Devi Kathalu         Chapters          Last Page

పార్వతీ దేవి

దక్షప్రజాపతి కుమార్తె సతీదేవి. దక్షుడు ఆమెను శివుని కిచ్చి వివాహం చేశాడు. దక్షప్రజాపతి దక్షుడే. ప్రపంచ సృష్టి కార్యక్రమ నిర్వహణ దక్షుడే. కాని, అహంకారి అజ్ఞానంతో చేయి కలిపి దక్షుని హృదయాన్ని ఆక్రమించింది. అతడు అనుచితాలు ఆచరించసాగాడు.

ఒకసారి దక్షుడు ఒక యజ్ఞాన్ని సంకల్పించాడు. బ్రహ్మేంద్రాది దేవతలను, శ్రీ మహావిష్ణువును, మహర్షి బృందాన్ని యజ్ఞానికి ఆహ్వానించాడు. శివునికి మాత్రం ఆహ్వానం పంపలేదు. పైగా శివుడుగాని, అతని పరివారంలో ఎవరైనాగాని వస్తే, వారికి స్వాగత సత్కారాలు చేయరాదని తన పరివారాన్ని శాసించాడు.

కైలాసంలో సతీదేవికి తన తండ్రి యాగం చేస్తున్నాడనే వార్త తెలిసింది తన తండ్రి చేస్తున్న యాగాన్ని చూడాలనే కోరికతో సతీదేవి, దక్షయజ్ఞానికి వెళ్ళడానికి శంకరుణ్ణి అనుమతి కోరింది. ఆహ్వానంలేని చోట అడుగు పెడితే అవమానం జరుగవచ్చునని, ఆహ్వానం లేకపోయినా, యజ్ఞానికి వెళ్ళవచ్చుననే శాస్త్రవాక్యం యథార్థమే అయినా, మమకారం చూపవలసిన పుట్టింటి వారే అహంకారంతో ప్రవర్తించి, ఆహ్వానం పంపని వేళలో స్వతంత్రించి, వెళ్ళి పారాభవం పొందడం మంచిది కాదని శివుడు ఆమెను అనునయించాడు. శివుడు ఎంతగా చెప్పినా, పుట్టింటిపై మమకారంవల్ల ఆమె యజ్ఞానికి వెళ్ళచానికే మొగ్గుచూపి, శివుణ్ణి పరిపరి విధాల ప్రార్ధించింది. చేసేది లేక, శివుడు 'సరే' అన్నాడు.

సతీదేవి యాగశాలకు వచ్చింది. ప్రవేశద్వారం వద్ద నిలబడిన సతీదేవిని ఎవ్వరూ లోనికి ఆహ్వానించలేదు. ఆదరంగా పలుకరించలేదు. దక్షుని ఆజ్ఞకు బద్దులై అందరూ మౌనం వహించారు. తల్లిదండ్రులు తనను కనీసం పలుకరించక పోవడం సతీదేవిని బాధించింది. ఆమె ఎలాగో ఆ బాధను దిగమ్రింగుకొని, ఓపిక పట్టింది. ఆ కథ అంతటితో ముగియ లేదు. శివుడు దిగంబరుడని, విషమనేత్రుడని, కపాల మాలాధరుడని, ఒడలెల్ల బూడిద పూసుకొని, బిచ్చమెత్తుకుంటూ తిరిగే హీనుడని, శ్మశాన సంచారుడు కనుక అపవిత్రుడని, శవుణ్ణి అవహేళన చేశాడు దక్షుడు. అందువల్లనే తాను శివుణ్ణి యాగానికి ఆహ్వానించలేదని అన్నాడు. తనకు స్వాగత సత్కారాలు చేయకుండా ఉపేక్షించినా సహించిన సతీదేవి, దక్షుడు చేసిన శివనిందను భరించలేక పోయింది. తన భర్తకు ఇష్టం లేని చోటుకు తాను వచ్చినందు వల్లనే తనకు ఇలాంటి దు స్ధ్సితి వచ్చిందని భావించింది. ఇకపై తన దేహం శివునకు ప్రీతిపాత్రం కాదని నిర్ణయించుకొని తన మనశ్శక్తితో అగ్నిని కల్పించుకొని, మరుజన్మలో మహేశ్వరుడే తనకు భర్త కావాలని మనసా భావించి, తన దేహాన్ని అగ్నిలో దగ్ధం చేసింది.

కైలాసంలో నిశ్చల ధ్యాన ముద్రలో ఉన్న శివునకు వామనేత్రం చలించింది. సతీదేవికి జరిగిన పరాభవం, ఆమె తనుత్యాగం, ఈశ్వరుని దివ్యచక్షువులకు గోచరించాయి. శివుడు తన జడనొక దానిని పెకలించి నేలపై కొట్టాడు. అందుండి పది చేతులు గల వీరభద్రడు ఆవిర్భవించాడు. అతడు శివుని ఆజ్ఞ మేరకు దక్షయజ్ఞాన్ని ద్వంసం చేయాలని నిశ్చయించుకున్నాడు కాని, తనకు శక్తి సహకారం లేనిదే తాను తన కర్తవ్యాన్ని నిర్వహింప జాలనని విన్నవించాడు అపుడు శివుడు తన జటాజూటంలోని వామభాగం నుండి ఒక జడను నేలపై తాకించగా, భద్రకాళి అనే శక్తి ఆవిర్భవించింది. అపుడు వీరభద్రుడు భద్రకాళీ సమేతుడై దక్షయజ్ఞాన్ని ద్వంసం చేశాడు.

సతీవియోగ తప్తుడైన శంకరుడు విరాగ భావంతో కైలాస శిఖరం పై తపస్సు ప్రారంభించాడు. అదే సమయంలో తారకుడనే రాక్షసుడు బ్రహ్మను గూర్చి తీవ్రమైన తపస్సు చేసి, మరణం లేకుండా వరం కోరాడు. పుట్టిన ప్రతి ప్రాణికి మరణం అనివార్యమైన సహజ ధర్మం కనుక, అలాంటి వరం అసాధ్యమని బ్రహ్మ చెప్పాడు. అలా అయితే, శివుని కుమారుని చేతిలో తప్ప తనకు మరణం లేకుండా వరం తనకు ప్రసాదించ వలసిందిగా తారకుడు ప్రార్ధించగా, బ్రహ్మ, "తథాస్తు!" అన్నాడు. భార్యా వియోగ దుఃఖ తీవ్రతలో విరాగియై నిశ్చల తపస్సులో నిమగ్నుడైన శంకరునికి మరల వివాహము, పుత్రోదయము, ఆ పుత్రుడు పెరిగి పెద్దవాడై తనను సంహరింప బోవడం అసంభవమని తారకుని దురాలోచన. ఆ విధంగా పరోక్షంగా తనకు మరణం లేరుండా వరం దక్కిందని విఱ్ఱవీగుతూ తారకాసురుడు అంతులేని దుష్కృత్యాలు ఆచరించ సాగాడు.

తారకునివల్ల బాధలు పడలేక దేవతలందరూ బ్రహ్మేంద్రాదులతో కలసి కైలాసానికి వచ్చి. పరమేశ్వరుడికి తమ మొఱలు వినిరించారు. లోకకంటకుడైన తారకాసురుడు వరగర్వంతో అంతులేని దురాగతాలకు పాల్పడుతున్నాడని, అతన్ని సంహరింపగల పుత్రసంతతిని పొందడం కోసమైనా వివాహాన్ని అంగీకరించ వలసిందిగా దేవతలు ప్రార్ధించారు. వారి ప్రార్ధనలు విని కూడా పరమేశ్వరుడు తన నిర్ణయం మార్చుకోలేదు. తపస్సుకోలే జీవితాన్ని కొనసాగిస్తానని సమాధానమిచ్చాడు. దిక్కుతోచని బ్రహ్మాది దేవతలు వైకుఠానికి వెళ్ళి తమ దుస్ధ్సితిని విన్నవించారు, విష్ణువు దేవతా వర్గంతో కలసి పరమేశ్వరిని ప్రార్ధించాడు. పరమేశ్వరునకు భార్య కాదగిన శక్తి స్వరూపిణి అయిన కాంతగా అవరించ వలసిందిగా దేవతలంతా దేవిని ప్రార్ధించారు. వారి ప్రార్ధనలు ఆలకించిన జగన్మాత "హిమాలయో స్తి మనసా మాముపాస్తే అతిభక్తితః తస్య సద్మని సంభవామి" అని అభయమిచ్చింది. అమిత భక్తితో చిరకాలంగా తన్ను సేవిస్తున్న హిమవంతుని పుత్రికగా జన్మించగలనని ప్రకటించింది. ఆ మాటలకు హిమవంతుడు ఉప్పొంగి పోయాడు. "అమ్మా! నా ఇంట బిడ్డగా జన్మిస్తానని అనుగ్రహించావు. అయితే బిడ్డగా జన్మించిన నిన్ను నేను అర్థం చేసుకొని, తగిన విధంగా ప్రవర్తించగల వివేకాన్ని ప్రసాదించు తల్లీ!" అని హిమవంతుడు దేవిని ప్రార్ధించాడు. అంతటఆమె హిమవంతునకు భక్తి జ్ఞాన వైరాగ్య యోగ సాధనాలను వివరించింది. ఈ ఘట్టం 'దేవీ భాగవతం'లో సప్తమ స్కందంలో 9 వ అధ్యాయంలో 438 శ్లోకల్లో "దేవీగీతాలు"గా సాధకుల సౌకర్యార్ధం వెలువడింది.

దేవీగీతాలలో ఆ తల్లి తన తత్వాన్ని ఇలా వివరించింది. "ఓ పర్వతరాజా! దేవతలారా!ఈ సృష్టికి పూర్వం అద్వితీయమైన ఆత్మ స్వరూపిణిగా నేనున్నాను. సచ్చిదానంద రూపంతో సర్వత్రా వ్యాపించి ఉంటాను. సర్వకాలల్లో, సర్వవస్తువుల్లో శక్తి రూపంగా వ్యాపించి ఉంటాను. అగ్నికి వేడిమి, సూర్యునకు వెలుగు, చంద్రునకు వెన్నెల ఉన్నట్లు నాతో మాయా శక్తి అభిన్నమై ఉంటుంది.

"పావకస్యోష్ణతేవేయం ఉష్టాంశో రివ దీధితిః|

&#చంద్రస్య చంద్రికేవేయం మమేయం సహజా ధ్రువా||"

నన్ను భక్తి శ్రద్దలతో అర్చించి నా నిజరూపాన్ని దర్శించవచ్చు. దీక్షతో కర్తవ్యాన్ని నిర్వహిస్తూ సర్వకర్మఫలాలనూ నాకు సమర్పించి, నా అనుగ్రహాన్ని పొందవచ్చు." అని పలికి తన విశ్వరూపాన్ని దేవతలకు దర్శింప చేసింది.

హిమవంతుడు, దేవతలు దేవి విశ్వరూపాన్ని చూచి ఆనందించారు. త్రిమూర్తులను, ముగ్గురమ్మలను, సూర్యచంద్రులను, నక్షత్రాలను, పశుపక్ష్యాది సమస్త ప్రాణి సముదాయాన్ని, బ్రహ్మాది స్తంభ పర్యంతం గల సమస్త విశ్వాన్ని ఆ విశ్వరూపంలో సందర్శించారు. ఆ శక్తి యొక్క విశ్వరూపానికి సత్యలోకం శిరస్సు. సూర్యచంద్రులు నేత్రాలు. దిక్కులే చెవులు. వేదాలు ఆమె వాక్కు. వాయువే ప్రాణం. విశ్వమంతా ఆమె హృదయం. ఆకాశ##మే నాభి. జ్యోతిర్మండలమే ఆమె వక్షస్థ్సలం. మహర్లోకం కంఠం. జనలోకం ముఖం. తపోలోకం ఆమె లలాటం. ఇందద్రాదులు భుజాలు. అగ్నయే ఆమె నోరు. దివారాత్రులు ఆమె కనురెప్పలు. మృత్యువే ఆమె కోరలు. సముద్రాలు ఆమె కుక్షి. పర్వతాలు ఎముకలు. నదులు నాడులు. వృక్షాలన్నీ కేశ సముదాయం. మనస్సే చంద్రుడు. విజ్ఞానమే విష్ణువు. ఆమె అంతః కరణం రుద్రుడు. ఈ విధంగా సర్వవ్యాపకమైన, సర్వరూపాలలో ఉన్న ఆదేవి విశ్వరూపాన్ని వారంసా దర్శించారు.

ఆ తరువాత ఆమె హిమవంతుడు కోరిన యోగ విధానానికి వివరించి, అంతర్ధానమయింది. హిమవంతు తన జన్మ చరితార్థమయిందని సంతోషించాడు. పరమేశ్వరునికి అర్థాంగి కాదగిన కన్యగా శక్తి స్వరూపిణి అవతరించబోతుందని విని, తమ కష్టాలు గట్టెక్క గలవని, తారకాసురుని పీడ త్వరలోనే విఱగడ కానున్నదని భావించి దేవతలందఱూ ఆనందించారు.

దేవతలకు ఇచ్చిన మాట ప్రకారం పరాశక్తి హిమవంతుని ఇంట పుత్రికగా జన్మించింది. పర్వత రాజపుత్రిక అయిన ఆమె పార్వతి అనే పేరుతో పెరిగి పెద్దదై యుక్తవయస్కురాలైంది.

పార్వతి పరమ శివుణ్ణి పతిగా కోరి, తపస్సు ప్రారంభించింది. పంచాగ్ని మధ్యములో నిలచి కఠోర నియమాలతో తపస్సు కొనసాగించింది క్రమంగా వాయుభక్షణ. పరభక్షణకూడా మానివేసింది. ఆసందర్భంలోనే దేవతలందఱూ ఆమెను 'అపర్ణ' అని ప్రశంసించారు, ఆమె తపస్సుకు సంతుష్టుడైన సర్వేశ్వరుడు ఆమెను అర్థాంగిగా స్వీకరించాడు. శివభక్తుల సమైక్యం వల్ల సుబ్రహ్మణ్య స్వరూపుడైన కుమారస్వామి జన్మించాడు. కుమారస్వామి వల్లి, దేవసేన అనే శక్తులను స్వాదీనం చేసుకొని, దేవతా వర్గానికి సేనా నాయకుడై యుద్దంలో తారకాసుణ్ణి సంహరింపగల కుమారస్వామి జననం కోసమే పరాశక్తి పార్వతీ దేవిగా అవతరించింది.

ఈ వృత్తాంతం విని, "తన అల్లుడైన శివునిపై దక్షునకు ద్వేషం ఎందుకు కలిగింది.?" అని వ్యసమహర్షిని ప్రశ్నిచాడు జనమేజయుడు.

దుర్వాసమహర్షి ఒక నాడు జాంబూనద క్షేత్రంలో పరమేశ్వరిని ఆరాధించి, ఆమె అనుగ్రహం పొంది.ఆమె మెడలోని పుష్పహారాన్ని ప్రసాదంగా పొందడం, దక్షుని కోరికపై ఆ పుష్పహారాన్ని దుర్వాసుడు దక్షుని కివ్వడం ,దక్షఉడు పవిత్రమైన ఆహారాన్ని నిర్లక్ష్యంగతో తన శయన మందిరంలో ఉంచడం, దోషం వల్ల అతని బుద్ధి వక్రించి, అతనిలో అకారణ శివద్వేషం అంకుంరించడం మొదలైన విశేషాలను వ్యాసమహర్షి పవిత్ర వస్తువులను చిన్నచూపు చూస్తే, భగవద్ద్వేషం కలిగి, అది పతన హేతువు అవుతుందని వివరించి, కనుక, పవిత్ర వస్తువులను చిన్న చూపు చూడరాదని వ్యాసుడు ఉపదేశించాడు.

Devi Kathalu         Chapters          Last Page