Devi Kathalu         Chapters          Last Page

భండాసురుడు

పరమేశ్వరుడు హిమాలయాలలో తపస్సు చేస్తూ ఉండగా, పర్వత రాజైన హిమవంతుడు తన పుత్రిక అయిన పార్వతిని అతని సేవకై నియోగించాడు. అలా పార్వతి పరమేశ్వరుని సేవిస్తూ ఉండగా దేవతల కోరికపై మన్మథుడు అక్కడికి వచ్చాడు. చెట్టు చాటు నుండి శివునిపై పుష్పబాణం ప్రయోగించాడు. తపస్సమాధిలో ఉన్న శివుడు తన మనస్సులో కలిగిన కలవరపాటునకు చింతించి, అందుకు గల కారణం కోసం నలుదిక్కులా పరిశీలించాడు. మన్మథుడు కన్పించాడు. కోపంతో శివుడు మూడవకన్ను తెరచి, ఆ కంటి మంటలలో మన్మథుణ్ణి మసి చేశాడు.

కొంతకాలం తర్వాత గణపతి ఆ బూడిదను రెండు చేతులతో ప్రోగుచేస్తూ ఉండగా, ఆ బూదిడ నుండి భయంకరాకారంతో రాక్షసుడొకడు ఉద్భవించాడు. అతడే భండాసురుడు. ఇతడు పెరిగి పెద్దవాడై, ఘోరమైన తపస్సు చేసి పురుషుల వల్ల తనకు మరణం లేకుండా వరం సంపాదించుకున్నాడు. వరబల గర్వితుడై, భండాసురుడు దేవతా వర్గంపై దండెత్తి దేవతలను, మునులను, సాధువులను పీడించడం ప్రారంభించాడు.

దేవతలు భండాసురుని దురాగతాలకు తట్టకోలేకపోయారు. తమ బాధలన్నీ బ్రహ్మదేవునికి నివేదించుకున్నారు. దేవతలందరి పక్షాన బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి వద్దకు వచ్చి ప్రార్థించగా, "ఒక మహాశక్తి వల్ల తప్ప భండాసురుడు మరణించడ"ని విష్ణువు వివరించాడు. అపుడు దేవతలందరూ బ్రహ్మ, విష్ణువులతో కలసి ఒక యాగం ప్రారంభించారు. ఆ యజ్ఞకుండంలో విష్ణువు తన సుదర్శన చక్రంలోని శక్తిని, బ్రహ్మ తన కమండలంలోని శక్తిని, శివుడు త్రిశూలంలోని శక్తిని, ఇంద్రుడు వజ్రాయుధంలోని శక్తిని సమర్పించారు. దేవతల కష్టాలు తీర్చవలసిందిగా పరాశక్తిని మరీ మరీ ప్రార్థించారు.

బ్రహ్మ , విష్ణువుల ఆధ్వర్యంలో జరిగిన యాగము, ఆ యాగములో దేవతలు చేసిన త్యాగము జగన్మాతను సంతృప్తి పరచగా, ఆ యజ్ఞవేదిక నుండు ఆమె ఆవిర్భవించిది. ఆమె, శిరస్సుపై రత్నఖచితమైన సువర్ణకిరీటం, ఆపై అర్థచంద్రుడు ప్రకాశించసాగారు. ఆమెనాలుగు చేతులలోపాశం, అంకుశము, చెఱకు విల్లు, ఐదు పుష్పబాణాలు ధరించింది. ఆ జగన్మాతను చూచి బ్రహ్మాది దేవతలు అనేక విధాలుగా స్త్రోత్రాలు చేశారు. వారి భక్తి భావాన్ని చూసి ఆమె ముచ్చట పడింది. భండాసురుణ్ణి సంబరించ గలనని దేవతలకు అమె అభయ మిచ్చింది.

కొన్నాళ్ళకు ఆ పరాశక్తి చతురంగ బలాలతో బయలుదేరింది. భండాసుర సంహారార్థమై బయలుదేరిన ఆమెను ఇరువైపులా వారాహీదేవి, శ్యామలాదేవి అనుసరించారు. పరిచారిగలుగా 'తల్లి' వెంట నిలిచారు.

ససైన్యంగా తన పైకి యుద్దానికి వస్తున్న పరాశక్తిని చూచి, భండాసురుడు భయంకరమైన తన సేనావాహినిని ఆమె పైకి పంపాడు. యుద్ధం ప్రారంభ##మైంది. దేవి పంపిన సేనలు భండుని సేనలను సర్వనాశనం చేశాయి. అపుడు భండాసురుడు తన ముప్పది మంది పుత్రులను దేవీ సైన్యం పైకి పంపాడు. అంతట పరాశక్తి తన కనుబొమల మధ్యభాగం నుండు బాలాదేవతను సృష్టించింది. భండపుత్రులను సంహరింపుమని ఆజ్ఞాపించింది. పరాశక్తి ఆజ్ఞమేరకు బాలా దేవత భండాసురుని పుత్రులందరినీ సంహరించిది.

తన పుత్రులందరూ మరణించడం చూచి, భండాసురుడు తన రెండు భుజాల నుండి ఇద్దరు రాక్షసులను సృష్టించాడు. ఒకడు విశుక్రుడు, వేఱొకడు విషంగుడు. వారిద్దరినీ జగన్మాత పైకి పురుకొల్పాడు తన పరిచారికలైన వారాహీ శ్యామలా దేవతలను ఆజ్ఞాపించింది. జగన్మాత ఆజ్ఞానుసారం వారాహీ దేవత విశుక్రుణ్ణి తుదముట్టించగా, శ్యామలాదేవి విషంగుణ్ణి సంహరించింది.

తనసైన్యము, తన పుత్రులు , తాను సృష్టించిన శక్తులు అన్నీ సర్వనాశనం కాగా, భండాసురుడు దిక్కుతోచని వాడయ్యాడు. దేవి ప్రయోగించే శస్త్రాస్త్రాల బారినుండి తన్ను తాను రక్షించు కోవడానికి ఒక విఘ్నయంత్రాన్ని ప్రయోగించాడు. సంగతి తెలిసిన జగన్మాత మహా కామేశ్వరుని వంక చూచింది. ఆ చూపులలో నుండి గణపతి ఆవిర్భవించాడు. తల్లి ఆజ్ఞమేరకు గణపతి భండాలురుని విఘ్నయంత్రాన్ని తునాతునకలు చేశాడు. ఆ పిమ్మట పరాశక్తి మహాపాశుపతాస్త్రాన్ని ప్రయోగించి బండాసురుని నగరమైన శూన్యక పట్టణాన్ని దగ్ధం చేసింది. ఆ వెంటనే కామేశ్వరాస్త్రప్రయోగంతో భండాసురుణ్ణి నేలకూల్చింది.

భండాసుర సంహారంతో దేవతలు ఆనందించారు. రాజరాజేశ్వరిగా, లలితా పరమేశ్వరిగా, భువనేశ్వరిగా పరాశక్తిగా ప్రస్తుతించారు. ఈ రీతిగానే ఎల్లకాలమూ తమ్ము కాపాడవలసిందిగా తల్లిని వేడుకొన్నారు. వాత్సల్యామృత వర్షిణి అయిన పరాశక్తి 'అలాగే' అని వారికి అభయప్రదానం చేసి అంతర్థానమైంది. దేవతలందరూ సుఖశాంతులతో కాలం గడిపారు.

ఈ కథ చాటున ఒక అంతరార్థం దాగిఉందని పెద్దలు వివరిస్తున్నారు. మందబుద్ధిగల సోమరితనానికి ప్రతీక భండాసురుడు. కామం నుండి పుట్టిన కోధం భండాసురుడు. అజ్ఞానంతో మిళితమైన అహంకారమే భండాసురుడు. ఈ లక్షణం గలవారు ఎవ్వరినీ లెక్కచేయకుండా, తమ బలమే గొప్ప అనుకొని, స్వచ్ఛగా ప్రవర్తిస్తూ , అందరికీ కష్టనష్టాలు కలిగిస్తూ ఉంటారు. అతినిద్ర, అశ్రద్ధ, తొందరపాటు, అవివేకము, అపకార స్వభావము మొదలైనవన్నీ ఈ లక్షణం నుంచిపుట్టే దుర్గుణాలు. వీటిని భండ పుతులుగా పేర్కొంటున్నది కథ.

ఈ దుష్టశక్తి సముదాయం జీవునిలో ప్రవేశించినపుడు, దానిని తనకు తానుగా మానవుడు అధిగమించలేడు. దుర్గుణాల ప్రభావం వల్ల తన స్వభావం కలుషితం కాగా, కానిపనులకు పాల్పడుతూ. పతనావస్థకు దిగజారి పోతాడు. మానవుడు, అతని జీవితం వ్యర్థమయిపోతూ ఉంటుంది. అపుడుమానవుడు అధ్యాత్మిక సాధన ప్రారంభించాలి. అందుకు ప్రతీకగా దేవీ ఆరాధనను కథ నిరూపించింది. తనలోని దుర్గుణ రాశివల్ల పతనమవుతూ ఆర్తిని పొందిన మానవుడు, సాధకుడై తనలోని దైవీశక్తిని ఉద్భోధింప చేసుకోవాలి. అపుడు దైవీశక్తి విజృంభిస్తే అంతరంగంలోని అసురశక్తులు అణగారి పోతాయి.

ఈ కథలో భండాసురుని అనుచరులుగా అతని భుజాల నుండి పుట్టిన ఇద్దరు రాక్షసులున్నారు. వారే నిశుక్రుడు , విషంగుడు.

'సంగము' అంటే కలయిక. దుస్సాంగత్యమే విషంగుడు. దుస్సాంగత్యం వల్ల మానవుడు వ్యసనపరుడై, శక్తిహీనుడవుతాడు. శక్తివిహీనతకే 'విశుక్రుడు 'అని పేరు. విషంగుణ్ణి సంహరించిన దేవత శ్యామల. అమెకే మంత్రిణీశక్తి అని పేరు. దుస్సాంగత్య ప్రభావానికి లోనైన జీవుడు సాధకుడై, ఆర్తిని చెంది, 'అమ్మ'ను ఆశ్రయిస్తే, ఆమె బుద్ధిబలాన్ని ప్రసాదిస్తుంది. అలాంటి బుద్ధిబలమే

"మంత్రిణీ" దేవత. బుద్ధిబలంతో మానవుడు తన ఆలోచనా విధానాన్ని సంస్కరించుకో గలుగుతాడు. పదాలోచనయే వారాహీ దేవత. బుద్ధిబలంతో దుస్సాంగత్యాన్ని వదిలించు కొని, ఇంద్రియ నిగ్రహంతో శక్తి సంపన్నుడు కావడమే సాధకుడు పొందే ప్రయోజనం.

జీవునిపై పూర్వసంస్కారాల ప్రభాలం బలీయమైనపుడు, 'సాధన ' నిరంతరాయంగా సాగే అవకాశం ఉండదు. దుష్టశక్తుల ప్రభావం తీవ్రమై సాధన సాగడానికి అవరోధం ఏర్పడుతుంది. అదే ఈ కథలో భండాసురుడు ప్రయోగించిన విఘ్నయంత్రంగా చెప్పబడింది. ఆనన్య చింతనను అలవరుచుకొన్న సాధకుడు, అంతర్యామిగా తనలో ఉన్న శక్తిని సందర్శిస్తాడు. అలాంటి సందర్శనం వల్ల విఘ్నాలను అధిగమించే శక్తి అతనికి అలవడుతుంది. సాధనలో అతడు పురోగమించి లక్ష్యాన్ని చేరుకుంటాడు. దేవి కామేశ్వరుని వంక చూడగా, గణపతి ఆవిర్భవించడం, అలా ఆవిర్భవించిన గణపతి విఘ్నయంత్రాన్ని భగ్నం చేయడం అనే పురాణ కథలోని సంకేతం ఇదే.

ఈ కథతో పాటు అందలి ఆలోచనా సుధను మనం ఆస్వాదించ గలిగితే, అంతరార్థాన్ని అందుకుని ఆచరించ గలిగితే, మనము సాధకులం కాలగలుగుతాము. మన అంతరంగంలో దుష్ట గుణాలనే రాక్షసులు సంహరింపబడి, ప్రశాంతత చేకూరుతుంది.

Devi Kathalu         Chapters          Last Page