Nadichedevudu   Chapters  

 

64. ఆదిలో ఉన్నది వేదమతం

(1931లో కంచిస్వామి చేసిన మహోపన్యాసం)

ప్రపంచంలో అనేక మతా లున్నవి. మతా లన్నిటికీ ప్రత్యేకమైన పేర్లున్నవి. ఆయా మత సంస్థాపకుల పేర్లతో అవి వ్యవహరించబడుతున్నవి.

బుద్ధభగవానుడు కనుగొన్న మతం బౌద్ధం. జినుడి నామంతో జైనం. మహమ్మద్‌ ప్రవక్త పేరుతో మహమ్మదీయ మతం. జీసస్‌ క్రీస్తు స్థాపించింది క్రైస్తవం. జోరాస్టర్‌ నెలకొల్పింది 'జోరాస్ట్రియనిజం' (పార్శీలమతం) చైనాలో కన్‌ప్యూషియస్‌ ద్వారా ఆవిర్భవించింది 'కన్‌ ప్యూషియనిజం'

ఈవిధంగా కొత్త మతాలను సృష్టించి అసంఖ్యాకప్రజలను తమవైపు ఆకర్షించిన వారంతా మహామహులు. ఒక్క మన మతానికి మాత్రమే ప్రత్యేకమైన పేరు లేదు. కాస్త ఇంగ్లీషు చదివిన కుర్రవాణ్ణి ''అబ్బాయీ, నీ మతం ఏది?'' అని అడిగితే, 'నాది హిందూమతం' అంటాడు. అలా కాకుండా, పల్లెటూళ్లల్లో పొలం పనులు చేసుకునే సామాన్య ప్రజలను అదే ప్రశ్న అడిగితే, వాళ్లు అందుకు తగిన సమాధానం చెప్పలేరు.

దక్షిణదేశంలో దస్తావేజులు వగైరా వ్రాసేవారిని ప్రశ్నించామనుకోండి. వారు 'మేము శైవుల మనో, వైష్ణవుల మనో, జవాబిస్తారు. శైవం గానీ వైష్ణవం గానీ మన మతంలో శాఖలే తప్ప, అవి అసలు మన మతం పేర్లు కావు. అవి మనం ఆరాధించే దేవతల పేర్లు. మతాన్ని కనుగొన్న వారి పేర్లు కావు.

మన మతానికి పేరే లేదు!

మన మతం పేరు హిందూమత మనేదే నిజమైతే మన పూర్వీకులందరికీ ఆ పేరు తెలిసి ఉండవలసిందే. అది ప్రాచీనకాలంలో కూడా ఆ పేరు వాడుకలో ఉండి ఉండేదే. మరీ పూర్వకాలపు వారికే కాదు, కొన్ని తరాల క్రిందటి వారికైనా 'హిందూ మతం' అనే మాట ఏదో ఒక వింత పదంగా, అర్థం లేని మాటగా అనిపించేది. ఈ పరిస్థితికి కారణమేమిటి? వాస్తవంలో మన మతానికి ఒక పేరంటూ లేదు.

మన మతంలోని శాఖలకు మాత్రం ప్రత్యేకమైన పేర్లున్నవి. ఆ పేర్లయినా, మానవులవి కావు. ఉపాసన కోసం ఆయా మతానుయాయులు ఏర్పాటుచేసుకున్న ఒకే పరమాత్మ యొక్క వేరువేరు రూపాలు. మన మొత్తం మతానికి ఒకే పేరు చెప్పడం కష్టసాధ్యం. ఇటీవలి కాలంలో 'సనాతన ధర్మం' అనే పేరు విశేషంగా వినిపిస్తోంది. అయినా, అది కూడా అనాదిగా వస్తున్న పేరని చెప్పలేము. అదే అయినట్లయితే, మన గ్రామాల్లో నివసించే సామాన్య రైతులకూ, అనాధులకూ కూడా ఆ పేరు సుపరిచితమై ఉండేది.

'హిందూయిజం' మన పేరు కాదు

'హిందూయిజం' అన్నది పరాయివారు మన మతానికి కట్టబెట్టిన పేరు. ఆ పేరు ప్రచారంలోకి ఎలా వచ్చిందో చరిత్రద్వారా మనకు తెలుస్తూనే ఉంది. మన పూర్వీకులు ఒకప్పుడు సింధునదీతీరంలో నివసిస్తూ ఉండేవారు. ఆ కాలంలో మన దేశానికి వచ్చిన విదేశీయులు ''సింధు'' నదిని ''ఇండస్‌'' అన్నారు. 'ఇండస్‌' ప్రవహించే దేశాన్ని 'ఇందు' దేశమనీ 'ఇండస్‌ భూభాగమ'నీ వ్యవహరిస్తూ వచ్చారు. క్రమేణా, ఇండస్‌ ప్రాంతాన్నేగాక, యావద్భారత దేశాన్ని అదే పేరుతో వ్యవహరించారు. ''హైడ్‌ పార్కుకు ఆవల అంతా ఎడారి'' అన్న సామెత మనం వినడం లేదా? అట్లా!

మన మతానికి చిహ్నం లేదు

ప్రతి మతానికీ ఒక ప్రత్యేక చిహ్నం ఉంటుంది. దాన్ని బట్టి ఇది ఫలానా మతం అని మనం తెలుసుకోవచ్చు. క్రైస్తవ మతానికి సిలువ గుర్తు. ఆ విధంగా హిందువులందరికీ ఒక ప్రత్యేక చిహ్నం లేదు. మన మతానికి పేరూ లేదు, చిహ్నమూ లేదు. పేరులేని, గుర్తులేని మతం మనది! మన మతస్థులు కొందరు ముఖాన విభూతి ధరిస్తారు. మరికొందరు విష్ణుపాదాన్ని చిత్రించుకుంటారు. మనలో కొందరు వీర వైష్ణవులైతే, మరికొందరు 'లింగాయతులు' లేక వీరశైవులు. అయినా, మొత్తం మీద తామంతా ఒకే మతానికి చెందిన వారమనే భావం కలిగి ఉంటారు.

ఏ పేరూ లేకుండా ఉండడంలోనే మన మతానికి ఒక మహత్త్వమున్నది. ఒకే విధమైన వస్తువులు అనేకం ఉన్నప్పుడు, ఒక్కొక్క వస్తువును వేరువేరుగా గుర్తించడానికి వాటికి పేర్లు పెట్టవలసి వస్తుంది. ఒకే విధమైన వస్తువు ఒక్కటే ఉన్నదనుకోండి. అప్పుడు దానికి పేరెందుకు? ఉదాహరణకు, ఒకే ఊళ్ళో 'రామస్వామి' అనే పేరుగల వ్యక్తులు నలుగురున్నట్టయితే, ఆ నలుగురినీ వేరువేరు ఇంటి పేర్లతో పిలవాలి. లేదా 'నల్ల రామస్వామి' అనో, 'ఎర్ర రామస్వామి' అనో ఏదో గుర్తించదగిన పేరుపెట్టి పిలవాలి. రామస్వామి ఒక్కడే అయినప్పుడు, అతనిని గుర్తించడానికి వేరే పేరు అక్కరలేదు. మన మతానికి కూడా ఈ సూత్రమే వర్తిస్తుంది.

మతమంటే ఏమిటి?

మత మంటే ఏమిటి? చావు పుట్టుకలనే విషచక్రం నుంచీ, లేదా పాపాలనుంచీ, కష్ట పరంపరలనుంచి మనలను రక్షించేది మతం. ఒక్క హిందూమతం తప్ప, ప్రపంచంలోని తక్కిన మతాలన్నీ ఆయా మత స్థాపకులు పేర్లతో పిలవబడుతున్నవని మొదట మనం చెప్పుకున్నాము. ఏతావతా, తేలిన విషయ మేమంటే, ఈ మతకర్త లందరూ పుట్టక ముందు ఈ మతాలు లేనేలేవు. అంతేకాదు; ఈ మతా లన్నీ ఎప్పుడెప్పుడు ఏర్పడ్డవో వాటి కాలాలు కూడా నిర్ణయించబడినవి. ఈ మతాలన్నీ రాక పూర్వం నుంచీ మన మతం ఉండేదని ఇందువల్ల నిరూపితమవుతున్నది. అత్యంత ప్రాచీనకాలం నుండి మానవజాతి కంతటికీ ఆధ్యాత్మిక చింతనను ప్రసాదిస్తూ, విశ్వవ్యాప్తమై ఉండేది మన మత మొక్కటే. ఈ కారణంచేతనే, ఈ మతానికి ప్రత్యేకమైన పేరంటూ లేదు. మతమున్నది కేవలం ధర్మం. ధర్మ మన్నది మతానికి మారు పేరు.

మన మతానికి ప్రత్యేకమైన పేరే లేకపోయినా, 'వేద ప్రామాణ్య'మనే సామాన్య సూత్ర మున్నది. ఆధ్యాత్మికవిషయాల్లో వేదమే కట్టకడపటి ప్రమాణం అనే విశ్వాసం. 'అదేమంత వేదాక్షరమా.' అన్న సామెత ఆ విశ్వాసంనుంచి పుట్టినదే.

ఒకే మతమనడానికి ఆధారాలు:

ఒకానొకప్పుడు యావత్ప్రపంచానికి మనది ఒక్కటే మతమైన పక్షంలో 'ప్రపంచంలోని మానవులంతా మన మత సిద్ధాంతాలను అవలంబించారా' అన్న ప్రశ్న ఉదయించడం సహజం. ఈ ప్రశ్నకు 'అవును' అని సమాధానం చెప్పడానికి అనేక ఆధారాలున్నవి. యూదుజాతివారు ఏసుక్రీస్తుకు మరణశిక్ష విధించారు. అందుకు వారు ఆయనపై కొన్ని ఆరోపణలు మోపారు. 'హీనజాతి ప్రజల బావి నీటిని జీసస్‌ క్రీస్తు పుచ్చుకున్నాడ'న్నది యూదులు ఆయనపై మోపిన నేరారోపణలలో ఒకటి. దీనినిబట్టి క్రీస్తుకు పూర్వం ఆ దేశంలో వర్ణవ్యవస్థ ఉన్నట్టు స్పష్టం అవుతున్నది కదా!

ఇంతేకాదు; క్రీస్తుకు పూర్వం1280 సంవత్సరం నాటి శాసనం ఒక దానిని ఈజిప్టులో కనుగొన్నారు. 'రెండవ రామేశస్‌'కూ, హిట్టెటెసకూ మధ్య జరిగిన సంధి షరతులు ఆ శాసనంలో పేర్కొనబడ్డాయి. ఈ సంధిలో 'మైత్రావరుణ' అనే వేదంలోని దేవత సాక్షిగా ఉదహరించబడినాడు. (హెచ్‌.ఆర్‌.హాల్‌ వ్రాసిన Ancient history of the near East- 364 పుట) ఇదిగాక, ఈజిప్టు రాజవంశావళిలో 1వ రామేశన్‌, 2వ రామేశన్‌, 3వ రామేశన్‌ అంటూ 'రామ' శబ్ధానికి సంబంధించిన రాజుల పేర్లు ఎన్నో ఉన్నాయి.

దక్షిణాఫ్రికా తూర్పుతీరాన మెడగాస్కర్‌ ద్వీపంలోని స్థలాల పేర్లు నూటికి 75 వంతులు సంస్కృతభాషకు చెందినవే. వాటిలో చాలా భాగం రామాయణ కధానాయకుడైన శ్రీరాముని పేరుతో సంబంధం కలవి.

'సాగర' - 'సహారా'

ఉత్తరాఫ్రికాలో 'సహారా డిజర్ట్‌' అనే పేరుతో గొప్ప ఎడారి ఉన్నదని మనకు అందరికీ తెలుసు. ఎడారులన్నీ ఒకప్పుడు సముద్రాలనే సిద్ధాంతం ఉన్నది. 'సాగర' అన్నది సంస్కృత శబ్దం. 'సాగర' అన్న పదం భ్రష్టమై 'సహారా' కావడం అసంభవం కాదు. సహారా ప్రదేశం జలమయమై ఉన్న కాలంలో దాని చుట్టూ ఉన్న భూమి జనావాసంగా ఉండేదనీ, అచ్చట నివసించే ప్రజల పేర్లు సంస్కృతభాషకు సంబంధించినవేగాక, రామ శబ్ధంతో కూడా జతపడి ఉండేవనీ చెప్పబడుతున్నది. (ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా, 13వ సంపుటం, శీర్షిక -సహారా.)

మన భూగోళం అవతలి దిక్కున ఇట్టి సాక్ష్యాధారాలు కోకొల్లలు. మనకెంతో దూరంగా ఉన్న మెక్సికోలో ఇంచుమించు మన దసరా పండుగ సమయంలోనే, ఆ దేశస్థులు కూడా ఒక పండుగ జరుపుకుంటారు. ఆ పండుగపేరు 'రామసీత' (టి.డబ్ల్యు. యఫ్‌గాన్‌ రచించిన "Maya Indians of Southern Yucaton, North and British Honduras" 24 పుట.)

ఇదొక్కటే కాదు. ఆ దేశంలో జరిగిన త్రవ్వకాలలో ఎన్నో 'గణశ విగ్రహాలు బయటపడ్డాయి. (బేరన్‌ హోమ్‌బోల్టు వ్రాసిన ఈ విషయాన్ని హరవిలాస్‌ శారదా 'హిందూ సుపీరియారిటీ' అనే గ్రంథంలో ఉదహరించారు.) ప్రాచీనకాలంలో ఆ దేశంలో నివసించిన ప్రజల పేరు Astikas (ఆస్తికులు) అనగా వేద పారాయణంలో నమ్మకం కలవారు. లేక వేద ప్రామాణ్యాన్ని అంగీకరించేవారు. ఆ తెగకు చెందిన వారి పేరు ఈనాడు కూడా ''ఆజ్‌టెక్సు.''

దక్షిణ అమెరికా పశ్చిమభాగంలో 'పెరూ' లోని ప్రజలు సూర్యుని ఆరాధించేవారు; 'ఇన్‌కాస్‌' అని పిలువబడేవారు. 'ఇన' అనేది సంస్కృతంలో సూర్యునికి పర్యాయపదం. వారి ముఖ్యమైన పండుగలు అయనాంతంలో జరుగుతాయి. (ఏషియాటిక్‌ రిసెర్చెస్‌, 1వ సంపుటం, 426 పుట.)

కాలిఫోర్నియా కపిలారణ్యమా?

ఈ విధంగా పరిశోధిస్తూ పోతే, కాలిఫోర్నియాలోని అనేక ప్రదేశాల పేర్లకూ మన పురాణాలలో కనిపించే పేర్లకూ పోలికలు కొట్టవచ్చినట్టు కనిపిస్తాయి. కపిలముని శాపం వల్ల 60 వేల మంది నగరచక్రవర్తి కుమారులు దగ్ధమై, బూడిద అయినారన్న కథ సుప్రసిద్ధం. వారి ఆత్మలను కాపాడేందుకు వారి వంశీయుడైన భగీరథుడు గంగను ఆకాశం నుంచి భూమికి కొనివచ్చాడని పురాణగాథ.

సగరుని కుమారులు వెతుక్కుంటూ వెళ్ళిన గుర్రము పాతాళలోకంలో (Netherlands) కనిపించిందని మన పురాణం చెబుతున్నది. అమెరికా, భారత దేశాలు భూగోళం మీద ఒకదానికొకటి ఎదురెదురుగా ఉన్నవి. కాలిఫోర్నియా అన్నది 'కపిలారణ్యం' అనే పదానికి భ్రష్టరూపం అనుకోడం అంత పరిహాసాస్పదం కాదు. దానికి కొద్ది దూరంలోనే ఉన్నవి. "The Horse Island", "The Ash Island" (హయద్వీపము, భస్మద్వీపము) అనేవి. మొదటిది నగర చక్రవర్తి గుర్రము పట్టుబడిన ప్రదేశమూ, రెండవది సగరుని అరవై వేలమంది కుమారులు శాపవశాన భస్మంగా మారిన స్థలమూ అనుకోవడం కూడా ఊహకు మించిన విషయం కాదు.

ఆస్ట్రేలియాలో 'శివనాట్యం!'

స్పెన్సర్‌, గిలెన్‌ అను వారిరువురూ Native Tribes of Central Asia అనే పుస్తకం రచించారు. ఆ పుస్తకం 621వ పుటలో ఆటవికజాతుల నాట్యాలు చిత్రించబడ్డాయి. ఆ నాట్యాలలో ఒకటి "The Siva Dance" (శివనాట్యం). 1899లో ఈ పుస్తకాన్ని మాక్మిలన్‌ కంపెనీ వారు ప్రచురించారు. జాగ్రత్తగా పరిశీలించి చూస్తే నాట్యం చేస్తున్న ఆ ఆటవికుల ముఖాలపై మూడవ నేత్రం చిత్రించబడ్డట్టు కనిపిస్తుంది. ఆస్ట్రేలియావంటి దూరదేశంలో సైతం ఆనాటి ప్రజలకు వైదికసంస్కృతితో సంబంధం ఉండేదని దీనినిబట్టి తెలుస్తున్నది.

జావా, బోర్నియా వంటి దేశాల సంగతి ఇక అడగవలసిన పనే లేదు. ఆ దేశాల్లో హిందూ సంస్కృతికి సంబంధించిన నిదర్శనాలు లెక్కలేనన్ని ఉన్నాయి. హిందూ సంస్కారాలకు, హిందువుల పూజా పునస్కారాలకు తార్కాణాలుగా చెప్పదగినవి జావాలో కావలసినన్ని. బోర్నియాలో మానవుడు ఎన్నడూ అడుగుపెట్టని ఒక అరణ్యం ఉన్నట్టు చాలాకాలంగా పాశ్చాత్య రచయితలు వ్రాస్తూ వచ్చారు. (వాలన్‌ వ్రాసిన 'The Malay Archipelago). ఆ తర్వాత ఒక పరిశోధక బృందం ఆ అడవిలో ప్రవేశించి కొన్ని వందల మైళ్ళు ప్రయాణించగా, వారి కొక శిలాశాసనం దొరికింది. దానిపైన ఒక రాజు కొన్ని యజ్ఞయాగాదులు చేసినట్టు వ్రాయబడింది. (Yupa Inscriptions of Mulavarman of Koeti, Borneo.) ఒకానొకప్పుడు మన మత మొక్కటే సర్వప్రపంచ వ్యాప్తంగా ఉండేది అనడానికి పైన చెప్పిన వన్నీ తార్కాణాలు.

సప్త ద్వీపాలు

పోతే, విశ్వాన్ని గురించి హిందువుల నమ్మకాలు ఎలాటివో తెలుసుకొనడం కూడా అవసరం. యావత్తు భూఖండం ఏడు ద్వీపాలుగా ఉన్నదని హిందువులు విశ్వసిస్తారు. శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యులు తమ రచనలలో ఒక చోట ''సప్త ద్వీపాచ మేదినీ'' అని పేర్కొన్నారు. ఈ సప్తద్వీపాలు ఒక్కొక్కటే కొన్ని వర్షాలుగా విభజించబడ్డాయి. ఆ వర్షాలు మళ్ళా 'ఖండాలుగా' ఏర్పడ్డాయి. మనం నివసించే ఈ ఇండియా దేశం 'భరత ఖండ'మని మన పురాతన గ్రంథాలు చెబుతున్నాయి. భరతఖండం భరతవర్షంలో ఒక భాగం. ఆ భరతవర్షం జంబూద్వీపంలోది. మేరుపర్వతమన్నది సప్తద్వీపాలకు ఉత్తర దిక్కున ఉన్నదని మన గ్రంథాలు పేర్కొంటున్నాయి. అంతేకాదు; ప్రతి రెండు ద్వీపాలకు మధ్య సముద్రం ఉన్నదనీ, సూర్య చంద్రులు మేరువుచుట్టూ పరిభ్రమిస్తారని కూడా మన గ్రంథాలలో వ్రాయబడి ఉంది.

పై అభిప్రాయాలలో ఇమిడి ఉన్న వాస్తవం ఏమిటో మనం తెలుసుకుందాము. భూగోళశాస్త్రానికి సంబంధించిన పుస్తకాల ద్వారా భూమి గుండ్రంగా ఉన్నదని పాశ్చాత్యులు మనకు బోధిస్తారు. ఈ సత్యాన్ని ప్రప్రథమంగా పాశ్చాత్యులే మనకు తెలియజేశారని మనం భావిస్తాము. 'జాగ్రఫీ' అనే ఇంగ్లీషు మాటకు సంస్కృత పదం ''భూగోళం.'' గోళమనే పదమే సూచిస్తుంది భూమి గుండ్రంగా ఉన్నదని. భూమి వలయాకారంగా ఉన్నట్టు మన పూర్వీకులు విశ్వసించారని ఆ పదం వల్లనే మనకు తెలియడం లేదా? మన ప్రాచీన గణితశాస్త్రాల్లో అంతటా 'ఖగోళం,' 'భూగోళం' అనే పదాలు ఉండడం కూడా దీనిని బలపరుస్తుంది. మన సంకల్ప మంత్రాలలో భూమిని 'బ్రహ్మాండం' అని చెబుతాము. 'అండం' అంటే గుడ్డు అని అర్థం. కొంచెం ఏటవాలుగా ఉన్నా గుడ్డు గుండ్రనిదే కదా!

భూమి యావత్తూ నిమ్మపండు ఆకారంలో ఉన్నదనీ, మేరువు (హిమాలయ) ఉత్తరం దిక్కును సూచించే శిఖరమనీ భావించే పక్షంలో మేరువు భూమికి ఉత్తర ధృవం అవుతుంది. అప్పుడు ''సర్వేషామపి వర్షాణాం మేరురుత్తరతః స్థితః'' అన్న వాక్యం సార్థకమవుతుంది. తక్కిన భాగమంతా దానికి దక్షిణ అవుతుంది. శిఖరం మీద నిలుచున్న వ్యక్తి కంటికి, దాని చుట్టూ సూర్య చంద్రులు పరిభ్రమిస్తున్నట్టే కనిపిస్తాయి. అనగా, సంవత్సరంలో ఎప్పుడు గానీ సూర్యుడు శిఖరానికి ఒక పక్కగా ఉంటాడే తప్ప, పూర్తిగా నెత్తిమీదకి రాడు. మేరువు చుట్టూ సూర్యుడు తిరుగుతాడని మన శాస్త్రాలు చెప్పే మాటకు సరి అయిన అర్థం అది. కాబట్టి, ఆధునిక భూగోళ శాస్త్రజ్ఞులు కొత్తగా కనిపెట్టిన సిద్ధాంతాలు ఏవీ మన శాస్త్రాలకు విరుద్ధాలు కావు.

వర్తమానభూగోళశాస్త్రకారులు భూమిని గురించి చెప్పే సూత్రాలు మన ప్రాచీన ఋష్యాదులకు తెలియనివి కావు. ఆర్యభట్టు, వరాహ మిహిర, అప్పయ్య దీక్షితుల రచనంలో కూడా వీటికి నిదర్శనా లున్నాయి.

ఈ ప్రపంచంలో మొట్టమొదట వ్యాప్తి చెందిన మతం మనదేనని వీటి అన్నిటిమూలంగా మనకు రుజువు అవుతోంది. ఇతర మతాలన్నీ తరువాత పుట్టినవే. సమగ్రమైన మన మతంలోని కొంత కొంత విజ్ఞానాన్ని గ్రహించి, అవి క్రమంగా వృద్ధి చెందాయి.

గర్వమూ, అహంకారమూ లేకుండా, కేవల సత్యాన్వేషణ బుద్ధితో, ప్రేమతో మన మీ విషయాలను ప్రచారం చేసే పక్షంలో ఇతర దేశాల వారందరూ ఈ సత్యాన్ని విశ్వసించవచ్చు.



మనువు - ధర్మపన్నాలు

మనువు తానుగా ధర్మపన్నాలు చెప్పలేదు. తన కాలంలో ఉన్న ధర్మాలను ఆయన క్రోడీకరించాడు.

'ఆమనోర్వర్‌త్మా' మనుకాలం నుంచి వస్తూవున్న మార్గం. ఇది మనువు వేసిన బాటకాదు. సనాతన ధర్మానికి మనువు ఒక వక్త అంతే.

మన శాస్త్రాలను అర్థం చేసుకునే ప్రయత్నంలో గ్రంధకర్త ఎవరు, అతని కాలమేది అన్న ప్రశ్నలు అనవసరం.

Nadichedevudu   Chapters