Devi Kathalu Chapters Last Page
వేదవతి
మనువులలో ఒకడైన దక్షిణసావర్ణి వంశం తామర తంపరగా అభివృద్ధి చెందింది. ఆ వంశంలో ఇంద్రసావర్ణి కుమారుడైన వృషధ్వజుడు శివభక్తి పరాయణుడు. నిరంతరం పరమశివుని ధ్యానించేవాడు. అయితే అతడు తక్కిన దేవతలను చిన్నచూపు చూడడంవల్ల సూర్యుడు అతనిపై కోపించి, రాజ్యభ్రష్టుడవు కమ్మని శపించాడు. తన భక్తుని శపించినందుకు సూర్యునిపై శివునిగి ఆగ్రహం కలిగింది.శివుడు త్రిశూలం చేతబట్టి సూర్యుణ్ణి వెంబడించాడు. సూర్యుడు కశ్యప ప్రజాపతిని ప్రార్థించి అతనితో కలసి సత్యలోకానికి వెళ్ళి, బ్రహ్మను ఆశ్రయించగా, బ్రహ్మ వారందరినీ వెంట పెట్టుకొని వైకుంఠానికి చేరాడు. విష్ణుమూర్తి సూర్యునకు అభమిచ్చి, శివునకు తనకు అభేదమని, కోట్లాది సూర్యులను, కోట్లాది బ్రహ్మలను సృష్టించగల శక్తి శివునికి ఉన్నదని చెప్పాడు. సర్వమంగళ స్వరూపుడైన శంకరుడు నిత్యమూ తననే ధ్యానిస్తూ ఉంటాడని, పంచముఖాలతో తన మంత్రాన్ని జపిస్తూ ఉంటాడని చెప్పాడు. అలాగే తాను కూడా నిరంతరం ఈశ్వర ధ్యానం చేస్తూ ఉంటానని విష్ణువు వివరించాడు. తమ యిద్దరిలో ఎవరికి అపచారం జరిగినా, అది ఇద్దరికీ చెందుతుందని నచ్చచెప్పాడు.
"యో హరిః సః సాక్షాత్ యశ్శివ స్సస్స్వయం హరిః|
నానయో రంతరం కించిత్ తత్త్వమేకం పరం మహాః "||
అని వివరించాడు. ఇంతలో శివుడు వచ్చి విష్ణువునకు నమస్కరించాడు.
"లక్ష్మీ నాథా! నిన్ను ఆశ్రయించిన వానికి ఆపదలు సంభవించవు. కాని, నా భక్తుడైన వృషధ్వజుని గతి యేమిటి? సూర్యుని శాపం వల్ల అతడు రాజ్యభ్రష్టుడైనాడు. నా భక్తునకు ఈ దుస్థ్సితి కలగడం నేను సహించలేను." అని ఈశ్వరుడు అన్నాడు.
ఆ మాటలకు శ్రీమహావిష్ణువు , చిరునవ్వుతో "మహేశ్వరా! ఎప్పటి మాట? ఏనాటి
వృషధ్వజుడు? నీవు వచ్చింది మొదలు ఇప్పటికీ వైకుంఠంలో అర్ధఘటికా కాలం గడిచింది. కాని భూతలోకంలో ఇరవై ఒక్క యుగాలు గడిచిపోయాయి. నీ భక్తుడైన వృషధ్వజుడు ఎప్పుడో గతించాడు. అతని వంశంలో ధర్మధ్వజుడు , కుశధ్వజుడు అనే వారు ఇప్పుడున్నారు. వారు అంశస్వరూపిణి అయిన లక్ష్మిని భార్యగా పొంది. సంపదలను, శుభాలనూ పొందగలరు" అని చెప్పగా, శివుడు సంతుష్టుడై మరలిపోయాడు.
కుశధ్వజుడు లక్ష్మీదేవి ని గురించి చిరకాలం తపస్సు చేశాడు. అతని బార్య అయిన మాల్యావతికి లక్ష్మీ దేవి అంశవల్ల ఒక పుత్రిక జన్మించింది. ఆమె పుట్టుకతోనే వేదవిద్యా సంపన్నురాలు కావడం వల్ల ఆమెకు 'వేదవతి' అని ఆ రాజు పేరు పెట్టుకున్నాడు. అమె బాల్యం నుండి తత్త్వచింతన కలదై, అరణ్యాలకు వెళ్ళి, ఒక మన్వంతర కాలం నారాయణుని గూర్చి తపస్సు చేసింది. అంతకాలం తపస్సు చేసినా , ఆమె శరీరంలో వార్థక్య లక్షణాలు కన్పించలేదు. ఆమె నిత్య¸°వనవతియై, సర్వాంగ సుందరియై తపస్సును కొనసాగించింది. అంతట, ఆకాశవాణి, "ఓ వేదవతీ! మరుజన్మలో విష్ణువు నిన్ను భార్యగా స్వీకరిస్తాడు." అని ప్రకటించింది. వేదవతి ఆ మాటలను విని సంతృప్తి తో గంధమాదన పర్వత ప్రాంతానికి వెళ్ళి, దేహం రాలిపోయేటంత వరకు తపోదీక్షతో గడపాలని నిశ్చయించు కొని, తపస్సును కొనసాగించింది.
ఇలా ఉండగా, లంకాధిపతి అయిన రావణుడు, ఒకనాడు గంధమాదన పర్వత ప్రాంతంలోవిహరిస్తూ , తపోదీక్షలో ఉన్న వేదవతిని చూశాడు. ఆమెను సమీపించాడు. ఆమె అతన్ని అతిథిగా భావించి, గౌరవించింది. మధురఫలాలు సమర్పించి, ఆతిథ్యం ఇచ్చింది. తపోదీక్షలో ఉన్నా , ఆమె శరీరకాంతికి, లావణ్యానికి ఆశ్చర్యం కలిగి, ఆమె చేయి పట్టుకోబోయాడు. అందుకు ఆగ్రహించిన వేదవతి తన చూపుతోనే రావణుణ్ణి పాషాంణంగా మార్చి వేసింది. పరమేశ్వరి కరుణ వల్ల తనకు లభించిన బావనాబలంతో ఆమె "రావణా! నా కారణంగా నువ్వు సబాంధవంగా నాశనం కాబోతున్నావు. పాషాణ రూపం నుండి విముక్తిని ప్రసాదిస్తున్నాను. "అని పలికి, రావణునికి నిజరూపం వచ్చేట్టుగా అతన్ని అనుగ్రహించి, తాను తన దేహాన్ని యోగాగ్నిలో సమర్పించింది.
ఆ వేదవతియే కాలాంతరంలో జనకమహారాజ పుత్రికయై, సీతాదేవిగా ఆవిర్భవించింది. విష్ణ్వంశ సంభూతుడైన శ్రీరామునికి భార్యయై, ఆ రావణుని సర్వనాశనానికి కారణమైంది. ఆ మహాశక్తియే మరోయుగంలో ద్రుపద మహారాజు యజ్ఞకుండంలో నుండి ద్రౌపదిగా ఆవిర్భవించి పాండవపత్నియై కురువంశ వినాసం తేసింది. కృతయుగంలో వేదవతిగా, త్రేతాయుగంలో సీతగా, ద్వాపరయుగంలో మహాలక్ష్మిగా ఆవిర్భవించి శ్రీమహాలక్ష్మి లోకకల్యాణ కారిణి అయింది.
వేదవతీ వృత్తాంతాన్ని పఠించినా, విన్నా, సర్వపాప విముక్తి ని పొంది సకల శుభాలూ పొందుతారని వ్యాసమహర్షి ఫలశ్రుతిని అనుగ్రహించాడు.