Acharyavaani - Vedamulu     Chapters   Last Page

3. వేదములపై పరిశోధన

వేదముల గురించి మనదేశంలో మనకి తెలిసినదానికి మూలం పాశ్చాత్య పండితులు చేసిన పరిశోధనా, వారి అడుగు జాడలలోనే జరిగే మన దేశస్థుల పరిశోధనలూను. ఇది చాలా శోచనీయం. వేదాల గురించి పాశ్చాత్యులెన్నో పరిశోధనలు చేశారు. నిజమే. వారి కృషిని మనం గుర్తించాలి - వారికి కృతజ్ఞతను కూడా చూపాలి. వేదాల ఘనతని చూచి స్ఫూర్తి పొందిన మాక్స్‌ - ముల్లర్‌ వంటి మహనీయులు వేదాలకి సంబంధించిన విషయాలనెన్నిటినో శ్రమపడి సేకరించారు, విశ్లేషించారు. వేదాలపై ఎన్నో గ్రంథాలు వ్రాశారు. రమారమి రెండు వందల సంవత్సరాల క్రితం, కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి సర్‌ విలియమ్‌ జోన్స్‌ స్థాపించిన ఆసియాటిక్‌ సొసైటీ అనే సంస్థ ప్రచురించిన గ్రంథాలను చూస్తే మనమాశ్చర్య చకితుల మవుతాం. ఈస్టిండియా కంపెనీ సహాయం వల్ల మాక్స్‌ ముల్లర్‌ శాయనుని టీకతో ఋగ్వేదాన్ని ఎన్నో సంపుటాలుగా వెలువర్చాడు. అంతేకాక, ఇంకా ఎన్నో హైందవ మత గ్రంథాలను కూడ ప్రచురించాడు. ఎందరో ఆంగ్లేయులు, జర్మనులు, ఫ్రెంచివారు, రష్యన్లు ఎంతో శ్రమకోర్చి పరిశోధనలు జరిపారు. దేశంలో ఎక్కడెక్కడో యున్న వేదపాఠాలను, తత్సంబంధమైన అనువాదాలను, సూత్రాలను సేకరించి ప్రచురించారు.

మన సాంస్కృతిక వారసత్వానికి సేవ చేసిన విదేశీయులు కూడా ఉన్నారు. లార్డ్‌ కర్జన్‌ వైస్‌రాయ్‌గా ఉన్నప్పుడే పురాతన కట్టడాల పరిరక్షణ చట్టం (Protection of Ancient Monuments Act) వచ్చింది. అది కొంత విధ్వంసాన్ని ఆపింది. ఫెర్గూసన్‌ దేశంలోని శిల్పసంపదని ఫోటో తీసి దాని గురించి మనకి ఎరుక కల్గించాడు. కనింగ్‌ హామ్‌, మార్టిమర్‌ వీలర్‌, సర్‌ జాన్‌ మార్షల్‌ - ప్రసిద్ధులైన పురావస్తు శాస్త్రవేత్తలు. దేశపు నలుమూలలనుండీ తాళపత్ర గ్రంథాలను సేకరించిన వాడు మెకన్జీ - ఇదే జరుగక పోతే మనకి మన శాస్త్రాల గురించి ఇంత తెలిసేది కాదు. బ్రిటిష్‌ వారి పరిపాలనా కాలంలోనే ఎపిగ్రాఫీకి వేరే శాఖను నెలకొల్పారు. పరపాలన వల్ల మనకెంతో మేలు చేకూరింది. కాని హాని కూడ జరిగింది. ఈ పాశ్చాత్య పండితులు వేదాలలోని విషయాలను తీసుకొని మన చరిత్ర వ్రాయబూనారు. అంతకు పూర్వం ఎవరూ ఎరుగని ''ఆర్యులు - ద్రావిడులు భిన్న జాతులన్న'' వాదాన్ని లేవనెత్తారు. దీని వల్ల స్పర్థలేర్పడ్డాయి. వారి దృష్టిలో వారిది తార్కికదృక్పథం. వారికి ఇంద్రియగ్రాహ్యం కాని దేదైనా సరే కాల్పనికమే. ఈ దృక్పథమే వారి నిర్ణయాలకు ఆధారం. దీని వల్ల ప్రాచీన ఋషులు ఆధునికుల కంటె తక్కువ వారని అనగలిగారు. మన మతగ్రంథాలను వారు విశ్లేషించేటప్పుడు కూడా క్రైస్తవ మతం మన మతం కన్నా గొప్పదని చూపటమే వారి ధ్వేయం. పైకి మాత్రం తటస్థంగా పరిశోధన జరుపుతున్నట్టు కనబడుతూ నిరంతరం మన మతాన్ని ఆక్షేపించేవారు.

సంస్కృతానికి, వారి భాషలకీ కల సారూప్యాన్ని గమనించి అనేకులు మన గ్రంథాలను కేవలం భాషాశాస్త్రం దృష్టితోనే అధ్యయనం చేశారు.

వారి అవిశ్రాంత పరిశోధననీ, వారు వేదాల మహనీయతకు తెచ్చిపెట్టిన ప్రాచుర్యాన్నీ మనం కొనియాడ వచ్చు. కానీ వేదమంత్రోచ్చారణ వల్లా, వేదోక్త కర్మల నిర్వహణ వల్లా విశ్వశ్రేయస్సున నెలకొల్పవచ్చనే ముఖ్యాంశాన్ని వారు గ్రహింపలేదు - సరికదా, మానవుని బుద్ధికి అందని వేదాల గురించి ఆ బుద్ధితోనే విశ్లేషింపబూనారు. సామాన్యుని నిత్య జీవితంలో శబ్దంగా కార్యరూపంలో సజీవశక్తిగా ఉండవలసినది, ఉద్గ్రంథాలలో నిర్జీవంగా నిక్షిప్తమై పోయి గ్రంథాలయాలలో ఉండటానికి మాత్రం పనికి వచ్చింది - పురాతన వస్తుజాలాన్నీ అస్థిపంజరాలనీ ప్రదర్శించే మ్యూజియంలోని జంతువులవలె!

వేద కాలం గురించిన పరిశోధన తప్పు :

వేదములు అనాది - అంటే మొదలు లేనివి - అనే విషయంపై పాశ్చాత్యుల ధోరణిని విశదీకరించటానికే వారి ప్రస్తావన తెచ్చానిక్కడ. వేదాలకు మొదలు అంటూ ఏదీ లేదన్న సత్యం వారి మెదడుకి ఎక్కదు. శాస్త్ర పరిశోధన తటస్థవైఖరిని ఆశిస్తుంది - అయినా మన పవిత్ర గ్రంథాల మహనీయతని వారిలో కొందరు అంగీకరింపలేక పోయారు. అటువంటి అపోహ లేకపోయినా మరికొందరు తర్కమూ, హేతువాదమూ విధించే పరిధులను దాటలేకపోయారు. వేదాలు అనాది - అనే భావాన్ని అంగీకరింపలేక ''విద్యావంతులైన'' కొందరు హైందవులు కూడ గాఢమైన ''పరిశోధన''కి ఉపక్రమించారు.

ఈ పరిశోధనానుసారం కాలనిర్ణయానికి రెండు విషయాలుపకరిస్తాయి. మొదటిది. భూగోళ శాస్త్రపు ఆధారాలు. రెండవది రచనలో వాడిన భాషా శైలి. ఈ పద్ధతి వల్ల వేదాల కాలం గురించి నిరపేక్షణీయమైన నిర్ణయాలకు వారు రాగలిగారా? రాలేక పోయారు. ఒకో పరిశోధకునికీ ఒకో అభిప్రాయం. తిలక్‌ వేదాలు క్రీ.పూ.6000 నాటి వన్నారు. కొందరు క్రీ.పూ.3000 నాటి వంటే మరికొందరు ఇంకా సమీపంగా క్రీ.పూ.1500 నాటి వన్నారు.

ఇతర మతగ్రంథాల విషయంలో ఇటువంటి భేదాభిప్రాయాలు లేవు. బౌద్ధుల 'త్రిపీటకము' అనే గ్రంథం గురించి ఏ అభిప్రాయభేదాలూ లేవు. అది అశోకుని రోజుల నాటిది, కాని అందులోని బుద్ధుని ప్రవచనాలు అంతకు ముందు కొన్ని శతాబ్దాల ముందువి - రమారమి 2500 సంవత్సరాల పూర్వపువి - బుద్ధుని జీవితకాలం నాటివి. అట్లాగే బైబిల్‌ (న్యూటెస్ట్‌మెంట్‌) గురించి కూడా ఏకాభిప్రాయమే ఉంది. అది దాదాపు 2000 సంవత్సరముల నాటిది. మన వేదాల గురించే ఏ విధమైన నిశ్చితాభిప్రాయానికీ ఆధారాలు లేవు. వేదాల కాలం గురించి నిర్ణయించటానికి పైన నేను చెప్పిన రెండు పద్ధతుల గురించి ఇంకొంచెం వివరిస్తాను -

వేదాలలో కొన్ని చోట్ల నక్షత్రాల ఉనికి గురించి ప్రస్తావన ఉంది. గ్రహాల కూడలి ననుసరించి, జ్యోతిషశాస్త్ర లెక్కలప్రకారం కొందరు వేదాలు క్రీ.పూ.6000 నాటివనో, మరెప్పటివనో అంచనాలు వేస్తారు.

కాని అటువంటి గ్రహాల కూడలి క్రీ.పూ.6000 నాటివేననీ, ఇంకెప్పుడూ సంభవించలేదనీ ఎట్లా అనగలం? అటువంటి కూడలి ప్రస్తుతపు విశ్వసృష్టికే పరిమితం కాకుండా అంతకు పూర్వ మెప్పుడో కూడా సంభవించి ఉండవచ్చు కదా. వీటిలో వేటి గురించి వేదాలు ప్రస్తావిస్తున్నట్టు? కాబట్టి కాలాతీతులైన ఋషులు అనుగ్రహించిన వేదాలకు ఈ కాలమానాలు వర్తించవు. వేదాలలోనే ఉన్నాయనబడే జ్యోతిష్యపు ఆధారాలు విషయాన్ని ఏ మాత్రమూ సులభగ్రాహ్యం చేయవు.

వేదాల కాలనిర్ణయానికి ఇంకొక మార్గం - వాటిలో వాడబడిన భాష. భాషకి శైలీ, లిపీ ప్రధానమైన అంశాలు. ఇప్పుడు భారతదేశంలో ఉన్న లిపులన్నిటికీ మూలం బ్రాహ్మీ లిపి. ఉదాహరణకి : పైపైన చూస్తే ఇప్పటి తమిళలిపికీ దేవనాగరి లిపికీ పోలిక కనబడక పోవచ్చు - కాని లిపి శాస్త్రజ్ఞులు మౌలికమైన బ్రాహ్మీ లిపి ప్రతివందేళ్లకూ ఏయే పరివర్తనలు చెందిందో చూపే పట్టికలను తయారు చేశారు. దీనిని బట్టి వివిధ ప్రాంతాలలో వివిధ సందర్భాలలో అనేక మార్పులు వచ్చాయనీ, ప్రస్తుతం ఒక లిపికీ మరొక లిపికీ పోలిక కనబడక పోయినా, అన్నిటికీ మూలం బ్రాహ్మీ లిపియేనని తెలుస్తుంది. ఒకోసారి నాకు పరిహాసానికి ఇట్లాతోస్తుంది: మూలానికి మీసాలు మొలవగా ఇప్పటి లిపులన్నీ తయారైనాయని! ఆ పట్టికను మీరు గమనిస్తే నేనన్నది మీకింకా బాగా అర్థమవుతుంది. దేవనాగరిలో ఉ () ఊ () అనే అక్షరాలు ఈ విషయాన్ని నిరూపిస్తాయి. అలాగే, తమిళలిపి చూస్తే ఆదిమలిపికి కొమ్ములు మొలిచాయేమో ననిపిస్తుంది. పూర్వపు రాజుల శాసనాలు, ప్రకటనలూ రాళ్లపైనా రాగిరేకులపైనా చెక్కబడ్డాయి. వీటిని పరీక్షిస్తే కాలక్రమేణా వచ్చిన మార్పులు స్పష్టంగా తెలుస్తాయి. ఒక శాసనం ఏ కాలందో తెలుసుకోవటానికి లిపి ఉపయోగిస్తుంది.

వేదాల విషయం తీసుకుంటే ఇవి ఎక్కడా ఏ రాతిపైనా చెక్కబడ లేదు. అందువల్ల వాటి కాలనిర్ణయానికి ''లిపి'' ఉపయోగించే ప్రసక్తే లేదు. ఇక మిగిలిన దల్లా భాషా శైలిని పరీక్షించడం.

మాటల వల్ల మనకి అర్థమయ్యే విషయాలూ, అవగాహనకీ శబ్దం యొక్క ప్రభావం - కాలక్రమేణా మార్పు చెందుతూనే ఉన్నాయి. ప్రాచీన తమిళ సాహిత్యంలో వాడిన పదాలు ఇప్పుడు అర్థమే కావు. ఇదే పరిస్థితి ఇతర భాషలలోనూ ఉంది. కొన్ని శబ్దాలు కాలానుగుణంగా మారి పోయాయి - వాటి అర్థం కూడా మారిపోయింది.

తరువాత వచ్చిన వాజ్మయం వల్ల వేదాలు సులభ గ్రాహ్యాలు కావు. ఈ రకమైన మార్పు ఇతర భాషలలో కూడా ఉంది. ఉదాహరణకి, ప్రాచీనకాలం నాటి ఇంగ్లీషు - అంటే వెయ్యి సంవత్సరాల పూర్వపుది - ఆధునికులకు అర్థం కాదు. అమెరికాలో గత మూడువందల ఏళ్లల్లోను ఇంగ్లీషు ఎంతో మార్పు చెందింది. దానిని అమెరికా ఇంగ్లీషు అనవలసిన స్థితి వచ్చింది.

వాడుక వల్ల ఉచ్ఛారణలో మార్పులు ఏ రీతిగా ఎంత వేగంగా ఉంటాయో పరిశోధకులు కనుగొన గలిగారు. కానీ మాటల అర్థంలోని మార్పులను ఇంత నిశితంగా కనుగొన లేకపోయారు. కాబట్టి ఈ పరిశోధకులు వేదాల కాలం నిర్ణయించటానికి వేదాలలోని పదాల ఉచ్ఛారణలో వచ్చిన మార్పులని ఒక ఆధారంగా తీసుకున్నారు. వారి దృష్టిలో పదజాలం యొక్క ఉచ్చారణ బాగా మారటానికి రెండు వందల సంవత్సరాలు పట్టుతుంది. వారి దృష్టిలో, వాడుకలో లేని మాటల ఆధారంగా వేదాలలోని పదాలలో ఎన్ని మార్పులు వచ్చాయో గమనించవచ్చు. ఈ లెక్క ప్రకారం, ఒక మాట పది మార్పులు చెందితే ఆ మాట 2000 సంవత్సరాలదని నిర్ణయించారు. వేదాలలోని ఒక మాట ముపై#్ఫ మార్పులు చెందితే వేదకాలం 3000 క్రీ.పూ. అని అన్నారు. అంటే, వేదాలు అంతకు పూర్వ ముండటానికి అవకాశం లేదని - ఈ విధంగానే లెక్కలు కట్టారు.

ఈ సిద్ధాంతమే నిరాధారమైనది. నిత్యం వాడుకలో ఉన్న పదాలు ఉచ్ఛారణలో మార్పుచెందుతాయి. వాటి అర్థంకూడా మారుతూంటుంది. వేదాలను ప్రతిదినం పఠిస్తున్నా మొదట ఏ ఉచ్ఛారణ ఉన్నదో అదే ఇప్పుడు కూడ ఉంది. వేదాలలో శబ్దాలను మార్పు లేకుండా ఉంచుకోవటానికి ఎంతో శ్రద్ధ చూపారు. అందువల్ల ఈ పరిశోధకులు ఊహించినట్టు వేద శబ్దాలు మామూలు మాటల వలె ఏ మార్పూ చెందలేదు.

ఈ పరిశోధకుల ఉద్దేశంలో వేదాలలో ప్రధమంగా ఋగ్వేదమూ ఆ తరువాత వరుసగా యజుర్వేదము, సామవేదము, అధర్వవేదమూ వచ్చాయి. ప్రతివేదంలోనూ మొదటి భాగం 'సంహిత'లు, తరువాతి 'బ్రాహ్మణాలు' ఆఖరిగా ఆరణ్యకాలు. ఈ విధంగా ఆలోచించి పరిశోధకులు వేదాల కాలాన్ని గణిస్తారు. వేదాలలోని పదాలు వాల్మీకి రామాయణంలో, మహాభారతంలో, చివరికి కాళిదాసు కృతులలో ఎట్లా పరివర్తన చెందాయో పోలుస్తారు. ఇటువంటి సాక్ష్యాలనెన్నింటిని పరిశీలించినా అదంతా వృథాయే. దానికి కారణం, వాళ్లు అసలు విషయాన్ని మరువటమే. వేదాలలోని పదాలు అన్ని కట్టుబాట్లనూ ఉల్లంఘించి మారుతాయనే అనుకొందాం. ఆ మార్పులు కేవలం రెండు వందల సంవత్సరాలలో అసంభవం. కొద్ది పాటి మార్పు జరగాలన్నా కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. సాధారణ వాడుకలో, సాహిత్యంలోనూ జరిగే పరివర్తన వేదవాక్కులకి వర్తించదని ఒప్పుకొంటే, వేదాల కాలాన్ని ఈ విధంగా లెక్క కట్టటం తప్పని తెలుస్తుంది.

''హిందీ'' అనబడే భాషకి ప్రత్యేక ప్రతిపత్తి కొద్ది శతాబ్దాల క్రితమే లభించింది. అయినా అది బాగా విస్తరించింది. ఈ స్వల్ప కాలంలోనే ఆ భాష ఎంతో మారింది - దీనికి కారణం - అది సంస్కృతము, ఉర్దూ, పార్శీ, ఇంగ్లీషు భాషలనుండి మాటలను తనలో కలుపుకోవటం. సంస్కృతం హిందీ కంటే ఎక్కువగా దేశమంతా వ్యాపించినా అది వాడుక భాష కాకపోవటం వల్ల మార్పు చెందలేదు. సంస్కృత సాహిత్యం విషయమే ఈ విధంగా అయితే, ఎంతో భద్రంగా కాపాడుకొంటూ వచ్చిన వేదపదాల విషయం వేరే చెప్పాలా? కాబట్టి ఈ పరిశోధకుల అంచనా ప్రకారం ఒక సామాన్యభాషలో వెయ్యి సంవత్సరాలలో వచ్చే మార్పులు వేదాల విషయంలో ఒక లక్ష సంవత్సరాలు పట్టవచ్చు.

వేద శబ్దాల ఆదిమస్వచ్ఛత అట్లాగే నిలిచి పోవటానికి కారణమిది : సరియైన ఉచ్ఛారణ వల్లనే వేదమంత్రాలు శక్తి మంతమవటం. ఇందులో దోషాలు దొర్లకుండా కాపాడు కోవటానికీ, ఒక తరం నుండి వేరొక తరానికి ఆ స్వచ్ఛతతోనే అందించటానికే - సమాజంలో ఒక వర్గం అంకితమై ఉండటం.

ఈ మౌలిక విషయాన్ని గ్రహించక పోతే, అసలు ఏమి జరిగిందో, ఏ పరిశోధనా కనుగొనలేదు. వేద మంత్రోచ్ఛారణలోని భిన్న రీతులు ఆ శబ్దస్వచ్ఛతని భద్ర పరచుకోవటంలోని సాఫల్యానికి నిదర్శనాలు.

* * *

Acharyavaani - Vedamulu     Chapters   Last Page