Devi Kathalu         Chapters          Last Page

పంచ శక్తులు

పరాశక్తి అయిన జగన్మాత లోకసంరక్షణార్ధం వేఱువేఱు సందర్భాలలో వేఱువేఱు నామరూపాలతో ఆవిర్భవించింది. ఆయా దేశకాలాలలో తన దైన "దివ్య ప్రణాళిక" ను నిర్వహించే నిమిత్తం 'దుర్గ'గా , 'రాధ'గా, 'లక్ష్మి' గా, 'సరస్వతి'గా, 'సావిత్రి'గా అవతరించింది. ఈ ఐదు సన్నివేశాలలో వ్యక్తమైన దేవతామూర్తులకే "పంచశక్తులు "అని పేరు.

దుర్గాదేవి

దేవీ మహిమలను శ్రద్ధాళువై అలకిస్తున్న జనమేజయ మహారాజు వ్యాసమహర్షికి కృతజ్ఞతాంజలి సమర్పిస్తూ "మహర్షీ! పరాశక్తి ప్రభావాన్ని గురించి ఎంతగా విన్నా తనివి తీరడం లేదు. ఆశ్రయించిన వారికి అనంత సంపదలను అనుగ్రహించే ఆ తల్లి వాత్సల్య విశేషాలను తెలియజేసి నన్ను తరింప చేయండి" అని ప్రార్థించాడు.

జనమేయుని మాటలకు సంతోషించిన వ్యాసమహర్షి "రాజా! దేవి యందు గల భక్తి శ్రద్ధలతో నీ వడిగిన ఈ కోరిక సంతోషం కలిగించింది. సావదాన చిత్తుడవై ఆలకించు "అని దుర్గాదేవి కథను ఈ విధంగా వివరించాడు.

"పూర్వం హిరణ్యాక్షుని వంశంలో దుర్గముడనే రాక్షసుడు పుట్టాడు. దేవతలకు వేదమే బలమని గుర్తించిన అతడు, వేదాలను తుదముట్టించి దేవతలను నాశనం చేయవచ్చునని ఆలోచించాడు. ఒక పథకం ప్రకారం వేయి సంవత్సరాలు బ్రహ్మను గురింతి తీవ్రమైన తపస్సు చేశాడు. కేవలం వాయి భక్షణతోనే జీవయాత్ర సాగిస్తూ, అతడు తపస్సును కొసాగించాడు. అతని కఠోర తపశ్చర్యకు లోకం అల్లకల్లోలమైంది. బ్రహ్మా అతనికి ప్రత్యక్షమయ్యాడు వేదాలను తనకు అనుగ్రహించ వలసిందిగా, దేవతలను జయించ గల శక్తిని తనకు ప్రసాదించ వలసిందిగాను వరం కోరుకున్నాడు దుర్గముడు. బ్రహ్మదేవుడు "తథాస్తు" అని మాయమయ్యాడు.

బ్రహ్మ యిచ్చిన వరప్రభావం వల్ల రాక్షసుడైన దుర్గమునికి వేదాలన్నీ స్వాధీనమయ్యాయి. ఆ నాటి నుండి విప్రులు వేదాలను మరచిపోయారు. భూలోకంలో వేజధర్మాచరమ క్షీణించింది. స్నానసంధ్యాదులు, జపహోమాదులు, యజ్ఞ యాగాదులు అన్ని అంతరించాయి. వేదవాఙ్మయ విజ్ఞానం తమకు దూరమై పోవడంతో బ్రాహ్మణులకు యజ్ఞనిర్వహణ అసాధ్యమైపోయింది. యజ్ఞాలు లేకపోవడం వల్ల దేవతలు నిర్వీర్యులయ్యారు. రాక్షస గణం దేవలోకాన్ని అక్రమించింది. ఇంద్రుడు స్వర్గాన్ని విడిచి, కొండల్లో, కొనల్లో అజ్ఞాతవాసం చేస్తూ పరాశక్తిని ప్రార్థించ సాగాడు. బ్రాహ్మణులందఱూ హిమాలయాలకు వెళ్ళి భవానీ మాతను ప్రార్థించి, తమ అపరాధాలను క్షమించి, దయచూడ వలసిందిగా వేడుకున్నారు. తెలియక చేసిన తప్పులను మన్నించి, కనికరించ వలసిందిగా ప్రాధేయ పడ్డారు.

"ప్రసీద త్వం మహేశాని! ప్రసీద జగదంబికే!

అనంతకోటి బ్రహ్మాండనాయికే! తే నమో నమః|| "

అని పరిపరి విధాలుగా ప్రార్థించారు.

వారి ప్రార్థనలు విని జగన్మాత ప్రత్యక్ష మయింది. నిలువెల్లా కన్నులతో దివ్య కాంతులతో ప్రత్యక్షమయింది. తన బిడ్డలైన ప్రాణికోటి కష్టాలను చూడలేత శతనేత్రాలతో తొమ్మిది రోజుల పాటు ధారాపాతంగా కన్నీరు కారుస్తూ రోదించింది. తన బిడ్డల బాధ చూడలేక కన్నీరు మున్నీరుగా ఆమె విలపించగా, ఆమె కన్నీటి దారల చేత చెట్లన్నీ చిగురించి, పుష్పించి, ఫలించి , ఆర్తులకు మధుర ఫలాలను అందించాయి. అంతట జగన్మాత స్వయంగా తన చేతులతో వివిధ ఫలాలను, రకరకాల శాకాలను ఆర్తుల నోటికి అందించి, వారి ఆకలిని తీర్చింది. ఆనాటి నుండి ఆ దేవిని "శతాక్షి"అని, "శాకంభరి "అని పిలుస్తూ, దేవతలందఱుఆమెను పూజింపసాగారు.

ఈ వృత్తాంతం విన్న దుర్గముడు రాక్షస సమూహాలను వెంటబెట్టుకొని వెళ్లి దేవతలను, బ్రాహ్మణులను చుట్టుముట్టి, పరిపరి విధాలుగా వేధిస్తూ, వారిని భయ భ్రాంతులను చేయసాగాడు. దేవతలు, బ్రాహ్మణులు ఆర్తితో శతాక్షీదేవిని ప్రార్థించారు.

"నమో వేదాంత వేద్యే !తే నమో బ్రహ్మ స్వరూపిణి|

స్వమాయమా జగద్విధాత్య్రైతే నమో నమః||

అస్మచ్ఛాంత్యర్థమతులం లోచనానాం సహస్రకమ్‌|

త్వయా యతో ధృతం దేవి! శతాక్షీ! త్వం తతోభవ!

కృపాం కురు మహేశాని! వేదానప్యాహరాంబికే!

భక్త కల్పద్రుమే! దేవి! స్తోతుం శక్తిర్న చాస్తి నః||"

అని స్తోత్రం చేశారు.

వారి మొఱలు ఆలకించి, జగన్మాత తేజోరాశి అయిన చక్రాన్ని సృష్టించి రాక్షసులతో యుద్ధం ప్రారంభించింది. దేవ దానవ సంగ్రామం భయంకరమైన , వారు పరస్పరమూ ప్రయోగించుకొనే శరపరంపరలతో సూర్య మండలం మూసుకు పోయింది. అగ్నిజ్వాలలు ఆకాశాన్ని అంటుకున్నాయి. రాక్షసులు మరింతగా విజృంభించారు. అపుడు దేవి కనుబొమలు ముడిచి, హుంకారం చేసింది. ఆమె దివ్యదేహం నుండి అజేయమైన శక్తులు అనేకం ఆవిర్భవించాయి.

"కాళికా తారిణీ బాలా త్రిపురా బైరవీ రమా|

బగళా చైవ మాతంగీ తథా త్రిపురసుందరీ||"

అలా ముప్ఫయి రెండు శక్తులు ఆవిర్భవించి, రాక్షసులను చీల్చి చెండాడాయి. పదిరోజులు యుద్ధం సాగిన తర్వాత దానవ సైన్యం అంతా నశించింది. దుర్గముడు ఒక్కడే మిగిలాడు. దుర్గముడు అతి కోపంతో దేవి పైకి విజృంభించాడు. అపుడు శతాక్షీదేవి తీక్షణమైన చూపులను ప్రసరింపచేసి, దుర్గమునిపై బాణవర్షం కురిపించింది. దుర్గముని రథాశ్వాలను, సారధిని వధించింది. ఆ పై మరో ఐదు బాణాలు ప్రయోగించి దుర్గముణ్ణి సంహరించిది. అప్పుడు దేవతలు, త్రిమూర్తులు ఆ దేవిని

నను శాకంభరీ దేవి! నమస్తే శతలోచనే!

"సర్వోపనిషదుద్ఘషే! దుర్గమాసుర నాశిని!"

అని సంస్తుతించారు.

అంతట ఆ దేవి వానితో " దేవతలారా ! వేద విప్రులారా ! మీరిప్పుడు చూస్తున్న ఈ నా రూపం చాలా పవిత్రమైనది. ఈ రూపాన్ని చూడనందు వల్లనే ఇంత కాలమూ మీరు ఇన్ని కష్టాలు పడ్డారు. దుర్గమాసురుణ్ణి చంపిన నన్ను 'దుర్గ' అనే పేరుతో పూజిస్తూ, మీ కష్టాలను దూరం చేసుకొని సుఖంగా ప్రశాంతంగా జీవించండి" అని అభయమిచ్చి, అంతర్ధానం మైంది.

ఆ నాటి నుండి దేవతలు, వేదవిప్రులు యథావిధిగా తమ తమ ధర్మాలను నిర్వర్తిస్తూ, ప్రశాంతంగా జీవయాత్ర సాగిస్తూ, ఆ దేవిని దుర్గగా, శతాక్షీ దేవిగా, శాకంభరిగా వ్యవహరిస్తూ, ఆమెను ఆరాధించి, ఆమె అనుగ్రహంతో తమ జీవితాలను చరితార్ధం చేసుకున్నారు.

ఈ కథ విశేషాన్ని వినిపించి, వ్యాసమహర్షి ఇలా అన్నాడు-"జనమేజయ మహారాజా !

పవిత్రమైన ఈ శతాక్షీ మహిమా వృత్తాంతం విన్న వారికి దేవీ భక్తి కలుగుతుంది.కష్టాలు తొలిగిపోతాయి. ఆమె అనుగ్రహం పొందితే, సర్వమూ సిద్ధించినట్లే. నీవు కూడా ఆమెను పూజించి, కృతార్ధతను పొందు."

ఈ రీతిగా పంచశక్తులలోని మిగిలిన అవతార వైభవ విశేషాలను కూడా వ్యాసమహర్షి జనమేజయ మహారాజుకు వివరించాడు.

రాధాదేవి

పంచశక్తులలో రెండవ శక్తికి 'రాధాదేవి' అని పేరు. ఈ రాధ 'గోకులం'లో ఉన్న గోపిక కాదు. 'గోలోకం'లో నివసించే శక్తిస్వరూపిణి. శ్రీ కృష్ణుని శరీరంలో అర్ధభాగాన్ని స్వీకరించి,అర్ధనారీశ్వరుల వలె ఒకే రూపంగా భాసించింది. ఈ రాధాదేవి పరాశక్తి అంశగా అవతరించింది. భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోకాలను దాటి, ఆ పైన గల వైకుంఠాన్ని కూడా అధిగమించి, గోలోకాన్ని తన స్వస్ధానంగా చేసుకున్న శక్తి స్వరూపిణి.

"వినారాధ్య రాధా పదాంభోజ యుగ్మం|

న కృష్ణస్య భక్తిస్సంజాయతే కిల||"

అనే సూక్తిని అనుసరించి, శ్రీ కృష్ణుని యందు నిశ్చల భక్తి కుదరాలంటే, ముందుగా రాధాదేవిని ఆరాధించి, ఆమె అనుగ్రహాన్ని పొందాలి.

మనం చూస్తున్న ఈ సృష్టి ఇలా వెలువడాడినికి పూర్వమే, ఈ సృష్టికి ఆధార భూతమైన ఒకానొక దివ్యశక్తి ఉన్నది. ఆ శక్తికి "పరా ప్రకృతి" అని పేరు. ఆ శక్తి ఈ సృష్టిగా వ్యక్తం కావాలని సంకల్పించుకొని తనంతట తానే రెండుగా విభాగమైంది. దక్షిణ భాగం పురుషుడుగా, వామ భాగం ప్రకృతిగా వ్యవహరింపబడతాయి. అగ్ని వేడిమి వలె, చంద్రుడు-వెన్నెల వెలె ప్రకృతి పురుషులకు అభేదం. అందువల్ల యోగులు తత్వవిషయంలో స్త్రీ పురుష భేధాన్ని అంగీకరించరు. మాయతో కలిసిన శక్తి, బ్రహ్మ విష్ణువు మహేశ్వరులుగా పురుష రూపంలోనూ, వాణీ రమా పార్వతులుగా స్త్రీ రూపంలోనూ విరాజిల్లుతోంది. అలాంటి శక్తులన్నింటిలో రాధాశక్తి అత్యంత సౌందర్య స్వరూపిణీగా, పరమానందదాయినిగా, రాసక్రీడలో శ్రీకృష్ణునకు అధిదేవతగా, 'రాసేశ్వరి'గా ఆరాధింపబడుతోంది. ఈ శక్తియే వరాహకల్పంలో ఒక గోపికకు పుత్రికగా జన్మించింది. శ్రీకృష్ణుని 'అర్ధాంగి' అయి, తన ప్రభావం చేతనే శ్రీకృష్ణుని చేత సర్వలోక వ్యవహారాలనూ నిర్వహింపచేస్తుంది. తేజో రూపిణిగా అండ పిండ బ్రహ్మాండాలలో వ్యాపించి, రసస్వరూపమైన ఆనందాన్ని కలిగించేది ఈ రాధాశక్తియే.

గోకులంలో నివసించే కృష్ణుడు, దేవకీ వసుదేవుల కుమారుడుగా జన్మించి, కంస శిశుపాలాదులను సంహరించిన అవతారమూర్తి కాదు. గోలోకృష్ణుడు చతుర్భుజుడు, ఈతడు పరబ్రహ్మ తత్వమే. ఈతని దివ్యదేహం నుండి చతర్బుజులైన సేవకులు సహస్రాధికంగా ఆవిర్భవించి, కృష్ణున్ని సేవిస్తూ ఉంటారు. గోలోక కృష్ణుని రోమకూపాల నుండి అసంఖ్యాకంగా గోపకులు వయోరూప లావణ్యాలతో ఆవిరభవించగా, రాధాదేవి దివ్యశరీరం నుండి సహస్రాధికంగా గోపకన్యలు ఉద్భవించారు. అలా వెలువడిన గో గోప సముగదాయాన్ని సేవించి, తరించిన రాధాదేవి, రాధాకృష్ణుల అనంత వైభవాన్ని మనకు వెల్లడిస్తోంది.

పాతాళం నుండి బ్రహ్మలోకం వరకు ఉన్న లోకాలకు 'బ్రహ్మాండము' అని పేరు.ఆ పైన వైకుంఠం, అంతకంటె పైన గోలోకం ఉన్నాయి.

" ఓం కృష్ణాయనమః" అనే షడక్షరీ మంత్ర ప్రభావాన్ని గుర్తంచ గలిగితే రాధాతత్వం అవగాహనకు వస్తుంది. రాధా శక్తితో కూడిన శ్రీకృష్ణువిరాడ్రూపమే పరబ్రహ్మ తత్త్వము.

లక్ష్మీ దేవి

పరా ప్రకృతి నుండి ఆవిర్భవించిన మహాలక్ష్మీ పంచశక్తులలో మూడవది. ఆమె నారాయణునికి పత్నియై ఆశ్రయించిన వారికి అఖండమైన సర్వసంపదలనూ అనుగ్రహిస్తుంది. ఈమెయే వైకంఠంలో మహాలక్ష్మిగా, స్వర్గంలో స్వర్గలక్ష్మిగా, రాజ్యాలలో రాజ్యలక్ష్మిగా, గృహాలలో గృహలక్ష్మిగా విరాజాల్లుతోంది. ధనలక్ష్మి,ధాన్యలక్ష్మి,గజలక్ష్మి, రూపలక్ష్మి వంటి అనేక నామాలతో ప్రకాశిస్తూ, విష్ణువక్షస్ధలంలో నిత్యనివాసిని అయింది.

స్వర్గలక్ష్మిగా ఉన్న ఈ అంశ##యే దుర్వాసిని శాపవశాన స్వర్గానికి దూరమై, దేవేంద్రులాదుల ప్రార్ధనచేత, శ్రీ మహావిష్ణువు యొక్క సంకల్పబలం వల్ల 'క్షీరసాగర కన్యక' గా ఆవిర్భవించింది. తేజస్సునకు, మాంగల్యానికీ, కాంతికి శాంతి సుఖాలకు ప్రధాన దేవత ఈ లక్ష్మీదేవి. తనను ఆశ్రయించిన వారికి సంకల్ప మాత్రం చేతనే సర్వసంపదలనూ అనుగ్రహింపగల శక్తి ఆమెది. ఆ లక్ష్మీదేవి, వేదవాక్కులలో, భగవన్నామములో, గోపుచ్ఛములో, తులసీవృక్షంలో, ఏనుగు కుంభస్ధలంలో,శంఖంలో, ముత్యములో, స్త్రీలసీమంత ప్రదేశంలో, సత్య వాక్కులో, అగ్ని హోత్రములో సూక్ష్మరూపిణిగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఇలాంటి స్థానాలను ఆదరించి, గౌరవించి, పూజించిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా లభిస్తుంది.తిరస్కరించిన వారికి కష్టాలు తప్పవు.

ఒక నాడు దూర్వాసముని వైకంఠంలో శ్రీ మహావిష్ణువును పూజించి, ఆయన ధరించిన పుష్పమాలను లక్ష్మీ ప్రసాదంగా స్వీకరించి, తిరిగి వెళ్తూ, మార్గం మధ్యలో స్వర్గలోకంలో ప్రవేశించాడు. తనకు ఆతిథ్య సత్కారాలను సమర్పించిన ఇంద్రునికి లక్ష్మీ ప్రసాదమైన పుష్పమాలను కానుకగా ఇచ్చాడు. ఇంద్రుడు ఆ పుష్పమాలను విలాసంగా తన వాహనమైన ఐరావతం మెడలో వేశాడు. పుష్పమాలా స్పర్శకు కలత చెందిన ఆ ఏనుగు ఆ మాలను తొండంతో లాగి నేలపై పడవేసి, పాదాలతో త్రొక్కి, ఛిన్నా భిన్నం చేసింది. తానిచ్చిన పుష్పమాల తన ఎదుటే ఇలా విధ్వంసం కావడానికి కారకుడైన ఇంద్రుని పై దుర్వాసమహర్షి ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'రాజ్యబ్రష్టుడవై పొమ్మ'ని శపించాడు. ఇంద్రుడు స్వర్గరాజ్యాలక్ష్మికి దూరమై కొండల్లో, కోనల్లో సంచరించ సాగాడు.

అలా సంచరిస్తూ, దేవేద్రుడు తన కష్టాలు తీరే ఉపాయం చెప్పుమని దేవగురువైన బృహస్పతిని కోరాడు. బృహస్పతి సూచనపై జగన్మాతను సేవించి ఆమె అనుగ్రహం పొందాలని థ్యాననిమగ్నుడయ్యాడు. ఇంద్రుని భార్య అయిన శచీదేవి కూడా తన భర్తకు స్వర్గరాజ్యాన్ని ప్రాప్తింప చేయవలసిందిగా లక్ష్మీదేవిని ప్రార్ధించింది.వారి మెఱలు విని లక్ష్మీదేవి వారిని అనుగ్రహించగా, ఇంద్రునికి మళ్ళీ స్వర్గరాజ్యం లభించింది.

లక్ష్మీదేవికి నిలయమైన, మంగళకరమైన పవిత్ర పదార్ధాలను అవమానించరాదు. అసత్యం పలికేచోట, స్త్రీని గౌరవించలేనిచోట, భర్తనెదిరించి పలికే ఇల్లాళ్ళున్న చోట, తన సంతానంలో కొందరిపట్ల పక్షపాత దృష్టితో ప్రవర్తించే తల్లి ఉన్న చోట,వేదవిప్రులను, పతివ్రతలను బాధించేచోట, వేదనింద,యజ్ఞనింద జరిగేచోట లక్ష్మీదేవి నిలువదని వివరిస్తూ వ్యాసమహర్షి ఈ వృత్తాంతాన్ని ముగించాడు.

సరస్వతీదేవి

పరాశక్తి నుండి వెలువడిన పంచశక్తులలో వాగ్రూపిణి అయిన శక్తి సరస్వతీదేవి. మునుముందుగా శ్రీ కృశ్ణుడు సరస్వతీదేవిని పూజించాడు. మాఘ శక్ల పంచమినాడు సరస్వతీదేవిని పూజించిన వారికి సకల విద్యలూ స్వాధీనమవుతాయని నారదునికి శ్రీ మహావిష్ణువు చెప్పిన వృత్తాంతాన్ని వ్యాసమహర్షి జనమేజయునకు వివరించాడు.

కణ్వశాఖలో చెప్పబడిన విధంగా సరస్వతిని ఆరాధించడానికి ముందుగా విఘ్ననివారణకై గణపతిని పూజించి, షోడశోపచారాలతో సరస్వతిని పూజించాలి.

"శ్రీం శ్రీం సరస్వత్త్యె స్వాహా శిరో మే పాతు సర్వతః |

శ్రీం వాగ్దేవతాయై స్వాహా ఫాలం మే సర్వదా అవతు||"

అని సరస్వతీ కవచాన్ని పఠించాలి. సరస్వతీ కవచానికి ఋషి ప్రజాపతి. బృహతీ ఛందస్సు, దేవత శారద. ఫలము సర్వతత్త్వ విజ్ఞాన వేతృత్వమే. కవచము అంటే శరీరాన్ని రక్షిచేది. యుద్దానికి వెళ్ళే యోధుడు శత్రువులు ప్రయోగించే బాణాలు తనకు తగులకుండా ఉండడానికి కవచం ధరిస్తాడు. అలాగే దేవతోపాసనకు పూనుకున్న సాధకుడు ఆ దేవతా సంబంధమైన కవచాన్ని మంత్ర బీజాక్షర రూపంగా పఠంచాలి. వెలుపల ఉన్న భూత ప్రేత పిశాచాదులవల్ల సాధకుని ఆరాధనకు అంతరాయం కలగకుండా కవచం రక్షిస్తుంది.

పూర్వము యజ్ఞవల్క్యుడు అనే మహర్షి గురువు ఇచ్చిన శాపంవల్ల విద్యావిహీనుడయ్యాడు, అతడు సూర్యుణ్ణి ఆరాధించి, సూర్యుని అనుగ్రహంతో సరస్వతీ స్తోత్రం చేసి అపారమైన ప్రతిభా పాండిత్యాలను సంపాదించాడు. ఈతడు చేసిన సరస్వతీస్తోత్రం ముప్ఫయి రెండు శ్లోకాల్లో దేవీ భాగవతంలో గోచరిస్తుంది. ఈ స్తోత్రాన్ని చదివినా, విన్నా, స్మరించినా అపారమైన విద్యావైభవం కలుగుతుందని ఫలశ్రుతిని అనుగ్రహించాడు వ్యాసమహర్షి, వర్ణ, శబ్ద, పద, వాక్య రూపాలలో, కవితారూపంలో, గానరూపంలో, ఆలోచనారూపంలో, కల్పనారూపంలో తనను ఆరాధించిన వారికి బహుముఖ ప్రజ్ఞాపాటవాలను ప్రసాదించి, వారిని సరస్వతీ పుత్రులుగా ప్రఖ్యాతిని పొందునట్లు అనుగ్రహించే విద్యాప్రదాత్రి సరస్వతీ మాత. రాజసీ శక్తి స్వరూపిణిగా ఉన్న సరస్వతి బ్రహ్మదేవునికి సహచారిణి అయి, సృష్టి కార్యక్రమాన్ని నిర్వర్తింప చేస్తుంది.

సావిత్రీదేవి

సావిత్రీదేవి వేదమాత, పంచశక్తులలో చివరిది. సావిత్రిని పూజించిన వారిలో మొదటి వాడు బ్రహ్మ. ఆ తరువాత వేదగణాలు, పండిత వర్గం సావిత్రీ దేవతను ఉపాసించారు.

పూర్వం భరతఖండాన్ని అశ్వపతి మహారాజు పాలించేవాడు. అతని భార్య మాలతి అనుకూలవతి. ఆ దంపతులు సంతతి లేక చాలా కాలం పరితపించారు. వశిష్ఠమహర్షి ఉపదేశానుసారం గాయత్రీ మంత్రాన్ని పది లక్షలు నియమ బద్దంగా జపించి, సావిత్రీ వ్రతం ఆచరించారు.

"తత్త్వకాంచన వర్ణాభాం జ్వలంతీం బ్రహ్మతేజాసా|

గ్రీష్మమధ్యాహ్న మార్తాండ సవిత ప్రభామ్‌||

వేదాధిష్ఠాతృ దేవీం చ వేదశాస్త్ర స్వరూపిణీం|

వేద బీజ స్వరూపాం చ సావిత్రీం మాతరం భ##జే||"

అని సావిత్రీ దేవతను ధ్యానించి పూజించగా, సావిత్రీ దేవి ఆ దంపతులకు ఒక పుత్రికను అనుగ్రహించంది. ఆ బిడ్డకువారు 'సావిత్రి' అని పేరు పెట్టుకున్నారు. సూర్యమండలాంతర్గతమైన తేజస్సుకే 'సవిత' అని పేరు. ఆమెయే సావిత్రి. మధ్యాహ్నవేళ జ్యోతిస్వరూపిణిగా ఉపాసకుల హృదయాలలో దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటుంది. అలాంటి దివ్యతేజో విశేషం వల్ల తమకు కలిగిన బిడ్డకు ఆ దేవత పేరే పెట్టుకొని ఆ దంపతులు సంతోషించారు.

ఆ కన్య క్రమంగా పెరిగి పెద్దదై ¸°వనవతి అయింది. తండ్రి అయిన అశ్వపతి తన కుమార్తెకు వివాహం చేయాలని నిశ్చయించి, వరాన్వేషణ ప్రారంభించాడు. కాని సావిత్రి ద్యుమత్సేనుని కుమారుడైన సత్యవంతుణ్ణి భర్తగా భావించి, అతన్నే వివాహం చేసికోదలచినట్లు తండ్రికి చెప్పింది. సత్యవంతుడు రాజ్యభ్రష్టుడని, అల్పాయుష్కుడని విని అశ్వపతి కుమార్తెకు నచ్చచెప్ప చూశాడు. కానీ వరుని విషయంలో ఆమె ప్రకటించిన అభిప్రాయము ఆమె నిర్ణయమే అని గుర్తించి, దైవముపై భారమువేసి సావిత్రిని సత్యవంతునికే ఇచ్చి వివాహం జరిపించాడు.

సావిత్రీ సత్యవంతులు సంవత్సరకాలం ప్రశాంతంగా దాంపత్య జీవనం గడిపారు. తన భర్త అల్పాయుష్కుడని విని సావిత్రి అనుక్షణం అతన్ని నీడలా అనుసరిస్తూ, పరిచర్యలు చేస్తూ ఉంచేది. ఒకనాడు సత్యవంతుడు అడవికి పోగా, సావిత్రి అతన్ని అనుసరిస్తూ. అడవిలో కట్టెలు కొడుతూ సత్యవంతుడు చెట్టు నుండి జారిపడి మరణించాడు. సత్యవంతుని ప్రాణశక్తిని బంధించుకొని పోవడానికి వచ్చిన యమధర్మరాజును సావిత్రి వెంటాడ సాగింది. యముడు ఆమెకు ఎన్నో విధాల నచ్చచెప్పాడు. మానవశరీరంతో తన వెంట రావడం సాధ్యం కాదని, ఆమె భర్తకు కాలం తీరింది కనుకనే తాను పరలోకానికి తీసుకొని పోవుచున్నానని, కర్మఫలాను భవం అనివార్యమని, ఎంత ప్రయత్నించినా భర్తను బ్రతికించు కోవడం అసాధ్యమని- అమెను వెనక్కు మళ్ళించాలని పరిప్రి విధాలుగా చెప్పాడు.

యముడు ఏమి చెప్పినా ఎన్ని చెప్పినా వినక, సావిత్రి అతన్ని అనుసరించ సాగింది. కర్మము, కర్మఫలము, దేహము దేహి, జ్ఞానము, బుద్ధి ప్రాణము, ఇంద్రియాలు, జీవేశ్వరుల లక్షణాలు మొదలైన అంశాలను గూర్చి ప్రశ్నించి, యమధర్మరాజు చెప్పే సమాధానాలు వింటూ, మరి కొంత దూరం అనుసరించింది.

"ఓ ధర్మదేవతా ! నా భర్త ప్రాణాలను తీసుకొని, నన్ను ఒంటరిగా తిరిగి పొమ్మనడం నీకు న్యాయం కాదు."అని యమధర్మరాజు నిలదీసింది సావిత్రి.

యమధర్మరాజు అమె తల్లి దండ్రులకు పుత్రప్రాప్తిని, అమె అత్త మామలకు నేత్రదృష్టిని అమెకు వరంగా ప్రసాదించాడు. అయినా, ఇంకా సావిత్రి తనను అనుసరిస్తూ వస్తూ ఉండటం చూచి , యమధర్మరాజు ఆమె పాతవ్రత్య మహిమకు తలఒగ్గి సత్యవంతుణ్ణి బ్రతికించాడు.

"ఓ సావిత్రీ ! సావిత్రీ దేవతా ప్రభావం చేత నీ భర్తను నువ్వు బ్రతికించుకోగలిగావు. %ా సావిత్రీ వ్రతం స్త్రీలను సౌమాంగల్య సౌభాగ్య ప్రదం. ఆ దేవతా వరప్రసాదం వల్ల పుట్టిన నువ్వు భక్తి శ్రద్ధలతో, వినయ సౌశీల్యాలతో, ఆధ్యాత్మిక ఆసక్తితో నన్ను మెప్పించావు. నీ భర్తతో కలసి సుఖశాంతులు అనుభవిస్తూ, నారీలోకానికి ఆదర్శమూర్తివై 'సావిత్రి' గా ఆరాధింపబడితావు. అని ఆశీర్వదించి యముడు అంతర్ధాన మయ్యాడు.

ఈ విధంగా పరాశక్తి నుండి ఆవిర్భవించిన దుర్గ, రాధ, లక్ష్మి, సరస్వతి, సావిత్రి అనే పంచశక్తుల వృత్తాంతాలను వ్యాసమహర్షి జనమేజయునకు వివరించాడు.

Devi Kathalu         Chapters          Last Page