Jagathguru Bhodalu Vol-3        Chapters        Last Page

వివాహం

బ్రహ్మచర్యానికి పూర్వం చేయవలసిన సంస్కారాలు ఏడు. బ్రహ్మచర్యంలో చేసేవి ఆరు. గృసాస్థాశ్రమంలో వివాహం, సంస్కారమూ, హవి, స్సోమ, పాకయజ్ఞా లనబడే 21 సంస్కారాలూచేరి 22 సంస్కారాలు వీనితో పంచయజ్ఞాలను చేరిస్తే నలభై సంస్కారాలు.

వివాహాలు అనేకవిధాలు. ఆసురము, గాంధర్వము, స్వయంవరము, పైశాచము ఇట్లా ఎన్నో, స్వయంవరాది వివాహాలలో వధువునకు వయస్సు మించినా ఫరవాలేదు. బ్రాహ్మము మాత్రం శీఘ్రంగా చేయవలెనని సంప్రదాయం. బ్రాహ్మ వివాహంలో వధువుకు తగినకాలం కన్యావస్థే.

కన్యగా ఉన్నపుడు ఆ శరీరంలో ఒకరివెంట ఒకరు మువ్వురు అధిష్ఠానదేవతలుగా ఉంటూ, ఆ కన్యను రక్షిస్తూ తమ అధికారకాలం తర్వాత మనుష్యులకు ఆకన్యను ఆర్పిస్తున్నారు. మొట్టమొదట శైశవంనుండీ లజ్జ తెలిసేవరకూ సోముడు అధిష్ఠాన దేవతగా ఉంటున్నాడు. అటు తర్వాత మనుష్యులకు ఆకన్య అధీనం. అందర దేహంలోనూ దేవతలు అధ్యాత్నికంగా ఉంటున్నారు. అట్లే పై చెప్పిన ముగ్గురు దేవతలున్నూ వయోవస్థకు తగినట్లు అధిష్ఠాతలై ఉంటూ ఉంటారు. సోముడు మొదటి అధిష్ఠానదేవత. ఆకాలంలో బాలికలు చూడడానికి చల్లగాఉంటారు. అటుతర్వాత వచ్చే అవస్థలో లావణ్యం ఎక్కువ. అది గంధర్వుని అంశ. అనగా వాని అధికారకాలం. అటుపై కామాగ్ని తీవ్రత ఏర్పడుతున్నది. అది అగ్ని యొక్క అధికారకాలం. ఇట్లా ఈ ముగ్గురు దేవతలు ఉండే వయోవస్థలను గూర్చి మనం లౌకికగానూ చెప్పుకోవచ్చు.

వివాహ ప్రయోగమంత్రం ఇలా ఉన్నది -

సోమః ప్రథమో వివిదే గంధక్వో వివిద ఉత్తరః

తృతీయో అగ్ని ష్టేపతి స్తురీయస్తే మనుష్యజాః

గంధర్వో దద దగ్నయే రయించ వుత్రాగ్‌ం శ్చాద

దగ్ని ర్మహ్య మథో ఇమే.

దీనివలన ఋతువు పిదప మూడేండ్లకు వివాహాధికార మేర్పడుతున్నదని తెలుస్తూంది. స్త్రీలకు వివాహమే ఉపనయనం. అందుచే వివాహమున్నూ గర్భాష్టమాలలో చేయాలి. వేదవాక్యాలు గమనిస్తే పై చెప్పిన ముగ్గురు దేవతల అధికారానంతరమే, వరునికధికారమని తెలుస్తూంది. పెండిలిలో చెప్పే మంత్రాలలో- అగ్ని నా వశ మొనర్చుగాక - అన్న అర్థంలో ఒకమంత్రంఉంది. శరీరవృత్తులూ, మనోభావాలూ వీనిననుసరించి దేవతలు శరీరాన్ని రక్షిస్తున్నారు. - ఈవిధులు గాంధర్వాది వివాహములకున్నూ కద్దు.

బ్రాహ్మణజాతి కేర్పడిన బ్రాహ్మ వివాహంలో గంధర్వపూజ ఉన్నది. అప్పుడీ మంత్రం --

''ఉదీర్వాతో విశ్వావసో నమసేడా మహేత్వా

అన్యా మిచ్ఛా ప్రఫర్వ్యం సం జాయాం పత్యాసృజ |

ఉదీర్వాతః పతివతీ హ్యేషా విశ్వావసుంనమసాగీర్భిరీట్టే |

అన్యామిచ్ఛ పితృషదం వ్యక్తాగ్‌ం స తే భా గో జనుషాతస్యవిది''

బ్రాహ్మవివాహం గంధర్వుని అధికారములో చేసేది. 'ఇది బ్రాహ్మవివాహం. అందుచేనీవు వెళ్ళిపో' అని అర్థం.

స్వయంవరం, చిన్నవయస్సులో జరిగినా జరగవచ్చు, లేదా వయసై#్సనపిదప జరిగినా జరగవచ్చు. గాంధర్వం క్షత్రియుల కేర్పడినది కనుక వధువులకు ప్రాయం వచ్చినపిదప జరిగేవి. బ్రాహ్మణులకు సాధారణంగా స్వయంవరాలు ఆచారంలో లేవు. బ్రాహ్మణ వివాహంలో గంధర్వపూజ ఉన్నందువల్ల గంధర్వుని అధికారంలో ఆవివాహం జరగాలని తెలుస్తూంది. ఇతర జాతులకు అగ్ని - అధికారం వచ్చినపిదప అనగా రజస్వలానంతర వివాహము చేయవలెనని తెలుస్తూంది. మునుపటి కాలంలో లోకాచారంకూడా అలాగే ఉండేది.

వివాహానికి మూడే ఉద్దేశాలు. మొదటిది మంచి సంతానం. అనగా పుష్టీ, లావణ్యమూ, బుద్ధిచతురతా కల్గిన జాతి ఏర్పడాలని మొదటి ఉద్దేశం. స్త్రీలు జీవితపరమావధి పొందాలి, వారికి చిత్తశుద్ధి ఏర్పడాలి. ఇందుకు ఒక ఆలంబనం ఉండాలి అని రెండో ఉద్దేశం. మూడవది పురుషునికి గృహస్థాశ్రమంలోకర్మానుష్ఠానంద్వారా, శ్రేయఃప్రాప్తికి ఒక సహాయం అవసరం. అనగా పురుషుడు పరిపక్వం పొందడానికి తగినధర్మం ఆచరించడానికిన్నీ స్త్రీలుతమ జీవితలక్ష్యం అందుకోవడానికిన్నీ అవలంబనంకావాలి. ఇదంతాకలిపిచూస్తే లోకకల్యాణానికి తోడ్పడే మంచిప్రజ సిద్ధించడానికి వివాహం ఏర్పడ్డదన్నమాట.

వర్ణాశ్రమ విభాగంలో ఒక్కొక్కధర్మానికి ఒక్కొక్క ఉద్దేశం ఉన్నది. సన్యాసులున్నారు. పురుషులులేని స్త్రీలు ఉన్నారు. వానప్రస్థులున్నారు. వారికి స్నానము, ఉపవాసమూ లాంటి అధికనియమాలున్నవి. సుమంగలులు మాటిమాటికి స్నానమాడనక్కరలేదు. వారికి జలప్రోక్షణమాత్రం చాలు.

సన్యాసి అడుగడుగునకూ స్నానం చేస్తుండాలి. క్షత్రియులు మాంసాహారం పుచ్చుకొన్నా అదిదోషమని చెప్పబడలేదు. శ్రీరామచంద్రమూర్తిసైతం శ్రాద్ధాదులకు మాంసముపమోగించారు, కృషిచేసేవారికి నియమాలు ఎక్కువగా చెప్పబడలేదు. అందరూ ఉపవాసాలుచేస్తే పనిజరిగేదేట్లా? అందరూ మాంసభక్షణకు పూనుకొన్నారంటే శుద్ధియెట్లా? మనదేశంలో అన్నిటినీ ఏకంచేయటం కానిపని. అందరూ ఒక్క మార్గంలోనే నడిస్తే ఒక్కపనియే చేయకల్గుతారు. మిగతా పనులేవీకావు. అందుచే వర్ణాశ్రమ ధర్మరీత్యా తలా ఒకరికీ తలా ఒకపనీ ఏర్పఱుపబడ్డది. అందరూ వర్ణశ్రమోచిత కార్యాలను చక్కగా అనుష్ఠిచ్తూ ఉమ్మడి పనిపాటలలో ఒకటిగా చేరుకొనేవారు.

గాంధర్వవివాహం లావణ్యమూ, వీర్యమూకల ఒక జాతికై ఏర్పడ్డది. స్వయంవరం అనే వివాహం తన ఇచ్ఛననుసరించి మగనిని ఎన్నుకోడం. జన్మసఫలతయే ప్రధానాశయంగా కల్గినది బ్రాహ్మం. ఈ ఆశయం ఇతర వివాహాలలోఉన్నా వారివారికి ప్రత్యేకమైన లక్ష్యాలున్నవి. బ్రాహ్మంలో మాత్రం ఆత్మ శ్రేయస్సే ప్రధానం తక్కినవి అనుషంగికం.

మనోభావ వ్యత్యాసం లేనికాలంలో, ఇతడే దైవమన్న అభిప్రాయం చిన్న వయస్సులోనే అంకురింపచేసి, దానికి అనుగుణంగా నడచుకొనే అలవాటు ఏర్పరచి, మనోవికారంకలిగే కాలంలో తన్ను తనభర్తకు అర్పించుకొనేవిధంగా వివాహం ఏర్పడినది. శరీరంమీద గంధర్వాధికారమున్న సమయంలో వివాహం చేయాలన్న శాస్త్రీయ నిబంధనకు ఇదే ఉద్దేశం.

పత్నికి పాతివ్రత్యం విధి. కాని పతికి పత్నీవ్రత ముండవలెననే నియమంలేదు. ఏకపత్నీ వ్రతమున్నది. కాని పతియే దైవమన్న భావన దానిలోలేదు. బ్రహ్మచర్యానికి కొన్ని వ్రతాలు ఏర్పడినట్లే, పాతివ్రత్యానికిన్నీ వ్రతమున్నది. పతియే పరమేశ్వరుడన్న భావన రూఢిచేసుకొని ఆజన్మాంతమూ పతియందు శ్రద్ధకలిగి నడుచుకొనడమే ఆపాతివ్రత్యం. పతికి ద్రోహంచేయకుండా ఉండటంమాత్రంచాలదు. పరమేశ్వరుడే పతిరూపంలో ఉన్నాడన్న భావన తీవ్రంగా మనస్సులో నాటుకొనేంతటి అంతశ్శుద్ధి ఏర్పరచుకోవాలన్నమాట.

ఈవిషయంగా రామాయణంలో ఒక వాక్యమున్నది. 'పతివ్రతా మహాభాగా ఛాయేవానుగతా సదా' స్త్రీభర్తను ఛాయవలె అనుసరించాలి. బ్రహ్మచర్యంలో శిష్యుడు గురువుపై చూపే భక్తిశ్రద్ధలుకూడా పాతివ్రత్యానికి సరిరావు. శిష్యునకు చదువు చెప్పేవాడు ఒక గురువు. అటుపై ఆత్మవేత్త మరొకగురు వేర్పడుతున్నాడు. స్త్రీలకట్లుగాక పతియే ఈశ్వరుడన్న భావన ఉండాలి. పెళ్ళికిముందు పరమేశ్వరుడే భర్తయని పూజిస్తూ పెండ్లి ఐన తరువాత భర్తయే పరమేశ్వరుడన్న భావం అలవర్చుకోవాలన్నమాట.

అంగసౌందర్యమూ, గుణసౌందర్యమూ ఉన్న భర్తలు దొరికితే పాతివ్రత్యాచరణకు పెద్ద బాధలేదు. ఇవి లోపించినపుడే ఏమిచేయడం? విపరీతగుణాలూ పరమకుత్పిత దేహమూ కల్గిన భర్తతో అసమాన పాతివ్రత్యాన్ని ఆచరించిన విషయం. నాలాయినికథ తెలుపుతూంది. పాతివ్రత్యాచరణంలో మూఢుడూ, కురూపీ ఐన భర్తపైకూడా ఏవం ఉండరాదనే విషయం నొక్కి చెప్పబడ్డది. ''మనమే అందవికారంగా పుట్టిఉంటే ఏమిచేయడం? ఇది ఈశ్వరపరీక్ష. ఇతడు అందగాడైతే పాతివ్రత్యం చేయడంలో గొప్పతనం ఏమున్నది?'' అన్నభావన కల్గిఉండాలన్నమాట. ఏఅవమానంగానీ, కష్టంగానీ ఏదో కొంతకాల ముంటుంది. కలకాలమూ ఉండదు.

పురుషునికి గురువు ఏస్థానంలో ఉంటున్నాడో అదేస్థానం భార్యపట్ల భర్తకున్నది. తన సమస్తాన్నీ పురుషుడు గురువున కర్పిస్తున్నాడు. అందుకొరకే ఒక్క గురువును నిర్దేశించుకోవాలన్న నియమం ఒకటి ఉన్నది. పదిమంది గురువులున్న మనస్సు ఏఒక్కరిపైనా లగ్నంకాదు. పురుషుడు ఒక్క గురువును నిర్ణయించుకోవాలి. స్త్రీ అట్లే ఒక్క పురుషునికి తన మనస్సు అర్పించాలి, మనస్సుకు తోచినదంతా చేయడం వదిలిపెట్టాలి. ఒక్క గురువును ఆశ్రయించి అతనినే శరణుజొచ్చి స్థిరంగా ఉండాలి.

''భూమౌ స్ఖలిత పాదానాం భూమిరేవావలంబనం,

త్వయి జాతా పరాధానాం త్వమేవాలంబనం గురో!''

మేడపైనుండి క్రిందపడితే భూమిభరిస్తున్నది. కిందనే జారిపడినా భూమియే భరిస్తున్నది. ఈశ్వరాపచారాన్ని గురువు దగ్గర చెప్పుకొని తప్పించుకోవచ్చు. గురువుకు చేసిన అపచారానికి గురువుదగ్గరకే మనం వెళ్ళవలసి వస్తుంది.

గురువును అన్వేషించడం మనధర్మం. మనం గురువును వెదకటం ఎందుకు? మనస్సు మారకుండా వుండడానికి మనస్సు గురువున కర్పించినట్లైతే గురు వెవరయినా సరిపోతుంది. గురువు శ్రేష్ఠుడైతే మరీ మంచిది. అయ్యోగ్యుడైతే అదీమంచిదే. మనమనస్సు మరింత పక్వమవుతుంది. మరింత మనోదార్ఢ్యం కలుగుతుంది.

మహాత్ములకు శక్తులున్నవి. మనకేమున్నవి? మనభక్తి మనకు ప్రయోజనం కావాలి. వెంకటాచలపతి ఆలయంలోని అర్చకులు అశుద్ధిగా ఉన్నారని, ఆలయానికి వెళ్ళడం మానుకున్నామా? మనం అర్పించేది మనకులాభం. గురువు మహాత్ముడు కాకపోతే అనుక్షణమూ కష్టం వస్తూంటుంది. దానిని ప్రతిఘటించే మనోదార్ఢ్యం అలవరచుకొంటే అది మరింత పుణ్యం. పురుషునికైనా గురువును వెదకవలసిన అవసరంఉంది. స్త్రీకి వివాహమైన క్షణంనుండీ భర్త గురువవుతున్నాడు. అతడు ఒకవేళ దుష్టుడైతే అంతకంత ఆకరణ శక్తి అధిక మవుతుంది.

వివాహంలో అగ్ని సంబంధ మేర్పడుతున్నది. అంతవరకు బ్రహ్మచర్యంలో సమిదాధానంచేయాలి. అటుపై ఔపాసనాగ్ని సిద్ధిస్తున్నది. సన్యాసికి అగ్ని ఆత్మలో ఉన్నది. స్త్రీపురుషులిరువురూ ఔపాసరాగ్నిని ఆరిపోనీక రక్షించుకోవాలి.

ఔపాసనతో పాటు కృష్ణపాడ్యమినాడు, శుక్లపాడ్యమినాడు స్థాలిపాకం చేయాలి. స్త్రీ లేకుండా పురుషుడు దానిని చేయరాదు. పురుషుడు ఇంటిలో లేకపోయినా స్త్రీఔపాసనచేయవచ్చు. గృహనిర్మాణంలోనే ఔపాసనాగ్నికి కల్పసూత్రాలప్రకారం ఒకస్థలం నిర్దేశింపబడిఉన్నది. గృహనిర్మాణం సైతం వర్ణాశ్రమధర్మాన్ని అనుసరించి ఏర్పడిఉన్నది.

గృహస్థాశ్రమం నాలుగువర్ణాల వారికిన్నీ ఉన్నది. నాలుగవ వర్ణానికి చౌలపర్యంతం సంస్కారాలున్నవి. అందుచేతనే వివాహకాలంలో వారు ఔపాసన చేస్తున్నారు. వైద్యనాథ దీక్షితీయములో వారికి ఔపాసన మున్నట్లు చెప్పబడినది. ఔపాసన మాయాశ్లోక రూపమంత్రాలతో చేయాలి.

అగ్నిపూజ పారసీకుల కున్నది. వారి మతగ్రంథం జెందవస్తా. అది ఛందో7వస్థకు వికృతి. సౌరాష్ట్రదేశంనుండి వెళ్ళిన ఒకరు వారి మతగురువైనారు. సౌరాష్ట్రపదం 'జొకాష్టర'న్న వికృతి పొందింది. వారిసంతతివారే పారసీకులు. ఋగ్వేదంలో 'అగ్ని మీళే పురోహిత' మన్న ఋక్కు ఉన్నది. అగ్నిలో పరమేశ్వరుని ఆరాధించాలి. మలయాదేశంలో దీపాన్నీ వెలిగించి భగవత్‌ సేవ అని ఆజ్యోతిలో అంబికారాధన చేస్తున్నారు. పారసీకుల అగ్ని పూజకూడా వైదికమత సంబంధమైనదే. వారు 'అగ్నిమీళే' మంత్రాలను కొంత కొంత మార్చి చెపుతున్నారు. మనుధర్మశాస్త్ర ప్రకారం కర్మానుష్ఠానాలు చేయించే బ్రాహ్మణులు లేనప్పుడు క్షత్రియత్వం పోగొట్టుకొన్న క్షత్రియాభాసులు వీరు. చీనావారిలోనూ, ద్రావిడులలోనూ, పారసీకులలో సైతమూ వైదికానుష్ఠానాభాసం కన్పడుతూంది.

నాలుగువర్ణాలవారున్నూ, అగ్నినుంచుకోవాలి. ఔపాసనాది కార్యాలలో కార్యకలాప మెక్కువ. అందుచే అగ్నిని కాపాడుతూవస్తే భూతప్రేతపిశాచాదుల బాధయున్నూ, వ్యాధులున్నూ ఉండవు. ప్రస్తుతం బ్రాహ్మణుల ఇండ్లలో సైతం భూతప్రేతాల బాధ కలిగి వారు భూతవైద్యుని ఇంటికి వెడుతున్నారు. వైదికాగ్ని ఇంటిలో ఉంటేచాలు, అదేరక్ష. ఏ ఉపద్రవమున్నూ కలుగదు. స్త్రీలకు ఆచరణీయమైన వైదిక ధర్మాలలో ఔపాసన ఒక్కటే.

ఇంట్లో వడ్లుదంచుకొంటె ఔపాసనాగ్నికి కావలసిన పొట్టుదొరుకుతుంది. శాస్త్రీయమైన బియ్యమున్నూ దొరుకుతుంది. మరలో తయారయ్యే బియ్యంలోని ఉష్ణముననూ ఉండదు. ఇంటివారే వడ్లుదంచుకొంటే దార్ఢ్యంకలుగుతుంది. ఎంతకెంత యంత్రముపై ఆధారపడుతున్నామో అంతకంత దానివల్ల శ్రముంటుంది. ఔపాసనాగ్నిని ఇంటిలో ఉంచుకొని రెండు మంత్రములైనా చెప్పి అక్షతలువేస్తే అదే గొప్పరక్షగా ఉంటుంది.

వివాహాలలో మూన్నాళ్ళు బ్రహ్మచర్యంచేయాలి. ఇది అన్నిరకాల పెండ్లిండ్లకూ సామాన్యం. నాలుగోరోజు శేషహోమంచేయాలి. వివాహదీక్ష సంవత్సరదీక్ష అనివాడుక. ఒక యేడాది మూన్నాళ్ళు వెలికిరాదగదనేది నియమం. ఇది ముఖ్యకల్పం. మూన్నాళ్ళనేది ఇటీవలిది. ఇపుడు ఒకరోజులైనా జరగాలి. అప్పటికిగాని ఔపాసనసిద్ధి ఏర్పడదు. లౌకిక వ్యయం అధికమైనందుచేత ఒకరోజే వివాహం చేస్తున్నారు. డెబ్బది ఏండ్లకుముందు పెండ్లిండ్లకు ఇంతకష్ట ముండేదికాదు. వైదిక కర్మలకు డబ్బుఖర్చు ఉండేదికాదు. వివాహమూ సంధ్యా వందనమూలాంటి వైదిక కర్మలకు డబ్బుఖర్చు పెట్టవలెననే నిర్బంధం లేదు. ఆత్మకు సంబంధించిన కార్యాలలో ద్రవ్యంతో సంబధంఉండరాదు. అట్లుంటే పేదవారికందరకూ దోషం ఏర్పడుతుంది. కర్మానుష్ఠానానికి, డబ్బుకూ లంకెపెట్టడం తప్పు. బీదసాదలు మొదలు మహారాజులవరకు చేయవలసిన కర్మలు ఈలాగే నడిచేవి. తిండినిగూర్చిన వంత ఆ రోజులలో ఉండేదికాదు.

ఉండటానికి పూరిగుడిసె ఏదో ఒకటి ఉండేది. ప్రస్తుతం సామాజికవ్యవస్థే మారిపోయింది. ఇదంతావ్యాపారసౌఖ్యాలు వృద్ధియైనదోషం. వస్తువులను అమితంగా నిలవచేయడం లక్ష్యమైంది. చిత్ర విచిత్రాలయిన బట్టలుకట్టడం, పెట్టడం ధ్యేయమైంది. ఇవే ద్రవ్యముంటేనేకాని చేయలేని పెద్ద కార్యాలయిపోయినై.

గ్రామాలువదలి నగర జీవనం ప్రారంభించారు. భూములనమ్మి సర్టిఫికెట్లుగా మార్చుకొన్నారు. నేర్చుకొన్న విద్యకు తగినఉద్యోగాలు దొరకవు. దీనినంతా మొదటప్రారంభించింది బ్రహ్మలే. తరువాత తక్కినవారున్నూవీరి అడుగుజాడలలో నడిచారు. గ్రామాలనువదలి నగరప్రవేశం చేసినందువల్లకల్గినది దారిద్ర్యమే. మొదట బ్రాహ్మణులకు ఉద్యోగాలు లేవన్నారు. అటుపిదప అందరికీ లేవన్నారు. పెళ్ళి విషయాలలో కూడా బ్రాహ్మణులనుచూచి ఇతరజాతులు దుబారాఖర్చులను పెంచుకొన్నారు. అందుచే సంస్కార-ఆశయం కలవారు పెళ్ళిఖర్చులను తగ్గించుకోవాలి. అందులకుగాను మూన్నాళ్ళ పెండ్లి ఒకరోజు చేయటంకాదు. ఆహారపు ఖర్చులూ వరకట్నాలూ తగ్గించుకోవాలి. ఒకరోజుపెండ్లి శాస్త్రసమ్మతంకాదు.

వివాహంలో ప్రవేశహోమ మనేదొకటి ఉన్నది. అది వరుడు స్వగృహం ప్రవేశించేటప్పుడు చేయవలసినది. వివాహాగ్నిని తీసుకొనిపోయి తన గృహంలో ఔపాసనహోమం చేయాలి. దానికే ఔపాసనయని పేరు.

వివాహంలో సాలంకృత కన్యాదానం చేయాలి. అంతమాత్రాన వరకట్నాలు పుచ్చుకోవాలన్న నిబంధనలేదు. లౌకికపు ఖర్చులు తగ్గించుకొంటే వివాహాలు సులభంగా ఐపోతై. తిండికీ, గుడ్డకూ, నగలకూ చేసేఖర్చులు తగ్గించుకొని శాస్త్రీయంగా మూడు రోజులలో వివాహంచేయడం ఉత్తమం. ప్రాతఃస్నానమూ, దేవదర్శనమూలాంటి మంచి అలవాట్లను వాడుకలోనికి తెచ్చుకొంటే జీవితం సుఖప్రదమవుతుంది.


Jagathguru Bhodalu Vol-3        Chapters        Last Page