Nadichedevudu   Chapters  

 

34. ''అదే నాకూ ఆశ్చర్యం!''

మద్రాసు మకాంలో మైలాపూరులోని సంస్కృత కళాశాల భవనంలో స్వామి విడిది. భవనం చుట్టూత పందిళ్లు వేశారు వేలాది ప్రజకూచునేందుకు.

ఒక రోజున త్రిపురసుందరీ, చంద్రమౌళీశ్వరుల రెండో కాలం పూజ జరుగుతున్నది. చుట్టూ వేసిన పందిళ్లు చాలక భక్తులు చాలా మంది ఆరు బయట నిలచి పూజ చూస్తున్నారు.

అనుకోకుండా ఆకాశం మేఘావృతమయింది. వర్షం పడుతుందేమోనని బయట నుంచున్న జనం ముందుకు ముందుకు తోసుకొస్తున్నారు. భారీవర్షం కురిస్తే పందిళ్లయినా ఆగేట్టు లేవు. తడిసిపోతా మని భక్తులు ఆందోళన పడుతున్నారు.

ఆనాడు చిన్న స్వామి శ్రీ జయేంద్ర సరస్వతి పూజలో కూచున్నారు. పెద్దస్వామి పందిరి వెలుపలికి వచ్చి ఆకాశంవైపు చూస్తున్నారు అదే పనిగా, కొన్ని నిమిషాలు అయ్యే సరికి, అంతగా భయపెట్టిన కారు మేఘం చెక్కలు చెక్కలుగా చెదిరిపోయింది. సహస్రకిరణాలతో సూర్యభగవానుడు దర్శనమిచ్చాడు.

స్వామి ప్రక్కనే ఉన్న ఒక వ్యక్తి ఈ దృశ్యమంతా తిలకిస్తున్నాడు.

''మీ సందేహం నివృత్తి అయిందా?'' అని స్వామి ఆ వ్యక్తిని అడిగారు.

'ఆహా, అయింది స్వామీ' అంటూ నీళ్లు నములుతూ సమాధానం చెప్పాడు ఆ వ్యక్తి.

ఆయన పేరు శ్రీ ఊటుకూరి నరసింహారావు; విజయవాడలో హరిజన సేవకుడుగా పేరుపడిన కాంగ్రెసు వాది.

ఈ కథంతా ఆయనే విజయవాడలో మా ఇంటికి వచ్చి నాకు వినిపించారు. తనకు స్వాములవార్లంటే నమ్మకం లేదనీ, వారి మహిమలను అంతకంటే నమ్మననీ, కాని మద్రాసులో తానీ దృశ్యం స్వయంగా తన కంటితో చూసిన తరవాత, తనలో ఏదో జిజ్ఞాస బయలుదేరిందనీ అన్నారు.

''అయితేమరి, మీకీ అనుమానాలూ, అపనమ్మకాలూ ఉన్నట్టు ఆ స్వామికి ఎలా తెలుసునండీ, మిమ్మల్ని ఆ ప్రశ్న అడగడానికి?'' అన్నాను నేను.

''అదే నాకూ ఆశ్చర్యం'' అన్నారు నరసింహారావు గారు!

* * *



శివపూజ - నారాయణస్మరణ

నేను భస్మాన్ని (విభూతిని) అలదుకొని శివపూజ చేస్తూ ఉంటాను. ఎవరైనా నాకు నమస్కరిస్తే 'నారాయణ, నారాయణ' అని 'నారాయణ' స్మరణ చేస్తాను.

Nadichedevudu   Chapters