Nadichedevudu   Chapters  

 

73. ఇరువులు మహనీయులు

గాంధిమహాత్ముని రచనల సమగ్రచరిత్రకు ప్రధానసంపాదకులైన ప్రొఫెసర్‌. కె. స్వామినాధన్‌ 'స్టేట్స్‌మన్‌' పత్రికకు ఒక లేఖ వ్రాశారు. ఆ లేఖలో వెల్లడించిన విషయాలు కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతిస్వామిపట్ల గాంధిగారికి గల పూజ్యభావాన్ని వ్యక్తపరుస్తున్నవి.

మహాత్మాగాంధికి, తదితర దేశనాయకులకూ తత్వతః ఎంతో అంతరమున్నది. గాంధిగారికి దేశ స్వాతంత్ర్య మొక్కటే ధ్యేయం కాదు. గాంధీజీ ఆస్తికులలో పరమ ఆస్తికుడు. రామభక్తుడు. అంతిమ క్షణాల్లో రామనామస్మరణ చేస్తూ అసువులు బాసిన భక్తశిఖామణి.

రాజకీయరంగంలో వీరవిహారం చేస్తూ, సత్యాహింసలు తన ఉచ్ఛ్వాసనిశ్వాసాలని ప్రకటించుకున్న సాధుపుంగవుడు. మతంలేని రాజకీయం క్షుద్రమని బాహాటంగా చాటిన మతాభిమాని. ఆయనవలె రాజకీయరంగంలో ఆత్మబలంపై, ఆధ్యాత్మికశక్తిపై ఆధారపడిన నాయకుడు లేడు. ఆయన ఉద్యమించిన సహాయనిరాకరణమూ, సత్యాగ్రహమూ, శాసనోల్లంఘనాది కార్యక్రమాలు ఆదిలో అనేకమంది దేశనాయకుల అధిక్షేపణలకు గురి అయినవి. కొందరు ఆయన రాజకీయపరిజ్ఞానాన్నే శంకించారు.

నిర్మాణకార్యక్రమంపై గాంధిగారికి ఎంతో ప్రీతి. ఖద్దరు, అస్పృశ్యతా నివారణ, హిందూ-ముస్లిం సఖ్యత, అహింసావలంబనలను స్వరాజ్యసిద్ధికి ఆయన ప్రధాన సాధనాలుగా పేర్కొన్నారు. ఆ నాలుగింటినీ ఇంటికి నాలుగు స్తంభాలతో పోల్చారు.

1927లో గాంధీజీ తన శక్తినంతా అస్పృశ్యతానివారణపై కేంద్రీకరించారు. అంటరానితనాన్ని రూపుమాపడం ద్వారా హిందూసంఘంలో ఐకమత్యాన్ని పెంపొందించి, హరిజనుల మతాంతరీకరణను నివారించగలమని భావించారు.

అంటరానితనాన్ని నివారించాలంటే కేవలం రాజకీయనాయకులపైనా, సంఘసంస్కర్తలపై మాత్రమే ఆధారపడకుండా, సనాతనధర్మంలో విశ్వాసం గల వారిని కూడా కూడకట్టుకొనడం అవసరమని ఆయన తలపోశారు.

అలాంటి వ్యక్తులు దేశంలో ఎవరున్నారు. ఎవరి సహకారం పొందితే తాను చేపట్టిన ఉద్యమానికి బలం చేకూరుతుంది అని యోచించారు. సనాతన ధర్మవాదులు దేశంలో ఎందరో ఉన్నారు: పండితులూ, శాస్త్రవిదులూ, మఠాధిపతులూ మొదలైనవారు. అయినా, కామకోటిపీఠం శంకరాచార్యులతో సంప్రతించాలని గాంధీజీ ఉద్దేశించారు.

కంచి పీఠాధిపతిని గురించి అంతకు పూర్వమే కాంగ్రెసు నాయకులైన శ్రీ రాజగోపాలాచారి, శ్రీ యస్‌. సత్యమూర్తి, హిందూ పత్రికా సంపాదకులు శ్రీ ఏ. రంగస్వామి అయ్యంగార్‌ మొదలైన ప్రముఖుల ద్వారా విన్నారు. కేవలం మతవిషయాల్లోనే గాక, కంచి పీఠాధిపతుల వివిధవిషయపరిజ్ఞానాన్ని, వారి నిర్మలాంతఃకరణాన్ని, విశేషించి దక్షిణభారతంలో పండితపామరప్రజానీకానికి వారిపై గల భక్తిప్రపత్తులను గురించి తెలుసుకున్నారు.

అట్టి మహావ్యక్తిని తా నుపక్రమించిన అస్పృశ్యతానివారణోద్యమానికి సుముఖులుగా చేసికొని, వారి సహకారాన్ని పొందినట్లయితే, దేశంలో ఆ ఉద్యమానికి ఎంతో బలం సమకూరగలదని ఆశించారు. కంచిస్వామితో సమావేశం జరపడానికి ముందు రోజు ఒక హరిజనసభలో ప్రసంగిస్తూ ఇదే అభిప్రాయాన్ని బహిరంగంగా వెల్లడించారు.

కంచిస్వామివారితో మాట్లాడడానికి తమ ప్రతినిధిగా ఏ రాజగోపాలాచారిగారినో, లేక తన కార్యదర్శినో పంపలేదు గాంధిగారు. తానే స్వయంగా వెళ్ళి స్వామిని సందర్శించారు. దాదాపు గంటసేపు స్వామివారి సంభాషణను శ్రద్ధగా ఆలకించారు. ఆ సంభాషణలో గాంధిగారు ఎంతగా నిమగ్నులైనారంటే ఇరువురి గోష్ఠి ముగిసేవరకూ వెలుపలనే కూర్చున్న శ్రీ రాజగోపాలాచారిగారు చివరకు లోపలికి ప్రవేశించి ''మీ సాయంత్రం భోజనానికి వేళ అయింది'' అని గాంధిగారికి జ్ఞాపకం చేశారు. అంతవరకూ స్వామి చెప్పే మాటలను గాంధిగారు వింటూనే ఉన్నారు. కదలలేదు.

అప్పుడైనా, శ్రీ రాజగోపాలాచారిగారితో గాంధీజీ ఏమన్నారు? ''ఇవాళ స్వామికీ నాకు జరిగిన ఈ సంభాషణ నా సాయంత్రపు భోజనం!'' అన్నారు.

దీనిని బట్టి, గాంధిగారికి కంచిస్వామి ఎడల ఎంత పూజ్యభావం ఏర్పడిందో, సమావేశానంతరం గాంధిజీ ఎంతగా ప్రభావితులైనారో విస్పష్టమవుతున్నది.

అంతేకాదు. కంచిస్వామివారితో వాదప్రతివాదాలు, సిద్ధాంతపూర్వపక్షాలు చెయ్యడానికో, న్యాయవాదుల వలె యుక్తిప్రయుక్తులతో తమ వాదం నెగ్గింది అనిపించుకోడానికో అయినట్లయితే, గాంధిజీ స్వామివారితో ఏకాంతంగా మాట్లాడేవారు కారు. సనాతనధర్మాన్ని స్వామివారివల్ల తెలుసుకోవా లన్న నిజమైన జిజ్ఞాసతోనే తమ ఇరువురికి మాత్రం పరిమితమైన రహస్యసంభాషణలు కొనసాగించారు.

ప్రొఫెసర్‌ స్వామినాథన్‌ తన 'స్టేట్స్‌మన్‌' పత్రికాలేఖలో పేర్కొన్న విషయాలు ఈ భావాలనే విశదపరుస్తున్నవి.

ఆశ్రమ వాసులకు గాంధిగారి లేఖలు:

1927 అక్టోబరు 15 తేదీన గాంధి-స్వామి రహస్యసంభాషణలు ముగిసినవి. 17తేది గాంధిగారు తమ ఆశ్రమ వాసి శ్రీ కిశోరిలాల్‌ మశ్రువాలాకు ఒక ఉత్తరం వ్రాస్తూ ''సమావేశం తరవాత పూర్తిగా భిన్నమైన అనుభవంతో నేను బయటికి వచ్చాను.'' అన్నారు (I came out with a totally different experience) అనగా, అస్పృశ్యతానివారణ విషయమై (పూర్వమున్నదానికి) పూర్తిగా భిన్నమైన అభిప్రాయంతో బయటపడ్డా మన్నారు. ఇక్కడ అనుభవం అనే పదాన్ని కూడా మనం గమనించక తప్పదు. ఔచిత్యం గుర్తించి పదప్రయోగం చెయ్యడంలో గాంధిగారిని మించినవారు లేరు.

అదే లేఖలో గాంధీజీ ఇంకా ఇలా అన్నారు. ''ప్రతి సమస్యకూ రెండు వాదాలున్నవి. ఆ రెండవది కూడా రమ్యమైనది. దానిని మనం గమనించక తప్పదు.'' ఈ మాటలనుబట్టి కూడా, స్వామి చేసిన ప్రసంగం గాంధిగారి నెంత ఆకర్షించిందో, ఎంత హృద్యంగా ఆయనకు తోచిందో తెలుస్తున్నది.

అయితే మరి, స్వామి వెల్లడించిన అభిప్రాయాలు తనకు అంత రమణీయంగా, అంత ఆకర్షణీయంగా తోచినప్పుడు ఆ విషయాన్ని గాంధిగారు బహిరంగంగా ఎందుకు వెల్లడించలేదు? ఎవరికైనా ఈ అనుమానం కలగవచ్చు.

ఇక్కడ మనం ఒక ధర్మసూక్ష్మాన్ని గమనించవలసి ఉంటుంది. గాంధిజీ ఎంతటి ఆదర్శవాది అయినా, ఆయన రాజకీయవేత్త అన్నమాటా, ఆయన లక్ష్యం స్వాతంత్ర్య సంపాదన అన్నమాటా మనం మరవరాదు.

అస్పృశ్యతానివారణ, ఖద్దరు ధారణ, హిందూ ముస్లిం సమైక్యత, అహింసావలంబనలు, స్వాతంత్ర్యసిద్ధికి సాధనాలు మాత్రమే. మూలసూత్రాలు కావు. అయినా, వాటి నిమిత్తం గాంధిగారు దేశవ్యాప్తంగా తీవ్రమైన ప్రచారం చేశారు. అంత ప్రచారం కొనసాగించిన తరువాత కంచిస్వామి చేసిన వాదం ఎంత ఆదరణీయంగా తనకు తోచినా, అస్పృశ్యతానివారణఅవసరం కాదనగలరా? ఆ విధంగా అంగీకరించిన పక్షంలో, స్వవచనవ్యాఘాతం మాట అలావుంచి, అంతవరకూ తాను కొనసాగించిన ప్రబలమైన ప్రచారం యావత్తూ వృథా కాదా? అది రాజనీతికి విరుద్ధం.

''స్వామి మూర్తీభవించిన శాంతం''

కాగా, అదే రోజున (అక్టోబరు 17) గాంధిగారు శ్రీమతి గంగాబెన్‌వైద్య అనే మరొక ఆశ్రమవాసురాలికి లేఖ వ్రాస్తూ, కంచిస్వామిని ఉద్దేశించి, ''ఆయన సాక్షాత్తూ మూర్తీభవించిన శాంతము'' (Incarnation of Peace) అన్నారు. శాంతి అనే పదాన్ని నిర్వచిస్తూ హిందీ కవితాపితామహుడు తులసీదాసు రచించిన రామచరితమానస గ్రంథం నుంచి ఈ క్రింది మాటలు ఉదహరించారు.

''నిజమైన శాంతిని మనం నిర్వచించలేము. అది అనుభ##వైక వేద్యం. జ్ఞానం ద్వారా లభ్యమయ్యే శాంతి సాధారణమానవుని అనుభవానికి అతీతమైనది. కామక్రోధ లోభ మోహాది వికారాలు లేనివారు మాత్రమే అట్టి పరమశాంతిని అనుభవించగలరు.''

పై వర్ణన శ్రీ కంచి యతీంద్రులు చంద్రశేఖరేంద్రసరస్వతులకు అక్షరాలా అనువర్తిస్తుంది. ఆయన మహాజ్ఞాని అనీ, సాక్షాత్తు ఆదిశంకరభగవత్పాదుల అవతారమనీ, పండిత మదన మోహన మాలవ్యా మొదలుకొని లోకమంతా నేడు అంగీకరించిన విషయాన్ని మహాత్మగాంధి ఆరుదశాబ్దులకు పూర్వమే భావించడం అత్యద్భుతం.

భవిష్యద్వాణి:

శ్రీ స్వామినాధన్‌ 'స్టేట్స్‌మన్‌' పత్రికకు వ్రాసిన లేఖలో మరొక విషయం కూడా ప్రస్తావించారు. అది గాంధిగారి హత్యను గురించినది.

మహాత్మునికి, కంచి స్వామికి జరిగిన సంభాషణలో గాంధిజీ హిందూ ముస్లిం సమైక్యతను గురించి ముచ్చటిస్తూ, స్వామి శ్రద్ధానందుడు ముస్లిం దుండుగునిచే హత్య చేయబడిన విషయాన్ని ఉదాహరించాడు. ఇలాంటి ఘాతుక చర్యల దృష్ట్యా భారత దేశంలో హిందూ-ముస్లిం సఖ్యత ఎలా సంభవమని గాంధిగా రన్నారు. ఆమాటకు కంచి తపస్వి అనుద్వేగులై, ఇలా అన్నారట. ''భవిష్యత్తులో ఒకవేళ ఏ హిందువో మిమ్ముగాని, నన్ను గాని హత్య చేసినట్లయితే, ఆ కారణాన యావత్తు హిందూ సంఘాన్ని మనం ద్వేషిస్తామా?''

పై సంభాషణ జరిగింది 1927లో. కాగా, 1948లో జనవరి 30 తేదీ గాంధీజీ ఒక హిందువుచేత హత్య చేయబడిన సంఘటనను పురస్కరించుకుని, ఆనాడు శ్రీ సి. రాజగోపాలచారి గారు ఈ విషయాన్ని కొందరు మిత్రులకు వెల్లడించినట్టు శ్రీ స్వామినాధన్‌ తన లేఖలో పేర్కొన్నారు.

భవిష్యత్సంఘటనను సూచిస్తూ కంచి స్వామి ముఖతా వెలువడిన ఈ మాటలు సామాన్యులకు ఆశ్చర్యజనకంగా తోచవచ్చు. కాని, ఆ మహనీయుని దివ్యచరిత్రనూ, త్రికాలజ్ఞతనూ తెలిసిన వారికి ఇది అసాధారణంగా తోచదు.

స్వామివారి ఆగతానాగత పరిజ్ఞానాన్ని గురించీ, అతీంద్రయశక్తులగురించీ పలువురు ప్రాజ్ఞులూ, పండితులూ ఈ పుస్తకంలో వ్రాసిన వారివారి అనుభూతుల ద్వారా మనం తెలుసుకోవచ్చు.

లౌకికానాంహి సాధూనాం

అర్థం వాగనువర్తతే!

ఋషీనాం పునరాద్యానాం

వాచమర్థోనుధావతి||

(లౌకికులైన సాధువుల వాక్కు ఉద్దిష్ఠమైన అర్థాన్ని అనుసరిస్తుంది. ఆద్యులైన ఋషుల వాక్యాలను అర్థమే అనుగమిస్తుంది. ఏనాటికీ అవి అసత్యములు కావు).

Nadichedevudu   Chapters