Jagathguru Bhodalu Vol-3        Chapters        Last Page

అంబికానుగ్రహం

అంబిక వాగధీశ్వరి. ఆమె అనుగ్రహం ఉంటేచాలు వాక్కు వశమవుతుంది.

రూపం తమస్ఫురిత చంద్రద మరీచి గౌర

మాలోక్యతే శిశిర వాగధిదైవతం యైః,

నిస్సీమ సూక్తి రచనామృత నిర్ఘరిణ్య

స్తన్య ప్రకామమధురాః ప్రసరంతి వాచః.

మహాకవులకు ఏ కాలంలోనూ ఎనలేనిగౌరవం ఉంటున్నది. దేశంలో ముప్పది మూడుకోట్లమంది జనం ఉన్నా ఇంతమందిలోనూ ఏఒక్కడో మహాకవి అవుతాడు. ఆ అదృష్టం కలగటం ఆమె అనుగ్రహం. ఐతే అన్ని కాలాలలోనూ, అందరిచేతా మహాకవి అనిపించుకొన్నవాడు కాశిదాసు ఒక్కడే. ఆ మహాకవి నామధేయమే అతని అంబికాచరణ దాసత్వాన్ని తెలుపుతున్నది.

కాళిదాసు రఘువంశమనే కావ్యం వ్రాశాడు. రఘువు తండ్రి దిలీపుడు. రఘువంశకథ ఈయనతోనే ప్రారంభమవుతుంది. దిలీపుడు, రఘువు, అజుడు, దశరథుడు, శ్రీరాముడు, కుశుడు, కుశునిపిదప వచ్చిన మహారాజుల చరిత్ర రఘువంశ కావ్యంలో వ్రాయబడింది.

శ్రీరామచంద్రమూర్తి వైకుంఠానికి వెళ్ళిపోగానే జనమంతా ఆయన వియోగం భరించలేక సరయూనదిలో దిగిపోయారట. కుశుడికి ఎక్కడలేని విరక్తికల్గింది. అందుచేత ఆయన అయోధ్యను విడచి కుశావతీ అనే పట్టణం నిర్మించి అక్కడ రాజ్యంచేస్తూ ఉన్నాడు. కాని తన పెద్దలు ఇంతకాలం ఉండిన అయోధ్యానగరపు-అధిష్ఠాన దేవతను మాత్రం మరచిపోక, కుశావతిలో మంత్రపూర్వకంగా ఆరాధిస్తూ వచ్చేవాడు. ఒకరోజు అంతఃపురంలో కుశమహారుజు నిద్రిస్తున్నాడు. అయోధ్యానగర అధిష్ఠాన దేవత మహారాజు శయ్యకు ప్రక్కగా నిలబడి అతనికి దర్శనమిచ్చింది. కుశుడు హఠాత్తుగాలేచి కూచుని ఈవిధంగా అంటాడు.

కాత్వం శుభే కన్య పరిగ్రహోవా

కింవా మదభ్యాగమ కారణంతే,

ఆచక్ష్వ మత్వా వశినాం రఘుణాం

మనః పరస్త్రీ విముఖ ప్రవృత్తి.

''సర్వోత్త మగుణ ఖనిగా కనబడుతున్నావు. నీవెవరవు? ఎవరిభార్యవు? రఘువంశంలో పుట్టినవారికి ఏ స్త్రీని చూచినప్పటికీ ఎంత ఏకాంతమైనా మనశ్చలనం ఉండదుకదా? నీ వెందుకిక్కడికివచ్చినావు? భయంలేక నిస్సందేహంగా బదులుచెప్పు''.

ఆపుడు అంబిక అతనిని చూచి బదులు చెప్పుతున్నది.

చిత్రద్విపాః పద్మవనావతీర్ణాః

కరేణు భిర్దత్త మృణాళ భంగాః,

నఖాంకుశాఘాత విభిన్న కుంభాః

సంరబ్ధసింహ ప్రహృతం వహంతి.

''కుశమహారాజా! నీవు అయోధ్యను వదలడం న్యాయంకాదు. నీపెద్దలుండిన నగరమది. అక్కడికి నీవు మరల తిరిగి రావాలి. నేను అయోధ్యాధిష్టాన దేవతను. నీవు వదలినదే అయోధ్య పాడుపడ్డది. మహోన్నత సౌధాలతో, జనంతో ఒకప్పుడు కలకలలాడుతూ ఉండిన నగరం నిర్జనమై ఇపుడు బూజుపట్టింది. సౌధప్రాంగణాలలో వ్రాసిన చిత్తరువులు వ్రాసినట్లే ఉన్నవి. రెండు ఏనుగులు (ఆడమగ జంట) ఒక తామరకొలనులో దిగియున్నట్లు వ్రాయబడిన చిత్తరువులో ఆడేనుగు తామరనూడులను తన తొండముతో పెరికి మగ ఏనుగుపై తన ప్రేమను తెలుపుటకు వేస్తున్నది. అయోధ్యలో చిత్తరువులలో ఏనుగులున్నవేకాని, నిజానికి లేకుండాపోయినవి.

ప్రజలు పాడుపెట్టిపోతే పట్నం కళావిహీనంకాక మరేమవుతుంది? అయోధ్యను నిర్జనంచేసినీవు వెళ్ళటం బాగులే''దని కుశునికి అంబిక చెప్పగనే తిరుగా కుశమహారాజు అయోధ్యకు వెళ్ళిపోయినాడట. ఆమెను ఆరాధిస్తూవచ్చినందు వల్ల అతనికి ఆమె దర్శనభాగ్యం అబ్బినది.

ఆచార్యులవారు ఎన్నోస్తోత్రాలు చేశారు. సౌందర్యలహరి, శివానందలహరి, భజగోవిందము, హరిమీడేస్తుతి, ప్రబోధసుధాకరము ఇత్యాదులెన్నో వ్రాశారు. 'హరిమీడేస్తుతి, ప్రబోధసుధాకరము ఇత్యాదులెన్నో వ్రాశారు. 'హరిమీడే' అన్నపదానికి 'హరిని నేను స్తుతిస్తున్నాను' అని అర్థం. ప్రబోధ సుధాకరమనగా అజ్ఞానమును నివృత్తిచేసి జ్ఞానమును కల్గించునది అని అర్థము.

చేత శ్చంచలతాం విహాయపురతః సంధాయ కోటిద్వయం

తత్రైకత్ర నిదేహి సర్వవిషయా సన్యత్ర చ శ్రీపతిం,

విశ్రాంతిర్హితమస్యహాక్వను తయోర్మ ధ్యేతదాలోచ్యతాం

యుక్త్యావానుభ##వేన యత్రపరమానందశ్చతత్సే వ్యతామ్‌.

అనునది ప్రబోధ సుధాకరములోనిది.

''ఓ మనసా! త్రాసుముల్లు చలించేవిధంగా నీవు చలిస్తున్నావు. ఒక్కక్షణం నీచాంచల్యం ఆపి నిలిచి యోచించిచూడు. నీ ఆశల నన్నిటినీ ప్రోగుచేసి ఒకతక్కెడలో పెట్టు. రెండవ తక్కెడలో శ్రీపతిని పెట్టితూచు. ఏతక్కెడ మొగ్గో నీకు అర్థం అవుతుంది. ఆశలన్నిటినీ ఒక్కచోటచేర్చి. 'ఇదివద్దు ఇదివద్దు' అని ఒక్కటొకటే వదలినావంటే అదే మోక్షానికి మార్గం. మనస్సును ఏకాగ్రతచేసి భక్తితోచూడు. నీకు మోక్షం కరతలామలకం''.

మన మందరమూ సన్మార్గంలోఉంటే అంబికానుగ్రహం తత్‌ క్షణమే కల్గుతుంది. భక్తిని అభివృద్ధి చేసుకుంటూ ఏ కార్యం చేస్తున్నా ఈశ్వరస్మరణ చేయడం కర్తవ్యం.


Jagathguru Bhodalu Vol-3        Chapters        Last Page