Kamakoti   Chapters   Last Page

 

శ్రీకంచికామకోటి జగద్గురు శంకరాచార్య

శ్రీచంద్రశేఖరేంద్ర సరస్వతీస్వామివారి ఉపదేశము

3. శ్రీమదాద్య శంకరాచార్య నామసంస్మరణము

శ్రీ శంకరభగవత్పాదు లద్వైత మతమును స్థాపించిరి. పూర్వమాకాలమున డెబ్బది రెండుమతములుండెడివనియు, వానినన్నిటిని శ్రీ ఆచార్యులవారు శమన మొనర్చి యద్వైతమతమును గంగోత్రి మొదలుగ గన్యాకుమారి వఱకును సుస్థిరముగ నుండునటుల స్థాపించిరనియు దెలియుచున్నది. అద్వైత మత స్థాపనానంతర కాలమునుండి నేటి వఱకునుగొన్ని యితర మతములుదయించుచున్నను నవి యెవ్వియు నద్వైతమతమును జలింపజేయలేకున్నవి. ఇతర మతములు కొన్ని ప్రాంతములలో మాత్రము ప్రబోధనముననున్నవి గాని భారత దేశమందెల్లడ నద్వైతమతము వ్యాపించియే యున్నది. సకలస్థలములయందును బ్రచారమున నున్నందున నీయద్వైతమతమందలి ప్రాశస్త్యమును గుర్తింపదగును. ఇతరమతములు శరీరార్ధాదిబలములుగల్గి యనేక శతాబ్దములనుండి దీనిని బ్రతిఘటించుచున్నను నియ్యది స్థిరముగ నుండుట నిందలి శక్తి ప్రదర్శితమగుచున్నది. ఇట్టి యమూల్యమగు మతమును శ్రీభగవత్పాదులు మనకు బ్రసాదించిరి. కాన దీనిని సంరక్షించుకొనుట మనకు విధియై యున్నది.

సకలజనుల కద్వైతమతమును బ్రబోధించుటకును, మతమును సంరక్షించుటకును గేంద్రస్థానములుగ గొన్ని పీఠములను శ్రీ ఆచార్యులవారు స్థాపించిరి. మతమునకే పీఠములు బలము చేకూర్చును. సర్వసనాతనధర్ములకును స్వథర్మసంరక్షణార్థమై సమిష్టి కేంద్రస్థానమావశ్యకము. పీఠపరంపరానుస్యూతిసంరక్షణమునకై రాజోపచార దేశోపచార చిహ్నములును నావశ్యకములు. అట్టి పీఠానుస్యూతి సంరక్షణముననే కేంద్రస్థానము సంరక్షింపబడును. మతస్థులు పీఠములను బూజించుటయు, బీఠాధిపతులు మతావలంబుల నాదరించి మతమును బ్రబోధించుటయు ధర్మము. అన్యులీ మతమును బ్రతిఘటించు నవసరమున బీఠములకు మతస్థులెల్ల సహాయ మొనర్చి మతము సుస్థిరముగ నుండునటుల యత్నింపవలయును. పూర్వమితరుల సంఘర్షణమునుండి హిందూదేశ హిందూధర్మములను బరమాద్వైతనిష్ఠులయ్యు హంపీరాజ్యస్థాపకులగు శ్రీ విద్యారణ్యులువారును, మహారాష్ట్ర వీర శ్రీ శివాజీ మహరాజుల గురువర్యులగు సమర్ధ రామదాసువారును సంరక్షించియుండిరి. అద్వైతమతనిష్ఠకును లోకోద్ధరణమునకును బరస్పరము విరోధము కలుగునను భ్రమయు నీ యద్వైతనిష్ఠాగరిష్ఠుల చరిత్రానుభవ మాత్రమున నివారిత మగు చున్నది. అట్టి బ్రహ్మనిష్ఠులే యెన్నడు నీమత సంరక్షకులగుదురు. ప్రకృతకాలమున - శ్రీ శంకర భగవత్పాద ప్రతిష్ఠిత పీఠములవారు శ్రీ ఆచార్యులవారి నామ సంస్మరణ మొనర్చుచు నద్వైతమతమును బ్రబోధించుటయే ప్రధానమగు ధర్మమై యున్నది.

అద్వితీయమగు పరబ్రహ్మ మొక్కటియే. శ్రుతిశిరములగు దశోపనిషత్తులందు బ్రత్యేకముగ శివస్వరూపము. విష్ణుస్వరూపము హైమవతీ రూపిణీ పరదేవతా స్వరూపమును. వర్ణింపబడి సర్వమద్వైతరూపమున పరబ్రహ్మప్రతిపాదకములై యొప్పుచున్నవి. శాస్త్రపురాణతిహాసము లందును శివ విష్ణ్వాది వర్ణనములు తత్త్వమును బోధించుచు నద్వైత రూపమున బరబ్రహ్మయందే పర్యాప్తములగుచున్నవి. ఈ విషయము సుప్రసిద్ధ వ్యవహారము నుండియు సుగమ మగుచున్నది.

కవికుల గురుడగు కాళిదాసు.

''ఏకైవమూర్తిర్బిభిదేత్రిధాసాసామాన్యమేషాం ప్రథమాపరత్వమ్‌,

విష్ణోర్హరస్తస్యహరిః కదాచిద్వేధాస్త యోస్తావపి ధాతురాజ్యౌ||

(కుమారసంభవము 7-44)

అను శ్లోకమున ''మూర్తియొకడ యట్లు (బ్రహ్మ విష్ణు శివాత్మకత్వమున) మూడయ్యెను. వానికి భిన్న పెద్దతనములు సాధారణములు. ఒకపుడు హరుడు విష్ణువునకును, విష్ణువు హరునకును నాద్యుడు హరిహరులకు బ్రహ్మయు, బ్రహ్మకు హరిహరులును నాద్యులు.'' అను నద్వైత సిద్ధాంతమును బోధించెను. అవిక్రియమగు బ్రహ్మము సత్వరజస్తమో గుణములయందు సృష్టిస్థితి సంహార రూపావస్థలంబొంది, బ్రహ్మ విష్ణు హరాత్మల వెలయును. ఈ భేదమౌపాధికము కాని వాస్తవికము కానేరదు. త్రిమూర్తులు నిచ్ఛచే నందఱు జ్యేష్ఠులను గనిష్ఠులను నగుదురు. వీరి యందిట్లు పౌర్వాపర్యమనియతము.

సుప్రసిద్ధ మహాకవియగు బాణభట్టుడును,

''రజోజుషేజన్మనిసత్వవృత్తయేస్థితౌ ప్రజానాంప్రలయే తమఃస్పృశే,

అజాయ సర్గస్థితినాశ##హేతవే త్రయీమయాయ త్రిగుణాత్మనేనమః''

(కాదంబరి 1)

అను శ్లోకమున ''సత్వరజస్తమోగుణములయందు సృష్టిస్థితి సంహార రూపావస్థలను బొందునదియు, సృష్టిస్థితిసంహారములకు గారణమైనదియు, వేదత్రయ ప్రతిపాదిత జ్ఞాన స్వరూపమైనదియునగు పరబ్రహ్మము'' అని వర్ణించెను. తత్త్వమున బరబ్రహ్మము నిరుపాదికస్వరూపమైనను గుణోపాథి నిబంధనమునందు స్రష్టుత్వాది వ్యవహారము కల్గును. ఏకమగు పరబ్రహ్మమునకే సృష్టి కాలమందు రజోగుణ సంబంధమున బ్రహ్మయనియు, స్థితి కాలమునందు సత్వగుణసంబంధమున విష్ణువనియు, బ్రలయ కాలమందు దమోగుణసంబంధమున శివుడనియు వ్యవహారమొప్పును.

అద్వైతము ''జీవబ్రహ్మాద్వైతము హరిహరాద్వైతము'' అని రెండు విధములు. రామకృష్ణవరాహ నృసింహాదినామములును దద్రూపములును భిన్నములయ్యుదన్నామస్మరణమునమానసికముగ గోచరించు నేకమగు విష్ణువు నటుల, శివ విష్ణ్వాదినామములును దద్రూపములును భిన్నములయ్యు దదుపాసనమున నీశ్వరుడ (పరబ్రహ్మను) ద్వితీయుడై భాసించుననుట హరిహరాద్వైతము, ఙానులకనుభ##వైకవేద్యము జీవబ్రహ్మాద్వైతము. ఇయ్యది సక్రమప్రాప్తవైరాగ్యమున గురూపదేశములనందిన పిమ్మట సిద్ధింపగలదు.

శ్రీ అద్య శంకరభగవత్పాదులు హరిహరాద్వైతమును చక్కగ బోధించిరి.

''భజగోవిందం భజగోవిందం భజగోవిందం మూఢమతే,

సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృఞ్‌ కరణ'

అని వ్యాకరణ శాస్త్రమాత్మసంరక్షణ మొనర్పజాలదని బోధించుచు గోవిందనామమును గీర్తించిరి.

''ఘటో వా మృత్పిండోప్యణురపి చ ధూమోగ్నిరచలః

పటో వా తంతుర్వా పరిహరతి కిం ఘోరశమనమ్‌|

వృధా కంఠక్షోభం సహసి తరసా తర్కవచసా

పదాంభోజం శంభోః భజ పరమసౌఖ్యం వ్రజ సుఖీః '' ||

అని తర్కశాస్త్ర చర్చ కంఠక్షోభమును గలుగ జేయును గాని, ఘోరశమనమును బరిహరింపదని బోధించుచు బరమ సౌఖ్యమునకై శంభుపదాంభోజ భజనము నొనర్చిరి.

తర్క వ్యాకరణ శాస్త్రములాత్మోద్ధరణమునకు సాధనములు కాజాలవనియు శివగోవింద భజనములు పరమ సౌఖ్యదాయకములనియు బోధించుచు శివగోవింద భజనముల నిట్లొనర్చుటం జేసి శ్రీ ఆచార్యులవారి హరిహరాద్వైతము ప్రదర్శితమగుచున్నది.

సులభసాధ్యమగు హరిహరాద్వైతమును గుర్తెఱిగి యభ్యాసయుక్తమగు భగవద్థ్యానమొనర్చుచు, నాచరించు కర్మల నీశ్వరార్పణము గావించుచు, జ్ఞానమార్జించిమోక్షసుఖమును బడయుటకు యత్నింపవలయును.

Kamakoti   Chapters   Last Page