Devi Kathalu         Chapters          Last Page

తులసి

గంధమాదన పర్వతంపై నిరంతరం విహరించే మాధవీ ధర్మధ్వజులనే దంపతులకు కార్తీక పూర్ణిమా శుక్రవారం నాడు ఒక ఆడపిల్ల పుట్టింది. సద్యో¸°వనంతో, పూర్వజన్మ స్మృతి జ్ఞానంతో జన్మించిన ఆ యువతికి తల్లిదండ్రులు 'పద్మిని' అని పేరు పెట్టుకున్నారు. చంద్రవదన, పద్మపత్రనేత్ర అయిన ఆ పద్మిని కరణాలు చిగురుటాకులవలె ఎఱ్ఱగా, సుకుమారంగా ఉన్నాయి. శిశిర ఋతువులో వెచ్చని స్పర్శ, గ్రీష్మర్తువులో చల్లని స్పర్శ కలిగి, సర్వాంగ సుందరిగా ప్రకాశించే ఆ కన్య, సౌందర్యంలో 'తుల' లేనిది కావడం వల్ల ఆమెకు" తులసి" అని పేరు వచ్చింది.

తులసికి జన్మతోనే వైరాగ్యం అబ్బింది. ఆమె, తపస్సు నిమిత్తం బదరికాశ్రమానికి బయలు దేరింది. తల్లిదండ్రులు ఎంతగా వారించినా, వినకుండా శ్రీ మహావిష్ణువునే భర్తగా పొందాలని నిశ్చయించుకుని యోగ మార్గంలో చిరకాలం తపస్సు చేసింది. మండు వేసవిలో పంచాగ్ని మధ్యంలోను, చలికాలంలో నీటి మధ్య నిలిచి, శీతోష్ణాది ద్వంద్వాలను సహిస్తూ వాటికి అతీతంగా నిలచి, నియమబద్దంగా తపస్సు కొనసాగించింది. కొన్ని సంవత్సరాల కాలం పండ్లు మాత్రమే ఆహారంగా స్వీకరించింది. మరి కొన్ని సంవత్సరాల పాటు ఆకులనే ఆహారంగా తీసుకున్నది. క్రమంగా వాయుభక్షణ మాత్రమే సాగించింది. చివరకు నిరాహారయై కఠోర తపస్సు చేయసాగింది. ఆమె తపస్సును మెచ్చి, బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. "వరం కోరుకో" అన్నాడు.

బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనందుకు తులసి ఎంతో సంతోషించింది."దేవా! సర్వజ్ఞుడవైన నీకు తెలియనిది ఏమున్నది? గోలోకంలో తులసి అనే గోపికగా జన్మించిన నేను శ్రీకృష్ణుని అనురాగానికి పాత్రురాలనయ్యాను. కాని రాధిక నాపై ఆగ్రహించి, నన్ను మానవలోకంలో జన్మించ వలసిందిగా శపించింది. అపుడు శ్రీకృష్ణుడు "బ్రహ్మ వరప్రభావం చేత నాకు భార్యవు కాగలవు" అని నన్ను ఊరడించాడు. కనుక విష్ణువునకు భార్యను కాగలిగేటట్లు నన్ను అనుగ్రహించు." అని బ్రహ్మను ప్రార్థించింది.

ఆమె ప్రార్థన విని, "తులసీ! శ్రీకృష్ణుని అంశగా సుదాముడనే గోపకుడు భారతదేశంలో శంఖుచూడుడు అనే పేరుతో రాక్షసుడై జన్మించాడు.అతడు కూడా రాధికాదేవి శాపానికి గురి అయిన వాడే. నువ్వు శంఖచూడుణ్ణి వరించు తరువాత, శాపవశాన భూలోకంలో అవతరించిన శ్రీకృష్ణుణ్ణి చేపట్టగలవు. తదనంతరం లోకపాననివై వృక్షరూపాన్ని పొందుతావు. ఆ వృక్షం విష్ణువునకు అత్యంత ప్రీతి పాత్రం అవుతుంది. బృందావన క్షేత్రంలో నివసించే నీవు 'బృంద' అనే పేరుతో విరాజిల్ల గలవు." అని అనుగ్రహించి, బ్రహ్మదేవుడు అంతర్థానమయ్యాడు.

బ్రహ్మదేవుని ఆదేశానుసారం తులసి శంఖచూడుణ్ణ మనసులో ధ్యానిస్తూ, బదరికాశ్రమంలో తపస్సు చేయసాగింది. ఒకనాడు శంఖచూడుడు ఆ తపోవన ప్రాంతానికి విచ్చేశాడు. బ్రహ్మదేవుని సూచనననుసరించి, తులసిని వివాహమాడ దలచి, మంగళ ప్రదమైన కవచాన్ని ధరించి వచ్చాడు. శంఖచూడుడు. అతడు ఆమెను పలుకరించాడు. తన పూర్వకన్మ విశేషాలను చెప్పి గోలోకంలో సుదాముడనే గోపకుడుగా ఉన్న తాను శాపవశాన మానవలోకంలో జన్మించానని వివరింపసాగాడు. తులసిని వివాహం చేసుకోవాలనే తన అభిలాషను వ్యక్తం చేశాడు. తల్లిందండ్రులు నిర్ణయించిన వరుణ్ణ వివాహం చేసుకోవడం తనకు తగిన ధర్మమని తులసి సమాధాన మిచ్చింది. అపుడు బ్రహ్మదేవుడు సాక్ష్కాతరించి, వారిరువురి పూర్వజన్మ వృత్తాంతాలను వివరించి, వారికి దాంపత్య బంధం కల్పించి , భావికాలంలో గోలోకంలో నారాయణునితో తాదాత్మ్యం పొంద గలుగుతారని అభయమిచ్చాడు.

తులసీ శంఖచూడులు దంపతులయ్యారు. శంఖచూడుడు బ్రహ్మదత్త వరప్రభాలం చేత దేవలోకాన్ని జయించాడు. ఇంద్రాది దేవతలు శంఖచూడుణ్ణి జయించలేక, బ్రహ్మను శంకరుని కలుసుకుని, తమ బాధలు విన్నవించుకున్నారు. వారంతా కలసి వైకుంఠానికి వెళ్ళారు. దేవతలందఱి పక్షాన బ్రహ్మదేవుడు శ్రీమహావిష్ణువును ప్రార్థించి , తమ ఆవేదనను నివేదించాడు. శంఖచూడుడు దురాగతాలు వివరించాడు. జేవతలకు స్వస్థత కలిగించ వలసిందిగా ప్రార్థించాడు.

అంతట శ్రీమహావిష్ణువు శంఖచూడుని పూర్వజన్మ వృత్తాంతాన్ని దేవతలకు జ్ఞప్తికితెచ్చి, రాధాదేవి శాపం వల్లనే అతడు మానవలోకంలో జన్మిచిన సంగతిని వివరించాడు. తొందరపడి శపించిన రాధ, "తిరిగి అచిరకాలంలోనే నా భర్త సన్నిధిని పొందగల"వని శాపమోక్షం కూడ అనుగ్రహించినట్లు చెప్పాడు. శంఖచూడుడు కంఠసీమలో ధరించిన కవచం తన ప్రసాదమే అని, ఆ కవచం వల్లనే అతడు అజేయుడై నిలిచాడని కూడా వివరించాడు. మఱొక్క రహస్యాన్ని కూడా విష్ణుమూర్తి వివరించాడు. శంఖచూడుని భార్య తులసి మహా ప్రతివత అని, ఆమె సతీత్వానికి భంగం కలిగిస్తే కాని, శంఖచూడుడు మరణించడనే సంగతి చెప్పి, తాను బ్రాహ్మణ వేషంలో వెళ్ళి తులసీదేవి సతీత్వాన్ని భంగపరుస్తానని, అదే సమయంలో పరమేశ్వరుడు యుద్ధంలో శంఖచూడుణ్ణి సంహరించ గలడని చెప్పాడు.

ఇంతలో శ్రీమహావిష్ణువు బ్రాహ్మణ వేషధారియై శంఖచూడుణ్మి సమీపించి, అతని కవచాన్ని యాచించి, దానంగా స్వీకరించాడు. ఆ కవచాన్ని ధరించి, శంఖచూడుని రూపంలో తులసి వద్దకు వెళ్ళాడు శ్రీమహావిష్ణువు. యుద్ధంలో విజయం సాధించి తన భర్త తిరిగి వచ్చాడని భావించిన తెలపిచ అతనికి అన్ని సపర్యలూ చేసింది. బ్రహ్మదేవుని మధ్య వర్తిత్వంలో సంధి కుదిరిందని, దేవతల రాజ్యాలను వారికి తిరిగి యిచ్చివేశానని, యుద్ధం ముగిసిందని చెప్పాడు శంఖచూడుని వేషంలో ఉన్న విష్ణువు . అతడు కోరగా, తులసి ఏకాంత సుఖాన్ని అందించడానికి సిద్ధపడింది. అయితే అతని స్వభావంలోని స్వల్పభేదాన్ని తులసి గమనించింది. "నీవు నా భర్తవు కావు. ఎవరో మాయావివి, నిజం చెప్పు "అని నిలదీసింది. విష్ణుమూర్తి నిజరూపంలో సాక్షాత్కారించాడు. శ్రీహరిని చూచి తులసి క్షణంలో మూర్ఛిల్లి , కొంత సేవటికి తేరుకొని, "ధర్మాన్ని భంగపఱచి నా భర్తను సంహరించావు. రాతి గుండెగల నీవు పాషాణ రూపుడమై పొమ్మ"ని విష్ణువును శపించింది.

అంతట విష్ణువు - తులసీ శంఖచూడుల పూర్వవృత్తాంతాలను, శాప విషయాలను తులసికి గుర్తుచేశాడు." యుద్ధంలో పరమశివుని చేత మరణించిన నీ భర్త శాపవిముక్తిని పొంది, తిరిగి గోలోకంలో చేరుకున్నాడు. నీవు కూడా ఈ దేహాన్ని విడిచి 'గండకీ' అనే నదివై ప్రవహించు. నీ శాప ఫలితంగా నేను గండకీ శిలనై, ఆ నదీతీరంలోనే నిలచి ఉంటాను. నీవు ఈశరీరాన్ని వదలి దివ్యరూపాన్ని ధరించి, నాలో ఐక్యం కాగలవు. నీ కేశములన్నీ తులసీవృక్షంగా రూపాంతరం చెంది. దేవతా పూజల్లో అగ్రస్థానం వహిస్తాయి. తులసీ దళం హరిహరులకు ప్రీతిపాత్రం అవుతుంది. సర్వపాప పరిహారకమై పేరు పొందుతుంది. దేవతల చేత పూజింపబడుతూ ఉంటుంది. తులసీ వృక్షం ఉన్నచోట నిత్యమూ నేను నివసిస్తాను. తులసీ దళంతో నన్ను అభిషేకించిన వారు సహస్ర ఘటాభిషేక ఫలాన్ని పొందగలరు. అవసాన దశలో తులసీతీర్థం సేవించిన వారికి పునర్జన్మ ఉండదు. వారు పాప విముక్తులై నాలోకాన్ని పొందుతారు. నిత్యమూ తులసీ తీర్థాన్ని సేవించే వారు అశ్వమేధయాగ ఫలాన్ని పొందగలరు. రాత్రి వేలలలోను, ఏకాదశి, పూర్ణిమ, అమావాస్య తిథులలోను, శుక్రవారమునాడు తులసీ దళాలను కోసే వారు నాశిరస్సును త్రుంచినంత పాపఫలాన్ని అనుభవించక తప్పదు. అద్వితీయము, అనంతము అయిన పవిత్రతను, శక్తిని నీకు అనుగ్రహిస్తున్నాను" అని చెప్పి, శ్రీమహావిష్ణువు అంతర్థాన మయ్యాడు.

తులసి తన శరీరాన్ని విడిచి, గండకీ నదీరూపంలో ప్రవహించగా, ఆమె కేశసముదాయం తులసీ వృక్షమై , బృందావనంలో సర్వదేవతలకు పూజనీయమైంది.

"బృందా , బృందావనీ, విశ్వపూజితా, విశ్వపావనీ

పుష్పసారా, నందినీ, చ, తులసీ, కృష్ణజననీ"

అనేవి ఎనిమిదీ తులసీ నామములు. వీటిని స్మరించిన వారు సర్వ పాపాల నుండి మవిముక్తులవుతారని, తులసీ దళానికి సాటి మఱొక్కటి లేదని వ్యాసమహర్షి జనమేజయునకు వివరించాడు.

"పుష్పేషు తులనా యస్యాః నాస్తి వేదేషు భాషితం |

పవిత్రరూపా సర్వాసు తులసీ సా చ కీర్తితా||"

మానవాళి సముద్ధరణకై దేవతామూర్తులు తామసగుణాన్ని ఆవహింప చేసుకొని, పరస్పరం శాపాలను పొందుతూ, శాపఫలంగా భూలోకంలో నదులుగా, వృక్షాలుగా, పర్వతాలుగా అవతరిస్తూ ఉంటారు. ఆ దేవతల రూపాలు ప్రజలను పాపవిముక్తులను చేయడానికే.

భక్తులను అనుగ్రహించడమే జగన్మాతకు ప్రధాన లక్ష్యం కనుక, అందుకోసం అనేక రూపాలతో ఆయా దేవతలను అవతరింప చేసి, ఆ తల్లి మనసు కనికరిస్తోంది.

Devi Kathalu         Chapters          Last Page