Upanyasamulu    Chapters   

అ ద్వై త ము.

మన మతమున కంతయు వేదము మూలాధారమైయున్నది. ఆవేదముల యంత్యభాగమున కుపనిషత్తులనిపేరు. వానిలో ప్రపంచస్వరూపము. అత్మతత్త్వము మొదలగు విషయములు విమర్శింపబడియున్నవి, శ్రీశంకరులవారు ఆ ఉపనిషత్తులకు వ్యాఖ్యానమొనర్చి అందతి నిగూడార్థములను చాలవరకు లోకమునకు వెల్లడించియున్నారు. పురాణములు. ధర్మశాస్త్రములు ఇతిహాసములు, గీతలు వీటినన్నిటిని ఏకవాక్యమొనర్చి చూచినచో ఉపనిషత్తుల తాత్పర్యము స్పష్టమగును. ప్రపంచమునందెల్ల సత్యపదార్థమొకటున్నది. అది యద్వైతము. వ్యవహారమున నానాగా అగుపడుటను వ్యావహారిక సత్యమనినారు కాని పారమార్థిక సత్యమొక్కటే. అదియే బ్రహ్మపదార్థము. దానినే శంకరులు విశదీకరించిరి. 1500 సంవత్సరములనుండియు నేటివఱకు మన దేశమునందా సిద్ధాంతము ననుసరించియే అనేకులు అనేక తత్త్వముల విశదీకరించినారు. ఆ మతమే ఉపనిషద్భాష్యము మొదలు భజగోవింద శ్లోకములవఱకును శంకరులు విపులీకరించిరి. శ్రీ విద్యారణ్యులుగారు మత జీవితమునంతయు అద్వైతతత్త్వము నకర్పించిరి. బీహారు ప్రాంతవాసులగు వాచస్పతి మిశ్రులను వారు 'భామతి' అను తన భార్య ముఖమునైనను చూడక అద్వైతతత్త్వమును విచారించినారు. కడపట 'భామతి' తనగతి యేమని ప్రార్థింప తన గ్రన్థమునకు ఆమెపేరుపెట్టినారు. వారి మేథనంతయు శంకరసిద్ధాంతమునకే యర్పించిరి. వేదాన్తదేశికులు రామనుజాచార్యులు, మధ్వాచార్యులు, మున్నగువారందరును కొన్ని కొన్ని సవరణలతో ఆ మతమునే యంగీకరించిరి. వైష్ణవులు తమ మతమునకు విశిష్టాద్వైతమనిపేరు పెట్టినారు. మధ్వలు తమమతమును ద్వైతమని వ్యవహరించినారు. భట్టభాస్కరులను వారు ద్వైతాద్వైతము, భేదాభేదము అని కొన్ని యభిప్రాయముల వెల్లడించినారు. కాని ఆ మతము విశేష ప్రచారమునకు రాలేదు. వారు చాల బుద్ధిమంతులు. వారు సత్యమగుపదార్థమొకటున్నదనియే నంగీకరింపలేదు. బీజమునందొకవిధమగు శక్తి యుండునట్లు జీవునకొక శక్తి యున్నదనినారు. అందుకై చాలగ్రన్థములనుకూడా రచించినారు. పద్మపాదులు, సురేశ్వరులు, అప్పయ్యదీక్షితులు ఎన్ని గ్రన్థములు వ్రాసిరో వానినెల్ల వ్యాసరాయలు జయతీర్థులు, అను వారిద్దరు ఖండించి పెక్కు పుస్తకములవ్రాసిరి. వారిగ్రన్థములపై వీరిద్దరును అనేక ఆపత్తులనిచ్చినారు. మధ్వతమస్థులు "మనకంటికగపడునదంతయు సత్యము. మనకేది అగుపడుటలేదో ఆ పదార్థములేనేలేదు. అందుచే అద్వైతములేదు" అని చెప్పిరి. మన అద్వైత సిద్ధాంతపక్షమున అద్వైతసిద్ధి అను ఉద్గ్రన్ధము కలదు. అందొకవిచారము చేయబడియున్నది. పరమాత్మసత్యము ప్రపంచము సత్యముకాదు. అనుపక్షమున ప్రపంచము సత్యముకాదనిన అర్థమేమి? మిథ్య అని చెప్పవలెను. అట్లయిన ప్రపంచమున మిథ్యాత్వమున్నదని చెప్పినట్లయినది, మిథ్యాత్వమొక ధర్మమం%ు, అయిన ఆధర్మము సత్యమా? మిథ్యయా? బ్రహ్మ కన్న యితరమగు పదార్థమెల్ల మిధ్యకాబట్టి ఈ ధర్మముకూడా మిథ్యయే అను పక్షమున మిథ్య అను ధర్మము మిధ్యఅనగా అబద్ధమైనదని చెప్పినట్లయినది. అబద్ధము అబద్ధమైన ఏమగును?నిజమగును. కాబట్టి అద్వైతమతమునందు అగతికముగ ప్రపంచమును సత్యమనియే అంగీకరించవలెను. అప్పుడు అద్వైతము కుదురదు. అని పూర్వపక్షము నాశంకించి.

సమాధానముగా:- మనకిప్పుడు ప్రపంచమునందగు పడుపదార్థములన్నియు సత్యములుకాదు. ఒక్క బ్రహ్మపదార్థము మాత్రము సత్యము. ఇందులకు స్యప్నమే దృష్టాంతము. మానవుడికి జాగ్రదవస్థ, స్వప్నావస్థ, సుషుప్త్యవస్థ, అని మూడు అవస్థలుకలవు. ప్రపంచవ్యవహారము కొఱకు జాగ్రదవస్థ అవసరము శ్రమ పరిహారముకొఱకు సుషుస్త్యవస్థ అవసరము. స్వప్నావస్థయెందులకు? ఇది అజాగళస్తనమువలె నిరుపయోగమా? లేక భగవంతుడు మూడవ అవస్థను సృష్టించుటయందేమేని ప్రయోజనముకలదా? అని విచారించిన ప్రపంచము సత్యముకాదు. అబద్ధముఅను ఉపనిషత్సిద్ధాంత ప్రతిపాదనకొఱకే స్వప్నావస్థ ఏర్పఱుపబడినదని చెప్పవచ్చును. మనము స్వప్నమున కోటికోటి పదార్థములను చూచుచున్నాము. మేలుకొనినతరువాత ఆపదార్థములంతయు నేమైనవి? అంతయు మిథ్య. ప్రపంచమంతయు నంతియే. మనకువిపరీతభావనయున్నది. అదిపోయి ప్రపంచముమథ్య అను జ్ఞానముకలిగినగాని పరమార్థము స్ఫురించదు. అది స్ఫురించినప్పుడు ప్రపంచములో మథ్యఉన్నదా? అదిమిధ్యయా? ఇది మిథ్యయా? అను జ్ఞానమువలన కలిగినదనవలెను. అప్పుడు అసత్యమునుండి సత్యముపుట్టుటకు వీలున్నదా? అను ప్రశ్నవచ్చును. అందులకు శ్రీ శంకరభగవత్పాదులు మిథ్యనుండి సత్యమువెలువడుట కవకాశమున్నదని చెప్పినారు. అందుకొక దృష్టాంతము చెప్పెదను.

ఒకనికి స్వప్నములో పులి తరుముకొనివచ్చినది. భయపడి పరుగిడినాడు. తత్తరపడినాడు. ఏమియు తోచలేదు. నోట మాటరాలేదు- అవస్థపడుచున్నాడు- గుండె తటతట కొట్టుకొనుచున్నది- దేహమంతయు చెమటపట్టినది. ఇంతలో మెలకువవచ్చినది. వ్రాఘ్రమున్నదా? లేదు. గుండెకొట్టుకొనుట చెమటపట్టుటలేదా? ఉన్నది. దీనిని గనుక తిప్పినట్లయితే యిక్కడ అసత్యమైనది. అక్కడ సత్యముకావచ్చును. వ్యాఘ్రము మిథ్యకాబట్టి భయముకూడా మిథ్యయే అనవచ్చునా? ఇదెప్పుడుగాని దానిని బాధించదు. అసత్యమగుపులివలన నిజమై కంటికగపడుభయము, గుండెదడ, చెమటకలిగినట్లుగా ప్రపంచము మిథ్య అను జ్ఞానము వలన సత్యమగుపదార్థము స్ఫురించుననుట యందసత్యములేదు. ఇప్పుడు నేను చెప్పిన ఈవిషయమంతయు స్థూలముగ చెప్పబడినది. కాబట్టి రంధ్రములు బహుళములుగ నుండవచ్చును.

------

Upanyasamulu    Chapters