Devi Kathalu         Chapters          Last Page

హయగ్రీవుడు

ఒకనాడు బ్రహ్మాదిదేవతలు ప్రార్థించగా శ్రీ మహావిష్ణువు స్వర్గలోకానికి వెళ్ళి, రాక్షసుసతో యుద్ధం చేశాడు. భయంకరంగా సాగిన దేవాసుర సంగ్రామంలో ఎందరో రాక్షసులను సంహరించాడు. యుద్ధంలో తీవ్రంగా అలసిపోయాడు. ఏకాంత ప్రదేశానికి చేరుకుని తన ధనుస్సునే తలక్రింద దిండుగా పెట్టుకొని నిద్ర పోయాడు. ఆ వింటికి అల్లెత్రాడు ఎక్కుపెట్టి ఉన్నది. అది విష్ణువు గమనించనే లేదు.

బ్రహ్మాది దేవతలు విష్ణువును వెతుక్కొంటూ, ఆ ప్రదేశానికి వచ్చారు. విష్ణువును మేల్కొలిపి, తమ కోరికలు నివేదించుకోవాలని ఆలోచించారు. ఒక పేడపురుగును సృష్టించి, విష్ణువుకు నిద్రాభంగం కలిగించ వలసిందిగా అదేశించారు. అపుడు ఆ పేడపురుగు

"నిద్రాభంగో కథాచ్ఛేదః దంపత్యోః ప్రీతిభేదనమ్‌"

శిశుమాతృ విభేదశ్చ బ్రహ్మహత్యా సమం స్మృతమ్‌||"

(నిద్రాభంగము , భగవత్కథలకు ఆటంకం కలిగించడం, దంపతులను విడదీయడం, తల్లిని బిడ్డను వేరుచేయడం బ్రహ్మహత్యతో సమానమైనవి)

అని పలికింది. "ఇంతటి పాపకార్యానికి నన్ను ప్రోత్సాహిస్తున్నా రేమిటి ?దీనివల్ల నాకు ప్రయోజనం ఏమిటి? "అని ప్రశ్నించింది.

"యజ్ఞంలో సమర్పించే హవిస్సులో నాలుగు ప్రక్కలా నీకు భాగం లభించేటట్లు నియమిస్తాను" అని బ్రహ్మ వాగ్ధానం చేశాడు. అందుకు అంగీకరించి, ఆ పురుగు విష్ణువు తలక్రింద ఉన్న వింటి అల్లెత్రాటిని కొరికింది. తెగిన అల్లెత్రాడు అతివేగంగా ధనుస్సు నుండి విడివడింది. అపుడు వెలువడిన భయంకర శబ్దాలకు బ్రహ్మాండం అంతా కపించి పోయింది. సముద్రాలలో సంక్షోభం చెలరేగింది. పర్వతాలు చెల్లాచెదరయ్యాయి. దేవతలు చింతాక్రాంతులయ్యారు. కొంతసేపటికి తెప్పరిల్లి ఆ దేవతలు విష్ణువు వంక చూశారు. అల్లెత్రాటి వేగానికి తెగిపడిపోయిన విష్ణువు శిరస్సు ఏమైందో, ఎక్కడి పడిందో వారికి తెలియలేదు. శిరస్సులేని విష్ణువు శరీరాన్ని చూచి దేవతలు మ్రాన్పడి పోయారు. అపరిమితమైన వేదనతో కుమిలి పోయారు. "అతిమానుషమైన ఈ అద్భుత కృత్యానికి కారణం ఏమైఉంటుందో!" అనుకున్నారు. "ఎవరి మాయా శక్తివల్ల విష్ణుదేవుని శిరస్సు అదృశ్యమైందో "వారికి అర్థంకాలేదు. "విష్ణువే లేనివాడు దేవతా వర్గానికి ఉనికి లేదు కదా !ఇంతటి ఘోరం యక్షరాక్షస దేవాదులవల్ల జరిగేది కాదు-" అనుకుంటూ కర్తవ్యతా విమూఢులై విచారసాగరంలో మునిగిపోయారు.

అపుడు దేవతలకు అగ్రేసరుడైన బ్రహ్మను చూచి, బృహస్పతి ఇలా అన్నాడు.

"చతురాననా !జరిగిన దానికి విచారించి ప్రయోజనం ఏమున్నది?కర్తవ్యం ఏమిటో ఆలోచించాలి. జరిగిన సన్నివేశాన్ని తలచుకుని నిరాశలో మునిగి పోకూడదు. సన్నివేశం చాటున దాగిన సత్యాన్ని అన్వేషించాలి. అపుడు మనకు కర్తవ్యం స్ఫురిస్తుంది. దైవసంకల్పము, మానవ ప్రయత్నము కలిసినప్పుడే కార్య సిద్ధి కలుగుతుంది."

బృహస్పతి మాటలతో దేవతలలో కొంత చైతన్యం కలిగింది. వారి ఆలోచనాలోచనాలకు వెలుగు రేకలు కన్పించసాగాయి. అపుడు ఇంద్రుడు "విష్ణువు శిరస్సు ఇలా మనం చూస్తూండగానే తెగి పడిపోవడానికి కారణం దైవం తప్ప వేఱు కాదు. శుభాశుభ కర్మ ఫలాలను అనుభవించక తప్పదు. "అని ఆలోచించాడు. అపుడు ఇంద్రాది దేవతలందరూ "ఓ దేవీ! జగన్మాతా! సృష్టిస్థితి లయలు నీ అధీనంలో ఉన్నాయి. ఓంకారములోని అర్థమాత్రా రూపమునీదే. అనగా నీవు ప్రణవ స్వరూపిణివి. నీవే గాయత్రివి. ఆ శక్తిని వెల్లడించు భూః,భువః, సువః అను వ్యాహృతులు కూడ నీవే, నీ అనుజ్ఞ లేనిదే ఈ లోకంలో ఏమీ జరుగదు. జగన్నాథుడైన విష్ణువు శిరస్సు ఏమైనదో మాకు అంతు పట్టలేదు. శ్రీమహావిష్ణువునకు శిరస్సును ప్రసాదించే శక్తి నీకు మాత్రమే ఉన్నది. శిరస్సులేని విష్ణువును చూచి మేము జీవింప జాలము. మా దుఃఖాన్ని తొలగించి , మమ్ములను రక్షించు" అని ఆ జగన్మాతను ప్రార్థించారు.

దేవతల ప్రార్థనలు విని కనికరించిన పరమేశ్వరి ఆకాశం నుండు "ఓ దేవతలారా !విష్ణువు శిరస్సు అదృశ్యమై పోవడం నా సంకల్పములో భాగమే "అని పలికింది. ఆ పరాత్పరి ఇంకా ఇలా అన్నది. "ఈ లోకలంలో ప్రతి కార్యమూ కారణ సహితమే. ఇపుడు విష్ణువు శిరస్సు ఇలా తెగి పడడం కూడా సకారణమే. ఒకనాడు విష్ణువు లక్ష్మీదేవిని అవహేళన చేశాడు. అందుకు ఆమె ఆగ్రహించింది. ఆమెలో తామసగుణం విజృంభించింది. అంతట లక్ష్మీదేవి విష్ణుమూర్తిని 'నన్ను చూచి నవ్విన నీ శిరస్సు తెగిపోవుగాక' అని శపించింది. ఆమె సంకల్పమువల్లనే ఇపుడీ హరి శిరస్సు తెగి సముద్రంలో పడింది. వైధవ్య రూపంలో తనకు రాబోయే ముప్పును కూడా గననించనంతటి తీవ్రమైన తామసీ శక్తి చేత ఆవేశింపబడి లక్ష్మీ దేవి ఇచ్చిన దారుణమైన శాపానికి ఫలమిది."

"అంతేకాదు, దేవతలారా! ఇపుడు ఇలా విష్ణువు శిరస్సు తెగిపడడానికి మరో కారణం కూడా ఉన్నది. పూర్వము హయగ్రీవుడనే లోకకంటకుడైన రాక్షసుడొకడు నా కోసం తీవ్రమైన తపస్సు చేశాడు. నేను అతనికి ప్రత్యక్షం కాగా, 'మరణంలేని జీవితం కావాల'ని వరం కోరుకున్నాడు. అది అసంభవమని అతనికు నచ్చజెప్పి, మరో వరం కోరుకోమన్నాను. 'హయగ్రీవు'ని చేతిలో తప్ప, తనకు మరణం లేకుండా వరం ప్రసాదించ వలసిందిగా ఆ రాక్షసుడు అర్థించాడు. అతనికి ఆ వరం అనుగ్రహించాను. ఇపుడు ఆ హయగ్రీవుడనే రాక్షసుణ్ణి సంహరించడానికి హయగ్రీవుడనే అవతారమూర్తిఅవసరమయ్యాడు. అందుకే విష్ణువు శిరస్సును అదృశ్యం చేశాను. మీరు విచారించకండి. గుఱ్ఱపు తలను తెచ్చి శ్రీహరి శరీరానికి సంధించండి. విష్ణువు హయగ్రీవుడై అవతరిస్తాడు. రాక్షస సంహారం సాగిస్తాడు. నేను హయగ్రీవుడు రాక్షసుని కిచ్చిన వరము లక్ష్మీదేవి శ్రీ దమహావిష్ణువున కిచ్చిన శాపము అంతటితో తీరిపోతాయి. మీ విష్ణువు మీకు దక్కుతాడు."

జగన్మాత పలికిన మాటలతో దేవేంద్రాదులు కలత నుండి కొంచెం

తేరుకున్నారు. కర్తవ్యం వైపుగా కదలిక సాగించారు.

దేవీ ఆదేశం మేరకు హయశీర్షం ఒకటి తెచ్చి విష్ణువు మొండేనికి అతికించారు. విష్ణువు హయగ్రీవుడై కనులు తెరచి, జగన్మాత మాయా విలాసాన్ని, జగన్నాటకంలో తన పాత్రను గుర్తించి, హయగ్రీవ రాక్షసుణ్ణి సంహరించి, లోక కల్యాణం కలిగించాడు.

ఆ తర్వాత హయగ్రీవుడైన విష్ణువు వేల సంవత్సరాలు జగన్మాతను గూర్చి తపస్సు చేసి, సర్వవిద్యలకూ అధిదేవుడైనాడు. అగస్త్యునికి లలితా తత్త్వాన్ని బోధించాడు. వశిన్యాది వాగ్ధేవతల నోట వెలువడిన లలితా సహస్రనామ వైభవాన్ని తాను అందుకొని, పరమేశ్వరిని సందర్శించి, ఆమె అనుగ్రహంతో ఆ అనంతనామ వైభవాన్ని అగస్త్య మహర్షికి బోధించాడు. తరతరాల మానవులూ తరించడానికి దారి చూపాడు.

సత్త్వగుణ సంపన్నుడైన శ్రీమహావిష్ణువు తల ఇవా తెగి పడడం, హయగ్రీపుడై, లోకారాధ్యుడై దేవీ తత్వాన్ని ప్రభోధించడం ఆ పరాశక్తి మాయా విలాసమే. హయగ్రీవుని వృత్తాంతం విన్నవారికి సకల శుభాలూ కలుగుతాయని సూతులవారు శౌనకాదు మహామునులకు ఫలశ్రుతిని కూడా అనుగ్రహించారు.

Devi Kathalu         Chapters          Last Page