Devi Kathalu         Chapters          Last Page

సుకన్య

సూర్యవంశంలో ఇక్ష్వాకుడనే రాజునకు శర్యాతి అనే సోదరుడున్నాడు. శర్యాతి కుమార్తె సుకన్య. సుకన్యను ఆ రాజు చ్యవనుడనే మహర్షికిచ్చి వివాహం చేశాడు. చ్యవనమహర్షి వృద్ధుడు, అంధుడు, అలాంటి వానికి శర్యాతి మహారాజు తన కుమార్తెనిచ్చి పెళ్ళి చేయవలసిన అవసరం ఎందుకు కలిగిందని జనమేజయుడు సందేహాన్ని వ్యక్తం చేయగా, వ్యాసుడు సుకన్య వృత్తాంతాన్ని సవిస్తరంగా చెప్పాడు.

"శర్యాతి మహారాజునకు సహస్రాధికంగా ప్రియురాండ్రున్నారు. అయినా, పట్టపురాణులు నలుగురు ప్రధానమైన వారు. వారిలో ఒక రాణికి కలిగిన కుమార్తె సుకన్య.

శర్యాతి పాలించే నగరానికి సమీరంలోనే ఒక సరస్సు ఉన్నది. ఆ సరస్సు నిర్మలమైన నీటితో నిండి, హంసలకు చక్రవాకాలకు నిలయమై, పద్మాలలోని మకరంద రసాన్ని ఆస్వాదిస్తూ ఝుంకారం చేసే తుమ్మెదల గుంపుతో ప్రకాశించేది. భృగువంశంలో పుట్టిన చ్యవనమహర్షి ఆ సరోవర తీరంలో తపస్సు చేసుకుంటున్నాడు. ఏకాంత ప్రదేశంలో మౌనవ్రతం పాటిస్తూ, నిద్రాహారాలు మాని, ఇంద్రియ నిగ్రహం కలిగి అతడు తపస్సును కొనసాగించాడు. అతనిపై పుట్ట పెరిగిపోయింది.

శర్యాతి మహారాజు కుమార్తె చ్యవనుని తపోవన ప్రాంతానికి తెలికత్తెలతో కలసి విహారానికి వచ్చింది. కొంత సేపు సరస్సులో క్రీడించి మరికొంతకాలం ఉద్యానవనంలో విహరిస్తూ చ్యవనుడు తపస్సు చేస్తున్న పుట్టను సమీపించిది. ఆ పుట్టలోపలి నుండి దివ్యకాంతితో ప్రకాశించే రెండి జ్యోతులు సుకన్యకు కన్పించాయి. ఆమె ఆశ్చర్యపడి , బాల్య సహజమైన చపల స్వభావం వల్ల ఒక ముల్లు తో ఆ జ్యోతుల ను పొడవబోయింది. పుట్టలోపలి నుండి "వలదు" "వలదు" అనే శబ్దం వినిపించింది. అయినా, సుకన్య ఆ మాటలను లెక్క చేయకుండా, చాపల్యంతో ఆ జ్యోతులను పొడిచింది. ఆ ముల్లు పుట్టలోపలి చ్యవనమహర్షి నేత్రాలకు గ్రుచ్చుకొని ఆయనకు బాధ కలిగించింది. శాంత స్వభావుడైన ఆ మహర్షి బాధను అనుభవిస్తూ కూడా, చలించకుండా తపస్సు కొనసాగించాడు.

చ్యవనమహర్షికి జరిగిన అపరాధ ఫలితంగా పట్టణంలో ఉన్న రాజుకు, మంత్రులకు, సైనికులకు శరీర ద్వారాలన్నీ బంధింపబడి భరింపరాని బాధ కలిగింది. అపుడు ఆ రాజు తమకు ఆకస్మికంగా ఈ బాధ కలగడానికి కారణమేమిటా ?అని ఆలోచనలో పడ్డాడు. "తపోదీక్షలో ఉన్న చ్యవన మహర్షికి అజ్ఞానంతో ఎవరైనా అపచారం చేస్తే, తత్ఫలితంగా మనకు ఈ బాధ కలిగి ఉండవచ్చు. కనుక, చ్యవనమహర్షి కి ఎవరైనా అపరాధం తలపెట్టారేమో, చూచి రమ్మ"ని తన మంత్రులకు పంపించాడు. ఈ వార్త క్రమంగా సుకన్య చెవికి సోకింది. అమె తన తండ్రిని సమీపించి, చాపల్యంతో తాను చేసిన అకృత్యాన్ని తండ్రికి నివేదించింది. వెంటనే శర్యాతి మహారాజు మంత్రి పురోహితులను వెంట పెట్టుకొని తపోవనానికి వచ్చి, మహర్షి పాదాలపై పడి , తమ కుమార్తె చేసిన అపరాధాన్ని క్షమించ వలసిందిగా ప్రార్థించాడు. అపుడు చ్యవనుడు జరిగినది తెలిసికొని, తనకు మహారాజుపై గాని, రాజకుమార్తెపై గాని కోపం లేదని, తనకు అపచారం కలిగినందుకు మహారాజు, అతని పరివారము బాధపడడం దేవీ మహిమ వల్ల జరిగి ఉంటుందని వివరించాడు. వృద్ధుడైన తాను ఇపుడు అంధుడు కూడా అయినందువల్ల తనకు పరిచర్యలు చేయడానికి రాజకుమార్తెను తన కిచ్చి వివాహం చేస్తే కష్టాలు తొలగిపోతాయని వివరించాడు. శర్యాణి మహారాజు తన కన్నబిడ్డను వృద్ధుడు, అంధుడు అయిన మహర్షికిచ్చి వివాహం చేయడానికి మనస్కరించక బాధపడసాగాడు. ఈ సంగతి తెలిసిన సుకన్య తనకు తానై ఆ మహర్షిని వివాహం చేసుకోవడానికి సుముకుతను వ్యక్తం చేసి, తండ్రిని ఒప్పించింది, గత్యంతరం లేక ఆ రాజు చ్యవన మహర్షికి సుకన్య నిచ్చి వివాహం జరిపించాడు. సుకన్య పతిసేవా పరాయణురైలై కాలం గడుపసాగింది.

వశిష్ఠునకు అరుంధతి వలె, అత్రిమహర్షికి అనసూయ వలె నిరంతరం భర్తను కనిపెట్టుకొని ఉంటూ, వేళకు అన్న పానాదులు అమర్చుతూ,

ప్రియోక్తులతో అతని మనస్సును అలరిస్తూ దేవతలు సైతం మెచ్చుకొనే విధంగా పతిభక్తి కలిగి, అన్ని విధాలా అతనికి అనుకూలవతియై ప్రవర్తింప సాగింది.

ఇలా ఉండగా ,ఒకనాడు ఆమె పాతివ్రత్యాన్ని పరీక్షీంచాలని అశ్వనీ దేవతలు భూమికి దిగి వచ్చి, ఆమెను సమీపించి, నీ వెవ్వరు? నీ తండ్రి ఎవరు చూడగా నీవు రాజకుమార్తె వలె కనిపిస్తున్నావు. ఏ పరివారమూ లేకుండా ఒంటరిగా ఈ సరస్సులో స్నానానికి వచ్చావేమిటి? నీభర్త ఎవరు? దివ్య శోభతో లక్ష్మీ దేవి వలె ప్రకాశిస్తున్న నిన్ను చేపట్టిన నీ భర్త ఎంతో భాగ్యవంతుడు కదా! అతని అదృష్టాన్ని మేము ఎమని ప్రసంసించగలం నీవు తిరుగాడుతున్న ఈ భూమి దేవలోకం వలె పవిత్రమై అలరారుతోంది. నీ వృత్తాంతాన్ని మాకు తెలియ చెయ్యి."అని అడిగారు. సుకన్య తన వృత్తాంతమంతా వివరించి, తమ ఆశ్రమానికి వచ్చి, తమ ఆతిథ్యం స్వీకరించవలసిందిగా, తన భర్తను సందర్శించ వలసిందిగా భక్తి వినయ సౌశీల్య గుణాలతో ఆహ్వానించింది. ఆమె వృత్తాంతం విన్న అశ్వనీ దేవతలు "వృద్ధునికి నీ తండ్రి నిన్ను ఎలా సమర్పించగలిగాడో మాకు అర్థం కావడం లేదు. నిన్ను చూస్తుంటే జాలి గలుగుతోంది. అడవి కాచిన వెన్నెల వలె నీ జీవితం నిరర్థకమై పోతోంది. సుఖింప దగిన దశలో ఇలా ఆశ్రమవాస క్లేశాలతో కాలం గడుపుతున్నావు. మా ఇద్దరిలో ఒకరిని వరించు. దివ్య భోగాలతో సుఖంగా ఉండ గలవు." అని ఆమెను ప్రలోభ పెట్టారు. ఆ మాటలను వినలేక సుకన్య తన చెవులు మూసుకొన్నది. భర్తను మనసులో తలచుకొన్నది. "కశ్యపవంశంలో జన్మించిన దేవతలైన మీరు నాతో ఇలా మాటాడటం భావ్యం కాదు. ఇది ధర్మవిరుద్ధం. మీరు వచ్చిన దారినే వెళ్ళి పొండి. లేని పక్షంలో ఇపుడే మిమ్మల్ని శపించగలను. తపోధనుడైన చ్యవన మహర్షికి అర్థాంగిని నేను." అని ఆవేశపడింది.

సకన్య ఇలా కోపోద్రిక్తురాలయి అశ్వనీ దేవతలను శపించబోగా, వారు, "నారీమణీ! శాంతించు. నీ పతిభక్తికి సంతోషంగా ఉంది. నీ భర్తను .యువకునిగా , రూపసంపన్నునిగా , నేత్రవంతునిగా చేస్తాము. నీ భర్తకు తెలియచేయు" మన్నారు. సుకన్య, భర్తతో విషయమంతా వివరించింది. చ్యవన మహర్షి అందుకు ఆనందంతో అంగీకరించాడు. అశ్వనీ దేవతలు చ్యవనుణ్ణి తమతో పాటు అక్కడున్న సరస్సులో స్నానం చేయవలసిందిగా సూచించారు. అశ్వనీ దేవతలతో పాటు మహర్షి కూడా సరస్సులోకి దిగాడు. సమాన రూప ¸°వన లావణ్య విలాసం కల ముగ్గురు తేజోమూర్తులు ఒకే సారిగా సరస్సు నుండి వెలువడ్డారు. వారిని చూచి సుకన్య, దేవతలు తన్ను ఇంకా పరీక్షింస్తున్నారని గ్రహించింది. జగన్మాత అనుగ్రహంతో మాత్రమే తాను ఈ కష్టం నుండి గట్టేక్కగలనని భావించింది. "జగన్మాతా! ఈ ఆపద నుండి నీవే నన్ను ఆదుకోవాలి. త్రిమూర్తులకు తల్లివై జీవులకు భుక్తి ముక్తి ప్రదాయినివై, ఆశ్రయించిన వారికి కొంగు బంగారమై, అనుగ్రహ స్వరూపిణివై అలరారే దివ్యజననీ! నా పతిని గుర్తించే శక్తిని అనుగ్రహించి నన్ను కృతార్థారాలను చేయవమ్మా!" అని ఆర్తితో ప్రార్థించింది. పరమేశ్వరి అనుగ్రహం చేత వెంటనే సుకన్య హృదయంలో ఒక విజ్ఞాన రేఖ తళుక్కు మన్నది. ఆమె తన భర్తను గుర్తించ గలిగింది. సుకన్య ప్రాతివ్రత్యానికి సంతోషించిన అశ్వనీ దేవతలు, నిజరూపాలు ధరించి, సుకన్యా చ్యవనుల అతిథి సపర్యలను స్వీకరించి, దేవలోకానికి తిరిగి వెళ్ళారు. యజ్ఞసమయాల్లో సోమపానం చేసే అర్హతను చ్యవన మహర్షి అశ్వనీ దేవతలకు వరంగా అనుగ్రహించాడు.

ఈ కథ చెప్పి, వ్యాసుడు, "జనమేజయా! భక్తితో పరమేశ్వరిని ఆరాధించిన వారికి, అసాధ్యం లేదు "అని వివరించాడు.

Devi Kathalu         Chapters          Last Page