Devi Kathalu         Chapters          Last Page

భువనేశ్వరి

దేవీ కథలను వినిపిస్తున్న వ్యాసమహర్షికి అలసట కలగడం లేదు. వింటున్న జనమేజయునకు తనివి తీరడం లేదు. జనమేజయుని కోరికపై వ్యాసమహర్షి భువనేశ్వరీ మహిమావిశేషాలను మరికొంత వివరించ సాగాడు.

ప్రళయానంతరం అఖండ సముద్రంగా ఉన్న నీటిలో ఒక పద్మం పుట్టింది. ఆ పద్మంలో నుండి ఆవిర్భవించిన బ్రహ్మదేవుడు నలువైపులా కలయ జూశాడు. ఎంతదూరం చూచినా, కనుచూపుమేరలో నీరే తప్ప ఇంకేమీ కనిపించలేదు. తనెక్కడ ఉన్నదీ పరిశీలించుంటే, తన ఉనికికి ఆధారమై, ఒక కన్పించింది. ఈ పద్మం ఎక్కడ నుండి పుట్టిందో అర్థం కాలేదు. ఇంతలో అతనికి 'సృజ', 'సృజ' అనే మాటలు వినిపించాయి. సృష్టి కార్యనిర్వహణ తన కర్తవ్యంగా ఆ మాటలవల్ల అతనికి బోధపడింది. అయితే, తన కర్తవ్య నిర్వహణ అయిన సృష్టి నిర్మాణం తీరుతెన్నులు ఎలా ఉండాలో అతనికి స్ఫురించలేదు. సృష్టి 'నమూనా' ముందుగా తన మనః ఫలకంపై గోచరిస్తే, ఆ తరువాత, సృష్టి నిర్మాణం సాగించ వచ్చునని బ్రహ్మదేవుడు అనుకున్నాడు. అయితే, అలా గోచరించడానికి ఏమి చేయాలో అతనికి తోచలేదు. ఇంతలో "తప", "తప" అనే శబ్దం వినిపించింది. కర్తవ్య నిర్వహణలో మెలకువ సంపాదించాలంటే తపస్సు చేయాలని అతనికి తట్టింది. తపస్సు ద్వారా సృష్టి నిర్మాణ సామర్థ్యాన్ని సంపాదించుకొని, కర్తవ్యాన్ని నిర్వహించాలని అతడు భావించాడు. సరే, తపస్సు చేయడం బాగానే ఉంటుంది కాని, ఏమి తపస్సు చేయాలి? ఎవరిని గూర్చి తపస్సు చేయాలి ?అని అతడు ఆలోచించసాగాడు.

అలా ఆలోచనా మగ్నుడైన బ్రహ్మకు తన ఉనికికి కారణమైన పద్మం ఎక్కడ నుండి పుట్టిందో తెలుసుకోవాలనిపించింది. తామరతూడు వెంబడి ప్రయాణం చేశాడు. తనకు జన్మనిచ్చిన పద్మం శ్రీ మహావిష్ణువు నాభి నుండి పుట్టినట్లు గుర్తించాడు. విష్ణుమూర్తి సన్నిధికి చేరుకున్నాడు.

విష్ణుమూర్తిని చేరుకున్న బ్రహ్మ ఆశ్చర్యపోయాడు విష్ణువు యోగనిద్రలో ఉండి. ఎవ్వరినో ధ్యానిస్తూ ఉండడం బ్రహ్మకు ఆశ్చర్య కారణమైంది. ఆ మాటే అడిగాడు విష్ణుమూర్తిని- "మహావిష్ణూ! నీవే జగత్కర్తవు. సర్వానికీ ఆధారమైన శక్తివి కదా! స్వతంత్రుడవు, పరిపూర్ణుడవు అయిన నీవు మరొకరిని ధ్యానించడం ఆశ్చర్యంగా ఉంది. ఎవరిని ప్రార్థిస్తున్నావు? అలా ప్రార్థించ వలసిన అవసరం ఏమిటి?" అని.

బ్రహ్మదేవుని సందేహం విని విష్ణుమూర్తి చిఱునవ్వు నవ్వాడు. "బ్రహ్మా! నీ అమాయకత్వం చూస్తే నవ్వు వస్తోంది. నేను స్వతంత్రుడనని, పరిపూర్ణుడనని నన్ను గురించి నీవు అనుకుంటూన్నావే; అది యథార్థం కాదు నాయనా!; నేను స్వతుంత్రడునే అయితే, చిత్ర విచిత్రమైన రూపాలన్నీ ధరిస్తానా !;మత్స్య,కూర్మ రూపాలను, చివరకు వరాహరూపాన్ని సైతం అంగీకరిస్తానా!; పంది జన్మ నీచమని అందరూ భావిస్తారు కదా! నేను స్వతుంత్రడనైతే అటువంటి రూపాలు ధరిస్తానా?; నీకు నాకు ఈ సమస్త జగత్తునకూ, సర్వప్రాణికోటికి ఆధారమైనది మహాశక్తి స్వరూపిణి అయిన జగన్మాత. ఆమె ఆదేశానుసారము ఆమె కనుసన్నలలో మెలగవలసిన వాడనే కాని, నేను స్వతుంత్రుడను కాను."

"విరించీ! మహా ప్రళయకాలంలో ప్రపంచమంతా లయమై జగమంతా జలమయమైనప్పుడు వటపత్రశాయి అయిన నన్ను ఊయలలో ఊగించి, లాలించి, పోషించినది ఆ జగన్మాతయే. మనందఱికీ ఆమెయే ఆధారము. ఆమెకు మఱొక్క ఆధారం లేదు. సూర్య చంద్రాగ్నులు, నక్షత్రగోళం, ఆకాశాది పంచభూతాలు, సర్వమూ ఆమె చేతనే సృష్టింపబడి, ఆమె చేతనే పోషింపబడి, ఆమె వల్లనే లయమైవుతున్నాయి. "అని విష్ణుమూర్తి వివరించాడు.

విష్ణువు మాటలు వున్న మఱింత ఆశ్చర్య చకితుడయ్యాడు. జగత్కర్తకే జనని అయిన ఆ పరమేశ్వరిని చూడాలని కుతూహలం పొందాడు. తన కోరికను విష్ణుమూర్తికి విన్నవించుకున్నాడు. అంతలో గణ గణ గంటల మ్రోతతో, ముత్యాల తోరణాలతో అలంకరింపబడిన విమాన మొకటి వారికి కనిపించింది. ఆ సమయానికి శవుడు కూడా అక్కడికి వచ్చాడు. త్రిమూర్తులకు విమానం ఎక్కాలని ముచ్చట కలిగింది. అంతట అంగీకార సూచకంగా ఓం అనే శబ్దం వినిపించింది. వెంటనే ఆ ముగ్గురూ విమానంలో కూర్చున్నారు. విమానము ఆకాశ మార్గంలో పయనించి సత్యలోకాన్ని చేరింది. అక్కడ హంసవాహనారూఢుడై ఉన్న బ్రహ్మ కనిపించాడు. విమానంలో ఉన్న బ్రహ్మ ఆశ్చర్యపోయాడు. 'నేనొక్కడనే బ్రహ్మను కదా! నాలోకంలో నా స్థానంలో కూర్చున్న ఇతడెవరు' అని విచికిత్సలో పడ్డాడు. ఇంతలో విమానం కైలాసానికి చేరింది. అక్కడ వృషభవాహనుడై, త్రినేత్రుడై, త్రిశూలపాణియై శివుడు కన్పించాడు. విమానంలోని శివుడు ఆశ్చర్యపోయాడు. అలాగే వైకుంఠం చేరిన త్రిమూర్తులకు అక్కడ విష్ణువు మరొక్కడు కన్పించాడు.విష్ణువు ఆశ్చర్యంలో మునిగిపోయాడు.

ఇలా త్రిమూర్తులకు వారి లోకాలకు, వారి రూపాలను పోలిన రూపాలను చూరించి, ఆశ్చర్యంలో ముంచెత్తిన విమానం అక్కడ నుండి గోలోకం చేరుకున్నది. అక్కడ చతుర్భుజుడైన శ్రీకృష్ణుడు, అతనిలో అర్థభాగమై ఉన్న రాధాదేవి కన్పించారు. త్రిమూర్తులు గోలోక మహిమా విశేషాలను సందర్శించారు. వారి ఆశ్చర్యానికి మేర లేదు. వారు ఆశ్చర్యంలో మునిగి ఉండగానే విమానం కదిలింది.

గోలోకం నుండి బయలు దేరిన విమానం మణిద్వీపానికి చేరింది. మణిద్వీపం చుట్టూ 12 మైళ్ళ పొడవున వ్యాపించి ఉన్న ప్రాకారం, అంతటి వెడల్పుగల ఎత్తైన ప్రదేశం కన్పించాయి. దానికి నాలుగు ప్రక్కలా నీరు ప్రవహింస్తోంది.చుట్టూ నీరు ప్రవహిస్తోంది చుట్టూ నీరు ఉండి, మధ్యలో భూమి కనుక, ఇది ద్వీపం. ఇది మణికంతులతో ప్రకాశిస్తూ ఉండడం వల్ల దీనికి 'మణిద్వీపమ'ని పేరు. మణిద్వీపమే భువనేశ్వరికి నివాస స్థానం. ఆ ద్వీపం చుట్టూ శతాధికంగా కల్పవృక్షాలున్నాయి. ఆ వృక్షాల మధ్యలో రత్న సింహాసనం ఉన్నది. ఆ సింహాసానికి మధ్య భాగంలో పంచప్రేతలతో ఆసనంగా ఉన్న ప్రదేశంలో సదాశివ ఫలకంపై ఆసీనురాలై భువనేశ్వరీదేవి కన్పించింది. ఆమె నివాసం చింతామణి గృహం. అలా దర్శన మిచ్చిన శ్రీమాతను చూచి త్రిమూర్తులు విమానం దిగి, ద్వారం వద్ద నిలబడి "అమ్మా! నీకు పాదాభివందనం చేయాలని ఉన్నది. నీ పాదసన్నిధికి చేరడానికి అనుమతిని ప్రసాదించు" అని అడిగారు. ఆమె చిరునవ్వుతో వాత్సల్య పూర్వకంగా వారి వంకచూచి, అంగీకార సూచకంగా "ఓం" అన్నది. త్రిమూర్తులు ఆనందంగా గడప దాటి లోపల అడుగు పెట్టారు. గడప దాటగానే వారు ముగ్గురూ స్త్రీ రూపాలను పొందారు. తమ రూపాలు మారిపోవడం వారికి ఆశ్చర్యం కలిగించింది. అమ్మనను సేవించుకోవడానికి ఈ రూపం అనుకూలమేనని భావించి ఆనందించారు. అలా భావించి, ఆముగ్గురూ తల్లి పాదాలకు నమస్కరించారు. ఆమె కాలిగోటి కాంతిలో సమస్త విశ్వమూ వారికి కనిపించింది. సూర్య చంద్ర నక్షత్రగోళాలు, నదులు, పర్వతాలు, సముద్రాలు, పంచభూతాలు, చతుర్దశ భువనాలు, వాటి అధిపతులు అందఱూ ఆమె పాదనఖ కాంతులలో గోచరం కావడం చూచి, త్రిమూర్తులు భక్తి పారవశ్యాన్ని పొందారు. భువనేశ్వరిని స్తోత్రం చేయసాగారు.

సత్త్వగుణ స్వరూపుడైన విష్ణువు "ఓ జగన్మాతా! సర్వలోకాలకూ నీవే జననివి. కార్య కారణాలు లేనిదానవు. సృష్టి, స్థతి, లయాలు నీ వల్లనే జరుగుతున్నాయి. నీ ఆజ్ఞను ధిక్కరించగల వారు. ఈ విశ్వమంతా నీవు వ్యాపించి ఉన్నావు. సూర్య, చంద్ర, అగ్ని నేత్రాలతో నీవు ప్రకాశిస్తూ, సూర్యచంద్రాగ్నులకే కాంతులను ప్రసాదిస్తున్నావు. నీ సూర్యనేత్రంతో పగటిని, చంద్రనేత్రంతో రాత్రిని, అగ్ని నేత్రంతో సంధ్యాకాలాన్ని ప్రవర్తింప చేస్తున్నావు. సదసద్విశిష్టమైన ఈ ప్రపంచాన్ని సృష్టించి, కాలాంతరంలో నీవే సంహరించి, నిర్వికార రూపంతో సచ్చిదానంద స్వరూపిణివై మెలగుతూ ఉంటావు. ఐంద్రజాలికుని వలె కోటాను కోట్ల బ్రహ్మాండాలను సృష్టించి, వాటి యందు నర్తకివై నటిస్తావు. నీ వల్లనే ఈ జగత్తు ప్రకాశిస్తోంది. ఈ సమస్త విశ్వానికి నీవే మూలకారణ శక్తివి. కల్పాంతంలో సమస్త ప్రపంచమూ నీలోనే లయమైపోతుంది. మహాశక్తి శ్వరూపిణివైన నీవు మాత్రమే కల్పాంతంలో కూడా కనిపిస్తావు.

"అమ్మా! మధుకైటభుల బారి నండి మమ్ము రక్షించావు. నీ సన్నిధికి రప్పించుకొని, మాకు నీ దివ్యసందర్శన భాగ్యాన్ని కలిగించావు. నీ పాదనఖదీధితులలో అనంతము, అద్భుతము అయిన ఈ సమస్త విశ్వమూ మాకు గోచరిస్తోంది. నీ దయ లేనిదే మేము శక్తి సంపన్నులం కాలేము. నీ సహకరంతోనే మేము సంచరిస్తున్నాము. మమ్ములను సేవకులుగా అంగీకరించి, నీ పాద సేవా భాగ్యాన్ని ప్రసాదించు తల్లీ! మా హృదయాలలో నీ యందు నిరంతరం భక్తి భావం నిలిచి ఉండేలా అనుగ్రహించవమ్మా! విద్యావంతులలో విద్య, బుద్దిమంతులలో బుద్ధి, శక్తిమంతులలో శక్తి నీవే. లోకములో గల కీర్తి, కాంతి, శోభ, తుష్టి, పుష్టి అన్నీ నీ అంశ##లే వేద సాగరమైన గాయత్రీ మాతవు నీవే. స్వాహా రూపంలో దేవతలకు, స్వధా రూపంలో పితృదేవతలకు ఆహారాన్ని అందించే శక్తివి నీవే. సముద్రంలోని తరంగాలవలె సకల ప్రాణులూ నీ సంకల్ప ప్రభావం చేతఉద్భవించిన వారే. మహావిద్యా స్వరూపిణివై మంగళ రూపిణివైన నీకు మా నమస్కారములు అని శిరస్సు వంచి తల్లి పాదాలకు నమస్కరించి, ఆనందపరవశుడై, అర్ధనిమీలిత నేత్రుడై నిలిచాడు.

ఈశ్వరుడు జగన్మాతకు నమస్కరిస్తూ, "ఓ పరాశక్తీ! త్రిమూర్తులమైన మా పుట్టుకకు నీవే మూలకారణ శక్తివి. నీ చిత్కలా సంబంధం లేనిదే ఈ పాంచ భౌతిక సృష్టి లేనే లేదు. పంచభూతాలు, దశేంద్రియాలు, అంతఃకరణ చతుష్టయం అన్నీ నీ నుండి వెలువడినవే. అమ్మా! నీవే అనంతరూపాలతో చరాచర జగత్తులో వ్యాపించి ఉన్నావు. నీ ఇచ్ఛానుసారం క్రీడించి, లయం చేస్తావు. నీ పాద పద్మ పరాగాన్ని శిరస్సున ధరించిన మాత్రాన మాకు సృష్టి, స్ధితి,లయ కర్తృత్వశక్తులు సంక్రమించాయి. మా నుండి వ్యక్తమయ్యే సమస్త శక్తులూ నీ కరుణాకిరణ ప్రసార ఫలితాలేనమ్మా! మేము నీ ఆజ్ఞకు బద్దులమై సృష్టి, స్ధితి, లయాలను నిర్వహిస్తున్నాము తల్లీ! నీ కలాంశగా సత్త్వ, రజ, స్తమోగుణాలు ఆవిర్భవించాయి. ఆ త్రిగుణాలే మాకు కర్తవ్య నిర్వహణ సామర్ధ్య హేతువులు. నీ లీలా విశేషాలను ఎవ్వరు వర్ణింపగలరమ్మా! ప్రకృతి స్వరూపిణివైన నీవు మహాకామేశ్వరుని అర్ధాంగివై క్రీడిస్తూ ఉంటావు. యువతీ భావాన్ని మేము నీ పాద పద్మాలను సేవించి ధన్యులమయ్యాము. నీ పాద సేవ ఒక్కటే మాకు చాలు. త్రిలోకాధిపత్యం మాకు అక్కఱలేదు. దయాస్వరూపిణివై మాకొక మంత్రాన్ని ఉపదేశించు. భవసాగరం నుండి మమ్ములను ఉద్ధరించు అని ప్రార్ధించి, ఆమె పాదాల మ్రోల అలా రాలిపోయాడు. శివుని భక్తిభావానికి మెచ్చిన భువనేశ్వరి అతనికి "నవాక్షరీ మంత్రాన్ని" , అనుగ్రహించింది. మోక్షప్రదము, సర్వాభీష్ట ప్రదాయతము అయిన నవాక్షరీ మంత్రాన్ని పొంది శివుడు సంతుష్టుడయ్యాడు.

అనంతరం బ్రహ్మదేవుడు జగన్మాతకు పాదాభివందనం చేసి "అమ్మా! ఆజ్ఞానినైన నేను ఈలోకానికి సృష్టికర్తను నేను అని అహంకరించాను. నీ స్ననిధికి చేరి , నీ అనుగ్రహంతో అహంకారాన్ని తొలగించుకొని నా నిజస్థితిని తెలుసుకోగలిగాను. నా అజ్ఞానాన్ని అహంకారాన్ని , పూర్తిగా తొలగించి , నన్ను నీ భక్తునిగా అనిగ్రహించవమ్మా! నీ సందర్శనభాగ్యం పొందలేక , నీ మహిమావిశేషాలను గుర్తించలేక కొందఱు యజ్ఞాలు చేసి , స్వర్గఫలాలను అనుభవిస్తూ ఉంటారు. అవిఅన్నీ క్షణికమైనవే

నీ ఇచ్ఛా శక్తివల్ల కోటానుకోట్ల బ్రహ్మాండాలు ఉద్భవిస్తున్నాయి. నీవు సర్వస్వతంత్రురాలవు మేమంతా నీ చేతిలోని ఆటబొమ్మలమం. నీ కన్నురెప్పల కదలికల్లో కాలచక్రం తిరుగుతూ ఉంటుంది.

జగన్మాతా! ప్రకృతి పురుష విలాసమే లోకానికి మూలమని తెలిస్తోంది. ప్రకృతి పురుషవిలాసాన్ని శివశక్తి సంబంధంగా అంగీకరిస్తే , "ఏకమేవా ద్వితీయం బ్రహ్మ" అనే సిద్ధాంతం ఎలా అన్వయిస్తుంది? ఇంతకూ ఈ ప్రకృతు పురుషుల తత్త్వం దైవత్వమా? అదైవత్వమా? ఈ పరాశక్తి రూపం పురుషరూపమా ? స్త్రీ రూపమా? ఈ నా సందేహం తీర్చి, నీ తత్వాన్ని తెలియ చెప్పి భవసాగరం నుండి మమ్మల్ని ఉద్ధరించవమ్మా"! అని ప్రార్థించాడు.

సత్త్వగుణ స్వరూపుడైన విష్ణువు. రజోగుణ స్వబావుడైన బ్రహ్మ, తమోగుణ సంకేత రూపుడైన శివుడు తన్ను సమీపించి, భక్తితో పరి పరి విధాలుగా ప్రార్థించి నందుకు పరాశక్తి ఎంతో సంతోషించింది. బ్రహ్మదేవునికి కలిగిన సందేహాన్ని నివారించడానికి జగన్మాత ఈ విధంగా వివరించసాగింది.

"కుమారా! ద్వైతము అనిత్యము. అద్వైతము నిత్యము. ప్రకృతి పురుషులకు భేదం లేదు. లోకవ్యవహారం కోసం వారు ఇద్దరుగా కనిపిస్తున్నారు. పరమార్థాన్ని సందర్శించ గలిగితే ఒకే శక్తి ప్రకృతిగా, పురుషుడుగా ఉన్నట్లు తెలుస్తుంది. ఏకత్వం అనుభవానికి వస్తుంది. కనుక, ద్వైతం వ్యావహారిక సత్యం. అద్వైతం పారమార్థిక సత్యం. ఆజ్ఞానులు ఉపాధి భేదాన్నిచూచి ద్వైత భ్రమకు లోనవుతున్నారు. జ్ఞానులు తత్త్వాన్ని దర్శించి అత్వైతానుభవంతో ఆనందిస్తారు. ప్రకృతి పురుషులను ఒకే చైతన్య శక్తిగా దర్శించినవాడే వివేకి. ఈ సృష్టి జాలమంతా దర్పణంలో కనిపించే ప్రతిబింబం మాత్రమే. సృష్టి కోసం నానాత్వం నేనే కల్పించు కొంటాను. దృశ్యాదృశ్య భేదం, స్త్రీ నపుంసక భేదం అన్నింటికిని సృష్టి కాలంలో నేనే కల్పించుకొని, ప్రళయకాలంలో నాయందే లయం చేసుకుంటాను.

శ్రద్ధా మేధా దయా లజ్జా క్షుధా తృష్ణా తథా క్షమా|
అహం బుద్ధిరహం హ్రీశ్చ ధృతిః కీర్తి స్స్మృతి స్తథా||

నూనం సర్వేషు దేవేషు నానా నామ ధరామ్యహమ్‌|
భవామి శక్తి రూపేణ కరోమి చ పరాక్రమమ్‌||

కనుక సృష్టిగా దిగివచ్చినపుడు ద్వైతం. పరిణామ దశలో అద్వైతం."

త్రిమూర్తులు పరవశిస్తూ వింటున్నారు. పరాశక్తి తన నుండి సాత్త్వికీశక్తిగా లక్ష్మీని, రాజసీ శక్తిగా సరస్వతిని, తామసీ శక్తిగా కాళిని సృష్టించి, విష్ణు బ్రహ్మ రుద్రులకు సమర్పించింది. ఆయా శక్తుల సహకారంతో తమ తమ కర్తవ్యాలను నిర్వర్తించ వలసిందిగా. త్రిమూర్తులను ఆజ్ఞాపించింది. చింతామణి గృహం దాటి వెలువలకు రాగానే త్రిమూర్తులకు పురుష రూపం తిరిగి లభిస్తుందని వివరించింది.

త్రిమూర్తులు భువనేశ్వరీ దేవి వద్ద సెలవు తీసికొని, నిజ స్థానాలకు చేరి సృష్టి స్థితి లయ కార్యక్రమాలలో జాగరూకులై ప్రవర్తింపసాగారు. అద్భుత చారిత్ర అయిన అమ్మ అనంత వైభవానికి అబ్బురపడిన త్రిమూర్తులు ఆ జగనామాతనే ప్రార్థుస్తూ కర్తవ్య నిర్వహణకు అంకితమయ్యారు."

ఈ విధంగా భువనేశ్వరీ వృత్తాంతాన్ని వివరించి, వ్యాసమహర్షి జనమేజయునకు ఆనందాన్ని ప్రసాదించాడు.

దేవీ చరిత్రను, దేవీ స్వరూపాన్ని, ఆమె నివాస స్థానాన్ని, భక్తులను అనుగ్రహించిన వైఖరిని, దుష్టులను శిక్షించిన వృత్తాంతాలను వివరించి వ్యాసమహర్షి జనమేజయునికి భవబంధ విముక్తికి మార్గాన్ని సూచించాడు. భువనేశ్వరీ దేవి పాదపద్మాలను సేవించడమే తరణోపాయమని ఉపదేశించాడు.

దేవీ కథలన్నింటినీ నైమిశారణ్యంలో సూతమహర్షి శౌనకాది మహా మునులకు వినిపించాడు. పవిత్రమైన దేవీ చరిత్రను చదివిన వారికి. విన్న వారికి ఇష్టకామ్యార్థసిద్ధి కలుగుతుంది. దేవిని ఆరాధించిన వారికి పాప వినాశము, పుణ్య లాభము కలుగుతాయని ఫలశ్రుతిని అనుగ్రహించాడు నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరీ సమేతుడైన సూతుడు.

"వేదసారమిదం పుణ్యం పురాణం ద్విజ సత్తమాః|
వేదపాఠ సమం పాఠే శ్రవణ చ తథైవ హి||

సచ్చిదానంద రూపాం తాం గాయత్రీ ప్రతిపాదితాం|
నమామి హ్రీంమయీం దేవీం ధియో యో నః ప్రచోదయాత్‌||

స్వస్తి సర్వేషాం సన్మంగళాని సన్తు|
శ్రీః పాలయతు సర్వదా|

Devi Kathalu         Chapters          Last Page