Nadichedevudu   Chapters  

 

45. మతంపరంగా హిందువులకు జరుగుతూవున్న అన్యాయం

స్వామితో ఏ.యస్‌. రామన్‌ ఇంటర్వ్యూ

''సావకాశంగా స్వామివారితో సంభాషించాలని నేను చేసిన ప్రయత్నాలలో ఇది అయిదవది...'' అంటూ 1964లో ఇలస్ట్రేటెడ్‌ వీక్లీ ఆఫ్‌ ఇండియా పత్రికకు సంపాదకుడు డా. ఎ.యస్‌. రామన్‌ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి సమక్షంలో విన్నవించారు.

ఆ మాటకు స్వామి సమాధానం చెప్ప లేదు. మందహాసం చేసి మౌనంగా ఉన్నారు.

''పోయిన వారం ప్రత్యేకించి నాకై ఏర్పాటు చేసిన సమావేశంలో దాదాపు 45 నిమిషాలు మీ సాన్నిధ్యంలో ఉండే అదృష్టం నాకు పట్టింది.''

''మరోసారి నేను మిమ్ము సందర్శించ వచ్చనీ, ఏ రోజైనా, ఏ వేళ అయినా చూడవచ్చనీ ఆనాడు దయతో సెలవిచ్చారు.''

అప్పటికి కూడా స్వామివారి నుంచి జవాబు రాదు. 'అవును, అవును' అన్నట్టు ముఖం మీద మందహాసం పొడగట్టుతుంది.

''అది మొదలుకుని నేను తమ వద్దకు వస్తూనే ఉన్నాను. అయినా, నేటి మధ్యాహ్నం వరకూ నా అదృష్టం కలిసి రాలేదు.''

ఇందుకూ స్వామి సమాధానం మౌనమే.

''నేను తమర్ని కొన్ని ప్రశ్నలు అడగ దలుచుకున్నాను. అనుమతిస్తే అడుగుతాను.''

సహజమైన కమ్మని తెలుగులో చిట్టచివరకు ''సరే'' అన్న మాట స్వామినోట వెలువడింది. ''మిమ్మల్ని నేను మరిచిపోలేదు. నిజమైన సందేహాలతో వస్తే, ఎవరికైనా నేను సమాధానం చెబుతాను. చిత్తశుద్ధి ఉంటే చాలు.''

రామన్‌: స్వామి వారికి కృతజ్ఞుణ్ణి. ఇది నా మొదటి ప్రశ్న: వర్తమాన భారతదేశంలో ప్రజల మత విశ్వాసాలకు మూల మేమిటి? ఆచార వ్యవహారాలలో, కర్మకలాపాలలో మన ప్రజలు శ్రద్ధ వహించినా, ఐరోపా, అమెరికా దేశాల ప్రజలకంటె తత్వతః మన దేశ ప్రజలు ఎక్కువ భౌతిక దృక్పధం కలవారు కారా?

నా ప్రశ్నకు స్వామి వారేమీ చలించలేదు. తటస్థంగా ఉన్నారు. స్వామి ఔదాసీన్యం చూచి నేను కంగారు పడ్డాను. నే నడిగిన ప్రశ్న సముచితంగా లేదా? అనుదాత్తంగా ఉన్నదా?......స్వామివారు నన్ను పరికించి చూశారు; సానుకంపంగానే కావచ్చు.

స్వామి: మీరు నన్నడగ దలచిన మొత్తం ప్రశ్నలు ఎన్నింటికి నేను సమాధానం చెప్పాలి?

రామన్‌: నేను అడగదలచిన ప్రశ్నలు లెక్కకు కొంచెం ఎక్కువే. స్వామివారి సమయాన్నీ, సహనాన్నీ ఎక్కువ హరిస్తానేమో!

స్వామి: పరవాలేదు. కానివ్వండి. ముందు మీ ప్రశ్న లన్నీ వినిపించండి. తరువాత అన్నిటికీ అనువర్తించేట్టు సమాధానం చెబుతాను.

తమ ప్రశ్నలన్నీ శ్రీ రామన్‌ స్వామికి వినిపించారు. స్వామి మౌనం వహించారు. కళ్లు మూసుకున్నారు. యధాలాపంగా గడ్డం తడుముకున్నారు. క్షణంలో స్వామి ముఖం వికసించింది. పెదవులు విడివడ్డవి. మందస్వరంతో నాలుగైదు మాటలు మాత్రం వినిపించాయి. అవి అంత స్పష్టంగా లేవు. మరొక సారి సెలవివ్వండని శ్రీ రామన్‌ స్వామిని ప్రార్థించారు.

కిందికి జారుతున్న కాషాయాన్ని పైకి సర్దుకుని కూచుంటూ స్వామి ఇలా అన్నారు. '' ఈ ప్రశ్నావళి తయారు చెయ్యడానికి మీకు ఎన్నిరోజులు పట్టింది? సుదీర్ఘంగా ఉంది. మీ ప్రశ్న లన్నింటికీ సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తాను.''

''స్వామివారు మొత్తం నాలుగు గంటల సేపు తెంపు లేకుండా, అవధాన శక్తితో, తపస్వులకు మాత్రమే సాధ్య మయ్యే సుసూక్ష్మ విషయ పరిగ్రహణ సామర్థ్యంతో సంభాషించారు. చివరకు చూసుకుంటే, నేను స్వామివారిని అడిగిన అన్ని ప్రశ్నలకూ సమాధానాలు సంపూర్ణంగా, సంతృప్తికరంగా లభించాయి'' అంటారు రామన్‌ గారు.

* * *

'మనదేశంలో మతప్రభావం ఎన్నటికీ క్షీణించదు.'

అధునాతన భారతదేశంలోని ప్రజల మత విశ్వాసాలను గురించి శ్రీ రామన్‌ అడిగిన ప్రశ్నకు స్వామి సమాధానం:

స్వామి: మన దేశంలో మత ప్రభావం ఎన్నటికీ క్షీణించదు. స్థూలదృష్టికి మనం భౌతిక దృక్పధం కలవారంగా కనిపించవచ్చు. కాని, నూటికి నూరుపాళ్ళు మనలో మతం జీర్ణించి ఉన్నది. తుదకు మన రాజకీయనాయకులు సైతం తమ మతేతర ప్రయోజనాలకు మతాన్ని ఉపయోగించుకుంటారు.

సామాన్యప్రజాహృదయాన్ని ఆకర్షించడానికి గాంధిగారు మతాన్ని ఎంత చమత్కారంగా వాడుకున్నారో మీకు జ్ఞాపకం ఉండి ఉండాలి. మతం పేరు చెప్పి, అమాయకులైన మన ప్రజానీకంచేత ఏదైనా చేయించవచ్చు.

దేశవిభజన జరిగిన వెంటనే లక్షలాది హిందువులు తమ ప్రాణాలను ఎందు నిమిత్తం త్యాగం చేశారో బహుశా మీరు విస్మరించి ఉండరు. అవమానాలను భరించడం కంటె వారు తమ అసువులను కోల్పోవడానికే సిద్ధపడ్డారు. మధ్య ఐరోపా ఖండంలో జరిగిన మత విధ్వంసం కంటె, దేశవిభజన ఫలితంగా భారతభూమిలో జరిగిన సంఘటనలు దారుణమైన వనడానికి సందేహం లేదు.

యూరప్‌ఖండంలో ఎప్పుడు ఏ సంఘటనలు జరిగినా ప్రాణా లర్పించిన వ్యక్తులను గురించి మాత్రం చెప్పుకుంటారు. భారతదేశంలో అలా కాదు. మత సంబంధమైన కలహాలు సంభవించి నప్పుడు మతం కోసం ప్రాణత్యాగం చేసే వారు సామాన్యప్రజలే గాని మేధావులూ కారు, సంస్కర్తలూ కారు.

మతాభిమానానికి మరొక నిదర్శనం

హిందువుల మతాభిమానానికి మరొక నిదర్శనం చెప్పమన్నారా? మన పవిత్రక్షేత్రాలలో దేనినైనా సందర్శించండి. అవసరమైతే మీ విదేశీ మిత్రులను కూడా వెంటబెట్టుకుని పొండి. తిరుణాలలో వలె ప్రజావాహిని కనిపిస్తుంది. మన పుణ్య తీర్థాలలో, మన పవిత్ర నదీతీరాలలో సంవత్సరం పొడుగునా వేలకు వేలు జనం కూడుతారు. పర్వదినాల్లో నదులలో స్నానాలకై ప్రజ లెంత ఉత్సహిస్తారో మీకు తెలియనిది కాదు.

కుంభ##మేళ వంటి మహోత్సవం ఒక్క భారతదేశంలోనే చూడగలుగుతాము. భౌతిక జీవనానికి మన ప్రజ లెంత అలవాటు పడినా, నేటికి కూడా మనదేశంలో మతప్రభావం సడలలేదు. అది మనందరిలో అస్థినంటుకుని ఉంది.

ప్రశ్న: సామ్యవాదం (సోషలిజం) లౌకిక రాజ్యాంగం (సెక్యులరిజం) అనే విషయాలకు అవసరమైనంత కంటె ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా నాయకులు ప్రజల్లో సంశయదృక్పధాన్ని, నిరాశావాదాన్ని ప్రబోధిస్తున్నారని నా అనుమానం. ప్రజల జీవితంలో ఒక విధమైన శూన్యతాభావాన్ని సృష్టిస్తున్నారు. తాము నాతో ఏకీభవిస్తారా?

హిందువులపట్ల విచక్షణ

స్వామి: మనరాష్ట్రప్రభుత్వాలేమి, కేంద్రప్రభుత్వమేమి సెక్యులరిజాన్ని బలవంతంగా ప్రజలపై మోపుతున్నాయి.

అల్పసంఖ్యాక ప్రజల (మైనారిటీల) విషయంలో మతపరమైన వారి హక్కులకు ఎక్కడ భంగం కలుగుతుందో అనే భయంతో వర్తిస్తారు. అధికసంఖ్యాకప్రజల పట్ల మాత్రం ఆ విధంగా ప్రవర్తించరు. వివాహాలు, విడాకులు, వారసత్వం, దేవాలయాలలో పూజా పునస్కారాలు, ఒకటేమిటి, అధికసంఖ్యాక ప్రజలకు సంబంధించిన అన్ని విషయాలలోనూ పాలకులు జోక్యం కలిగించుకుని విచక్షణాపూర్వకమైన శాసనాలు చేస్తారు.

తుదకు, కుటుంబనియంత్రణ విధానానికి సైతం హిందూ సంఘమే గురి అవుతున్నది. దీని ఫలితంగా ఇటీవల దేశంలో హిందువుల సంఖ్య నూటికి మూడు వంతులు తగ్గింది. ముస్లిం జనాభా నూటికి అయిదు రెట్లు పెరిగింది. (ఈ సంభాషణ 1964లో జరిగింది. గత 26 సంవత్సరాలలో ఈ సంఖ్యలు మరింత పెరిగి ఉండాలి - రచయిత) ప్రత్యేకించి అస్సాం రాష్ట్రంలో ముస్లిం జనాభా క్రమంగా హెచ్చిపోతున్నది.

ముస్లిం, క్రైస్తవ సంఘీయుల సాంఘిక, మత వ్యవస్థలను సంస్కరించే సాహసం మన శాసనకర్తలకు లేదు. అయినా హిందువుల విషయంలో వారి మతాన్ని మూలచ్ఛేదం చెయ్యడానికైనా పాలకులు వెనుకాడరు.

ఆసియాఖండంలోని అన్ని దేశాలలో మతపరమైన ప్రభుత్వాలున్నవి - సింహళం, బర్మా, పాకిస్తాన్‌, మలయా వగైరాలు. భారతదేశానికి మాత్రమే అలాంటిది లేదు. రాజకీయవేత్తం మతరాహిత్యవిధానం ఒక్క హిందువులకే వర్తించబడుతున్న దనడం సుస్పష్టం. హిందువులు తమలో తాము చీలి ఉండడం చేత బలహీనులుగా ఉన్నారు. హిందువులకు నాయకుడు లేడు. వారి క్షేమాన్ని కాపాడే నాథుడు లేడు. అందుచేత, హిందూమతాన్ని భారతప్రభుత్వమతంగా పార్లమెంటులో ఆమోదింప చెయ్యగల వారెవ రున్నారు?

పాలకుల పాక్షిక విధానం

ముసల్మానులు, క్రైస్తవులు, పార్సీ మతస్థులు, తదితర అల్ప సంఖ్యాక వర్గాల వారంతా సుసంఘటితులై బలవంతులుగా ఉన్నారు. హిందువులు తమలో తాము ఏకీభవించే ప్రయత్నం చేస్తే చాలు, అట్టి వారిని మతోన్మాదులుగా చిత్రించి, వారి సంస్థలను నిషేధించడం జరుగుతున్నది. ఈ విధంగా అధికసంఖ్యాకవర్గ ప్రజలను శాశ్వతంగా నిర్వీర్యులుగా చేస్తున్నారు. హిందూమతానికి సంబంధించినంతవరకు బ్రిటీష్‌ వైసురాయీలకంటె కూడా నేటి మన పాలకులే ప్రతికూలురుగా కనిపిస్తారు. మతపరమైన మైనారిటీల కోరికలు ఎట్టివైనా వాటిని నెరవేర్చడమూ, హిందువులను కష్టనష్టాల పాలు చెయ్యడమూ, మన నాయకులు అవలంబిస్తున్న విధానం. ఈ తత్వం నాకు అర్థం కావడం లేదు. దీని ఫలితంగా ప్రజల జీవితంపై హిందూమత ప్రభావం క్రమంగా క్షీణిస్తుంది.

అయినప్పటికీ, మన ప్రజలు మతాన్ని కోలుపోరు.

Nadichedevudu   Chapters