు భుతముగా (గడచినదిగా) మారి పోవుచున్నది. వర్తమానము ఇట్లు భూతభవిష్యత్తులతో పెన వేసికొని యున్నదగుటచే ఇదియును తత్తుల్యమేకాని వేరైనది కాదు. (ఇంతకును ఇవన్నియు మనోవిలాసములే)

ఆత్మవస్తువునందు నిత్యజాగరూకుడైన యోగియం దీ స్వప్న ముండదు. భూత- భవిష్యద్వర్తమానార్థ చింతన ముండదు. అతడు జరిగినదానిని జరుగబోయెడుదానిని మాత్రమే కాదు. వర్తమానమున దన ఎదుట నున్నదానిని సైతము భావింపడు, తిలకింపదు.

సర్వం బ్రహ్మమయమన్న భావనగలవాడై - నిత్య సమరస బుద్దియై - (కాలాతీతుడై) విరాజిల్లును.

ఇట్టి యోగిపుంగవుడు వెదుకగా వెదుకగా ఎచటనైన లభించునేమో!

నిగృహీతాఖిల కరణః

నిర్మృష్టాశేష విషయేహః |

తృప్తి మనుత్తమ సీమాం

ప్రాప్తః పర్యటతి కో7పి యతివర్యః || 52

తా|| ఇంద్రియముల నన్నిటిని బిగియబట్టి- నిలువరించి' విషయవాసనల నన్నిటిని తొలగబెట్టి-తుడిచిపెట్టి, సర్వాధికమైన-బ్రహ్మానందసీమయందు ఎవడో యతి శేఖరుడుమాత్రమే విహరింపగలడు.

వివరములు:-

'ఇంద్రస్య-ఆత్మనః-నిఙ్గం- జ్ఞాపకం- ఇన్ద్రియం' ఆత్మవస్తుపును సూచించునది యగుటచే ఇంద్రియము. శ్రోత్రాదులైన ఇంద్రియములు పని చేయుచున్నవి. ఎట్లు పని చేయుచున్నవి.?

ఆత్మసామీప్యముచే బుద్ధియందు ప్రతిఫలించిన చైతన్యమును మనస్సుద్వారా అందుకొని అవి పని చేయుచున్నవి.

గిన్నెలోని నీళ్ళు మరుగుచు- క్రింద అగ్ని జ్వలించుచున్నదని తెలియజేయుచున్నట్లు-ఇంద్రియమలు తాము పని సేయుచు-తమ వెనుకనున్న ఆత్మను జ్ఞప్తికి దెచ్చుచున్నవి. అందుచే వీనికి ఇంద్రియములని పేరేర్పడెను. విషయజ్ఞానమునకు సాధనము లగుటచే ఇవి 'కరణములు' అనబడెను కరణము అనగా సాధనము.

"యధా ప్రదీపేన కరణన రూపముపలభ్యతే-తథా చక్షుషాపి కరణన రూపముపలభ్యతే | ఏవ వేతరాణ్యపి కరణాని|| "

-శంకరభవత్పాదులవారు.

చికటిలోనున్న వస్తువుయొక్క రూపమును గ్రహించుటకు దీపము సాధనముగా ఉపయోగించు చున్నట్లు - రూపగ్రహణమున కన్ను సాధనముగా ఉపయోగించుచున్నది. ఇంద్రియము లన్నియును ఇటులేసాధనములుగా ఉపయోగపడు చున్నవి.

శబ్దగ్రహణమున చెవి-స్పర్శగ్రహణమున త్వగింద్రియము- రూపగ్రహణమున నేత్రము- రసవిషయమున జిహ్వ-గంథ విషయమున నాసిక-సాధనములై కరణము లనబడు చున్నవి.

నేరుపు గలవాడు సాధనమును జక్కగ వినియోగించి శ్రేయమొందును. నేరుపు లేనివాడు వానిని ఉపయోగించుకొనుట చేతకాక ప్రమాదమున జిక్కుకొనును.

గుఱ్ఱమున్నది, సైకిలున్నది. అవి ప్రయాణమున సాధనములే. వానిని నడుపుట ఒక నేర్పు. ఆనేర్పు లేనివాడు ప్రమాదమున బడిపోవుచున్నాడు. ఇది మన ఎరుకలోనిదే!

అట్లే ఇంద్రియములును పామరుని బ్రమాదమున బడదోయుచున్నది. ప్రాజ్ఞుడు వానినే బిగియబట్టి, నిగ్రహించి శ్రేయమందుచున్నాడు.

ఒక గుఱ్ఱమునో-ఇతర వాహనమునో ప్రమాదము లేకుండ నడపుటకు నిగ్రహించుటకు నేర్పు కావలయును. ఇంద్రియములను నిగ్రహించుటకు దానికంటెను నేర్పు అవసరము. 'మనఃషష్ఠానీన్ద్రియాణి' శ్రోత్రాది పంచకము-మానసము ఈ ఆరును జ్ఞానేంద్రియములు వాగాది పంచకము కర్మేంద్రియములు. ఈ ఇంద్రియములు శబ్దాదివిషయములను మనసునకు అందించుచున్నవి. మనసుపై ఈ విషయములు విహరింపగా-అచట వాని వాదనలు పేరుకొనుచున్నవి. అట్లు పేరుకొన్న వాసనలచే బ్రేరితమై మనస్సు విషయాభిలాషతో ఇంద్రియములను గదలించుచున్నది.

కొడుకు తెచ్చిన మద్యమును ద్రావి మత్తిల్లినవాడు తద్వాసనచే బ్రేరితుడై- మరల మరల కొడుకును ఆ మద్యమున దెచ్చి అందించుమని ప్రేరణ చేసినట్లు-

విషయసుఖమత్తమై- తద్వాసనచే గదలిన మనస్సు ఇంద్రియములను బౌనఃపున్యముగా విషయములవంక బరువెత్తించుచున్నది. మనసుయొక్కు ఈప్రవృత్తికి తద్గత విషయవాసనయే కారణము.

యోగి తన అంతఃకరణమునుండి విషయవాసనలను నిరంతర బ్రహ్మభావనచే దుడిచిపెట్టివేయును. వాసనలే లేవు, అభిలాష ఎట్లు జనించును?

శ్రీ మద్రామాయణమున ఋష్యశృంగుని కథయున్నది. వయసులోనున్న సొగసుకత్తెలైన వారవనితలు రాచుకొని తిరిగినను ఆయన అంతరంగమున విషయాభిలాష జనింపలేదు- ఏల ఉదయింపలేదు ఆ మహాత్ముని అంతరంగమున విషయవాసనలే లేవు.

మహాయోగుల అంతరంగము-విషయవాసనారహితమై శుద్ధమై యుండును. ఇట్టి మహానీయులు నిస్సీమానంద దేశమున నిరంతరము విహరించుచుందురు.

సన్త్యజతి నోపపన్నం

నాసమ్పన్నం చ వాఞ్ఛతి క్వాపి |

స్వస్థః శేతే యతిరా

డాన్తర మానన్ద మనుభవన్నేకః|| 53

తా|| యోగి తనకు ఉపలబ్ధమైనదానిని కాదనడు అనుప లబ్ధమును వాంఛింపడు. ఆంతరానందానుభవమగ్నుడై స్వస్థుడై యుండును.

వివరము:-

"శరీరమునకు నిత్యము ప్రాతవస్తువు కావలెను. మనసుకు నిత్యము నూతన వస్తువుకావలెను. ఇది వాని స్వభావనము."

ఏమంచము-ఏదిండు-ఏగది-ఏవాహనము ఉపయోగించుట జరుగుచున్నదో శరీరమునకు అదే మంచము-అదేదిండు-అదేగది-అదేవాహనము కావలెను. మారినచో సుఖముండదు. ఇట్లు శరీరము అన్నిటిని వెనుకటివానినే కోరుకొనును.

మనసు అట్లు కాదు. దానికి నిత్యము క్రొత్తది కావలయును. ఏ కథవిని ఇంతవరకును ఆనందించుట జరిగెనో అదే కథ వినుటకు మనసు సుముఖము కాదు. ఇష్టపడదు.

ఏ సుందరి పొందుకై ఇంతవరకు తపించెనో అది లభించిన పిమ్మట దానియెడవిరక్తమై క్రొత్తదానిని వాంఛించును.

ఏదియైనను తనకు లభింపనంతవరకు మాత్రమే మనసు దానికై ఆరాటపడును. లభించినమీదట దానియెడ విరక్తమై వేరొకటి క్రొత్తది కావలెను. అందుచే ఆరాటమే కాని ఆనంద మన్నది మనసుద్వారా లభించుట కల్ల,

'అదేదో అది' లభించిన చాలును. నాకు వేరేమియు అక్కరలేదు. అని మనసు ప్రతిజ్ఞలు పలుకును. 'అదేదో అది' లభించినది. వెంటనే మనసు తన ప్రతిజ్ఞను గాలికి వదలి వేయును. లభించిన దానియెడ అసంతృప్తమై-వేరొకదానికై కుతూహలమును వ్యక్తపరచును.

యోగియొక్క మానసము సామాన్యలోకముయొక్క మానసమునకు భిన్నముగా నుండును.

'లభించినదానియెడ నిరసనభావము'

లభింపనిదానియెడ వాంఛాలక్షణము'

యోగి మానసమునందుండవు. అతని మానసము అపారమైన అంతరానందమున- దేనికి సాటియన్నది లేదో- అట్టి బ్రహ్మానందమున నిత్యతృప్తమై-అన్యవాంఛారహితమైయుండుటయే దీనికి హేతువు.

ఈ లోకమునందెవరును సుఖముగా శయనించుట లేదు. రేపు-'ఇది చేయవలయును. అది సంపాదింపవలెను. ఈ అడ్డమును తొలగించుకొనవలయును' - ఇత్యాదిగా బహువిధములైన ఆవేదనలతోడనే లోకము శయ్యపై మేనువాల్చుచున్నది.

యోగిపుంగవుడు మాత్రమే స్వస్థభావముతో శయనించును.

కాషుపి విమలాం పదవీం

ఆసాద్యానన్దసంవిదున్నిద్రామ్‌|

అన్తే భిక్షుక ఏకో

విహరన్నిర్ముక్త బన్ధనః సై#్వరమ్‌|| 45

తా|| జ్ఞానానందములు నిత్యజాగృతములై- వికసితములై వర్తిల్లు-విమలమైన-అనిర్వచనీయ స్థానమును జేరుకొన్నవాడై బంధరహితుడై, సర్వవిధముల స్వతంత్రుడై భిక్షకు డొకడు విహరించు చున్నాడు.

విరరము:-

'దేశములో రాష్ట్రపతి పదవి పెద్దపదవి. ఆయన సర్వ విధముల స్వతంత్రుడు. ఆ పదవి ఎవనికో భాగ్యవంతునకు లభించును' - అని చెప్పుటలో అర్థమున్నది.

కాని ఎవడో భిక్షకుడు. తిన తిండి-కట్ట బట్ట తలదాచుకొనుటకు ఒక చిన్న పూరిగుడిశ అయినను లేనివాడు అపారానందమును అనుభవించుచున్న స్వతంత్రుడని చెప్పుచున్నారా? ఇదేమి విడ్డూరము? అనిపించును?

రాష్ట్రపతి పదవియైనను భయరహితముకాదు. భయరహితమైనచో అంగరక్షకు లెందులకు? అది శాశ్వతమును కాదు. భయస్థానమున లబించు ఆనంద మేమి ఆనందము?

భిక్షుకుడు- కట్టబట్టలేనివాడు- తిన దిండి లేనివాడు - అని మనము భావించు యోగిపుంగవుడో! ఆయన గతమును భావింపడు. భవిష్యత్తును జింతింపడు! బ్రహ్మానందసామ్రాజ్యపట్టాభిషిక్తుడైన అతనికి బ్రహ్మాదులును సాటికారు. అందుచే అతడొకడు మాత్రమే ఉన్నత పదవియందుండి ఆపారానందమును అనుభవించుచున్నాడు.

వస్తు న్యస్తమి తాఖిల

విశ్వవిహారే విలీనమనాః|

రాజతి పరానపేక్షో

రాజా7ఖిల వీతరాగాణామ్‌|| 55

తా|| సర్వవిశ్వవిహారము ఎందు అస్తమించి కానరాకుండ బోవుచున్నదో-అట్టి వస్తువునందు (పరబ్రహ్మమునందు) వీలీనమైన మానసము గలవాడై-వైరాగ్యభాగ్యసంపన్నులలో జాక్రవర్తియై యతి శేఖరుడొకడు ఇత రాపేక్ష లేనివాడై విరాజిల్లు చున్నాడు.

వివరము:-

కలలో విహరించుట ఎంతవకు? మెలకువ రానంతవరకు. మెలకువ వచ్చినంతనే స్వప్నవిహారమెల్ల అస్తమించుచున్నది. కలలోని ఆవస్తువులు-వ్యక్తులు-వానియందేర్పడన రాగద్వేషాదులు-ఈర్ష్యా భయకంపాదులు ఇవన్నియును అదృశ్యము లగుచున్నవి. జాగృతియందు, మెలకువయందు అస్తమించుచున్నవి.

అట్లే అజ్ఞానమన్న పెనునిద్దురయందేర్పడిన యీ విశ్వస్వప్నమెల్ల-ఆత్మజ్ఞానరూపమైన జాగృతి ఉదయించినంతనే అస్తమించిపోవుచున్నది. అనగా ఆత్మవిద్య ఉపలబ్ధమైనంతనే విశ్వస్వప్న విహారము పరిసమాప్త మగుచున్నది. సర్వమైన విశ్వము ఆత్మోపలబ్ధియం దంతర్హితమై పోవుచున్నది.

బ్రహ్మాభిన్నమైన అట్టి స్వాత్మవస్తువునందు ఎవడు నిలువనేర్చునో- వాని ఆనందానుభూతికి ఇతర వస్తువులతో అక్కర యుండదు.

వైరాగ్యమనగా విరక్తి; ఇహాముత్ర ఫలభోగమునందు అనాసక్తి. అది లేకున్న బ్రహ్మానుభవము సున్న. ఆ వైరాగ్యమైనను అసాధారణమైయుండవలయును. అపుడే విశ్వస్వప్నము తిరోహితమగును. లేకున్న సగము నిద్దుర- సగము మెలకువ అయిన దశయందువలె విశ్వస్వప్నము ఖండఖండములుగా అనువర్తించుచుండనేగాని పూర్తిగా దొలగదు.

ఎవడో అసాధారణవైరాగ్య సంపన్నుడైన యతిలోక చక్రవర్తి మాత్రమే ఈ స్థితి నందుకొని విరాజిల్లును.

ఆచార్యా పాఙ్గ దృశా

సమవాప్తా పార సంవిదాకారః|

ప్రశమిత సకల విభేదః

పరహంసః కశ్చిదాభాతి|| 56

తా|| శ్రీగురుకరుణాకటాక్షముచే-అంతములేని జ్ఞానము యొక్క ఆకారమును అందుకొన్నవాడై-పరమహంస యొకడు అస్తమితాఖిల భేదభావనుడై విరాజిల్లుచున్నాడు.

వివరము:-

గురువులేని విద్య కుంటివిద్య. ఏవిద్యనైనను గురువు లేకయే అందుకొనగలరేమో కాని, శ్రీగురుని కరుణలేక ఆత్మవిద్య అలవడదు.

ప్రపుల్లమైన అంతరంగముతో గురువొనరించు 'తత్త్వమసి' ఇత్యాది మహావాక్యార్థోపదేశ##మే శ్రీగురుని కరుణ. దానిచే మాత్రమే ఆజ్ఞానవిలాసమైన సంసారము నివర్తించును. ఎవడైనను మహావాక్యార్థ మననముచేతనే- 'శరీరము తాను కాననియు, అపారమైన సంవిత్తు, అనగా జ్ఞానము, అదే తన రూపమనియు గ్రహింప నేర్చును.

అపుడు వానికి సర్వమును ఆత్మస్వరూపముగ అనుభవమునకు వచ్చును. ఆత్మకంటె - బ్రహ్మముకంటె వేరైన దెద్దియును గోచరింపదు. అందుచే అతనియందు లేశమును భేదభావము మిగిలియుండదు.

ఇట్టి స్థితి నందుగొనిన పరమహంసయైన యోగీంద్రుడొక్కడు మాత్రమే చిదానందాకృతియై విరాజిల్లును, 'హన్తీతి-హంసః' హన హింసా గత్యోః. 'నడచువాడు' పోవువాడు' అని హంసశబ్దమునకు అర్థము.

ఎవడీ సంసారచక్రమునుండి పరమాత్మవంకకు బోవుటకైచక్కనిమార్గము నేర్పరచుకొని, అందు సాగుచున్నాడో-పోవుచున్నాడో వాడు హంస. అనగా యోగి, యతి. వారిలో శ్రేష్ఠుడు 'పరహంస, పరమహంస'.

పామరమైన లోకమెల్ల సంసారమునుండి కదలనిదే. ప్రాజ్ఞులయందు గూడ ఎవడో మహానీయుడు మాత్రమే 'హంస-పరమహంస' పదము నందుకొనును. అతనికి మాత్రమే భేదరహితమైన బ్రహ్మానుభవము సాధ్యము, అదియైనను శ్రీగురుకరుణావిశేషముచే మాత్రమే లభించును.

వర్ణాశ్రమ వ్యవస్థాం

విధూయ విధ్యాదీన్‌ |

పరిశిష్యతే యతీన్ద్రః

పరిపూర్ణాసన్ద బోధమాత్రేణ || 5

తా|| అఖండానందమయమైన బ్రహ్మమును గూర్చిన బోధము ఆవిర్భవింపగా - యతిశేఖరుడు వర్ణాశ్రమ వ్యవస్థను మీఱి-బ్రహ్మాదులను క్రిందొనరించి, అద్వితీయ పరబ్రహ్మవస్తువై విభాసించుచున్నాడు.

వివరము:-

బ్రాహ్మాణాది వర్ణవ్యవస్థను-ఆశ్రమవ్యవస్థను పాలింపవలసినవారు ఎవరు! శరీరేంద్రియనిష్ఠులు ఈ వ్యవస్థను పాలించుట తప్పదు.

శరీరేంద్రియ విలక్షణమైన ఆత్మ స్వరూపమును గుర్తించి బ్రహ్మమే తానన్న బోధమున నిలిచినవానికి పర్ణము లేమిటి? ఆశ్రమము లేమిటి?

'చండాలో7స్తు సతుద్విజో7స్తు గురురిత్యేషా

మనీషా మమ' -మనీషాపంచకము.

వాడు బ్రాహ్మణుడై నను చండాలుడైనను సర్వలోక పూజ్యుడే, ఆ మహానుభావుడు ఇతరుల యెడను- బ్రాహ్మణాది వర్ణజనిత-ఆశ్రమజనిత భేదభావములను బ్రదర్శింపడు. సర్వమును బ్రహ్మమయముగా అనుభవించును.

బ్రహ్మవిద్వరేణ్యుడైన యోగీంద్రుడు తృణీకృతబ్రహ్మపురందరుడు, అనగా ఇంద్రపదవిని-బ్రహ్మపదవిని గడ్డిపరకగా జూచును.

బ్రహ్మయొక్క ఆయువు ఎంత ఎక్కువయైనను దానికిని అంతమున్నది. 'అద్య బ్రహ్మణః- ద్వితీయపదార్థే' అని సంకల్పములో చెప్పుచన్నారు.

పర+అర్ధము=గొప్పదైన సగము, బ్రహ్మయొక్క ఆయువు చాలపెద్దది. దానిని రెండు సగములుగా జేసినపుడు అవి చాల పెద్దవైన రెండు సగములు-అర్థభాగములు అగును. మొదటి సగము ప్రథమ పదార్థము. రెండవ సగము ద్వితీయపదార్థము.

ఇపుడున్న బ్రహ్మకు ఏబదేండ్లు గడచిపోయినవి. ఆరవపదిలో బడినాడు. ఈద్వితీయ పదార్థము పరిసమాప్తమైనచో ఈ బ్రహ్మయుండడు, వేరొకడు బ్రహ్మపదము నధిష్ఠించును.

ఇట్లు బ్రహ్మాదుల పదవులు అశాశ్వతములై యుండగా యోగి శాశ్వతమైన-పునరావృత్తి రహితమైన (న సపునరావర్తతే) పరబ్రహ్మము తానై ప్రకాశించు చున్నాడు.

శాశ్వతుడు నశ్వరుని గ్రిందుసేయుటయం దాశ్చర్యమేమున్నది?

అఖండానందమయ పరబ్రహ్మము తానన్న అనుభవము నందుకొన్నవాడు విశ్వాతీతుడై-బ్రహ్మాధికుడై-అద్వితీయుడై అలరారుచున్నాడు.

శ్రీసదాశివ బ్రహ్మేంద్రులవారు ఇంతవరకును ఆత్మ విద్యావిలాసమైన జీవన్ముక్తిని బ్రస్తుతించినవారై-గ్రంథోపసంహారముగా ఇకమీదట విదేహముక్తిని వినుతించుచున్నారు.

క్షయ ముపనీయ సమస్తం

కర్మ ప్రారబ్ధ ముపభుజ్య |

ప్రవిగలిత దేహబన్ధః

ప్రాజ్ఞో బ్రహ్మైవ కేవలం భవతి|| 58

తా|| అసంగుడై- ఆత్మనిష్ఠుడై చరించుటచే సంచిత, అగామికర్మములను, అనుభవముచే ప్రారబ్ధకర్మమును క్షయింపజేసినవాడై యోగీంద్రుడు- దేహము రాలిపోగా కేవల పరబ్రహ్మమే తానగుచున్నాడు.

వివరము:-

తప ఆదికముచే సంచిత ఆగామి కర్మములు మాత్రమే నశించును. ప్రారబ్ధము (ఏ కర్మఫలానుభవమునకై శరీర మేర్పడినదో అది) అనుభవముచేతనే నశించును, (ప్రారబ్ధంభోగతో నశ్యేత్‌).

ఈ గ్రంథమునం దింతవరకు ఏ ఆత్మవిద్యావైభవము బ్రస్తుతింపబడెనో - దానినిస్వాయత్త మొనరించుకొని సదా ఆత్మనిష్ఠుడై-దేహేంద్రియములతోడి తాదాత్మ్యమునుబూర్తిగ విడిచిపెట్టి అసంగుడై చరించుటద్వారా-

విస్తరలోనున్న అన్నము, వండబడుచున్న అన్నమువలె సంచిత ఆగామి కర్మములు యోగీంద్రుని అనుభవమునకు రాకయే నశించును.

విస్తరలో నున్నదైనను- పండబడుచున్నదైనను తినగోరువాని అనుభవమునకు వచ్చునేగాని- ఇచ్ఛారహితుడై ప్రవృత్తిలేనివానికి వాని అనుభవ మెట్లు సిద్ధించును?

ప్రారబ్ధము మాత్రము ఇదివరకే తిన్న అన్నమువలె తినపని తాను జేయక విరమింపదు. కాగా అసంగుడై చరించుటచే సంచిత ఆగామి కర్మములు నశించును. అనుభవముచే ప్రారబ్ధ కర్మము నశించును.

ప్రాజ్ఞుడైన యోగీంద్రు డిట్లు సర్వకర్మములను విలయమొనరించుటచే - దేహపాతానంతరము - తిరుగ దేహమును దాల్చుటకు దగిన కర్మమే శేషించి యుండదు.

అతడు శరీరముతో మన నడుమ నడయాడుచున్నప్పుడే బ్రహ్మమై యున్నాడు గదా! శరీరపాతానంతరము- వేరొకశరీరమును మొలకెత్తించు శరీర మెద్దియును శేషించి యుండని దశయందు కేవల పరబ్రహ్మమే యగుచున్నాడు.

ప్రాజ్ఞుడు దేహపాతానంతరము కేవల పరబ్రహ్మమే తానగుచున్నాడని జెప్పినారుకదా! ఆ పరబ్రహ్మ మెట్టిదో నాలుగు శ్లోకములలో వివరించు చున్నారు.

స్తిమిత మసన్తమనాద్యం

é సన్తత మానన్ద బోధఘనమ్‌|

అవికల్ప మాద్యమేకం

సన్మాత్రం విద్యతే కిమపి|| 59

తా|| కదలికలేనిదై-మొదలు చివర లేనిదై-జ్ఞానానంద పరిపూర్ణమై-వికల్పరహితమై- సత్తామాత్రముగ విరాజిల్లు అనిర్వచనీయ వస్తు వొకటి (పరబ్రహ్మము) విభాసిల్లు చున్నది.

వివరము:-

యోగీంద్రుడు దేహపాతానంతరము కేవల పరబ్రహ్మ మగుచున్నాడని చెప్పుటచే-బ్రహ్మస్వరూప మెట్టిదై యుండునని పాఠకుని మానసము తడువుకొనునని-సదాశివబ్రహ్మేంద్రులవారు నాలుగు శ్లోకములలో పరబ్రహ్మస్వరూపమును దిఙ్మాత్రముగ సూచించు చున్నారు.

వివరము:-

పరబ్రహ్మము స్తిమితము-అనంతము-అనాది.

ఎచట రెండవ వస్తువు లేదో అచట కదలిక యుండుటకు వీలులేదు. అంతటను వెలితియన్నది లేక - అద్వితీయమై పరబ్రహ్మము అలరారుచున్నది. దానియందు చలనముండదు. అది స్తిమితమైనది.

సృష్టికి బూర్వము-ప్రలయమునకు బిమ్మటగూడ నిర్వికారమై యుంéడునది యగుటచే పరబ్రహ్మము అనాది అనంతము

పరిపూర్ణజ్ఞానానందములే దాని రూపము. అన్యమన్నది లేక ఒంటిగా విరాజిల్లుచున్న దగుటచే అది వికల్పరహితము. రెండవది లేదు. అందుచే అది అద్వితీయము.

రెండవది లేదని అనుట ఎట్లు? జ్ఞానము ఆనందము రెండు కావా? అనిపించును. అవి రెండు కావు. ఒక్కటే. జ్ఞానానందములుగా నున్న దొక్కటియే. అదే జ్ఞానము. అదే ఆనందము.

పోనిమ్ము, బ్రహ్మభిన్నమై ప్రపంచమున్నదిగదా? బ్రహ్మము అద్వితొయమనుట ఎట్లు కుదురును అని జిజ్ఞాస ఉదయించును.

అభ్యాస దశయందున్నవారికై ఈ ప్రపంచము బ్రహ్మభిన్నమని చెప్పబడెను. ఈ ప్రపంచముకూడ బ్రహ్మమే-బ్రహ్మవ్యతరిక్తము కాదు.

కార్యము కారణముకంటె వేరైనది కాదు, ఒక మట్టి కడవ యున్నది. కడవగా నున్నప్పుడును- పగిలి ముక్కలైనపుడును, కడవగా మారుటకు పూర్వమును-అది మన్నే-మట్టి యందే నామరూపములు కల్పితములయ్యెను. కల్పితము అసత్యము. అది మృత్తే. మృద్భిన్న మెన్నడును. కాదు.

పరబ్రహ్మము నాశ్రయించి చెలగిన మాయయొక్క విలాసముగా ఉదయించిన-ఈ నామరూపాత్మక ప్రపంచము గూడ-పరమకారణమైన పరబ్రహ్మము కంటె వేరైనది ఎట్లగును?

అందుచే అభ్యాసారంభమున-ప్రపంచము వేరు. బ్రహ్మము వేరు. అనాత్మవస్తువు-ఆత్మవస్తువు అని చెప్పుదురు.

అభ్యాసముయొక్క - పూర్ణావస్థయందో అనగా సిద్ధానవస్థయందు- 'సర్వం ఖల్విదం బ్రహ్మ', 'నేహనానాస్తికించన', ఉన్నదొక్కటే, రెండవది లేదు, లేనేలేదు, అని అనుభవమునకు వచ్చును.

కుండలు ఎన్నిరకములుగా-ఎన్ని పేరులతో గోచరించుచున్నను ప్రాజ్ఞుడు అదెల్ల మృత్తే అని తలంచినట్లు- ఆత్మ విద్యాసంపన్నుడుగూడ సర్వమును అద్వితీయ పరబ్రహ్మమున అనుభవించును.

'విచారే7ప్యయ మేవార్థో7యమేవార్థో7విచారణ' జ్ఞాని విచారించి 'ఉన్నదొక్కటే' యని గ్రహించుగాక! అజ్ఞాని తత్త్వమును గ్రహింపజాలక నానాత్వమును భావించుగాక!

ఉన్నదొక్కటే! దానియందు మార్పులేదు. అది సన్మాత్రము,

'సన్మాత్రము'-అను ఈ పదము అద్భుతమైనది. సత్త-అనగా ఉనికి, 'ఉనికియే' బ్రహ్మస్వరూపము అనిఈపదము తెలుపుచున్నది.

'దేహమున్నది; ప్రపంచమున్నది' అన్నపుడు వీనికి గారణమైన వస్తువొకటి యున్నదని ఊహకు అందుచున్నది. అదేదో ఆ పరమకారణ వస్తువుయొక్క ఉనికియే అనుభవమునకు అందుచున్నదిగాని-వస్త్వనుభవము సంభవము కాదు.

అందుచే పరబ్రహ్మము సన్మాత్రము, కేవల సత్తాస్వరూపము. ఉనికియే రూపముగా గలది. ఈ సత్త-ఈఉనికి జ్ఞానానందములకంటె వేరైనది కాదు. 'సచ్చిదానందములు' అను మూడు శబ్దములచే ఇది పేర్కొనబడుగాక! ఇందు స్వగతభేదము లేశమును లేదు. ఈ సత్‌-చిత్‌-ఆనందములు-ఒకదానికంటె ఒకటి వేరైనవి కావు,

(గురూపదేశ పూర్వకమైన నిరంతరాభ్యాసముచే మాత్రమే దీనిని దెలియగలరు.)

శరీరమును వీడిన పిమ్మట యోగి యిట్టి పరబ్రహ్మము. కేవల పరబ్రహ్మమే తానగుచున్నాడని తాత్పర్యము.

అక్షర మజర మజాతం

సూక్ష్మతరాపూర్య శుద్ధ విజ్ఞానమ్‌|

ప్రగళిత సర్వ క్లేశం

పరతత్వం వర్తతే కిమపి|| 9

తా|| ఆ పరబ్రహ్మము జన్మ-జరా-మరణములు లేనిది, మిక్కిలి సూక్ష్మమైనది, అందుక్లేశమన్నది లేశమును లేదు. సర్వతత్త్వములకును అవ్వలిదై - అద్వితీయమై ప్రకాశించు చున్నది.

వివరము:-

జన్మ-జరా-మరణములు దేహమునకు పరబ్రహ్మమో!

"న జాయతే మ్రియతేవా కదాచిత్‌|

నాయం భూత్వా భవితావా నభూయః" ||-గీత.

దానికి జన్మ-జరా-మరణములు లేవు.

ఘట శరావాది నామరూపము లెన్ని కల్పితములై అణగారినను, మృత్తు జనన మరణము లందినట్లు కాదు.

మాయావిలాసముగా ఈ ప్రపంచ మెన్నో విధముల గల్పితమై పెరిగి విరిగి తరుగుగాక!

ఈమాయ దేని నాశ్రయించి చెలగుచున్నదో, దేనియందణగారుచున్నదో ఆ పరబ్రహ్మము నిర్వికారమే. అందుచే పరబ్రహ్మము అక్షరము, అజరము, అజాతము.

ఈ పరబ్రహ్మము ఒక వస్తువుగా కాదు, కేవలము సత్తగా (ఉనికిగా) సన్మాత్రముగా అనుభవింప దగినది. అందుచే దీనికంటె సూక్ష్మమైనది ఉండనేరదు.

సుఖము-దుఃఖము దేహేంద్రియాంతఃకరణముల వరకును సాగి రాగలవు. అటు తరువాత సాగలేవు.

సర్వతత్త్వములకును అవ్వలిదైన పరబ్రహ్మమునందు వానికి బ్రవేశము సంభవము కాదు. అందుచే అది క్లేశరహిత మైనది.

జ్ఞానస్వరూపమైన ఆ పరబ్రహ్మము అనిర్వచనీయము-అద్వితీయము.

యోగి శరీరపాతానంతరము ఇట్టి కేవల పరబ్రహ్మము తానగుచున్నాడు. అనగా-బ్రహ్మ వస్తువునకు వాడబడిన సర్వ విశేషణములు అతనికి చెందినవియే అగుచున్నవి.

సుఖతర మమర మదూరం

సారం సంసార వారిధే స్తీరమ్‌|

సమరన మభయ మపారం

తత్కిఞ్చన విద్యతే తత్త్వమ్‌||

తా|| ఆ పరబ్రహ్మము సుఖస్వరూపము. అనినాశి నిత్య సన్నిహితము. సంసార సముద్రమునకు తీరభూమి. అది నిత్యసరమరసము, అభయస్థానము. అంతములేనిది. అనిర్వచనీయము. అద్వితీయము.

యోగి పుంగవుడు దేహపాతానంతరము-ఇట్టి అద్వితీయ-అనిర్వచనీయ పరబ్రహ్మము తానై, పునరావృత్తి రహితుడై విరాజిల్లును.

వివరము:-

ఎంత దగ్గరలో నున్న వస్తువైనను సూక్ష్మముగా బరిశీలించినపుడు దానికిని మనకును నడుమ కొంత అంతరముండక తప్పదు.

కాని పరబ్రహ్మము అట్లు కాదు. అదే మనమైయున్నాము. అందుచే దానికంటె సన్నిహితమైన- నిత్యసన్నిహితమైన-ఎన్నడును ఎడబాయని-దూరరహితమైన వస్తువు వోరొకటి లేదు. ఉండదు.

(ఇతర విశేషణము లన్నియును వెనుక వివరింపబడెను)

దేహము రాలిపోగా యోగి యిట్టి కేవల పరబ్రహ్మమే తానగుచున్నాడు.

శ్రీ సదాశివబ్రహ్మేంద్రులవారు (గ్రంథకర్త) ఇలాంటి యోగిపుంగవులే. వారు బ్రహ్మీభూతులైనారన్నది నిశ్చితము. పరబ్రహ్మము అందరకును నిత్యసన్నిహితమని చెప్పనారుగదా! బ్రహ్మీభూతులగుటచే సదాశివబ్రహ్మేంద్రులు అందరకును నిత్యసన్నిహితులని వేరే చెప్పనక్కరలేదు.

ఎవడైనను తీవ్రమైన అభ్యాస వైరాగ్యములచే తన అంతఃకరణమును దాటి సన్మాత్రముగ అనుభవింపబడు పరబ్రహ్మమును జేరుకొన్నచో- వారు సదాశివబ్రహ్మేంద్రులవారిని జేరుకొనినారన్నమాట.

శ్రీ సదాశివబ్రహ్మేంద్రులవారు అందరకును నిత్య సన్నిహితులై అందరి నేనుకును వెనుక విరాజిల్లుచున్నారన్న యథార్థమున గూడ యీ శ్లోకము తెలియజేయుచున్నది.

అరస మగన్ధ మరూపం

విరజస్క మసత్వ మతమస్కమ్‌|

నిరుపప నిర్భయ తత్వం

తత్కిమపి ద్యోతతే నిత్యమ్‌|| 92

తా|| రూపరస గంధములు కాక-సత్వ-రజః-తమస్సులనెడు గుణములు ఏమియును లేనిదై-సాటిలేని అభయవస్తుడొకటి అనిర్వచనీయమై-అద్వితీయమై ప్రకాశించు చున్నది.

వివరము:-

శబ్ద-స్పర్శ-రూప-రస-గంథములు శ్రోత్రాదీంద్రియములచే బట్టువడుచున్న విషయములు. పరబ్రహ్మము అట్టిదికాదు. అది ఇంద్రియ వృత్తుల పట్టునకు జిక్కదు. అది 'అశబ్ద-మస్పర్శ-మరూప-మప్యయం' అయినది.

విశ్వమంతయు త్రిగుణాత్మకము. త్రిగుణములనగా సత్త్వరజస్త మోగుణములు.

"త్రైగుణ్య విషయావేదాః నిసై#్త్రగుణ్యోభవార్జున!"

-గీత.

పరబ్రహ్మము త్రిగుణాతీతము, నిర్గుణము. గుణాతీతుడు కానివాడు దాని పొలకువను అనుభవింపనేరడు.

బ్రహ్మానుభవము 'అత్రి'కి మాత్రమే లబించును. 'అత్రి' అనగా త్రిగుణములు లేనివాడు. అతడు 'అనసూయభావముతో' గూడినపుడు పరబ్రహ్మము సాక్షాత్కరించును.

'పరగుణషు దోషావిష్కరణం- అసూయా.' గుణమును దషముగా జూచుట అసూయ. ఉన్నది పరబ్రహ్మముకాగా- దానిని నశ్వరమైన జగత్తుగా జూచుట- ఉన్నదొక్కటేకాగా- నానాత్వమును దర్శించుట-గుణమందు దోషదర్శనమే కదా!

కాగా, పరబ్రహ్మమునందు జగద్భావన 'అసూయ' అనబడును. అదిలేకుండుట 'అనసూయాత్వము'- అనగా బ్రహ్మమును బ్రహ్మముగా దర్శించుట.

అత్రియై ఇట్టి భావము కలవాడైనపుడు-ఆత్రేయమైన దేదో-అనగా త్రిగుణాతీతమైనది సాక్షాత్కరించును.

''అహంబ్రహ్మేతి చేద్వేద సాక్షాత్కారః స ఉచ్యతే''

-పఞ్చదశీ.

సాక్షాత్కారమనగా తానే అది యగుట.

ఇట్టి సాధనమార్గముచే అందుకొనదగిన పరబ్రహ్మముగా శ్రీ సదాశివబ్రహ్మేంద్ర సరస్వతులవారున్నారని, అభ్యాసవైరాగ్యములచేవారిని అందుకొన వచ్చునని తాత్పర్యము,

ఇతి గురు కరుణాపాఙ్గా

దార్యాభిః ద్వ్యధిక షష్టిసంఖ్యాభిః|

నిరవద్యాభి రవోచం

నిగమ శిరస్తన్త్ర సారభూతార్థమ్‌| 93

తా|| శ్రీగురువులైన శ్రీపరమశివేన్ద్ర సరస్వతుల కరుణాకటాక్షముచే నేను (సదాశివేంద్రసరస్వతి) ఉపనిషత్సారభూత మైన మహార్థము నీవిధముగ-అనింద్యములైన అరువది రెండు ఆర్యావృత్తములతో జెప్పితిని.

వివరము:-

ఉపనిషత్తుల నన్నిటిని మధింపగా లభించు సారమీ గ్రంథములో నున్నది. అనుటచే ఉపనిషత్తుల సమ్యక్పఠనముచే లభించు ప్రయోజనము అల్పకాయమైన ఈ గ్రంథము నొక్కదానిని పఠించి పొందగలరనియు, ఇదిగ్రంథరత్నములకు తలమానిక మనియు తాత్పర్యము.

ఆర్యావృత్తము మాత్రాఛందము. జేసిపాదముల యందు 12మాత్రలతో ఇది నడచును.

ఈ గ్రంథమునందన్నియు ఆర్యావృత్తములే.

గదిత మిద మాత్మ విద్యా

విలాస మనువాసరం స్మరన్‌విబుధః|

పరిణత పరాత్మ విద్యః

ప్రపద్యతే సపది పరమార్థమ్‌|| 94

ఎవడేని విద్వాంసుడీ ఆత్మవిద్యావిలాసమును ప్రతి దినము అర్థచింతనపరుడై పఠించినచో-వానియందు ఆత్మ విద్య పంటకువచ్చును. ఆత్మవిద్య పరిపక్వదశకు చేరినంతనే-నిముసమైనను ఆలస్యముండదు. పరమార్థ మాతనికి లభించును.

వివరము:-

విద్వాంసుడు ఈ గ్రంథమును జదువుటకు అధికారి. అతడైనను దీనిని నిత్యము జదువుచుండవలయును. లేకున్న అది 'గజస్నాన మగును'.

ఏనుగు స్వచ్ఛనదీజలములో శుభ్రముగ స్నానముచేసి, ఒడ్డెక్కి వెంటనే ధూళిలో పొరలాడును. స్నానమువలన లభించి శుభ్రత నిలచినదా? లేదు.

అట్లే ఈ గ్రంథము నొకమారు జదువగా జనించిన విషయ పరాఙ్ముఖవృత్తి - ఆత్మాభిముఖ ప్రవృత్తి-ప్రాపంచిక విషయములచే మరల మాసిపోవును. అందుచే దీనిని నిత్యము పఠింపవలె ననినారు.

ఆ పాఠముకూడ కేవలము అక్షరోచ్చారణముకాదు, సమ్యగర్థ చింతనముతో సాగవలయును. లేకున్న ప్రయోజనము ముండదు.

ఈ గ్రంథ పఠినమునందీ నియమములను బాటించి వర్తిల్లిన వానియందాత్మ విద్య పంటకు వచ్చును. అతడీ పుడమీపై మరల నవతరించిన శ్రీసదాశివేన్ద్రయోగీన్ద్రుడై విరాజిల్లును.

పరమశివేన్ద్ర శ్రీగురు

శిష్యేణత్థం సదాశివేన్ద్రేణ|

రచితేయ మాత్మవిద్యా

é విలాసనామ్నీ కృతిః పూర్ణా|| 95

తా|| శ్రీ పరమిశివేంద్రసరస్వతుల శిష్యుడు సదాశివేంద్రుడు ఈవిధముగా రచించిన 'ఆత్మవిద్యావిలాసము' అన్న గ్రంథము సమాప్తమైనది. పూర్ణమైనది.

వివరము:-

"సంసారమన్న సుడిగుండమున జిక్కి ఉక్కిరి బిక్కిరి యగుచున్న ఓ లోకమా! నీ దుఃఖములెల్ల దొలగుటకు, నీ వపారానందవారాశిలో నోలలాడుటకు తగిన మార్గము జెప్పితిని, నా చెప్పుట పూర్ణమైనది.

ఈ మార్గమును అనుసరించి శ్రేయమొందుట నీవంతు నీవంతు పని వెంటనే ఆరంభింపుము'. -అని ఉపదేశము.

పరమహంస పరివ్రాజకాచార్యులు

శ్రీ పరమశివేంద్ర పూజ్యపాదుల శిష్యులు

అయిన, శ్రీ సదాశివబ్రహ్మేంద్రులు

రచించిన ఆత్మవిద్టయావిలాసము

సంపూర్ణము.

-: శుభం భూయాత్‌:-

శ్రీ సదాశివబ్రహ్మేంద్రులవారి అపూర్వగ్రంథములు

1, శివమానస పూజాస్తుతిః అద్వైతతారావళి,

అద్వైతగీతాలు (తాత్పర్య-వివరములతో) 10-00

2. ఆత్మవిద్యావిలాసము (తాత్పర్యము వివరములతో) 15-00

3. బ్రహ్మసూత్రవృత్తి (శంకరుల భాష్యమునకువృత్తి)

4. యోగసుధాకరము(పాతంజల యోగసూత్రములకు వివరణము)

5. ద్వాదశోపనిషద్దీపిక

6. అద్వైత రసమంజరి

7. నవమణిమాల

8. ఆత్మానుసంధానము

9. స్వప్నోదితం

10. స్వానుభూతి ప్రకాశిక

11. శ్రీదక్షిణామూర్తి స్తోత్రం

12. మనోనియమనము

13. నవరత్నమాల (నవవర్ణరత్నమాల)

14. సిద్ధాంతకల్పవల్లి-కేసరవల్లీ వ్యాఖ్యానము

15. బ్రహ్మసూత్రప్రకాశిక

16. సూతసంహితసంగ్రహము

17. మనీషాపంచకము-తాత్పర్యదీపిక వ్యాఖ్యానము

18. సదాశివబ్రహ్మేంద్రుల చరిత్ర

ఈ గ్రంథము లన్నియు ఆంధ్రానువాదముతో క్రమంగా వెలువడును.

....................................................................................................................................

సా ధ న గ్రం థ మం డ లి - తె నా లి.

Atma Vidya Vilasamu         Chapters          Last Page