Nadichedevudu   Chapters  

 

70. రాజ్యాంగమా, ధర్మశాస్త్రమా?

అస్పృశ్యతానివారణ విషయమై 1927లో మహాత్మాగాంధి, కామకోటి శంకరాచార్యులకు జరిగిన రహస్య సంభాషణలలో స్వామివారు వెల్లడించిన అభిప్రాయాల దృష్ట్యా, అమెరికా దేశస్థుడు డాక్టర్‌ ఎల్డర్‌ అడిగిన ప్రశ్నలకు ప్రస్తుత దేశపరిస్థితులలో భారతపౌరుల కర్తవ్యాన్ని గురించి స్వామి చెప్పిన సమాధానం గమనించవలసి ఉన్నది.

అమెరికాలోని విస్‌కాన్సిస్‌ విశ్వవిద్యాలయంలో సాంఘికశాస్త్ర పండితుడు డాక్టరు. జె. డబ్లియు. ఎల్డర్‌ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెపుతూ శ్రీ కామకోటి పరమాచార్యులు శ్రీ చంద్రశేఖరేంద్రసరస్వతి స్వామివారు భారతదేశం లౌకిక (సెక్యులర్‌) రాజ్యాంగ విధానాన్ని అవలంబించిన కారణాన, హిందూధర్మశాస్త్రానికీ రాజ్యాంగచట్టానికీ వైరుధ్యం సంభవించినప్పుడు రాజ్యాంగచట్టమే అనుసరణీయం కాగలదని అంగీకరించారు.

డాక్టర్‌ ఎల్డర్‌ : హిందూధర్మశాస్త్రాలలో నిర్వచించబడిన విధినిషేధాలను నేటి ప్రభుత్వప్రతినిధులు కూడా అనుసరించవలెనని మీ అభిప్రాయమా?

కంచిస్వామి: ప్రస్తుతం భారతదేశం మతప్రమేయం లేని లౌకిక (సెక్యులర్‌) విధానాన్ని అవలంబిస్తున్నది. పూర్వపు ధర్మశాస్త్రాలను నేటి ప్రభుత్వాలు అమలు జరపడం సాధ్యం కాదు. అందుచేత, ధర్మశాస్త్రాలలోని విధినిషేధాలను గురించి ప్రజలలో ప్రచారం చెయ్యవలసిన బాధ్యతను మతసంస్థలు వహించవలసి ఉన్నది. తద్వారా, శాసన సభలలో ప్రవేశించి ప్రభుత్వాలను ఏర్పాటు చేసే ప్రజా ప్రతినిధులు హిందూధర్మశాస్త్రాలలోని నియమనిబంధనలను గుర్తించగలుగుతారు. నేడు ప్రభుత్వంలో ఉండే నాయకులు ఈ నియమాలను పట్టించుకొనడంలేదు. కాబట్టి, ప్రజల నైతిక, పారమార్ధిక అభివృద్ధిని పెంపొందించే బాధ్యత మతసంస్థల మీదా, మతప్రమేయంగల పెద్దల మీదా ఆధారపడిఉన్నది.

డా. ఎల్డర్‌: అలా అయితే, భారతదేశంలోని రాజకీయనాయకులు శాస్త్ర విధులకు అనుగుణంగా నడుచుకోవాలి. శాస్త్రాలలో పరస్పర వైరుధ్యాలు కన్పించినప్పుడు ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి. ధర్మశాస్త్రానికీ, రాజ్యాంగానికి వైరుధ్యం ఉన్నప్పుడు రాజ్యాంగాన్ని అనుసరించాలి. దీనిని బట్టి, చివరకు భారతరాజ్యాంగమే పాలకులకు అనుసరణీయం కాలేదా?

కంచిస్వామి: ఔను, నేటి పరిస్థితులలో రాజ్యాంగమే దేశనాయకులకు అనుసరణీయం.

వేదాలు -పురాణాలు

ఇతిహాస పురాణాలను పరిశీలించే వేదార్థం తెలుసుకోవాలి. ఇతిహాస పురాణాల పరిజ్ఞానం లేకుండా ఎవరైనా వేదానికి అర్థం చెప్పడానికి పూనుకుంటే అతడిని చూచి వేదాలు వణకిపోతాయట. ఎందుకంటే, అతడు అల్పజ్ఞుడు గనుక వేదార్థాలను తన అల్పమైన ఎరికలోనికి తెచ్చి ముడిపెడతాడని వేదాల భయమట!



గాంధి - స్వామి గోష్ఠి

ఆరు దశాబ్ధాల కిందటిమాట. 1927 లో దక్షిణ భారతదేశంలోని నెల్లిచెరి అనే గ్రామంలో మహాత్మగాంధి, కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామిని దర్శించారు. అస్పృశ్యత, అహింస, ఆర్ష సంస్కృతులను గురించి మహనీయు లిరువురూ ఏకాంతంగా ముచ్చటించుకున్నారు. అయితే, ఇంతవరకు ఈ గోష్టి వివరాలు లోకానికి వెల్లడికాలేదు.

సత్యం లోకానికి తెలియడం అవసరమన్న దృష్ట్యా గోష్ఠి వివరాలను బహిరంగ పరచవలసిందని కంచిస్వామి వారిని పలుమారులు నేను ప్రార్థించాను.

తలవని తలంపుగా సంభవించిన కొన్ని సంఘటనల ఫలితంగా, చివరకు స్వామి నా ప్రార్థనను మన్నించి తమ సంభాషణలు వెల్లడించారు.

ముందుపేజీలలో పూర్తి వివరణ చూడగలరు.

- నీలంరాజు వెంకటశేషయ్య

Nadichedevudu   Chapters