Sri Sankara Jayant  Chapters    Last Page

శ్రీ శివాయగురవవే నమః

భూ మి క.

సృష్ట్యాదియం దీశ్వరుడు గుణ, కర్మ విభాగపూర్వకముగ చాతుర్వర్ణ్వమును సృష్టించెను. ఈ విషయమునే 'చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మవిభాగశః" అని భగవద్గీత యందు స్పష్టపరచెను. ఇట్టి చాతుర్వర్ణ్యములవారికి నాయా యాశ్రమములను, తత్తదనుగుణకర్మలను శ్రుతి, స్మృతి పురాణాదులు తెల్పుచున్నవి. అందు బ్రాహ్మణునకు బ్రహ్మచర్య, గార్హస్థ్య, వానప్రస్థ, సంన్న్యాసములు శ్రుతిస్మృత్యాదులచే విహితములు. క్షత్రియవైశ్యులకు సంన్యాసము దక్క మిగిలిన 3 ఆశ్రమములు, శూద్రులకు పౌరాణికముగ వివాహాదిసంస్కారములు విహితములు. గాన క్షత్రియాదు లగు మూడువర్ణములవారికి సంన్న్యాసమునం దధికారము లేదు. సంన్న్యాసాధికృతులు బ్రాహ్మణులే. ఈ విషయమునే శ్రీశంకరభగవత్పాదులు బృహదారణ్యకపంచమాధ్యాయభాష్యమునందు "బాహ్మణానా మేవ ప్రవ్రజనే7ధికారో నక్షత్రియాదీనాం" అని స్పష్టపరచిరి.

పరాశరస్మృతియందు 'అశ్వాలంబం గవాలంబం సన్న్యాసం పలపైతృకమ్‌ | దేవరాచ్చ సుతోత్పత్తిః కలౌ పంచ వివర్జయేత్‌|' అని సంన్న్యాసము కలియుగమునందు నిషేధింపబడుచుండ, బ్రాహ్మణులకే సంన్యాసాధికారము కలదని సుడువు టెట్లు పొసగునని శంకింపరాదు. శ్రుతి, స్మృతులలో స్మృతికంటె శ్రుతి ప్రబలప్రమాణ మగుటచే "యదహరేవ విరజేత్త దహరేవ ప్రవ్రజేత్‌" అను శ్రుతి సంన్న్యాసమును విధించుచుండ పరాశరస్మృతి దుర్బలప్రమాణ మగుటంజేసి యప్రమాణ మని శ్రీశంకరభగవత్పాదులు "నను పరామర్శెపి" ఇత్యాది గ్రంథముచే సూత్రభాష్యతృతీధ్యాయమున స్పష్టపరచిరి.

అట్టి శ్రుతిసిద్ధమగు సంన్న్యాసము విద్వత్సంన్న్యాస మనియు, వివిదిషాసంన్న్యాసమనియు రెండువిధములు. కర్మానుసారము బ్రాహ్మణజన్మము నొంది, ఈజన్మమనందుకాని, జన్మాంతరమందుకాని శ్రవణమనననిదిధ్యాసనముల నొనర్చి, పరిపక్వాంతఃకరణము కలవాడై, కర్మలయందు ప్రవృత్తి లేక, శుకజడభరతాదుల వలె సంచరించువానికి సంన్న్యాసము స్వతః ప్రాప్తమే యగును. అదియే విద్వత్సంన్యాస మనబడును అట్టి సంన్న్యాసవిషయమై ఆరూఢపతితత్వశంక లేదు. విధ్యుక్తకర్మయందుకాని, నిషిద్ధకర్మయందుకాని ప్రవర్తింపడు. దేనినీ యపేక్షింపడు. "కరతలభిక్ష స్తరులతవాసః' అనునట్లు సంచరించును.

ఇక వివిదిషాసంన్న్యాస మనగా జన్మతోడనే దేవర్షి పితౄణములు కలవాడై, 'తమేతం వేదానువచనేన బ్రాహ్తణా వివిదిషంతి యజ్ఞేన దానేన తపసా7నాశ##కేన' అను శ్రుత్యుక్తరీతిని బ్రహ్మచర్యమున సాంగవేదాధ్యయన మొనరించి, దాన ఋషిఋణవిముక్తుడై, 'ఆచార్యాయ ప్రియం ధన మాహృత్య ప్రజాతంతుం మా వ్యవత్స్యేత్సీః" అను శ్రుత్యుక్తరీతి గుర్వాజ్ఞానుసారము గురుదక్షిణ నొసంగి, స్వగృహమునకేగి స్నాతక వ్రతియై, సవర్ణయు, నసగోత్రయు నగు కన్యను యథావిధిగ స్వీకరించి, యామె యందు సత్సంతానమును కని పితౄణ విముక్తుడై, "కర్మ ణ్యవాధికార స్తే' అను గీతావచనాను సారము ఫలనిరపేక్షుడై, పరమేశ్వరార్పణ బుద్ధితో గర్మల నాచరించి దేవఋణ వినిర్ముక్తుడైన వానికి యంతఃకరణము పరిశుద్ధ మగును. అట్టివాడు స్రక్చందన వనితాది భోగముల యెడ తీవ్రవైరాగ్యము కల్గి 'నేను కృతార్థుడ నగుటకు సాధనము ఆత్మజ్ఞాన మొక్కటియే' యని నిశ్చయించుకొని, అందుకై బ్రహ్మవేత్త నాశ్రయించి నిర్విఘ్నముగ శ్రవణ మొనరించుటకై సంన్న్యాసమును స్వీకరించును. లేదా యట్టి శ్రవణార్థము బ్రహ్మచర్యము నుండియే సంన్యసించును. ఇదియే వివిదిషాసంన్యాము. పైద్వివిధ సంన్న్యాసులు, యాదృచ్ఛికముగ గృహస్థుల యిండ్లకు వచ్చునప్పుడు కాని, లేక గృహస్థులు వారిని స్వయముగ నాహ్వానించి తీసుకు వచ్చినపుడు కాని గృహస్థులు వారికి విధివిహితముగ భిక్ష నొసంగుట భారతీయుల ధర్మమై యున్నది. ఇది యిట్లుండ భారతీయుల దురదృష్టమో, కలికాల మహిమయో కాని, కొందరు గృహస్థులు యతీశ్వరు లన్న దూరముగ నుండి పట్టించుకొనకుండుట, కొందరు హేళన చేయుట, మరికొందరు దూషించుట గూడ జరిగి భారతావని పాపపంకిల యగుచున్నది. ఇట్టితరి శ్రీశ్రీ శ్రీ సచ్చిదానందేంద్రసరస్వతీస్వాములవారు 'శ్రీశంకరజయంతి' అను నొక సద్గ్రంథమును ఆస్తికలోకమున కనుగ్రహించిరి. ఇందు శంకరజయంతిని వైశాఖశుద్ధ పంచమినాడు పెద్దలు నిర్ణయించిన వ్యవస్థనుబట్టి తప్పక చేసుకొనవచ్చును. ఇదికాక శంకరభగవత్పాదులు బ్రహ్మవేత్త లగుట సర్వకాలసర్వ దేశములకు జెందిన వారు గాన గృహస్థుల యుత్సాహానుసారము ఎప్పుడు చేసుకొనినను చేసుకొనవచ్చును. అని సోపపత్తికముగ నిరూపించిరి. మరియు యతిపూజావశ్యకతను,దానివలన గలుగు మహోత్కృష్ట ఫలమును అనేక ప్రమాణ ప్రదర్శనపూర్వకముగ ననేక దృష్టాంతములతో విపులముగ నిరూపించి యుండిరి. స్థితప్రజ్ఞు లగు యతీశ్వరుల పూజను స్తుతించుటకుగాను అర్థవాదములును కొన్ని చోట్ల చూపబడెను. మరియు స్థితప్రజ్ఞుని తెలిసికొనుటకై గృహ స్త్రీ, విత్తాదుల కోరుకొను మనియతులను ప్రలోభ##పెట్టుట గూడ గొన్ని కధానికలలో కలదు. అట్టివానిని యతి గ్రహింపబూనినచో స్థితప్రజ్ఞుడై కాడనియు, గ్రహింప నిరాకరించినచో స్థితప్రజ్ఞుడనియు స్పష్టమగును. ఈ పరీక్ష జానశ్రుతి రైక్వుని యెడ ఆచరించి, రైక్వుడు స్థితప్రజ్ఞుడని తెలిసుకొనెను. ఇదేవిధముగ జనకుడు యాజ్ఞవల్క్యునిగూర్చి "హస్త్యృషభగ్‌ం సహస్రం తేదదామి" అని యనేక పర్యాయము లడిగి యుండ శిష్యుడు కృతార్థుఁడు కానిదే గ్రహింపనని బదులు చెప్పి యుండెను. కాన యే యే స్థలముల యతికి వనితావిత్తాదుల నర్పించవలె నని చెప్పియుండెనో ఆవాక్యము లన్నియు నర్థవాదములే యనియు, యతి పూజాప్రాశస్త్యద్యోతకములనియు గ్రహింతురుగాక. గృహస్థునకు యతిపూజ యత్యావశ్యక మనియు, యతితిరస్కృతి రౌరవాదినరకప్రాపక మనియు నీగ్రంథమునందు సప్రమాణముగ నిరూపింపబడెను. కాన భారతీయు లీగ్రంథమును చదివి, యతీశ్వరులను తమ ఇండ్ల కాహ్వానించిగాని, తమంత తాము దయచేసినప్పుడు గాని వారిని సాక్షాత్‌ శంకరభగవత్పాదులుగ భావించి, ఆసుదినమును శంకరజయంతిగా భావించి భక్తిశ్రద్ధలతో శాస్త్రనిర్దిష్టమార్గమున పూజించి, సేవించి యిహపరశ్రేయస్సులను బొందుదురుగాక. యని విన్నవించుకొనుచున్నాను.

ఇట్లు

"దర్శనాలంకార, న్యాయవేదాన్త విద్యాపారీణ"

బులుసు అప్పన్న శాస్త్రి.

భ ట్న వి ల్లి.

ది 11-9-71.

Sri Sankara Jayant  Chapters    Last Page