Jagathguru Bhodalu Vol-3        Chapters        Last Page

ఇంద్రియనిగ్రహం

ప్రొద్దుక్రుంకి చీకటి లావరించినంతనే చీకటులతో పాటు ఒకవిధమైన ప్రకాశమున్నూ ఏర్పడుతుంది. ఈ చీకట్లవల్లనే ఆ ప్రకాశం కల్గుతున్నది. అంటే ఈప్రకాశానికి కారణం ఆ చీకటే అన్నమాట. యోచిస్తే వెలుగున్నూ ఒకవిధమైన చీకటే. పగటిపూటకూడా ఆకాశంలో జ్యోతిర్మండలమున్నది. నక్షత్రాలూ ప్రకాశిస్తూనే వుంటవి. కాని మనకు కానరావు. అంటే పగటి ప్రకాశంలో తమోగుణం ఉన్నదని అర్థం. అదే సూర్యుడస్తమించి, చీకటులావరించేసరికి జ్యోతిర్మండలం స్ఫుటతరంగా నయనగోచర మవుతున్నది. వేదాంతమూ అదే మనకు బోధిస్తున్నది. 'శివస్వరూపం నీకు అవగతమైందంటే ఈ దృశ్య ప్రపంచం నీదృష్టిలోనుంచి అంతరిస్తుంది. దృశ్యప్రపంచం భాసిస్తూ ఉంటే, శివస్వరూపం నీదృష్టినుండి మరగిపోతుంది'.

'యానిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ,

యస్యాం జాగ్రతి భూతాని సానిశా పశ్యతో మునేః'.

అనే గీతాశ్లోకం దీన్నే వివరిస్తున్నది.

సమస్త ప్రాణులూ దేనిని రేయి అని అనుకుంటాయో సంయమికి అది పగలు. అతనికి ఏదిపగలో ప్రాణిలోకం దానిని రేయిగా నరిగణిస్తుంది. సమ్‌ ్శ యమి అను రెండు కలిసి సంయమి అనే పదం ఏర్పడ్డది. 'సమ్‌' అనే దానికి చక్కగా అని అర్థం. 'యమి' అన్నదానికి 'అణచినవాడు' అని అర్థం. అందరి ప్రాణాలనూ తన హస్తగతం చేసుకొని అందరినీ అణగద్రొక్కేవాడు యముడు. సంయమ కామక్రోధాదుల నణచినవాడు. కోపాన్ని అణచడమనేది చాలకష్టమైనపని. 'కోపానికేమి? సులభంగా జయించగలం' అని చెప్పవచ్చు కాని ప్రయత్నం చేసేటప్పుడు అది ఎంత దుష్కరమో తెలుస్తుంది.

ఒక ఊళ్లో ఒకాయన వుండేవాడట. ఆయన సద్గుణవంతుడేగాని, కొంచెము కోపిష్ఠి. ఒకరోజు ఆయన ఇంటి అరుగుమీద ఇద్దరు కూచుండి ఇంట్లో ఆయన ఉన్నాడన్న ఆలోచనలేక ఆయనశీలాన్ని కోపస్వభావాన్నీ గూర్చి మాట్లాడుకొంటున్నారట.

వీరిమాటలు చెవిలో పడెనో లేదో ఆయన విసవిస నడచివచ్చాడట. 'ఎవరా చెప్పింది నేనుకోపిష్టినని? అట్లా అనడానికి ఎంత ధైర్యం?' అని గద్దించినాడట. అరుగుమీద ఉన్న ఆ ఇద్దరూ 'ఇంకా వేరుసాక్ష్యం దేనికి?' అని శాంతంగా బదులు చెప్పినారట.

ఈ కోపాన్ని గూర్చి చేసే ప్రస్తావనలో మరొక విషయం జ్ఞప్తికి వస్తున్నది. నలుని చరిత్ర మీకందరికీ తెలిసే ఉంటుంది. మన నాయనమ్మల కాలంలో వేకువజామున నాలుగు గంటలకే ఆడవాళ్ళులేచి ఇంటిపనులు చేసుకుంటూ మేలుకొలుపులు, స్తోత్రాలు, పుణ్యకథలూ పాడుకొనేవారు. అవి విన్న పిల్లలకు పురాణపరిచయ మేర్పడేది. పెద్దలైన పిదప పౌరాణికుల మూలంగానో, మూలగ్రంథాలను చదివియో కథలను గ్రహించేవారు. ఈ పాత సంప్రదాయాలన్నీ ఇపుడు అడుగంటి పోయినవి. పురాణజ్ఞానం మనకు నాటకాలవల్లా, సినిమాలవల్లా ఇపుడు కలుగుతూన్నది. కాని వీనిని చూచేవారికి కథపై కాక నటుల గుణవర్ణనలమీదా రూపాదులమీదా మనస్సు లగ్నమవుతున్నది. అట్లుగాక పెద్దలమూలంగా పురాణపరిచయ మేర్పడితే, పురాణాలుపదేశించే మేలిగుణాలను గ్రహించడానికి ఎక్కువ అవకాశముంటుంది. సినిమాలలో కథాభాగము చాలా తక్కువ. అప్రస్తుత సన్నివేశాలకూ, వికారమైన పాటలకూ ప్రాధాన్యం ఎక్కువ. ఈ కాలపు భాగవతుల హరికథలలో కూడా జనాన్ని రంజింపజేయడానికి అనవసర ప్రసంగాలకు ఎక్కువకాలం వినియోగింప బడుతున్నది. మునుపటి కాలంలో అట్లుకాక హరికథా కాలక్షేపాలు సత్ఫలాన్ని ఇచ్చేవి. కొందరు ఈ పుణ్యకథలను కట్టుకథలనీ, పుక్కిటిపురాణాలనీ ఈసడించడంకద్దు. ఐతేమాత్రం ఏమి? వీనివలన ప్రయోజనం లేదంటారా? పురాణపఠనం, పురాణశ్రవణం ఉదాత్తభావాలను మేలుకొలిపి మనస్సుల నాహ్లాదపరచి శాంతి కలిగిస్తున్నదా? లేదా? దుకాణానికి ఏదోవస్తువు కొనడానికి వెళ్ళినవానికి దుకాణాదారుడు నల్లగా ఉంటేఏమి? తెల్లగా ఉంటేఏమి? కోరిన వస్తువు ఇస్తేసరి, వాని వేష భాషల సంగతి కొనేవాని కెందుకు? తద్దినానికి నియంత్రించిన బ్రాహ్మణునికి ఖగోళశాస్త్ర పరిచయం లేకపోతేయేం? పురాణాల కాలం ప్రాచీనమైనా, అప్రాచీనమైనా మనకు కావలసినది దానివల్ల కలిగే ప్రయోజనంకాని మరి వేరేమీకాదు.

ప్రాతఃస్మరణీయులలో నలుడుకూడా ఒకడు. దమయంతీ స్వయంవరానికి ఇంద్రాది దేవతలు నలుగురు వచ్చారు. దమయంతి నలునియం దనురక్తియన్న విషయాన్ని వారు తెలిసికొన్నారు. దమయంతి మనసు మార్చడానికీ, తమ్మువరించడానికీ దౌత్యంకోసం, నలుడినే వినియోగించారు. దౌత్యానికి నలుడున్నూ అంగీకరించి దమయంతి కెంతో నచ్చచెప్పాడు. నలునికర్పితమైన హృదయం. అనలంకాదు. ఇది వృధాశ్రమ అని చెపుతుంది దమయంతి. సరస్వతి అనుగ్రహబలంవల్ల నలవేషధారులైన దేవతలనూ అసలు నలుణ్ణి గుర్తించి ఆమె నలుని మెడలో పూదండవేస్తుంది. దేవతలు దమయంతి ఉత్తమగుణాలను ఆమోదించి ఆశీర్వదించి వెళ్ళుతూ, ఆ స్వయంవరానికే బయలు దేరిన ద్వాపరుణ్ణీ, కలినీ త్రోవలో చూస్తారు. దేవతలు వివాహం అయిపోయిందన్నమాట చెవిని వేస్తారు. వారికోపానికి మితిలేకపోతుంది.

కలియొక్క సేనాధిపతులు ఆరుగురు. వారు కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యాలు. ఒక్కొక్కరు తమ ప్రతాపాలను తామే ఉగ్గడించు కొంటారు. పాపాన్ని ఆర్జించి ప్రాణికోటికి మూటకట్టి యిచ్చి దాంట్లో తమకు సముడు ఎవడూ లేడని కాముడు చెప్పుకుంటాడు. మనుష్యులను పశుప్రాయులుగా చేసే గొప్పతనం ఎక్కువగా అతనిదేనట.

పిదప క్రోధుడు తన గుణగణాలను చెప్పుకోడానికి ఆరంభిస్తాడు. తన కోట కామునికి సహితం గెలవరానిదట. క్రోధుని దుర్గానికి, కాముని ఆశుగాలు తగులవట. ఎంతో కష్టపడ్డాపోవడానికిగాని, చేరడానికిగానివీలులేనిది దుర్గం. ఆశుగము అంటే బాణం. ఆశ్సుశీఘ్రముగా, గమ్సుపోవునది. ఆశుగమ్సుశీఘ్రగామి బంగాళ##దేశములోని 'అషుతోష్‌ ముఖర్జీ' అన్న పేరు వినేవుంటారు. అసలు పేరు అశుతోషుడు. శీఘ్రంగా సంతోషించే వాడని ఈ పదానికి అర్థం. పరమశివునికి అశుతోషుడని పేరు. నీ దుర్గంఏదని క్రోధుణ్ణి ప్రశ్నిస్తే దుర్వాసుని హృదయం అని బదులు చెప్తాడు. దుర్వాసునికి పరిపూర్ణమైన కామజయం సిద్ధంచినా పాపం! క్రోధానికి లొంగిపోయినాడాయన, కామక్రోధాలకు ఆస్పదం కానివాడు సంయమి, మనకేది చీకటో సంయమికి-అనగా సంయమనము చేసినవానికి-అది ప్రకాశం. 'యస్యాంజాగ్రతిభూతాని సానిశా పశ్యతో మునేః' - ప్రాణులకు ఏది పగలో, జ్ఞానికి అది చీకటి. మనం దేనిని లోకమనుకుంటామో జ్ఞానికి అది నిరాలోకంగా వుంటుంది. అతనికి అది లోకమనిపించదు. నీడలో పుస్తకాన్ని చదువుతుంటాము. బయటకువచ్చి సూర్యరశ్మిలో చదవబోతే కండ్లు మసకలు క్రమ్ముతవి. అంటే మనదృష్టికి ప్రకాశము అంధకారప్రాయమైనదన్నమాట.

శైవసిద్ధాంత సంబంధమైన గ్రంథాలను 'తిరుమురై' అంటారు. అవి పండ్రెండు. ఆ సంప్రదాయానికి చెందిన తిరుమూలర్‌ అను యోగీశ్వరుడు వ్రాసినది మొదటి తిరుమూరై. ఆయన తొమ్మిదికోట్ల సంవత్సరములు తపస్సు చేసినట్లూ, వేయి సంవత్సరాల కొక్కొక్క పద్యమును వ్రాసినట్లు తత్సంప్రదాయకులు చెపుతారు. ఆయన తిరుమురైలో ఒక పద్యంలో ఇట్లు వ్రాస్తారు.

ఆలయానికి ఒక ఏనుగు కావలసివచ్చింది. దానిని చేయమని ఒక వడ్రంగికి చెప్పారు. అతడు తయారుచేసిన తరువాత మరొక వడ్రంగి దానిని చూడడానికి వెడతాడు. అతనితో అతని కూతురుగూడ వెళుతుంది. ఆ ఏనుగును చూడగానే అతని కుమార్తెభయపడిననాన్నా 'ఏనుగు దగ్గరకు వెళ్ళకు, అదినిన్ను ఏమైనాచేస్తే కష్టం' అని తండ్రిని హెచ్చరిస్తుంది. కాని ఆ తండ్రి ఆ హెచ్చరిక లెక్కచేయక 'ఆహా ఎంతచక్కని చేత! ఎంతచక్కని చెక్క!' అని ఆకర్ర ఏనుగును చూస్తూ ఉంటాడు. అది దారువా? లేక దంతియా? ఒకరికి దారువు, మరొకరికి దంతి. వడ్రంగికి ఏనుగు కనపడలేదు. కుమార్తె చూచినది ఏనుగు. వస్తువు ఒకటే. కల్గిన భావాలు మాత్రం వేరు.

పరమాత్మ స్వరూపాన్ని ఎక్కడ అని వెదకటం? పరమాత్మా, పంచభూతాలు వేరుకాదు, పరమాత్మ వేరని అనుకొన్నప్పుడు పంచభూతాల వ్యస్తరూపం మనకండ్ల ఎదుట ఉంటుంది. అదే పరమాత్మ అని అనుకొన్నప్పుడు పంచభూతాలు మరిగిపోయి పరమాత్మ గోచరిస్తాడు.

వేదాంతమే ఉపనిషత్తులు. ఆచార్యుల అవతరణ ఉపనిషద్విశదీకరణకే. ప్రథమ భాష్యకారులువారే. దశోపనిషత్తులకును వారు భాష్యాలను వ్రాసినారు. అందు 'ఈశావాస్యం' మొదటిది. సర్వమూ ఈశావాస్యంగా చూస్తే ప్రపంచం ఈశ్వరునిచే అచ్ఛాదితమై, దృష్టి నుండి మరగిపోతుందని అది చెప్పుతున్నది.

''దంతిని దారువికారేదారు తిరోభవతి సోపిత త్త్రెవ,

జగతి తథా పరమాత్మ పరమాత్మన్యపి జగత్‌ తిరోధత్తే''

దారువు కనబడితే ఏనుగులేదు. ఏనుగు కనబడితే దారువులేదు. మొదట ద్వైతం తరువాతశివాద్వైతం. అటుపై శివమయం. మనకు పరమాత్మ చీకట్లోనూ, జగత్తు ప్రకాశంలోనూ ఉన్నది. అట్లుకాక, జగత్తు అంధకార ప్రాయమైపోతే ఈశ్వరుని ప్రకాశం మనకు కనిపిస్తుంది. 'ఈశానః సర్వభూతానాం' అని వేదమంత్రం. ఇది వేదాంతమూ, అద్వైతమూ.

ఈ కథలవలన ప్రయోజనమేమి? అని అడుగవచ్చును. ప్రయోజనం ఆచార్యోపదేశ మననమే. ధనికులను ధర్మము చేయమనీ, దరిద్రులను దుఃఖించవలదనీ ఈ కథ బోధిస్తుంది. ఈ శివాద్వైతమనే ఔషధం బాధానివృత్తి చేస్తుంది. ఈ ఔషధం సేవించకపోతే లోకంలో చీకట్లు అలముకొంటవి. ఈ ఔషధం చేతిలో ఉంటే సూర్యుడున్నా లేకున్నా మనకు బాధలేదు.


Jagathguru Bhodalu Vol-3        Chapters        Last Page