Kamakoti   Chapters   Last Page

 

15. పిల్లలకు పెద్దలకు

యువతులకు యువకులకు

పిల్లలకు

ఇది సత్యయుగమనకు చెందిన కధ, కృతయుగమునకే సత్యయుగమని పేరు. ఆనాడు ధర్మము నాలుగుపాదములతో నుండునని యొక విశ్వాసము. కాని ఏదో దోషమువలన కరువు వచ్చెను. రాజు అధర్మముగ పరిపాలించిన దుర్భిక్షము కలుగునని చెప్పుదురు. వర్షాలు లేకపోవుటచే పంటలు లేవు. పశువులకు గడ్డి లేదు, అదేవిధమున మరుసటి సంవత్సరమునకూడ వాన కురియలేదు. ప్రజల కష్టములు అధికమయాయి. నదులు చెరువులు యెండిపోయినవి. సూర్యుడు తన వేడి వేడి కిరణములద్వారా భూమిని రసహీనముగా జేసెను. చెట్లు చేమలు ఎండిపోయినవి. మహావృక్షములు మోడులైనవి. మానవులలో, పశుపక్ష్యాదులలో హాహాకారములు బయలుదేరెను.

కరువు పెరిగిపోవుచుండెనుగాని తరగలేదు, ఒక యేడు కాదు రెండేళ్లు కాదు, పూర్తిగా పన్నెండు సంవత్సరాలు అనావృష్టి కలిగెను. దానినే ద్వదశవర్ష క్షామమని పిలుతురు. ప్రజలు త్రాహి త్రాహి యను చుండిరి. అన్నములేదు. నీరు లేదు, గడ్డిగాదలా లేవు, వానలు లేవు, పంటలులేవు, చల్లదనమేలేదు. అంతటా వేసవికాలము తప్ప తక్కిన ఋతువులు లేవు, వేడిగాడ్పులు, ఆగాలి కెగురు ధూళి భూమండలమున నిండెను. ఆకాశమున పక్షిసంచారముచే శూన్యమయ్యెను. పశుపక్ష్యాదులేకాక ఎంతమంది మానవులు మృత్యుముఖమున ప్రవేశించిరో లెక్కలేదు. తల్లుల రొమ్ములలో పాలు లేక పోవుటచే ఎందరు సుకుమారులైన శిశువులు చనిపోయిరో ఎవ్వరెరుగుదురు. ఎచ్చట చూచిన నరకంకాళములే, ఎవ్వరికి అన్నములేనప్పుడు యెవరెవరికి యివ్వగలరు. రాజుగారి ధనాగారమున రత్నరాసులు, ధనికుల యిండ్లలో వెండి బంగారము పట్టెడన్నము పెట్టుటకు కూడ సామర్ధ్యము లేనివయ్యెను. పరిస్థితి (ఉత్తరోత్తరా) క్రమ క్రమముగా ఎక్కువగుచుండెనేగాని తగ్గుసూచనలు కానరాలేదు. ప్రాణరక్షణ మెట్టులా ? అను ప్రశ్న కలిగెను.

ఎవరో అన్నారు, నరమేధయాగము చేసిన వర్షము తప్పక పడుతుందని. ఏదో యొక ఉపాయము. సరేనని అందరూ వప్పుకున్నారు. సమావేశమయ్యారు. అందరి ప్రాణాలు అందరకు ప్రియమైనవే. బలాత్కారముగ బలియిచ్చుట యాగమునందు వీలులేదు. సభలో చాలామంది గలరు. అందరూ మౌనముద్రవహించిరి. ఒక్కరికీ స్వయముగా ప్రాణపరిత్యాగమునకు సాహసము కలుగలేదు. సభ నీరసముగా నుండగా హఠాత్తుగా నొక బాలకుడు 12 యేండ్లవాడు లేచెను.

అందరి దృష్టిని అతడాకర్షించి యిట్లనియెను. (అతని శరీరము నుండి కోమలత్వముట్టిపడుచుండెను) మహానుభావులారా ! పెద్దలారా ! అసంఖ్య ప్రాణికోటిని రక్షించుటకు, దేశమును దుర్భిక్షమునుండి కాపాడుటకు నేను నా ప్రాణముల నర్పించుటకు సిద్ధముగా నున్నాను. ఈ శరీరము దేశమన పండిన పంటలవలన పెరిగినదిగాన దీనిని మరల దేశమునకే అర్పించుటకన్న సదుపయోగ మేమిగలదు. ఈ రూపమున ఈ నశ్వరశరీరముతో పరమాత్మసేవ జరుగునని భావించుచున్నాను.

అందరూ ఆశ్చర్యచకితులైరి. ఇంతలో ''నాయనా ! శతమన్యూ ! నీవు ఎంత ధన్యుడవురా ! నీకు యీ వయసులో యింత సాహసమెట్లు కలిగెనురా'' అని వాపోవుచూ ఒక నడివయస్సువ్యక్తి ఆ పిల్ల వానిని ఆలింగనము చేసికొని రోదనము చేయసాగెను. అతడు అతని తండ్రి. ''నీవు నీ పూర్వపురుషులను అమరులుగా చేసితివిరా తండ్రీ'' యని విలపించెను. ఆ సభలో అతని తల్లికూడ గలదు. ఆమె దుఃఖము భరించజాలక గోలుగోలున యేడ్చుచూ కుమారుని (కడకు) దగ్గరకు వచ్చెను. ఆమె తన పుత్రుని వక్షమునకు హత్తుకొని నేను నాపిల్లవాని నివ్వనన్నట్టు గట్టిగా పట్టుకొనెను.

యాగమునకు ముహూర్తము నిశ్చయించిరి. యజ్ఞమారంభమయ్యెను. శతమన్యు బాలకుని సమస్త తీర్ధములనుండి తెచ్చిన జలముతో స్నానము చేయించిరి. నూతన వస్త్రాభరణములతో నలంకరించిరి. సుగంధద్రవ్యములను శరీరమునిండ పూసిరి. పుష్పమాలలు మెడలో వేసిరి.

బాలకుని యజ్ఞమండపమునకు తీసికొని వచ్చిరి. యూపస్తంభముకడ నిలబడి యతడు దేవతలకు ప్రభువైన యింద్రుని ప్రార్ధించసాగెను. బలిసమయ మయ్యెను. యాగశాలయంతయు నిశ్శబ్దముగా నుండెను. శతమన్యు కుమారుడు శిరసు వంచెను. సభాసదుల దృష్టులన్నియు అతనిపై కేంద్రీకృతములైయుండెను. జనసముదాయము కిక్కురుమనకుండా చూచుచుండెను.

ఇంతలో శూన్యాకాశమున దుందుభులు మ్రోయు ధ్వని (విచిత్రముగా) వినబడెను. శతమన్యుని శిరసుపై పారిజాతకుసుమములు వర్షముగా పడుచుండెను. ఒక్కసారిగా మేఘముల గర్జన వినబడెను. వెంటనే ఇంద్రుడు వజ్రాయుధము ధరించి ప్రత్యక్షమయ్యెను. అందరూ కళ్లు పెద్దవిగా చేసుకొని చూచుచుండిరి. చెవులప్పగించి వినసాగిరి, ఇంద్రుడు శతమన్యుని (శిరసుపై) మస్తకముపై తన వరదహస్తమునుంచి ప్రేమతో నిమురుతూ ''వత్సా ! శతమన్యూ ! నీ భక్తికి మెచ్చితి, ప్రాణికోటిని రక్షించుటకు నీ వాచరించిన సాహసమునకు సంతసించితిని . ఏదేశమున బాలకులు సహితము తమ దేశరక్షణకై ప్రాణములను తృణప్రాయముగా అర్పణ చేయుటకు ప్రతిక్షణము సిద్ధముగా నుందురో ఆదేశ మెన్నటికిని పతనము చేయుటకు పతనము జెందుట కవకాశములేదు. నీ త్యాగమునకు సంతుష్టుడనై బలి యవసరము లేకుండనే యజ్ఞఫలమును యిచ్చుచున్నాను. వర్షములు పడునని చెప్పి దేవేంద్రు డంతర్ధానమయ్యెను.

పెద్దలకు

హరిఃశరణం అను మంత్రమువలన భయంకరరోగనాశము, కలకత్తాలో కొలది కాలము క్రిందట జరిగిన(విషయము) సంఘటన - ఆ రోజులలో కలకత్తాలో ప్రతి సంవత్సరము ప్లేగురోగము వ్యాపించి వేలకొలదిజీవులను మృత్యువుపాలు చేస్తూవుండేది. కలకత్తానగరమున గల సాధారణ ప్రజానీకము, ధనికవర్గము అందరూ ప్లేగురోగమునుండి రక్షించుకొనుటకు ఊరువిడచి దూరదూర గ్రామాలకు పారిపోయెడివారట. ఎన్నోరకాల యిబ్బందులు వారు పొందుతూవుండేవారు, అనేకచోట్ల అఖండ హరినామము చేసెడివారు. ఆదినములలో ఒక పెద్ద ధనికునకు ప్లేగురోగము సోకెను. అతడు చక్కగా చదువుకొన్నవాడు, ఆధ్యాత్మిక సంస్కారము కలవాడు, సంస్కృతభాషాపరిజ్ఞానము భగవద్భక్తికలవాడు. ఇంటిలో అతడొక్కడే ఉండెను. భార్యాపుత్రాదులు పుట్టింటికిపోయియుండిరి. ఇంటిపనులన్నీ నౌకరులు చాకర్లు చేయుచుండిరి.

ఆధనికుడు ప్లేగురాగానే ఒక పెద్ద పేరుగల డాక్టరుని నౌకర్లద్వారా పిలిపించెను. డాక్టరువచ్చి చూచుసరికిరోగిపరిస్థితి చాలాగందరగోళముగా నుండెను. తీవ్రమైనజ్వరము దానిలో వెక్కిళ్లు పైగా సన్నిపాతము ప్రారంభమయ్యెను. డాక్టరు రోగి మృత్యువునకు సమీపమందున్నాడనియు ఆరాత్రి యెప్పుడో చనిపోవుననియు స్పష్టముగా చెప్పి వెళ్ళిపోయెను. ఆ ధనికరోగి విశ్వాసపాత్రుడైన నౌకరిని పిలిచి గంగాజలములో అంగవస్త్రము తువ్వాలు తడిపించి తన శరీరమును శుభ్రముగా తుడవమని చెప్పెను. ఆ పనియైన తరువాత తాను బట్టలుమార్చుకొని పట్టుబట్ట కట్టుకొని పరుపు మీద మూడుపక్కలా తలగడాను పెట్టుకొని కూర్చుండెను. ఎదురుగా శ్రీకృష్ణుని పటమును పెట్టించుకొని నౌకరుతో ఇట్లు చెప్పెను.

ఒరేయ్‌ ! అబ్బీ తలుపులు వేసి బయటగడియపెట్టుకో ద్వారం దగ్గరే పడుకో నేను తలుపు తియ్యమన్నప్పుడే తియ్యి నేను తియ్యమనకపోతే సూర్యోదయమైన తరువాత నువ్వేతెరువు. నేను మరణించినట్టయితే మాబంధువులకు కబురుచేసి అంత్యేష్టిక్రియలు జరుపుకోమను - నా పర్సులోనే కావలసిన ద్రవ్యంవుంది. అని చెప్పెను. నౌకరువిచారంతో తలుపేసుకొని ద్వారంవద్దనే ప్రాతఃకాలమునకై ప్రతీక్ష చేయసాగెను.

తెల్లవార గట్లకోడికూసిన తరువాత సుమారు నాలుగు గంటలకు రోగి కేక పెట్టెను. నౌకరుతలుపు తెరచెను. యజమాని నౌకరుతో ఒరేయ్‌! అబ్బీ నువ్వుగంగాతీరానికి వెళ్లి వందమంది బ్రహ్మణులను భోజనానికి పిలుచుకొనిరా. వంటవాళ్ళను పిలిచి వంటశాలలో వంటలు తయారుచేయించు. పదిగంటల లోపులోనే భోజనాలు అయిపోవాలి అని పలికెను. నౌకరు చెప్పినపని చేయుటకు వెళ్లిపోయెను. ఆసమయమున యజమాని జ్వరము పూర్తిగా తగ్గిపోయెను వెక్కిళ్లు లేవు. సన్నిపాతముకూడా అంతరించెను. శరీరమున ఏరోగమూ ఉన్నట్లు గుర్తులేదు,

నౌకరువ్యవస్థను చక్కగాచేసెను. బ్రాహ్మణుల భోజనములు పూర్తియయ్యెను. ఈసంగతి యెట్టులో డాక్టరుగారికి తెలిసెను. అతడు చాలాశ్చర్యపడి రోగిని చూచుటకు వచ్చెను. అతడు తాను చెప్పినదానికి తిరుగులేదు అనిభావించి యుండెను. అతని విశ్వాసమునకు దెబ్బతగిలెను. అన్ని దుర్లక్షణములు గల రోగి రెండు మూడు ఝాములకన్న యెక్కువ జీవించడని అతని నిశ్చయము. రోగియైన యజమానికి డాక్టరుకి చిరకాలమునుండి పరిచయ ముండుటచే అతడు స్వయముగా రోగిని చూచుటకు వచ్చెను. అతని యాశ్చర్యమునకు మేరలేదు. రోగి చక్కగా గంగాజలముతో స్నానముచేసి పట్టుబట్టలతో పీటమీద కూర్చొని బ్రాహ్మణ భుక్తశేషమును పెద్ద వెండిపళ్ళెములో వడ్డించినదానిని తినుటకు సిద్ధముగా నుండెను. డాక్టరు ఇట్లు ప్రశ్నించెను. ఏమండీ ! మహాశయా ! ఎవరిసలహాతీసుకొని యీపదార్ధాలు తినబోవు చున్నారు ? అని, యజమాని డాక్టరుగారూ ఎవని మందువలన ప్లేగు రోగము పటాపంచలయ్యెనో యతని యాజ్ఞననుసరించి ఈప్రసాదము తినబోవుచున్నా ననెను. డాక్టరుగారికి ఈమాటయందుకూడ భ్రాంతియే కలిగెను.

సన్నిపాత రోగము వలననే అతడిట్లు ప్రవర్తించుచుండెననియనుకొనెను, డాక్టరు వెళ్ళిపోతూ గుమ్మమువద్ద నౌకరుతో జాగ్రత్తగా వుండమని హెచ్చరించి వెళ్ళిపోయెను.

ఆ ధనికుడు వాస్తవమున రోగరహితుడయ్యెను. డాక్టరు మూడునాలుగు దినముల తరువాత రోగియింటికి వచ్చి, ''మహాశయా! మీరు ఎవరివద్ద మందుపుచ్చుకోగా రోగము నయమైనదో నాకు కాస్త చెబుతారా'' మని ప్రశ్నించెను. యజమాని డాక్టరుగారిని మేడమీద తాను అస్వస్థతగా నున్నపుడు పరుండిన గదిలోనికి తీసికొనిపోయెను. అక్కడొక కుర్చీమీద డాక్టరుని కూర్చొనమని తాను మంచముమీద పరుపుపై కూర్చొని యిట్లు చెప్పెను.''డాక్టరుగారూ ! మీరు ఆరోజున రాత్రి ఏదోసమయమున నేను మరణించుట నిశ్చయమని చెప్పి వెళ్ళినారుగదా ! మీరు వెళ్ళిన తరువాత నాకు భాగవతమాహాత్మ్యమున ఒక ప్రసంగము స్మృతికి వచ్చెను. అందు నారదుడు సనకాదులతో మీరు చిరంజీవులై యుండుటకు కారణము 'హరిః శరణం' అను మంత్రమును నిరంతరము స్మరించుచుండుటే గదా యని నుడివియుండెను. నేనిట్లాలోచించితిని ''డాక్టరుగారి మాట ప్రకారము నేను చనిపోవుట నిశ్చయము. అయితే నేను కూడ భగవంతుని శరణుపొంది 'హరిః శరణం' అను మంత్రమును ఏల జపించరాదు. సనకాదులను నిత్యబాలకులుగా నుంచగలిగిన భగవంతుడు నా ప్రాణములనుకూడ రక్షించగలడేమో ! ఒకవేళ రక్షించడనుకొనినను ప్రాణాపాయసమయమున భగవంతుని స్మరించినట్లగునుగదా. అప్పుడు సద్గతియేకదా కలుగును. కనుక రెండు విధములా లాభ##మేగాని నష్టమేమీ లేదు'' అని భావించి గంగాజలముతో శరీరమును శుభ్రపరచుకొని పవిత్రమైన పట్టుబట్టలు మడికట్టుకొని శ్రీకృష్ణుని చిత్రపటమును ఎదురుగా నుంచుకొని ''హరిః శరణం'' అను మంత్రమును జపముచేయ నారంభించితిని. కొన్ని క్షణములలో నామనస్సు తన్మయత చెందినది. బయట యేమి జరుగుచున్నదీ నాకు తెలియలేదు. నేను శ్రీకృష్ణుని మాత్రము ధ్యానించుచుంటిని. నాకు బాహ్యస్మృతి కలుగుసరికి శరీరమంతయూ తేలికయయ్యెను. జ్వరము పూర్తిగా తగ్గిపోయి నట్లనిపించెను. వెక్కిళ్ళు రాలేదు. శరీరమున నొప్పులుకూడ లేవు. అప్పుడు టైము (వేళ) చూచుసరికి గోడగడియారము నాలుగు కొట్టినది. నేను వెంటనే నౌకరును పిలిచి బ్రాహ్మణులను భోజనానికి రమ్మని పిలువనంపితిని. వంటవాళ్ళను పిలచి వంటలు చేయించి బ్రాహ్మణ సమారాధన జరిపించితిని. ఆనాడు మీరు వచ్చుసరికి బ్రాహ్మణభుక్త శేషమును వడ్డింపించుకొని తినబోవుచుంటిని, ఆ ప్రసాదము నాశరీరమునకు పూర్తి స్వాస్థ్యము చేకూర్చినది. ''హరిః శరణం'' అను మంత్రరూప ఔషధము వలన భయానక ప్లేగురోగము పూర్తిగా నశించెను. మరణాసన్నుడైన రోగి ఆరోగ్యవంతుడయ్యెను. ఈ సంఘటనను విని డాక్టరు ఆశ్చర్యచకితుడయ్యెను.

యువతులకు

(మార్చి సంచిక తరువాయి)

అమితోత్సాహంతో సామగ్రిని కైలాసానికి చేర్చారు. ముందు మూడురోజులలో లడ్డూ జిలేబి యిత్యాది తీపిసరుకు పిండివంటలు రాసులుగా తయారుచేసి పర్వతాలవలె పోకటపోశారు. అగస్త్యుడెంత తింటాడో చూద్దామని 33 కోట్ల దేవతలకు 9 కోట్ల ప్రమధగణాలకు పుట్టింటినుండి వచ్చిన పదికోట్లమందికి సరిపడే ఆహార సామాగ్రి అన్నము కూరలు పప్పులు పచ్చళ్లు తయారుచెయ్యమని ఒకటే ఆజ్ఞ వేసింది పార్వతి. ఆమూడురోజులు రాత్రనక పగలనక అందరూ వంటలపనులుచేశారు పూర్ణిమనాడు అగస్త్యమహర్షి పదిగంటలకు పిలచిన ప్రకారం వచ్చేశాడు. పెద్ద పీట వేశారు. పెద్దవిస్తరి కుట్టి ముందు వేశారు. మొదటివడ్డనకాగానే అగస్త్యుడు పరిషేచనం చేశాడు. పార్వతిపూజను పూర్తి చేసుకొని వచ్చి అతనికి హస్తోదకమిచ్చింది. భోజనము ప్రారంభ##మైనది.

రైలుబండి స్టేషను నుండి బయలుదేరు నపుడు మెల్లగా బయలుదేరుతుంది. డిష్టంటుసిగ్నలు దాటినతరువాత స్పీడు క్రమంగా హెచ్చుతుంది. పది నిముషాలలో పూర్తివేగాన్ని అందుకుంటుంది. అటులనే అగస్త్యమహర్షి మొదట మామూలుగా భోజనం ప్రారంభించి క్రమక్రమంగా స్పీడు హెచ్చించాడు. ముక్కోటి దేవతలు పరుగులెత్తి వడ్డిస్తున్నారు. విస్తరిలో వేసినది వేసినట్టే మాయమైపోతూవుంది. అందరికీ ఆశ్చర్యంగావుంది. మధ్యాహ్నం మూడుగంటలయినా తృప్తాస్మ అనకుండా తింటున్నాడు అగస్త్యుడు. పార్వతి ప్రక్కనే నిలబడి చూస్తూనేవున్నది. వంటశాలలోని శాకపాకాదులు నూటికి 90 వంతులు అయిపోయాయి. అగస్త్యుడదేవిధంగా తింటే ఇంకొక గంటలో అన్నీ పూర్తి అయిపోతాయి అనే భయం కలిగింది. వంటచేయు దేవతలు భవానిని కేక వేశారు. ఆమె వంటశాలలోకి పోయి చూచేసరికి గాభరా కలిగింది. గాడిపొయ్యిల మీద గుండిగలలో యెసర్లు మరుగుతూనే ఉన్నాయి. బియ్యాలు కడిగి పోస్తూనే వున్నారు. వార్చినవారు వారుస్తూనే వున్నారు. వారుకూడ అధైర్యపడుతున్నారు. పార్వతి అన్నీ చూచి ఇంక ఆగ లేక కన్నీటితో పరుగు పరుగునపోయి శంకరుని పాదములమీద పడి యేడవటం ప్రారంభించింది. శంకరుడు ఆమెను లేవదీసి నేను మొదట చెబితే విన్నావా? యిప్పుడు యేడుస్తే యేంలాభం అన్నాడు. పార్వతి తనలో తానే తమాయించుకొని మీతో ఒక్క ప్రార్ధన మీరింకేమీ చెయ్యవద్దు గాని ఆవైకుంఠానికి వెళ్ళి మా అన్నగారైన విష్ణుమూర్తిని ఒక్కసారి పిలుచుకొనిరండి అతనే ఏదో ఉపాయం చెబుతాడు అంది. శంకరుడు వైకుంఠానికి పరుగెత్తేడు విష్ణమూర్తికి జరిగినదంతా విన్నవించి మీ చెల్లెలొకసారినిన్ను తీసుకురమ్మంది అని చెప్పేడు విష్ణుమూర్తి వెంటనే బయలుదేరి శంకరునితో కైలాసానికి వచ్చేడు అప్పటికి సాయంత్రం నాలుగు గంటలయింది. వచ్చీరావడంతోటే అగస్త్యుని యెదటనే ఏమమ్మా చెల్లాయి ఉద్యాపన చేసుకుంటూ పిండివంటలన్నీ నాకు పిసరైనా పెట్టకుండా నువ్వూ అగస్త్యుడూ మాత్రమే తిందామనుకున్నారా ? నాకిప్పుడు తెలిసింది కనుక వచ్చాను కాస్త వడ్డించండి అని విస్తరివేసుకొని అగస్త్యుని పంక్తిని వేసుకున్నాడు అందరూ తెల్లబోయి చూస్తున్నారు వంటవారు కొంచొం కొంచెంగా అతని విస్తరిలో వడ్డించారు. విష్ణుమూర్తి గబగబా కలుపుకొని ఏదో నాలుగు మెతుకులు కతికి తిన్నట్టునటించి ఉత్తరాపోసనపట్టేశాడు, అగస్త్యునికి అపరిమితమైన కోపంవచ్చింది ఏమయ్యా విష్ణూ! నీవువచ్చి నాభోజనమంతా పాడుచేశావు ఇంకా పొట్టసగమైనా నిండలేదు అన్నాడు. శ్రీ మహావిష్ణువు లేదు మహర్షివర్యా! తమరు ఉదయం 10 గంటలనుండి తింటున్నారు కనుక తృప్తులయ్యారనుకొని నేను త్వరగా తింటిని క్షమించండి నాదిపొరపాటు అయినది. అని వేడుకొనెను.

విష్ణుమూర్తి తను చేసిన తప్పు వప్పుకున్నాడు. కనుక అగస్త్యమహర్షి కొంత శాంతించాడు. పంక్తిలో వ్యక్తి ఉత్తరాపోసనపట్టిన తరువాత మిగిలినవారు తినరాదు కనుక అగస్త్యుడు కూడా ఉత్తరాపోసన పట్టవలసి వచ్చింది. పార్వతి గుండెలో బరువు తగ్గింది. అగస్త్యుని కోపమంతా విష్ణుమూర్తిపై ప్రసరించింది.

''పోనీ కొంచెం మంచినీళ్లైనా పొయ్యండి'' అని అగస్త్యుడడిగేసరికి విష్ణుమూర్తి 'మహానుభావా ! వీరు మనకి మంచినీరు పొయ్యలేరు. నేను మీకు మంచితియ్యనినీరు చూపిస్తాను తాగుదురుగాని రండి'' యని సముద్రతీరమునకు తీసికొనిపోయెను. అగస్త్యుడు 'కేశవయస్వాహా' యని సముద్రన్నంతటినీ ఒక్కగుక్కలో తాగేశాడు. 'నారాయణాయస్వాహా' అనడానికి నీరు లేక పోయింది.

సముద్రంలో నీరు లేకపోగానే - వర్షాలు లేవు - పంటలు లేవు. యజ్ఞయాగాదులు లేవు. దేవతలకు హవిర్భాగాలు లేవు. మూడు లోకాలు పస్తుపరుండ వలసినదే. కనుక దేవతలందరూ అగస్త్యమహర్షిని ప్రార్ధించారు. అగస్త్యుడు తాగిననీటిని మూత్రరూపమున విడచి సముద్రమును మరల నిండింపజేశాడు. ఆనీటితో తయారైన ఉప్పు అపవిత్రమైనది కనుక దానిని చేతితో తాకకుండా వేరే ఆకులో వడ్డిస్తారు. అన్నం వడ్డించిన ఆకులో దానిని వడ్డించరాదు. దానిని చేతితో ముట్టినచో చేతిని కడగవలెను. ఉప్పును పవిత్రం చెయ్యడానికే గోరసంతో (పెరుగుతో) కలుపుతారు. ఉప్పును చేతితో వడ్డించరాదు. ఉప్పును వడ్డించాలంటే దానిని చిన్న ఆకులో గరిటెతో వేసుకొని దానిలో పెరుగు మిశ్రితం చేసి ఆకుపాళంగా విస్తరి చివర ఉంచవలెను. పెరుగు వేరు ఉప్పు వేరుగా వడ్డించరాదు. రెండూ కలిపి వడ్డించవలెను. ఇదే విధమున ప్రతి వస్తువూ వడ్డించడానికి పద్ధతులు వేరువేరుగా వున్నాయి. అవే సంప్రదాయ రహస్యాలు. అవి తెలిసిన నాడే భారతీయసంస్కృతి తెలిసినట్లు. తెలియకపోతే తెలియనట్లే.

శ్లో|| ఆగస్త్యం కుంభకర్ణంచ శమీంచ బడబానలం

ఆహార పరిణామార్ధం స్మరామి చ వృకోదరం

అని భోజనా నంతరము శిష్టాచార పరులు స్మరిస్తూ ఉంటారు. అగస్త్యుని చరిత్ర కొంతవరకు విన్నాం. కుంభకర్ణుని భోజనం రామాయణంలో విశేషంగా వర్ణింపబడింది. శమీవృక్షము బడబానలము శాస్త్రదృష్టిద్వారా తెలియదగినవి. భీమసేనుని యాహారము భారతము వలన తెలిసికొనవచ్చును. బకాసురినికిపంపినబండెడన్నమును భీమసేనుడే తినెను. వీరందరూ తీవ్రమైన జఠరాగ్ని కలవారు కనుక వారిని స్మరించిన మనము తిన్న యాహారముకూడ పచనమగునని భావన.

అగస్త్యుడు దక్షేణాకాశమున ఉజ్వలతారారూపమున వెలుగొందుచున్నాడు. పంచాంగములందు అగస్త్యోదయము, అస్తమయము వ్రాయబడి యుండును. అతని భార్యలోపాముద్ర, వీరిరువురూ శ్రీ విద్యోపాసకులు. హయగ్రీవుడు త్రిశతీనామము లితనికే యుపదేశించును.

అగస్త్యునిశాపమువలననే ఇంద్రద్యుమ్నుడు గజేంద్రుడయ్యెను నహుషుడు ఇంద్రపదవినుండి భ్రష్టుడై కొండచిలువయయ్యెను. భారతీయ సంస్కృతిలో అగస్త్యమహర్షియొక్క విశిస్టస్థానము నాక్రమించియున్నాడు. వాతాపియను రాక్షసుని జీర్ఱింపజేసుకొనెను. వాతాపిజీర్ణం అని పిల్లలకు పాలుపోసిన తర్వాత తల్లులు స్మరింతురు. ఇట్టాంటి విషయాలు చాలావుంటాయి. ఆపుస్తకంలో

ఆమె అయితే తప్పకుండా అచ్చువేయించడానికి ప్రత్నిస్తాను. మా మహిళా సమాజం అందరితో చెప్పి ప్రోత్సహిస్తాను. స్వామి మంచిది. వెళ్ళిరా నారాయణ.

యువకులకు

సాధువు తన విజ్ఞానము ద్వారా విద్యార్ధుల నాకర్షించెను. మరునాడు కూడ వారు వచ్చిరి. ఆ కాలేజీ విద్యార్ధులను చూచి సాధు విట్లు ప్రశ్నించెను ?

సా;- మీరు నెపోలియన్‌ బోనో పార్ట్‌ పేరు విన్నారా ?

వి;- వినకేమండి. ఫ్రాన్సుదేశ చక్రవర్తినేనా మీరడిగేది ?

సా;- అవును.

వి;- అతడు యూరప్‌ ఖండాన్నే ఉర్రూతలూగించినవాడు పెద్ద నియంత. రాజకీయవేత్త.

సా;- అతని చిన్న తనమున జరిగిన సంఘటన నొకదానిని చెబుతాను వినండి. మీబోటి వారికి పనికివస్తుంది.

అతడు మొదట చక్రవర్తి కాడు. Selfmade Man తన భావముల ననుసరించి తన్ను నిర్మించుకొనెను. అతడు సాధారణ ధనిక వర్గానికి చెందిన పిల్లవాడు. అతనికి పదేళ్ళ వయసున జరిగిన సంఘటన. అతనికొక అక్క కూడా వున్నది. ఆమె పేరు ఇలాయిజా. వారిరువురూ తరుచు ఆడుకొనేవారు. తండ్రి చిన్నప్పుడే చనిపోవుటచే తల్లి మేనమామల పెంపకమున అల్లారుముద్దుగా పెరిగేరు. ఇలాయిజా అతనికన్న రెండేళ్ళు పెద్దది. వారికొక పెద్దతోట గలదు. తల్లియనుమతి తీసుకొని ఇద్దరూ ఆతోటలో ఆడుకొనుటకు పోయిరి. ఆటపాటలలో వారికి వళ్లు తెలియలేదు. తోట దాటి కూడా పరుగెత్తిరి. ఇలాయిజా వెనుకగా పరుగెత్తుచూ మామూలు దారివెంట పోయే ఒక అమ్మాయిని గుద్దివేసినది. ఆ అమ్మాయి నేరేడుపండ్ల బుట్టను నెత్తి బెట్టుకొని బజారున అమ్ముటకు పోవుచుండెను. ఇలాయిజా తగులుట తోడనే పిల్ల నెత్తిన వున్న బుట్ట నేలపై బడినది. పండ్లన్నియు చితికి మట్టిలో పడిపోయెను. అమ్మకానికి తినడానికి పనికిరానివయ్యెను. ఇలాయిజా భయపడి (ఒరేయ్‌ తమ్మీ ! పరుగెత్తి ఇంటికి పారిపోదాం పదరా. ఎవరైనా చూస్తే ఏదైనా అంటారు) అని యనెను. నెపోలియన్‌ ఇలాయిజాతో ''అక్కా చూడవే పాపం ! ఆపిల్ల ఎంత ఏడుస్తూవుందో, దాని పళ్ళబుట్టను నువ్వేకదా పడగొట్టావు. దాని కెంత నష్టం కలిగిందో చూడు. దానికేదో పరిహారం యివ్వకుండా పారిపోదాం అంటావేమిటే. తప్పు నువ్వుచేశావు పారిపోతే తప్పు పోతుందామరి. ఆపిల్ల కేదో యిచ్చి ఓదార్చి వెళ్ళాలి'' అని ఆపిల్ల దగ్గరకి నెపోలియను వెళ్ళెను. అతని వెనుకనే ఇలాయిజా కూడా వెళ్ళినది. (అతని భావం తెలిసికొని) ఇద్దరూ కలిసి క్రిందపడిపోయిన పళ్ళను బుట్టలోకి యెత్తడం ప్రారంభించారు. ఆ అమ్మాయి యేడుస్తూ ''ఇంటికెళ్ళి మా అమ్మకు యేం చెబుతాను ఈపళ్ళు చితికి పోయాయి. అమ్మకానికి పనికిరావు యెవరూ కొనరు. అని ఆపిల్ల వెక్కి వెక్కి యేడవటం ప్రారంభించింది. నెపోలియన్‌ ''యేయ్‌ పిల్లా యేడవబోకు. యేడుస్తే యేమొస్తుంది'' అని తన జేబులోనున్న మూడు వెండినాణములను ఆమె చేతిలోపెట్టి ''నువ్వు మాయింటికిరా ! నీకు బాకీ మిగిలిన పైసా యిస్తాను'' అని ఆపిల్లను తీసికొని అక్కాతమ్ముడూ యింటివైపు బయలుదేరారు. దారిలో అక్క అందిగదా ''తమ్ముడూ ! దీన్ని తీసుకుపోయి అమ్మతో అంతా చెబితే అమ్మ కొడుతుందేమోరా ! దీన్ని పంపేసి మనం యిద్దరమే యింటికి పోదాంపద.'' ఆమాట మీద నెపోలియన్‌ ''అమ్మ కొట్టదు లేవే, నీకేం భయంవద్దు. కొడితే నేను పడతాను గాని యీ పిల్లకు నష్టపరిహారం యివ్వకుండా పంపడం నా కిష్టంలేదు'' అని అంటూ వుండగానే ఇంటినుండి దాసీదివచ్చి మీయిద్దరిని అమ్మగారు త్వరగా రమ్మన్నారు'' అని చెప్పి ''ఈ పిల్లయెవరు'' అని ప్రశ్నించింది. ''దాని పళ్లబుట్ట పొరబాటుల నావల్ల క్రిందపడిపోయింది. నష్టపరిహారం యివ్వడానికి యింటికి తీసుకువస్తు'' న్నా నని నెపోలియన్‌ నేరము తనపై నారోపించుకొనెను.

ఇంటిముందు వరండాలో నెపోలియన్‌ తల్లి లిటిసియా కుర్చీపై కూర్చొనియుండెను. ఇంతో ఈ నలుగురూ యింటికి చేరిరి. తల్లి కోపంతో ''ఎందుకింత ఆలస్యమైందర్రా ? తోటదాటి ఆటలాడవద్దని చెప్పానా ! రేపటినుంచి చూడండి మిమ్మల్ని ఆటకు పంపుతానేమో ! '' అని అన్నది. దాని మీద నెపోలియన్‌ ''అమ్మా ! అక్కదేమీ తప్పులేదే నేనే ముందు వెళ్ళాను. నా వెనకాతల అది వచ్చిందే. దానినేమీ అనకే '' అని చెప్పెను. మొదట ఇలాయిజా తమ్ముడేమి చెబుతాడో అని భయపడింది. కాని నేరమంతా తనపై నారోపించుకోగానే ఆమెకు కొంత ధైర్యం కలిగింది. ఇంతలో వాళ్ళ మేనమామ అక్కడకు వచ్చెను. ఇలాయిజాకు మేనమామవద్ద యెక్కువ చనువు కనుక అతని ఒడిలో కూర్చొని తప్పంతా తనదేనని తమ్మునిది కాదని అతనిని దండించవద్దని తల్లితో చెప్పమని కన్నీటితో బ్రతిమలాడింది. తల్లి అంతా విని తప్పు ఒప్పుకున్నారు కనుక ఇద్దరిని క్షమించింది.

తరువాత నెపోలియన్‌ ''అమ్మా ! నాకు నెలసరిగా ఇస్తున్న జేబు ఖర్చు నాకిప్పుడే కావాలి యిస్తావా ! '' అని అడిగెను. తల్లి ఆ పైసలు అతనికిచ్చి ''మళ్ళీ నెలవరకూ నన్నేమీ అడగవద్దు.'' అని మందలించెను. నెపోలియన్‌ ఆ పైసలు పళ్ళపిల్ల కిచ్చివేయగా అవి పళ్ళకు పరిపోయినవని ముందు ఇచ్చిన మూడు వెండినాణములు అతని కివ్వబోగా అతడు తీసికొనలేదు. తల్లి ఆ పిల్ల అమాయకత్వమును చూచి ముగ్ధురాలై - ఆ పిల్ల కుటుంబవిషయమంతయు నడిగి వారింటికి పోయి జబ్బుగావున్న పిల్ల తల్లికి వైద్యసహాయము నేర్పాటు చేసి ఆ యింట నేది లోటుగా నున్నను తన యింటికి వచ్చి తీసికొనిపొమ్మని చెప్పి యింటికి వచ్చెను. ''అయ్యే చెట్టుకి ఆకులే చెబుతాయి. '' ఆ తల్లికి తగిన కొడుకు నెపోలియన్‌ - పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని సామెత.

నేటి కాలేజీ విద్యార్ధులు బాధ్యతారహితంగా ప్రవర్తిస్తూ ఉంటారు. సమ్మెలను పేరుతో స్కూలులోని లేబరేటరీని పాడు చేస్తారు. ఫర్నిచరు తగులబెడతారు, దీనివలన నష్టమెవరికి కలుగుచున్నదో వారాలోచించుట లేదు. ''విద్య యొసగును వినయంబు వినయమునను బడయు పాత్రత పాత్రతవలన ధనము ధనమువలనను ధర్మంబు ధర్మంబువలన నైహికాముష్మిక సుఖంబులందు నరుడు.'' యను భారతసూక్తిని వమ్ము చేయుచు నేటి విద్యార్ధులు గర్వించు చున్నారు. ఇదియే విద్యా విధానమున నున్నలోటు. డిసిప్లిన్‌ నేర్చుకొనుటకు బదులు అల్లరి మూకగ తయారగుచున్నారు. ప్రపంచం మొత్తం మీద విద్యార్ధుల స్థితి గడ్డుగా నున్నదని ఆలోచనాపరులు ఆందోళన చెందుచున్నారు.

రాజకీయవేత్తలు కొందరు విద్యార్ధులను తమ పావులుగా వాడుకొనుచున్నారని కొందరు విమర్శించుచున్నారు. విద్యార్ధులు స్వబుద్ధి నుపయోగించి విచారణ గావించినచోట ఔచిత్యము గోచరించకపోదు. వారి కెవరైన మంచిని చెప్పుట మంచిది.

ఒకప్పుడు అనగా బీహారు భూకంప సమయమున గాంధీగారు అస్ప్రుశ్యతానివారణ దేశ ప్రజలు అంగీకరించక పోవుటచే భూకంపము వచ్చినదని హరిజనపత్రికలో వ్రాసిరట. దానికి సమాధానముగా ఠాగూరు గారు (రవీంద్రనాధ) ''మహాత్మాజీ ! నువ్వు భూకంపాన్ని నీ అస్ప్రుశ్యతా నివారణ కార్యక్రమానికి ఉపయోగించు కోవడానికి వాడుకున్నావు. గాని సనాతనులు ఏమంటారంటే ''వారి సనాతన ధర్మానికి వ్యతిరేకంగా నువ్వు ప్రచారం చేస్తున్నావు కనుకనే భూకంపం వచ్చిందని అంటే నీ దగ్గర ఉన్న సమాధానమేదో చెప్పు'' అని ప్రశ్నించారట. గాంధీగారు వెంటనే తమ పొరబాటు తాము తెలిసికొని మారు మాటాడ లేదని విన్నాము. మానవుడు తప్పు చేస్తాడు. 'To err is human* కాని దానిని సవరణ చేసుకొనుటలోనే అతని మానవత్వము గలదు. విద్యార్ధు లావిధముగ దేశసంపదను పాడు చేయ నిర్మాణాత్మక కార్యక్రమములందు పాల్గొనుట (యొప్పు) లగ్గు.



శాశ్వత సభ్యులు

శ్రీ యస్‌. పెంటయ్యగారు, కెవిస్టీలు & సిమ్మెంటు

ట్రేడర్సు, 15-2-690, సిద్ధింబరు బజారు, హైదరా

బాదు-12రు. 116/-లు సమర్పించి కామకోటి తెనుగు

మాసపత్రికకు శాశ్వతసభ్యులుగా చేరిరి.

శ్రీకామాక్షీ చంద్రమౌళీశ్వరులు వీరికి ఆయురా

రోగ్యైశ్వర్యములు ప్రసాదించుగాక !







 

Kamakoti   Chapters   Last Page