Nadichedevudu   Chapters  

 

41. స్వామిసన్నిధిలో షష్టిపూర్తి

విశ్వావసునామ సంవత్సర మార్గశిర బహుళ ఏకాదశి నేను పుట్టిన రోజు. విశాఖ నక్షత్రం. ఇంగ్లీషుతేది 1905-12-22. మన పంచాంగం లెక్కకు 1965 డిసెంబరు 20 తేదికి 60 సంవత్సరాలు నిండుతవి.

షష్టిపూర్తి ఉత్సవం కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి సమక్షంలో జరుపుకుందామని సంకల్పించుకున్నాము. నిజానికి, అది మా శ్రీమతి సంకల్పమే. నేను 'బాగు బాగు' అంటూ తల ఊపాను.

స్వామి అందుకు దయతో సమ్మతించారు. ఆ నాటికి తాము ఎక్కడ ఉంటే అక్కడికి బంధుమిత్రులను, పండితులను వెంటబెట్టుకుని రమ్మన్నారు.

డిసెంబరు నెలలో స్వామి మద్రాసు నగరంలో, మైలాపూరు సంస్కృత కళాశాల భవనంలో మకాం చేస్తున్నారు.

స్వామి ఆదేశం ప్రకారం ఆ రోజుకు నేను నా తల్లిదండ్రులతో, కుటుంబంతో, బంధుమిత్రులతో, విజయవాడ, గుంటూరు పట్టణాలనుంచి దయచేసిన పండితులతో, పురోహిత బృందంతో మద్రాసు చేరాను.

పూర్వశ్రమంలో శ్రీ స్వామిపాదుల సోదరులు శ్రీ సాంబమూర్తిశాస్త్రి గారు సెంట్రల్‌ స్టేషనుకువచ్చి, స్వామి మైలాపూరునుంచి తిరువొత్తియూరుకు మకాం మార్చారని చెప్పి, మమ్మందరిని తిరువొత్తియూరుకు వెంటబెట్టుకు వెళ్లారు.

తిరువొత్తియూరు పుణ్యక్షేత్రం. సంగీత త్రిమూర్తులలో ఒకరైన త్యాగరాజు సందర్శించిన ఊరు. కామకోటి పరంపరలోని పూర్వ పీఠాధిపతులలో ఒకరు సిద్ధిపొందిన స్థలమది.

మంటపారాధనంతో మహాకలశ స్థాపనం జరిగింది. అధిదేవతా, ప్రత్యధిదేవతలతో మృత్యుంజయుణ్ణి ఆవాహనం చేశారు. సప్తచిరంజీవులను, నవగ్రహాలను, సంవత్సర నక్షత్రదేవతలను, దిక్పాలాదులను ఆవాహనంచేసి, యథావిధిగా పూజలు జరిపారు.

పరమనైష్ఠికులు, ఆహితాగ్నులు అయిన శ్రీ కప్పగంతుల లక్ష్మీపతి చయనులుగారు బ్రహ్మగా వ్యవహరించారు. పౌండరీకాది మహాక్రతువులు ఆచరించిన శ్రీ రెంటచింతల పౌండరీక యాజులుగారు, శ్రీ కప్పలవాయి యజ్ఞేశ్వర శర్మగారు, వారి సోదరులు రామశాస్త్రిగారు షష్టిపూర్తి ఉత్సవంలో పాల్గొన్నారు.

మహాపండితులు చతుర్వేదమంత్రాలు పఠిస్తూవుండగా మహదాశీర్వాదం ఆరంభ##మైంది. యాగశాల వేదఘోషతో ప్రతిధ్వనించింది. పెద్దలు స్వస్తివాచకం చెప్పబోతున్నారు. సరిగ్గా ఆ సమయానికి జగద్గురువులు శిష్యసమేతంగా సభామంటపానికి విజయంచేశారు. మేళతాళాలతో ఎదురేగి మహాస్వామిని మందిరంలో ప్రవేశ##పెట్టాము. శ్రీ చరణుల శుభాగమనంతో సభాభవనం కలకల లాడింది. ఆ వైభవం అవర్ణనీయం!

సభాసదుల పాదాభివందనాలు స్వీకరించిన పిమ్మట స్వామిపాదులు వేదిక నధిరోహించి, ఈ క్రింది శ్లోకం చదివి, సంస్కృతంలో వ్యాఖ్యానించగా, శ్రీ జమ్మలమడక మాధవరామశర్మగారు తెలుగులో దానిని సభ్యులకు వినిపించారు:

గుణదోషౌ బుధోగృహ్ణన్‌ ఇందుక్ష్వేలా వివేశ్వరః

శిరసా శ్లాఘతే పూర్వం పరం కంఠే నియచ్ఛతి||

ఈశ్వరుడు పాలసంద్రంలో పుట్టిన కాలకూట విషాన్నీ, చంద్రుణ్ణీ స్వీకరించి, చంద్రుని శిరస్సున ధరించి, విషాన్ని పైకి రానీకుండా కంఠంలోనే ఇముడ్చుకున్నట్టు, పండితుడు పరుల గుణాలను శ్లాఘిస్తూ దోషాలను దాచుతాడు.

''వేంకటాధ్వరి రచించిన విశ్వగుణాదర్శ చంపువులో కృశాను, విశ్వావసులనే ఇద్దరు గంధర్వు లున్నారు. వారిలో కృశాను ఇతరుల దోషాలను వెలిబుచ్చుతాడు. విశ్వావసు వారి గుణాలను మాత్రమే ప్రకటిస్తాడు. అదే విధంగా విశ్వావసునామ సంవత్సరంలో జన్మించిన ఈ నీలంరాజు వెంకట శేషయ్య గుణ గ్రహణ పారీణుడై, గుణ ప్రకటన చేస్తూ చిరంజీవిగా వర్థిల్లాలని నారాయణ స్మరణ పూర్వకంగా ఆశీర్వదిస్తున్నాము''.

కవులూ, పండితులూ పద్యగద్యోపాయినాలు అందజేశారు. మిత్రులు శుభాకాంక్షలను అందించారు. పండిత సత్కారంతో సభాకార్యక్రమం ముగిసింది.

* * *

Nadichedevudu   Chapters