Devi Kathalu         Chapters          Last Page

దేవి అంశావతారాలు

లోకయాత్ర ధర్మబద్ధంగాను, వేదవిహితంగాను సాగాలనే సత్సం కల్పంలో , వివిధ సందర్భాలలో దేవీ తన అంశావతారాలను అనుగ్రహించింది. దేవికి ప్పతిరూపాలుగా స్వాహాదేవి, స్వధాదేవి, దక్షిణాదేవి, మంగళ చండిక మానసాదేవి, షష్ఠీ దేవి అనే వారు దిగివచ్చారు. వారి వృత్తాంతాలను సంగ్రహంగా పరిశీలిద్దాం.

స్వాహాదేవి

బ్రహ్మా దేవుని సృష్టిలో దేవ, గంధర్వ, కిన్నర, కింపురుష, యక్ష, సిద్ధ, సాధ్యాది వివిధ దేవతా గణాల వారున్నారు. వీరిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన ఆహారం అభీష్టం . దేవతలు ఒకనాడు సత్యలోకానికి వెళ్ళి తమకు తగిన ఆహారం కల్పించ వలసిందిగా బ్రహ్మను ప్రార్థించారు."యజ్ఞవేదికల నుండి అగ్నిముఖంగా వేదవిప్రులు మంత్ర పూర్వకంగా అర్పించే పదార్థాలు ఆధారంగా మీకు తగిన ఆహారాన్ని కల్పించగల అభీష్ట సిద్ధిని పొందండి" అని బ్రహ్మ చెప్పాడు. అంతట దేవతలందఱు వైకుంఠానికి వెళ్ళి శ్రీమహావిష్ణువును సమీపించి తమ కోరికను నివేదించారు. అంతట విష్ణువు "ఓ దేవతలారా! యజ్ఞ సమయంలో బ్రాహ్మణులు యజ్ఞపతిని ప్రార్థించి , అగ్ని దేవుని ద్వారా అర్పించిన పదార్థాలు మీకు ఆహారమై మిమ్మల్ని , సంతృప్తి పరుస్తాయి. అయితే, అగ్నిలో సమర్పితమైన ఆయా ఆహుతులను మీకు అందించే శక్తి అవసరం. ఆ శక్తిని అనుగ్రహించ వలసిందిగా పరాశక్తిని ప్రార్థించండి" అని హితలు చెప్పాడు. ఆ మాటలు విని దేవతలు ధ్యాననిష్ఠతో పరమేశ్వరిని ప్రార్థించాడం ప్రారంభించారు. పరమేశ్వరీ ధ్యానం ఇలా సాగుతుండగా ఆ పరమేశ్వరి బ్రహ్మదేవుని మనోనేత్రాలకు సాక్షాత్కారించింది. దివ్య సుందర విగ్రహ స్వరూపంతో తన మనోనేత్రాలకు గోచరించిన పారాశక్తిని చూచి బ్రహ్మ ఎంతో ఆనందించాడు. "విరించీ! ఒక వరం కోరుకో" అన్నది పరమేశ్వరి. అపుడు బ్రహ్మ అమ్మా! అగ్ని ముఖంగా వేదవిప్రులు సమర్పించే హవిస్సులను దేవతలకు ఆహారంగా అందించే శక్తి అవసరమై ఉన్నది. అలాంటి శక్తిని ప్రసాదించు తల్లీ" అని కోరుకున్నాడు. అంతట ఆమె" అగ్నిదేవునకు హవిస్తులు సమర్పిస్తూ బ్రాహ్మణులు ఉచ్చరించే మంత్రాల చివర "స్వాహా" అనే పేరు గల నామాన్ని చేర్చి ఉచ్చరిస్తే , ఆ పదార్థాలు దేవతలకు ఆహారంగా అంది, వారికి సంతృప్తిని కలిగిస్తాయి అని తెలియ" చెప్పింది.

ఇంకా ఆ దేవి ఇలా అన్నది. చతురాననా! దేవి అంశగా అవతరించిన నన్ను "స్వాహాశక్తి"అంటారు. నేను శ్రీమహావిష్ణువును గూర్చి చిరకాలం తపస్సు చేశాను. నిరంతరం మనస్సులో ఆ పురుషోత్తముని రూపాన్నే నిలుపుకొని నియమవ్రతం పాటించి, నిశ్చలధ్యానం సాగించాను. ఒకనాడు అతని దివ్యమంగళ రూపాన్ని చూచి పారవశ్యాన్ని నిగ్రహించుకోలేక మూర్ఛపోయాను. అతడు నాభావాన్ని గ్రహించి, అంశావతార స్వరూపంగా 'స్వాహా' అనే పేరుతో 'దాహికా' (దహించగల) శక్తిగా ఉండుమని నన్ను ఆజ్ఞాపించాడు. తాను అగ్నిగా ఉండి నన్ను పత్నిగా స్వీకరిస్తానని అనుగ్రహించాడు. ఆ నాటి నుండి నేను అగ్నిదేవుని పత్నినై, 'స్వాహాదేవి 'అనే శక్తిగా అవతరించాను. ఇపుడు మీ ప్రార్థనలు ఆలకించి, 'స్వాహా' రూపంలో ప్రత్యక్షమయ్యాను. 'స్వాహా' అనే నానామాన్ని ఉచ్చరిస్తూ బ్రాహ్మణులు అగ్నిలో సమర్పించే పదార్థాలను దేవతలకు అందిస్తాను." అని పలికి అంతర్థానమైంది.

ఆనాటి నుండి దేవతలు నిర్ణయాము సారంగా యజ్ఞం చేసే బ్రాహ్మణులు 'స్వాహా' నామాన్ని జోడించి మంత్రోచ్చారణలు సాగించారు. పరమేశ్వరి సంకల్పం చేత అగ్నితో సంపర్కం పొందిన స్వాహాదేవికి దక్షిణాగ్ని, గార్హపత్యం. ఆహవనీయం అనే పేర్లు గల ముగ్గురు కుమారులు కలిగారు. వారికే త్రేతాగ్నులు అని పేరు. యజ్ఞంలో తేతాగ్నుల ద్వారా అగ్నికి హవిస్సురను సమర్పించే వేళలో బ్రాహ్మణులు ఆయా దేవతల పేర్లను మంత్ర పూర్వకంగా ఉచ్చరిస్తూ 'స్వాహా' నామాన్ని జోడించ సాగారు. అంతట ఆయా హావిర్భాగాలు ఆయా దేవతలకు చేరి, వారిని సంతృప్తి పరిచేవి.' స్వాహా 'నామం జోడించకుండా మంత్రోచ్చారణం సాగినా, యజ్ఞాగ్నిలో సమర్పితమైన హవిర్భాగాలు దేవతలకు చేరవు విషహీనమైన సర్పం, వేదవిద్యా విహీనుడైన బ్రాహ్మణుడు, భర్త కు అనుకూలవతి కాని భార్య, విద్యాగంధం లేని పురుషుడు , ఫలముల లేని వృక్షం నిరర్థకములై, నింద్యములైనట్లే 'స్వాహా' విరహితమైన మంత్రంతో చేసే హోమం కూడా నిష్ఫలమే అవుతుంది.

ఈ విధంగా స్వాహాశక్తి ద్వారా దేవతలకు సంతృప్తిని కలిగించి, మానవునకు ఆయా దేవతల అనుగ్రహం పొందే అవకాశాన్ని పరాశక్తి ప్రసాదించింది. పరాశక్తి నుండి అంశావతారంగా 'దిగి వచ్చిన' దివ్య శక్తియే 'స్వాహాదేవి.' అందువల్లనే' ఇంద్రాయ స్వాహా' , 'వరుణాయ స్వాహా'అనే మంత్రాలలో ఆయా దేవతల పేర్లకు' స్వాహా' నామాన్ని జోడించి బ్రాహ్మణులు యజ్ఞం చేయడం మనం చూస్తూ ఉంటాం. అలాంటి స్వాహాదేలి మనకు ఆరాధ్య దైవం.

స్వధాదేవి

బ్రాహ్మదేవుడు, పితృదేవతా గణాలకు శ్రాద్ధ కర్మలలో తర్పణ పూర్వకంగా సమర్పించే పదార్థాన్ని ఆహారంగా నియమించాడు. బ్రాహ్మణులు తర్పణలు ఇస్తున్నప్పటికీ పితృదేవతలకు సంతృప్తి కలుగలేదు. ఆ పితృగణాలు బ్రహ్మను ప్రార్థించగా ఆయన ధ్యాన నిమగ్నుడై మానస పుత్రికను సృష్టించి, ఆమెను గుణవతిగా, విద్యావతిగా తీర్చిదిద్ది, ఆకన్యకు 'స్వధాదేవి' అని నామకరణం చేశాడు. పితృదేవతలకు పత్నిగా స్వధాదేవిని నియమించాడు. ఆనాటి నుండి పితృదేవతలు, మహర్షులు, విప్రులు, మానవులు "స్వధాదేవిని "పూజిస్తూ, ఆమె అనుగ్రహంతో పితృదేవతలను సంతృప్తి పరుస్తూ వచ్చారు.

"బ్రాహ్మణో మానసీం శశ్వత్సుస్థిర ¸°వనాం|

పూజ్యానాం పితృదేవానాం శ్రద్ధానాం ఫలదాం భ##జే||"

అని స్వధాదేవిని ప్రార్థిస్తూ ఉంటారు.

పరాశక్తి అంశావతారంగా స్వదాశక్తి ఆవిర్భవించి, పితృదేవతలకు సంతృప్తిని ప్రసాదించింది. శ్రాద్ధ కర్మలలో, బలితర్పణాల్లో తీర్థస్నానాల్లో స్వధాదేవీ నామాన్ని ఉచ్చరిస్తే సర్వపాపాల నుండి విముక్తి లభిస్తుందని వ్యాసమహర్షి వివరించాడు.

దక్షిణా దేవి

గోలోక నివాసి అయిన శ్రీకృష్ణునకు సుశీల అనే ప్రియురాలు ఉంది. శ్రీకృష్ణుడు ఆమెను ఎంతో ఆదరానురాగాలతో చూచేవాడు. అది రాధకు సుశీల పట్ల మాత్సర్య కారణమైంది. రాధ మాత్సర్యాన్ని చూచి శ్రీకృష్ణుడు అంతర్థాన మయ్యాడు. గోపకులు గోపకాంతలు వచ్చి రాధను ప్రార్థించారు. సుశీల పట్ల సఖ్య భావాన్ని కలిగి ఉంటే శ్రీకృష్ణుడు పునర్దర్శన మిస్తాడని రాధను వేడుకున్నారు. రాధ తన పొరపాటు దిద్దికోపోగా, "గోలోకంలో అడుగుపెడితే , భస్మమైపోతా"వని సుశీలను శపించింది.

సుశీల బ్రహ్మదేవుని సూచన ననుసరించి గోలోకాన్ని విడిచిపెట్టి వెళ్ళి తపస్సు చేయసాగింది. లక్ష్మీ దేవి అనుగ్రహం పొంది ఆమెలో ఐక్యమైంది. ఆ తర్వాత బ్రహ్మాదులు యజ్ఞఫలం పరిసమాప్తి పొందడానికి ఒక దేవతా మూర్తిని తమకు ప్రాసాదించ వలసిందిగా విష్ణువును ప్రార్థించగా, శ్రీమహావిష్ణులు లక్ష్మీ దేవి అంశగా ఆమె శరీరం నుండి ఒక దివ్యశక్తిని ఆవిర్భవింప జేసి బ్రహ్మ దేవునికి ప్రసాదించాడు. బ్రహ్మ ఆ శక్తిని యజ్ఞ పురుషునకు సమర్పించాడు. యజ్ఞపురుషుడు ఆ శక్తి సహాయముతో యజ్ఞఫలాలను యజమానులకు అందించసాగాడు. ఆ శక్తియే దక్షిణాదేవి దేవి అంశావతారంగా ఆమె అవతరించింది. యజ్ఞాలలో దక్షిణా దేవి ప్రధాన ఆరాధ్య దైవం. దక్షిణా దేవి కర్మఫలాన్నివ్వదు. కర్మఫల ప్రాప్తికై దక్షిణా దేవిని సేవించాలి. కార్తీక పూర్ణిమనాడు లక్ష్మీ దేవి శరీరం నుండి ఆవిర్భవించిన ఈ దక్షిణాదేవిని యజ్ఞపురుషులు ఆరాధించి, ఆదరించి, యజ్ఞఫలాలను పొందుతూ ఉంటారు. యజ్ఞఫల ప్రాప్తికై సమర్పించే దక్షిణ ఈ దక్షిణాదేవి స్వరూపమే అని వ్యాసుడు వివరించాడు.

మంగళ చండికాదేవి

భూదేవి కుమారుడైన అంగారకునకు 'మంగళుడు' అని పేరు. అతనికి చెందిన వారమే మంగళవారము లేదా అంగారకవారము.

మనువంశంలో మంగళుడనే పేరు గల ఒక రాజున్నాడు. అతడు నిరంతరం దేవిని పూజించి, అభీష్ట సిద్దిని పొందాడు. సిద్దించిన అభీష్టాలన్నీ మంగళ ప్రదమైనవై, అన్యదుర్లభ##మైన తేజస్సుతో ప్రకాశించాయి. అందు చేతనే ఆమెకు "మంగళ చండిక" అని పేరు.

ఆ దేవి స్మరణం చేతనే సమస్త కార్యాలూ మంగళ ప్రదమవుతాయి. ఆ దేవి అనుగ్రహం చేతనే బలపరాక్రమాది సంపదలు అసంఖ్యాకంగా లభిస్తాయి. మంగళ స్వరూపురాలై ఆశ్రయించిన వారికి మాంగల్యాన్ని ప్రసాదించే ఆ దేవత "మంగళ చండిక".

త్రిపురాసుర సంహార సమయంలో శంకరుడు ఈ మంగళ చండికను పూజించి సంహారక శక్తిని సంపాదంచి విష్ణువును ప్రేరేపించి త్రిపురాసుర సంహారం కార్యాన్ని నిర్విఘ్నంగా నిర్వహించాడు.

శంకరుడు ఒకనాడు రాక్షసులతో యుద్దం చేస్తండగా, అతని వాహనం భగ్నమైంది. అపుడు అతడు 'మంగళ చండిక'ను ప్రార్థించి మంగళ ప్రదమైన వాహనాన్ని పొంది విజయం సాధించాడు.

సర్వకాల సర్వాలస్థలలో మంగళ చండికను పూజించి, ఆమె అనుగ్రహానికి పాత్రులు కావలసిందిగా శంకరుడు తన పరివారానికి వివరించాడు.

"దేవీం షోడశ వర్షీయాం శశ్వత్సుస్థిర ¸°వనాం|

బింబోష్ఠీం సుదతీం శుద్ధాం శరత్పద్మ నిభాననాం||"

అని మంగళ చండికను ధ్యానించే విధానాన్ని వివరించాడు. దుష్టశక్తులను జయింపగోరేవారు. ఈ మంగళ చంéడికను ఆరాధించాలని వ్యాసమహర్షి వివరించాడు.

మానసాదేవీ

కశ్యప ప్రజాపతి ప్రార్థన చేత పరమేశ్వరి ఆయన కుమార్తెగా ఆయన మనస్సులో నిరంతరమూ తేజోరూపంతో ప్రకాశిస్తూ సర్వకార్య సిద్ధిని కలిగించ సాగింది.

ఈ మానసాదేవి మూడు యుగాల కాలము తపస్సు చేసి, తపః ప్రభావం వల్ల శైవి, వైష్ణవి, వాగేశ్వరి, విషహరి అనే పేర్లుతో ప్రఖ్యాతి చెందింది. జనమేజయుని సర్పయాగాన్ని మాన్పించిన అస్తీకుడు మానసాదేవి పుత్రుడే.

"జగత్కారుర్జర ద్గౌరీ సిద్ధయోగీనీ|

వైష్ణవీ నాగభగినీ శైవీ వాగీశ్వరీ తథా||

జరత్కారు ప్రియా ఆస్తీకమాతా విషహరేతిచ|

మహాజ్ఞాన యుతా చైవ సా దేవీ విశ్వపూజితా||"

అనే పన్నెండు పేర్లతో ఈ మానసాదేవిని ఆరాధించిన వారికి విషభయం మొదలైన అన్ని భయలూ తొలగిపోతాయి.

పరీక్షిత్తు కుమారుడైన జనమేజయుడు సర్పయాగం చేశాడు. ఎక్కడెక్కడి సర్పాలూ ఆగ్నికి ఆహుతి అయ్యాయి. నాగరాజైన తక్షకుణ్ణి కూడా నాశనం చేయాలనే సంకల్పంతో జనమేజయుడు ప్రయత్నించాడు. ఆ తక్షకుడు ప్రాణభయంతో ఇంద్రుణ్ణి ఆశ్రయించాడు. ఆ సంగతి గ్రహించిన జనమేజయుడు "సహేంద్ర తక్షకాయ స్వాహా" అని మంత్రోచ్ఛాటనం చేశాడు. తక్షకుణ్ణి రక్షించబోయిన తనకు సైతం ముప్పు వాటిల్ల నున్నదని గుర్తించి ఇంద్రుడు, ఎలాగైనా సర్పయాగాన్ని మాన్పించ వలసిందిగా ఆస్తీకుణ్ణీ ప్రార్థించాడు. ఆస్తీకుడు జనమేజయుని వద్దకు వెళ్ళి సర్పయాగాన్ని మాన్పించి, సర్పజాతికి ప్రాణభయం లేకుండా చేశాడు. అలాంటి ఆస్తీకునికి తల్లి అయిన 'మానసాదేవిని 'అరాధించిన వారికి సమస్త భయాలూ బాధలూ తొలగిపోతాయి.

ఈవృత్తాంతం చెప్పి , వ్యాసమహర్షి జనమేజయుణ్ణి దేవీ యాగానికి ప్రోత్సహించాడు. ప్రతీకారేచ్ఛ లక్ష్యంగా , ప్రాణ హింస ప్రథానంగా సాగించిన సర్పయాగం వల్ల ప్రాప్తించిన పాపం పరిహారం కావాలంచే దేవీయాగం చేసి, మానసాదేవిని ఆరాధించడం మంచిదని వ్యాసుడు జనమేజయునకు ఉపదేశించాడు. దేవి అంశావతార రూపమే మాసాదేవి.

షష్ఠీదేవి

ప్రకృతి స్వరూపిణీ అయిన పరాశక్తి నుండి ఆఱవ అంశావతారంగా ఆవిర్భవించిన శక్తి షష్ఠీదేవి. శిశుజననము, శిశివుల అంగసౌష్ఠవము, వారి రక్తమాంసాలు, వారి ప్రాణశక్తి మొదలైన వాటికి అధిష్ఠాన దేవత ఈ "షష్ఠీదేవి" శిశు సంరక్షణలో ప్రధాన మాతృకగా ఆరాధింపబడే దేవత "షష్ఠీదేవీ" దేవలోకంలో ఈమెకు "శిశుప్రదాత్రి" అని పేరు. ఈమెనే "దేవసేన" అని కూడా వ్యవహరిస్తారు. శిశువులకు ఆయురారోగ్యాలను ప్రసాదించే దేవత "షష్ఠీదేవి" , భూతప్రేత పిశాచాది దుష్టశక్తుల నుండి శిశువులను సంరక్షించే దేవత 'షష్ఠీదేవి'.

స్వాయంభువ మనువునకు పుత్రుడైన ప్రియవ్రతుడు చిరకాలం తపస్సు చేసి, చివరకు బ్రహ్మదేవుని ఆదేశానుసారం తపస్సు చాలించి, గృహస్థ ధర్మాన్ని , స్వీకరించాడు. ఎంతకాలం గడిచినా ఆ దంపతులకు సంతానం కలుగలేదు. కశ్యపుడు వారి చేత "పుత్రకామేష్టీ" అనే యాగం చేయించాడు. యజ్ఞపాయసం స్వీకరించిన ప్రియవ్రతుని భార్య గర్భవతి అయి, బంగారు ఛాయతో ప్రకాశించే కుమారుణ్ణి కన్నది కాని, మాతృగర్భం నుండి భూమిపై పడుతూనే ప్రాణాలు విడిచిపెట్టాడు. మృతపుత్రుణ్ణి భుజాన వేసికొని, ప్రియవ్రతుడు స్మశానానికి వెళ్ళాడు. అక్కడ దుర్భరమైన గర్భశోకంతో అతడు తల్లడిల్లి పోతుండగా మణికాంతులతో ప్రకాశిస్తున్న ఒక విమానం ప్రియవ్రతునికి కన్పించింది. ఆ విమానంలో ఒక దేవతామూర్తి కనిపించింది. ఆమెను చూడగానే ప్రియవ్రతుడు, మృతపుత్రుణ్ణి నేలపై ఉంచి, ఆ దేవతకు నమస్కరించాడు. అపుడు ఆమె "ఓ రాజా! నేను బ్రహ్మ మానసపుత్రికను. నన్ను "దేవసేన" అంటారు. బ్రహ్మదేవుడు నన్ను సృష్టించి కుమారస్వామికి సమర్పించాడు. పుత్రులు లేని వారికి పుత్రులను ప్రసాదించి, ఆ శిశువులను సంరక్షిస్తూ ఉండే శక్తిని నేనే. ప్రాణులకు వారి కర్మానుసారంగా సుఖదుఃఖాలను, శోకభయాలను కలిగించేదీ, దరిద్రులకు సంపదలను అనుగ్రహించేదీ నేనే. సంతాన ప్రాప్తి, సంతాన హీనత, శిశు మరణము, చిరజీవనము అన్నీ కర్మను అనుసరించే జరుగుతాయి". అని పలికింది. ఆ మృతశిశివును ఆ దేవత అలా చేతితో తాకింది. అంతే. ఆ బాలుడు పునర్జీవితుడయ్యాడు. ప్రియవ్రతుడు ఆశ్చర్యానందాల నుండి తేరుకొనేలోగా ఆ బాలుణ్ణి తీసికొని ఆ దేవత ఆకాశమార్గంలో ఎగిరి పోసాగింది. తనకు పుత్రభిక్ష ప్రసాదించ వలసిందిగా వేడుకుంటూ ప్రియవ్రతుడు దేవిని అనుసరించాడు.

అంతట ఆ దేవత ఆ శిశివును ప్రియవ్రతునకు అప్పగించి." రాజా! మనుపుత్రుడవైన నీవు షష్ఠీదేవతగా నన్ను ఆరాధించావు. ఈ ఆరాధనా విధానాన్ని లోకంలో పదిమందికీ తెలియచెయ్యి. పునర్టీవితుడైన నీ కుమారుడు గుణవంతుడై, పండితుడై "సువ్రతుడ"నే పేరుతో ఖ్యాతిని పొందుతాడు. నూఱు యజ్ఞాలు ఆచరించి ఇంద్రుని మించిన కీర్తిని పొందుతాడు." అని ఆశీర్వదించి, అంతర్థానమైంది.

ప్రియవ్రతుడు అమాత్యులతో కలసి తన అంతఃపురానికి తిరిగి వెళ్ళి , జాతకర్మాదులు మహోత్సముగా నిర్వహించి, షష్ఠీదేవిని పూజించి , ఆమె అనుగ్రహం పొంది. ఆమె కృపా మహిమను లోకానికి వెల్లడించాడు.

పురుటింటిలో అఱవరోజున షష్ఠీదేవిని అరాధిస్తే శిశివునకు ఏ విధమైన బాలగ్రహదోషమూ కలుగదు. ఇరవై ఒకటవ రోజున, నామకరణం, అన్న ప్రాశనాది శుభసందర్భాలలో తల్లిదండ్రులు షష్ఠీదేవతను పూజించి, అమె అనుగ్రహం పొందితే వారిబిడ్డలకు ఆయురారోగ్యాభివృద్ధి కలుగుతుంది.

"వీరం పుత్రం చ గుణినం విద్యావంతం యశస్వినం|

సుచిరాయుష్యవంతం చ సూతే దేవీ ప్రాసాదతః ||"

అని షష్ఠీదేవతా మహిమను ప్రియవ్రతుడు ప్రజలకు బోధించి, తన జీవితాన్ని సార్థకం చేసుకొన్నాడని వివరుస్తూ, వ్యాసమహర్షి దేవి అంశావతార గాధలను పరిసమాప్తం చేశాడు.

Devi Kathalu         Chapters          Last Page