Nadichedevudu   Chapters  

 

24. 'భక్తు డెందు చనిన పరతెంతు వెనువెంట'

కొందరు భక్తుల అనుభవంలో ఉన్న మరొక విశేషం: స్వామిని దర్శించడానికి ఎక్కడినుంచి బయలుదేరినా, ఏ వేళ బయలుదేరినా, ఆ ప్రయాణం నిర్విఘ్నంగా కొనసాగుతుంది. స్వామి దర్శనానికి వెళ్లే భక్తులు మంచిరోజూ, మంచి మూహూర్తం కూడా వెతుక్కోరు. అయినా, ప్రయాణంలో ఏ ఆటంకాలూ ఎదురురావు.

అనుకున్న రైలు అందుతుంది. రైలులో చోటు దొరుకుతుంది. ఒక్కొకప్పుడు, సంచారంలో స్వామి ఏ మారుమూల గ్రామంలోనో మకాం చేస్తారు. ఆ గ్రామానికి రైలు ఉండదు. బస్సులో పోవలసి వస్తుంది. కొంతదూరం నడవ వలసిన అవసరం కూడా ఉంటుంది. అయినప్పటికీ విఘ్నం లేకుండా ప్రయాణం సాగుతుంది. రైలు ఆలస్యంగా రావడంవల్ల బస్సు దొరకదేమో అనుకుంటే, ఆ రోజున ఏ కారణంచేతనో బస్సుకూడా ఆలస్యంగా బయలుదేరుతుంది! ఇదంతా వింతకాదు, వినోదమూకాదు. సహజంగా జరుగుతుంది.

కాఫీ, టీలు సేవించడంచేతా, వేళకు ఆహార నిద్రలు లేకపోవడంవల్లా, ఇంకా ఏవేవో ఇతర అలవాట్లకు బానిసలుకావడం మూలంగా, ఈ కాలంలో అనేకమందిని అనేక విధాలైన రుగ్మతలు వెంటాడుతూ ఉంటాయి. ఇల్లు విడిచి వెళితే వాటివల్ల మరీ ఇబ్బంది పడుతుంటారు. కాని, స్వామి దర్శనానికి బయలుదేరగానే, ఆ బాధలన్నీ సమసిపోవడమో, లేదా, బహు పరిమితంగా కనిపించడమో జరుగుతుంది. తిరిగి ఇంటికి చేరుకునే వరకూ అవి వారి జోలికి రావు.

ఇదంతా ప్రత్యక్షానుభవమేగాని, ఊహాజనితంకాదు; మనస్తత్వపు (Pay-chological) మార్పుకాదు.

థాయ్‌లాండ్‌ దేశపు రాజగురువు పూజ్య వామదేవముని, వారి అనుయాయులతో భారతదేశం విచ్చేశారు. స్వామి విజయవాడలో ఉండగా 1968 అక్టోబరు 14 తేదీన అక్కడికి వచ్చి స్వామిని దర్శించారు.

స్వామిని దర్శించినప్పుడు తమ పూర్వీకులు, తమ తాత ముత్తాతలు స్వామిలో తమకు ప్రత్యక్షమైనట్టు తోచిందని అన్నారు శ్రీ దేవముని.

స్వామిని సందర్శించి, స్వామితో సంభాషించి, స్వామి చేతితో ప్రసాదం స్వీకరించి, స్వామి సెలవు పుచ్చుకొని ఒక నెలరోజుల పాటు భారతదేశమంతా తిరిగి, దివ్యక్షేత్రాలను దర్శనీయమైన ప్రసిద్ధ స్థలాలను వీక్షించారు.

తమ పర్యటనంతా ముగిసిన తరువాత రాజగురువు ఇలా అన్నారు:

''నెల రోజులు మేము చేసిన దేశ పర్యటనలో స్వామి మా వెంట ఉండి, మాకు ఏవిధమైన అసౌకర్యమూ లేకుండా, ప్రతి చిన్న విషయంలోనూ మాకు సాయపడినట్టు స్పష్టంగా తోచింది.

విజయపురి, నాగార్జునసాగర్‌, తిరుపతి, కంచి, మద్రాసు, మధుర, ఢిల్లీ, ఆగ్రా, హరిద్వార్‌, హృషీకేశ్‌, అయోధ్య, సారనాధ్‌, గయా, నలందా, కలకత్తా ఈ స్థలాలన్నిటా, ప్రత్యక్షంగానో, పరోక్షంగానో స్వామితో మాకు సంబంధం ఏర్పడింది....

స్వామినామం, స్వామిరూపం, స్వామిదండం, స్వామి పాదుకద్వయం....ఇవన్నీ మా హృదయ సీమల్లో స్థిరంగా చోటు చేసుకున్నవి!''

Nadichedevudu   Chapters