Nadichedevudu   Chapters  

 

38. వింత శిక్ష!

కంచిమఠాన్ని అంటిపెట్టుకుని ఎందరో పరిచారకులున్నారు. వేదాధ్యయనపరులు, జమాఖర్చు లెక్కలు రాసేవారు, ఉత్తర ప్రత్యుత్తరాలు చూసేవారు, వంటవాళ్ళు, పశువులను కాచేవాళ్ళు, కావలి వాళ్ళు, మేళగాళ్ళు మొదలైన వారంతా.

వీరందరూ తప్పకుండా గుణవంతులూ, శీలవంతులూ అని చెప్పడానికి వీలులేదు. ఉత్తమ, మధ్యమ తరగతులున్నవి. ముఖంమీద విభూతి రేఖలున్నంత మాత్రాన, అందరిలో అపరిగ్రహ లక్షణా లన్నీ గూడుకట్టుకు ఉన్నవనుకోడానికి వీలులేదు.

రోజూ ఇంత అనుష్ఠానంతో, అతిధి సత్కారంతో, విద్వద్గోష్ఠులతో, వివిధ విషయ చర్చలతో మునిగి తేలుతూ ఉన్నా, మఠం వ్యవహారాలకు సంబంధించిన మంచి చెడ్డలు స్వామికి తెలియకుండా ఉండవు. అయితే, వాటిని పరిష్కరించడంలో ఆయన అవలంబించే పద్ధతులు వేరు. అవి మనకు అసాధారణంగా, ఆశ్చర్యజనకంగా తోచవచ్చు.

ఉదాహరణకు, భిక్షలు చేసేవారు ఎంత ఖరీదైనా పెట్టి భిక్షకు కావలసిన సామగ్రి అంతా సమృద్ధిగా, శ్రేష్ఠమైనదిగా ఎంచి తెస్తారు. ఏ వస్తువూ చాలలేదే అని అతిథులు అనుకోరాదు. ఇది అతిధ్యం ఇచ్చేవారి ఆశయం.

అయితే, ఒక్కొక్కప్పుడు భిక్షకు తెచ్చిన వస్తువు లన్నీ వంటలోకి రావు. ఈ సంగతి స్వామి ఎలాగో కనిపెడతారు. భోజనాలు అయిన తరవాత వంటచేసిన వాళ్లు వినేటట్టు, ''ఇవాళ పాయసంలో జీడిపప్పు అంతగా కనిపించలేదే! ధర ఎక్కువగా ఉన్నదని బహుశా జీడిపప్పు తగ్గించి తెచ్చి ఉండాలి. లడ్డులలో పచ్చ కర్పూరం వాసన రావడంలేదు. దానిని వెయ్యడం మనవాళ్లు మరిచిపోయి ఉండవచ్చు.'' అంటూ మృదువుగా వ్యంగ్యంగా మందలిస్తారు.

ఆ మర్నాటి నుండి శాకపాకా లన్నిటిలో అన్ని వస్తువులూ సమృద్ధిగా ఉంటాయి!

* * *

ఒక రోజున మఠం పరిచారకుడు ఒకడు తన తల కింద చిన్నమూట పెట్టుకుని నిద్రపోతున్నాడు. ఆ మూటలో ఏమున్నదో నని మేస్త్రీ మూట విప్పి చూశాడు. మూడు పడుల మినప్పప్పు కనిపించింది! ఆ సంగతి స్వామికి వినిపించాడు మేస్త్రీ.

మేస్త్రీ చెప్పిన దంతా స్వామి విన్నారు. చివరకు ఇలా అన్నారు: ''ఆ పరిచారకుడికి మినప్పిండితో చేసే వడ లంటే చాలా ఇష్టం కావచ్చు. మఠంలో వడలు చేసినప్పుడు అతనికి కావలసి నన్ని వడ్డించి ఉండరు! ఒక పని చెయ్యండి. ఆ మూడు పడుల మినప్పప్పూ బాగా మెత్తగా రుబ్బి, అందులో అల్లం, పచ్చిమిరపకాయ, జీలకర్ర మొదలైన వస్తువులన్నీ దండిగా వేసి, చాలినంత నూనెపోసి, ఆ పరిచారకుడు ఎన్ని తింటే అన్ని వడ్డించండి. అతడు తృప్తిగా భోంచెయ్యాలి.

అది మొదలు ఆ సేవకుడు ఇంకెన్నడూ అలాంటి పనులకు దిగకుండా తన ప్రవర్తనను దిద్దుకున్నాడు.

* * *

విజయవాడలో ఒకనాడు కృష్ణానదిలో స్నానం చెయ్యబోతూ మఠం పరిపాలనను గురించి పక్క నున్న వారితో స్వామి ఇలా అన్నారట. ''మఠం అన్నంత మాత్రాన మఠంలో ఉన్న వారందరూ సత్యహరిశ్చంద్రులు అనుకో నక్కరలేదు. ఒడ్డునుంచి చూస్తే కృష్ణనీరు నిర్మలంగా కనిపిస్తుంది. నీటిలో దిగి కొంత దూరం వెళితే అడుగునంతా బురదగా ఉంటుంది!''

స్వామి వాస్తవిక పరిజ్ఞానం, లోకానుభవం అంతాయింతా కావు. అయితే స్వామి వ్యవహరించే తీరు మాత్రం వేరు.

బౌద్ధమతాన్ని వెళ్లగొట్టింది భగవత్పాదులా?

శంకర భగవత్పాదులు బౌద్ధమతాన్ని హిందూదేశం నుంచి వెళ్లగొట్టారని అందరూ అనుకుంటారు. కాని, శంకరుల భాష్యాలను చూస్తే వాటిలో బౌద్ధమత ఖండన చాలా అరుదుగా కానవస్తుంది. ఆయన చేసిన ఖండన మంతా మీమాంస మీదా; సాంఖ్యం మీదా సాగింది.

Nadichedevudu   Chapters