Upanyasamulu    Chapters   

సంస్కృతమనగా నేమి?

భాషల కనేకముగా దేశాన్నిబట్టి పేరు వచ్చుచుండును. సాధారణంగా ఒకదేశానికి, ఆదేశంలో వాడబడు భాషకు ఒకే పేరుఉంటుంది. తెలుగుదేశం తెలుగుభాష, తమిళ##దేశం తమిళ భాష, కన్నడదేశం కన్నడభాష, ఓఢ్రదేశం ఓఢ్రభాష, ఇట్లే అంతటాకూడాను. ఇక ఖండాంతరాల్లోకూడా గ్రీక్‌ దేశం గ్రీక్‌ భాష, ఫ్రెంచిదేశం ఫ్రెంచిభాష, ఆవిధంగానే ఉంటుంది. మన దేశంలో రామేశ్వరం మొదలు హిమాలయపర్యంతంఉండే అన్ని దేశాల్లోకూడా, సర్వజనులకలవాటులేక, పండితలోకంలోమాత్రం అలవాటుగా ఉండుభాష సంస్కృతము ఈభాష సాధారణ జనుల వాడుకలో లేకపోయినప్పటికిన్నీ, 100 కి 30 పదములీ భాషని తత్సమరూపంగానో, తద్భవరూపంగానో, భాషాంతరములందు కలసియేయున్నవి. పూర్వమాభాష తెలిసినవారు ఊరికి ఇద్దరైనా ఉండేవారు. ఇప్పుడు కూడా ఆవిధంగానే ఉన్నారని చెప్పవచ్చును- ఈసంస్కృతము సర్వదేశాల్లోవుండుట నుబట్టి దానికొక దేశాన్నిబట్టి పేరురాలేదు. అయితే ఈభాషను గూర్చి మనవారభిప్రాయమేమి? అను విషయమునుగూర్చి చెప్పదలచినాను.

ఇంగ్లీషువారు మొదట మనదేశమునకొచ్చినపుడు వారిలో కొందఱు ప్రాచీన శాసనాలనుగూర్చి పరిశోధించినారు. మరికొందరు. బంగారు, ఇనుము, మొదలగు ధాతువులనుగూర్చి విమర్శించినారు. ఇక కొందరు మతవిషయములనుగూర్చి శోధింపమొదలిడినారు. వారు ఆయావిషయాలలో చాలామట్టుకు పాటుబడినారు, కొంతకుకొంత సాధించగలిగినారు. అట్లనే వారిలోకొందరు భాష, కవులు, అలంకారములు, ప్రాచీన నవీనభావములు వీటినిగురించికూడా పరిశోధింప మొదలుపెట్టినారు. అట్లా విమర్శించేవారినే ఇగ్లీషులో ఓరియంటలిస్తులనెదరు. వారనేక పుస్తకములను వ్రాసినారు. వారీభాషనుగురించి ఒక విధమగు అభిప్రాయపడ్డారు. అది బి.ఏ., యం. ఏ చదివినవారి కంతా తెలిసియేవుంటుంది. ఆపుస్తకా లాయాపరిక్షల్లో ఉంటవికాబట్టి. అయితే ఆఓరియంటలిస్టులలోకూడా ఈభాషనుగురించి అభిప్రాయభేదములు చాలాఉన్నవి. దాని నిర్ణయము చేయవలసిన భారము విమర్శకులందున్నది. కాబట్టి గ్రన్థములయందేమున్నది?అను విషయమునే చర్చింతము.

సంస్కృతమనగా సంస్కారముపొందినది అనిశ ఆబ్దము వలన మనకర్థమగును. అయితే సంస్కారమనగానేమి? అనిమనము మొదట విచారించవలెను. ఈ సంస్కారపదమునకు శంకరులొకచోట 'పదార్థమునకుండు దోషముల తీసివైసి గుణముల కల్పించుటే సంస్కారము' అని నిర్వచనము చేసియున్నారు. దీనినే.

'గుణాధానం, దోషాపనయనమ్‌' అని చెప్పుదురు. ఒక ఇట్లు పాడుబడియున్నదనుకొనుడు అప్పుడు మనమాఇంటిలో నుండు బూజును తుడిపింతుము, పెంటనంతయు చిమ్మింతుము, సున్నమును కొట్టింతుము. ఇప్పుడాయింటికి మనము బూజును దులింపుచుటే దోషాపనయనము. సున్నమును గొట్టించుటే గుణధానము. ఇదే ఆయింటికి సంస్కారము. బ్రాహ్మణ, క్షత్రియులకు 48 సంస్కారము లవసరమని శాస్త్ర కారులు చెప్పినారు. అందు దయ, సత్యము, మొదలగునవి 8 ఆత్మగుణములు, తక్కిన 40 కూడా శాస్త్రవిహితములగు గర్భాదానాది సంస్కారములు. అక్కడి సంస్కారపదమునకు కూడా ఇదే అర్థము. అయితే ఈభాషకు సంస్కృతమనిపేరు ఉండుటబట్టి దీనికి పూర్వమేదో రూపముండినదనియు, దానినెవరోకొందరు శుద్ధమొనర్చిరనియు తెలియుచున్నది. కాబట్టి ఆపూర్వావస్థకే ప్రాకృతమనిపేరు. ఆ ప్రాకృతభాషయే సంస్కారమును పొందుటచేత సంస్కృతమని వ్యవహరింపబడుచున్నది. అని ప్రాచ్యభాషావిదులు చెప్పుచున్నారు. కాళిదాసాదులు వ్రాసిన నాటకములలో బ్రాహ్మణులు, క్షత్రియులు, తప్ప తదితర పాత్రలకును స్త్రీ పాత్రలకును ప్రాకృతమే వాడబడియున్నది. బ్రాహ్మణాదివర్ణములవారుగాని, విదగ్ధులుగాని మాటలాడవలసివచ్చిన సంస్కృతము ప్రయోగింపబడినది. దీనినిబట్టి మొదట సర్వసాధారణముగా ప్రాకృతమనేభాష ఉండినదనిన్నీ, రానురాను అదియే ఒకవిధమగు సంస్కారమును పొందుటచేత సంస్కృతమని వ్యవహరింపబడుచున్నదనిన్నీ, కాబట్టి మొదటిభాష ప్రాకృతము, తర్వాతది సంస్కృతము అని విమర్శకులభిప్రాయపడుచున్నారు- కాని ఈభాషావిషయంలో మనవారేమి అభిప్రాయపడుచున్నారనగా:- ప్రాకృతభాష మగధి, శౌరసేని, పైశాచి, అని ఆఱువిధములుగానున్నది. ఆ పైశాచికభాషాతద్భవములే నేడు వ్యవహరింపబడుచుండు హిందీభాష, మహారాష్ట్రభాష, మొదలైనవి. మాగధినుండి పుట్టినదే పాలీభాష, బుద్ధమతమంతయు పాలీభాషయందున్నది. బుద్ధుడు, వారిమతస్థులు అందరుకూడా పాలీభాషలోనే వారిమతాన్ని ప్రచారంచేసినారు. అయితే బుద్ధుడు రాకముందు మగధదేశమున మాగధి రూపమగు ప్రాకృతభాషయే వాడుకలోనుండినదని చెప్పవచ్చును. ప్రతిభాషలోకూడా గ్రాంధికమని గ్రామ్యమని రెండువిధములుంటవి. అట్లనే తెలుగులోకూడా ఉన్నవిగదా! నాటకములలో నుత్తమపాత్రలకు గ్రాంథికభాషను వాడెదరు. అధమపాత్రలకు గ్రామ్యమును వాడెదరు: కాని మనమెవరిని గ్రాంథికులని వ్యవహరించుచున్నామో వారుకూడా నిత్యవ్యవహారములో గ్రామ్యమునే మాటలాడుచున్నారు. అయితే (మహామహోపాధ్యాయ) కొక్కొండ వేంకటరత్నంవంతులుగారు మాత్రం ఎప్పుడుకూడా గ్రాంధికమే మాట్లేడేవారని చెప్పుచున్నారు. అట్లే సంస్కృతంలో కూడా కొంచము వ్యుత్పన్నులుగా నుండువారి కందఱకును సంస్కృత భాషనే నాటకములయందుపయోగింతురు. అటువంటి సంస్కృతభాషనే నాటకములయందుపయోగింతురు. అటువంటి సంస్కృతముయొక్క చితికిన అరిగిన రూపమే ప్రాకృతము అని చెప్పినారు. భాషా విమర్శకులు మొదట ప్రాకృతముండి అదియే ఒకవిధమగు సంస్కారమంది సంస్కృతమని వ్యవరింపబడుచున్నదన్నారు. మనవారుమాత్రము మొదట సంస్కృతమే ఉండినది, అదే కాలక్రమముగ, అరిగి అరిగి, చితికి చితికి, ప్రాకృతరూపమునకూడా పరిణమించినది అని చెప్పుచున్నారు. ఈఒక్కవిషయమేకాదు. అనేక విషయములలో మనప్రాచీనులకును ఆ ఓరియంటలిస్టులకును భావభేదములుకలవు. రామాయణము ముందా? భారతము ముందా? అని ఒకవిచారము. మనవారేమో రామాయణమే మొదటపుట్టినది, భారతము వెనుక వచ్చినది అనిచెప్పి రామాయణణు నాదికావ్యమనికూడా వ్యవహరించుచున్నారు. కాని వారట్లుచెప్పరు. మొదట భారతముపుట్టినది, వెనుక రామాయణ మొచ్చినదందురు. భారతమందలి భాషవేదభా,ననుకరించుచున్నది. రామాయణమందలి భాషతేటగా ఇప్పటికి శైలిని దగ్గరదగ్గరగా అనుకరించుచున్నది. కాబట్టి భాషా శైలినిబట్టిచూచిన భారతమేముందు, తర్వాతనే రామాయణము అని చెప్పుదురు. కాని భారతమున రామాయణకథ ఉన్నది. రామాయణమున భారతకథయేలేదు.

సాధారణముగా ఏభాష అయినప్పటికిన్నీ 500 మైళ్లు దాటితే దాని రూపం మారుతుంది. ఇప్పుడు నాయుడుపేట దగ్గరనుండి బరహంపురంవరకు ఒకే తెలుగుభాష ఉన్నప్పటికిన్నీ వ్యవహారంలో అనేకమార్పులున్నవి. అయినా నిత్యవ్యవహారంలో ఒకరిభావాలను మరొకరు తెలుసుకొనవచ్చును. కాని అంతకుమించితే ఈ భాషవలన లాభంలేదు. అక్కడనుండి ఇంకొక విధమగు భాష వ్యవహారమునందుండును. కాని మన సంస్కృతముమాత్రము ఆవిధముగా ఒకదేశమును పురస్కరించుకొని వచ్చియుండలేదు.

భాషను విమర్శించు శాస్త్రమునకు వ్యాకరణమనిపేరు. ఆవ్యాకరణముకూడా ఐంద్రవ్యాకరణమనీ, చాంద్రవ్యాకరణమని, హనుమద్వ్యాకరణమనీ, ఈవిధంగా తొమ్మిదివిధములున్నవి. కాని వాటిలో పాణిని వ్యాకరణమే ముఖ్యమైనది. ఆవ్యాకరణమునుబట్టియే భాషాంతరములలోగూడా వ్యాకరణములేర్పడినవి. దానికే పతంజలిమహర్షిగారు భాష్యమును వ్రాసినారు. దానికే మహాభాష్యమనిపేరు. ఆఱుశాస్త్రములున్నవిగదా? వాటిలో ఏ భాష్యమునకుగాని 'మహా' అనేశబ్దము లేదు. సంస్కృతమున పతంజలి మహర్షిరచించిన భాషాశైలి భాషాంతరములలో లేదనిచెప్పవచ్చును. కాని శ్రీశంకరుల భాష్యముదానికి సమానమని చెప్పవచ్చును. పద్యములు వ్రాయుటలో కాళిదాసు మహాకవి శ్రేష్ఠుడు. గద్యములో పతంజలి గొప్పవాడు. కాని గద్యపద్యములో రెంటిలోకూడా శంకరాచార్యులవారు గొప్పవారని చెప్పవచ్చును. అటువంటి మహాభాష్యములో పతంజలి మహర్షిగారీ భాషనుగూర్చి,

సంస్కృతంనామ దైవీవాక్‌

అనిచెప్పినారు. లోకములోశబ్దాన్ని అనుసరించిలక్ష్యమువ్యచ్చినదా లక్ష్యముననుసరించి శబ్దములువచ్చినవా? దక్షిణదేశమున వ్యాపారస్తులలోకొన్ని సాంకేతిక శబ్దములున్నవి. అవన్నీకూడా లక్షణాన్ని బట్టి లక్ష్యములేర్పడినవి. కాని సామాన్యభాషలో చూచినట్లయితే, ముందు లక్ష్యములుండినట్లును వెనుకనే లక్షణములు ఏర్పఱుపబడినట్లును తెలుస్తుంది. మహాభాష్యకారులు తమ శాస్త్రమున లక్ష్యమనగా ఎక్కడ అని విచారించుటలో మన వేదములను శాస్త్రములను, అన్నిటినికూడా ప్రమాణంగా అంగీకరించినారు. ఇంకాకూడా ఈ లోక శబ్దములేకాదు. మనకు దేవలోకమని ఒకటున్నది. మనలోకానికి, ఆ లోకానికి సంబంధమున్నది. ఈ నెల్లూరికి మద్రాసునకు సంబంధమున్నది. దాని కింకొక రాజధానితో సంబంధమున్నది. దానికింగ్లాండుతో సంబంధమున్నది. అయితే ఈ అన్యోన్య సంబంధం ఈ లోకంతోనేగాదు. మనకు ఎండకావలసియున్నది. వాన కావలసియున్నది. గాలి కావలసియున్నది. వాటిని అచేతన పదార్థాలని అనుకోకూడదు. వాటితో కూడా మనముసహకారమును పొందవలెను. గవర్నమెంటువారిప్పుడు మనకు కొన్ని శక్తులనిచ్చినట్లుగా భగవంతుడాదేవతలకుకూడా జ్ఞాన, ఐశ్వర్య, బల, వీర్యములను నాలుగు శక్తులనిచ్చియున్నాడు కాబట్టి మనమువారికి సహాయముచేస్తేనే వారు మనకు సాహయముచేసెదరు. దీనినే గీతలో

'పరస్పరం భావయన్తః శ్రేయఃపర మవాప్స్యథ'

అని కృష్ణుడు బోధించినాడు. అట్లెప్పుడు అన్యోన్య సహకారముతోనుందుమో నాడే మనకు క్షేమముకలుగును, అన్యోన్య సహకారమంటే ఏమిటి?

అన్నాద్భవన్తి భూతాని పర్జన్యా దన్నసంభవః

యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మసముద్భవః.

అనగా మనము మన క్షేమానికోసరము వేద విహితములగు యజ్ఞయాగాది కర్మకాండ నాచరింపవలెను. అప్పుడు దేవతలు తృప్తులై మన క్షేమంకొఱకు వర్షమును కురిపించెదరు. ఆ వర్షం వల్ల భూమిలో పైరులు చక్కగపండి అన్నము కలుగుతున్నది ఆ అన్నమువలననే సమస్త భూత ప్రపంచ ముద్భవించుచున్నది. ఈ విధముగా మనము వారికి సహాయంచేస్తే వారు మనకు సహాయముచేసెదరు. ఇదే పరస్పర సహకారము. దీనిని మనమెప్పుడును మరువరాదు.

ఆ దేవతలు వ్యవహరించే భాషకే సంస్కృతమని పేరు. దానినే

"సంస్కృతంనామ దైవీవాక్‌" అని పతంజలి చెప్పినాడు.

ఈ సంస్కృత భాషావిషయములో వైయాకరణులకును, మాంత్రికులకును కొంచమభిప్రాయ భేదమున్నది. సంస్కృత భాష క్రొత్తదికాదు. కాని ఆ ఉన్నభాషయే వాడుకవలన అరిగిపోయినప్పుడు ప్రకృతి ప్రత్యయ విభాగములచేసి ఒక విధమగు కట్టుదిట్టమును చేయుటబట్టి దీనికి సంస్కృతమనిపేరు వచ్చినదని వైయాకరణులు చెప్పుదురు.

ఇప్పుడొకభాషను దేశభాషగ చేయవలనంటే అంతకు ముందుగనుండొక భాషను దేశమునుండి తరిమివేయవలెను. అది తప్పదు. అందుచేతనే నేడు మద్రాసులో నిర్బంధహిందీ విధానముకొఱకై ఎంత ఆందోళన జరుగుచున్నదో మీకు తెలిసియే యున్నది. భాషావిమర్శకులీ సంస్కృతమును డెడ్‌ లాంగ్వేజి (మృతభాష) అని అన్నారు. ఈ సంస్కృతం వాడుకలో అనగా నిత్యవ్యవహారములోలేదు కాబట్టిమృత భాషంటున్నారు. కాని నా అభిప్రాయములో ఏ భాషవాడుకలో వుంటుందో ఆ భాష చచ్చిపోతుంది. 2 వేల సంవత్సరాలకొకమారు భాషలో మార్పుకలుగుతూవుంటుంది. రెండవేల సంవత్సరములక్రిందనుండు భాషయే ఇప్పుడున్నదని చెప్పలేము. ఓల్డు (ప్రాత) ఇంగ్లీషు ఇప్పుడర్థమగుటలేదు. అట్లనే ఇతరభాషల్లో కూడాను. అందుచే ఆ సంస్కృతమే గనుక దేశభాషగనుండినపక్షమున కొన్నివేల సంవత్సరముక్రిందట సంస్కృతమున వ్రాసిన మనమహర్షుల భావము లిప్పుడు మనకర్థమయ్యేవేకావు. అందుకు వ్యావహారిక భాష కాలపరిణామమువలన మారుతుండుటయే కారణము. కాబట్టియే ఆ భాష సర్వసాధారణ భాషగా కొద్ది మంది వ్యవహారింలోనే వుంది. అయినాదాన్ని ఎక్కువగా రక్షించవలసిన భారము మన యందున్నది. అదెప్పుడైన వాడుక భాషగనుండినదా?అనినచో దేవలోకమున దేవతల వ్యవహారమునందున్నది. అందుకనే దానిని దేవభాష అని వ్యవహరించుచున్నారు. మనము దేవకార్యములు చేయునపుడు సంస్కృతభాషలోనే చెయ్యవలెను.

దేవతలకు తెలిసిన భాష సంస్కృతము కాబట్టి మనము వారి ప్రీతికొఱకు కార్యములు చేయవలసివచ్చినచో వారికర్థమగు భాషయందే చేయవలెను. అప్పుడే మనకు కర్మానుగుణమగు ఫలము సంప్రాప్తమగును. ఇప్పుడు మనకు ఇంగ్లీషువారు ప్రభువులుగనున్నారు. వారు న్యాయస్థానముల నిర్మించినారు. వాటిలో ప్రజలభావముల ప్రభుత్వమునకు తెలుపుటకుగా వారి భాషనేర్చిన ప్లీడర్లను నియమించినారు. అంటే ఎవరికి ఏ భాషతెలిసివుండునో వారినిగురించి వ్యవహారముల జరుపవలసి వచ్చినచో మనముకూడా ఆ భాషనే ఉపయోగించవలెను. అటువంటి సర్వోత్కృష్టభాషలో నుత్త మతత్వములు చెప్పిన సర్వదేశములవారికి సర్వకాలములలోనుపయోగపడునని మన ప్రాచీనులభిప్రాయపడినారు. ఈ భాషలోనున్న పరిపూర్ణ వ్యాకరణము భాషాంతరములలోలేదు. మన జ్యోతిశ్శాస్త్రములో హోరా శాస్త్రమని ఒక శాస్త్రమున్నది. అందు 'అహోరాత్రము' అనుశబ్దము, అకార, తకార, రేఫలు సైలంటు అయి 'హోరా' అని ఉచ్చిరింపబడుచున్నది. దానినే ఇంగ్లీషులో Hour అన్నారు, ఆ హోరాశబ్దమందలి ఓకారము సైలంటయి 'అవర్‌' అని వచ్చినది. అయితే సంస్కృతంలో ఆ పదమునకు ప్రకృతి ప్రత్యయ విభాగము చక్కగనున్నది. ఇంగ్లీషులో అటువంటి అర్థమున్నదనికూడా వారెఱుగరు. ఇక మన్త్రశాస్త్రములో ఈ సంస్కృతభాషను గూర్చి ఏమని అభిప్రాయ పడ్డారనగా.

మన అభిప్రాయములను ఇతరులకు అందివ్వడానిగ్గా వర్ణములేర్పడినవి. అటువంటి అక్షరముల నుచ్చరించవలయునన్న కొన్నినాడుల సంబంధమవసరము. దానికి కొంతవాయుసంచార మవసరము. కొన్నినాడుల సంచలనమువలన మనకుకామము కలుగుచున్నది. కొన్నినాడుల సంచలనమువలన దుఃఖము, కొన్నినాడుల సంచలనమువలన సంతోషము, మరికొన్నినాడులవలన పిచ్చి, ఇవన్నీ కలుగుతున్నవి. కొందరికీకాలంలో ఉదయాన్నే కాఫీ పానంవలన చిత్తమునకు డిప్రెష9 తొలగుతున్నట్లు కొన్నినాడులనుండి ఉచ్చరించబడు వర్ణములవలన మన మనస్సునకుగల వికారములు తొలగి శాంతి, ఆనందంకలుగుతుంది. అటువంటి అక్షరోచ్చారణమును కలుగజేయునాడి చలనము, అటువంటి అలవాటు కలుగజేసుకొనుట ప్రతివారికవశ్య కర్తవ్యమని మంత్ర శాస్త్రవేత్తలు 'ఏవిధమగునుచ్చారణచేయుటవలన మనకు శాంతనాడీచలనముకలుగునో అటువంటివర్ణములుగల భాషయే సంస్కృత' మని చెప్పినారు. అందు అకారాది క్షకారాంతముగల 50 వర్ణములకే ప్రత్యాహారముగ అక్షరములని పేరువచ్చినది. జపమాలికలకు 'అక్షమాల' అనికూడా వ్యవహారమున్నది. సంస్కృతమందలి 50 వర్ణములుకూడా మాతృకగా సరస్వతి రూపములు. అటువంటి లోకోత్తర సంస్కారము ఈ భాషయందలి వర్ణములకుండుటంబట్టియే దీనికి సంస్కృతమని వ్యవహారమొచ్చినదనిచెప్పినారు. ఆ వర్ణసముదాయములో వైదిక లౌకిక మంత్రములనేకములున్నవి. వాటిని విద్యతో అనగా అర్థజ్ఞాన పురస్సరముగా నుపాసనచేసిన వీర్యవత్తరమగునిని చెప్పినారు. దీనివలన విద్యతోచేస్తే వీర్యవత్రమౌతుంది. లేకుంటే వీర్యముకలది అవుతుంది. అంతేగాని నిష్ఫలమెప్పుడునుకానేరదు. అను అర్థమేర్పడును.

నా అభిప్రాయములో మంత్రములకు తెలిసీ తెలియక విపరీతార్థముల గ్రహించుటకన్న అర్థము నెఱుగక నుపాసించుట యేమంచిది. ఇందుకొక దృష్టాంతము. ఒక యోగ్యుడైన కలెక్టరున్నాడనుకొనుము. ఒక రైతుకు చాలాకష్టంకలిగింది. కలెక్టరుగారితో మనవిచేసుకుందామిని వచ్చినాడు. వాడికి ఇంగ్లీషు రాదు. అందుకోసరము ఒక ప్లీడరువద్దకుపోయి వాడికష్టనిష్టురములనంతా ఇంగ్లీషులో పిటిషను రూపమున వ్రాయించినాడు. దానిని రైతు తీసుకొని వెళ్ళి కలెక్టరువద్ద ఇట్టి తన కష్టముల బావుకొనుచున్నాడు. అయితే ఆ కాగితమున వ్రాయబడిన విషయము రైతుకు తెలియునా? లేదు. అయినప్పటికిన్ని ఎవరివద్ద %ీ కాకితమిచ్చుచున్నాడో వాడికి అందలి అర్థము తెలియును. కాబట్టి వాడు సమీహితార్థమును పొందుచున్నాడు. ఆ విధంగానే మనకు ఆ మంత్రార్థము తెలియకపోయినప్పటచికిన్ని ఎవడినిగురించి మనము ఉపాసనచేయుచున్నామో వాడికి దాని అర్థము తెలియును. కాబట్టి మనలో కొన్ని లోపములున్నా సవరించి అందుకు తగిన ఫలమును మనకిచ్చితీరును. అయితే అందుకు శ్రద్ధాభక్తులు ప్రథానములు. మంత్రక్రమము పరిశుద్ధముగానుండవలెను. వారమునకొకమారో, పక్షమునకొకమారో తనకు తీరుబడిఉండినప్పుడు పండితులవద్దకు వెళ్ళిదానిఅర్థమును తెలిసికొనవలెను. మన జీవితములో నొక మంత్రము నైనను అర్థపురస్సరముగ శ్రద్ధాభక్తులతో నుపాసనచేసిన కడతేరుట కుపాయమగును. అప్పుడు ఆమంత్రోచ్చారణచేత నాడీశుద్ధికలుగుతుంది, దానివల్ల చిత్తముశాంతి పొందుతుంది. అప్పుడేనిజమైన ఆనందాన్ని జీవుడు అనుభవించును. ఇదే సంస్కారము, ఇదే సంస్కృతము. అయ్యదియే సర్వమానవులకు జ్ఞేయము.

-----

Upanyasamulu    Chapters