Nadichedevudu   Chapters  

 

26. అది ఒక లీల!

1965 లో మద్రాసు సమీపాన తిరువొత్తియూర్‌లో నా షష్టిపూర్తి స్వామి సమక్షంలో శాస్త్రీయంగా జరగడం నా అదృష్టం.

అది మొదలు ఏటేటా నా జన్మనక్షత్రం నాటికి దేశంలో స్వామి ఏ మూల ఉన్నా అక్కడికి వెళ్ళి స్వామిని సందర్శించి రావడం ఈశ్వరానుగ్రహంవల్ల ఈనాటివరకూ నిరంతరాయంగా జరుగుతున్నది.

1971 డిసెంబరులో నా జన్మదినానికి స్వామి దర్శనం చెయ్యాలి. స్వామి కార్యక్రమం తెలుపవలసిందని కంచి మఠం వారిని కోరాను.

'ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో మారుమూల గ్రామాల్లో ఎక్కడో పర్యటన చేస్తున్నారు, మీరు వెళ్ళే రోజుకు ఎక్కడ మకాం చేస్తారో చెప్పడం సాధ్యంకా'దని మఠంవారు సమాధానం రాశారు.

నిజమే. కదాచితుగా తప్ప, సంచారంలో ఉన్నప్పుడు స్వామికి ఒక నిర్ణీత కార్యక్రమం అంటూ ఉండదు- మంత్రులకూ, ఉద్యోగస్థులకూ ఉన్నట్టు. ఏ రోజు ఎక్కడ ఉంటారో, ఎక్కడనుంచి ఎక్కడికి బయలుదేరుతారో, అంతేవాసులైన శిష్యులకూ, అత్యంత సన్నిహితులకు కూడా సరిగ్గా తెలియదు. స్వామి ఎప్పుడు బయలుదేరితే అప్పుడే మూటాముల్లె సద్దుకుని శిష్యులు వెంట నడుస్తారు.

మాటవరసకు 'మూటా ముల్లె' అన్నానేగాని, మూటతప్పితే, ముల్లె అంటూ ఏమీ ఉండదు స్వామి ప్రయాణంలో. 'కరతల భిక్షా, తరుతల నిద్రే' కదా!

ఏమైనాసరే, డిసెంబరు 15కు చిత్తూరు జిల్లాలో స్వామి ఎక్కడ ఉంటే అక్కడ వారి దర్శనం చేదామని కృతనిశ్చయులమై దంపతులం ఇద్దరం భద్రాచలం నుంచి బయలుదేరి తిరుపతి చేరుకున్నాము. తిరుపతి చేరితే, స్వామి ఎక్కడ ఉండేదీ అక్కడ బస్సుల వాళ్ళుగానీ, ఇతరులెవరైనాగానీ మాకు చెప్పగలరనే నమ్మకంతో.

తిరుపతి సత్రాల్లో వారినీ వీరినీ వాకబుచేశాము. కొద్ది రోజుల కిందట ఫలానా గ్రామంలో ఉన్నట్టు విన్నామనీ, అక్కడికి వెళితే ప్రస్తుతం ఎక్కడ ఉండేదీ తెలియవచ్చనీ, బస్సు కండక్టర్లు ఒకరిద్దరు చెప్పారు. ఆ మాత్రం ఆధారం దొరికినందుకు సంతోషించి, బస్సుఎక్కి, వారు చెప్పిన ఊరికి టిక్కెట్లు తీసుకున్నాం.

మేము బయలుదేరే ముందు తిరుపతిలో కుంభ వృష్టి. ఆ ముందురోజు ఒక్క చినుకు లేదు. ఆకాశం చిల్లి పడ్డట్టు కురిసింది. సగం తడుస్తూ బస్సు ఎక్కాము. ఆ మర్నాడే నా జన్మదినం కాబట్టి ఎట్లాగైనా సరే, ఆనాటికి స్వామి సమక్షంలో ఉండాలి అని మా సంకల్పం.

బస్సు ఎక్కికూచుని, ప్రయాణీకులను ఒక్కొక్కరినీ అడగడం మొదలు పెట్టాము. ఆరా తీయగా తీయగా, చివర కొక కొండగుర్తు దొరికింది. అక్కడికి సమీపంలో రామగిరి అనే కొండ ఉంది. ఆ కొండ దిగువను వాలీశ్వరాలయం ఉంది. కొండపైన మరొక ఆలయం-స్కందగుడి కాబోలు ఉన్నది.

ఆ ఆలయాలు శిథిలావస్థలో ఉంటే, వాటిని పునర్నిర్మాణం చెయ్యడానికి సమీప గ్రామస్థులు కొందరు నడుంకట్టారు. కంచిస్వామిని రప్పిస్తే ఆలయ పునరుద్ధరణ సులభంగా నెరవేరుతుందని వారి విశ్వాసం. ఆ విధంగా స్వామి అక్కడ మకాంచేస్తున్నారని కొందరు ప్రయాణీకులు చెప్పారు. బస్సు దిగి స్వామి ఉన్న రామగిరి చేరుకున్నాము.

మా అదృష్టం వల్ల స్వామి చుట్టూ జనం లేరు. ఆలయానికి దగ్గరగా చిన్న కొలను గట్టుపైన కూచున్నారు స్వామి ఏకాంతంగా. గబగబా వెళ్లి స్వామికి సాష్టాంగపడ్డాము.

మర్నాడు నా జన్మ నక్షత్రమనీ, భద్రాద్రి నుంచి బయలుదేరి తిరుపతి వచ్చామనీ, తిరుపతి నుంచి దారిలో స్వామి ఎక్కడున్నారు అంటూ ఒక్కొక్కరినీ అడుగుతూ చివరకు రామగిరి చేరామనీ విన్నవించాము.

స్వామి: మీరు వచ్చేప్పుడు తిరుపతిలో వర్షం కురిసిందా?

నేను: ఎక్కడి వర్షం స్వామీ, కుండపోతగా కురిసింది. మేమిక్కడికి చేరుకోగలమా అని సందేహించాము.

స్వామి: అలాగా! తిరుమలపై ఈ మధ్య వర్షాలు లేక యాత్రికులు నానా అవస్థలు పడ్డారు. ఆలయం ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసరు నా సలహా అడిగారు. వరుణజపాలు చేయించవలసిందని చెప్పాను. వాటిని చక్కగా నిర్వహించగల పురోహితులను కూడా ఏర్పాటు చేశాము. మండలం రోజులు దీక్షతో, ఆహారనియమంతో జపాలు చెయ్యాలి. నిన్నటితో నలభై రోజులు పూర్తి అయినాయి - అందుకని అడిగాను.

మేము ఆశ్చర్యపోయాము. ఈ కాలంలో కూడా వరుణజపం చేస్తే, వానలు కురవడం సంభవమేనా!

* * *

భద్రాద్రిలో మా 'బిల్వవనం' నుంచి భద్రంగా మూటకట్టుకు తెచ్చిన బిల్వపత్రాన్ని స్వామి ముందు ఉంచాము. ఆ బిల్వవృక్షం మా భూమిలో కొంతకాలం క్రితం స్వామి స్వహస్తంతో నాటిందే. పత్రాన్ని కళ్లకద్దుకుని, దానిని వాలీశ్వరాలయంలో ఈశ్వరుడికి అర్చన చెయ్యడానికి పంపారు స్వామి.

* * *

కొంతసేపయింది. సావకాశంగా స్వామి మాటలు వింటూ కాలం గడపడానికి అవకాశం లభించింది గదా అని ఆనందిస్తున్నాము. ఇంతలో కొందరు పురజనులు వచ్చారు. కొండపైన ఉన్న ఆలయం చూడ వలసిందని స్వామిని ప్రార్థించారు.

స్వామి బయలుదేరారు. ఇద్దరు శిష్యులు స్వామి వెంట వచ్చారు. మేము కూడా స్వామితో వెంట నడిచాము. కొండపైకి దారి తిన్నగా లేదు. మెట్లన్నీ శిథిలమై పోయినై. అడుగులో అడుగు వేసుకుంటూ, కిందచూస్తూ, జాగ్రత్తగా నడవాలి. దానికి తోడు స్వామికి ఒక కన్ను పూర్తిగా కనిపించదు.

శిష్యులు స్వామికి అరవంలో చెబుతున్నారు. ''ఇక్కడ అడుగు వెయ్యండి; అక్కడకాదు. ఇటు, ఇటూ'' అంటూ. శిష్యులైనా స్వామిని తాకరు కదా! శిష్యులు చెప్పినట్టే చేస్తున్నారు స్వామి.

ఇంతలోకి రానేవచ్చింది వాన. దారీ తెన్నూ లేని మెట్లు అసలే కాళ్లు జారేట్టున్నవి. చూపుగల వాళ్లకే భయమేస్తున్నది ఎక్కడ కాలుజారుతుందో అని. మరి స్వామి మాటో! 'వాన నిలిచే వరకైనా ఆగండి' అని చెప్పగల ధైర్యం ఎవరి కుందీ? ఏం చెయ్యాలి అని అందరూ యోచిస్తున్నారు. 'ఆగితే బాగుండును' అని గుసగుసలాడుతున్నారు.

శిష్యులు చెపుతుంటే అడుగులో అడుగు పెడుతూ నడిచిన స్వామి గబగబా అందరికంటె ముందు నడవడం మొదలెట్టారు! మిగిలిన వాళ్లు స్వామిని అనుసరించడమే కష్టమైంది!!

దారిలేని దారిలో, పైపెచ్చు వర్షంలో, కాలు పెడితే జారిపడే కొండరాళ్లపైన, సరిగ్గా కళ్లు కనిపించని స్వామి, అందరి కంటే ముందుగా ఎలా నడవగలిగారో స్వామికే తెలియాలి!

ఇలాంటి లీలలు అనేకం అప్పుడప్పుడు ప్రదర్శిస్తూ ఉంటారు స్వామి. ప్రదర్శించడం కాదు; అవి జరుగుతూ ఉంటవి. ఎప్పుడో, ఎందుకో, ఎవరికొరకో, మనం ఊహించలేము.

ఒక్కటి మాత్రం నిజం. జ్ఞానులకూ, యోగులకూ, మహాతపస్వులకూ లభ్యమయ్యే సిద్ధులన్నీ సహజంగానే ఉన్నవి స్వామికి.

'జన్మౌషధి మంత్ర తపః

సమాధిజాః సిద్ధయః'

అంటూ, సిద్ధులు పుట్టుకతోనే సిద్ధించవచ్చునంటాడు పతంజలి మహర్షి.

ప్రకృతి శక్తులపై అధికారం చలాయిస్తారు స్వామి అనడానికి అనేక నిదర్శనాలున్నవి. వర్షం కురువమంటే కురుస్తుంది. ఆగమంటే ఆగుతుంది!

* * *





నైష్కర్మ్యానికి మార్గం

సకాలంలో సత్కర్మలను ఆచరించడమే నైష్కర్మ్యానికి మార్గం. కర్మే ఆకర్మణ్యతకు సాధన మవుతుంది. ఆ పిమ్మట పొందదగిన దంటూ లేదు.



Nadichedevudu   Chapters