Nadichedevudu   Chapters  

 

65. శ్రీ మద్దులపల్లి మాణిక్యశాస్త్రి అనుభవాలు

- శ్రీ కుకునూరు శేషగిరిరావు

తర్క వేదాంతాచార్య శ్రీ మద్దులపల్లి మాణిక్యశాస్త్రిగారు విజయవాడలో 'సర్వతంత్ర స్వతంత్ర కళాశాల'లో తర్క వేదాంత శాస్త్రపండితులుగా నియమించబడినారు. ఆ సందర్భంలో, వేదాంత న్యాయరక్షామణి, భాట్టదీపిక (మీమాంస) అనే రెండు సంస్కృతగ్రంథాలు వారికి కావలసివచ్చాయి.

ఆ గ్రంథాలు రెంటినీ తమకు పంపవలసినదిగా విన్నవిస్తూ శాస్త్రిగారు కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్రసరస్వతిస్వామివారికి ఉత్తరం వ్రాశారు. స్వామివారు ఆ రెండు గ్రంథాలను పోస్టు ద్వారా ఉచితంగా శ్రీ శాస్త్రిగారికి అందజేశారు. అప్పటికి శ్రీ స్వామివారికి శాస్త్రిగారితో స్వయంగా ఏ విధమైన పరిచయమూ లేదు.

కొంత కాలం గడచింది. జగద్గురువులు కాళహస్తి మకాంలో ఉండగా, శ్రీ మాణిక్యశాస్త్రి స్వామి దర్శనానికై కాళహస్తి వెళ్లి, సభలో దూరంగా కూర్చున్నారు. పూర్వ పరిచయం లేనప్పటికీ స్వామి ''మాణిక్యశాస్త్రీ, మాణిక్యశాస్త్రీ'' అని సంబోధిస్తూ శాస్త్రిగారిని దగ్గరకు పిలిచి, వారితో సంస్కృతంలో మాట్లాడి, సన్మానించి పంపారు.

మరొకప్పుడు దక్షిణాదిని గురువాయూరులో శ్రీ జయేంద్రసరస్వతిస్వామి చాతుర్మాస్య దీక్షలో ఉండగా, అక్కడ జరిగే శాస్త్రసభలకు శ్రీ మాణిక్యశాస్త్రిగారు పరీక్షాధికారిగా ఆహ్వానించబడ్డారు. శ్రీశాస్త్రిగారు భార్యతో, శిష్యులతో ప్రయాణమై వెళ్లారు. ఆ సమయంలో అక్కడ, సమ్మె కారణంగా బస్సుల రాకపోకలు నిలిచిపోయినవి. శాస్త్రిదంపతులకు, వారి శిష్యులకూ గమ్యస్థానం చేరే మార్గం కనిపించలేదు. స్నానానుష్ఠానాదులకు కూడా వసతి లేకపోయింది. అంతట శ్రీశాస్త్రిగారు మనస్సులో శ్రీ చంద్రశేఖరేంద్రసరస్వతిస్వామిని నిండుభక్తితో ప్రార్థించారు. ఇంతలో ఎక్కడినుంచో ఒక బస్సు వచ్చి శ్రీ శాస్త్రిబృందం ఉన్నచోట ఆగింది. ఆ బస్సులో కొందరు పోలీసువారు మాత్రం ఉన్నారు. బస్సు కాలడీ వెళుతున్నదనీ, రాదలచినవారు బస్సులో రావచ్చునని చెప్పి, శాస్త్రి ప్రభృతులను పోలీసులు బస్సులో ఎక్కించుకుని, వారిని గురువాయూరులో దింపి వెళ్లారు!

మరొకమారు శ్రీ మాణిక్యశాస్త్రిగారు అనారోగ్యంతో బాధపడుతూ స్వామివారిని తరచు స్మరించారు. శాస్త్రిగారికి స్వామి స్వప్నంలో దర్శనమిచ్చారు. స్వప్నంలో స్వామి ఆదేశించిన విధంగా శాస్త్రిగారు స్వామివారి పాదపంకజాలను తన హృదయపుండరీకమున అనుసంధానం చేయగా శ్రీ శాస్త్రిగారికి సంపూర్ణారోగ్యం చేకూరింది.

''నిన్ననే కదా నీ సందేహాలు తీర్చాను''

ఒకసారి గుంటూరు వాస్తవ్యులు, వేదాంతశాస్త్రపండితులు శ్రీ ఉప్పలూరి పున్నయ్యశాస్త్రిగారు శ్రీ స్వామివారిని సందర్శించి తమకు గల కొన్ని సందేహాలను వారిచే నివారణ చేయించుకొన నుద్దేశించి, రైలులో ప్రయాణం చేశారు. మార్గమధ్యంలో నిద్రలో వారికొక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో శ్రీ శాస్త్రికి స్వామి దర్శనమిచ్చి, వారి సందేహాలను స్వప్నంలోనే నివారణ చేశారు. అయినా, శ్రీ శాస్త్రిగారు తన ప్రయాణం సాగించి, మరునాడు స్వామిని సందర్శించి, తన సందేహాలను స్వామికి వినిపించారు.

''నేను నిన్ననే కదా నీ సందేహాలకు సమాధానం చెప్పాను.'' అని స్వామి వా రన్నారు!

* * *

తీర్థ మివ్వని కారణం!

శ్రీ చంద్రశేఖరేంద్రసరస్వతిస్వామివారు నెల్లూరు మకాంలో ఉండగా, ఒకనాడొక బ్రాహ్మణస్త్రీ తీర్థం పుచ్చుకోడానికి వచ్చింది. స్వామి ఆమె ముఖం చూచి, ''అమ్మా, నీవు మడిగాలేవు. మైలపడినావు. ఇంటికి వెళ్లమ్మా!'' అన్నారు.

''స్వామి, నేను ఉతికి ఆరవేసిన మడి చీర కట్టుకుని వచ్చాను. చేత్తో మన్నీళ్లు కూడా పట్టుకు వచ్చాను'' అన్నది ఆ భక్తురాలు.

అయినా, స్వామి ఆమెకు తీర్థం ఇవ్వలేదు. మరి, చేసే దేమీ లేక, విచారిస్తూ ఆమె ఇంటికి చేరింది.

ఆమె ఇంటికి వెళ్లేసరికి, గ్రామాంతరంలో ఉన్న ఆమె పెనిమిటి హఠాత్తుగా కాలం చేసినట్టు టెలిగ్రాం వచ్చింది!

తర్కసహం కాదు

ఏసుక్రీస్తును లేదా మహమ్మదు ప్రవక్తను విశ్వసించేవారు. మాత్రమే స్వర్గానికి పోతారనే సిద్ధాంతం యొక్క తార్కికపరిణామం (Logical Conclusion) 'వారి పుట్టుకకు పూర్వం జీవించిన వారెవ్వరూ మోక్షం పొందలేదు' అనికాదా? ఇది అంగీకారయోగ్యం కాగలదా?



Nadichedevudu   Chapters