Jagathguru Bhodalu Vol-3        Chapters        Last Page

ఓమ్‌
శ్రీ జగద్గురుభ్యో నమః
జగద్గురు బోధలు
అంతశ్శుద్ధి


మనదేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నవి. ఈ క్షేత్రాలలోని పురాతన ఆలయాలు అక్కడక్కడ జీర్ణమైపోతున్నవి. పాడుపడుచున్న ఈ దేవళాలను బాగుచేయడానికి ఇటీవల పూనుకొన్నవారిలో నాటుకోటిచెట్టియార్లు ముఖ్యులు.

పూర్వం చోళరాజులు పాడుపడిన గుడులను బాగుచేసేవారు. ఆ కాలంలో ఆ రాజులు చేసిన పనిని ఈరోజులలో నాటుకోటిచెట్టియార్లు చేస్తున్నారు. వారి పుణ్యమా యని ఎన్నో దేవాలయాలు నేటికి మిగిలినవికాని లేకపోతే అవి ఏనాడో శిథిలమైపోయి ఉండేవి. ఒకరిని పొగడడముకోసము నేనీసంగతి చెప్పరాలేదు. ఒకరుచేసిన సత్కార్యాన్ని మనం మెచ్చుకోవడంవల్ల ఆసత్కార్య ఫలితంగా వాళ్ళకు చెందే పుణ్యం మనకూ అంటుతుంది.

ఒకడొక పుణ్యకార్యం చేస్తాడనుకొందాము. అతడు తన్ను ఇతరులు స్తుతిస్తుంటే విన్నాసరే, లేదా తన్ను తానే పొగడుకున్నాసరే వాని పుణ్యఫలం కొంత లోపిస్తుంది. అందుచేత ఎవరైనా మనం మెచ్చుకోవాలన్న ఉద్దేశముంటే పరోక్షంగా మెచ్చుకొనడం మేలు.

ఐతే ఈ నాటుకోటి చెట్టియార్లు ఇట్టి పుణ్యకార్యాలు చేయడానికి ఎట్లా అలవాటుపడ్డారు? నలభైయాభై ఏళ్ళముందు రుద్రాక్షలూ, విభూతీ ధరించిన నాటుకోటి చెట్టియార్లు ఒక్కరైనా కనపడరంటే అతిశయోక్తికాదు. దీనికి కారణం తామ్రపర్ణతీరంలో వసిస్తుండిన శ్రీ సుందరస్వామి అనేవారు, ఆయన గొప్ప శివభక్తుడు, మంచి నిష్ఠాపరుడు. పుణ్యకార్యాలు చేయడములో ఆయనకు ఆయనే సాటి. ఆయన తిరువారూరులో ఏడు ఆలయాలకు ఒక్కరోజున కుంభాభిషేకం జరిపించినాడట. మద్రాసులో సావుకారుపేటలో స్థిరపడిన గుజరాతీలలో చాలమంది ఈసుందరస్వామివారి శిష్యులే. వారున్నూ, సుందరస్వామి అడుగుజాడలలో నడుస్తూ, రుద్రాక్షమాలలను ధరించేవారు. ఈ సుందరస్వామివారు చెట్టినాడులో సమాధి చెందినారు. ఆయన నాటిన శివభక్తి అనే బీజం మహావృక్షమై ఫలించింది.

దాదాపు యాభై ఏళ్ళక్రితం చెట్టినాడులోనికోయిలూరు అనేచోట సుందరస్వామికి దీటయిన వీరప్పస్వామి అనే ఆయన ఒకరు ఉండేవారు. ఈయనకూడా ఒకభక్తుడు. మంచి శీలమూ చిత్తశుద్ధి కలవాడు. కాని ఆయనకు ముక్కుమీద కోపం. ఇదే ఆయనకున్న లోపం. కోపంవచ్చి ఎవరినన్నా ఆయన ఏమయినా అంటే గడగడాట్‌! ఆయన నోటినుండి మాటరావడమే తడవు- అది జీర్ణాలయమును ఉద్ధరించడమో-వేదపాఠశాలకు శంకుస్థాపన చేయడమో, సత్రం కట్టించడమో, ఏదైనాసరే ఆక్షణమే ఆకార్యం చకచకా నడచిపోయేది. వీరప్పస్వామివారు ఎంతో దోహదం ఐనారు.

ఐతే వీరప్పస్వామికి ఒక్కటే దుర్గుణం. అది ముంగోపం అని చెప్పాను. మనకు విరోధులు ఎవరూ ఉండకూడదని మనం ప్రార్థిస్తూ ఉంటాము. కాని కోపాన్ని మించిన విరోధి వేరే ఎక్కడ? వీరప్పస్వామి తన యీ మర్గుణానికి చాలా వగచేవాడు. ఈ అంతఃశత్రువును ఎలా హతమార్చడం?

సుబ్బరాయ ఆయ్యరనే ఒకబ్రాహ్మణుడు వీరప్పస్వామి సహచరుడు. ఈయన వీరప్పస్వామికి పురాణములూ, న్యాయశాస్త్రమూ ఇంకా ఇతర గ్రంథములూ చదివిచెప్పేవారు. వీరప్పస్వామివారు ఆయనతో అన్నారట- 'అయ్యా! ఇన్ని పురాణాలు మీరు చదివినారుగదా! పురాణాలలో నాబోటి కోపిష్ఠి ఎక్కడైనా స్థలంలో ఉండే మహిమచేత తనకోపాన్ని పోగొట్టుకొని బాగుపడినట్లు చదివిన జ్జాపకమున్నదా? నాకేమైనా విమోచన ఉన్నదా? లేదా?' అని అడిగినారట. సుబ్బరాయ అయ్యరున్నూ 'ఆః, ఉంది' అని బదులు చెప్పినారట.

మనకు సాధారణంగా స్థలమహాత్మ్యాలంటే చాల చిన్నచూపు. ఆయా క్షేత్రం తనగొప్పదనాన్ని విస్తారంగా చెప్పుకొన్న కట్టుకథలు అని అనుకొంటాం. కొందరు ఆస్తికులు సైతం ఈభ్రమలో పడుతూ ఉంటారు. నిజానికి ఈస్థలపురాణాలలో మనకు ఎన్నో లుప్తభాగాలకు ఈస్థలపురాణాలలో లంకెలు చూస్తాం, విస్తరించి వ్రాయబడిన కథలోని సత్యాన్ని నిరూపించడమేకాక దానికొక సాక్ష్యంవలె ఆ యీస్థలపురాణాలు నిలువబడుతూ ఉంటవి. అందుచేతనే ద్రావిడ కవులలో ఎందరో సంస్కృతములోని స్థలపురాణాలను అనువదించి పెట్టినారు. ఒకదానికొకటి ఎంతో దూరంలో ఉన్న పుణ్యక్షేత్రాలకు పరస్పర సంబంధమున్నట్టు ఈస్థలపురాణాలు నిరూపిస్తూ ఉంటవి. కాశీక్షేత్రానికీ, మాయావరం, కుర్తాలం మొదలైన పుణ్యక్షేత్రాలకు ఈస్థలపురాణాలు లంకెపెట్టటం మనం గమనించతగ్గది.

'తిరుత్తరైపూండి సమీపంలో ఉన్న తిరుక్కోయిలూరు క్షేత్రానికి వెళ్ళితే నీకు దారి కనబడవచ్చు' అని సుబ్బరాయ అయ్యరు వీరప్పస్వామికి చెప్పినారట. ఆక్షేత్రంలో మూలవిగ్రహానికి ఎదురుగా దుర్వాసమహం ి ఈక్షేత్రంలో సేవచేసి తన కోపాన్ని పోగొట్టుకొన్నారట. ఆ క్షేత్రంలో వారి విగ్రహం శాంతి ద్యోతకంగా ఉంటుంది.

వీరప్పస్వామి తిరుక్కోయిలూరు చేరుకొన్నారు. వారి యత్న ఫలితంగా బూజుపడుతున్న ఆ దేవాలయం అతి సులభంగా బాగుపడ్డది. అక్కడి తటాకం కూడా ఆయన బాగుచేశారు. దేవాలయంచుట్టూ గృహారామాలు ఏర్పడినవి. ఉత్తరపువీథిలో వీరప్పస్వామియున్నూ, ఒక కుటీరం నిర్మించుకొని నివాస మేర్పరచుకొన్నారు. ఇంత మంచి దేవాలయానికి ఒక రథం లేకపోయింది కదా! అని అనుకొని ఆయన అనతికాలంలోనే రథం సిద్ధంచేసి పెట్టించాడు. వడ్రంగులు, రథాన్ని కైంకర్యానికి వినియోగించే ముందు ఏ కోడినో, గొర్రెనో బలి ఇవ్వడం మంచిదని సూచించారు. అట్లా బలియిస్తేకాని రథం సులభంగా కదలదన్నారు. వీరప్పగారిది పేదమనస్సు, హింసకు ఆయన ఒప్పుకోలేదు. బలిలేకుండానే రథంకదల్చమన్నాడు. రథోత్సవానికి నిర్ణయమైన రోజున స్వామిని రథం మీద కూచోపెట్టారు. ఎందరో భక్తులు చేరారు. రథాన్ని లాగడానికి పూనుకొన్నారు. కొంతదూరం రథం కదిలింది. తరువాత నిలిచిపోయింది. బలికి సమ్మతించవలెనని అందరూ వీరప్పస్వామిని బలవంత పెట్టసాగినారు. ఆయన అన్నారట, ''బలి ఇవ్వడం సులభ##మేకాని నోరులేని ఒక మృగాన్ని చంపితే దాని తల్లి దానికై ఏడుస్తుంది కదా! ఒక స్రాణిని చంపడమే కాదు, ఇంకొక ప్రాణికి ఎంతవ్యధ కల్గిస్తున్నారు? అందుచే అందరమూ కలసి రథం కదలవలెనని దేవుణ్ణి ప్రార్ధించడం మేలు. అప్పటికీ రథం కదలకపోతే రథచక్రాల క్రింద నేను పడడానికి తయారు. నాకోసం ఏడ్చేవారెవరూలేరు.''

అందరూ ప్రార్థించిఒక్కమారుద్విగుణితోత్సాహంతో రథంలాగారు. రథం కదిలింది. వీరప్పస్వామి కుటీరముముందు రథంలాగారు. రథం ఆగింది. వారి భావోద్వేగం చెప్పతరంకాదు. 'భగవానుడు ఎంతటి కరుణామయుడు! భక్తులంటే ఆయన కెంత మమత? వారి బాగోగుల యెడల ఆయన కెంత శ్రద్ధ!' అంటూ స్వామి నీరాజనం ఇచ్చారు. వీరప్పస్వామికన్నులు ఆనందంతో నిండిపోయినవి. ఆ తన్మయతలో ఆయన ప్రాణవాయువులు మహావాయువులో కలసిపోయినయ్‌. ఆయన దేహం వెనుక నిలిచి చూస్తూవున్న సుబ్బరాయ అయ్యగారి బాహువులమీద ఒరిగిపోయింది.

ఈవిషయం ఈమధ్యనే జరిగింది కొంతమందికి ఈ సంగతి గుర్తు ఉండవచ్చు. పురాణాలని కట్టుకథలనేవారుకూడ ఈ విషయాన్ని కాదనలేరు. వీరప్పస్వామి తమకున్న ఒక్క అవగుణం ఎపుడు జయించారో, ఆక్షణమే ఆకరుణాసింధువు, అతనిపై తనచూపు నిలిపాడు. ఆ కటాక్షం వీరప్పస్వామిని జననమరణముల పరిధి ఆవలకు తీసుకొనిపోయింది.

ఆ పరదేవతా కటాక్షముంటేచాలు. ఇచ్ఛాద్వేషాలు, భయశాత్రవాలూ అన్నీ తుడిచిపెట్టుకపోయి మనిషి నిర్లిప్తుడవుతాడు. అపుడు వానికి విపినమూ, భువనమూ ఒక్కలాగు అవుతుంది. అతిలోకసుందరి అధరం మట్టిముద్దలా చూడగల వైరాగ్య మాతనికి కల్గుతుంది. అతనిని ఏదీ ఆకరింపలేదు. దేనిపైనా వానికి కోరికలేదు. కోపంలేదు. ప్రీతిలేదు. భీతిలేదు. మనలోఉన్న అవగుణాలు తొలగిపోవాలంటే దానికి వాసుదేవ భజనమే ఔషధం. భగవత్కరుణానిదర్శనానికి పురాణాల వరకూ వెళ్ళబనిలేదు. ఇటీవల జరిగిన కధలుకూడా చాలు. అందులకే ఈ వీరప్పస్వామిని గూర్చి ప్రసంగించాను.

కామజయానికీ, కాలవిజయానికీ ఈశ్వరభక్తియే సాధనం. ''కాలకాల ప్రసన్నానాం కాలః కిన్ను కరిష్యతి?'' కొందరు ఇట్లా అనవచ్చు- 'మనకు బుద్ధిశక్తులున్నవిగదా! మన యత్నమే ఆధారంగా ఇంద్రియ విజయాన్ని సాధించకూడదా? అని'. నిజానికి అదొక అహంకారమే. భగవత్‌ స్థానంలో 'నేను నీకు పట్టాభిషేకం చేయడమే. భగవంతుడు ప్రేమస్వరూపీ, జ్ఞాన స్వరూపీ. ఆయన అనుగ్రహముంటే కాని మనకు ప్రేమాజ్ఞానమూ అంటువడదు. భక్తిచేతనే వీరప్పస్వామి నీరాజన సమయంలో తన అంతర్జ్యోతిని బహిర్జ్యోతిలో మిళితం చేయ గలిగాడు.

అందుచేతనే మనం చిన్నతనం నుంచే మహాపురుషుల జీవితచరిత్రలు చదవాలి. ఎందరో నిస్సంగులు, కామక్రోధాది అరిషడ్వర్గాలకు అతీతమైన జీవనం గడిపిన మనుషులు, మన జీవనమార్గాలలో తమ అడుగుజాడలు విడిచి సాయపడతారు. బహిఃశత్రువుల విషయంలో మనం అతి మెలకువతో మెలగటం మరచిపోరాదు.


Jagathguru Bhodalu Vol-3        Chapters        Last Page