Jagathguru Bhodalu Vol-3        Chapters        Last Page

ఆలయ పూజలు

మనం మానవులమై పుట్టినందుకు విధిగా మనచేతనైనంతవరకూ, సందర్భానుసారంగా ఇతరులకు సహాయం చేయడానికి పూనుకోవాలి. బీదవారు శ్రమదానం చేయవచ్చు. శ్రీమంతులు ద్రవ్యసహాయం చేయవచ్చు. పలుకుబడిఉంటే, అట్టి అదృష్టవంతులు, ఇతరుల కష్టనివారణకోసం తమ పలుకుబడిని ఉపయోగించవచ్చు. ఇట్లు ప్రతిఒక్కరూ ఏదో ఒకవిధంగా తమకు లభించే సదవకాశాన్ని సామాజిక సౌఖ్యంకోసం వినియోగించుకోవాలి.

మనదేశం బీదదేశం. మనప్రజలు బీదవారు. ఐతే దక్షిణ దేశంలో చాలా గ్రామాలలో నేటికి మనం చూస్తున్న మహోన్నత దేవాలయాలు ఎంతో కాలమునుండి ఇంతవరకూ చెక్కుచెదరక నిలిచిఉన్నవి. ఇవి బీదవారి చెమటనుండియే రూపొందినవి. ఆనాటి ఆర్ధికస్థితిగతులువేరు. వారి కోరికలు ఈనాటివలె అధికంకావు. అందుచేత తమకున్న నిలువనంతా శ్రీమంతులు దైవకైంకర్యాలకై వినియోగించేవారు. బ్రహ్మాండమైన అలయాలనూ, తటాకాలనూ నిర్మించి బీదవారికి పనికల్పించి, వారికి జీవనోపాధి చూపేవారు.

కాని ఈనాటి సమూహసేవ రీతియే వేరు. దాని పరిభాషయూవేరు. విద్యావ్యాప్తికోసం స్కూళ్ళుకటుతున్నారు. ప్రజలు వ్యాధిగ్రస్తులౌతున్నారని వారి ఆరోగ్యం నిమిత్తం వైద్యశాలలు నిర్మిస్తున్నారు. దారిద్ర్య నివారణార్ధం బ్యాంకులను లేవదీస్తున్నారు. ఈవిధంగా ఈనాటి సమూహసేవ చెలామణి అవుతున్నది. ఐతే దీనివల్ల పూర్తి ప్రయోజనాలు ఉద్దేశించినవారికి లభిస్తున్నవా అంటే ఔననిచెప్పడం కష్టం. విద్య వ్యాపిస్తూనేఉన్నది. కానినేర్చినవిద్య అసత్య భాషణాన్నికాని, లంచగొండితనమునుగాని నిర్మూలించలేకపోతున్నది. ఇదే నేటి విద్యావంతులతీరు అదేగ్రామాలలోని పాటకజనం, కొండజాతివారూ ఏవిద్యాలేకపోయినా నిజాయితీకల్గి, ధార్మికంగా జీవితాలను గడపటం చూడవచ్చు. ఆస్పత్రులు ఉన్నవికదా, ఇంకేం అనిజనం తారుమారుజీవనం చేస్తున్నారు. ఆ జీవనంలో ఒకనియమంలేదు ఒకకట్టుబాటు లేదు. ఏవ్యాధివచ్చినా ఆస్పత్రి ఉన్నదన్న ధీమా ప్రజలకు ఏర్పడినది. ఇకబ్యాంకు విషయం-ఇన్ని బ్యాంకులుఉన్నా ప్రజల దారిద్ర్యమేమో యథాతథంగానే ఉన్నది.

ఈరోజుల్లో మనం మన అవసరాలను గుణకారం చేసుకొంటున్నాము. ఆ అవసరాలు లెక్క లేకుండా పెరిగిపోతున్నవి. దీనివలన వచ్చేఫలం అతృప్తి. నిజమైన సంతోషం మనకు కావాలంటే అది నిరాడంబర జీవితంనుండే రావాలి. మనదేశంలో సాముదాయిక ప్రయోజనార్థం నిర్మించిన ఆలయాలు ఎన్నోఉన్నవి. ఉదాహరణకి అవుడయార్‌కోవేల తీసుకొందాం. అచ్చట విస్తారమైన అన్న రాశి స్వామివారికి నివేదించి, ఆప్రసాదం అందరికీ తక్కువ వెలకు అమ్మేవారు. కొన్ని ఆలయాలలో ఈ సాముదాయికభావం ప్రజాహృదయాలలో హత్తుకోవాలనే, కొన్నికొన్ని విశేషోత్సవాలు చేస్తుంటారు. కొన్ని ఉత్సవదినాలు ప్రత్యేకించి ఉంటాయి. ఆరోజులలో, ఆసందర్భాలలో, నివేదితాన్నం ఉచితంగా పంచిపెట్టుతూ ఉంటారు. ఈపద్ధతి సాముదాయిక జీవనానికి మార్గదర్శకంగా ఉండేది.

అందరూ అలవరచుకోవలసిన విశిష్టగుణాలలో కృతజ్ఞత ఒకటి. మనరాజ్యాంగానికీ, కార్పొరేషన్లుకూ పన్నులు చెల్లిస్తున్నాం. వారు మనకు అందజేసే ఎన్నో వసతులకు, మనం చెల్లించేపన్ను ఒకవిధంగా కృతజ్ఞతారూపమే. ఇదేవిధంగా మనకు అనుక్షణం సహకరిస్తున్న అమానుష సంస్థలున్నవి. వానికి మనం కృతజ్ఞతచూపడం మరచిపోరాదు. వేదములలో విధించినట్లు, ఆ అధికారస్థానాలకు మనం కృతజ్ఞతచూపాలి. అట్టి అధికారస్థానాలే ఆలయాలు, వానికి చెల్లించేపన్ను, లేదా మనంచూపే కృతజ్ఞత-యజ్ఞం. నేటి సాముదాయిక పద్ధతిలో స్కూళ్ళు, ఆస్పత్రులు, బ్యాంకులు సమూహసేవా స్థానాలుగా ఉన్నప్పటికీ, అవి నానావిధాలైన సేవలుచేస్తున్నా వాని ఉద్దేశాలు మాత్రం పూర్తిగా ఈడేరకుండా ఉన్నవి. ఈశ్వరాను గ్రహంలో అచంచలమైన విశ్వాసం అలవర్చుకొని ఎటువంటి కష్టాలు వచ్చినప్పటికీ ఓర్చుకోగల సహన శక్తి పెంపొందించుటకోవడమే ప్రస్తుతం మనకున్న వ్యాధిని కుదర్చగల పరమ ఔషధం. ఆసహనశక్తి మనకు ఒక్క భక్తి వల్లకాని లభించదు. భక్తిని పెంపొందించడానికి ఏర్పడిన సంస్థలే ఆలయములు. అందుచేతనే ఆలయనిర్మాణం మన పెద్దలు ఒక విశిష్ఠ కార్యంగా ఎన్నేవారు.

ఆలయాలలో ప్రతిష్ఠించిన అర్చామూర్తులకు చేసే నివేదన, కానుక, కైంకర్యం, ఆ విశ్వరచయితకు మనం తెలిపే కృతజ్ఞతాభావమే. మానవుడు ఒక తృణకణం ఒక్క దర్భపోచ సృష్టించగలడా? అందుచే మనం తినే అన్నం, కట్టుకొనే వస్త్రం, ఆసర్వేశ్వరుడికి అర్పించి ఆయన ప్రసాదంగా గ్రహించాలి. అట్లు అర్పించకపోతే మనం కృతఘ్నులం కామా? అందుచేత ఈశ్వరునికి మనం అర్పించే వస్తువులు చాలా శ్రేష్ఠమైనవిగా ఉండాలి. అందరూ వారి వారి ఇండ్లలో ఈశ్వరుని పూజించడం, అన్నవస్త్రాలు నివేదించటం అనేది కాని పని. అందుకొరకే ఆలయాలు ఏర్పడినవి.

చాలామందికి, మనం దేవాలయాలకు ప్రతిరోజు వెళ్ళవలెనా, అక్కరలేదా? అన్నదొక పెద్ద సందేహం. ఆలయాలకు వెళ్ళటం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తలచుకోవాలి. పూర్వ కాలంలో గుడిగంటలు వింటే కాని ఇంట్లో భోజనానికి కూర్చునే వారు కారు ఈశ్వరునికి నివేదన సరిగా నడుస్తున్నదా అని మనం జాగ్రత్తగా గమనించాలి. మనం ఆలయాలకు వెళ్ళకపోతే అక్కడ అన్నీ ఎట్లా సక్రమంగా నడుస్తవి? పూజా నైవేద్యాలు సరిగా జరుగుతున్నవని తెలిస్తే ఆలయానికి వెళ్ళనవసరంలేదు. మనం ఆలయాలకు వెళ్ళుతుంటే కనీసం మనకోసమైనా ఆలయాలను శుద్ధంగా ఉంచుతారు. దీపారాధన, నివేదన శుద్ధంగా చేస్తుంటారు. దీనికొరకైనా మనం ఆలయాలకు వెళ్ళుతుండాలి.

మనం ఉన్నచోట్ల ఉన్న ఆలయాలలో పూజాదికాలు జరుగుతున్నవా అని గమనించడం మనధర్మం. గోపురం దర్శనం చేస్తేనేచాలు. సూక్ష్మధర్మాల నన్నిటినీ మనం మరచిపోయాము. ఈశ్వరునికి మాసిపోయినగుడ్డ కట్టరాదు. శుద్ధవస్త్రాన్నే అర్పించాలి. ఆయన వస్త్రం శుద్ధంగా ఉంటే మన హృదయం శుద్ధంగా స్ఫటికసంకాశంగా ఉంటుంది. కాని ఈరోజులలో అందరినీమించి, మాసిపోయిన వస్త్రాలు ధరించే వారెవరా అనిచూస్తే స్వామియే కనబడుతున్నాడు. ఆయన వలువలు చూడరానివిగా ఉన్నవి. అందుచే శుద్ధవస్త్రాలు స్వామికి కట్టబెడితే, ఈమాత్రపు ధర్మం మనం చేయగలిగితే, అది ఎంతో విశేషం. ఈ ధర్మం సూక్ష్మం మనం సూక్ష్మం వదిలిపెట్టి స్థూలాన్ని పట్టుకొని దానికై విశేషశ్రమ పడుతున్నాము.

అనేక ధర్మాలున్నవి. గంజివార్చి బీదవారికి దానం చేయడం, ద్రవ్యసహాయం చేయడం, అన్నంపెట్టడం ఇవి అన్నీ ధర్మాలే. మూలధర్మాలేమిటి? అన్న ప్రశ్నవస్తే ఆలయపూజ తగ్గకుండా నడుస్తున్నదా అని గమనించడమే ఆలయాలు శుభ్రంగా ఉండాలి. అందులో దీపజ్యోతులు ఆఖండంగా వెలుగుతుండాలి. దీనిని మనం గమనిస్తూరావాలి. ఇట్లుంటేచాలు. ఇట్లా మనం జాగరూకత వహిస్తే ఆస్పత్రులు కట్టే ప్రయోజనం దీనివల్ల లభిస్తుంది.

ద్రావిడదేశపు భక్తురాలు మహాజ్ఞానిఐన అన్వయారు 'ఆలయానికి అనుదినం వెళ్ళు' అని ఆదేశంఇచ్చింది, దినమూ పారాయణచేయడం, కనీసం వారానికొక్కమారైనా ఆలయానికి వెళ్ళడం - అనే విధులు మనం వదలకుండా పాటిస్తూవస్తే శాశ్వతసౌఖ్యం లభిస్తుంది.


Jagathguru Bhodalu Vol-3        Chapters        Last Page