Hindumatamu    Chapters    Last Page

అధ్యాయము .

నవయుగము

రెండు మార్గములు

హిందూమతమును రక్షించుటకు రెండువిధములైన యుపాయములు నేడు సూచింపబడుచున్నవి. శ్రుతిస్మృతీతి హాసపురాణ సదాచారముల ప్రచారము నిప్పటికంటె లోకములో హెచ్చుగ వ్యాపింపచేయవలెననియు, సంధ్యావందనాదికర్మలను, ఆర్యసంప్రదాయములను దేశములో హెచ్చుగ వ్యాప్తిలోనికి తేవలెననియు కొందఱు చెప్పుచున్నారు. ఇట్లు చెప్పువారిని హిందూమత పునరుజ్జీవన వాదులని చెప్పవచ్చును. హిందూమతధర్మములు నేడాచరించుటకు కష్టముగ నున్నవనియు, కర్మకాండను కొంతవఱకుగాని, పూర్తిగాకాని తగ్గించివేయవలెననియు ప్రజలకు నిగ్రహశక్తి తగ్గిపోవుటచే స్త్రీ పునర్వివాహాది విషయములలో కొంత సడలింపును గల్గింపవలెననియు, స్వేచ్ఛాస్వాతంత్ర్య సౌభ్రాత్రములను సిద్ధాంతములపై నాధారపడియున్న యాధునిక నాగరికతలో వర్ణభేదములను రూపుమాయింపవలెననియు, స్త్రీ స్వాతంత్ర్యము, వర్ణవ్యవస్థ మున్నగువానిలో మార్పులను అంగీకరింపవలెననియు కొందరు చెప్పుచున్నారు. వీరు పునర్నిర్మాణవాదులు, లేక సంస్కరణవాదులు, పునరుజ్జీవన విధానమున కాంగ్లములో Revival అని చెప్పవచ్చును. సంస్కరణ విధానమును Reform అని నుడువదగును.

మతమెప్పుడును ఉత్కృష్టధర్మమును బోధించును. మనము నికృష్టులమై యాధర్మము నాచరింప లేనపు డా ధర్మమును గూడ నికృష్టస్థితిలోనికి దింపరాదు. పాశ్చాత్య దేశములలోని క్రైస్తవులు ఘోరసంగ్రామములో దగుల్కొని, దారుణమైన హింసను సల్పుకొనుచుందురు. వారి మతగ్రంథమగు బైబిలన్ననో అహింసను బోధించుచున్నది. ఒక చెంపమీద నెవ్వరైన కొట్టినచో, రెండవచెంపనుగూడ చూపవలెనని బైబిలు చెప్పుచున్నది. తమ యాచరణమునకును తమ ధర్మమునకును, వ్యత్యాసమున్నదను కారణమున నేక్రైస్తవుడైనను మతమును దిద్దుటకుగాని, సంస్కరించుటకుగాని యత్నించుచున్నాడా? అట్లే మహమ్మదీయులందరు తమతమగ్రంథములలో చెప్పబడినట్లాచరించుచున్నారా? ఆచరింపనంతమాత్రమున తమ మతమును మార్చుకొనవలెననుచున్నారా? అట్టిచో నొక్కహిందువులే మతమును మార్చుకొనవలెననుట వింతగలేదా?

మతమును సంస్కరించుకొనవలెనను విచిత్రమగు నాందోళనమును హిందువులే లేవతీయుటకు గలకారణమును విచారించి చూతుమేని, ప్రామాణ్యము లేకపోవుటయే యా కారణముయొక్క స్వరూపమని తేలగలదు. మనలో పాశ్చాత్యవిద్య నభ్యసించినవారి కనేకులకు మన మతగ్రంధములగు శ్రుతిస్మృతులయందు విశ్వాసము లేదు. ఈ 20 వ శతాబ్దములో నట్టి మూఢవిశ్వాసములు పనికిరావని వారందురు. కాని 20 వ శతాబ్దపు నాగరకత మన కేపాశ్చాత్యదేశములనుండి వచ్చినదో, యాదేశములలోనే, మన కీమత విశ్వాసమును పారద్రోలిన పాశ్చాత్యవిద్యకు గురువులైన పాశ్చాత్య పండితులకే, యీ మూఢవిశ్వాసము నే డుండుట గమనింపదగిన యంశము.

ఈ 20 వ శతాబ్ద పిశాచము మనలనే పట్టుకొనినది కాని పాశ్చాత్యులను పట్టుకొనలేదు. వారి మతవిశ్వాసమునకు 20 వ శతాబ్దముగాని, నవనాగరికతగాని, రాజకీయ వికాసముగాని యడ్డురాలేదు. నేడు పాశ్చాత్య దేశములలో మహారాజ్యతంత్ర ప్రవీణుడైన యేక్రైస్తవుని యొద్దకైన నేగి ''బైబిలననెద్ది?'' యన నాయన ''బైబిలు భగవద్దత్తము'' అని సమాధానము చెప్పును. ''ఏసుక్రీస్తు ఎవ'' రన ''దేవుని కుమారుడు'' అనును. అట్లే నవనాగరకతామూర్తియని చెప్పదగిన యేముస్లిము నాయకుని యొద్దకైన నేగి ''కొరాన్‌ అననేమి? మహమ్మద్‌ ఎవరు?'' అని ప్రశ్నించుచో నాతడు వెంటనే ''కొరాన్‌ పరమ ప్రమాణము. మహమ్మదు భగవంతునిచే పంపబడిన ప్రవక్త'' యని సమాధానము చెప్పును. వారి రాజకీయ ప్రావీణ్యముగాని, నవనాగరకతగాని, 20 వ శతాబ్దము కాని యిట్లు మత గ్రంథములందును, మతప్రవక్తలయందును విశ్వాసమును ప్రకటించుట కడ్డువచ్చుటలేదు. మన హిందూసంఘమునకు చెందిన యే యాధునిక ప్రముఖునియొద్దకైన నేగి ''వేదము లెట్టివి? శ్రీ రాముడెవరు?'' అని యడుగుడు. వెంటనే యాతడు'' వేదము లొకప్పు డానాటి బుద్ధిమంతులచే నానాటి కుపయోగపడు విధమున రచింపబడినవి; శ్రీరాముడును మనవంటి మానవుడే కాని కొన్ని యుత్కృష్టగుణము లాతనియందున్నవి'' అని సమాధానము చెప్పును. వేద మీశ్వరదత్తమని నుడువుట కాతడు సిగ్గుపడును. రాము డవతారపురుషుడని చెప్పుట కాతడు సంకోచించును. ఏయితర మతస్థులకును లేని బిడియము మనకేల యుండవలెనో తెలియకున్నది. మన హిందూ సంఘమున నాయకత్వము వహించిన వారిలో చాలమంది యిట్లే యున్నారు.

మతగ్రంధములలో వాస్తవముగా నమ్మకము లేనివారే చాలమంది కలరు. నమ్మకముండినను పైకి చెప్పుటకు భయపడువారు కొందరు కలరు. ఇతర మతస్థులందరు నాయా మతగ్రంథము లీశ్వరదత్తములని నిస్సంకోచముగా నెట్లు చెప్పుచున్నారో, యట్లే మనవారును వేదము లీశ్వరదత్తములనియు శ్రుతిస్మృతులు పరమప్రమాణములనియు చెప్పగల్గిననాడే మతమునకు నిజమైన యుద్ధరణము గల్గును. ప్రమాణములేని మతమేదియు నింతవరకు ప్రపంచములో విలసిల్లి యుండలేదు. హిందూమతగ్రంధములందు విశ్వాసము లేకుండినను గూడ, హిందువులమని చెప్పుకొనుట హాస్యాస్పదము. హిందూమతము విశాలమైనదనియు నిందు సంకుచితభావము లేదనియు నుడువుట నేటి మన విద్యాధికులలో నొకవిలాసము (ఫేషను) అయినది. హిందువు డనిపించుకొనుట కిట్లే నడచుకొనవలెననికాని, యిట్లు నడచుకొనగూడదనికాని నియమము లేదనియు హిందూమతము విశ్వసంగ్రాహి (Catholic) యనియు, వీరు నుడువుచున్నారు. ఇట్లు చెప్పువారు హిందూమతముయొక్క మూలసూత్రములనైన నెఱుగక హిందూమతమునకు మహాపచారము చేయు పండితమ్మన్యులో లోకపంచకులో యైయున్నారు.

హిందూధర్మగ్రంథమని చెప్పదగిన యేగ్రంధమును తీసికొనినను, నది విధినిషేధవాక్యములతో నిండియుండును. శ్రుతిస్మృతులలో మానవుని ప్రవర్తనమున కెట్టి స్వాతంత్ర్యము నంగీకరింపబడలేదు. బ్రాహ్మముహూర్తమున లేచినది మొదలు రాత్రి శయనించువఱకుగల సమస్త ముఖ్యకార్యములను శాస్త్రములం దాదేశింపబడి యున్నవి. శాస్త్రములందు చెప్పబడనిపట్ల కూడ మనకు పూర్ణ స్వాతంత్ర్యములేదు. అట్టిపట్ల శిష్టాచారము ప్రమాణము. శ్రుతిస్మృతి సదాచారములు అడ్డురానిపట్లనే మనకు స్వాతంత్ర్యము కలదు.

హిందూమతముపేర స్వేచ్ఛాచరణమును బోధించుట యత్యంతము గర్హ్యము. నేడు నవనాగరకుల జేబులలోగూడ గన్పట్టు భగవద్గీత యీస్వేచ్ఛాచరణమును తీవ్రముగ గర్హించుటలేదా? గీత శాస్త్రప్రామాణ్యమును నొక్కి చెప్పుచున్నది. అర్జునుడు యుద్ధము చేయుట తనకు తప్పుగ తోచినదని చెప్పినపుడు శ్రీకృష్ణపరమాత్మ యర్జునునితో, ''నీకుతోచుట లెక్కలోనిదికాదు. శాస్త్రమేమి చెప్పుచున్నదో చూడుము. క్షత్రియునకు ధర్మయుద్ధము కర్తవ్యము. కావున శాస్త్రము ననుసరింపుము'' అని బోధించినాడు. కర్తవ్యా కర్తవ్య నిర్ణయమునందు నీకు శాస్త్రమే ప్రమాణమని గీత స్పష్టముగ నుడువుచున్నది. ''తస్మాచ్ఛాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యవ్యవస్థితౌ'' (16-24)

వేదముకాని మరి యేయితరగ్రంధముగాని మానవుని స్వేచ్ఛాప్రవృత్తి నంగీకరించుటలేదు. మన మతగ్రంథములన్నియు శాస్త్రోక్తాచరణమును విధించుచు, దానిని తప్పుచో నరకప్రాప్తియేయని కంఠోక్తిగ నుడువుచున్నవి. కావున నితరమతస్థులనో, నవనాగరికులనో మెప్పించుటకై మనవారెవ్వరును హిందూమతము స్వేచ్ఛాస్వాతంత్ర్యములకు తావొసగుననియు, నందువలన హిందూమతము విశాలమైనదనియు విశ్వసంగ్రాహి (Catholic) యనియు నుడువకుందురుగాక! విధినిషేధములు లేని మతమనగా నాస్తికమతమనియే యర్థము. అట్టి నాస్తికమతమే మన మతమని గర్వించు ప్రాజ్ఞులనుచూచి హిందూమతస్వరూపమునే యించుక గ్రహించినవారికైనను, జాలి కలుగక మానదు.

ఒక విషయములోమాత్రము హిందూమతము విశాలమైనదే. భగవదారాధనవిషయమై యది హద్దుల నేర్పరచుటలేదు; తమతమ మనశ్శక్తి సామర్థ్యములనుబట్టి భగవంతు నెవ రేవిధముగనైనను భావింపవచ్చును; ఏవిధముగనైనను అర్పించవచ్చును. భగవంతు డిచ్చటనే యుండును; ఈవిధముగనే యాతని పూజింపవలయును; మరొక విధముగ పూజింపరాదు'' అను హద్దులను హిందూమతము విధింపదు. ఎవడు భగవంతు నేస్వరూపములో నర్చించినను భగవంతుడు సంతుష్టుడగును. తన పూర్ణస్వరూపమును భక్తుడు గుర్తించినపుడు మాత్రము భగవంతుడు పూర్తిగ సంప్రీతుడగును. ఏ దేవత నెవడేవిధముగ నారాధించినను, అది భగవదారాధనమే యగును.

''ఆకాశాత్పతితం తోయం యథా గచ్చతి సాగరం

సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్ఛతి''

''యేప్యన్యదేవతాభక్తా యజంతే శ్రద్ధ¸°న్వితాః

తేపి మామేవ కౌన్తేయ యజం త్యవిధిపూర్వకం''

మున్నగువాక్యము లీభావమునే తెల్పుచున్నది. భగవదారాధన విషయమున క్రైస్తవులనుగాని, మహమ్మదీయులనుగాని హిందూమతము నిందింపదు. వారు భగవంతునిపట్ల నింకను విశాలమైన భావమును పొందవలెనని హిందూమతము కోరును. కావున భగవద్విషయములో హిందూమతము విశాలమైనదనియు విశ్వసంగ్రాహియనియు నుడువుటలో నాక్షేపములేదు. హిందూమతములోని భగవదారాధన విధానములు మానవ మనస్తత్వముపైనను, భగవంతుని యనంతరూపలక్షణ విశ్వాసముపైనను నాధారపడి యుండుటచేతను ప్రపంచములోని యితర మతముల విధానములు వీనిలో నిముడవలసినవే యగుటచేతను కాలము గడచిన కొలదియు హిందూమతములోని యీఘనతను ప్రపంచములోని విజ్ఞానవంతు లెల్లరు గుర్తించి గౌరవింపక తప్పదు. (చివరి యధ్యాయములో నీయంశములు విస్తరింపబడినవి.)

నవీన విజ్ఞానానుకూల్యము

హిందూమతములోని యంశములు క్రమక్రమముగా ప్రకృతిశాస్త్రములకు (సైన్సులకు) అనుగుణములుగా కన్పట్టుచుండుటగూడ నీమతమునకు భవిష్యత్ర్పపంచములో గలుగగల యున్నతస్థానమును వ్యక్తపరచుచున్నది. సైన్సుయొక్క యభివృద్ధి మతమునకు భంగకరమనునది యితరమతముల విషయమున చెల్లిన చెల్లవచ్చును, గాని హిందూమతము మాత్రము సైన్సు వలనను నవీన విజ్ఞానము వలనను తన మహత్త్వమును లోకమునకు హెచ్చుగ చాటుకొనగలదనుట తధ్యము. ఈనాడు సైన్టిస్టులు కనిపెట్టిన రహస్యముల నెన్నిటినో మన పూర్వులు మతగ్రంథములలో వెల్లడించియున్నారు.

తరుగుల్మలతాదులకుకూడ సుఖదుఃఖానుభవ మున్నదనియు, నదిపైకి కన్పట్టకపోయినను లోలోన జరుగుచున్నదనియు మన శాస్త్రములు చెప్పినవి.

అంతస్సంజ్ఞాభవంత్యేతే సుఖదుఃఖసమన్వితాః మను (1-49)

మొన్న మొన్నటివఱకును సైన్‌టిస్టుల కీసంగతి తెలియలేదు. శ్రీ జగదీశ చంద్రబోసుగారు నవీనశాస్త్రముల యాధారముచే నీయంశమును రుజువుచేసిన వారిలో ప్రథముడు. బోసుగారివంటి సై& టిస్టులు బయలుదేరినకొలదియు, హిందూమతములోని సత్యములు బయట పడుచుండును.

మానవుడు జీవించియుండగా వానిగుండె యాగిపోదని పాశ్చాత్య శరీరశాస్త్రజ్ఞులు, వైద్యులు తలంచుచుండిరి. వేలకొలది సంవత్సరముల క్రిందట మన దేశములో రచింపబడిన యోగశాస్త్ర గ్రంథములలో గుండెనాపుట సాధ్యమేయని చెప్పబడినది. నేటికిని హఠయోగులు కొందరు దానిని మనకు ప్రత్యక్షముగ గన్పఱచుచున్నారు. పాశ్చాత్య విజ్ఞానము హిందూ విజ్ఞానమునుండి నేర్చుకొనవలసినది చాల కలదనుట కిట్టి వెన్నియో సాక్ష్యములు కలవు.

గంగానది పవిత్రమైనదిగ హిందువులచే తరతరములు నుండి భావింపబడుచున్నది. ఏదోయొకింత పాశ్చాత్య విజ్ఞానము నార్జించిన మన యువకు లిట్టి నమ్మకములను పరిహసించుటను చూచుచున్నాము. కాని యిటీవల ఫ్రాంసు దేశమునుండి యొక సై& టిస్టు వచ్చి గంగాజలమును పరీక్షించి, యందు చాల విశేషముగలదనియు, కలరా పురుగులనుగూడ నిర్వీర్యము చేయుశక్తి యందు గలదనియు చెప్పెను. పిమ్మట మనవారికి గంగాజలముపై గౌరవము గల్గినది. కాని గంగోదకము భౌతిక మహత్త్వము గలదనియే కాని, యది మానసికముగను, ఆధ్యాత్మికమునుగూడ పావనమని నమ్ముట యెట్లని యడుగువారుకూడ కలరు. ఒక ఫ్రెంచి సైన్‌టిస్టు ఇంతకాలమునకు బయలుదేరి దాని భౌతికమహత్త్వమును గనిపెట్టినట్లే, మరొక వైజ్ఞానికుడు దాని యలౌకికశక్తులను గనిపెట్టవచ్చును. నవీన 'సైన్సు' ఇంకను పూర్తికాలేదు. ప్రతిదినము తన్నుతాను దిద్దుకొనుచు నభివృద్ధి నందుటకు యత్నించుచున్నది. ఈనాడు దానికి తెలియని సంగతులు రేపు తెలియవచ్చును. దానిలో లేనివన్నియు నసత్యములనువారు షేక్స్పియరుయొక్క యీక్రింది వాక్యమును జ్ఞప్తికి తెచ్చుకొనవలెను.

There are more things in heaven and earth, Horatio,

Than are dreamt of in your philosophy,

హిందూమత విజ్ఞానములోని సత్యములు క్రమక్రమముగ సైన్సువలన ప్రపంచమునకు రుజువగుచున్నపుడు గూడ, నింకను తొందరపడి ప్రస్తుత సైన్సున కందనివన్నియు నసత్యములని త్రోసివైచుటకంటెను నవివేక ముండదు.

మనవారు రుజువులను చెప్పక విధులరూపమున మనకాదేశించిన మహాసత్యము లెన్నియో క్రమముగ సైన్సుయొక్క అంగీకారమును పొందుచున్న ననునదియే హిందూమతమున కనుకూలమగు గొప్పబలము.

రాత్రి పరుండునపుడు శిరస్సును తూర్పు దిక్కుగ నుంచవలెననియు, దక్షిణముగ నుంచుట మొకమాదిరిగ మాత్రమే మంచిదనియు మనపురాణములు చెప్పుచున్నవి. ఇట్టివానిని పుక్కిటి పురాణములని నవీనులు కొట్టివైచుచున్నారు. కాని నవీనశాస్త్రము లిట్టివిధుల కెంతయనుకూలముగ నున్నవో వారు పరికింపరు. కొందరు సైన్‌టిస్టు లీపైని తెల్పిన విధిని పరిశీలించియున్నారు. భూమిపై ప్రసరించు విద్యుచ్ఛక్తి ప్రవాహముల గమనికనుబట్టి, రాత్రి తూర్పుగా తలనిడి శయనించువానికి తెల్లవారునప్పటికి, ఉష్ణతీవ్రత తగ్గి బుద్ధివైశద్య మేర్పడుననియు, దక్షిణముగ తలనిడి శయనించువాని శరీరమునకు బలము గల్గుననియు సైన్‌టిస్టులు కనుగొనిరి. ప్రాక్ఛిరస్కుడై శయనించువాడు పండితుడగుననియు, దక్షిణ శిరస్కుడై శయనించువా డారోగ్యవంతుడగుననియు పురాణములు చెప్పుచున్న పరమసత్యములతో నీసైన్‌టిస్టులు కనిపెట్టిన సత్యము లెట్లు సరిపోవుచున్నవో గమనింపదగిన యంశము. (చూ. హరవిలాస శారదాగారి Hindu Superiority పుట. 228-31).

మనమతములోని సత్యములు మన స్థూలబుద్ధికి నర్థరహితములుగ దోచినను, చివరకు వాని యాథార్థ్యము వ్యక్తము కాగలదని గ్రహించుట యత్యవసరము.

హిందూమత గ్రంథములచే నాదేశింపబడిన ధర్మములన్నిటిలోగల సత్యములను గ్రహించుట యేమానవునకును సాధ్యము కాకపోవచ్చును. జీవితమంతయు పరిశోధనలలో గడిపినను అన్నియంశములను గ్రమించుట సాధ్యముకాదు. ఎంత బుద్ధిమంతుడైనను, కొన్ని సత్యములను మాత్రమే తన పరిశోధనవలన కనిపెట్టగలడు. ఆయా పరిశోధకులు న్యాయముగా ప్రకటించు స్వీయానుభవములను మనము విమర్శించి చూతుమేని, మన మతములోని యేయంశమును త్రోసివేయుటకు వీలులేదను నమ్మకము కలుగగలదు.

పైకి మూఢవిశ్వాసములుగ కన్పట్టున వెన్నియో పరమసత్యములై యున్నవి. వేద మంత్రములలో పటిమ కలదనియు, స్వరము తప్పకూడదనియు, మనవారు చెప్పిరి. భావమే ముఖ్యముకాని వేదమంత్రములలోను, స్వరములలోను నేమియులేదని యాధునికులు కొట్టివేయుచున్నారు. లెడ్‌బీటరు, థామస్‌ మున్నగు పాశ్చాత్యులు వేదమంత్రములను గురించి పరిశీలన గావించిరి. వారు దివ్యజ్ఞాన సమాజమునకు చెందినవారు; సూక్ష్మదృష్టి నలవరచుకొనినవారు. స్వరయుక్తముగా మంత్రము నుచ్చరింపగా నేమి జరుగునో వారు స్వయముగ సూక్ష్మదృష్టిచే చూచినారు. గాయత్రి నుచ్చరించునపుడు సూర్యమండలము నుండి యొక జ్యోతి బయలుదేరి యా యుచ్చరించు స్థలమువరకు వచ్చి యా చుట్టుపట్ల ప్రదేశమునుకూడ తేజోమయముగ చేసినట్లు చూచితినని లెడ్‌బీటర్‌ చెప్పెను. అపస్వర ముచ్చరించుచో నాజ్యోతి కొంత తగ్గినట్లును, ప్రక్కకు తిరిగినట్లును కూడ నాతడు కనిపెట్టెను. ఈవిధముగా తెలిసికొనిన వారి సాక్ష్యములు మన కమూల్యములు. హిందూమత సత్యములనవి వేనోళ్ళ చాటుచున్నవి.

మృతులైనవారికి శ్రాద్ధాదికము చేయవలెననియు, వారు మన వ్యవహారములను పరికించుచుందురనియు మతగ్రంథములలో కలదు. మన పాశ్చాత్యవిద్యావాసితులు కొందరు దీనిని పరిహసించుచుండిరి. కాని గొప్ప పాశ్చాత్య సైన్‌టిస్టు అయిన సర్‌ ఆలివర్‌ లాడ్జిమున్నగువారు మృతుల గమనికను స్వానుభవ పూర్వకముగ తెలిపి వారికిని మనకునుగల సంబంధము మరణముతో పోలేదని నుడివినపుడు వారు కన్నులు తెఱచిరి. శ్రాద్ధము పెట్టని కుమారులను మృతపితరులు నిందించుచున్నట్లు కూడ కొందరు పరిశోధకులు తెలిసికొని యున్నారు.

పునర్జన్మ కలదను నంశమును హిందూమతము తప్ప మరి యేమతమును చెప్పుటలేదు. ఎన్నడును రుజువుచేయబడి యుండని యీయంశమును హిందువులు వేలకొలది సంవత్సరములనుండి నమ్ముట యాశ్చర్యకరముగ నున్నదని మాక్డోనెల్‌ వ్రాసియున్నాడు. నేటి మన నవ్యభావోపేతులు కూడ చచ్చినవాడు మరల పుట్టుననుట హాస్యాస్పదమందురు. ఈ పునర్జన్మ సిద్ధాంతముపట్ల విశ్వాసము సన్నగిల్లుచున్న యీ దినములలో ప్రజలకు దీనియందలి విశ్వాసమును బలపరచుటకో యనునట్లు, పరమేశ్వరు డీనడుమ కొన్ని రుజువులను లోకములో వెలయింప చేసినాడు. అమెరికాలో, నొక బాలుడు అయిదు సంవత్సరములలోపు వయస్సుననే తాను పూర్వజన్మములో నొక గ్రామములో నొక యింట నొక పేరుతో నుంటినని నుడువగా ప్రజలాశ్చర్యపడి యాబాలుడు పేర్కొన్న గ్రామము, కుటుంబము సత్యముగ నున్నవే యనియు, నాపేరుగల మనుష్యుడు కొంతకాలము క్రిందట మరణించినాడనియు తెలిసికొని యాబాలు నాగ్రామములో నాయింటికి తోడ్కొనివెళ్ళిరి. అంత నాబాలు డాయింటిలో నెచట నే వస్తువు లుండెవో చెప్పి ముఖ్యములైన కొన్ని కాగితములుగల పెట్టెనుగూడ తెల్పెను. అందరు నాశ్చర్య చకితులైరి. 1934 వ సంవత్సరములో ఢిల్లీలో జనించిన శాంతి దేవియను బాలిక తన పూర్వజన్మములోని భర్త పేరును గ్రామముపేరును తెల్పి యచటకు తన్ను తీసికొని పోగోరగా నామె బంధువు లామె నచటకు (మధురకు) తీసికొనిపోయిరి. అచట నామె తన పూర్వజన్మ బంధువుల నందరను గుర్తుపట్టెను. రాజస్థాన విశ్వవిద్యాలయములో మనస్తత్త్వశాఖాధినేతల శ్రీ హెచ్‌.ఎన్‌. బెనర్జీ 1966-67 లో 500 పునర్జన్మ సంఘటనలను కనిపెట్టిరి.

ఇతర మతములలో లేనంతమాత్రమున మన మతములోని యేయంశమును మనము త్రోసివేయరాదనుట కీపునర్జన్మవిషయ మొక యుదాహరణము. మానవుని యనుభవము, సైన్సు, ఇతరమతములు ఇంతవరకు కనిపెట్ట లేకపోయిన మహాసత్యములు వందలకొలది హిందూమతములో గలవు. మన తెలివితేటలకును, అనుభవమునకును విరుద్ధముగ నున్నంతమాత్రమున వానిని తిరస్కరింపరాదనునదియే ముఖ్యాంశము.

చారిత్రక పరిశోధకులుగూడ నీయంశము నంగీకరించియున్నారు. మన పురాణములలో ననేకములైన చారిత్రకాంశములును, భూగోళసంబంధములైన యంశములును గలవు. పరిశోధకులు తమ యనుభవమునకు విరుద్ధముగ నున్నంతమాత్రమున వీనిని తిరస్కరించుచుండిరి. కాని క్రమక్రమముగ పరిశోధకులు తమ తప్పును సవరించుకొనుచున్నారు. గౌతమీపుత్రశాతకర్ణి గౌతమీపుత్రయజ్ఞశ్రీ మున్నగురాజుల పరంపరను వాయుపురాణము బేర్కొనినది. దానిని నమ్మక మన చారిత్రకులు పుక్కిటి పురాణమని కొట్టివైచిరి. కాని కొంతకాలమునకు నాసిక ప్రాంతములో కొన్ని ప్రాతనాణములు భూమిలోనుండి బయటపడినవి. ఆ నాణములపైనున్న రాజనామములను చూచినపుడు పురాణములలో పేర్కొనబడిన రాజపరంపర యాధార్థమైనదేయని చారిత్రకులకు వెల్లడియైనది, (చూ. వి. ఎ. స్మిత్‌ The early History of India 212 పు.) ఇట్లే పురాణములలోసి సత్యము లెన్నియో వెల్లడి యగుచున్నవి.

నేడు కొందరు హిందూసంఘమును సంస్కరింపగోరి, వర్ణపద్ధతిని నిర్మూలింపగోరుచున్నారు. దానివలన సంఘమున సమత్వ మేర్పడునని వారి యభిప్రాయము. కాని మానవ స్వభావమును, సంఘస్వభావమును వారు పరికింపరు. ఈవిధమైన వర్ణవిభాగములేని దేశములలోగూడ సంఘసమత్వములేదని వారు గ్రహింప లేకున్నారు. ఆర్థికముగ సంఘమును సంస్కరించుకొనవచ్చునుగాని వృత్తివిభాగమును తీసివైచుట వెఱ్ఱిపని యని సాంఘికశాస్త్రవేత్తలు గ్రహింపగల్గుచున్నారు.

వర్ణపద్ధతి ననుసరించి బ్రాహ్మణుడు విద్యలకు గురువై బుద్ధిబలముచేతను, ఆధ్యాత్మిక బలము చేతను సంఘమున కుపకరించుచు జీవనము గడపుకొనుచు కర్మానుష్ఠానపరుడై యుండవలెను. క్షత్రియుడు పరాక్రమము ప్రధానలక్షణముగ గలవాడై దేశరక్షకుడుగ నుండవలెను. వైశ్యుడు ధనార్జన సాధనములను చేతనుంచుకొని వ్యాపారాదులచే లోకమునకు గూడ నుపకరింపవలెను. శూద్రుడు శరీరశక్తిచే సంఘసేవ చేయవలెను. ఇట్లు నాల్గువిధములైన విభాగములను హిందూమతము గావించినది. విభజించినను విభజింపకపోయినను ఏసంఘమైనను నిట్లు నాల్గు విభాగములు కాకతప్పదు. నేటి యూరపుఖండములో నేదేశమునైనను దీసికొనుడు. అందీనాలుగు విభాగములు గన్పట్టును.

ఇంగ్లండులో చూడుడు. బుద్ధిబలముచేతను ఆధ్యాత్మిక సాధనములలోను జీవితము గడపు పండితులు, న్యాయవాదులు, మతగురువులు (Clergy) మున్నగువారి నందరను చేర్చి తాత్కాలికముగ వారికి బ్రాహ్మణులను పేరొసంగుడు. దేశమును రక్షించు సైన్యమును తీసి దానికి క్షత్రియ నామ మొసగుడు. ధనికులు, మిల్లుయజమానులు మున్నగు వారి నొకచోచేర్చి పైశ్యులను నామమిడు. కార్మికులను (Labourers) ఒకచో చేర్చి వారికి శూద్రులను నామమిడుడు.

ఇట్లు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రవిభాగము ఇంగ్లండులో మాత్రము తప్పినదా? ఎట్లయినను తప్పనిది కనుకనే, హిందూమతము దీనికొక చక్కనిరూప మీయదలచి, జన్మచేతనే యీవిభాగమును చేసి, ప్రతివర్గమువారును నెరవేర్పవలసిన విధులను విసులముగాదెల్పి గొప్ప సాంఘిక నిర్మాణము గావించెను. ఎట్లయినను తప్పని విభాగమును జన్మతోనే చేయుటలో ననేక లాభములు కలవు. దీనివలన వివిధవర్గముల నడుమ నీర్ష్యాస్పర్థలు గలుగు నవకాశము పోవును. జన్మతోనే ప్రారంభ##మైన వృత్తితో నందరును సంతుష్టి నొందుదురు. ఆయా వర్ణములవారికి తమవృత్తులలో బాల్యమునుండియు ప్రావీణ్యము గల్గును. వర్ణపద్ధతివలన వృత్తివిద్యాపాఠశాలల కవసరము తొలగిపోవునని పాశ్చాత్యులే యంగీకరించినారు.

మానవజాతిలో సమత్వ ముండదనియు, ''చతుర్థోనాస్తి పంచమః'' అని మనపూర్వులు చెప్పిన యంశము సాంఘిక శాస్త్రమున కెంతయు సరిపోవుచున్న దనియు, పాశ్చాత్యు లీసత్యమును గ్రహించుకొనలేక పోవుటచేతనే తమ సంఘము నీపద్ధతిలో విభజించుకొనలేకపోయిరనియు భారతదేశమున నిదివరలోనే సిద్ధమైయున్న యీయుత్తము పద్ధతిని భంగము చేయదలచినవారు సంఘమునకును, మతమునకును మహాపచారము చేయుచున్నా రనియు ముఖ్యముగ గమనింపదగిన యంశములు.

మన మతములోని సంప్రదాయములు, ఆచారములు, సాంఘిక నిర్మాణము చాల దూరదృష్టితో చేయబడినవనియు, వీనిమహత్త్వమును గుర్తించుటకు బదులుగ మనము వానిని భగ్నము చేయుట యజ్ఞానమూలకము, ననర్థదాయకముననియు మన యువకుల కెంత హెచ్చరిక చేసినను చాలదు. హిందూమతము శాశ్వత సత్యములపై నాధారపడిన దగుటచేతను, అంతస్సారము గలదగుటచేతను నింతకాలము నిలిచినది. ఇంకను నిలువగలదు. దీనిపై వచ్చుదాడులు తాత్కాలిక ఫలవంతములే కాని, శాశ్వతముగ దీనిని మార్చలేవు.

సనాతనుల హక్కు

శాస్త్రములలో చెప్పబడిన హిందూమతమునకును, నేటి హిందువుల యాచరణమునకును చాల వ్యత్యాసముండుటచే, సనాతనధర్మమునకు తిలాంజలిని వదలవచ్చుననువారు మనలో కొందరు బయలుదేరినారు. ''మతము పూర్తిగ నాచరింపబడుట లేదు, కావున పూర్తిగ వదలివేయవలె'' ననునది యర్థరహితమైన వాదము. పూర్తిగా నాచరించినవానికి పూర్తిగా ఫలము లభించును; సగ మాచరించినవానికి సగము ఫలము లభించును; నూరవ వంతాచరించినవానికి నూరవవంతు ఫలము లభించును. ఏమియునాచరింపనివాని కేమియు ఫలము లభింపదు. ఇది హిందూమతమునకేకాక యితర మతములకుగూడ వర్తించును. అట్లయినను, ''పూర్తిగా నాచరించుచున్నవా'' యను కఠినపరీక్ష సనాతనధర్మపరాయణునిపట్ల మాత్రమే చేయబడుచుండుటను నేడు మనము చూచుచున్నాము. ఒక క్రైస్తవుని చూచి యెవ్వరును, ''నీవు క్రీస్తు చెప్పినట్లు పూర్తిగ నాచరించుటలేదు కాన నీవు క్రైస్తవుడవు కావు'' అని యనరు. అట్లే యొక ముస్లిమును చూచి ''నీవు మహమ్మదు బోధలను పూర్తిగా నాచరణలో పెట్టుటలేదు. కావున నీవు ముస్లివుకావు'' అని యెవ్వరును చెప్పుటలేదు. కాని యొక్క వర్ణాశ్రమ ధర్మపరాయణుని మాత్ర మిట్టి కువిమర్శగావించుట కందరును ముందంజ వైచుచున్నారు. సరియైన సమాధానము చెప్పువారు లేకపోవుటచేతనే యిట్టి కువిమర్శలు పెచ్చుపెరుగుచున్నవి.

ఏసుక్రీస్తు లక్షణములను బట్టి ప్రతిక్రైస్తవుని విమర్శించుట యెట్టిదో, మహమ్మదు లక్షణములను బట్టి ప్రతి ముస్లిమును విమర్శించుట యెట్టిదో, ఋషుల లక్షణములను బట్టి ప్రతి సనాతన ధర్మపరాయణుని విమర్శించుట యట్టిదే యగును. క్రైస్తవులు, ముస్లిములు మున్నగువారు నూటికి నూరుపాళ్ళు నాచరించకపోయినను, తత్తన్మతస్థులమని చెప్పుకొనుట కెట్టిహక్కు గల్గియున్నారో సనాతనధర్మపరాయణులు సనాతునులమని చెప్పుకొనుట కట్టిహక్కునే గల్గియున్నారు. నూటికి ముప్పది యంశములను తెచ్చుకొని పరీక్షలలో నుత్తీర్ణులగుట కితరుల కెట్లు హక్కుగలదో, యట్టి హక్కే సనాతన ధర్మపరాయణునకును గలదు. ఆతడొక్కడే నూటికి నూరంశములు తెచ్చుకొనవలె ననునది కువిమర్శనము.

ప్రస్తుత మసంపూర్ణములుగనున్న తమ మతములను రక్షించుకొనుటకు, నుద్ధరించుకొనుటకు నితరమతములవారి కెట్టి హక్కుగలదో, యట్టి హక్కే సనాతనధర్మమును రక్షించుకొనుటకును తేజోయుతము చేసికొనుటకును సనాతనులకుగలదు. పూర్ణవికాసముతో లేదను హేతువుచే సనాతనధర్మమును పూర్తిగ వదలివేయవలయుననునది యర్ధరహితవాద మనుటకే పైని సనాతనధర్మవాదుల సమర్ధనము గావింపబడినది కాని, సనాతనధర్మ ప్రస్తుతస్థితి తృప్తికరముగ నున్నదనుట కెంత మాత్రమును గాదు.

మతాదర్శములనుబట్టి మానవులు తమ్ము తాము దిద్దికొనవలెనేకాని, తమ్ముబట్టి మతాదర్శములను మార్చుకొనరాదనియు, హిందూమతగ్రంధములలోని పరమసత్యములు కాలక్రమమున మన యనుభవమునకును, నవీన శాస్త్రములకును ననుగుణమైనవిగ రుజువగుచుండుటచే తొందరపడి మతమును మార్చుకొనుట యవివేకమనియు, ప్రామాణ్యబుద్ధి మతమునకు ముఖ్యలక్షణమగుటచే అతీంద్రియగోచరవిషయములను దెల్పు శ్రుతిస్మృతులను విశ్వసింపక తప్పదనియు, ధర్మము కొంతపోయినది గనుక పూర్తిగ పోగొట్టుకొనవలె ననునది యర్థరహితమైన వాదమనియు మనము ముఖ్యముగ జ్ఞప్తియం దుంచుకొనవలెను. ఏనాటికైనను సనాతనధర్మమే లోకమునకు శరణ్యము కాగలదను విశ్వాసముతో ధార్మికులెల్లరు దాని పునరుజ్జీవనమునకై కృషి సల్పుదురుగాక!

Hindumatamu    Chapters    Last Page