Sri Shiva manasika pooja stuthi    Chapters    Last Page

అద్వైత తారావళిః

శ్రీ సదాశివ బ్రహ్మేన్ద్ర విరచితా

మండలి మాట

'అహం బ్రహ్మాస్మి-బ్రహ్మైవాహ మస్మి' అన్న బోధము యొక్క పరిపూర్ణోదయము ఉపాసనల కన్నిటికిని తుది చీటీ!

ఆబోధము ఉదయించువకు ద్వైతబాధ తప్పనిదే! 'ద్వితీయాద్వై భయంభవతి'.

శ్రీ శంకర భగవత్పాదులకు బిమ్మట అద్వైతజ్ఞాన మునుగూర్చి గంభీరములైన శాస్త్రగ్రంథములను రచించిన మహనీయులెందరో ఉన్నారు. కాని శ్రీ సదాశివ బ్రహ్మేందులవారివలె అద్వయజ్ఞానశిఖరాధి రోహణము జేసి - ఆనందోకన్మత్తులై చరించిన వారరెందరున్నారు? అని ప్రశ్నించినచో సమాధానమునకు తడుముకొనవలసినదే! అందువలననే కబీరుదాసు - సింహోంకే నహి లేహఁడే, హంసోంకీ నహి పాంతి' అనినాడు.

('లేళ్ళమందలు - కొంగలబారులు ఉంటాయి' -

'సింహాల మందలు - హంసల గుంపులు ఉండవు')

నాల్గువైపుల దుర్గమ పర్వతశిఖరములు - నడుమనొక లోతైన లోయ. ఆలోదయలో నున్న వారికి - ఆదుర్గమ పర్వత శిఖరము నధిరోహించినవానికి అనుభవమున భేదముండదా!

మన మాలోయలోనివారము! బ్రహ్మానందరసమగ్నులైన మహాత్ములు ఆ కొండ కొమ్ముమీదివారు.

అట్టి మహాత్ముల మాటలు మనయందును ఆ ఆనంద శిఖరాధిరోహణమునకైన యత్నమునకు మంచి ప్రేరణనిచ్చును. మనసును నిలువద్రొక్కుటకు మహితమైన మార్గమును జూపును.

శ్రీ సదాశివ బ్రహ్మేంద్రులవారు - తమ ప్రాక్తనజన్మ పుణ్యపరీపాకముచే వెల్లివిరిసిన శ్రీ గురుకరుణా విశేషముచే అద్వయ జ్ఞానానందశిఖరాధిరూఢులై - తమయందు పెల్లుబికిన ఆనందానుభవ విశేషములను వెల్లడించుచు రచించిన కృతుల యందీ అద్వైత తారావళి యొకటి.

ఈ తారావళి - ఈ నక్షత్రమాల - బ్రహ్మానందాకాశమును దీప్తి మంతమొనరించు దివాకరశ్రేణి! యుగపత్సముదిత సహస్రాంశుబింబ సముదాయము !

మూలముతో - తాత్పర్యముతో బ్రకటితమైన యీ ప్రకరణగ్రంథము అద్వయానంద జిజ్ఞాసువులకు అమందానంద స్ఫూర్తుల నందీయఁగలదు!

ఇతి శమ్‌.

వ్యవస్థాపకుడు:

సాధన గ్రంధ మండలి, తెనాలి.

అద్వైత తారావళిః

అఖిల పరమహంస దేశిక

మాగమ గూఢార్థ దర్శకం ప్రాజ్ఞమ్‌ |

ఆనన్దపూర్ణ సాగర

మనిశమహం నౌమి శఙ్కరాచార్యమ్‌ || 1

తాత్పర్యము :

శ్రీ శంకరభగవత్పాదులవారు పరమహంస పరివ్రాజకులైన మహాత్ములకందరకును గురువులే. ఆవేదగూఢార్థ విజ్ఞాతకు - పూర్ణానంద సాగరునకు నా నిరంతర ప్రణామములు. (సదాశివుల గురువులైన పరమశివేంద్రులును జగద్గురువులై శంకరాచార్యులే) ఈ ప్రణామమువారికిని వర్తించును.

శరణం నభవతీ జననీ

నపితా నచ సోదరా నాన్యే |

పరమం శరణమిదం మే

చరణం మమ శిరసి దేశికన్యస్తమ్‌ || 2

తాత్పర్యము :

తల్లి రక్షింపదు - తండ్రి రక్షింపడు. సోదరులు, ఇతరులు కాపాడజాలరు. నాతలపై నుంచబడిన శ్రీ గురుచరణ మొక్కటియే నాకు శరణము! నాకు రక్షకము.

స్వాత్మావబోధ హీనాః

కుణప శరీరాభిమాన పరితుష్టాః |

వారిజ బుద్బుద రక్షాం

మూఢాః కుర్వన్తి మోహబన్దేన || 3

తాత్పర్యము :

మూఢులు ఈ శరీరమే తామనుకొనుచున్నారు. అచ్చమైన తమ స్వరూపమును (ఆత్మను) గుర్తింపజాలక - శవమైన ఈ శరీరమునభిమానించుచు - అజ్ఞానమునకు జిక్కి, నీటి బుడగ వంటి దీని రక్షణ యత్నములో నిమగ్నులగుచున్నారు.

తదిదం తాదృశ మేతావ

త్తావదితిచ యన్నభ##వేత్‌ |

బ్రహ్మ తదిత్యవధేయం

నోచేద్విషయో భ##వేత్పరోక్షం చ|| 4

తాత్పర్యము :

అది - ఇది, ఇట్టిది - అట్టిది, ఇంత - అంత - అని తెలియుటకు సాధ్యము కానిది బ్రహ్మము. అట్లు తెలియుటకు వీలైన దైనచో అది విషయమే! శబ్దస్పర్శ రూప రస గంధాత్మకమే! అది బ్రహ్మమువలె అపరోక్షము కానేరదు. (ప్రత్యక్షమైనది సంసారము, పరోక్షమైనది. స్వర్గాదికము. ఆత్మతత్త్వము సంసారమువలె ప్రత్యక్షముకాదు. స్వర్గాదులవలె పరోక్షమనుటకును వీలుకాదు. అది అపరోక్షము.)

సతి కోశ శక్త్యుపాధౌ

సంభవత స్తస్య జీవతేశ్వరతే |

నోచేత్తయో రభావాత్‌

విగత విశేషం విభాతి నిజరూపమ్‌ || 5

తాత్పర్యము :

శరీరము పంచకోశాత్మకము. అట్టి ఉపాధియందలి తాదాత్మ్యముచే జీవుడు. మాయోపాధిచే ఈశ్వరుడు ఈ ఉపాధులను దిగజార్చినపుడు జీవేశ్వరులకు (తత్తదుపాధిగత చిద్వస్తువునకు) భేదములేదు. నిర్విశేషమై - బ్రహ్మాభిన్నమై ఆత్మ స్వరూప మపుడు భాసించును.

జలమివ మృగతృష్ణాయాం

శుక్తౌ రజతం యథాహిరివ రజ్జౌ |

సత్యమివ సకలమేతత్‌

కల్పిత మాభాతి మయి పరానన్దే || 6

తాత్పర్యము :

ఎండమావిలో నీరువలె - ముత్తెపుఁ జిప్పయందు వెండి వలె - త్రాటియందు పామువలె - ఆనందఘనుడనై నా యందు ఈ సర్వమును సత్యమన్నట్లు కల్పితమయ్యెను.

ఇదమిదమితి ప్రతీతే వస్తుని

సర్వత్ర బాధ్యమానేపి |

అనిద మబాధ్యం తత్త్వం

సత్వా దేతస్య నచ పరోక్షత్వమ్‌ ||

తాత్పర్యము :

'ఇది-ఇది' యని తనకంటె వేరుగా దోచుచున్న వస్తువులనెల్ల బయటను లోపలనుగూడ (మనోబుద్ధ్యాదుల యందును) తానుగాదని త్రోసివేయగా -'ఇది' యని పేర్కొనుటకును - త్రోసివేయుటకును అశక్యమైన వస్తువొకటి (ఆత్మ తత్త్వము) మిగిలియుండును. అది త్రికాలాబాధ్యమైనది. అందుచే అది అపరోక్షమైనది.

అఖిలాగమాంత లక్ష్యం

హానోపాదాన హీన చిన్మాత్రమ్‌ |

అనుభూతిమాత్ర గమ్యం

బ్రహ్మైవాహం తదస్మి పరిపూర్ణమ్‌ || 8

తాత్పర్యము :

ఉపనిషత్తులన్నియును బ్రహ్మమునే రక్షించుచున్నవి. తరుగుట - పెరుగుట అన్నది లేక చిన్మాత్రముగా (కేవలము జ్ఞానస్వరూపముగా) అనుభవమునకు మాత్రము అందుచున్న - ఆ బ్రహ్మము నేనై యున్నాను. అంతటను నిండియున్న ఆ బ్రహ్మము నేనే!

చిన్మాత్ర మమల మక్షయ

మద్వయ మానన్ద మనుభవారూఢమ్‌ |

బ్రహ్మైవాస్మి తదన్యం

నకిమప్యస్తీతి నిశ్చయో విదుషామ్‌ ||

తాత్పర్యము :

బ్రహ్మమన్నది కేవలము జ్ఞాన స్వరూపము. దానియందు పరిసంపర్కము లేదు. దానికి నాశము లేదు. రెండువదన్నది లేక ఒక్కటియై అది ప్రకాశించుచున్నది. ఆనందమయమైన ఆ బ్రహ్మము అనుభవముచే దెలియదగినదే కాని, 'ఇది' యని నిరూపించుటకు శక్యముకాదు.

అట్టి బ్రహ్మమే నేను! దానికంటె వేరేమియును లేదు'' - అని విద్వాంసుల నిర్ణయము.

జ్ఞానం కర్మణి నస్యాత్‌

జ్ఞానే కర్మేమదపి తథా నస్యాత్‌ |

కథమయ మనయో రుభయోః

తపన తమోవత్‌ సముచ్చయో ఘటతే || 10

తాత్పర్యము :

కర్మయందు జ్ఞానముండదు. జ్ఞానమున కర్మయు నుండదు. జ్ఞానము సూర్యుడు, కర్మము చీకటి. ఇట్లున్న ఇవి రెండును కలిసి - నాయందెట్లుండును! నేను జ్ఞాన స్వరూపిని. నాయందు కర్మలు లేవు, ఉండవని భావము.

తస్మాన్మోహ నివృత్తౌ

జ్ఞానం నసహాయ మన్యదర్థయతే |

యద్వద్ఘనతర తిమిర

ప్రకర పరిధ్వంసనే సహస్రాం శుః|| 11

తాత్పర్యము :

జ్ఞానము ఇట్టిదగుటచేతనే (సూర్యునివంటిదగుటచేతనే) అజ్ఞానమును నివారించుటయందు దానికి వేరొకదాని సాయమక్కరలేదు.

ఎంత చిక్కని చీకటుల మొత్తములనైనను చీల్చి చెండుటలో చెండి రూపుమాపుటకు సూర్యునకు వేరొక తోడు కావలయునా!

కర్మభిరేవ న బోధః

ప్రభవతి గురుణా వినా దయానిధినా |

ఆచార్యవాన్హి పురుషో

వేదేత్యర్ధస్య వేదసిద్ధత్వాత్‌ || 12

తాత్పర్యము :

దయామయుడైన గురువు లేక - కేవలము కర్మలచేతనే జ్ఞానమెన్నడును ఉదయింపదు. 'ఆచార్యవాన్‌ హి పురుషోవేద' - ఎవనికి సద్గురువు లభించునో, అతడు మాత్రమే - ఆత్మ తత్వమును బ్రహ్మాభిన్నముగా ననుభవించును - అని శ్రుతి తెలుపుచున్నదిగదా !

ఐక్యపరైః శ్రుతివాక్యై

రాత్మా శశ్వత్ర్పబోధ్యమానో7పి |

దేశికదయా విహీనై

రపరోక్షయితుం నశక్యతే పురుషైః || 13

తాత్పర్యము :

జీవబ్రహ్మైక్యమును శ్రుతివాక్యము లెంతగా బోధించు చున్నను - శ్రీ గురు కరుణాప్తి లేక దానిని సాక్షాత్కరింప జేసుకొనుట (అనుభవించుట) ఎంతటివారికైనను అసాధ్యమే!

మయి సుఖబోధ పయోధౌ

మహతి బ్రహ్మాండ బుద్బుదసహస్రమ్‌ |

మాయామయేన మరుతా

భూత్వా భూత్వా పునస్తిరోధత్తే || 14

తాత్పర్యము :

ఆహా! ఆనందవారాశినైన నాయందు జెలరేగిన మాయ యను గాలి తాకిడిచే వేలకొలది బ్రహ్మాండములు నీటిబుడగల వలె తలఎత్తి ఎత్తి తిరోహితములగుచున్నవి.

దన్తిని దారువికారే

దారు తిరోభవతి సో7పి తత్రైవ |

జగతి తథా పరమాత్మా

పరమాత్మన్యపి జగత్తిరోధత్తే || 15

తాత్పర్యము :

కఱ్ఱ ఏనుగులో కఱ్ఱ భాసింపదు. (చూచినవాడు 'అదిగో! ఏనుగు!' అనునే కాని, 'అదుగో! కఱ్ఱ!' అనడు) ఆ ఏనుగు కూడ అచటనే యున్నది! ఏనుగురూపుపై చూపు నిలిపినపుడు కఱ్ఱ మాయమగును. ఆ ఏనుగుకూడ అందేయున్నది. అది కఱ్ఱయే! దారువే!

లోకమును రక్షించునపుడు పరమాత్మ - పరమాత్మను - లక్షించునప్పుడు లోకము అదేవిధముగ అంతర్హితమగును.

(కఱ్ఱయే - ఏనుగు రూపమున - దాని కాళ్ళు - కడుపు - తొండము, దంతములు - ఇత్యాదులుగా) ఉన్నట్లు పరమాత్మయే కనబడుచున్న యీ నిఖిలలోకమున నున్నాడు. లోకముమీదనే చూపునిలుపువానికి పరమసత్యమైన పరమాత్మ అనుభవమునకు అందడు. అట్లే పరమాత్మయందే బుద్ధిని నిలిపినవానికి ఈలోకము ఉన్ననులేనట్లే! అది భాసింపదు. సర్వము బ్రహ్మమయమే!

తస్మిన్‌ బ్రహ్మణి విదితే

విశ్వమశేషం భ##వేదిదం విదితమ్‌ |

కారణమృది విదితాయాం

ఘట - కరకాద్యా యధావగమ్యన్తే || 16

తాత్పర్యము :

మృణ్మయపాత్రలు పలురకములు, వీనికికారణము మృత్తు. (మట్టి) అది తెలియబడినంతనే తత్కార్యములైన కుండ - కూజా మొదలైనవి ఎన్నియున్నను, అన్నియును దెలియబడును.

అట్లే సర్వకారణకారణమైన బ్రహ్మమును గూర్చిన జ్ఞానము ఉదయింపగా - ఈ విశ్వమంతయును దెలియఁబడును.

ఏషవిశేషో విదుషాం

పశ్యన్తో7పి ప్రపఞ్చ సఞ్చారమ్‌ |

పృథగాత్మనో నకిఞ్చిత్‌

పశ్యేరన్‌ నిఖిలనిగమ నిర్ణీతాన్‌ || 1

తాత్పర్యము :

ఎన్నో విధములుగా కదలుచున్న ఈ ప్రపంచము పామరునకెట్లు కనబడుచున్నదో - పండితునకును అటులే కనబడుచుండును.

కాని విద్వాంసులు సర్వవేదతాత్పర్యమును దృష్టియందుచుకొన్నవారై, ఈ నిఖిలప్రపంచమును ఆత్మాభిన్నముగా అనుభవించుచుందురు.

ఇదియే పామరునికంటె పండితునియందలి విశేషము. (సర్వమును ఆత్మాభిన్నముగా దర్శింపనివాడు ఎంత చదివినను పండితుడుకాడు. పామరుడే!)

జగదాకారతయాపి

ప్రథతే గురుశిష్యవిగ్రహతయాపి |

బ్రహ్మాకారతయాపి

ప్రతిభాతీదం పరాత్పరం సర్వమ్‌ || 17

తాత్పర్యము :

శరీరముకంటె ఇంద్రియములు వానికంటె, మనసు, దాని కంటె బుద్ధి - బుద్ధికంటెను ఆత్మ పరమైనవి. (అవ్వలనున్నవిగొప్పవి.) ఇట్లు అన్నిటికిని బరమైనది బ్రహ్మము.

పరాత్పరమైన ఆవస్తువే - జగత్తుగా జూచుచున్నది. గురువై అదియే బోధించుచున్నది. మరియు శిష్యాకారమున గూడ నదియే ప్రవర్తిల్లుచున్నది. అదియే బ్రహ్మాకారమున భాసించుచున్నది. ''ఉన్నది యొక్కటియే! రెండవది లేదు!''.

కిం చిన్త్యం కిమ చిన్త్యం

కిం కథనీయం కిమస్త్యకథనీయమ్‌ |

కిం కృత్యం కిమకృత్యం

నిఖిలమిదం జానతాం విదుషామ్‌ || 19

తాత్పర్యము :

అద్వితీయమై బ్రహ్మమొక్కటియే విరాజిల్లుచున్నదన్న ఎరుకగల విద్వాంసుల - మనో వాగింద్రియ వృత్తులకు (మనో వృత్తి చింతనము వాగ్వృత్తి వర్ణనయు, ఇంద్రియవృత్తి కర్మాచరణము) విషయము కాదగినది -కాకూడనిది అన్న విభాగము ఉండదు. బ్రహ్మానుభవమగ్నునకు విధినిషేధములు లేవు.

కబళిత చఞ్చలచేతో

గురుతర మణ్డూక జాలపరితోషా |

శేతే హృదయగుహాయాం

చిరతర మేకైవ చిన్మయీద భుజగే || 20

తాత్పర్యము :

కప్పలను కడుపునిండుగా మెసవి, సుఖముగా శయనించి యున్న సర్పమువలె - గంతులిడుచున్న మానసిక వృత్తులనన్నిటిని ఆహరించి, హృదయ గుహయందొంటిగా చిత్స్వరూపము చిరతరనైశ్చల్యముతో విరాజిల్లుచున్నది.

(మనోవృత్తులు - శబ్ద - స్పర్శ - రూప - రస - గంధాత్మకము లైన విషయములపై నిత్యము గంతులు వేయుచుండును. జ్ఞాన ముదయింపగానే ఈగంతులు పూర్తిగ ఆగిపోవును. అనంతరము జ్ఞానమొక్కటియే నిశ్చలముగా బ్రకాశించును.)

సతి తమసి మోహరూపే

వివ్వమపశ్యం తదేత దిత్యమలమ్‌ |

ఉదయతి బోధాదిత్యే

కిమపి నపశ్యామి కింన్విదం చిత్రమ్‌ || 21

తాత్పర్యము :

నాకు చిమ్మచీకటిలో సర్వమును గోచురించి - సూర్యోదయ మైనంతనే ఏమియును కనబడుటలేదు! చిత్రముగా లేదూ!

అజ్ఞానమన్న చీకటి యున్నంతవరకును - దారపుత్రా దులు, కలిమిలేములు, సుఖదుఃఖములు, మిత్రవర్గ శత్రువర్గ ములు - ఇత్యాదిగా ప్రపంచము నానావిధములుగా కనబడుచు వచ్చినది.

జ్ఞానసూర్యుడుదయింపగా ఈ నానాత్వమేమియు నాకు గాన వచ్చుట లేదు! ఇదయ్యా చిత్రమ!|

విద్యాస్థితయః ప్రాజ్ఞే

సాధన భూతాః ప్రయత్ననిష్పాద్యాః |

లక్షణభూతాస్తు పునః

స్వభావతః సంస్థితాః స్థితప్రజ్ఞే || 22

తాత్పర్యము :

తెలిసినవాడు బ్రహ్మాత్మైక్యస్థితిని యత్నించి నిలువ బెట్టును. అది సాధనదశ.

తెలివి ఎవనియందు రూఢమూలమైన దో ఆస్థిత ప్రజ్ఞునకు బ్రహ్మనిష్ఠయే స్వభావమగును; సహలక్షణమగును. అచట మరి ప్రయత్నపూర్వకమైన సాధనముతో బనియుండదు.

జీవన్ముక్తి రితీమాం

వదన్త్యవస్థాం స్థిరాత్మసంబోధామ్‌ |

బాధిత ఖేదప్రతిభాం

అబాధితాత్మావబోధ సామర్థ్యామ్‌ || 23

తాత్పర్యము :

అచ్చమైన ఆత్మజ్ఞానము బాగుగా స్థిరపడి, తాపకారులైన దుఃఖముల బలమెల్ల వీగిపోయి - ఆత్మావబోధమునకు బాధకమైనది లేశమును లేని అవస్థయే జీవన్ముక్తి అనిఆర్యోక్తి.

అజరో7హ మక్షరో7హం

ప్రాజ్ఞో7హం ప్రత్యగాత్మబోధో7హమ్‌ |

పరమానన్దమయోహం

పరమ జీవోహం సదాస్మి పరిపూర్ణమ్‌ః || 24

తాత్పర్యము :

నేనజరుడను, అక్షరుడను, శిధిలమగుట - నశించుట - దేహాదులకే కాని బ్రహ్మమనైయున్న నాకు లేవు. నేను ప్రాజ్ఞుడను. నేను ఆత్మ జ్ఞానాకృతిని |

(శరీరము - ఇంద్రియములు - అంతఃకరణము ఇవేవి యును దాను కాదనియు, వీనికవ్వల నఖండముగా వెలయుచున్న వస్తువేది యున్నదో, దేని వెలుగులో నివియెల్ల భాసింపు చున్నవో ఆ వస్తువు అనగా బ్రహ్మము తాననియు గుర్తించిన వాడు ప్రాజ్ఞుడు)

(దేహేంద్రియాదులకంటె విలక్షణమై ఆత్మస్వరూపము భాసింపు చున్నదన్న తెలివి యేది కలదో - ఆ తెలివి - అజ్ఞానము అదియే ఆత్మస్వరూపము).

నేను ఆనందమయుడను! నేను పరమ శివుడను! నేను పరిపూర్ణుడను!

బహుభిః కిమేభి రుక్తైః

అహమేవేదం చరాచరం సర్వమ్‌ |

శీకర - ఫేన తరంగాః

సిన్ధో రపరాణి నఖలు వస్తూని || 25

తాత్పర్యము :

వేయిమాట లెందులకు? ఈ సర్వమైన చరాచరప్రపంచ మును నేనే!

తుంపరలు - నురగ - తరంగములు - సముద్రముకంటె వేరైనవా?

విదితో వేదరహస్యం

విదితో దేహాది రయ మనాత్మేతి |

విదితం పర ఇతి చాత్మా

కిమితః పరమస్తి జన్మసాఫల్యమ్‌ || 26

తాత్పర్యము :

ఆహా! వేదములలో దాగియున్న రహస్యము నాకు వెల్లడియైనది.

ఈ దేహాదికము నేను కాదని (అనాత్మయని) తెల్లమైనది!

నేను (ఆత్మ) అన్నిటికిని బరమైనవాడనని ప్రస్ఫుటమైనది. పుట్టినపుట్టుకకింతకంటె సాఫల్యమున్నదా!

గురుకరుణయైవ నానా

ప్రాక్తన భాగ్యానుకూల మారుతయా |

దుస్సహ దుఃఖతరఙ్గ

తుఙ్గ స్సంసార సాగరస్తీర్ణః|| 23

తాత్పర్యము :

ఆహా! నా వెనుకటి పుట్టువులలోని పున్నెములు అనుకూలవాయువులై ప్రేరేచగా నెగసిన శ్రీ గురుకారుణ్యముచే - దుస్సహములైన దుఃఖ తరంగములతో సంకులమై సమున్నతమై యున్న సంసారసాగరమును తరించితిని; దాటితిని: దాటి గట్టెక్కితిని!

కారుణ్యసారసాన్ద్రాః

కాంక్షిత వరదాన కల్పతరువిశేషాః |

శ్రీగురు కటాక్షపాతాః

శిశిరా శ్శమయన్తు చిత్త సన్తాపమ్‌ || 28

తాత్పర్యము :

శ్రీ గురుకరుణా కటాక్షములు సాంద్రకరుణాసారములు ! కామితములను బ్రసాదించుకల్పవృక్షములు. చల్లని ఆ శ్రీగురు కటాక్షములు నా చిత్తములోని యుత్తముల నుపశమింప జేయునుగాక|

ఇతిశమ్‌

శ్రీ పరమహంస పరివ్రాజకాచార్య

సదాశివ బ్రహ్మవిరచితా

అద్వైత తారావళిః

సమాప్తా.

Sri Shiva manasika pooja stuthi    Chapters    Last Page