Nadichedevudu   Chapters  

 

40. ''స్వామి కరుణతో కడుపు పండింది''

సంతానం కోసం జపాలూ, తపాలూ, దానాలూ, ధర్మాలూ చేస్తారు. ఔషధాలు సేవిస్తారు. శస్త్రచికిత్స చేయించుకుంటారు. ఇన్ని చేసినా, కొందరికి సంతాన ప్రాప్తి ఉండదు.

ఆడసంతతి ఉన్నవారు పుత్రసంతతి కోసం విశ్వప్రయత్నం చేస్తారు. అపుత్రస్య గతిర్నాస్తి అని విశ్వసించేవారు వీరు.

శ్రీ ఓరుగంటి నృసింహయోగి కోనసీమ పండితుడు. ఆంధ్రంలో, సంస్కృతంలో అనర్గళంగా గంటలకొలది ఉపన్యసించే శక్తి ఉన్నవాడు. హిమవత్పర్వతప్రాంతాల్లో కొంతకాలం గురుశుశ్రూషచేసి యోగంలో అనుభవంగడించి, యోగిగా పేరు పొందిన వ్యక్తి.

కంచిస్వామి ఆంధ్రదేశసంచారం చేస్తూ విజయవాడ మకాంలో ఉండగా ఒకనాడు శ్రీ నృసింహయోగి మా కార్యాలయానికి వచ్చి, తన రాకను గురించి ఇలా అన్నాడు. ''ఆచార్యస్వామి దర్శనం కోసం విజయవాడ వచ్చాను. మాకు మగ సంతతి లేకపోగా, ఈ మహానుభావుడి అనుగ్రహం వల్ల మా కొక పుత్రుడు కలిగాడు. ఆ పాపణ్ణి స్వామి పాదాలపై పడవేసి, పుత్రభిక్ష పెట్టినందుకు కృతజ్ఞతను తెలుపుకోడానికి ఇక్కడికి వచ్చాము.''

అదే సందర్భంలో ఇంకో మాట కూడా అన్నాడు. శ్రీ నృసింహయోగి '' అయ్యా, నా ¸°వనదశలో నాకంటె విద్యావంతు డెవ్వ రున్నాడనే అహంభావంతో వేదాంత విషయంపై ఈ స్వామితో వాదనకు తలపడ్డాను. అది నా అజ్ఞానదశ!''

ఇద్దరం నవ్వుకున్నాము.

దశరథమహారాజు అంతటివాడు పుత్రసంతతికై 'పుత్ర కామేష్టి' యాగం చేశాడు. పుత్రులు లేకున్న గతులు లేవు అనే నమ్మకంతో కాకపోయినా, తన పేరు నిలిచేందుకైనా ఒక్క మగనలుసు కలిగితే బాగుండునని చెట్టు చెట్టుకూ, పుట్ట పుట్టకూ మొక్కేవారింకా సంఘంలో ఎందరో ఉన్నారు. స్వామి అనుగ్రహంతో సంతానం బడసి సంతోషిస్తున్నవారిని అనేకమందిని ప్రత్యక్షంగా చూస్తున్నాను.

ఆధునికనాగరికతాప్రభావం చేత కొందరు స్త్రీ పురుషులు అసలు సంతానంతో పనే మున్నదని గర్భనిరోధక మార్గాలు అనుసరించవచ్చు. సంతానవిషయంలో ఆడ, మగ భేదమే ముందనే వారుండవచ్చు. కాని, వివాహం కేవలం స్త్రీ పురుషుల కామవ్యాపారం మాత్రమే కాదనీ, సత్సంతానప్రాప్తి కొరకనీ సనాతనుల విశ్వాసం. వైవాహికవ్యవస్థకు పరాకాష్ఠ సంతానమే నని నమ్మేవారు విల్‌డ్యూరెంటు వంటి తత్వవేత్తలూ, మహామేధావులూ పాశ్చాత్యులలో సైతం లేకపోలేదు.

* * *
రాచరికం ధర్మబద్ధం కావాలి

రాజు కూడా ప్రజలవలె శాస్త్రానికి బద్ధుడు. రాచరికం ధర్మబద్ధంగా ఉండాలి. పాలకులకూ, పాలితులకూ ఉన్న ఈ ధర్మశ్రద్ధే మనదేశానికి ధర్మక్షేత్రమన్న పేరు తెచ్చింది.

Nadichedevudu   Chapters