Nadichedevudu   Chapters  

 

44. శ్రీ కాంచీ క్షేత్రం

అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా|

పురీద్వారవతీ చైవ సపై#్తతే మోక్ష దాయకాః||

భారతదేశంలో గల సప్తమోక్షపురులలో శ్రీ కాంచీక్షేత్రం ఒకటి. అది మోక్షవిద్యకు మూలపీఠం. అద్వైతవిద్యకు ఆధారస్థానం. ఆదిశంకరులు అధిష్ఠించిన కామకోటిపీఠవైభవంతో ఆ నగరశోభ మరింత దేదీప్యమాన మయింది. ఆది శంకరులనుండి నేటివరకు అవిచ్ఛిన్నంగా కామకోటిపీఠజగద్గురుపరంపరను సాక్షాత్కరింపజేస్తున్న గురుపీఠానికి ఇది ఆవాసభూమి.

'కాంచీ' అనగా మొలనూలు. వడ్డాణం. మొత్తం భారతభూమికి ఇది నాభిస్థానం. అతి ప్రధానమైన శక్తిక్షేత్రం. పరమపూజ్యులైన ఆదిశంకరభగవత్పాదులు విదేహముక్తి నందిన పుణ్య స్థలం.

దేవర్షి అయిన అగస్త్యుడు తీర్థాటనం చేస్తూ కాంచీ క్షేత్రానికి విచ్చేసి శ్రీ కామాక్షీ దేవిని పూజించాడు. ''కామాక్షీ సదృశీదేవీ, నాస్తి మంగళ##దేవతా.''

శ్రీరామచంద్రుడు సీతావియోగంతో అడవిలో సంచరిస్తూ కాంచీ పట్టణానికి వచ్చి, అగస్త్యమహాముని వాక్యాన్ని పాటించి, ఇచట ఈశ్వరార్చన చేశాడు.

సర్వతీర్థం:- కంచికి పశ్చిమంగా 'సర్వతీర్థం' సరస్సు ఉన్నది. ఇది సర్వతీర్థాలకు సమాహారరూపమైన సార్థకమైన పేరు కలిగిఉన్నది.

ఆమ్రవృక్షం:- కంచిలో ఉన్న ఏకామ్రేశ్వర ఆలయంలో వేదాలన్నీ మామిడిచెట్టు రూపంలో ఆవిర్భవించాయి. దీనివల్లనే ఇచటి ఈశ్వరునికి 'ఏకామ్రేశ్వరు'' డనే పేరు ప్రసిద్ధ మైంది. ఈ వృక్షదర్శనం సర్వసిద్ధులను ప్రసాదిస్తుంది. నేటికీ ఈ వృక్షాన్ని కన్నులారా కాంచి సేవించుకోవచ్చు. శ్రీ ఏకామ్రేశ్వరుడు పృథివీలింగరూపంలో ఉంటాడు.

శ్రీ కామాక్షి అమ్మవారు

కాంచీక్షేత్రం చక్రాకృతిలో నిర్మితమైంది. ఈ క్షేత్రం మధ్యభాగాన బిందు స్థానీయంగా శ్రీ కామాక్షీ అమ్మవారి ఆలయం ఉంటుంది. అమ్మవారే ఇచ్చటి ప్రధాన దేవత. కంచిలోని దేవాలయవిమానగోపురాలన్నీ కామాక్షీదేవి ఆలయానికి అభిముఖంగా ఉంటాయి.

శ్రీరాజరాజేశ్వరీ స్వరూపిణి అయిన ఈతల్లి ఇక్కడ సిద్ధాసనంలో ఆసీనురాలై ఉంటుంది. ఈమె చతుర్భుజ. కుడివైపు వెండిచేతిలో పంచపుష్పబాణాలు, పై చేతిలో పాశం, ఎడమవైపు వెండి చేతిలో ఇక్షుధనుస్సు, పై చేతిలో అంకుశం.

ఈ అమ్మవారి విగ్రహానికి ముందు శ్రీ ఆది శంకరుల సాలగ్రామ శిలపై స్వయంగా లిఖించి ప్రతిష్ఠించిన శ్రీచక్రఅధిష్ఠాత్రిగా ఆ పరాశక్తి సూక్ష్మరూపిణిగా దర్శనమిస్తుంది. ఇదే కామకోటి పీఠం.

ఇచ్చట చిదాకాశ (బిలాకాశం) రూపమే అమ్మవారి కారణరూపం. అఖండ సచ్చిదానంద రూపిణి అయిన పరదేవత యొక్క స్థూల, సూక్ష్మ, కారణ రూపాలను ఇక్కడ మనం దర్శించవచ్చు.

కంచిలోని ఏకామ్రనాధుని రధోత్సవం, శ్రీవరదరాజస్వామి రధోత్సవం మొదలైనవి, కంచిలోని ఏదేవునకు ఏ ఉత్సవం జరిగినా అది శ్రీ కామాక్షీదేవి ఆలయ ప్రదక్షణ రూపంగా, అమ్మవారి ఆలయం చుట్టూ ఉండే నాలుగు ప్రధాన వీధులగుండా వెళ్లడం ఇప్పటికీ సంప్రదాయసిద్ధమైన ఆచారం.

కంచిలోని వరదరాజ స్వామిఆలయంలో కూడా ఎనిమిది స్థంభాల మంటపంలో వేదవ్యాస, ఆది శంకరుల శిల్పాలు ఉన్నవి.

ఐతిహాసిక ప్రశస్తి:- కాంచీక్షేత్రం వైదికధర్మ పోషణ, ప్రచారాలకు కేంద్రస్థానమై సింహళం, ఇండోనేషియా మొదలైన పలు ప్రాంతాలకు వైదికధర్మాన్ని వ్యాపింపజేస్తూ ఉండేది. ప్రాచీనపురాణాల్లో 'బ్రహ్మశాల', 'దివ్య క్షేత్రం' అని ఈ పట్టణం వర్ణించబడింది. 'నగరేషు కాంచీ' అని కూడా ప్రసిద్ధి గాంచింది.



ఈశ్వరానుగ్రహం

కామజయానికీ, కాలవిజయానికీ ఈశ్వరభ##క్తే సాధనం. మన యత్నమే ఆధారంగా ఇంద్రియ విజయాన్ని సాధించలేమా అనుకోవడం ఒక విధంగా అహంకారమే అవుతుంది.

భగవంతుడు ప్రేమ స్వరూపీ, జ్ఞాన స్వరూపీ. ఆయన అనుగ్రహం ఉంటేనే గాని మనకు ప్రేమా, జ్ఞానమూ లభించవు.



రెండునిముషాలు నాకు దానమివ్వండి.

''మీరందరూ నావద్దకు అనేక కానుకలు తీసుకుని వస్తున్నారు. పుష్పఫలాదులు తెస్తున్నారు. ధనమిస్తున్నారు. వీటిని వేటినీ నేను కోరడం లేదు. దినానికి రెండు నిమిషాలు మాత్రం నాకివ్వండి. ఆ రెండు నిమిషాలు నిశ్చిలమైన భక్తితో పరమేశ్వరుని ధ్యానించండి. అదే నాకు అత్యంత ప్రీతికరమైన కానుక. దినమంతా మీరు లౌకిక వ్యాపారాలతో గడుపుతారు. రెండు నిమిషాలు ఈ బీద సన్యాసికి దానమివ్వలేరా? నాకు కావలసిన దంతే!''

Nadichedevudu   Chapters