Kamakoti   Chapters   Last Page

 

21. ప్రశ్నోత్తరమాలిక

ప్ర:- మన మతగ్రంధముల యొక్క పేర్లేమి ? వాటి అర్ధమేమి ?

కృతులు, స్మృతులు, పురాణములు, గృహ్యసూత్రములు, ధర్మసూత్రములు శ్రౌతసూత్రములు, ఇతిహాసము, భక్తి స్తోత్రములు.

శృతి అనగా : ఆకాశములో శబ్దరాసులు ప్రసరించియున్నవి. అవి ఈశ్వర అనుగ్రహము వలన విశేషగ్రహణశక్తిని పొంది దాని అర్థము గ్రహించి యెట్లు గ్రహించిరో అటులనే తిరిగి శిష్యులకు బోధచేయుటను శృతి అందురు. అట్లు శ్రోత్రేంద్రియము ద్వారా గ్రహించిన శబ్దమయమయిన శ్రుతికి వేదమని పేరు కూడా కలదు. శృతి అనగా వినడమని అర్థము. వేదమనగా తెలుసుకొనుట అని అర్ధము. అందువలన మన మత గ్రంధమునకు గురు శిష్య పరంపరగా విని తెలుసుకొనుట యని అర్ధము.

స్వరప్రాధాన్యము, కాలప్రాధాన్యము, వ్యక్తిప్రాధాన్యముతో కలిసి యుండునది శృతి. స్మృతి యనగా అట్లు శ్రోత్రేంద్రియము ద్వారా గ్రహించిన శబ్ద అర్ధమును స్మరించి వాక్యరూపముగనో, శ్లోకరూపముగనో, మహర్షులు రచించినది. స్వర, కాల, వ్యక్తి ప్రాధాన్యములు దీనిలో లేవు. అందరు చదివి తెలిసికొనవచ్చును.

పురాణ మనగా ప్రతి కల్పకాలములో జరిగిన భగవదవతారము యొక్క కధ ఆయాకాలములో రాజుల కధలు, దేశపరిస్థితుల విషయములు మహర్షుల ద్వారా స్మరించి చెప్పబడినది పురాణమనబడును.

గృహ్యసూత్ర మనగా తెల్లవారి నిద్ర లేచినది మొదలు రాత్రి నిద్రపోవు వరకు మనము చేయవలసిన నిత్య కృత్య పనులు గురించి మహర్షులచే వాక్యరూపముగనో, శ్లోకరూపముగానో చెప్పబడినది (బాహ్యరూపమనగా చెప్పబడినది)

ధర్మసూత్ర మనగా మానసికముగా మనసునకు కావలసినవి గుణ ప్రధానముగా మహర్షులచే చెప్పబడినవి. (తటాకములు త్రవ్వుట, సత్రములు కట్టుట అబద్ధమాడకుండుట మొదలగునవి.)

శ్రౌతసూత్రమనగా శ్రుత్యుక్త ప్రకారముగా యజ్ఞయాగాదులు ప్రక్రియలు చేయుట మహర్షులచే వాక్యరూపముగనో, శ్లోకరూపముగనో చెప్పబడినది.

ఇతిహాసమనగా నాయకానాయికులను ప్రధానముగా పెట్టుకొని కధల రూపముగా నొక ధర్మమును బోధచేయుట. (ఇతిహ, ఆస) యిట్లు ఒకడు ధర్మమును ఆచరించియుండెను. (రాముడు పితృవాక్య పరిపాలన అను ధర్మమును ఆచరించెను.)

భక్తిస్తోత్ర మనగా ఉత్తమ మానవులు ఈశ్వరుని యందు భక్తి గలిగి యుండి ఆ ఈశ్వరానుగ్రహము వలన వారి నోటినుండి అనర్గళముగా వచ్చు వాక్యములు.

వేదములు యెన్ని ? అవి యేవి ?

ఋగ్‌, యజుః, సామ, అధర్వణ యని నాలుగు రకములు,

చందోబద్ధము ప్రాధాన్యముగా వుండునది ఋక్కు; దండాకారముగా పెద్దవాక్యము ప్రాధాన్యముగా గలది యజుస్సు; గాన ప్రాధాన్యత గలది సామము; వాక్య ప్రాధాన్యత గలది అధర్వణము.

నాలుగు విధములుగా కలిసియుండు శబ్దరాశికి వేదమని పేరు. ఈశబ్దరాశిని నాలుగు విధములుగా విభజించినది వేదవ్యాసమహర్షి. (వేదవ్యాసుడు అనగా శబ్దరాశిని విభజించిన వాడు అని అర్థము.)

వేదములలో గల శాఖ లెన్ని ?

ఋగ్వేదములో 21 శాఖలు, యజుర్వేదములో 101 శాఖలు, సామవేదములో 1000 శాఖలు, అధర్వణవేదములో 11 శాఖలు గలవు. వేదవ్యాసుడు వేదములను విభజించినపుడు 1180 శాఖలుగా విభజించెను.

ప్రతిశాఖ యెట్లు విభజింపడెను ?

మంత్రం, బ్రహ్మణం, ఉపనిషత్తు అని మూడు రకములుగా విభజింపబడెను.

 

Kamakoti   Chapters   Last Page