Shaktipatamu    Chapters    Last Page

మండలిమాట

ఇచ్ఛా జ్ఞానాదిరూపేణ యా శంభో ర్విశ్వభావినీ |

వందే తాం పరమానంద ప్రబోధలహరీం శివామ్‌ ||

'శక్తి పాత' మన్న మాట విన్న వారు, దానిస్థూలార్థము నైన గ్రహించినవారు, గురుకృత శక్తిపాతానుభవము నందిన వారు, శిష్యునందు శక్తిపాత మాచరింపcగలవారు-క్రమముగా నీ నలువురు లోకమునం దోకరికంటె నొకరు అల్పసంఖ్యలోc గానవచ్చెదరు.

ఈ గ్రంథమును రచించిన బ్ర. శ్రీ. ఈశ్వర సత్యనారాయణశర్మగారు శక్తిపాతముచే నెందఱో శిష్యుల ననుగ్రహించిన మహానుభావులు. వారు స్వయముగా శక్తిపాతపూర్వక మంత్రదీక్షను బాల్యమునc బడసి, చిరకాలతపఃఫలముగా శిష్యులయందు శక్తి పాతానుగ్రహమును నెఱపు భాగ్యమును గూడcబడసినవారు.

ఇవి రెండును రెండనుభవములు, గురువు శక్తిపాతముచే శిష్యుననుగ్రహించు నపుడు - అనుగ్రహించుటకుం బూను కొనిన గురుననుభవ మొక తెగకుc జెందినది.

ఇట్టివైన రెండనుభవములకుc దోడు వానియొక్క సూక్ష్మసూక్ష్మములైన ఉద్భవ - స్థితి - గతులను వివేకముచే గ్రహించి, ఉచితభాషా వేషమునం దాభావములను వెల్లడింపcగల నేర్పుతోడి పాండిత్యము మూcడవది.

శక్తిపాత గ్రంథరచనమున కావశ్యకమైన యీ త్రయమును బ్ర. శ్రీ. శర్మగారియందు మెండు. ఈత్రయ మందేయొక్కటి లోపించినను గ్రంథరచన మసాధ్యమైనటులే. వీనిలో నే యొక దానిచేనైన సంపన్నుడు కాని వాని కిది దురవగాహము.

'శక్తి పాత మెట్లు జరుగను? శక్తి పాతము వలనఁ గలుగు లాభములేమి?' ఇత్యాదులైన సర్వవిషయములు ఈ గ్రంథమునందే వివేచింపcబడినవి. శ్రుతులయందు, ఆగమములయందు నచ్చటచ్చట శక్తి పాతమును గూర్చిన వివృతులున్నవి.

'పరిపక్వమలా యే తాన్‌ ఉత్సాదన హేతు శక్తి పాతేన యోజయతి పరేతత్త్వే స దీక్షాయా మాచార్యమూర్తిస్థః' అని ఆగమము.

ఆణవ - కార్మిక - మాయికము లని మలములు మూcడు రకములు. స్వరూపజ్ఞానమును మఱుగుపఱచు దోషము అణవమల మనcబడును. గురూపదిష్ట పరమార్థమునందు బుద్ధిని జొఱనీయని దోషము కార్మికమల మనcబడును. పరతత్త్వజ్ఞాన వాసననై నcగలుగcనీయని దోషము మాయికమలమనcబడును.

లోకమునం దందఱియందు నీమలములు మూడు నంతో యింతో యుండును. ఎవరియందీ మలము లల్పములో వారు శక్తి పాతానుగ్రహమున కధికారులు. అట్టివారిని పరమాత్మ ఆచార్యమూర్తిస్థుండై శక్తిపాతముచే నుద్ధరించి, వారికంతవఱకు ననుభూతి కందనిదైన పరతత్త్వముతో సంబంధము కలిగించును.

బహుగ్రంథములు శాస్త్రములు చదివినను అనుభూతికి రాని పరతత్త్వము సద్గురుకృతి శక్తి పాతానుగ్రహముచే కరతలామలక మగును.

శక్తి పాతమువలన నిదియెట్లు సంభవించును ? అను ప్రశ్నకు సమాధానము హేతువాదపూర్వకముగా నిర్వచించుట యసాధ్యము. హేతువాదముయొక్క పరిధి సీమితము. ఆత్మవిచారము హేతువాదముయొక్క సంకుచిత పరిధియందే యుండి చేయుటకు వీలైనదికాదు. అయినను శ్రీ శర్మగారు దృష్టాంతముల సాయముతో గీతోపనిషదాదుల యాధారము లతో కేవల హేతువాదవరులకునుc దెలియవచ్చునటు లీ గ్రంథమును రచించిరి.

వాస్తవమునకు శ్రీశర్మగారిని గూర్చి యేమి వ్రాసినను వారినిగూర్చి పూర్తిగాc దెలిపినట్లు కాదు. ఆయన కారణ జన్ములు. ఆయన శక్తిపాతపూర్వకమైన దీక్షనిచ్చి శిష్యుల ననుగ్రహించుచుండcగా నేను పలుతడవలు చూచియుంటిని. చిరకాలతపస్సంపాదితమైన వారి యాత్మశక్తి శిష్యునియందుc బ్రవేశించుట దృష్టికిc గాన రాకున్నను శిష్యుని స్థూల సూక్ష్మోశరీరమునం గలిగిని మార్పు లెట్టివో గుర్తించితిరా? వానినిc దెలియc జెప్పcగలరా? యని యడిగితిని.

వారు చెప్పిన మాటలు :- అయ్యా! మంత్రమందుం గరాంగ న్యాసములు సేయింతురుగదా! 'అంగుష్టాభ్యాం నమః' యని యన్నంతనే యేదో యొక శక్తి నాయంగుష్ఠమునం జొచ్చి కదలుచున్నటులును, 'తర్జనీభ్యాం నమః' అని యన్నం తనే యాశక్తియే 'తర్జనినిజొచ్చినటులును, ఇటులే న్యాసములన్నిటియందును, నొక యనిర్వచనీయ శక్తి యొక్క కదలికను నేననుభవించితిని. మఱియు గురువులు నా వెన్నునc జేత నిమిరినంతనే వెన్నుతుదినుండి యొకశక్తి మెఱపువలె ప్రవహించి నటు లొకయనుభవముకూడ నాకుc గలిగినది. ఈ తీరున నా స్థూల సూక్ష్మదేహములం దాశక్తి కదలాడినంతనే యియ్యుపాధి నంటియున్న 'నేన' న్న భావమునకు నాశక్తికిని భేదము లేదనిపించినది.'

ఈతీరున శిష్యులను దీర్చిదిద్దcగల యుపాసకశ్రేష్ఠులు లోకమునం దల్పసంఖ్యలో నున్నారు. శ్రీశర్మగారు వయసులో నున్నపుడు శరీరధార్ఢ్యము సడలనిసమయమున బహుదూరగత శిష్యోద్ధరణకై 'మానసీ' దీక్షల నిచ్చియనుగ్రహించుటయు నుండెడిది. అట్లు వారివలన మానసీదీక్షానుగ్రహమునుc బడసిన యొక భాగ్యశాలిని నేనెఱుంగుదును.

శ్రీశర్మగారు 'మంత్రశాస్త్ర - యోగ శాస్త్రములయందు సమస్త తంత్రగ్రంథములయందు, ప్రస్థానత్రయమునందు, కుల విద్యయగుట నాయుర్వేదమందు' నిరుపమనుగుc బ్రజ్ఞగలవారు. ఇవన్నియు నొక్కచోcబ్రోవయి వెలయుట వింత. అందువలన నే శర్మగారిని కారణజన్ములనుట. ఈ కారణముననే శ్రీ శర్మ గారి జీవిత చరిత్రము నొక దానిని వ్రాసి యచ్చొత్తించవలయు నన్నతలం పొకటి నాకున్నది. శర్మగారి నేదోవిధముగాc గొ నియాడవలెనన్న యల్పోహవలన నాయం దీతలం పేర్పడ లేదు. బాల్యమునుండియు నుపాసనామార్గమునc బయనించుచుc బ్రాప్యమును బ్రాపించి జీవన్ముక్తులై నేcటి కెనుబది నాలుగేండ్లు వృద్ధులైయున్న శ్రీశర్మగారి జీవితమును బ్రకటించుచో నుపాసనమునకు సంబంధించిన బహువిషయములు బహురహస్యములు ప్రస్ఫుటములై లోకమున కుపకరించునుగదా! యన్న యూహయే నాతలంపనకు హేతువు.

అస్తు! ఈగ్రంథ మింత యనుభూతిని బండించుకొన్న వారిచే వ్రాయcబడినదనుట కీ మాటలు వ్రాసితిని. లోకమునc బ్రాచీనమహర్షుల తేజము వెల్లివిరియవలెనని శ్రీశర్మగారి తీవ్రమైన కోరిక. అందువలననే యెన్నో యుపాసనారహస్యములను బుక్కిలింతలుగా వెల్లడించు గ్రంథరాజముల ననేకము లను రచించినారు. ఇట్లు విరచితములైన గ్రంథము లచ్చు మొగము జూడకున్న వీనివలన లోకమున కేమి ప్రయోజనమని ప్రతిగ్రంథమునకు ముద్రణవ్యయము నంతో యింతో యిచ్చి యీగ్రంథమండలిని అన్నివిషయములందు నల్పుండ నైన నన్ను ననుగ్రహించుచు వచ్చిరి. వారి యీ యనుగ్రహమునకు నేనేమి బదులాచరింపcగలను. అందు సర్వధా అశక్తుండను. అందుచే పితృపాదులు, సద్గురువులు, శిష్యవత్సలులు నగు శ్రీశర్మగారి ఆయురారోగ్యములను గాపాడుమని నాకెన్నడును గానరాని-వారికి నిత్యప్రత్యక్షమైన సకలజననీచరణరాజీనయుగము నెదుట మోకరిలి ప్రార్థించుచున్నాను.

ఈ గ్రంథపఠనమువలన బరతత్త్వమునుగూర్చిన యెన్నో శంకలు నివారితము లగును. పాఠకు లీ గ్రంథము నాదరించి మేలొందుదురుగాత మనుచు నిట్టి యుద్గ్రంథము ననితర రచనా సాధ్యము నతివార్ధకమున నుండియు రచించిన పరశివ స్వరూపులైన శ్రీ శర్మగారి చరణసరసిజయుగళి కంజలించుచున్నాను.

కోరినతోడనే యీగ్రంథమునకు పరిచయము వ్రాసి యిచ్చిన ఆత్మీయులు వ్యాకరణశిరోమణి, భాషాప్రవీణ బ్ర.శ్రీ హరిసాంబశివశాస్త్రి. యం. ఏ. గారికి కృతజ్ఞతాపూర్వక వందనములు.

తెనాలి బులుసు సూర్యప్రకాశశాస్త్రి

సాధారణ. జ్యేష్ఠము వ్యవస్థాపకుడు ః సాధన గ్రంథ మండలి

Shaktipatamu    Chapters    Last Page