Nadichedevudu   Chapters  

 

17. ''ఇక్కడే నా బాలాజీ!''

తమవద్ద శిష్యుడుగా చేరి కడవరకు తమకు శుశ్రూష చేస్తూ ఒక మహారాష్ట్ర సన్యాసి కథను కంచిస్వామి ఇలా వివరించారు.

1929లో ఉత్తరార్కాటుజిల్లా సరిహద్దు గ్రామంలో న న్నొక సన్యాసి కలుసుకున్నాడు. ఆయనకు తెలుగుగాని, అరవంగాని తెలియదు. మరాఠీ, హిందీ భాషలు మాత్రం వచ్చు.

రామేశ్వరం వెళుతూ ఉండగా సన్యాసులకు ఉండవలసిన దండం పోగొట్టుకున్నాడట. కొత్తదండం లభించేవరకు బహుశా ఆ సన్యాసి ఉపవాసదీక్ష వహించి ఉండాలి. కొత్తదండం అభిమంత్రించి నేను ఆయన కిచ్చాను.

తన ఆశ్రమధర్మాన్ని కాపాడిన కారణాన, అది మొదలుకుని ఆయన నన్ను తన గురువుగా పరిగణించాడు. అప్పటికి ఆయన వయస్సు ఎనభైపైబడ్డవి. 1945లో ఆయన సిద్ధిపొందాడు. అంతవరకు ఆయన నన్ను వదలడానికి ఇష్టపడలేదు.

1929లో చాతుర్మాస్య మప్పుడు ఆ సన్యాసి మాతో చేరిన వెంటనే దాదాపు నలభైరోజులు నాకు మలేరియా జ్వరం తగిలింది. అప్పటివరకు న న్నెవ్వరూ తాకేవారు కారు. ఆ జ్వరంవల్ల అప్పుడు నాకు నిలబడే శక్తిగాని, సహాయం లేకుండా నడిచే శక్తిగాని ఉండేది కాదు. కొత్తగా వచ్చిమాతో చేరిన ఈ వృద్ధు, సన్యాసి కావడంచేత నాకు సహాయపడే బాధ్యత వహించాడు.

ఆయన ముక్కోపి. మాట్లాడితే శాసించినట్టు ఉండేది. చుట్టు పక్కల వారంతా ఆయనను చూసి భయపడేవారు.

ఆశ్రమ స్వీకారానికి పూర్వం మధ్య భారతం దేవాస్‌లో రెవిన్యూ శాఖలో ఉద్యోగిగా పనిచేశాడు. అధికారం చలాయించడంలో నానాసాహేబ్‌గాని, ఝూన్సీరాణిగాని ఆయనకు సాటిరారు!

ఒక్కరోజైనా ఆయన నా పాదాలకు పూజ చెయ్యకుండా మానలేదు. ఆ నియమాన్ని పాలించకుండా ఆయనను వారించ గల వారెవరూ లేరు. ఆ పూజ చేసేటప్పుడు ఆయన కళ్ల వెంట బొటబొట నీరు కారుతూ ఉండేది.

ఆయన బంధువు లొకరు తీర్థయాత్ర చేస్తూ కంచికి వచ్చి నన్ను చూశారు. ఆ సన్యాసితో కొంతసేపు మాట్లాడిన పిమ్మట ఆయన నా దగ్గిరకు వచ్చి నాతో నిష్ఠురంగా మాట్లాడారు.

తన బంధువైన ఆ సన్యాసి శతవృద్ధు కదా, భగవంతునికంటె నన్ను అధికంగా భావించి పూజిస్తున్నాడు కదా, అలాంటి వ్యక్తిపట్ల ఏ మాత్రం అభిమానంగాని, సానుభూతిగాని చూపించకుండా మీ రిట్లా ఎందుకు ఉంటున్నారు అని నన్ను దుయ్యబట్టారు. ఆయన అంత కోపగించుకున్నా, నేనేమీ ఉలకలేదు, పలకలేదు.

ఒకసారి మేము తిరుపతి యాత్రకు బయలుదేరాము. వృద్ధస్వామి కూడా అప్పుడు మాతో ఉన్నాడు. వేంకటేశ్వరుని సేవించడానికి నేను కొండపైకి నడిచి వెళ్లాను. బాలాజీ దర్శనం చేసుకుని కిందికి నడిచి వస్తున్నాము.

కిందినుంచి వస్తూ ఆ వృద్ధ సన్యాసి దారిలో మాకు ఎదురైనాడు.

ఆయన వయస్సునుబట్టి అనండి, సన్యాసి కావడంవల్ల అనండి, లేదా మామఠంతో ఆయన కున్న సంబంధంచేత అనండి, ఏమైతేనేం, ఆయనకు ప్రత్యేకం బాలాజీ దర్శనం చేయించడానికి ఆలయ అధికారులు అంగీకరించారు.

కాని, ఆయనమాత్రం అందుకు సమ్మతించలేదు. ''ఇక్కడే నా బాలాజీ'' అంటూ నా పాదాలు పట్టుకున్నాడు. అంతదూరం కొండ ఎక్కి వచ్చిన వాడు, తీరా బాలాజీ దర్శనం లేకుండానే తిరిగివచ్చాడు!

పరమేశ్వరుడు కొందరిని పరుల కోసమే బతకమని సృష్టించాడు!

--ఇది నేను నా జీవితంలో నేర్చుకున్నాను.





అందరిలో ఈశ్వరపదార్థం

ప్రతి మానవునిలోనూ ఈశ్వరపదార్థం ఉండనే ఉన్నది. కనుక భక్తులైన వారు సకల మానవులనూ ఒక్క రీతిగనే భావించవలసి ఉంటుంది.





జగద్గురు ప్రశస్తి

జ్ఞాత్వా తదీయాం బహవశ్శుభేఛ్ఛా మధీత వేదా అయతంత విప్రాః,

వేదార్థ విజ్ఞాన సమార్జనాయ జయంచ తత్రాపురసి ప్రకృష్టం.

స్వామి ప్రోత్సాహంతో అనేక మంది విప్రోత్తములు వేదార్థ జ్ఞానమును ఆర్జించారు.

వర్షాణి వింశత్యధికాని సమ్యగ్‌ వేదాంతశాస్త్రం బహుపండితేభ్యః,

అధీత్య యజ్ఞాతు మశక్త ఆసీ ద్విద్వాన్‌ క్షణాద్వేత్తి తదస్య బోధాత్‌.

పండితులు ఇరవయ్యేళ్లు వేదాంత శాస్త్రం చదివి గ్రహింపజాలని రహస్యాలను ఒక్క క్షణంలో స్వామి ఉపదేశం చేత గ్రహించగలరు.

అర్థోపవాసీ నసకృత్య ఖిన్నః పూర్ణోపవాసీ నజహోతి వర్చః,

అభౌతికం తస్య బలం సమస్త మోజశ్చతేజశ్చ విలక్షణం తత్‌.

స్వామి అల్పాశనులు. అయినా, కార్యనిర్వహణలో అలసట నొందరు. పూర్ణోపవాసం చేసేప్పుడు కూడా వర్చస్సు తగ్గదు. స్వామి శక్తి లోకోత్తరం.

లోకకల్యాణ కార్యాణా మంగత్వేనైవ నా2న్యధా,

అద్భుతాని ప్రవర్తంతే తస్మా త్కీర్తి పరాఙ్ముఖాత్‌.

లోకసంగ్రహ నిర్వహణలో భాగంగానే స్వామి తమ విభూతులను ప్రదర్శిస్తారే తప్ప ప్రదర్శన కోసం కాదు.

Nadichedevudu   Chapters