Sri Shiva manasika pooja stuthi    Chapters    Last Page

అద్వైత వేదాన్త గీతాని

శ్రీ సదాశివ బ్రహ్మేన్ద్ర విరచితాని

మండలి మాట

చిన్ముద్రిత కరకమలం చింతిత భ##క్తేష్టదం విమలమ్‌ |

గురువర మాద్యం కంచన - నిరవధికానంద నిర్భరం వన్దే ||

ఇవి శ్రీసదాశివబ్రహ్మేంద్రులవారు రచించిన సంస్కృత కీర్తనలు. త్యాగరాజస్వామివారి కీర్తనలు భక్తిరస మాధురీ మహితములైన తేనెపెరలు. సదాశివుల యీకీర్తనలు బ్రహ్మానందరసస్యందులైన అమృతపు గుళికలు.

అద్వైతవేదాంతముతో సామాన్యమైన పరిచితిగలవారిని సైతమివి ఆనందరసమగ్నులను గావింపగలవు. అద్వయానంద శిఖరాధిరోహణము చేయింపగలవు.

సంఖ్యచే - పరిమాణముచే అల్పములు - మాధుర్యముచే మహత్త్వము చే అనల్పములు - అయిన వీనికిసంగ్రహముగా తాత్పరయము వ్రాయబడినది. సర్వమైన బ్రహ్మసూత్ర శాంకరభాష్యమును వీని వివరణములో పలుమాఱులు ఉదాహరింపవచ్చును.

అల్పాక్షరములైన వీని కడుపులో నిమిడియున్న మహార్ధమెంత విశాలమైనదో దీనినిబట్టి గ్రహింపవచ్చును.

శ్రీసదాశివబ్రహ్మేంద్రులవారు ఒకక విగా - ఒక పండితుడుగా - ఒకగా యకుడుగా కాదు ఒకయోగిగా - అపధూతగా 'బ్రహ్మముతానై' కీర్తించిన కీర్తనలివి.

ఇవి ఉపనిషదర్థములు ! - ఇవి భగవద్గీతాసారములు !

ఇవి అద్వయానందశిఖరసీమను జేర్చు మణిమయ సోపానములు ! పాఠకులారా! మీ హృదయపీఠమున వీనిని నిలువబెట్టుడు; మిమ్మివి బ్రహ్మానంద సామ్రాజ్య సింహాసనమున కూర్చుండబెట్టును!

ఇతిశమ్‌.

వ్యవస్థాపకుడు : సాధన గ్రంథ మండలి, తెనాలి

శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర

అద్వైత వేదాంత కీర్తనలు

కల్యాణి రాగః - ఆదితాళమ్‌.

೧. భజరే గోపాలమ్‌

భజరే గోపాలం -

మానస-భజరే గోపాలమ్‌ భజ||

1. భజగోపాలమ్‌ భజిత కుచేలం

త్రిజగన్మూలం దితిసుత కలాం|| భజ||

2. ఆగమ సారం యోగ విచారం

భోగ శరీరం భువనాధారం || భజ||

3. కదన కఠోరం కలుష విదూరం

మదన కుమారం మధు సంహారం || భజ||

4. నత మందారం నంద కిశోరం

హత చాణూరం హంస విహారం || భజ||

తాత్పర్యము :

1. చిత్తమా ! గోపాలుని సేవింపవే! కుచేలుడు కొలిచిన స్వామిని - ముల్లోకములకు మూలమైనవానిని - ఆ అసురాంతకుని గోపాలుని సేవింపవే!

2. వేదముల సారము గోపాలుడు! అద్వైతవేదాంత విచారము గోపాలుడు! ఆయన భోగశరీరి: లోకాధారుడు. మానసమా! ఆస్వామియందు తాదాత్మ్యము ననుభవింపవే!

3. చిత్తమా! ఆస్వామి రణకర్కశుడే! కలుషమంటని వాడే! మదనజనకుడే! ఆ మధువైరిని - గోపాలుని భజింపవే!

4. మానసమా! కొలిచిన వానికోరిక లీడేర్చు కల్పకమైనందుని గారాలపట్టియైన ఆస్వామి చాణూరమల్లుని నేల గూల్చినవాడే! హంసయందు (సదాశివబ్రహ్మేంద్రుల గురువులు శ్రీ పరమ శివేంద్ర సరస్వతీమహాస్వామివారు. వారు పరమ హంస పరివ్రాజకాచార్యలు. వారియందు అనిభావము)

కాఫీరాగః - ఆదితాళమ్‌

2. స్మర వారం వారమ్‌

స్మర వారం వారం - మానస

స్మర నన్దకుమారమ్‌.

1. ఘోష కుటీర పయోఘృతచోరం

గోకుల బృన్దా వన సఞ్చారమ్‌ || స్మర||

2. వేణురవామృత పాన విలోలం

విశ్వస్ధితిలయ హేతు విహారమ్‌ || స్మర||

3. పరమహంసహృత్‌ పఞ్జరకీరం

పటుతరధేనుక బక సంహారమ్‌ || స్మర||

తాత్పర్యము :

నందునికొడుకై వెలసిన స్వామినో మానసమా! మాటి మాటికి పునఃపునః సంస్మరింపవే!

1. వ్రేపల్లెలో వెలసిన వెన్నదొంగను - గోకులములో బృందావనమున విహరించుచు వెలుగులు జిమ్మువానిని - నంద కిశోరుని తలంచి తలచి మరలస్మరింపవే!

2. చిత్తమా! మధుమయమురళీగానామృతమున బరవశించి యుండు నందనందనుని శరణొందవే! విశ్వమును బాలించుటలో విలయమొనర్చుటలో కారణమై విహరించు వేలుపుదొఱను వెన్నంటి నిలువవే! వెంట వెంట తలంపవే!

3. పంజరములోనున్న చిలుకవలె - పరమ హంస ( శ్రీ సదా శివుల గురువులు) హృదయములో స్థిరముగా నివసించు గోపబాలునియందు - బలముచే మదించిన ధేనుకాసుర బకాసురు అను సంహరించిన స్వామియందు - ఓనామానసమా! విహరించుచునుండవే!

సురుటిరాగః - ఆదితాళమ్‌

3. బ్రూహి ముకున్దేతి

బ్రూహి ముకున్దేతి - రసనే

బ్రూహి ముకున్దేతి.

1. కేశవ మాధవ గోవిన్దేతి

కృష్ణానన్ద సదానన్దేతి || బ్రూహి||

2. రాధారమణ హరే రామేతి

రాజీవాక్ష ఘన శ్యామేతి || బ్రూహి||

3. గరుడగమన నన్దక హస్తేతి

ఖణ్డితదశ కంధర మస్తేతి || బ్రూహి||

4, అక్రూరప్రియ చక్రధరేతి

హంస నిరఞ్జన కంస హరేతి|| బ్రూహి||

తాత్పర్యము:

1. ముకుందా! ముకుందా! అని పలుకవే నాలుకా! కేశవా! మాధవా! గోవిందా! అని అనవే! కృష్ణా! ఆనందమయా! సదానందరూపా అని ఉచ్చరింపవే! ముకుందా! అనవే!

2. రాధారమణా! హరీ! రామా అని పిలువవే! రాజీవాక్షా! (తామరలవంటికన్నలుగలవాడు) ఘనశ్యామా! (మేఘమువలె నల్లనివాడు) అనుచు ఆడవే! ముకుందా అనవే!

3. గరుడగమనా! (గరుడునిపై నెక్కిపోవువాడు) నందక హస్తా! (హరిచేతిలోని ఖడ్గము నందకము) అని సంబోధింపవే! రావణుని పదితలలనునరకిన ఓరఘువీరా! అనుచుఆహ్వానింపవే! ముకుందా! అనవే!

4. అక్రూరుని యందనురాగముగల ప్రభూ! చక్రపాణీ! ఓయి హంసస్వరూపా! పరమహంస పరివ్రాజకాచార్యవరులు! శ్రీ పరమశివేంద్ర సరస్వతులు) నిరంజనా! కంససంహారీ! అనుచు ఆనందింపవే! ముకుందా! అనవే!

నవరోజ్‌ రాగః - ఆదితాళమ్‌

4. మానస సంఞ్చరరే

మానస సఞ్చర రే - బ్రహ్మణి

మానస సఞ్చరరే.

1. శ్రీరమణీ కుచ దుర్గ విహారే

సేవకజన మన్దిర మన్దారే || మానస||

2. మదశిఖి పిఞ్ఛాలంకృతచికురే

మహనీయ కపోల విజితముకురే || మానస||

3. పరమహంస ముఖ చన్ద్రచకోరే

పరిపూరిత మురళీరవధారే|| మానస||

తాత్పర్యము :

మానసమా : అనంతమైన పరబ్రహ్మమున విహరించుచు ఆనందింపవే!

1. కోటకొమ్మున కొలువుదీరినటులు - ఆపరబ్రహ్మము లక్ష్మీదేవియొక్క రొమ్ములజంటను క్రమ్ముకొనియున్నదే! (హరియే పరబ్రహ్మము).

2. ఆ పరబ్రహ్మము తన్ను గొలుచువారి యింటి ముంగిటి పారిజాతమే! అందువిమరింపవే! మానసమా! ముంగురులయందు నెమలిపింఛమునలంకరించుకొన్న - అద్దముకంటెను నున్ననైన బుగ్గలుగల శ్రీకృష్ణపరబ్రహ్మమున విహరింపవే!

3. చిత్తమా! చకోరము చంద్రునివంక ప్రేమతో పరికించు నట్లు - పరమహంసలైన యోగీంద్రుల (పరమశివేన్ద్రసరస్వతులు) మొగమును ఆశ్రీకృష్ణపరబ్రహ్మము అనురాగముతో తిలకించుచుండునే!

మధుమయ మురళీగానప్రవాహముతో చెలగుచున్న ఆ శ్రీకృష్ణచంద్రపరబ్రహ్మమునందు ఓనామానసమా! హత్తు కొని విహరింపవే!

కున్తలవరాళీరాగః - ఆదితాళమ్‌

5. గాయతీ వనమాలీ

గాయతి వనమాలీ - మధురం

గాయతీ వనమాలీ

1. పుష్పనుగన్ధిసు - మలయ సమీరే

మునిజన సేవిత యమునా తీరే || గాయతి||

2. కూజిత శుక - పిక - ముఖ ఖగకుఞ్జే

కుటిలాలిక బహు నీరదపుఞ్జే || గాయతి||

3. తులసీదామ విబూషణహారీ

జలజ భవస్తుత సద్గుణ శౌరీ || గాయతి||

4. పరమహంస హృద యోత్సవకారీ

పరిపూరిత మురళీ రవధారీ గాయ|

తాత్పర్యము:

1. ఆహా! వైజయంతీ విభూషితుడైన శ్రీకృష్ణదేవుని మధురగానము చెలగుకున్నది.

పూలవాసనలతో గుబాళించుచున్న మలయమారుత ముతో నిండిన - మునిజన నివాసమైన - యమునాతీరమున వనమాలి గానము సాగుచున్నది.

2. యమునయొడ్డున పొదలలో చిలుకలు, కోయిలలు కూయుచున్నవి. ఉంగరాలజుట్టువలె మబ్బులు ముసురుకొని వచ్చుచున్నవి. అపుడచట వాని నడమ స్వామిగానము ప్రవహించుచున్నది.

3. తులసీమాలికా విభూషితుడు - బ్రహ్మ సంస్తుతుడు - గుణశాలి - శౌరి - వనమాలి గానముచేయుచున్నాడు.

4. పరమహంసలైన యోగీంద్రుల (సదాశివబ్రహ్మేంద్రుల) హృదయము నానందముతో నిండించుచు - వనమాలి గోపాలదేవుడు - అడుగో! గానము చేయుచున్నాడు.

సురుటి రాగః - ఆదితాళమ్‌

6. క్రీడతి - వనమాలీ.

క్రీడతి వనమాలీ గోష్ఠే

క్రీడతి వనమాలీ.

1. ప్రహ్లాద పరాశర పరిపాలీ

పవనాత్మజ జామ్బవ దనుకూలీ|| క్రీడతి||

2. పద్మాకుచ పరిరమ్భణ శాలీ

పటుతర శాసిత మాలి సుమాలీ || క్రీడతి||

3. పరమహంస వరకుసుమ సుమాలీ

ప్రణవ పయోరుహ గర్భ కపాలీ|| క్రీడతి||

తాత్పర్యము:

1. ఆహా! వనమాలి - వైజయంతీ విభూషితుడు క్రీడించు చున్నాడు. గోశాలలో ! గోశాలలో!

ప్రహ్లాదుని బాలించిన దైవము - పరాశరమహర్షి నేలిన (వ్యాసుని తండ్రి పరాశరుడు) వేలుపుదొఱ హనుమంతునకు, జాంబవంతునకు అనుకూలుడై చెలగిన ప్రభువు - క్రీడించు చున్నాడు. గోశాలలో! గోశాలలో!!

2. లక్ష్మీదేవి రొమ్ములజంటను గాడము హత్తి కౌగిలిలో గొన్న హరి - మాలిని, సుమాలిని శాసించిన వైకుంఠుడు అడుగో! గోశాలలో ఆడుచున్నాడు! గోశాలలో! (సుమాలి రావణుని మాతామహుడు. సుమాలి అన్న మాలి. హరి మాలిని యుద్ధమున సంహరించెను. సుమాలి పారిపోయెను. చూడు -రామాయణము ఉత్తరకాండ)

3. చక్కని పూలదండనువలె పరమహంసలైన యోగీంద్రులను (పరమశివేంద్రులను) తనగుండెలయందు నిండించు కొన్న దేవదేవుడు - ఓంకారమనెడు తామరపూవులో శివుడై కూర్చున్న శ్రీకృష్ణపరబ్రహ్మము - గోశాలలో - పశుశాలా ప్రాంగణములో క్రీడించుచున్నాడు!

(శివుడు సదా ధ్యానమగ్నుడు. ఆయనకు చలనము లేదు. అట్లు సుస్థిరుడై ఓంకృతి గర్భమున వెలయుచున్న వాడని భావము)

సావేరి రాగః - ఆదితాళమ్‌.

`ò. భజరే - యదునాథమ్‌.

భజరే యదునాథం - మానస -

భజరే యదునాథమ్‌.

1. గోపవధూ పరిరమ్భణలోలం

గోప కిశోరక మద్భుతలీలమ్‌ || భజ||

2. కపటాఙ్గీకృత మానుషవేషం

కపటనాట్యకృత కుత్సితవేషమ్‌|| భజ||

3. పరమహంసహృత్‌ తత్త్వస్వరూపం

ప్రణవపయోధర ప్రణవస్వరూపమ్‌ || భజ||

తాత్పర్యము:

1. మానసమా! యదుకులతిలకుని, యాదవశిరోరత్నమును శ్రీకృష్ణచంద్రుని సేవింపవే!

గోపీప్రియుడై, వారిని కౌగిలిలో గొనుటకై వేచిచూచు గోపకిశోరుని - ప్రభువును - ఓనాచిత్తమా! హత్తి నిలువవే! తన లీలచే ఎల్లలోకమును ఆశ్చర్యరసమగ్ను మొనరించు

స్వామిని సేవింపవే!

2. ఓసి మానసమా! అతడు సాధారణమానవుడుకాడే! లీలామానుషవిగ్రహుడే! లోకముయొక్క కనులు గప్పుటకై మానవరూపముధరించిన పరబ్రహ్మమే! నాట్యమాడుచున్నదే? హీనవేషము దాల్చియున్న దే! ఇదంతయు కపటమే! అది పరబ్రహ్మమే! ఆ యదువంశశిరోరత్నమును ఆరాధింపవే!

3. చిత్తమా! మహాయోగులు తమయెడదలయందీ తత్త్వమునే ఆరాధించుచుందురే! ఇట్టి ప్రణవస్వరూపమే! ప్రణవమేఘమే! (మేఘము నీటిని వర్షించును. ప్రణవము ఆనంద మును వర్షించును.) అన్యచింతలు వీడి దీని నారాధింపవే!

మోహనరాగః - ఆదితాళమ్‌

8. భజరే - రఘువీరమ్‌.

భజరే రఘువీరం - మానస

భజరే రఘువీరమ్‌ (బహుధీరమ్‌).

1. అమ్బుదడిమ్భ విడమ్బనగాత్రం

అమ్బుదవాహస నన్దనగాత్రమ్‌ || భజ||

2. కుశిక సుతాపిత కార్ముకవేదం

వశిహృదయామ్బుజ భాస్కరపాదమ్‌|| భజ||

3. కుణ్డల మణ్డన మణ్డిత కర్ణం

కుణ్డలి మఞ్చక మద్భుత వర్ణమ్‌ || భజ||

4. దణ్డిత సున్ద సుతాదికవీరం

మణ్డిత మనుకుల మాశ్రయశౌరిమ్‌ || భజ||

5. పరమహంస మఖిలాగమ వేద్యం

పరమవేద మకుటీ ప్రతిపాద్యమ్‌|| భజ||

తాత్పర్యము:

1. మనమా! శ్రీరఘువీరుని శ్రీరాముని సేవింపవే! పిల్ల మబ్బులను వెక్కిరించు నల్లని మేనుగల ఘునందనుని - ఇంద్రుని బిడ్డయైన జయంతుని బాలించిన ప్రభువును ఆరాధింపవే!

(రామవనవాసవేళ అమ్మరొమ్ములమధ్య నెత్తురోడునట్లు ముక్కుతో బొడిచిన కాకాసురుడు జయంతుడే. వానిపై బ్రహ్మాస్త్రమును బ్రయోగించియు శరణొందగా స్వామి కరుణించినాడు.)

2. కుశికాత్మజుడైన విశ్వామిత్రునినుండి ధనుర్వేదము నెల్ల గ్రహించిన రామచంద్రుని -

రవికిరణములు తామరలను వికసింపజేసినట్లు జితేంద్రియులైన మునుల హృదయములకు వికాసముగూర్చు శ్రీరామచంద్రుని సేవింపవే!

3. ఆదిశేషుని శయ్యగా గొని - కుండలాలంకృత కర్ణుడైన ఆస్వామి శరీరచ్ఛాయ అద్భుతమైనదే! ఆ స్వామి నోచిత్తమా సంస్మరింపవే!

4. సుందుని కొడుకులైన మారీచసుబాహులను - ఇల్లా లైన తాటకను దండించిన వీరుని -

తానవతరించి మనువంశమునకు గొప్పఖ్యాతిని గూర్చిన శౌరిని రఘునాథుని ఆశ్రయింపవే! ఆశ్రయించి సేవింపవే!

పరమహంసస్వరూపియై - (పరమశివేంద్రుల రూపమున నున్న) వేదవేద్యుడైన ఆ స్వామిని వేదములకు కిరీటములు అనదగిన ఉపనిషత్తులు పరబ్రహ్మమని ప్రతిపాదించుచున్నదే! మానసమా! నీ వారఘుకులతిలకు నాశ్రయించి మేలొందవే!

కామ్భోజిరాగః - త్రిపుటితాళమ్‌

9. ప్రతి వారం - వారమ్‌.

ప్రతి వారం వారం - మానస

భజరే రఘువీరమ్‌

1. కాలామ్భోదర కాన్తశరీరం

కౌశిక శుక శౌనక పరివారమ్‌|| భజ||

2. కౌసల్యాదశరథ సుకుమారం

కలి కల్మషభయ గహన కుఠారమ్‌ || భజ||

3. పరమహంస హృత్పద్మ విహారం

ప్రతిహత దశముఖ బలవిస్తారమ్‌ || భజ||

తాత్పర్యము:

1. మాటిమాటికి - పౌనఃపున్యము - ఓ మనసా! రఘు నాథుని భజింపవే!

నీటితో నిండిన నల్లనిమబ్బువలె మెఱయు మైచాయగల రఘునాధుని హత్తి నిలుపవే! కుశికనందనుడు విశ్వామిత్రుడు వ్యాససూనుడు శ్రీశుకుడు, శునకమునీంద్రుని కొడుకు శౌనకుడు ఆ స్వామి పరివారములోని వారేనే! నీవా రఘువీరుని గొలిచి మేలొందవే!

2. చిత్మా! శ్రీకౌసల్యాదేవి కడుపుపంట - దశరథ రాజన్యుని గారాలపట్టి అయిన రఘురాముడు - అడవివలె పెరిగి పోయిన ఈ కలిలోని కాలుష్యమునకు గొడ్డలి పెట్టువంటివాడే! ఆ స్వామిని దలచి కొలిచి సుఖింపవే!

3. పరమహంస (సదాశివులు) హృదయపద్మమున విహరించు శ్రీరాముని - పదితలలతో నిక్కిన రావణుని సేనలను చీల్చి చెండి చెక్కి వేసిన రఘువీరుని - ఓమనమా? మాటిమాటికి మననము చేసి మహానందమునందుకొనవే!

సురుటిరాగః - ఆదితాళమ్‌

10. చేతః శ్రీరామమ్‌.

చేతః శ్రీరామం - చిన్తయ

జీమూతశ్యామమ్‌.

1. అఙ్గీకృత తుమ్బురు సఙ్గీతం

హనుమద్గవయ గవాక్ష సమేతమ్‌|| చేతః||

2. నవరత్న స్థాపిత కోటీరం

నవతులసీదళ కల్పితహారమ్‌|| చేతః||

3. పరమహంస హృద్‌ గోపురదీపం

చరణదళిత ముని తరుణీశాపమ్‌|| చేతః||

తాత్పర్యము:

1. చిత్తమా! మేఘశ్యాముని శ్రీరాముని ధ్యానింపవే! తుంబురుగానము నంగీకరించిన ప్రభువును, హనుమతో - గవయ గవాక్షవీరులతో కొలువుదీరియున్న శ్రీరఘునాథుని ఆశ్రయింపవే!

2. శిరమున నవరత్నకిరీటముతో - మెడలో తులసీ దళదామముతో శోభించు రామచంద్రుని - ఓచిత్తమా! ఆశ్రయింపవే! ఆశ్రయించి ధ్యానింపవే!

3. గుడిగోపురమున ధగధగ మెఱయు దీపమువలె యోగిపుంగవుల (పరమశివేంద్రుల) హృదయములో వెలుగులుజిమ్ము శ్రీరాముని - పాదస్పర్శచేతనే పాషాణమును పడతిగా మార్చిన (అహల్యా శాపవిమోచనము) శ్రీరామచంద్రపరబ్రహ్మ మును చిత్తమా! సేవింపవే! సేవించి ధ్యానింపవే!

జఞ్ఝోటి రాగః - ఆదితాళమ్‌

11. పిబరే - రామరసమ్‌.

పిబరే రామరసం - రసనే

పిబరే రామరసమ్‌

1. దూరీకృత పాతక సంసర్గం

పూరిత నానావిధ ఫలవర్గమ్‌ || పిబ||

2. జనన మరణభయ శోకవిదూరం

సకల శాస్త్రనిగమాగమ సారమ్‌|| పిబ||

3. పరిపాలిత సరసిజ గర్భాణ్డం

పరమ పవిత్రీకృత పాషణ్డమ్‌|| పిబ||

4. శుద్ధ పరమ హంసాశ్రయ గీతం

శుక శౌనక కౌశిక ముఖపీతమ్‌|| పిబ||

తాత్పర్యము:

శ్రీరామనామరసమునో నా జిహ్వేంద్రియమా! ఆస్వాదింపవే! ఆస్వాదించి చెన్నొందవే!

1. రామరసము నాస్వాదింపుము. పాపములు నీదరి జేరవు. రామరసపాన మొనరింపుము - చతుర్విధ పురుషార్థములు కొల్లలుగా ఫలించును.

2. శ్రీరామనామామృత సేవనముచే - ''చచ్చెదమని - మరలబుట్టెదమని'' భయము ఏది ఇంతవరకు బీడించుచున్నదో - అది మటుమాయమై పోవునే! జిహ్వేంద్రియమా! శ్రీరామ రసమును పానమొనరింపవే! ఇది సకల వేదసారమే! సర్వ శాస్త్రములు, ఆగమములు దీనినే నిరూపించుచున్నవే!

3. బ్రహ్మాండము నెవరు పాలించుచున్నారు. శ్రీరామ నామామృతము! పతితులను సైతము పరమపవిత్రులుగా మార్చగలవారెవరు? శ్రీరామరసాయనము! అదిమాత్రమే ఆపని చేయగలదు.

అందుచే రసనేంద్రియమా! రామరసపానము జేసి రంజిల్లవే!

4. నిర్మలాంతఃకరణులైన యోగివరేణ్యులు (పరమశివేంద్రులు) శ్రీరామనామమును గానము చేయుచుందురే? ఓ రసనేంద్రియమా! శ్రీశుకయోగి - శౌనకమునివరుడు - విశ్వామిత్ర మహర్షి శ్రీరామనామామృతము నాదరముతో సేవించిన వారే సుమా! ఓనా జిహ్వేంద్రియమా! రామరసాయనమును సేవింపవే!

అఠాణారాగః - ఆదితాళమ్‌

12. ఖేలతి -మమ- హృదయే.

ఖేలతి మమ హృదయయే

రామః - ఖేలతి మమహృదయే

1. మోహమహార్ణవ తారకకారీ

రాగద్వేషముఖాసుర మారీ || ఖేలతి||

2. శాన్తి విదేహసుతా సహాచారీ

దహరాయోధ్యా నగరవిహారీ || ఖేలతి||

3. పరమహంస సామ్రాజ్యోద్ధారీ

సత్యజ్ఞానానన్ద విహారీ|| ఖేలతి||

తాత్పర్యము:

1. ఆహా! నాహృదయములో - రాగద్వేషాది రాక్షస వర్గమును నేలగూల్చుచు - అంతములేని అజ్ఞాన సముద్రమును దాటించువాడై - రాముడు. శ్రీరామచంద్రుడు క్రీడించుచున్నాడు.

2. పరమ ప్రశాంతియే సీతమ్మతల్లియై తన్ను వెన్నంటి నిలువగా - హృదయదేశమునందు యోగిజనైక వేద్యమైన దహరస్థానమునే అయోధ్యగా స్వీకరించి అందు విహరించుచు రాఘువుడు క్రీడించుచున్నాడు.

3. ఆహా! సత్యజ్ఞాన - ఆనందరూపుడై, యోగిజనులకు (పరమశివేంద్రులు) ఆత్మజ్ఞాన సామ్రాజ్యమును సముద్దరించుచు రాఘవుడు నాహృదయములో ఇదుగో! క్రీడించు చున్నాడు.

తోడిరాగః - ఆదితాళమ్‌.

13. ఖేలతి పిణ్డాణ్డ.

ఖేలతి పిణ్డాణ్డ

భగవాన్‌ - ఖేలతి పిణ్డాణ్ణ.

1. హంసః సోహం హంసః సోహం

హంసః సోహం సోహమితి || ఖేలతి||

2. పరమాత్మాహం పరిపూర్ణోహం

బ్రహ్మైవాహ మహంబ్రహ్మేతి || ఖేలతి||

3. త్వక్‌ చక్షుః శ్రుతి జిహ్వాఘ్రాణ

పంచవిధ ప్రాణోపస్థానే || ఖేలతి||

4. శబ్దస్పర్శ రసాదికమాత్రే

సాత్విక రాజస తామసమిత్రే || ఖేలతి||

5. బుద్ధి మనశ్చిత్తాహంకారే

భూజల తేజో గగన సమీరే || ఖేలతి||

6. పరమహంస రూపేణవిహర్తా

బ్రహ్మవిష్ణు రుద్రాదిక కర్తా|| ఖేలతి||

తాత్పర్యము:

1. బ్రహ్మాండమునందంతటను నిండియున్న భగవంతుడు నాయీ పిండాఁడములో - దేహములో ఆడుచున్నాడు. 'హంసఃసోహం - హంసః సోహంః - హంసః - సోహం సోహం' అని పలుకుచు ఆడుచున్నాడు.

వివరము; (మనము గాలిని బీల్చుచున్నాము; విడుచు చున్నాము. గాలి లోపలకు ప్రవేశించుచు 'హం' అని ధ్వనించుచున్నది. బయటకు బోవుచు 'సో' అని ధ్వనించుచున్నది. అనగా మన ఊరు నిట్టూరుపులయందు 'హంసో' అన్న ధ్వని పుట్టుచున్నది.

సంస్కృతభాషలో పదాంతమునందలి ఓకారము - విసర్గముయొక్క వికారమే. అందుచే ఊర్పు నిట్టూర్పులు 'హంసః' అని ధ్వనించుచున్నవని తెలియుచున్నది.

ఊర్పు తరువాత నిట్టూర్పును గాక - నిట్టూర్పు తరువాత ఊర్పును పరిగణింపగా ఆధ్వని 'సోహం' అగుచున్నది.

ఇట్లు మనము గమనించుట లేదుగాని - మనయందు 'హంసః - సోహం' అన్న ధ్వనులు నిరంతరము సాగుచున్నవి హకారము - శివవాచి, సకారము శక్తి వాచకము. 'హంసః' అనగా శివశక్తులే!

'హంసః సోహం - హంసః సోహం' అనుచు శివశక్త్యా త్మకమైన దైవతత్త్వమే (చెడుగుడి ఆటలో బాలురు కూత కూయుచున్నట్లు) మనయందాడుచున్నది.

ఇచట మరొకవిశేషము :- 'సోహం' అనుదానిని విడదీయగా 'సః+అహం' అగును. ఉన్నవి ఈ రెండక్షరములేకాని, ఈ 'అకారము' 'ఓకార-హకారముల' నడుమ జనించుటకు సంస్కృత వ్యాకరణము అవకాశము కల్పించును, అందుచే 'సోహం' అనుదానిని విడదీయగా 'నః+అహం' అగును.

'సః=వాడు, అహం=నేను, వాడు నేను అనగా 'వాడే నేను' అగుచున్నది. అనగా - 'వాడేనేను, నేనేవాడు' అన్న అర్థము జనించుచున్నది.

శివశక్తిస్వరూపమైన దైవతత్త్వము నాపిండాండములో 'హంసః సోహం' హంసః సోహం' అనుచు - 'నేనే వాడు, వాడే నేను' అని నిరంతరము పల్కుచు - ఫలితముగా - నేను పరమాత్మను, నేను పరిపూర్ణుడను, నేను బ్రహ్మమను, బ్రహ్మమే నేను - అని ఘోషింపుచు విహరింపుచున్నది. ఇది సత్యము.

ఉత్తమ సాధకున కిది అనుభవములో సాక్షాత్కరించును. అట్టివాడు తన ఊర్పు నిట్టూర్పులపై భగవంతుని యొక్క యీ క్రీడావిహారమునందు చిత్తమును నిలిపి, పరిణతుడై అద్వైతశిఖరాగ్రమును జేరి బ్రహ్మాత్మ్యైక్యము ననుభవించును.

'సాధన చేయనివానికి ఏమియును లేదు'.

2. నేను పరమాత్మను, నేను పరిపూర్ణుడను! నేను బ్రహ్మమను బ్రహ్మము నేనే! అనుచు భగవంతుడు - భగవానుడే నాశరీరమునందాడుచున్నాడు.

3. నాత్వగింద్రియము (చర్మము)లో - కంటిలో - చెవిలో - ముక్కులో - నాల్కపై స్వామి క్రీడించుచున్నాడు! ప్రాణ పంచకమునకు ఆశ్రయమైన నాదేహములో 'బ్రహ్మైవాహం' అనుచున్నాడు! క్రీడించుచున్నాడు.

4. మనోబుద్ధ్యహంకారచిత్తాత్మకమైన నా అంతంకరణములోని నాల్గుభాగములయందును - భగవానుడు 'బ్రహ్మైవాహ' మ్మనుచు గంతులు వేయుచున్నాడు.

5. 'నేల - నీరు - నిప్పు -గాలి - ఆకసము' - అనెడు పంచ భూతముల సమ్మిశ్రమముగానున్న నాయీ పిండాండములో హరియొక్క క్రీడావిహారము నిరంతరముగా సాగుచున్నది.

6. పరమహంసలైన యోగీంద్రుల రూపమున (సదాశివులు గురువులు) లోకమున వివరించు స్వామి - బ్రహ్మ -విష్ణు - మహేశులకు మూలమైన దైవము - నాపిండాండమున గ్రీడించు చున్నాడు.

ధనాసరీరాగః - ఆదితాళమ్‌

೧೪. స్థిరతా నహి - నహిరే.

స్ధిరతా నహి నహిరే - మానస

స్థిరతా సహి సహిరే

1. తానత్రయసాగర మగ్నానాం

దర్పాహంకార విలగ్నానామ్‌|| స్థిరతా|7

2. విషయపాశ వేష్టిత చిత్తానాం

విపరీతజ్ఞాన విమత్తానామ్‌|| స్థిరతా||

3. పరమహంసయోగి విరుద్ధానాం

బహు చఞ్చలతర సుఖబద్ధానామ్‌|| స్థిరతా||

తాత్పర్యము:

ఓసి మానసమా! కుదురుండదే? వారికి శాంతియుండదే?

1. ఆధ్యాత్మికము (శరీరసంబంధి) ఆధిభౌతికము (పంచభూతములవల్లనైనది) అధిదైవికము (దైవసంబంధి) అని మూడు రకములైన తాపములు. ఈ తాపత్రయము సముద్రమువలె అంతములేనిది. అందు మునిగినవారికి కుదురుండదే మానసమా! గర్వమున - అహంకారమున తగులుకొన్న వారికి శాంతి యుండదే!

2. శబ్ద - స్పర్శ - రూప - రస - గంధాత్మకములైన విషయములు పాశములు. అవి చుట్టలు చుట్టలుగా నెవరిని జుట్టి బాధించుచున్నవో వారికి - ఓమానసమా! కుదురుండదే! స్థిరతయుండదే!

ఏది తాను కాదో - దానిని తాననుకొనుట (శరీరము తాననుకొనుట) ఏది - తానో - అది తానుకాదనుకొనుట (అచ్చమైన ఆత్మను తానుగా గుర్తింపకపోవుట) అనగా అనాత్మయందు ఆత్మభావము, ఆత్మయందు అనాత్మభావము - విపరీత జ్ఞానము అనబడును.

ఇట్లు విపరీతజ్ఞానముచే ఎవ్వరి బుద్ధి చెడియున్నదో - వారికి ఓచిత్తమా! శాంతి ఎట్లుండునే? స్థైర్యము ఎట్లు లభించునే?

3. పరమహంసలైన యోగీంద్రులు (సదాశివులగురువులు) ఉపదేశించు యోగమార్గమును వ్యతిరేకించువారికి - మిక్కిలి చంచలములైన ఇంద్రియసుఖములయందు దగులు కొన్నవారికి చిత్తమా! శాంతియుండదే! నిలుకడ ఉండదే!

ఆనన్దభైరవిరాగః - ఆదితాళమ్‌

೧೫. నహిరే నహి శఙ్కా.

నహిరే నహి శఙ్కా

కాచి - న్నహిరే నహి శఙ్కా

1. అజ మక్షర మద్వైత మనన్తం

ధ్యాయన్తి బ్రహ్మ పరం శాన్తమ్‌ || నహిరే||

2. యే త్యజన్తి బహుతర సన్తాపం

యే భజన్తి సచ్చిత్సుఖ రూపమ్‌|| సహిరే||

4. పరమహంస గురు భణితం గీతం

యే పఠన్తి నిగమార్థ సమేతమ్‌|| నహిరే||

తాత్పర్యము:

వారికి ఏభయమును లేదు ఉండదు! ఎవరికి? బ్రహ్మాను సంధాన పరులకు! 'బ్రహ్మపదార్థము పుట్టదు గిట్టదు. అదొక్కటే ఉన్నది, రెండవది లేనే లేదు. అది అనంతము. దాని కంటె గొప్పది శాంతమైనది లేదు' - అని యీ విధముగా ఎవరు నిరంతరము బ్రహ్మానుసంధానపరులై ఉంటారో - వారికి సందేహాలు ఉండవు. భయాలు జనింపవు.

2. ఎవరు బహుళ తాపములను దెచ్చిపెట్టుసంసారాసక్తిని వీడి - సచ్చిదానందమయమైన పరబ్రహ్మమే తానని ధ్యానించి సేవింతురో వారికి లేశమున్నూ భీతిలేదు. ఉండదు.

3. ఇట్టి వారికి ఏశంకయును లేదన్న యీ మాట పరమహంసలైన గురువులు చెప్పినమాట సుమా! వేదార్థ మిదియే సుమా! ఇట్లున్న యీగీతము నెవరు పఠింతురో పఠించి ఆచరింతురో - వారికి భయమా! వారికి భీతియా! వారికి శంకయా!

లేదు! కలుగదు!! ఉండదు!!!

కామ్భోదిరాగః - ఆదితాళమ్‌

೧೫. చిన్తా నహిరే-నాస్తి కిల

చిన్తా నాస్తి కిల

తేషాం - చిన్తా నాస్తి కిల.

1. శమ దమ కరుణా సమ్పూర్ణానాం

సాధు సమాగమ సంకీర్ణానాం|| చిన్తా||

2. కాలత్రయ జిత కన్దర్పాణాం

ఖణ్డిత సర్వేంద్రియ దర్పాణామ్‌|| చిన్తా||

3. పరమహంసగురు పద చిత్తానాం

బ్రహ్మానన్దామృత మత్తానామ్‌|| చిన్తా||

తాత్పర్యము:

చింతలేదు - వరికి శోకము లేదు.

1. అంతరింద్రియములను, బహిరింద్రియములను బూర్తిగా అదుపులో ఉంచుకొన్నవారికి - సజ్జన సంగతియందు కాలము గడుపువారికి దుఃఖము లేదు! చింతలేదు!

2. మూడు వేళలయందును కామునెన్నడును కదలనీయని వారికి - అన్ని యింద్రియముల విజృంభణమును బూర్తిగా అరికట్టినవారికి చింతఏమున్నది! శోకమేమున్నది!!

3. పరమహంసలైన శ్రీ గురువులపాదములయందు దమ్ముదామర్పించుకొన్న వారికి (సదాశివబ్రహ్మేంద్రులవారు తమ గురువులను స్మరించుచున్నారు. ఎవరైనను తమ గురువుల నిటులే భావింపవలెనని భావము) - బ్రహ్మానందామృతపానముచే తమ్ము దా మరచువారికి చింత ఏమున్నది? శోకమే మున్నది?

నాథనామక్రియారాగః - ఆదితాళమ్‌

. బ్రహ్మైవాహం కిల

బ్రహ్మైవాహం కిల

సద్గురు కృపయా - బ్రహ్మైవాహం కిల

1. బ్రహ్మైవాహం కిల గురుకృపయా

చిన్మయ బోధానన్ద ఘనం తత్‌|| బ్రహ్మై||

2. శ్రుత్యనన్తైక నిరూపిత మతులం

సత్యసుఖామ్బుధి సమరస మనఘమ్‌|| బ్రహ్మై||

3. కర్మాకర్మ వికర్మ విదూరం

నిర్మలసంవి దఖణ్డ మపారమ్‌|| బ్రహ్మై||

4. నిరవధి సత్తాస్పద పదమజరం

నిరుపమ మహిమని నిహితమనీహమ్‌|| బ్రహ్మై||

5. ఆశాపాశ వినాశన చతురం

కోశపఞ్చకాతీత మనన్తమ్‌|| బ్రహ్మై||

6. కారణకారణ మేకమనేకం

కాలకాల కలిదోష విహీనమ్‌|| బ్రహ్మై||

7. అప్రమేయపద మఖిలాధారం

నిష్ప్రపంఞ్చ నిజ నిష్క్రియ రూపవ్‌|| బ్రహ్మై||

8. స్వప్రకాశ శివ మద్వయ మనఘం

నిష్ప్రతర్క్య మనపాయ మకాయమ్‌|| బ్రహ్మై||

తాత్పర్యము :

1. శ్రీ గురువుల కరుణచే నేను బ్రహ్మమనే! శ్రీ గురుకృపచే - 'చిన్మయము. జ్ఞానానందములచే ఘనీభూతము అయిన బ్రహ్మమే నేనని' నాకు అనుభవమునకు వచ్చినది.

2. దేనిని వేదములు అనంతమని - ఒక్కటియని నిరూపించుచున్నవో, దేనిని సత్యమని - ఆనంద సముద్రమని - పెరుగుట. తరుగుట ఎఱుగని నిత్యసమరసమని కీర్తించుచున్నవో - ఆబ్రహ్మమే నేను! శ్రీ గురుకరుణాప్తిచే నేను బ్రహ్మమనైతిని!

3. ఏ బ్రహ్మానుభవమున 'జేయదగిన - చేయగూడని వివేషముగా చేయదగిన కర్మలన్నవి కొంచెముకూడ శేషించి యుండవో, ఏది నిర్మలజ్ఞానరూపమో, దేనియందు విభాగము లన్నవిలేవో, మరియు నెయ్యది సారములేనిదో - శ్రీగురుకరుణా విశేషముచే అట్టి బ్రహ్మము నేనైయున్నాను.

4. ఏది నిరవధికసత్యమో - (ఎన్నడును ఏవేళయందును మారదో) దేనియందు శైథిల్యము కొంచెమును లేదో - దేనిమహిమకు సాటిలేదో - తనమహిమయందే ఏది తాను నిలిచియున్నదో - ఎందుకోరికలన్నవి ఉదయింపవో శ్రీగురువుల కరుణచే నేనా బ్రహ్మమనైయున్నాను.

5. కోరికలన్న పాశములకు అంతముండదు. బ్రహ్మానుభవముకలిగినంతనే ఆకోరికలు మరి నిలువవు. అన్నమయ - ప్రాణమయ - మనోమయ - జ్ఞానమయ - ఆనందమయములనెడు పంచకోశములను దాటిన మీదట అనుభవమునకు అందునట్టి అనంతమైన ఆబ్రహ్మము నేనే!!

6. లోకములో దేని ఉనికికైనను కారణమున్నది; కాని బ్రహ్మమునకు కారణములేదు. అన్నిటికిని అదియే కారణముగా నున్నది. అందుచే అది సర్వకారణములకును కారణమైనది. అది ఒక్కటి. అనేకముగా దోచుచున్నది.

ఆ బ్రహ్మపదార్థము 'ఫలానా కాలములోనిది, అని కాలములో బంధించుటకు వీలుకానిది. కాలమన్నది తల యెత్తనిచోట అది ఉన్నది. అందుచే అదికాలమునకును కాలుడైనది; మృత్యువైనది.

'కలి' అనునది కాలములోని మురికి; మడ్డి. ఇచట పాపమే ఎక్కువ. కాలమనునది తలఎత్తని తావుకదా బ్రహ్మము. కాలప్రసక్తియే లేనిదైన బ్రహ్మమున కలిదోషము లెటులంటును? ఇట్టి పరబ్రహ్మము నేనే!!

7. పరబ్రహ్మముయొక్క పరిమాణము - ఇంతయని కొలుచుట ఎవరికిని సాధ్యముకాదు. అది సర్వాధారము. అచట ప్రపంచము లేదు. అచ్చట ఏవిధమైన క్రియయును లేదు.

అట్లు అమేయము - అఖిలాధారము - నిష్ప్రపంచము - నిష్క్రియము అయిన బ్రహ్మము నేనే!!

8. లోకములోని ఏవస్తువును స్వయంప్రకాశము కాదు. అనగా పరాపేక్షలేక తానై స్ఫురింపదు, ప్రకాశింపదు. సూర్యుడున్నాడు. స్వయముగనే ప్రకాశించుచున్నాడు కదా! అనవచ్చును. కాని అతడు అనంతతానై స్ఫురింపడు. వాని స్ఫురణమునకు 'నీవో - నేనో' అవసరము. అపుడు మాత్రమే వాని ఉనికి అవగతమగును. కాని సర్వులును అనుభవించు 'నేను, అన్నదాని స్ఫురణమునకు పరాపేక్షయున్నదా! లేదు. అందుచే 'నేను' అన్నది తప్ప అన్యములన్నియును పరతః ప్రకాశములే.

ఈ నేను రెండు విధములుగా నున్నది. బుద్ధియందు తోచు 'అహంతా స్ఫూర్తి' అచ్చమైనది కాదు. అది అజ్ఞాన విలాసము, బుద్ధిని దాటిపోయినపుడు ఏది తాను అనెడి అను భూతి ఉదయించునో అది నిజమైన నేను. అది ఆత్మ. అది బ్రహ్మము. అది - అదొక్కటి మాత్రమే స్వయంప్రకాశశీలము. ఇతరములన్నియు దానిమహిమచే మాత్రమే స్ఫురించుచున్నవి. తెలియబడుచున్నవి. (నేను - ఆత్మ - బ్రహ్మము - ఇదొకటి మాత్రము తనకు దానుగా తెలియబడుచున్నది. ఇతరములు ఏవియును తమకు దామై తెలియబడవు.) అందు చేతనే. శ్రుతి - 'యస్య భాసా సర్వమిదం విభాతి' అన్నది. అనగా బ్రహ్మము స్వయంప్రకాశశీలమైనదని అర్థము.

మరియును ఆ బ్రహ్మము మంగళమయమైనది. అది ఒక్కటన్న ఒక్కటి, రెఓండవది లేనేలేదు. అందుచే అది అద్వయము.

ఆ బ్రహ్మవస్తువు తర్కములకు జిక్కునదికాదు. దానికొక అపాయమన్నది ఎన్నడును లేదు, కలుగదు. దానికి శరీరము లేదు.

ఇట్లు స్వయంప్రకాశ##మై - శివమై - అతర్క్యమై - అనపాయమై - అశరీరియై యున్న బ్రహ్మము నేనే!!

(ఇచట 'శివ' శబ్దము సదాశివుల గురువులకు సూచకము)

నవరోజ్‌ రాగః - ఆదితాళమ్‌

18. సర్వం బ్రహ్మమయమ్‌.

సర్వం బ్రహ్మమయమ్‌

రేరే - సర్వం బ్రహ్మమయమ్‌.

1. కిం వచనీయం కిమవచనీయం

కిం రచనీయం కిమరచనీయమ్‌ || సర్వం||

2. కిం పఠనీయం కిమపఠనీయం

కిం భజనీయం కిమభజనీయమ్‌|| సర్వం||

3. కిం బొద్దవ్యం కిమచోద్ధవ్యం

కిం భోక్తవ్యం కిమభోక్తవ్యమ్‌|| సర్వం||

4. సర్వత్ర సదా హంసధ్యానం

కర్తవ్యం భో! ముక్తినిదానమ్‌|| సర్వం||

తాత్పర్యము:

సర్వము బ్రహ్మమయమే! అంతయును బ్రహ్మమే! ఇదంతా బ్రహ్మమే రా!

1. ఇచట ప్రవచింపదగిన దేమున్నది? ప్రవచింపరాని దేమున్నది? చేయదగిన దేమున్నదిఒ? చేయంగూడనిదేమున్నది? అంతయును బ్రహ్మమేరా!

2. చదువదగిన దేమిటి? చదువరాని దేమిటి? సేవింపదగిన దేమిటి? సేవింపరానిదేమిటి? సర్పమును బ్రహ్మమే. (అంతయును బ్రహ్మముగా నెవనికి భాసింపుచున్నదో వానికి విదినిషేధము లుండవు).

3. తెలియ దగిన దేమిటి? తెలియరాని దేమిటి? తిన దిగిన దేమిటి! తినరానిదేమిటి? అంతటను బ్రహ్మమే నిండి యున్నదిరా!

4. చేయవలసినదొక్కటే! అన్ని వేళలయందును - అన్ని చోటులయందును ముక్తి కారణమైన 'హంసధ్యానము - హంస ధ్యాన మొక్కటియే' అచరిం పవలెను.

సర్వమును బ్రహ్మమే!

హంసధ్యానము :- గాలిని లోనికి బీల్చుచు 'హం' అను అక్షరమును - విడుచుచు 'సో' అను అక్షరమును అనుసంధానము చేయవలెను.

'అనుసంధానము = వెంట తగుల్చుట! ఊర్పునకు వెనుకగా 'హం' అను అక్షరమును, నిట్టూర్పు వెంబడి 'సో' అను అక్షరమును భావించుట. ఇదియే హంసధ్యానము. ఇది బ్రహ్మానుభవమును గలిగించు ప్రక్రియ. వివేషములకు 'సూత సంహితను, పరిశీలించునది.

నవరోజ్‌ రాగః - ఆదితాళమ్‌

19. తద్వజ్జీవత్వమ్‌

తద్వజ్జీవత్వం

బ్రహ్మణి - తద్వజ్జీవత్వమ్‌.

1. యద్వత్తోయే చస్ద్రద్విత్వం

యద్వన్ముకురే ప్రతిబింబత్వమ్‌ || తద్వత్‌||

2. స్థాణౌ యద్వన్రరూపత్వం

భానుకరే యద్వత్తోయత్వమ్‌|| తద్వత్‌||

3. శుక్తౌ యద్వద్‌రజత మయత్వం

రజ్జౌ యద్వత్‌ ఫణి దేహత్వం|| తద్వత్‌

4. పరమహంస గురు ణాద్వయ విద్యా||

భణితా ధిక్కృత మాయావిద్యా || తద్వత్‌||

తాత్పర్యము:

(బహ్మమందు జీవభావము భ్రాంతిమూలము) - (బ్రహ్మము కంటె వేరైనదిలేదు).

జీవభావము - బ్రహ్మమందు; బ్రహ్మమందు జీవభావనము అట్టిదయ్యా!

1. నీటిలో ఇద్దరు చంద్రులు దోచుట లేదా? నిజముగా ఇద్దరు చంద్రులున్నారా? లేరు. బ్రహ్మమందు జీవభావనము అట్టిదయ్యా! (బ్రహ్మము కంటె వేరుగా జీవుడు లేడు. లేనే లేడు).

అద్దమున ప్రతిబింబము కనబడుట లేదా? బ్రహ్మమున జీవభావ మట్టిదే! (ప్రతిబింబమున్న తావుకూడ అద్దమే! అది అద్దముకంటె వేరైనదికాదు.)

2. దుంగయందు (భ్రాంతిచే) దొంగ దోచుచున్నాడు. సూర్యకిరణములే (భ్రాంతిచే) జలముగా దోచుచున్నవి. అట్లే బ్రహ్మమునందు జీవభావము భ్రాంతిచే జనించుచున్నది.

(ఉన్నది దుంగయే; దొంగలేడు. ఉన్నది సూర్యకిరణ ప్రసారమే; జలము లేదు. అట్లే ఉన్నది బ్రహ్మమే! జీవుడు లేడు!! అనిభావము).

3. ముత్తెపు జిప్పలో వెండి నిండి యున్నట్లు తోచు చున్నది. త్రాటియందు సర్పశరీరము భాసించుచున్నది. వాస్తవమునకు 'వెండి, పాము' రెండును లేవు. అట్లే బ్రహ్మమున జీవభావము తలయెత్తుచున్నది. బ్రహ్మముకంటె వేరేమియును లేదు.

4. ఇది అద్వయ బ్రహ్మవిద్య. పరమహంసలైన గురు వర్యులు మాయా నిరాసకము; అవిద్యానాశకము అయిన ఈవిద్యను ప్రవచించినారు, ఘోషించినారు.

బ్రహ్మమున జీవభావము భ్రాంతిమూలమే నయ్యా!

కల్యాణీరాగః - ఆదితాళమ్‌

20. పూర్ణ బోధో7హమ్‌

పూర్ణబోధోహం -

సదానన్ద - పూర్ణబోధో7హమ్‌

1. వర్ణాశ్రమాచార కర్మాతి దూరో7హం.

స్వర్ణవ దఖిలవికార గతో7హమ్‌ || పూర్ణ||

2. ప్రత్యగాత్మాహం ప్రవితతసత్యఘనో7హం

శ్రుత్యన్తశతకోటి ప్రకటిత బ్రహ్మాహం

నిత్యో7హ మభయో7హ మద్వితీయోహమ్‌|| పూర్ణ||

3. సాక్షిమాత్రో7హం ప్రగళిత పక్షపాతో7హం

మోక్షస్వరూపో7హ మోంకారగమ్యో7హం

సూక్ష్మో7హ మన ఘో7హ మద్భుతాత్మాహమ్‌|| పూర్ణ||

4. స్వప్రకాశో7హం విభురహం నిష్ప్రపఞ్చో7హం

అప్రమేయో7హ మచలో7హ మకలో7హం

నిష్ప్రతర్క్యాఖణ్ణౖక రసో7హమ్‌ || పూర్ణ||

5. అజనిర్మమో7హం బుధజన భజనీయో7హం

అజరో7హ మమరో7హ మమృత స్వరూపో7హం

నిజపూర్ణ మహిమని నిహిత మహితో7హమ్‌ || పూర్ణ||

6. నిరవయవో7హం నిరుపమ నిష్కలఙ్కో7హం

పరమశివేన్ద్ర శ్రీగురు సోమ సముదిత

నిరవధి నిర్వాణ సుఖసాగరో7హమ్‌ || పూర్ణ||

తాత్పర్యము:

1. ఆహా! నాకు జ్ఞానోదయమైనది - ఆనందమయమై నిండైన ఏజ్ఞానము నాయందు ఉదయించినదో - ఆజ్ఞానమే నేను.

బ్రామ్మణాది వర్ణములు - వర్ణములకు విధింప బడిన ఆచారములునాకు లేవు. కరకంకణ-కర్ణ భూషాదులుగా ఒకే బంగారము అనేకవికారములు చెందినట్లు - ఒక్క నేనే వివిధముగా గోచరించుచున్నాను. (నాకంటె వేరైనది లేదు. నిండైన జ్ఞానానందములే నారూపము.)

2. అన్నిటికిని లోపలిదైన ఆత్మను నేను, (శరీరము - ఇంద్రియములు - మనస్సు - బుద్ధి - ఆత్మ - ఇవి ఒకదానికంటె ఒకటి లోపలివి.) అనంతముగా విస్తరించి యున్న సత్యముయొక్క ఘనీభూత స్వరూపమే నేను.

('సత్యము' అనగా - నిజము, ఆడి తప్పకుండుట అన్నది లౌకికార్థము. వేదాంతమున సత్యము అనగా త్రికాలాబాధ్యమైనది. సృష్టి - స్థితి - లయములయందును, అవి లేనపుడును - ఎన్నడును ఏది కొంచెముకూడ వికారమునకు లోను కాదో - అది సత్యము - అనగా బ్రహ్మము అని అర్థము.)

బహుళములైన ఉపనిషత్తులు ఏ పరబ్రహ్మమును బోధించు చున్నవో ఆపరబ్రహ్మమే నేను! వెలితిలేని జ్ఞానానందములే నారూపము.

3. నేను నిత్యుడను ఒకప్పడుండుట - ఒకప్పుడు లేకుండుట నాకు లేవు. నాకు భయము లేదు. ''ద్వితీయాద్వై భయంభవతి'' - రెండవదియున్న భయము జనించును. రెండవది లేదు. ఉన్నది నేనొక్కడనే! నాకు భయము దేనివలన గల్గును? నేనద్వితీయుడను, రెండవది లేనివాడను. 'ఏకమేవాద్వితీయం బ్రహ్మ' అని శ్రుతి నన్నే తెలుపుచున్నది. నేను జ్ఞానానంద మయుడను.

నేను కేవలము సాక్షిని. (''సాక్షాత్‌ ద్రష్టాసాక్షీ ''చూచిన వాడు. నాలో - నాకు వెలుపల ఏమిజరిగినను - పరుగుచున్నను - అది మంచియైనను చెడ్డయైనను నాకు దానితో లేశమును సంబంధము లేదు.

ఇద్దరు వ్యక్తులు వివాదపడుచున్నారు. ఏ వెలుగులో వారు వివాదపడుచున్నారో ఆ వెలుగునకు వారివివాదముతో సంబంధమేమున్నది? జరుగుచున్న వివాదమునకు ఆ వెలుగు సాక్షి; అంతే! అట్లే నేను నామనోబుద్ధ్యహంకార చిత్తాదుల యందును - ఇంద్రియములయందును - దేహమున - దేహమునకు బయటిదైన లోకమున జరుగు సర్వవిధ కృత్యములకు సాక్షిని. కేవలము సాక్షిని. ఏమి జరిగినను నా వెలుగులో జరుగుచున్నది. అంతే! నాకు ఆజరుగుచున్న దానితో సంబంధము ఏమాత్రమును లే.)

ఇట్లగుటచేతనే నాకు పక్షపాతము లేదు. లోకము దేనిని సుఖమనుకొనుచున్నదో - అది సంభవింపలేదని బాధగాని, దేనిని దుఃఖముగా భావించుచున్నదో అది తొలగ లేదన్న ఆరాటముగాని ఆనలో లేవు. నేను సాక్షిమాత్రుడను గదా! అందుచేతనే - ఇది సంబవింపవలెనని | ఇది కలుగరాదని నే నెన్నడును భావింపను. ఇందువలననే నాకు దేనియందును పక్షపాతములేదు. మోక్షము నాస్వరూపమే! (తన్ను అనగా ఆత్మను తానెఱుంగుటయే మోక్షము. ఆ ఎఱుక జ్ఞానము. ఆజ్ఞానమే నారూపము).

ఓంకారము నన్నే తెలుపుచున్నది. నేను సూక్ష్ముడను - మహత్తరుడను, 'అణోరణీయాన్‌ - మహతో మహీయాన్‌' అనిశ్రుతి నన్నే కీర్తించుచున్నది. నేను జ్ఞానానందమయుడను!

4. నేను స్వయంప్రకాశశీలిని. (చూ. 17. తాత్పర్యము లోని వివరణము) నాయందు ప్రపంచములేదు. (ఉన్నది నేనే) ఇంత అని నన్ను గొలుచుట సాధ్యముకాదు. (బ్రహ్మ అనంతమైనది) నేనచలుడను. (దేహాదులకు చలనముగాని, బ్రహ్మము నకు చలనము లేశమును లేదు.) నేను నిష్కలుడను. (భాగరహితుడను).

నా రూపము తర్కమునకు అందదు. అది అఖండము - ఏకరసము. (బహ్మము అనంతము | ఏకము. అందు ఖండములకు - ముక్కలకు - భాగములకు అవకాశము ఎట్లు? 'రసోవై సః- ఆనంన్దం బ్రహ్మేతి వ్యజానాత్‌' అనుచు శ్రుతిరసమే, ఆనందమే బ్రహ్మస్వరూపమని నన్నే కీర్తించుచున్నది.)

జానమయమైన ఆనందము నేనే!

5. నేనజుడను (నాకు బుట్టుకలేదు). నేను నిర్మముడను (ఉన్నది నేనే కాని, నాకంటె వేరైనది లేశమును లేదు.)

జ్ఞానులైనవారికి నేనే సేవ్యుడను. (జ్ఞాని పరబ్రహ్మాను సంథాన పరుడై యుండును. ఆపర బ్రహ్మము నేనే!)

నేనమృతుడను. నేను నావెలితి లేని నామహామహిమ యందే సుప్రతిష్ఠితుడనై యున్నాను.

నేను నిత్యము జ్ఞానానందపరిపూర్ణుడను.

6. నాయందు అవయవ విభాగము లేదు. నాకు సాటి వేరొకటి లేదు. నేను నిష్కలుడను.

శ్రీ గురువులు పరమశివవేంద్రులు శీతమయూఖుడువోలె చంద్రుడువలె) అపారముగా వెల్లివిరియ జేసిన బ్రహ్మానంద సముద్రమే నేను!!

నేను జ్ఞానమయుడను! ఆనందమయుడను! 'బ్రహ్మైవాహం'.

మధ్యమావతీరాగః - ఝంపతాళమ్‌.

21. ఆనన్ద పూర్ణ - బోధో7హమ్‌.

ఆనన్ద పూర్ణ బోధో7హమ్‌

సతత - మాసన్ద పూర్ణ బోధో7హమ్‌

1. ప్రత్యగద్వైత సారో7హం

సకల శ్రుత్యన్త తస్త్రవిదితో7హ మమృతో7హం.

మత్యనన్తర భావితో7హం

విదిత నిత్య నిష్కలరూప నిర్గుణపదో7హమ్‌ || ఆనన్ణ||

2. సాక్షి చిన్మాత్ర గాత్రో7హమ్‌

పరమ మోక్షసామ్రాజ్యాధిపో7హం మమృతో7హం

పక్షపాతాతి దూరో7హం

అధిక సూక్ష్మో7హ మనవధిక సుఖసాగరో7హమ్‌ || ఆనన్ద||

3. స్వప్రకాశైక సారో7హం

సదహ మప్రపంచాత్మ భావో7హమభయో7హం

నిష్ప్రతర్క్యో7హ మమరో7హం

చిదహ మప్రమేయాఖ్య మూర్తిరేవాహమ్‌ || ఆనన్ద||

తాత్పర్యము :

ఆనందమయమైన జ్ఞానమే నాస్వరూపము! నిత్యానంద మయమైన జ్ఞానమే నేను!!

అన్నిటికిని అవ్వలిదైన ఆత్మస్వరూపము బ్రహ్మముకంటె + వేరైనది కాదు. ఉన్నది బ్రహ్మ మొక్కటియే! రెండవది లేనే లేదు. అట్టి అద్వైతజ్ఞానసారమే నేను. ఉపనిషత్తులు తంత్ర శాస్త్రములు నన్నే కీర్తించుచున్నవి! నేనమృతుడను!

(శరీరము - ఇంద్రియములు - మనసు - బుద్ధి ఇవి ఒకదాని కంటె ఒకటి లోపలివి. 'బుద్ధేరాత్మా మహాన్‌ పరః' బుద్ధికి అవ్వలిభాగమున ఆత్మ ప్రకాశించుచున్నది. బుద్ధికి అవ్వల భావితమైన స్వరూపమే - ఆత్మయే - బ్రహ్మమే - నేను!)

నిత్యముగా (సర్వకాలము వెలయునదిగా) నిరవయవిగా (అఖండముగా) నిసై#్త్రగుణ్యముగా (సత్వ-రజస్తమోగుణములు లేనిదిగా తెలియబడుచున్న స్థానమే నేను!

నిత్యానందమయమైన జ్ఞానమే నేను?

2. నేనన్నిటికిని సాక్షిని మాత్రమే! (చూ. 20. తాత్పర్యము) నేను జ్ఞానమాత్ర శరీరిని! మోక్షసామ్రాజ్యముకంటె గొప్పది లేదు.నేనా సామ్రాజ్యమునకు అధీశుడను! ఏలికను! నేనమృతుడను! (నాకు మరణము లేదు).

నేనన్నిటికిని సాక్షినిగదా! అందుచే నాకు సుఖమున పక్షపాతముగాని దుఃఖమున ద్వేషముగాని లేదు. పక్షపాతము నాకు చాల దవ్వైనది! నేనణువుకంటెను సూక్ష్మమైన వాడను! నేనపారమైన ఆనన్దజలరాశిని!

నిత్యానందమయమైన జ్ఞానమే నేనే!!

స్వయంప్రకాశకమైన వస్తువుయొక్క (బ్రహ్మముయొక్క సారమే నేను సత్తు నేను! (త్రికాలాబాధ్యమైనది సత్తు.) ప్రపంచమన్నది లేని ఆత్మభావము నేనే! భయమన్నది నాకు లేదు!

ఇట్టిది - అట్టిది అని తర్కించుటకు వలనుగాని వస్తు వేది కలదో - అదే (బ్రహ్మమే) నారూపము! నేనమరుడను! 'ఇంత - అంత' అని కొలుచుటకు శక్యముగాని స్వరూపమేది యున్నదో - అది (బ్రహ్మము) నేను!

ఆనందపూర్ణమైన బోధము-జ్ఞానము-అదే నేను!!

శఙ్క రాభరణరాగః - మిశ్రతాళమ్‌

22. ఆనన్ద పూర్ణ - బోధో7హమ్‌.

ఆనన్ద పూర్ణబోధో7హం-

సచ్చి - దానన్ద పూర్ణ బోధో7హమ్‌.

1. సర్వాత్మచరో7హం పరినిర్వాణ

నిర్గుణ నిఖిలాత్మకో7హమ్‌

గీర్వాణవర్యానతో7హం కామ గర్వ

నిర్వాపణ ధీరతరో7హమ్‌ || ఆనన్ద||

2. సత్యస్వరూపో7హం వర శ్రుత్యన్త

బోధిత సుఖసాగరో7హం

ప్రత్యగభిన్నపరో7హం శుద్ధమన్తు

రహిత మాయాతీతో7హమ్‌ || ఆనన్ద||

3. అవబోధరససాగరో7హం వ్యోమ

పవనాది పఞ్చభూతాతి దూరో7హం

కవివర సుసేవ్యో7హం ఘోర భవసిన్ధు

తారక పరమ సూక్ష్మోహమ్‌| ఆనన్ద||

4. బాధిత గుణకలనో7హం

బుద్ధిశోధిత సమరస పరమాత్మాహం

సాధన జాతాతీతో7హం నిరుపాధిక

నిస్సీమ భూమానన్దోహమ్‌|| ఆనన్ద||

5. నిరవయవో7హ మజోహం

నిరుపమమహిమని నిహితమహితో7హం

నిరవధి సత్వఘనో7హం

ధీర పరమశివెన్ద్ర శ్రీగురుబోధితో7హమ్‌ || ఆనన్ద|

తాత్పర్యము:

ఆనందమునేను! జ్ఞానము నేను!! వెలితిలేని సచ్చిదానంద ములు నేను!!! నేను శివుడను!

సర్వుల ఆత్మయందును నేనున్నాను. (జీవులకు నానా త్వము ఆత్మకు ఏకత్వము) పరిపూర్ణమైన మోక్షము నేను. నేను నిర్గుణుడను! అందరియొక్క ఆత్మగాను ఉన్నది నేనే!

దేవవర్యులు నాకు మ్రొక్కుదురు. కాముని గర్వము నకు చెల్లుచీటి వ్రాసిన ధీరుడను నేను. (ఆత్మజ్ఞాన ముదయింప నంతవరకే కోరిక లుండును! ఆత్మజ్ఞాన సంపన్నునియందు కోరిక అన్నది పేరుకుగూడ మిగిలియుండదు. 'ఆత్మానం చేద్‌ విజానీయా దయ మస్మీతి పూరుషః, కిమిచ్ఛన్‌ కస్య కామాయ శరీర మనుసంజ్వరేత్‌.')

నిండుగా వెల్లివిరిసిన సచ్చిదానందములు నేను!

2. త్రికాలాబాధ్య వస్తువుగా బేర్కొనబడి అన్నిటి కంటెను బరమైన దేది కలదో - ఆవస్తువు - ఆబ్రహ్మము నేనే! శ్రుత్యంతములైన ఉపనిషత్తులు 'ఆనన్దం బ్రహ్మేతివ్యజానాత్‌' అని దేనిని సుఖరూపముగా వర్ణించుచున్నవో - ఆ అనంత సుఖసాగరమే నేను.

అన్నిటికిని లోనిదైన ఆత్మకంటె (ప్రత్యగాత్మ) వేరుకాని దైన పరబ్రహ్మము నేనే! నాకు పరసంపర్కము లేశమును లేదు. ఏవిధమైన క్లేశములును నాకు లేవు. నేను మాయాతీతుడను.

అంతటను నిండియున్న సచ్చిదానందములు నేను!

జ్ఞానరస సముద్రమే నేను! ఆకాశాది పంచభూతములకును నేను చాల దూరమందున్నాను.

మహాకవులు నన్నే సేవించుచున్నారు. (వారి కవితా వస్తువు నేనే) ఘోరమైన సంసారసముద్రమును దాటించు పరమ సూక్ష్మ వస్తువు - 'అణోరణీయాన్‌ 'మహతోమహీయాన్‌' అని కీర్తితమైన పరబ్రహ్మము నేను!

నిండుగా నంతటను బ్రకాశించు సచ్చిదానందములు నేను!

4. ఎచట సత్వరజస్తమస్సులు పూర్తిగా బాధింపబడునో - అనగా ఎచట నవి తల ఎత్తుటకు వీలు లేదో - ఆస్థానము పరబ్రహ్మము. అది నేనే!

శుద్ధమైన బుద్ధిచే 'ఇది కాదు - ఇది కాదు' అనుచు అన్ని టిని త్రోసివేయగా నెయ్యది త్రోసివేయుటకు వీలుకానిదై మిగిలియుండునో ఆ సమరసమైన పరమాత్మ నేనే!

సర్వమైన సాధన సామాగ్రికిని అవ్వల నేను ప్రకాశించు చున్నాను.

సాధకుడు బ్రహ్మనిష్ఠుడై ప్రకాశించుటకు నాల్గు సాధనములు ఆవశ్యకములని వేదాంతశాస్త్రములు తెలుపుచున్నవి. ఆసాధనములు 1. వివేకము, 2. వైరాగ్యము, 3. శమాది షట్కము 4. ముముక్షుత.

1. వివేకము :- బ్రహ్మవస్తు వొక్కటియే సత్యము, ఇతరమెల్ల అనిత్యమే, అసత్యమే అని ఒకదానినుండి వేరొక దానిని వేరు చేసి గ్రహించుట.

2. వైరాగ్యము:- దేహము మొదలు బ్రహ్మ (సృష్టికర్త) వరకైన సమస్తములైన భోగ్యవస్తువులయందును - ఏహ్యభావము - జుగుప్స - అనిష్టము - పరాఙ్ముఖత వైరాగ్యమన బడును.

3. శమాదిషట్కము :- శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ - సమాదానము, ఈఆరును శమాది షట్కమన బడును.

1. శమము:- అంతరింద్రియమైన మనసును అదుపులోబెట్టుట.

2. దమము:- జ్ఞానేంద్రియ కర్మేంద్రియ నిగ్రహము.

3. ఉపరతి :- మనసుయొక్క వృత్తి - శబ్దస్పర్శాది విషయముల ఆకారమును ధరింపకుండుట.

4. తితిక్ష :- సంభవించిన దుఃఖమును నివారించుటకు ఏ ప్రయత్నమును ఆచరింపక సహించుట.

5. శ్రద్ధ :- శాస్త్రమున గురువాక్యమున సత్యత్వబుద్ధి.

6. సమాధానము :- బుద్ధిని శుద్ధబ్రహ్మ పదార్థమున లెస్సగా నిలుపుట.

7. ముముక్షుత :- మోక్ష ప్రాప్తికైన తీవ్రేచ్ఛ.

(ఇట్లు చెప్పబడిన సాధనచతుష్టయముచే నేను (బ్రహ్మము) అనుభవింపబడుదునని భావము)

ఏ ఉపాధియునులేని సీమారహితమైన భూమానందము (బ్రహ్మానందము) నేను!

సచ్చిదానందములు నేను! శివుడు నేను!

5. నేనఖండుడను! నేనజుడను! సాటిలేని స్వీయమైన మహామహిమయందు సుప్రతిష్ఠితుడను నేను! నేను మహితుడను!

సురుటి రాగః - ఆదితాళమ్‌.

23. జయ - తుజ్ఞతరఙ్గే.

జయ తుఙ్గతరఙ్గే-

గఙ్గే - జయ తుఙ్గతరఙ్గే

1. కమల భవాణ్డ కరణ్డ పవిత్రే

బహువిధ బన్ధ చ్ఛేద లవిత్రే || జయ||

2. దూరీకృత జన పాప సమూహే

పూరిత కచ్ఛప గుచ్ఛ గ్రాహే|| జయ||

3. పరమహంస గురు భణిత చరిత్రే

బ్రహ్మవిష్ణుశఙ్కర నుతిపాత్రే|| జయ||

తాత్పర్యము:

1. మహాతరంగ పరిశోభితాగంగా! జయ! వివిధము లైన సంసారబంధములను ఛేదించు లవిత్రమవైన (కొడవలి) గంగా! తుంగతరంగా! జయ!

2. లోకుల పాతకములనెల్ల దూరమునకు తరిమివేయు గంగా! తాబేళ్లతో - వివిదజలచరములతో నిండియున్న తుంగతరంగా! జయ!

3. పరమహంసలైన గురువులచే (సదాశివబ్రహ్మేంద్రుల గురువులు) కీర్తింపబడిన చరిత్రకల గంగా! బ్రహ్మ, విష్ణు - మహేశుల సన్నుతికి పాత్రమవైన ఓభాగీరధీ! జయ!

(ఉకలు పెట్టివచ్చుచున్న బ్రహ్మజ్ఞాన ప్రవాహమే గంగ!) (ప్రతికీర్తనలోను హంస - పరమహంస శబ్దములచే గీర్తింఊపబడినవారు శ్రీపరమశివేంద్రసరస్వతీ మహాస్వామి - సదాశివబ్రహ్మేంద్రుల గురువులు)

జయో7స్తు శ్రీసదాశిబ్రహ్మేన్ద్రస్వామిభ్యః

విజయో7స్తు తద్గురుభ్యః

శ్రీపరమశివేన్ద్ర సరస్వతీ మహాస్వామిభ్యః

శుభంభూయాత్‌

శ్రీ సదాశివ బ్రహ్మేంద్రులు

రచించిన

అద్వైత వేదాంత కీర్తనలు

సంపూర్ణము.

Sri Shiva manasika pooja stuthi    Chapters    Last Page