Geetha Koumudi-1    Chapters   

పీ ఠి క

భగవద్గీతను గురించి నేను అనేక ప్రదేశములలో ఉపన్యసించుచుండగా వినిన శ్రోతలు ఈవిధంగా గీతను విషయవారీ విమర్శతో అందరికి సులభముగా తెలియులాగున చెప్పుట చాలా బాగున్నదనిన్ని, ఈ పద్ధతిలో గ్రంథమును రచించినయెడల సంస్కృతజ్ఞానము లేని జిజ్ఞాసువులకు ఎంతో ఉపయోగించి ఆధ్యాత్మికచింతను వృద్ధిచేయుననిన్ని నాతో చెప్పుట చేత నేనీ గ్రంథము రచించితిని. గీతలోని వివిధ విషయములను ఈ గ్రంథము విశదము చేయుచున్నది. కనుక దీనికి గీతాకౌముది అని పేరుపెట్టుట సంభవించినది. దీనిలోని అధ్యాయములకు కిరణములని పేరు.

గీతకు శంకరులు రచించిన భాష్యమునున్ను, ఇతర వ్యాఖ్యానములున్ను చూచి అన్నింటి సారమును అందరికి తెలియులాగున, ముఖ్యంగా సంస్కృతభాషాజ్ఞానములేనట్టిన్ని, ఆంగ్లవిద్యావిజ్ఞానము కలిగినట్టిన్ని వారికి సులభముగ తెలియులాగున విషయవారీగా విభాగముచేసి యుక్తుల తోడను, ఆధునిక సైన్సు విజ్ఞానము ననుసరించిన్ని సులభ##శైలిలో ఈ గీతాకౌముదిని రచించినాను.

అందరికి తేలికగ అందుబాటులో నుండుటకై ఈ గీతాకౌముదిని మూడు భాగములుగ విభాగము చేసినాను.

ఈ గ్రంథము దీనిలో మొదటిభాగము. దీనిలో ఉపోద్ఘాతరూపముగ గీతా ఆవశ్యకత, గీతా విశిష్టత, గీతా అవతరణము. గీతాతత్త్వము అని నాలుగు కిరణములను వ్రాసి తరువాత గీతలోని మొదటి మూడు అధ్యాయములను 8 కిరణములలో విశదీకరించినాను.

నేను 1965 సం||లో కాకినాడలో గీతోపన్యాసము లిచ్చుచున్న కాలములో మొదటిభాగమగు నీగ్రంథమును అచ్చువేయుటకుగానుMasterman Press యజమానులగు శ్రీ పోతాప్రగడ కృష్ణమూర్తిగారితో చెప్పగా వారు తమ సహజమైన ఔదార్యముతో ఈ గ్రంథమును ఉచితముగానే అచ్చువేయించి యిచ్చెదనని చెప్పి, వారికి ఎన్నో వత్తిడిగల పనులున్నను ఈ గ్రంథమును త్వరలోనే అచ్చువేయించి యిచ్చినారు.

ఇంకను తహశ్శీల్‌ దారు ఉద్యోగమును చేసి రిటైరు అయి శివాలయ ప్రతిష్ఠ, పురాణకాలక్షేపమందిర నిర్మాణము మున్నగు అనేక భగవత్కార్యములను చేసిన ఔదార్యవంతులగు శ్రీ యేచూరి సీతారామారావుగారు ఈ గ్రంథము అచ్చుకు కావలసిన కాగితముక్రింద 6 రీముల తెల్లకాగితమును ఇచ్చి తోడ్పడినారు.

ఇట్లు ఈ గ్రంథ ముద్రణకు తోడ్పడిన శ్రీ పోతాప్రగడ కృష్ణమూర్తిగారికిని, యేచూరి సీతారామారావుగారికిని సకల శ్రేయస్సులు కలుగుగాక అని మా నారాయణ స్మరణ పూర్వక ఆశీస్సులు.

మరియు ఈ గ్రంథమును చదివి చక్కని ప్రశంసలను గావించిన శ్రీ కుప్పా శ్రీ ఆంజనేయశాస్త్రిగారు, జటావల్లభుల పురుషోత్తం ఎం.ఏ గారు, శ్రీ బులుసు వెంకటేశ్వర్లు. ఎం.ఏ. గారు, మల్లావజ్జల వెంకటసుబ్బరామశాస్త్రిగారు, భాగవతుల కుటుంబరావు ఎం.ఏ. గారు, లంక సీతారామశాస్త్రిగారు, పల్లెల రామచంద్రుడు ఎం. ఏ. గారు, అనువారలకు సకల శ్రేయస్సులు కలుగుగాక అని మా నారాయణ స్మరణపూర్వక ఆశీస్సులు.

_విద్యాశంకర భారతీస్వామి.

 

శ్రీ శ్రీ శ్రీ గాయత్రీ పీఠాధిపతులు శ్రీ విద్యాశంకర భారతీస్వాములవారి "గీతాకౌముది" యను గ్రంథమును సావధానముగా జూచితిని. పదునెనిమిది యధ్యాయములతో యీతత్త్వబోధక గ్రంథమును సామాన్యు లర్థము చేసికొనజాలరు. ఎంతయో గురు-దైవకటాక్షముండి యెన్నియో వందల పర్యాయము లేకాగ్రచిత్తతతో మననము చేసిన గాని యందలి రహస్యము కరతలామలకముగాదు. అట్టి యీగ్రంథము శ్రీ స్వామివారికి కైవశమగుట లోకకల్యాణదాయకము.

శ్రీశ్రీ స్వామివారు ఈ గ్రంథ మెందుకు పుట్టెనో యెట్లు పుట్టెనో అను నుపోద్ఘాతమునుండి యామూలాగ్రము సందర్భపురస్సరముగ వివరించినారు. ఈ గ్రంథమునందు కర్మ-భక్తి-జ్ఞానయోగముల తత్త్వ ముపదేశింపబడినదని యందఱు స్థూలదృష్టితో నెఱుంగుదురుగాని యా యోగముల సూక్ష్మదృష్టితో నిరూపించువారు మిక్కిలితక్కువ సంఖ్యలో నుందురనుట నిర్వివాదము.

కాగా- శ్రీశ్రీ స్వామివారు ప్రత్యధ్యాయమునకు సంగతిని చక్కగా ప్రదర్శించుచు నాయా యధ్యాయములందలి విషయమును వివరించుటయేగాక ప్రతిషట్కము యొక్క ముఖ్యభావమును తద్రహస్యమును సుబోధముగా వివరించి నారు. కావున అక్షరజ్ఞానము, ఆధ్యాత్మిక విషయపిపాసగల ప్రతివ్యక్తికి గీతారహస్యమును ఈ గ్రంథము కరతలామలకమును చేయుననుట నిర్వివాదాంశము. స్వతస్సిద్ధముగా అద్వైతతత్త్వ (బోధ) ప్రచారబద్ధకంకణులైనను నాకుగల యత్యంతోత్సాహముతో నిటులనే సూత్రభాష్యోపనిషద్భాష్యరహస్యములనుగూడ ప్రపంచనమునకు ప్రసాదింతురు గాకయని శ్రీశ్రీ స్వామివారికి విన్నవించు కొనుచున్నాను.

ది 18-12-66 "సర్వతంత్రవిశారద"

కుప్పా శ్రీఆంజనేయశాస్త్రి

24/110 బొజ్జిల్లి పేట, మచిలీపట్టణము.

శ్రీశ్రీశ్రీ గాయత్రీ పీఠాధిపతులు శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్యవర్య శ్రీశ్రీశ్రీ విద్యాశంకర భారతీస్వాములవారు 1965 వ సంవత్సరములో కాకినాడలో నొసగిన భగవద్గీతోపన్యాసములను విను భాగ్యము గల వారిలో నేనొకడను. వందలకొలది విద్యాధికులతో గూడిన యాసభలలో స్వాములవారు నిశితవిమర్శనాశక్తితో గీతా ప్రవచనము గావించి సకలసదస్య హృదయావర్జనము గావించిరి.

ఇట్టి యమూల్యవిషయములు గ్రంథస్థములై ముద్రణము పొందుచో నాంధ్ర పాఠకావళికి శాశ్వతోపకారమగు నని యానాడే శ్రోత లనుకొనిరి. అది నేటికి నెరవేరినందులకు సంతసించుచున్నాను. గీతపై ప్రజలకు గల శంకలకు తృప్తికరమైన సమాధానము చెప్పుటలో శ్రీవా రందెవేసిన చేయి. నూతన శంకలను రేకెత్తించుటయు వానిని ప్రత్యుత్తరించుటయుకూడ స్వాములవారికి విలాసము. విషయచాలనము సిద్ధాంతస్థాపనమునకు ముఖ్యమైన సాధనమగుటచే శ్రీవా రవలంబించినపద్ధతి కడుంగడు శ్లాఘనీయము. ఈ గీతాకౌముది ప్రధమభాగము చదివినవారు ద్వితీయభాగము నకై యుత్కంఠతో నిరీక్షింతు రనుటలో సందియము లేదు.

ఆర్ష విద్యాభూషణ,

జటావల్లభుల పురుషోత్తం, ఎం.ఏ.

 

శ్రీ శ్రీ శ్రీ విద్యాశంకర భారతీస్వాములవారి గీతోపన్యాసములు విను మహాభాగ్యము కలిగినందుకు నే నెంతయు ధన్యుడనని భావించితిని. వారి యుపన్యాససారాంశము గ్రంథరూపమునఁ బ్రకటింపఁబూను టాంధ్రుల అదృష్ట భాగ్యమనియు నానిశ్చయము.

భగవద్గీత పరీక్షలు పెట్టి విద్యార్ధులను ప్రోత్సహించిన కీ|| శే|| శ్రీ న్యాపతి సుబ్బారావుపంతులుగా రొకప్పుడు "నీవు పరీక్షకుఁ గూర్చుంటివా" యని నన్నుఁ బ్రశ్నింపగా "గీతాపరీక్ష శ్రీ కృష్ణభగవానునెదుట నీయఁగోరుచున్నాన" ని జవాబు చెప్పితిని. మిగిలినవన్నియు నటుంచి ఒక్క భగవద్గీతనుమాత్రమే లోకమున కిచ్చియున్నచో, భారత దేశము ఋణమును లోకమెప్పటికిని దీర్పఁజాలదు.

గీత పెక్కు జన్మములనుండి ముముక్షువై, శ్రద్ధాభక్తులతో నభ్యసించినవారికిఁగాని నిజముగా బోధపడదు. గీతలోతు దెలిసిన వ్యక్తులు కొలఁదిమందియే యుందురు. విస్పష్టమైన అనుభవజ్ఞాన మున్నఁగాని బోధించుశక్తి కలుగదు. శ్రీగాయత్రీ పీఠాధిపతులు గీతలోని ప్రతివాక్యత త్త్వమును సమగ్రముగా నెఱిఁగి దాని, కితర సర్వవాక్యములతో నెట్టిసంబంధమున్నదో చూపుటలో వారి విషయవిభాగసామర్థ్యము. భిన్నాంశసమన్వయదక్షతయు నిరుపమానములని యీ గ్రంథపాఠకులకుఁ దెలియగలదు వేయేల ? ఇంతవఱకు రచింపఁబడిన సుప్రసిద్ధ గీతభాష్యములలో నెచ్చటను లభింపని కొన్ని భావములను శ్రీస్వామివా రద్భుత ప్రజ్ఞావైభవముతో నావిష్కరించిరి. ఇది యాంగ్ల భాషలోఁగూడఁ బ్రకటింపఁబడుచో విశ్వవంద్యము కాఁగలదని వినమ్రుఁడనై సూచించుచున్నాను.

చిన్ననాటినుండి వైదిక వాఙ్మయసాగరమున నీదులాడి శ్రీ మద్గీతారహస్యము నెఱుఁగుటకై శ్రీ స్వామివారు నిరవధికకృషి చేసి, తమ అమూల్యభావములను లోకమునకిచ్చుటకుఁ బూనిన యీ మహత్కార్యము సర్వాస్తికలోకము నకుఁ బూజ్యమైనది.

హిందూమతము అనంత శాఖోపశాఖాసమన్వితమగు వయోనిర్ణయ మసాధ్యమైన విశ్వవ్యాప్త మహా వటవృక్షరాజము. శ్రీమద్భగవద్గీత, దాని సారాంశము, శ్రీ విద్యాశంకరుల గీతావివరణము. హిందూమతసారాంశ సారాంశము. అందుచే శ్రీ స్వామివారి గీతావివరణము పఠించినచో హిందూమతసారాంశము సంపూర్ణముగాఁ దెలియఁ గలదు. ముముక్షువు లందరీగ్రంథమును బఠించి ధన్యులయ్యెదరుగాక.

9-1-67

బులుసు వెంకటేశ్వర్లు (రిటైర్డు ఎ.పి.ఇ.యస్‌.)

తెలుగు జాతీయ బహుమానగృహీత.

 

శ్రీ శ్రీ శ్రీ గాయత్రీపీఠాధిపతులు, శ్రీ విద్యాశంకర భారతీస్వామివారు రచియించిన "గీతాకౌముది" యను పొత్తమును అచ్చటచ్చట జూచితిని, గీతాశాస్త్రమునందు స్వామివారొనర్చిన పరిశ్రమ లోగడ వారు గావించిన ఉపన్యాసములను వినియున్న నాకు ఇతఃపూర్వమే విదిత చరము.

శ్రీ స్వామివారు రచించిన "గీతాకౌముది" ప్రథమ భాగము సశాస్త్రీయముగను, సప్రమాణముగను, సోపపత్తికముగను, సవిమర్శముగను, చమత్కారజనకముగను, సులభవ బోధకముగను, ఉన్నదనుటకు సందియములేదు. వీరిందు విమర్శించి చూపిన గీతారహస్యములను పలుతావుల నుపన్యాసరూపమున బోధించి, శ్రోతల నమందానందసందోహతుం దిలస్వాంతుల జేసిరి.

శాస్త్ర పరిశ్రమ సన్నగిలిన యిక్కాలమున, ఆధ్యాత్మికవిషయములను అవగత మొనర్చుకొనుటకు నిట్టిగ్రంథము లత్యంతోపకారకములు.

వరంగలు,

4-1-1967.

ఇట్లు

 మల్లావఝల వెంకటసుబ్బరామశాస్త్రి

అద్వైతవేదా న్తీ శిరోమణి, మీమాంసావిశారద,

్హతాము రచించిన, శ్రీమద్భగవద్గీతా తత్త్వకౌముది ప్రథమభాగమును ఆమూలాగ్రము చదివితిని. శ్రీమద్భగవద్గీతకు తెనుగున అనేక వివరణములు ఇంతకు పూర్వమే యున్నవి. కాని సామాన్యము సారశూన్యమని భావింపబడుచున్న ప్రథమాధ్యాయగ్రంథము, గంభీర భావగర్భితమని వివరించుటలోను, ఆయా యధ్యాయముల యందలి శ్లోకములకు పూర్వాపరసంబంధమును స్పష్టముచేసి విషయవిభాగమును ప్రదర్శించుటలోను, శాస్త్రీయమగు యుక్తులతో గీతాతత్త్వమును నిరూపించుటలోను, ఈవిషయముల నన్నిటిని అతి సుబోధముగ ప్రతిపాదించుటలోను, అన్వర్థమగు ఈ గీతాతత్త్వకౌముది యనిదంపూర్వమనుట స్వభావోక్తియే. పామరులకును పండితులకునుకూడ నవశ్య మాదరణీయమగు ఈ గ్రంథము, తెనుగు సారస్వతమున కొక యాభరణముగ నుండగలదు. కాని యొకమనవి. తామీ గ్రంథ శేషమునుగూడ అనతికాలములో ప్రకటించుచో, ఈ గ్రంథమును చవిచూచిన పాఠకుల కెనలేని యానందము కలుగును.

6-4-67

 అన్తేవాసి కుటుంబరావు, ఎం, ఏ.

ఆంధ్రజాతీయ కళాశాలా ప్రిన్సిపాల్‌.

Geetha Koumudi-1    Chapters