Nadichedevudu   Chapters  

 

72. గోష్ఠి వివరాలు

చరిత్రాత్మమైన శ్రీ చంద్రశేఖర సరస్వతీ - మహాత్మగాంధి సమావేశం ప్రాచీనకాలంలో ఋషుల ఆశ్రమ వాటికలలో వలె ఒక గోశాలలో జరిగింది.

నిరాడంబరతకూ, నియమబద్ధమైన జీవితానికీ ఉభయులూ పేరుబడిన వారు.

గాంధీజీ ఇంగ్లండులో బారిష్టరై, పాశ్చాత్యుల వేషభాషల నలవరచుకున్న వాడైనా, వాటి నన్నింటిని విడనాడి, భారతదేశంలోని సామాన్యప్రజననుసరించి, 'దరిద్ర నారాయణ' సేవలో నిమగ్నుడైనాడు.

ఇక కంచిసంయమి సంగతి చెప్పవలసిని పనేలేదు. పూర్వ సంప్రదాయం ప్రకారం మఠాధిపతి అయిన స్వామికి ఏనుగులు గుఱ్ఱాలు, పండితులు పరిచారకులు, మందీ మార్బలం ఎంతో ఉన్నా, దండం, కమండలం, కౌపీనం, కాషాయం ఇవే సర్వసంగపరిత్యాగి అయిన స్వామి ఆస్తిపాస్తులు. విభూతి, రుద్రాక్షలే ఆయన అలంకరణాలు.

సాధారణంగా పీఠాధిపతికి ఉండవలసిన ఏ పటాటోపమూ లేకుండా ఖద్దరుధారి ఐన స్వామిని చూసి గాంధీగారు ముగ్ధులైనారు.

యావద్భారతజాతికి ఏకైక నాయకుడై, బ్రిటిషు ప్రభుత్వానికి సింహస్వప్నంగా పరిగణించబడుతున్న గాంధిమహాత్ముడు సహచరులు లేకుండా ఒంటరిగా తన కుటీరానికి రావడం చూచి స్వామి కూడా పరమానంద భరితుడైనాడు.

కంచిస్వామి మహాత్మగాంధీకి స్వాగతం పలుకుతూ, ఆధ్యాత్మిక సిద్ధాంతాలకు అనుగుణమైన రాజకీయవిధానాలను రూపొందించి ప్రజలను ప్రబోధిస్తున్నందుకు గాంధిగారిని ప్రశంసించారు.

సౌష్ఠవమైన జాతి మనుగడకు ఆధ్యాత్మిక శక్తి అవసరమనీ, మతరహితమైన, కేవల భౌతికసూత్రాలపై ఆధారపడిన జాతులకు వినాశనం తప్పదనీ స్వామి ఉద్ఘాటించారు.

స్వామి సంస్కృతంలోనూ, గాంధీజీ హిందీలోనూ సాదరంగా, హృదయాలు విప్పుకొని సంభాషించుకున్నారు. వాద ప్రతివాదాలు, సిద్ధాంత పూర్వపక్షాలు లేకుండా నిష్కల్మషంగా ఒకరినొకరు అర్థం చేసుకోడానికి ప్రయత్నించారు.

స్వామి ఇంకా ఇలా అన్నారు:

''ప్రపంచంలోని అత్యంత ప్రాచీన దేశాలలో భారతదేశం ఒకటి. అనాది నుండీ భారతజాతి విశిష్టమైన సభ్యతా సంస్కృతులను కలిగి ఉన్నది. ఏనాడో అది వర్ణాశ్రమ ధర్మమనే విలక్షణమైన సామాజిక వ్యవస్థను రూపొందించుకున్నది. దాని ననుసరించి భారతప్రజలలో ఒక్కొక్క వర్గం ఒక్కొక్క ధర్మాన్ని, ఒక్కొక్క వృత్తినీ అవలంబించింది. వారి వారి స్వధర్మాన్ని పాలిస్తూ ప్రజలందరూ ఐహికాముష్మికసుఖాలను అనుభవించారు.

ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన విధులను నిర్వర్తించడం వల్ల మొత్తం జాతికి అభ్యుదయం సిద్ధిస్తుంది. ప్రజలందరికీ సామాన్యధర్మాలున్నా, వారిలో కొందరికి విశేషధర్మాలున్నవి. ఎవరి ధర్మాన్ని వారు అనుసరించడమే. సహజమైన, సుకరమైన మార్గం. ఇందువల్ల ప్రతి వ్యక్తి తాను చేసే పనిలో కౌశలం సాధిస్తారు. సంఘం సర్వతోముఖంగా వృద్ధి చెందుతుంది. ఇది హిందూసంఘం ప్రత్యేక లక్షణం.

చన్నీళ్ళకుండే గుణం వేరు. వేడినీళ్ళకుండే గుణం వేరు. రెంటినీ కలగలపు చెయ్యడం వల్ల అవి వాటి సహజగుణాలను కోలుపోయి, నిరుపయోగమవుతాయి.

సమాజం అంతా ఒక్కవిధంగానే ఉండదు. ఉదాహరణకు, మామిడిచెట్టుకు అనేక శాఖ లుంటవి. ఈ శాఖలలో ఒక్కొక్కటి ఒక్కొక్క సమయంలో పూత పూస్తుంది. ఒక్కొక్క తరుణంలో కాయ కాస్తుంది. అయినా, చెట్టు ఒక్కటే. సంఘంకూడా ఈ చెట్టువంటిదే. అన్ని శాఖలు కలసి వృక్షం అయినట్టు, అన్ని వర్గాలూ చేరి సంఘం అవుతుంది.

సహజమైన ఈ పరిస్థితిని తారుమారు చెయ్యడంవల్ల సమాజంలో అవ్యవస్థ ఏర్పడుతుంది. ఇటీవలి కాలంలో రాజకీయనాయకులు మత, సాంఘిక వ్యవహారాలలో జోక్యం కలిగించుకొని, వాటిని మార్చడానికి ప్రయత్నించడం చేతనే హిందూ సంఘం బలహీన మయింది.'' అన్నారు స్వామి.

సాంఘిక విషయాలలో రాజకీయవాదులు జోక్యం కలగజేసికొనడం కారణంగా, దేశ పరిస్థితి తారుమారు అయింది అన్న అభిప్రాయంపట్ల గాంధిగారు తమతో ఏకీభవించినట్లు స్వామి వక్కాణించారు.

స్వామి ఇంకా ఇలా అన్నారు. ''అతి ప్రాచీన కాలం నుంచి మన దేశంలో ప్రవర్తిల్లుతూ వచ్చిన సాంఘికవ్యవస్థలో శుచి, శౌచములకు సంబంధించిన కట్టుబాట్లు, నియమ నిబంధన లున్నవి. అవి మన సంస్కృతికి దోహదం చేసినవి. పూర్వ మెన్నడూ అవి దోషంగా పరిగణించబడలేదు. వాటిని పాటించినంత మాత్రాన ఒక వర్గం ప్రజలు మరొక వర్గం వారిని తక్కువ చేసినట్లుకాదు. కులక్రమానుగతమైన ఈ నియమ నిబంధనలను అంతరింపజేస్తే సంస్కృతిపరంగా జాతి ఒక మహత్ప్రయోజనాన్ని కోలుపోతుంది.''

దేవాలయ ప్రవేశ విషయంపై శ్రీస్వామి ఇలా అన్నారు. ''శాస్త్ర ప్రమాణాలపైన, సనాతన సంప్రదాయం పైనా నమ్మకం గల అశేష ప్రజల విశ్వాసాలకు విరుద్ధంగా వారికి బాధ కలిగించడం, అది కూడా ఒక విధమైన హింసగానే పరిగణించబడుతుంది.

దేవాలయాలు పవిత్రమైన వనీ, ఆలయాంతర్భాగంలో దేవుడున్నాడనీ నమ్మేవారికి దేవాలయాలు ఉద్దేశించబడినవి. ఆలయ పవిత్రతను ఆగమ శాస్త్రాలు వేనోళ్ళ చాటుతున్నవి. ఆ శాస్త్రాలలో ఎవరికి విశ్వాసం లేదో, శుచికీ శౌచానికీ సంబంధించిన ఆ నియమ నిబంధనలను ఎవ్వరు పాటించరో వారందరూ ఆలయ ప్రవేశానికి అర్హత లేనివారే.''

భారతదేశ ప్రజలలో హిందువులే గాక, ముస్లిములు, క్రైస్తవులు మొదలైన అన్యమతస్థులు కూడా ఉన్నందువల్ల అప్పృశ్యతా నివారణకు అవసరం ఏర్పడిందని గాంధీజీ అభిప్రాయం వెలిబుచ్చినట్లు కంచి స్వామి వారన్నారు.

రాజకీయ సమస్య:

ఇకపోతే, అప్పృశ్యతానివారణ అన్నది గాంధిగారి దృష్టిలో కేవలం సాంఘిక సమస్యగానే గాక, రాజకీయ సమస్యగా కూడా పరిగణింపబడిందనడానికి తార్కాణంగా కంచిస్వామి నాతో ఇలా అన్నారు.

''భాతర స్వాతంత్ర్యసిద్ధికి గాంధిగారు మొదట నాలుగు షరతులు ప్రకటించారు. వాటిలో మొదటిది అహింస. రెండు: హిందూ ముస్లిం సఖ్యత. మూడు: ఖద్దరు ధారణ. నాలుగు: అస్పృశ్యతానివారణ. ఈ నాలుగూ, ఇంటికి నాలుగు స్తంభాలవంటి వని గాంధిగారు వర్ణించారు. కాని, కొంతకాలం గడచిన పిమ్మట, పైనాలుగు షరతులలో మూడింటిని ఉపసంహరించి, ఒక్క అహింసను మాత్రమే దేశ స్వాతంత్య్ర సంపాదనకు ఒకే ఒక షరతుగా గాంధిగారు పేర్కొన్నారు.

ఇందువల్ల తేలిన దేమిటి? అప్పృశ్యతానివారణ స్వాతంత్య్రసిద్ధికై ఉద్దేశించబడిన రాజకీయ ప్రయోజనమేననీ, మౌలిక సిద్ధాంతంకాదనీ ఋజువు కావడం లేదా?''

తమకూ, గాంధిగారికీ జరిగిన సంభాషణను గురించి స్వామి చెప్పిన తరువాత, ప్రొఫెసర్‌ స్వామినాథన్‌ లేఖను పురస్కరించుకుని నే నీవిధంగా స్వామిని అడిగాను.

నేను: ప్రతి సమస్యకూ రెండు వాదాలున్నవనీ, ఆ రెండవది కూడా రమ్యమైనదేననీ గాంధిగారు తమ ఆశ్రమవాసి మశ్రువాలాకు వ్రాశారు. అంతే కాదు; స్వామితో జరిగిన గోష్ఠి అనంతరం తాను పూర్తిగా భిన్నమైన అనుభవంతో బయటికి వచ్చినామనికూడా ఆ లేఖలో పేర్కొన్నారు. దీనిని బట్టి గాంధీజీ స్వామివారి వాదాన్ని అంగీకరించినట్టు భావించవచ్చునా?

స్వామి: అందుకు సందేహ మేమున్నది?

నేను: అలా అంగీకరించినట్లయితే ఆమాట గాంధిగారు బహిరంగంగా ఎందుకు చెప్పలేదు?

స్వామి: అది ఎలా సాధ్యం? నా వాదాన్ని వారు అంగీకరించినట్టు ఒప్పుకుంటే, అస్పృశ్యతానివారణనుగురించి అంతకు పూర్వం గాంధిగారు దేశవ్యాప్తంగా చేసిన ప్రచారమూ, కృషీ అంతా వృధాకాదా?

గాంధిగారి అహింసా సిద్ధాంతం :

నెల్లిచెరి గ్రామంలో జరిగిన గోష్ఠి వివరాలను వెల్లడించిన పిమ్మట, మహాత్మగాంధిగారి అహింసాసూత్రాన్ని గురించి కంచిస్వామి ఇలా వ్యాఖ్యానించారు.

''అహింసాసిద్ధాంతాన్ని గాంధిగారు మూల సూత్రంగా పాటించినా, ఆచరణలో మాత్రం అది వా రూహించిన విధంగా కొనసాగలేదు. అందుకు ఉదాహరణంగా ఈ కింది విషయాన్ని గమనించవచ్చు.

1927లో గాంధిగారికీ నాకూ జరిగిన గోష్ఠిఅనంతరం, సుమారు ఇరవై సంవత్సరాల తరువాత దేశంలో తీవ్రమైన ఆహారధాన్యాలు కాటకం సంభవించింది. బెంగాలు, ఒరిస్సా, ఆంధ్ర, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు రాష్ట్రాలవారు ఆహారధాన్యాలు సరఫరా చేయవలసిందని కేంద్రాన్ని అర్థించారు. ప్రజల ఒత్తిడి ఎక్కువకాగా, కేంద్రం సందిగ్దంలో పడ్డది. ఆరోజుల్లో గాంధీగారు స్వతంత్ర భారతంలో మకుటంలేని మహీపతి. సమస్యపరిష్కారానికి గాంధికారొక మార్గం సూచించారు. సముద్రతీరవాసులు కానట్టి రాష్ట్రాల ప్రజలకు మాత్రమే కేంద్రం ఆహారాన్ని సరఫరా చేయవలసిందని సలహా ఇచ్చారు.''

నేను: అనగా, సముద్ర ప్రాంతాలలో నివసించే ప్రజలు మత్య్సాహారంపై ఆధారపడవలెననే కదా గాంధిగారి సూచన?

స్వామి: అంతే కాదా మరి?

అహింస: ఆహార సమస్య

అటు తరువాత స్వామి అహింసనుగురించీ, ఆహార సమస్యను గురించీ తమ అభిప్రాయాన్ని ఈ విధంగా వివరించారు.

భారత దేశంలో శాకాహారం ప్రజలలో కొన్ని వర్గాలకు మాత్రమే విధిగా నియమించబడింది. ప్రజలంతా శాకాహారులైతే కాయపుష్టితో పనిచేసే వారికి దేహబలం లోపిస్తుంది. అట్టివారు మాంసాహారులైనా దోషం లేదు. ఎవరివిషయంలో మాంసాహారం నిషేధించబడిందో, వారు మాత్రం ఆ నిషేధాన్ని పాటించి తీరాలి. ఇది కర్మ విభాగమనే (division of labour) సూత్రంపై ఆధారపడి ఉన్నది.

Nadichedevudu   Chapters