జగద్గురు బోధలు తృతీయ సంపుటము శ్రీ కంచి కామకోటి జగద్గురు శ్రీ చంద్రశేఖరేంద్రసరస్వతీ శంకరాచార్యస్వామి ఆంధ్రానువాదము: ''విశాఖ'' పరిశోధకులు: శతావధానులు, శ్రీ వేలూరి శివరామశాస్త్రి ''ఆంధ్రప్రభ '' నుండి పునర్ముద్రితం. ప్రకాశకులు: సాధన గ్రంధమండలి, తెనాలి. కాపీ రైటు : : వెల : రు. 25-00 సర్వ స్వామ్యములు సాధన గ్రంథ మండలివి. యు వ శ్రావణ పూర్ణిమ వాణీ ఆర్టు ప్రింటర్స్ తెనాలి : 1995 ''శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానము వారి ఆర్థిక సహాయముతో ఈ గ్రంథము ముద్రింప బడినది. వారికి మా మండలి తరపున కృతజ్ఞతా పూర్వక ధన్యవాదములు''.
సంకటనాశన గణపతిస్తోత్రము
జగద్గురుబోధలు మూడవ సంపుటముకూడా వెంటనే వెలువడుట ఈశ్వరునికృప. నాలుగవభాగమున్నూ త్వరలోనే వెలువడగలదు. ఈ ఉపన్యాసములు స్వామివారి ప్రతిభనూ, సందేశమునూ భావ విశిష్టతనూ ఎంత వెల్లడించినా, అవన్నీ వారివ్యక్తిత్వము ముందు తీసికట్టు. స్వామివారిని దర్శించినవారికి ఈబోధలు అవగాహన మవడమేకాక ఆనందం కూడా స్ఫురిస్తుంది. శ్వేతాశ్వతరోపనిషత్తు- యస్య దేవే పరా భక్తి ర్యథా దేవే తథా గురో, తసై#్యతే కథితా హ్యర్థాః ప్రకాశం తే మహాత్మనః|| అని వక్కాణిస్తుంది. రమణభగవానులను దర్శించినపుడు కావ్యకంఠ గణపతిముని 'నేను చదువవలసినదెల్లా చదివినాను. వేదాంతశాస్త్ర పరిశీలనా కావించినాను. తృప్తితీరా మంత్రజపమూ చేశాను. కాని తపస్సంటే ఏమో తెలియలేదు అని అన్నారట. రమణభగవానుల కరుణాపూర్ణసుద్ధాబ్ధిలో మునిగినపిదప కాని గణపతి మునులకు ఊరట లేకపోయింది. అదేవిధంగా దారి చూపే గురువు లేకపోతే ఎవడైనా అంధుడే. జగద్గురు శ్రీ చంద్రశేఖరేంద్రస్వామి వారికి సమకాలికుల మవడం మనభాగ్యం. ఆభాగ్యం వారిదర్శనభాగ్యం కలుగనంతవఱకూ పూర్ణంకాదని మోబోటివారి నమ్మకం. ఈ మధ్య కంచిలో స్వామివారిని దర్శించటం తటస్థించింది. వారు అపుడు శాంతీశ్వరాలయానికి వెళ్ళిఉన్నారు. సమయం సుమారు 12 గంటలు. ఆ ఆలయములోని మూర్తి వ్యాసభగవానులకు శాపవిమోచన కావించి శాంతి నిచ్చిన శాంతీశ్వరుడు. ఆలయానికిముందు శిథిలమవుతున్న కొలనులో స్వామివారు స్నానం చేసి శాంతీశ్వరుని దర్శంచి అక్కడే మండపంలో ఉపవిష్టులైనారు. ఆయన ఎక్కడికి వెడితే అక్కడికి వెంబడించే జనం దాదాపు నలభైమంది ప్రోగైనారు. స్వామివారు మమ్మల్ని అందర్నీ కూర్చోమన్నారు. ఈ క్రింది శ్లోకం చదివినారు. ఆకాశ శ్చికురాయతే దశదిశాభాగో దుకూలాయతే శీతాంశుః ప్రసవాయతే స్థిరతరానందః స్వరూపాయతే, వేదాంతో నిలయాయ తేసువినయో యస్యస్వభావాయతే తస్మి న్మే హృదయం సుఖేనరమతాంసాంబే పరబ్రహ్మణి. 'ఈ శ్లోకంఎక్కడిదో తెలుసా?' అని అడుగగా ఒకరు శ్రీ శంకరాచార్యకృత దశశ్లోకలోనిది అని చెప్పగా స్వామివారు మరొక శ్లోకం చదివినారు. గోవిందా దధికం న దైవత మితి ప్రోచ్చార్య హస్తా ముభా వుద్ధృ త్యాథ శివస్య సన్నిధిగతో వ్యాసోమునీనాం పురః, యస్య స్తంభితపాణి రానతికృతా నందీశ్వరే ణాభవ త్తస్మి న్మేహృదయం సుఖేనరమతాం సాంబేపరబ్రహ్మణి. వ్యాసమహం్షులు ఒకపుడు కైలాసం వెళ్ళారట. అక్కడ శివసాన్నిధ్యంలో గోవిందునికంటే అధికుడైన దేవుడు లేడు - అని రెండుచేతులూ పైకెత్తి ఉద్ఘోషించారట. ఆ విషయం చెప్పడానికి వారికి వేరే చోటు దొరకలేదు కాబోలు. ఈశ్వరుడు వేదాంతనిలయుడు. ఆయన స్వరూపమే ఆనందం. ఆయన స్వభావమేవినయం. గోవిందునికీ తనకూ ఎట్టి భేదమూ లేనందున వ్యాసులు చెప్పినది నిజమేకదా యని ఊరకున్నారట. స్వామి ఊరకున్నా సేవకుడు ఊరుకోడే! వ్యాసుల భేదబుద్ధి చూడగాచూడగా నందికేశ్వరుల వారికి ఎక్కడా లేని కోపంవచ్చింది. పైకి ఎత్తిన వ్యాసులచేతులు అలాగే స్తంభించిపోవాలని నందికేశ్వరులు శాప మిచ్చారట. అంతటితో వ్యాసులు తమ తప్పిదము గుర్తించి. కంచికి వచ్చి శాంతీశ్వరునికి సేవచేసి శాపవిముక్తులయ్యారట. స్వామివారు పై విషయం చెప్పినపుడు అక్కడ ఉన్నవారికి ఆ దృశ్యం మరపురాదు. వారికన్నులు ఆర్ధ్రాఆర్ద్రాలై. ఈశ్వరప్రశంసవల్ల దేహం పులకరించి, వారిభాషలో భావస్రవంతి వెల్లివెరిసింది. మహాపురుషుల ప్రతిమాటా ప్రతిచేష్టా మనకు బోధకంగానే ఉంటుంది. 'స్థితధీః కిం ప్రభాషేత కి మాసీత వ్రజేత కిం?' ఇంతకూ స్వామివారు చెప్పవచ్చినది శైవవైష్ణవ భేదములగూర్చి. ఆయాయీవారు ఆయాయీమతం గొప్పదని అంటారు. లింగాయతులు పైకెత్తబడిన వ్యాసమహం ''సర్వ శ్శర్వ శ్శివ స్థ్సాణు ర్భూతాది ర్నిధి రవ్యయః, సంభవో భావనో భర్తా ప్రభవః ప్రభు రీశ్వరః. అన్న నామావళి పూర్ణంగా శివచిహ్నంగా ఉన్నది. అన్నిటినీ సమన్వయం చేసి వైషమ్యాలు వదలి విశ్వేశ్వరునిలో విశ్వరూపదర్శనం చేయటమే స్వామివారు తరచు బోధించేది. ఈ బోధలలో సాధకులకు కావలసినంత పాథేయం లభిస్తుంది. ఒక్కొక్క ఉపన్యాసంలోనూ మనిషికి ఈశ్వరప్రణిధానం ఎంత ప్రధానమో స్వామివారు చర్వితచర్వణంగా చెప్పి ఉన్నారు. ఈ బోధలు మన కందరికీ ఉపాదేయములై దైవానుగ్రహ హేతువు కావాలని నా ప్రార్థన. 'వాసుదేవ స్సర్వం'. శ్రీ క్రోధి - సంక్రాంతి 'విశాఖ' బొంబాయి - 1965 (యం.వి.బి.యస్. శర్మ) ద్వంద్వాతీతం గగనసదృశం తత్త్వమస్యాది లక్ష్యమ్, ఏకం నిత్యం విమల మచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం న త్రిగుణరహితం సద్గురం తం నమామి. ఇది జగద్గురుబోధలు మూడవ సంపుటము. శ్రీ కంచి కామకోటి జగద్గురు శ్రీ చంద్రశేఖరేంద్రసరస్వతీ శంకరాచార్యస్వాములవారి బోధన రూపమైన ఈ''జగద్గురుబోధలు'' ద్వైతరత్నశకలములు. శ్రీ ఆదిశంకరుల వాస్మయసుధాధారలు. సండిత పామర కంజకములు. వివిధరత్న భాండారములు. వారివారి భావానుకూలముగా శ్రీస్వామివారి బోధరత్నాలను పొంది. జీవితములను సరిదిద్దుకొని జన్మను చరితార్థమును జేసికొనుటకు చక్కని సాధనలు. శ్రీ స్వామివారి తపస్సంపన్నత, ప్రతిభా మహత్త్వము లోకమునకు సుపరిచితములు. అనిర్వచనీయమైన దివ్యశక్తి శ్రీ జగద్గురువుల అనుగ్రహరూపంలో మాచే ఈ జగద్ధిత గంభీర కార్యాన్ని చేయించింది. ఆంధ్రప్రభలో ప్రచురించిన వ్యాసములను మా సాధన గ్రంథ మండలిలో గ్రంథరూపంగా రూపొందించుటకు తమ ఆమోద అంగీకారముల వెలిబుచ్చి శ్రీవారి చిత్రములనుగూచ అనుగ్రహించి సహకరించిన ''ఆంధప్రభ'' సంపాదకులు శ్రీ నీలంరాజు వెంకటశేషయ్యగారికి మా ధన్యవాదములు. సహృదయములు ఆప్తమిత్రులు శ్రీవారిబోధలు ఆంధమున అనువదించిన ''విశాఖ'' (యం.వి.బి.యస్.శర్మ) గారికి మా కృతజ్ఞతలు. గ్రంథకర్త అనురోధముచే ఆంధప్రభలో అచ్చపడిన వ్యాసములలోని గ్రంథకర్త భాషను శిష్టవ్యావహారిక భాషలోనికి విద్యావయోవృద్ధులు శతావధానులు బ్ర|| శ్రీ వేలూరి శివరామశాస్త్రిగారు మార్చిరి. మరియు ఒకటి రెండు సంపుటములలోని శ్లోకాదులకు అర్థములు వ్రాసినటులే ఈ సంపుటమున గల శ్లోకాదులకును శ్రీ శివరామశాస్త్రిగారు విశేష అర్థవివరణమును వ్రాసిరి. శ్లోకాదులలోని అతినిగూఢమైన అర్థ విశేషములను అతిసులభంగా తేటతెలుగున సామాన్యులకుగూడ సుబోధమగునటుల వ్రాసిరి. శ్రీ శాస్త్రిగారికి మా కృతజ్ఞతా పూర్వక ధన్యవాదములు. జిజ్ఞాసువులు, మముక్షువులు అయిన ఆంధ్రమహాజనుల కరకమలములకు ఈ ''జగద్గురుబోధలు'' అందించ గలుగుటకు హం్షించుచున్నాము. ఒకటి, రెండు సంపుటములవలె ఇదియు ఆదరాభిమానములతో స్వీకరించి మా యీ కృషికి సహకరింతురుగాక యని కోరుచున్నాము. తెనాలి ఇట్లు బులుసు సూర్యప్రకాశశాస్త్రి క్రోధి-మాఘము 1965 వ్యవస్థాపకుడు : సాధన గ్రంథ మండలి. తృతీయ ముద్రణ యువ - శ్రావణ పూర్ణిమ 1995 |