Nadichedevudu   Chapters  

 

39. మరుపురాని సంఘటన

శ్రీ బులుసు సూర్యప్రకాశ శాస్త్రి

'ఆంధ్రప్రభ'లో జగద్గురుబోధలు చదువుతూ ఉండగా జగద్గురు చంద్రశేఖరేంద్ర సరస్వతిస్వామిని దర్శించాలని కోరిక కలిగింది. అయితే, నావంటి వానికి ఆ మహనీయుని దర్శనం అయ్యేనా అని సందేహం కలిగింది.

శ్రీవారికి సన్నిహితులైన శ్రీ కుప్పా లక్ష్మావధానిగారికి జాబు రాశాను, శ్రీవారికి పరిచయం చేయవలసిందని. ''నేను మిమ్ము పరిచయం చెయ్యనక్కరలేదు. మీరు స్వామివారి అనుగ్రహం పొందగలరు. కంచి వెళ్లి దర్శనం చెయ్యండి'' అని శ్రీ లక్ష్మావధానిగారు సమాధాన మిచ్చారు.

స్వామిని ధ్యానించుకుంటూ అప్పుడు శ్రీవారు మకాంచేస్తున్న అంబి అనే గ్రామానికి వెళ్లాను. పీఠం తాలూకు కార్యకర్తలను స్వామివారిని ఎప్పుడు దర్శించవచ్చునని అడిగాను. ఉదయం 6 గంటలకు గోపూజ, గజపూజ జరిగేటప్పుడు దర్శించ వచ్చునని చెప్పారు. గోపూజ, గజపూజలు చూశాను. పూజచేసిన పుష్పాలను గజరాజు స్వామివారి శిరస్సున ఉంచిన దృశ్యం మనోహరంగా ఉంది. ఆ సమయంలో స్వామికి సాష్టాంగ నమస్కారం చేశాను. స్వామి నా వైపు చూసి ''ఎవరూ? బులుసు సూర్యప్రకాశశాస్త్రిగారా, తెనాలి నుంచి వచ్చారా?'' అంటూ అభయహస్తం చూపించారు. నా శరీరం జలదరించింది. నన్ను గురించి శ్రీవారికి ఎవ్వరూ చెప్పలేదు. మరి, శ్రీవారికి నాపేరూ, ఊరూ ఎలా తెలిసిందా అని ఆశ్చర్యపోయాను. శ్రీవారు సర్వజ్ఞులు.

నాటి రాత్రి స్వామివారు శ్రీ చంద్రమౌళీశ్వరుని అర్చన చేసి చిన్నగదిలో కూర్చున్నారు. వివిధప్రాంతాలనుంచి వచ్చిన ఉద్యోగస్థులతో సహా అనేకులు బారులు తీరి నిలుచున్నారు. స్వామివారొక పరిచారకుని పిలిచి ఎక్కడో చివర నిలబడిన నన్ను తమ దగ్గరకు పిలిపించుకున్నారు. సాష్టాంగ పడ్డాను. కూర్చోమని సంజ్ఞచేశారు. కూచున్నాను. ''బులుసు లేని యజ్ఞం, బలుసు లేని శ్రాద్ధం'' అనే సామెత తెలుసునా? అని అడిగారు. తెలుసు నన్నా. తరువాత, నా పరిస్థితులు, నా చదువు, నా గురువులు, మా పెద్దలు బులుసు పాపయ్య శాస్త్రి, పూర్ణ సోమయాజులు, అచ్చయ్య శాస్త్రిగారు, బులుసు సాంబమూర్తి గారు, వారి తండ్రి మొదలైన వారందరిని గురించి సుమారు గంటసేపు మాట్లాడారు.

సోమవారం మూలానక్షత్రం రాత్రి 12-5 గంటలకు దీక్షావిధానంగా ఆంజనేయం ఉపదేశించారు. ఇది మరపురాని సంఘటన. స్వామి దర్శనం సర్వదేవతా సందర్శనం.

బుద్ధి వాస్తవ పక్షపాతి

నీరు ఏ విధంగా నిమ్న ప్రదేశం చిక్కే వరకూ అల్లాడుతుంటుందో అదే విధంగా ఒక వస్తువు వాస్తవస్థితి తెలియనంతవరకూ బుద్ధి కూడా అల్లాడుతుంటుంది. నిజం తెలిసిన తర్వాత శాంతిని పొందుతుంది.

Nadichedevudu   Chapters